శ్రీమందిరం ఆవరణకు జగన్నాథుని రథాన్ని చేరుస్తున్న సేవాయత్‌లు
సాక్షి, భువనేశ్వర్/పూరీ: జగన్నాథుని రథయాత్ర ప్రపంచ ప్రఖ్యాతం. జనసంద్రం నడుమ అత్యంత వైభవంగా జరగాల్సిన యాత్ర ఆద్యంతాలు ఈ ఏడాది కరోనా కారణంగా జనసంచారం లేని వీధుల గుండా సోమవారం జరగబోతోంది. శ్రీమందిరం నుంచి గుండిచామందిరం వరకు సాగే ఈ యాత్రలో బొడొదండొ దారి పొడవునా బలభద్ర, సుభద్ర, జగ న్నాథుని రథాలను లాగే గొప్ప కార్యక్రమం చోటుచేసుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో తగిన ఏర్పాట్లను నిర్వాహకులు చేశారు. కోవిడ్ నియంత్రణ చర్యల దృష్ట్యా గతేడాది తరహాలో లాగే ఈసారి కూడా యాత్రకు భక్తులకు ప్రవేశం నిషేధిస్తూ చర్యలు చేపట్టడం గమనార్హం.
సింహద్వారం ప్రాంగణంలో శానిటైజ్ చేస్తున్న సిబ్బంది
పరిమితమైన సిబ్బంది, సేవాయత్‌లతో ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలతో యాత్ర నిర్వహిస్తారు. ఇప్పటికే యాత్రలో పాల్గొనే వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అంతకుముందే ఆయా వర్గాల వారికి కోవిడ్ వ్యాక్సిన్ కూడా వేశారు. పోలీస్ సిబ్బంది, సేవాయత్‌లు మినహాయిస్తే యాత్ర కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు దాదాపు 1000 మంది అధికారులు వరకు అందుబాటులో ఉంటారని పూరీ జిల్లా కలెక్టర్ సమర్థ వర్మ తెలిపారు. సుప్రీంకోర్టు ఆంక్షలకు అనుగుణంగా రథాలను లాగేందుకు సేవాయత్‌లు, పోలీసులను మాత్రమే నియమించారు. ఈ క్రమంలో ఒక్కోరథం లాగేందుకు గరిష్టంగా 500 మంది ఉంటారని అధికారులు తెలిపారు.
యాత్రా స్థలంలో మోహరించిన భద్రతా బలగాలు
భద్రత కట్టుదిట్టం..
కరోనా కట్టడిలో భాగంగా యాత్రలో జనసమూహం నివారణకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పూరీ జిల్లా రైల్వేస్టేషన్‌ని చేరుకునే రైలు సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో పాటు పట్టణంలో కర్ఫ్యూ విధించి, పట్టణ సరిహద్దుల్లో ఇతర ప్రాంతాల వారి రాకపోకలను పూర్తిగా నిషేధించారు. ఈ నెల 13వ తేదీ వరకు కర్ఫ్యూ నిబంధనలు కొనసాగుతాయి. ఇదిలా ఉండగా, రథయాత్ర ఏర్పాట్లను ఆదివారం సమీక్షించిన అదనపు డీజీపీ ఆర్.కె.శర్మ మాట్లాడుతూ పూరీ పట్టణాన్ని 12 జోన్లుగా విభజించి, 65 ప్లాటూన్ల పోలీస్ బలగాలతో భద్రతా చర్యలు చేపట్టామన్నారు. భద్రతా బలగాల్లో 10 మంది అదనపు పోలీస్ సూపరింటెండెంట్లు, 31 మంది డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్లు, 64 మంది ఇన్‌స్పెక్టర్లు, 222 మంది సహాయ సబ్–ఇన్‌స్పెక్టర్లు, సబ్–ఇన్‌స్పెక్టర్లుని నియమించినట్లు పూరీ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కె.వి.సింఘ్ తెలిపారు.
నందిఘోష్ రథం వద్దకు ఆజ్ఞామాలను తీసుకువెళ్తున్న దృశ్యం
ఆజ్ఞామాలలతో పూజలు..
రథ నిర్మాణ శాల శ్రీమందిరం ఆవరణకు చేర్చిన జగన్నాథ, సుభద్ర, బలభద్రుని రథాలకు మూలవిరాట్ల దగ్గరి నుంచి బాజాభజంత్రీలు, మేళతా ళాలు, ఘంటానాదంతో తీసుకువచ్చిన ఆజ్ఞామాలలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక గోవర్థన పీఠాధిపతి, ఆదిశంకరాచార్యులు స్వామి నిశ్చలానంద సరస్వతికి ఆలయ సంప్రదాయ రీతిలో అధికారిక పిలుపు చేశారు. రథాలపై యాత్రకు ఆసీనులైన మూలవిరాట్లను తొలుత ఆదిశంకరాచార్యులు ప్రత్యక్షంగా దర్శించుకుని, స్వామి తొలి దర్శనం స్వీకరిస్తారు.
సూక్ష్మ రథాలు.. సూపర్!
జగన్నాథుని రథయాత్ర పురస్కరించుకుని, నగరంలోని శ్రీరామ్‌నగర్‌కి చెందిన ప్రముఖ శిల్పి హరగోవింద మహరణ తన కళా నైపుణ్యం ఉపయోగించి, బియ్యం, గోదుమలతో తయారు చేసిన బలభద్ర, సుభద్ర, జగన్నాథుని సూక్ష్మ రథాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రోజుకు మూడు గంటలు చొప్పున కష్టపడగా, వారం రోజుల్లో ఇవి పూర్తయినట్లు సమాచారం.
– బరంపురం
Comments
Please login to add a commentAdd a comment