సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిరునామాలు సరిగ్గాలేక రవాణా శాఖ పంపుతున్న డ్రైవింగ్ లైసెన్సు (డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సీ) కార్డులు తిరిగొస్తున్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా రెండు నెలల్లో ఏడు వేలకు పైగా కార్డులు రవాణా శాఖ కార్యాలయాలకు వచ్చాయి. వాహనాల కొనుగోలు, డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షకు హాజరైన సమయంలో అందజేసే ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్‌కు రవాణా శాఖాధికారులు ఆర్‌సీలు, డీఎల్‌లు పంపడమే ఇందుకు కారణం. అయితే, వాహనదారుడు ఆ అడ్రస్‌లో లేకపోవడంతో పోస్టల్ శాఖ వాటిని తిరిగి రవాణా శాఖకు పంపుతోంది. అంతేకాక.. వాహనదారులు సైతం దరఖాస్తు చేసి పట్టించుకోవడంలేదు. కాగా, విశాఖ జిల్లాలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇక్కడొక్క చోటే రెండు వేలకు పైగా కార్డులు తిరిగొచ్చాయి.
అడ్రస్ మారితే మార్చుకోవాలి
వాహనదారులు వాహనం కొనుగోలు చేసినప్పుడు డీలరు తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాన్ని ఇస్తున్నారు. దీంతోనే వాహనదారులు తమ వాహనాలను తిప్పుతున్నారని రవాణా అధికారులు చెబుతున్నారు. ఆర్‌సీలు లేకుండా వాహనాలు తిప్పితే సీజ్ చేయాలని రవాణా శాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. అయితే.. ఆర్‌సీలు, డీఎల్‌లు పొందినా.. అడ్రస్ మారితే ఆ అడ్రస్ ఆధారంగా కార్డులను మార్చుకోవాలని రవాణా శాఖ సూచిస్తోంది. కాగా, తిరిగొచ్చిన ఆర్‌సీలు, డీఎల్‌లను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రవాణా శాఖ కార్యాలయాల్లో ఉ. 10 గంటల నుంచి మ. ఒంటి గంటలోగా పొందేందుకు అధికారులు వీలు కల్పిస్తున్నారు. అప్పటికీ వాహనదారుల నుంచి స్పందన లేకుంటే వాటిని రద్దు చేయనున్నారు.
రవాణా, పోలీసు శాఖలకు చిక్కులు
ఇదిలా ఉంటే.. ఆర్‌సీలో ఉన్న చిరునామా, వాహనదారుడు నివాసం ఉండే చిరునామా వేర్వేరుగా ఉండడంతో పోలీస్, రవాణా శాఖలకు చిక్కులు ఎదురవుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించినప్పుడు ఈ–చలానాలు పంపినా.. వేల సంఖ్యలో అవి తిరిగొస్తున్నాయి. ముఖ్యంగా ప్రమాదాలు జరిగినప్పుడు వాహన నంబరు నోట్ చేసుకుని ఆన్‌లైన్‌లో చిరునామా కోసం వెతికితే తప్పుడు అడ్రస్సులు దర్శనమిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు జనవరి నుంచి ఆర్‌సీల తనిఖీని ముమ్మరం చేయాలని రవాణా శాఖ భావిస్తోంది.
హలో డ్రైవర్.. లైసెన్స్ తీసుకెళ్లు
Published Sun, Dec 22 2019 3:02 AM | Last Updated on Sun, Dec 22 2019 3:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment