సాక్షి, హైదరాబాద్: సుధీర్ నెల క్రితం కొత్త వాహనం కొన్నాడు. రిజిస్ట్రేషన్ పూర్తయింది. కానీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) కార్డు మాత్రం అతనికి అందలేదు. కర్నూలుకు వెళ్తుండగా చెక్‌పోస్టు వద్ద అధికారులు తనిఖీ చేశారు. ఫోన్‌లో ఉన్న ఆర్సీని చూపాడు. కానీ స్మార్ట్ కార్డు కావాల్సిందేనని పట్టుబట్టిన అధికారులు, రూ.4 వేల ఫైన్ వసూలు చేశారు. కార్డు సిద్ధమైనా బట్వాడా జరగకపోవడమే ఇందుకు కారణం.
ఒక్క ఆర్సీ కార్డులే కాదు.. కొత్త డ్రైవింగ్ లైసెన్సులు, రెన్యువల్స్, డూప్లికేట్లు సంబంధిత స్మార్ట్ కార్డులు తెలంగాణ రవాణా శాఖ కార్యాలయాల్లో గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. రోజుకు దాదాపు 15 వేలకు పైగా కార్డులు సిద్ధమవుతాయి. వీటిని స్పీడ్ పోస్టు ద్వారా వినియోగదారులకు పంపాలి. బట్వాడా చేసే బాధ్యత తపాలాశాఖది. కానీ గత రెండు నెలలుగా తపాలాశాఖ ఆ బట్వాడా జరపటం లేదు. దీంతో కార్డులన్నీ కార్యాలయాల్లోనే ఉండిపోతున్నాయి.
బట్వాడా ఎందుకు నిలిచింది?
ఏ స్మార్ట్ కార్డునైనా ఆ ప్రక్రియ పూర్తయిన వారం రోజుల్లో వాహనదారులకు పంపాలి. స్పీడ్ పోస్టు ద్వారా ఇళ్లకు బట్వాడా చేసినందుకు ప్రతి కార్డుకు రూ.17 చొప్పున పోస్టల్ చార్జీ కింద తపాలా శాఖకు రవాణా శాఖ చెల్లిస్తుంది. అయితే దాదాపు ఏడాది కాలంగా ఈ చెల్లింపులు నిలిచిపోయాయి. ఏకంగా రూ.నాలుగైదు కోట్ల మొత్తాన్ని రవాణా శాఖ బకాయి పడింది. ఆ బకాయిల కోసం అడిగీఅడిగీ విసిగిపోయిన తపాలా శాఖ రెండు నెలల క్రితం బట్వాడా నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది.
ప్రజల దగ్గర రెట్టింపు వసూలు చేస్తున్నా..
వాహనదారులు ఆయా సేవల కోసం రవాణా శాఖలో దరఖాస్తు చేసినప్పుడే, నిర్ధారిత ఫీజుతో పాటు సంబంధిత స్మార్ట్ కార్డు ఇంటికి పంపేందుకు గాను పోస్టల్ చార్జీల కింద రూ.35 చొప్పున వసూలు చేస్తుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తుంది. వాహనదారుల నుంచి రూ.35 వసూలు చేస్తున్నా.. తపాలా శాఖకు మాత్రం రూ.17 మాత్రమే చెల్లిస్తోంది. అంటే జనం నుంచి రెట్టింపు మొత్తం రవాణాశాఖ వసూలు చేస్తోందన్నమాట. అయినా సదరు చార్జీలు తపాలా శాఖకు చెల్లించకుండా బకాయి పడింది. ప్రభుత్వం నుంచి రవాణా శాఖకు నిర్వహణ ఖర్చుల కోసం నిధులు విడుదల కావాల్సి ఉండగా, ఆ మొత్తం అందక పోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి.
ఆడిట్ అభ్యంతరంతో..
తపాలాశాఖ ‘బుక్ నౌ.. పే లేటర్’అన్న నినాదాన్ని అవలంబిస్తోంది. చార్జీలు ముందుగా చెల్లించకున్నా సేవలు అందిస్తుంది. ఇలా ఏడాదిగా రవాణా శాఖ చెల్లించకున్నా సేవలు కొనసాగించింది. కానీ రెండు నెలల క్రితం అంతర్గత ఆడిట్ విభాగం దీన్ని తప్పుబట్టింది. రవాణా శాఖ దరఖాస్తుదారుల నుంచి చార్జీలు వసూలు చేసి కూడా పోస్టల్‌కు చెల్లించకపోవడం సరికాదని, అలాంటప్పుడు సేవలు ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించినట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలోనే తపాలా శాఖ బట్వాడా నిలిపివేసింది. వాహనదారులు కార్డు అందలేదని కార్యాలయాలకు వచ్చి నిలదీస్తే రవాణా శాఖ సిబ్బంది అప్పటికప్పుడు వెతికి ఇస్తున్నారు. మిగతావారు ఎదురుచూపుల్లోనే గడుపుతున్నారు. మొత్తం మీద అన్ని రుసుములు చెల్లించిన తర్వాత కూడా, కార్డుల బట్వాడాలో రవాణా శాఖ వైఫల్యం కారణంగా వాహనదారులు తనిఖీల సమయంలో జరిమానాలు కట్టాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment