
మధ్య, చిన్నతరహా షేర్ల పతనంపై స్పందించవలసిన అవసరంలేదని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఛైర్‌పర్సన్ మాధవి పురీ బచ్ తాజాగా పేర్కొన్నారు. ఇటీవల మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు భారీగా పతనమవుతున్న నేపథ్యంలో బచ్ వ్యాఖ్యాలకు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే గతేడాది మార్చిలోనే మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ అధిక విలువల్లో ట్రేడవుతున్నట్లు సెబీ హెచ్చరించిందని బచ్ గుర్తు చేశారు.
నిజానికి చిన్న షేర్లపై అవసరమైన సందర్భంలో సెబీ ఆందోళన వ్యక్తం చేసినట్లు దేశీ మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్(యాంఫీ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ అంశంపై సెబీ మరోసారి స్పందించవలసిన అవసరం కనిపించడంలేదని స్పష్టం చేశారు. ఇటీవల మధ్య, చిన్నతరహా షేర్ల కౌంటర్లలో నిరవధిక అమ్మకాల కారణంగా కొన్ని షేర్లు 20 శాతానికి మించి పతనమయ్యాయి. ఫలితంగా మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో బేర్ ట్రెండ్ కనిపిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ రెండు విభాగాల్లోనూ షేర్లు అధిక విలువలకు చేరినట్లు 2024 మార్చిలోనే బచ్ ఇన్వెస్టర్లను హెచ్చరించడం గమనార్హం! కాగా.. ఇటీవల ప్రవేశపెట్టిన రూ.250 సిప్ పథకాలను ఫండ్ హౌస్‌లకు తప్పనిసరి చేయాలన్న ఆలోచనేదీ సెబీకి లేదని బచ్ తెలియజేశారు.
వారసత్వ పెట్టుబడుల బదిలీకి ఎంతో కృషి
తొలి తరం క్యాపిటల్ మార్కెట్ ఇన్వెస్టర్ల పెట్టుబడులను వారి వారసులు పొందడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సెబీ చైర్‌పర్సన్ మాధవి పురి బుచ్ తెలిపారు. వారసులకు పెట్టుబడుల బదిలీని సులభతరం చేసే విషయంలో సెబీ ఎంతో కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఇన్వెస్టర్లు మరణించిన సందర్భాల్లో కొత్త సమస్యలు ఎదురవుతున్నట్టు పేర్కొన్నారు. ‘ఆ తరం ఇప్పుడు అంతరిస్తోంది. వారి వారసులు సెక్యూరిటీలను వారసత్వంగా పొందుతున్నారు. ఈ క్రమంలో 20 ఏళ్ల క్రితం లేనివి కూడా నేడు సమస్యగా మారుతున్నాయి. ఎందుకంటే ఆ పెట్టుబడులు ఎక్కడ ఉన్నాయన్నది వారసులు గుర్తించలేకపోతున్నారు’ అని బుచ్ వివరించారు.
ఇదీ చదవండి: జనరల్ బోగీలో ప్రయాణిస్తున్నారా..? నిబంధనలు మార్పు?
క్యాపిటల్ మార్కెట్ల పట్ల విశ్వాసంతో పెట్టుబడులు పెట్టిన తొలి తరం వారిని మార్గదర్శకులుగా ఆమె అభివర్ణించారు. ఎన్‌ఎస్‌డీఎల్, సీడీఎస్‌ఎల్ రూపొందించిన యూనిఫైడ్ ఇన్వెస్టర్ యాప్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆమె మాట్లాడారు. ఈ రెండు డిపాజిటరీల పరిధిలో ఒక ఇన్వెస్టర్ పేరిట వివిధ డీమ్యాట్ ఖాతాల్లో ఉన్న అన్ని రకాల హోల్డింగ్స్‌ను ఇందులో పొందుపరిచారు. ఆ నాటి ఇన్వెస్టర్ల వారసులకు పెట్టుబడుల గుర్తింపు విషయంలో ఇది ఉపయోగకరంగా ఉంటుందని బుచ్ చెప్పారు.