
న్యూఢిల్లీ: రెన్యువల్ ఫీజును కట్టనందుకు గాను 72 రీసెర్చ్ అనలిస్టుల రిజిస్ట్రేషన్‌ను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రద్దు చేసింది. దీంతో వాటి రిజిస్ట్రేషన్ ఇక చెల్లుబాటు కాదు. గడువు తీరిపోయిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు దుర్వినియోగం కాకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెబీ తెలిపింది. సెబీ నిబంధనల ప్రకారం నమోదు చేసుకున్న ప్రతి రీసెర్చ్ అనలిస్టు అయిదేళ్లకోసారి రెన్యువల్ ఫీజును కట్టాల్సి ఉంటుంది.
అయితే, ఈ 72 అనలిస్టులు రెన్యువల్ ఫీజులు చెల్లించలేదని, వారి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ గడువు ముగిసిపోయిందని సెబీ గుర్తించింది. దీంతో నిబంధనల ఉల్లంఘనకు గాను వారికి షోకాజ్ నోటీసులు పంపించి, తాజా నిర్ణయం తీసుకుంది. అటు లిక్విడిటీ ఉండని స్టాక్ ఆప్షన్లలో మోసపూరిత ట్రేడింగ్ ఆరోపణలపై సహదేవ్ పైక్ హెచ్‌యూఎఫ్, పరితోష్ సాహా హెచ్‌యూఎఫ్, త్రిప్తా ష్రాఫ్, దక్ష్ షేర్ బ్రోకర్స్ మొదలైన వర్గాలపై జరిమానా విధించింది.