Registration Certificate
-
కొత్త బండి మోజు తీరకుండానే చలాన్ల మోత.. ఎందుకో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: కొత్త బండి మోజు తీరకుండానే చలాన్లు మోత మోగిస్తున్నాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదవుతున్నాయి. ఆర్సీలు లేకుండా నడుపుతూ అడ్డంగా బుక్ అవుతున్నారు. నిజానికి తప్పిదం తమది కాకపోయినా మూల్యం చెల్లించాల్సి వస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ఆర్టీఏ కార్యాలయాల నుంచి వాహనదారులకు సకాలంలో ఆర్సీ స్మార్ట్‌కార్డులు అందకపోడం వల్ల ఈ పరిస్థితి నెలకొంటోంది. కొత్త బండి కొనుగోలు చేసిన సంతోషం క్షణాల్లో ఆవిరవుతోందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీఏలో వాహనం నమోదైన వారం, పది రోజుల్లోనే స్మార్ట్‌కార్డు ఇంటికి చేరాల్సి ఉండగా, అందుకు విరుద్దంగా నెలలు గడిచినా కార్డులు రావడం లేదని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవాణాశాఖలో స్మార్ట్‌కార్డుల కొరత వల్లనే ఈ జాప్యం చోటుచేసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. స్మార్ట్‌కార్డుల నాణ్యత పెంచేందుకు ఇటీవల పాత కాంట్రాక్ట్‌ను రద్దు చేశారు. కానీ దాని స్థానంలో కొత్త కాంట్రాక్ట్ వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడం వల్ల రవాణాశాఖకు స్మార్ట్‌కార్డుల మెటీరియల్ సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో కొన్ని చోట్ల స్మార్ట్ కార్డులు అందుబాటులో ఉన్నప్పటికీ మరికొన్ని ఆర్టీఏ కేంద్రాల్లో కొరత ఏర్పడింది. ఇది వాహనదారులకు ఆర్థిక భారంగా మారింది. గ్రేటర్లో వేలల్లో డిమాండ్గ్రేటర్ హైదరాబాద్‌లోని 10 ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రతిరోజూ సుమారు 2,500 వాహనాలు కొత్తగా నమోదవుతాయి. అలాగే బ్యాంకు ఈఎంఐలు చెల్లించిన అనంతరం స్మార్ట్‌కార్డుల్లో హైపతికేషన్ రద్దు కోసం వచ్చే వాహనదారులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. దీంతో తెలంగాణలోని ఇతర ప్రాంతాలకంటే హైదరాబాద్‌లో డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల ఆర్సీల కోసం ముద్రించే స్మార్ట్‌కార్డులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. రెండు కేటగిరీల్లో కనీసం రోజుకు 5,000 కార్డులను ప్రింట్ చేసి స్పీడ్ పోస్టు ద్వారా వాహనదారులకు చేరవేయాల్సి ఉంటుంది. ఒక్కో కార్యాలయం నుంచి సుమారు 500 కార్డులకు డిమాండ్ ఉంటుంది. కానీ ఇందుకు తగిన విధంగా కార్డుల మెటీరియల్ లేకపోవడం వల్ల కొరత తలెత్తుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్షకుపైగా కార్డుల కొరత ఉండగా, సెప్టెంబర్ నాటికి 40 వేలకు పైగా అందజేసినట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరికొద్ది రోజుల్లో కొత్త కార్డుల సరఫరాకు ఒప్పందం ఏర్పడనుందని, ఆ తర్వాత పూర్తిస్థాయిలో కార్డులను జారీ చేస్తామని తెలిపారు. కానీ ప్రస్తుతం నెలకొన్న జాప్యం వల్ల వాహనదారులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ‘హైపతికేషన్ కాన్సిల్ చేసుకొని నెల దాటింది. కానీ ఇప్పటి వరకు కార్డు రాలేదు. బండి బయటకు తీయాలంటే భయమేస్తోంది..’ అని తుర్కయంజాల్ ప్రాంతానికి చెందిన శ్రీధర్ అనే వాహనదారుడు విస్మయం వ్యక్తం చేశారు. ఇప్పటికే చలాన్ల పేరిట రూ.300 చెల్లించినట్లు చెప్పారు. మరోవైపు స్మార్ట్‌కార్డుల కోసం ఆర్టీఏ చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తుందని, గంటల తరబడి పడిగాపులు కాసినా అధికారులు స్పందించడం లేదని చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన ఓ వాహనదారుడు ఆందోళన వ్యక్తం చేశారు.ఒక్కో కార్డు రూ.685డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల కోసం ఆర్టీఏకు ఆన్లైన్లో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్సుల కేటగిరీ మేరకు రూ.685 నుంచి రూ.1500 వరకు ఖర్చవుతుంది. ఆర్సీలకు మాత్రం రూ.685 వరకు చెల్లించాలి. ఇందులో సర్వీస్ చార్జీల రూపంలో రూ.400, స్మార్ట్‌కార్డుకు రూ.250 చొప్పున చెల్లించాలి. మరో రూ.35 స్పీడ్‌పోస్ట్ చార్జీలు చెల్లించాలి. ఇలా అన్ని చార్జీలు కలిపి ముందే చెల్లించినా నెలల తరబడి పడిగాపులు కాయాల్సి రావడం గమనార్హం. చదవండి: ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్సైలపై వేటుసారథి వస్తే ఆన్లైన్లోనే.. మరోవైపు తరచూ కార్డుల జారీలో నెలకొంటున్న జాప్యం, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఆధార్ తరహా ఆన్లైన్లోనే డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలను డౌన్లోడ్ చేసుకొనే సదుపాయాన్ని అధికారులు సీరియస్‌గా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌లో ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న సారథి సాంకేతిక వ్యవస్థ పూర్తిస్థాయిలో అమలైతే ఈ సేవా కేంద్రాల నుంచే స్మార్ట్ కార్డులను అందజేసే అవకాశం ఉంటుందని ఒక అధికారి చెప్పారు. ఇందుకు మరి కొంత సమయం పట్టవచ్చు. -
ఆర్సీలు, లైసెన్సులు రావట్లే!
సాక్షి, హైదరాబాద్: సుధీర్ నెల క్రితం కొత్త వాహనం కొన్నాడు. రిజిస్ట్రేషన్ పూర్తయింది. కానీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) కార్డు మాత్రం అతనికి అందలేదు. కర్నూలుకు వెళ్తుండగా చెక్‌పోస్టు వద్ద అధికారులు తనిఖీ చేశారు. ఫోన్లో ఉన్న ఆర్సీని చూపాడు. కానీ స్మార్ట్ కార్డు కావాల్సిందేనని పట్టుబట్టిన అధికారులు, రూ.4 వేల ఫైన్ వసూలు చేశారు. కార్డు సిద్ధమైనా బట్వాడా జరగకపోవడమే ఇందుకు కారణం. ఒక్క ఆర్సీ కార్డులే కాదు.. కొత్త డ్రైవింగ్ లైసెన్సులు, రెన్యువల్స్, డూప్లికేట్లు సంబంధిత స్మార్ట్ కార్డులు తెలంగాణ రవాణా శాఖ కార్యాలయాల్లో గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. రోజుకు దాదాపు 15 వేలకు పైగా కార్డులు సిద్ధమవుతాయి. వీటిని స్పీడ్ పోస్టు ద్వారా వినియోగదారులకు పంపాలి. బట్వాడా చేసే బాధ్యత తపాలాశాఖది. కానీ గత రెండు నెలలుగా తపాలాశాఖ ఆ బట్వాడా జరపటం లేదు. దీంతో కార్డులన్నీ కార్యాలయాల్లోనే ఉండిపోతున్నాయి. బట్వాడా ఎందుకు నిలిచింది? ఏ స్మార్ట్ కార్డునైనా ఆ ప్రక్రియ పూర్తయిన వారం రోజుల్లో వాహనదారులకు పంపాలి. స్పీడ్ పోస్టు ద్వారా ఇళ్లకు బట్వాడా చేసినందుకు ప్రతి కార్డుకు రూ.17 చొప్పున పోస్టల్ చార్జీ కింద తపాలా శాఖకు రవాణా శాఖ చెల్లిస్తుంది. అయితే దాదాపు ఏడాది కాలంగా ఈ చెల్లింపులు నిలిచిపోయాయి. ఏకంగా రూ.నాలుగైదు కోట్ల మొత్తాన్ని రవాణా శాఖ బకాయి పడింది. ఆ బకాయిల కోసం అడిగీఅడిగీ విసిగిపోయిన తపాలా శాఖ రెండు నెలల క్రితం బట్వాడా నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రజల దగ్గర రెట్టింపు వసూలు చేస్తున్నా.. వాహనదారులు ఆయా సేవల కోసం రవాణా శాఖలో దరఖాస్తు చేసినప్పుడే, నిర్ధారిత ఫీజుతో పాటు సంబంధిత స్మార్ట్ కార్డు ఇంటికి పంపేందుకు గాను పోస్టల్ చార్జీల కింద రూ.35 చొప్పున వసూలు చేస్తుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తుంది. వాహనదారుల నుంచి రూ.35 వసూలు చేస్తున్నా.. తపాలా శాఖకు మాత్రం రూ.17 మాత్రమే చెల్లిస్తోంది. అంటే జనం నుంచి రెట్టింపు మొత్తం రవాణాశాఖ వసూలు చేస్తోందన్నమాట. అయినా సదరు చార్జీలు తపాలా శాఖకు చెల్లించకుండా బకాయి పడింది. ప్రభుత్వం నుంచి రవాణా శాఖకు నిర్వహణ ఖర్చుల కోసం నిధులు విడుదల కావాల్సి ఉండగా, ఆ మొత్తం అందక పోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. ఆడిట్ అభ్యంతరంతో.. తపాలాశాఖ ‘బుక్ నౌ.. పే లేటర్’అన్న నినాదాన్ని అవలంబిస్తోంది. చార్జీలు ముందుగా చెల్లించకున్నా సేవలు అందిస్తుంది. ఇలా ఏడాదిగా రవాణా శాఖ చెల్లించకున్నా సేవలు కొనసాగించింది. కానీ రెండు నెలల క్రితం అంతర్గత ఆడిట్ విభాగం దీన్ని తప్పుబట్టింది. రవాణా శాఖ దరఖాస్తుదారుల నుంచి చార్జీలు వసూలు చేసి కూడా పోస్టల్‌కు చెల్లించకపోవడం సరికాదని, అలాంటప్పుడు సేవలు ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే తపాలా శాఖ బట్వాడా నిలిపివేసింది. వాహనదారులు కార్డు అందలేదని కార్యాలయాలకు వచ్చి నిలదీస్తే రవాణా శాఖ సిబ్బంది అప్పటికప్పుడు వెతికి ఇస్తున్నారు. మిగతావారు ఎదురుచూపుల్లోనే గడుపుతున్నారు. మొత్తం మీద అన్ని రుసుములు చెల్లించిన తర్వాత కూడా, కార్డుల బట్వాడాలో రవాణా శాఖ వైఫల్యం కారణంగా వాహనదారులు తనిఖీల సమయంలో జరిమానాలు కట్టాల్సి వస్తోంది. -
నయా నకిలీ దందా.. రూ.900కే వెహికిల్ ఆర్సీ..
సాక్షి, హైదరాబాద్: నకిలీ ఆర్సీలు, ఆధార్ కార్డులను సృష్టించి సొమ్ము చేసుకోవడంతో పాటు కొత్త ఆర్సీ జారీతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి కొడుతున్నారు నకిలీ ఆర్సీ ముఠాను సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఓటీ డీసీపీ సందీప్‌తో కలిసి సీపీ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం వివరాలు వెల్లడించారు. నగరంలోని యూసుఫ్‌గూడ వాసి షేక్ జాంగీర్ బాషా, కిషన్‌బాగ్‌కు చెందిన సయ్యద్ హుస్సేన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసి సంపత్.. వీరు ముగ్గురు అత్తాపూర్, భద్రాద్రి కొత్తగూడెం రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ) కార్యాలయాల్లో ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. ఆర్టీఏ కార్యాలయాలోని లొసుగులను ఆసరాగా చేసుకొని సొమ్ము చేసుకునేందుకు పక్కా ప్లాన్ వేశారు. ప్రధాన నిందితుడు శంషాబాద్ రాళ్లగూడకు చెందిన చామన సతీష్, కాటేదాన్‌కు చెందిన డీటీపీ ఆపరేటర్ ఎం గణేష్, వాహన మధ్యవర్తులు అల్వాల్‌కు చెందిన కలిగిడి చంద్రశేఖర్, మదీనాగూడ వాసి సీహెచ్ రమేష్‌లు ముఠాగా ఏర్పడ్డారు. ఆర్టీఏలో వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించే సమయంలో ఆర్సీ కార్డు చేతికివ్వరు. వాహనదారు సూచించిన ఇంటి అడ్రస్‌కు కొరియర్ ద్వారా వస్తుంది. ఆ సమయంలో ఇంటికి తాళం వేసి ఉన్నా లేదా వాహనదారు ఇల్లు మారినా, మరే కారణంతోనైనా ఆర్సీ తీసుకోని పక్షంలో అది తిరిగి ఆర్టీఏ కార్యాలయానికి వస్తుంది. ఇలా వచ్చిన ఆర్సీలను జాంగీర్ బాషా, సయ్యద్ హుస్సేన్, సంపత్‌లు దొంగిలించి.. ఒక్కో ఆర్సీని రూ.900 చొప్పున సతీష్, చంద్రశేఖర్, రమేష్‌లకు విక్రయిస్తారు. డేటా ఆపరేటర్ గణేష్ ఆయా ఒరిజినల్ ఆర్సీ కార్డులపై ఉన్న యజమాని వివరాలను నెయిల్ పాలిష్ (డాజ్లర్)తో తొలగించి నకిలీ ఆర్సీలను సృష్టిస్తాడు. ఆయా బ్రోకర్ల నుంచి వాహనాలను కొనుగోలు చేసిన వాహనాదారులు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి సందర్శించినప్పుడు కొత్త ఆర్సీలు జారీ కావు. ఎందుకంటే ఒరిజినల్ ఆర్సీని అధికారులు స్వాధీనం చేసుకొని ఆధార్ కార్డును ధ్రువీకరించుకున్న తర్వాతే కొత్త ఆర్సీ జార్సీ చేస్తారు గనక! దీంతో ఆయా వాహన బ్రోకర్లు అంతకుముందే సృష్టించిన నకిలీ ఆర్సీ, ఆధార్ కార్డులను వాహనాదారులకు అందిస్తారు. వీటిని ఆర్టీఏ అధికారులకు సమర్పించి.. వాహనదారులు కొత్త ఆర్సీలను తీసుకుంటారు. ఒడిశా వాహనాలకు నకిలీ ఆర్సీ కాపీలు సృష్టిస్తున్నారని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల దృష్టికి రావటంతో రంగంలోకి దిగారు. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.10 వేల నగదుతో పాటు 1,200 నకిలీ ఆర్సీలు, 29 రబ్బర్ స్టాంపులు, 75 ఆధార్ కార్డులు, రెండు ల్యాప్‌టాప్‌లు, సీపీయూ లు, ప్రింటర్లు, 6 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి గత కొన్ని నెలలుగా ఈ ముఠా నకిలీ ఆర్సీ బాగోతాన్ని నడుపుతోంది. ఒక్కో ఆర్సీ జారీ ద్వారా ప్రభుత్వానికి వచ్చే రూ.1,000 నుంచి 1,200 ఆదాయానికి గండిపడింది. సుమారు వెయ్యి వా హనాలకు నకిలీ ఆర్సీలను సృష్టించారు. ఆయా ఆర్టీఏ అధికారులకు పోలీసులు లేఖ రాశారు. వాహనాలను దొంగతనం చేసే నేరస్తులకు కూడా నకిలీ ఆర్సీలను ఇవ్వాలని ఈ మోసగాళ్లు భావించినట్లు పోలీసుల విచారణలో తేలింది. -
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు తీపికబురు అందించింది. వాలిడిటీ ముగిసిపోయిన మోటార్ వెహికల్ డాక్యుమెంట్ల గడువును పొడిగించింది. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. సెప్టెంబర్ 30 వరకు ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ (డిఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్సీ) వంటి పలు వాహన సంబందిత డాక్యుమెంట్ల గడువును తాజాగా అక్టోబర్ 31, 2021 వరకు పొడిగించింది. దీనికి సంబందించి రోడ్డు & రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. "కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా ఫీట్ నెస్, పర్మిట్(అన్ని రకాల), లైసెన్స్, రిజిస్ట్రేషన్ ఏదైనా ఇతర సంబంధిత డాక్యుమెంట్(ల) గడువును 30 సెప్టెంబర్ 2021 వరకు పొడగించినట్లు" ట్విటర్ ద్వారా కేంద్రం తెలిపింది.ఈ క్లిష్ట సమయంలో పనిచేస్తున్న పౌరులు, రవాణాదారులు అసౌకర్యానికి గురికాకుండా చూసేలా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చర్యలు తీసుకోవాలని రోడ్డు & రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. మోటారు వాహనాల చట్టం, 1988 & సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్, 1989కు సంబంధించిన మోటార్ వెహికల్ డాక్యుమెంట్ల పొడిగించింది. గత ఏడాది మార్చిలో వచ్చిన మహమ్మారి కారణంగా అప్పటి నుంచి వీటి గడువును 6 సార్లు పొడిగించింది. చదవండి: అమెజాన్‌లో మొబైల్స్‌పై అదిరిపోయే ఆఫర్స్! MoRT&H has issued advisory to all States/UTs to extend validity of documents till 31 October 2021. pic.twitter.com/DQicN1tk8C — MORTHINDIA (@MORTHIndia) September 30, 2021 -
వాహనదారులకు కేంద్రం శుభవార్త!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా వాహనదారులకు శుభవార్త అందించింది. డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(ఆర్సీ) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో జూన్ 30 వరకు ఉన్న డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ వంటి పలు వాహన సంబందిత డాక్యుమెంట్ల గడువును తాజాగా 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. దీనికి సంబందించి రోడ్డు & రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. "కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి ఫీట్ నెస్, పర్మిట్(అన్ని రకాల), లైసెన్స్, రిజిస్ట్రేషన్ ఏదైనా ఇతర సంబంధిత డాక్యుమెంట్(ల) గడువును 30 సెప్టెంబర్ 2021 వరకు పొడగించినట్లు" అని కేంద్రం ట్వీట్ చేసింది. గత ఏడాది ఫిబ్రవరి 1 ముగిసిన అన్నీ వాహన పత్రాల గడువును సెప్టెంబర్ 30, 2021 నాటికి పొడగించింది. ఈ చర్య వల్ల సామాజిక దూరాన్ని పాటిస్తూ రవాణా సంబంధిత సేవలను పొందవచ్చు అని తెలిపింది. ఈ క్లిష్ట సమయంలో పౌరులు, రవాణాదారులు ఇబ్బందులను ఎదుర్కొనకుండా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సహకరించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే, గతంలో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లు, డ్రైవింగ్ లైసెన్స్ జారీకి సంబంధించిన నిబంధనలలో కొన్ని మార్పులు చేసింది. ఇంతకు ముందు, అభ్యర్థులు లైసెన్స్ కోసం ఆర్టివో కార్యాలయలలో డ్రైవింగ్ టెస్ట్ చేయాల్సి వచ్చేది. కొత్త నిబందనల ప్రకారం, ప్రభుత్వం గుర్తించిన, అర్హత కలిగిన కేంద్రాల్లో డ్రైవింగ్ టెస్ట్ పాస్ అభ్యర్థులు డ్రైవింగ్ లైసెన్స్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. Taking into consideration the need to prevent the spread of COVID-19, MoRT&H has advised the Enforcement Authorities that the validity of Fitness, Permit (all types), License, Registration or any other concerned document(s) may be treated to be valid till 30th Sept, 2021. pic.twitter.com/xe6QIvks5T — MORTHINDIA (@MORTHIndia) June 17, 2021 చదవండి: కొత్త ఇన్‌కంటాక్స్ పోర్టల్ మరీ ఇంత ఖరీదా? -
హలో డ్రైవర్.. లైసెన్స్ తీసుకెళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిరునామాలు సరిగ్గాలేక రవాణా శాఖ పంపుతున్న డ్రైవింగ్ లైసెన్సు (డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) కార్డులు తిరిగొస్తున్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా రెండు నెలల్లో ఏడు వేలకు పైగా కార్డులు రవాణా శాఖ కార్యాలయాలకు వచ్చాయి. వాహనాల కొనుగోలు, డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షకు హాజరైన సమయంలో అందజేసే ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్‌కు రవాణా శాఖాధికారులు ఆర్సీలు, డీఎల్లు పంపడమే ఇందుకు కారణం. అయితే, వాహనదారుడు ఆ అడ్రస్‌లో లేకపోవడంతో పోస్టల్ శాఖ వాటిని తిరిగి రవాణా శాఖకు పంపుతోంది. అంతేకాక.. వాహనదారులు సైతం దరఖాస్తు చేసి పట్టించుకోవడంలేదు. కాగా, విశాఖ జిల్లాలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇక్కడొక్క చోటే రెండు వేలకు పైగా కార్డులు తిరిగొచ్చాయి. అడ్రస్ మారితే మార్చుకోవాలి వాహనదారులు వాహనం కొనుగోలు చేసినప్పుడు డీలరు తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాన్ని ఇస్తున్నారు. దీంతోనే వాహనదారులు తమ వాహనాలను తిప్పుతున్నారని రవాణా అధికారులు చెబుతున్నారు. ఆర్సీలు లేకుండా వాహనాలు తిప్పితే సీజ్ చేయాలని రవాణా శాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. అయితే.. ఆర్సీలు, డీఎల్లు పొందినా.. అడ్రస్ మారితే ఆ అడ్రస్ ఆధారంగా కార్డులను మార్చుకోవాలని రవాణా శాఖ సూచిస్తోంది. కాగా, తిరిగొచ్చిన ఆర్సీలు, డీఎల్‌లను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రవాణా శాఖ కార్యాలయాల్లో ఉ. 10 గంటల నుంచి మ. ఒంటి గంటలోగా పొందేందుకు అధికారులు వీలు కల్పిస్తున్నారు. అప్పటికీ వాహనదారుల నుంచి స్పందన లేకుంటే వాటిని రద్దు చేయనున్నారు. రవాణా, పోలీసు శాఖలకు చిక్కులు ఇదిలా ఉంటే.. ఆర్సీలో ఉన్న చిరునామా, వాహనదారుడు నివాసం ఉండే చిరునామా వేర్వేరుగా ఉండడంతో పోలీస్, రవాణా శాఖలకు చిక్కులు ఎదురవుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించినప్పుడు ఈ–చలానాలు పంపినా.. వేల సంఖ్యలో అవి తిరిగొస్తున్నాయి. ముఖ్యంగా ప్రమాదాలు జరిగినప్పుడు వాహన నంబరు నోట్ చేసుకుని ఆన్లైన్లో చిరునామా కోసం వెతికితే తప్పుడు అడ్రస్సులు దర్శనమిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు జనవరి నుంచి ఆర్సీల తనిఖీని ముమ్మరం చేయాలని రవాణా శాఖ భావిస్తోంది. -
మార్గదర్శి ఇన్వెస్ట్మెంట్ రిజిస్ట్రేషన్ రద్దు
ముంబై: ఈనాడు గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావు డెరైక్టర్‌గా వున్న మార్గదర్శి ఇన్వెస్ట్మెంట్ అండ్ లీజింగ్‌తో సహా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మూడు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్బీఎఫ్సీలు) రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రిజర్వు బ్యాంకు రద్దుచేసింది. ఇవి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ల (ఎన్బీఎఫ్ఐలు) మాదిరిగా కార్యకలాపాలు నిర్వహించడమే ఇందుకు కారణమని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసిన మూడు కంపెనీల్లో మార్గదర్శి ఇన్వెస్ట్మెంట్ అండ్ లీజింగ్, విష్ణు ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్లు హైదరాబాద్‌కు చెందినవి. మరొకటి - సిబార్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడకు చెందినది. రిజిస్ట్రేషన్ రద్దు ఫలితంగా ఈ కంపెనీలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కార్యకలాపాలను నిర్వర్తించజాలవని ఆర్బీఐ పేర్కొంది. ఎన్బీఎఫ్సీ అంటే: రుణాలివ్వడం, షేర్లు, బాండ్లు, డిబెంచర్లు సెక్యూరిటీల వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టడం, లీజింగ్, హైర్‌పర్చేజ్, బీమా, చిట్ వ్యాపారాలు ఎన్‌బీఎఫ్‌సీల ప్రధాన కార్యకలాపాలు. ఎలాంటి స్కీములు, ఒప్పందాల ద్వారా అయినా భారీ మొత్తాన్ని లేదా వాయిదాల్లో నగదును తీసుకోవచ్చు. ఎన్బీఎఫ్ఐ అంటే... వివిధ ఆర్థిక అవసరాలకు నిధులు సమకూర్చే సంస్థల బృందాన్ని ఎన్బీఎఫ్ఐగా వ్యవహరిస్తారు. ఈ బృందాల్లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లు, ఎన్బీఎఫ్సీలు, ప్రైమరీ డీలర్లు (బ్యాంకులు) ఉండవచ్చు.