
టూ వీలర్‌కు రూ.2 వేలు,
త్రీ వీలర్‌కు రూ.5 వేలు, కార్లకు రూ.10 వేలు
20 ఏళ్లు పైబడిన వాహనాల రెన్యూవల్ ధరలు పెంచనున్న కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: వాహన కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. 20 ఏళ్లకు పైబడిన వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ) రెన్యువల్ ఛార్జీలను భారీగా పెంచాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీనిని కేంద్రం ఆమోదించిన వెంటనే 20 ఏళ్లకు పైబడి ఉన్న వాహనాలను తమ వద్ద ఉంచుకోవాలనుకునే వారు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.
బీఎస్–2 ఉద్గార నిబంధనలు అమల్లోకి రాకముందే తయారైన వాహనాలను ప్రజలు వదిలించుకోవాలనే కేంద్రం ఈ చర్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. రానున్న రోజుల్లో 20 ఏళ్ల పైబడిన ద్విచక్ర వాహన రిజి్రస్టేషన్ రెన్యువల్‌కు రూ.2 వేలు, త్రీ వీలర్‌కైతే రూ.5 వేలు, కార్లు/జీపులకు రూ.10 వేలు చేయాలని ఆ శాఖ ప్రతిపాదించింది. అంతేగాక 15 ఏళ్లు పైబడిన భారీ వాహనాలను దశలవారీగా రద్దు చేయడంపై దృష్టి సారించిన కేంద్రం వాణిజ్య మీడియం ప్యాసింజర్/గూడ్స్ వాహనానికి రూ.12 వేలు, హెవీ ప్యాసింజర్/ గూడ్స్ వాహనానికి రూ.18 వేలు రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఛార్జీలుగా ప్రతిపాదించింది.
అదే వాహనాలను 20 ఏళ్ల తర్వాత రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించుకుంటే వాటి రుసుములను వరుసగా రూ.24 వేలు, రూ.36 వేలుగా రెట్టింపు చేస్తూ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలు అమలైతే దేశవ్యాప్తంగా వాహన యజమానులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో మాత్రం దీని ప్రభావం ఉండదు. ఎందుకంటే ఇక్కడ కోర్టు ఆదేశాల నేపథ్యంలో 10 ఏళ్ల పైబడిన డీజిల్, 15 ఏళ్ల పైబడిన పెట్రోల్ వాహనాలను తప్పనిసరిగా తొలగించాల్సి ఉన్న విషయం తెలిసిందే. 2021లో రోడ్డు రవాణా శాఖ మోటార్ సైకిళ్లు, త్రీ వీలర్లు, కార్ల రిజి్రస్టేషన్ రెన్యువల్ రుసుమును మాత్రమే పెంచింది. దీంతో, తాజాగా 20 ఏళ్లు దాటిన మీడియం, హెవీ ప్రైవేట్ కమర్షియల్ వాహనాల ఫిట్‌నెస్ పరీక్షల ఫీజును రెట్టింపు చేయాలని ప్రతిపాదించింది.
Comments
Please login to add a commentAdd a comment