అవినీతి కేసులో ఆర్ఐ అరెస్ట్
తిరువొత్తియూరు, న్యూస్‌లైన్: పాఠశాల భవనం గుర్తింపు రెన్యువల్ సర్టిఫికేట్ ఇవ్వడానికి రూ.2 వేలు లంచం తీసుకున్న కీళంబాక్కం ఆర్ఐని పోలీసులు అరెస్టు చేశారు. కాంచీపురం జిల్లా మామల్లపురానికి చెందిన కన్నన్, మామల్లపురం సమీపంలో పుదుఎడయూర్ కుప్పంలో జీకే నర్సరీ పాఠశాలను నడుపుతున్నాడు. పాఠశాల భవ నం రిజిస్ట్రేషన్, గుర్తింపును ప్రతి ఏటా రెన్యువల్ చేయవలసి ఉంది. ఈ మేరకు తన పాఠశాల భవనం నాణ్యత, గుర్తింపు రెన్యువల్ సర్టిఫికేట్ పొందడానికి కేళంబాక్కం రెవెన్యూ ఇన్స్పెక్టర్ మణివన్నన్(56)కు దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ నిర్ధారణ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఆర్ఐ రూ.2వేలు లంచం కోరాడు.
డబ్బులు ఇవ్వక పోవడంతో కన్నన్ను కార్యాలయానికి పలుమార్లు తిప్పించుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో చెన్నైలో ఉన్న అవినీతి నిరోధక విభాగం అధికారులకు కన్నన్ ఫిర్యాదు చేశారు. డీఎస్పీ జీవానందం, ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాసన్ మంగళవారం ఉదయం కీళంబాక్కం వచ్చారు. అధికారులు ఇచ్చిన సలహా మేరకు రూ.2 వేలును కన్నన్, ఆర్ఐకి ఇచ్చారు. ఆ నగదును తీసుకుంటున్న సమయంలో అక్కడే మాటు వేసి ఉన్న అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా రెవెన్యూ ఇన్స్పెక్టర్ మణివన్నన్‌ను పట్టుకుని అరెస్టు చేశారు. తర్వాత కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు.