Department of Transport
-
రవాణాశాఖలో ఫ్యాన్సీ నంబర్ల కుంభకోణం
సాక్షి, హైదరాబాద్: రవాణాశాఖలో కొందరు అధికారులు, ఓ ప్రైవేటు ఏజెన్సీ సిబ్బంది కలిసి ఫ్యాన్సీ నంబర్ల కుంభకోణానికి పాల్పడ్డారు. ఫ్యాన్సీ నంబర్లకు వాహన దారులు కోట్ చేసిన ధరను రహస్యంగా ఉంచాల్సింది పోయి, ఆ మొత్తాన్ని అనుకూల వాహనదారుల చెవిన పడేసి ఆ నంబర్ వారికే దక్కేలా పావులు కదిపారు. ఇలా ఒక్కో నంబర్ కేటాయింపు ద్వారా భారీగా కమీషన్లు దండుకున్నారు. ఇదంతా ఓ అధికారి కనుసన్నల్లో జరిగిందని తేల్చుకున్న ప్రభుత్వం ఆయనపై చర్యలకు సిద్ధమవుతోంది. కొన్నేళ్లుగా రవాణాశాఖలో జరుగుతున్న అవినీతి బాగోతం గుట్టు విప్పే పని ఇప్పుడు వేగంగా సాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులు భారీగా అక్రమాలను సాగించారని గుర్తించిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని బహిర్గతం చేయాలని నిర్ణయించింది. గతంలో రవాణాశాఖలో అన్నీ తానై చక్రం తిప్పిన ఓ అధికారిపై భారీగా ఫిర్యాదులున్నాయి.కమిషనర్‌ను కూడా లెక్క చేయకుండా ఆ అధికారే అన్ని చక్కబెట్టేవారన్న ఆరో పణలున్నాయి. సిబ్బందికి పదోన్నతులు, బదిలీలు కూడా ఆయన కనుసన్నల్లోనే జరిగేవి. ఇదే తరహాలో ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు వ్యవహారం కూడా చోటుచేసుకుంది. ఆ అధికారికి చెందిన ఓ బినామీ సంస్థ కూడా ఈ శాఖలో కీలకంగా వ్యవహరించిందని సమాచారం. రూ.కోట్లలో కమీషన్లురవాణా శాఖ కార్యాలయాలకు సాంకేతిక సహకారాన్ని అందించే బాధ్యతను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఈ క్రమంలో ఆ సంస్థ సిబ్బందిని ఓ అధికారి తన అక్రమాలకు వినియోగించుకున్నారన్న ఫిర్యాదులున్నాయి. రవాణా శాఖలో ఫ్యాన్సీ నంబర్లకు బాగా డిమాండ్ ఉంటుంది. సెంటిమెంటు ఆధారంగా వాహనదారులు తమకు ఇష్టమైన నంబరును పొందేందుకు ఆసక్తి చూపుతారు. 0001, 9999, 0099, 5555... ఇలాంటి నెంబర్లకు డిమాండ్ చాలా ఎక్కువ. ఏటా దాదాపు లక్ష వరకు నంబర్లను వేలంలో ఉంచటం ద్వారా రవాణా శాఖకు ఏటా రూ.80 కోట్లకుపైగా ఆదాయం వస్తుంది.ఈ నంబర్ల కేటాయింపు బిడ్డింగ్ పద్ధతిలో జరుగుతుంది. ఎవరు ఎక్కువ కోట్ చేస్తే వారికి నంబరు దక్కుతుంది. రవాణాశాఖ ప్రధాన సర్వర్ వద్ద విధుల్లో ఉండే ప్రైవేటు సంస్థ సిబ్బంది బిడ్డింగ్‌లో కోట్ చేసిన మొత్తాన్ని ఆ అధికారికి చేరవేసేవారు. అప్పటికి బిడ్‌లో నమోదైన గరిష్ట మొత్తాన్ని తెలుసుకుని అనుకూల వాహనదారులకు చేరవేయటం ద్వారా నంబర్ అలాట్ అయ్యే మొత్తం కోట్ చేసేలా చక్రం తిప్పేవారు. ఇలా కోరిన వారికి నంబర్ ఇప్పించి పెద్ద మొత్తంలో కమీషన్లు వసూలు చేసే వారు. అలా ఏటా రూ.కోట్లలో జేబుల్లో వేసుకునేవారు. ఇప్పుడు దీనిపై ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. ఈ కుంభకోణంలో బాధ్యులుగా కొందరిని గుర్తించింది. ప్రస్తుతానికి 56 మంది డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ల(డీబీఏ)లను విధుల్లో నుంచి తొలగించినట్టు తెలిసింది. త్వరలో మరికొందరిపైనా చర్యలు తీసుకోనున్నట్టు సమా చారం. సూత్రధారిగా ఉన్న అధికారిపైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. -
రాష్ట్ర కోడ్ మార్చేస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: ఒకే నంబర్‌తో రెండు, మూడు వాహనాలుంటే ఎలా ఉంటుంది? ఏదైనా నేరాలు, అక్రమాలకు పాల్పడే ఉద్దేశంతో కొంత మంది ఇలా చేస్తుంటారు. కానీ కొందరు వాహనదారుల అత్యుత్సాహం, అవగాహన లేమితో ఇప్పుడు భవిష్యత్తులో ఒకే నంబర్ రెండు వాహనాలకు కనిపించే పరిస్థితి ఎదురుకాబోతోంది. దీంతో ఒక వాహనానికి సంబంధించిన వారు ఏదైనా నేరం చేస్తే దానివల్ల అదే నంబర్ ఉన్న రెండో వాహన యజమాని ఇబ్బంది పడే అవకాశం ఉందని అధికారులంటున్నారు. ఇదీ సంగతి..: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి స్టేట్ కోడ్ ఏపీ నుంచి టీఎస్‌కు మారింది. దాదాపు పదేళ్లపాటు అదే కొనసాగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని మార్చింది. టీఎస్‌కు బదులు టీజీని అమల్లోకి తెచ్చింది. అయితే పాత వాహనాలకు టీఎస్ కోడ్ యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. కానీ కొందరు వాహనదారుల అత్యుత్సాహంతో ఇది సమస్యగా మారనుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో తమ వాహనాలకు టీజీ కోడ్ ఉండాలని బలంగా కోరుకున్న కొందరు... ఇప్పుడు టీజీ కోడ్ అమల్లోకి రావడాన్ని స్వాగతిస్తూ తమ పాత వాహనాల నంబర్ ప్లేట్లపై టీఎస్ అక్షరాలను తొలగించి టీజీ అని పెట్టుకుంటున్నారు. సమస్య ఏమిటి? టీజీ కోడ్ కొత్తగా రావడంతో రవాణా శాఖ అధికారులు కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ నంబర్లను మళ్లీ ‘ఎ’ ఆల్ఫాబెట్ నుంచి కేటాయిస్తున్నారు. ప్రస్తుతం ‘సి’ సిరీస్ కొనసాగుతోంది. రాష్ట్రం ఆవిర్భవించిన సమయంలో టీఎస్ కోడ్‌ను ప్రారంభించినప్పుడు ‘ఇ’ సిరీస్‌తో మొదలుపెట్టారు. ఇప్పుడు త్వరలోనే టీజీ కోడ్‌లో కూడా ‘ఇ’ సిరీస్ మొదలవుతుంది. దానికి 0001 నుంచి నంబరింగ్ మొదలవుతుంది. క్రమంగా గతంలో టీఎస్ కింద కేటాయించిన నంబరే ఇప్పుడు టీజీ సిరీస్‌లో కూడా అలాట్ అవుతుంది. స్టేట్ కోడ్ (టీఎస్, టీజీ) మాత్రమే తేడా ఉంటుంది. అయితే టీఎస్ నంబర్ ప్లేట్ ఉన్న వాహనదారుడు సొంతంగా టీజీ ఏర్పాటు చేసుకుంటే... అధికారికంగా టీజీ కోడ్‌తో అదే నంబర్ ఉన్న వాహనంతో దాని నంబర్ క్లాష్ అవుతుంది. ఉదా: టీఎస్ ఎ 0001 నంబర్‌తో ఉన్న పాత వాహనదారుడు దాన్ని టీజీగా మారిస్తే.. ఇప్పుడు టీజీ ఏ 0001 అని ఏదైనా కొత్త వాహనానికి నంబర్ అలాట్ అయితే రెండు వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లు ఒకటిగా మారి సమస్య ఏర్పడుతుందన్నమాట. రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు, నేరాలు జరిగినప్పుడు ఇలా నంబర్లు క్లాష్ అయితే కేసు దర్యాప్తులో చిక్కులు ఏర్పడతాయి. దీంతోపాటు అధికారికంగా సరైన నంబర్ కలిగి ఉన్న వాహనదారుడు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. అలా మార్చడం నేరం టీజీ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కొందరు టీఎస్ కోడ్ వాహనదారులు వచ్చి తమ వాహనాలకు టీజీ కోడ్ అలాట్ చేయాలని కోరుతున్నారు. కానీ అది సాధ్యం కాదని... టీజీ సిరీస్ అమల్లోకి వచ్చిన తర్వాత కొన్న వాహనాలకు మాత్రమే టీజీ కోడ్ వర్తిస్తుందని చెప్తున్నాం. ఎవరైనా సొంతంగా నంబర్ ప్లేట్‌పై స్టేట్ కోడ్ మారిస్తే దాన్ని ట్యాంపరింగ్గానే భావించి నేరంగా పరిగణించాల్సి ఉంటుంది. అలాంటి వారిపై చర్యలు కూడా ఉంటాయి. వాహనదారులు ఇది తెలుసుకోవాలి. – రమేశ్, జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ -
స్మార్ట్ కార్డుల్లో నాణ్యత లేని చిప్స్
సాక్షి, హైదరాబాద్: వాహనదారులకు తెలంగాణ రవాణా శాఖ సరఫరా చేస్తున్న స్మార్ట్ కార్డుల్లో నాణ్యత లేని చిప్స్ వాడుతున్న వ్యవహారం వెలుగు చూసింది. స్మార్ట్ కార్డులు సకాలంలో రాకపోవడం, అందిన కార్డుల్లోనూ నాణ్యత లేకపోవటంపై చాలాకాలంగా ఫిర్యాదులు వస్తున్నా, రవాణాశాఖ సరిగ్గా స్పందించలేదు. చివరకు ఆ ఫిర్యాదుల ఆధారంగా ఇప్పుడు ఎట్టకేలకు విచారణ జరిపింది. జారీ అయిన కార్డుల్లో నాణ్యత లేని చిప్స్ ఉన్నాయన్న విషయాన్ని శాస్త్రీయంగా తెలుసుకొని చర్యలకు ఉపక్రమించింది. తెలంగాణ రవాణా శాఖకు లైసెన్సులు, ఆర్సీ కార్డులకు సంబంధించి స్మార్ట్ కార్డులు జారీ చేస్తున్న నోయిడాకు చెందిన సంస్థను బాధ్యతల నుంచి తప్పించింది. తదుపరి రవాణాశాఖకు సంబంధించి ఎలాంటి టెండర్లలో పాల్గొనకుండా డిబార్ చేయటం విశేషం. వాహన లైసెన్సులు, ఆర్సీ కార్డులకు సంబంధించి కొన్నేళ్లుగా రవాణాశాఖ చిప్స్‌తో కూడిన స్మార్ట్ కార్డులను జారీ చేస్తున్న విషయం తెలిసిందే. స్కాన్ చేయగానే పూర్తి వాహనం, లైసెన్సు వివరాలను తెలిపే సమాచారాన్ని అందించే చిప్స్‌ను స్మార్ట్ కార్డుల్లో నిక్షిప్తం చేసి జారీ చేస్తున్నారు. టెండర్ల ద్వారా ఈ బాధ్యతను ప్రైవేట్ సంస్థలకు రవాణా శాఖ అప్పగించింది. అలా ఢిల్లీ సమీపంలోని నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న మెజర్స్ కలర్‌ప్లాస్ట్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్మార్ట్ కార్డుల జారీ టెండర్ దక్కించుకుంది. కానీ, చాలాకాలంగా ఆ సంస్థ కార్డులను సరిగ్గా జారీ చేయటం లేదు. స్మార్ట్ కార్డు రుసుము, పోస్టల్ చార్జీలు చెల్లించినా నెలల తరబడి కార్డులు సరఫరా కాక వాహనదారులు టెన్షన్ పడాల్సి వస్తోంది. దీనిపై అధికారులను ప్రశి్నస్తే, కార్డులు జారీ అవుతాయని చెప్పటం, తప్ప వాస్తవాలు వెల్లడించటం లేదు. ఆ ఫిర్యాదుతో.... ఇటీవలే మళ్లీ కార్డుల జారీ ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో ది సేఫ్ కమ్యూనిటీ ఫౌండేషన్ సంస్థ చైర్మన్ నుంచి రవాణా శాఖకు గత మే నెలలో ఫిర్యాదు అందింది. తమకు జారీ అయిన స్మార్ట్ కార్డుల్లో నాణ్యత లేదన్నది దాని సారాంశం. దీంతో రవాణాశాఖ కొన్ని కార్డులను సేకరించి స్మార్ట్ కార్డ్ ఆపరేటింగ్ సిస్టం నిబంధనల మేరకు కార్డుల్లో నాణ్యత ఉందో లేదో తేల్చాలని ఎన్ఐసీ(నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్)ని కోరింది. శాంపిల్ కార్డులను పరిశీలించిన ఎన్ఐసీ, కొన్ని కార్డుల్లోని చిప్స్‌లో నాణ్యత లేదని తేల్చి నివేదిక అందించింది. దీనిని తీవ్రంగా పరిగణించిన రవాణా శాఖ, ఆ కార్డులను సరఫరా చేసిన నోయిడాలోని సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని తేలి్చ, ఇప్పుడు చర్యలకు ఉపక్రమించింది. కార్డుల జారీకి సంబంధించి రవాణా శాఖతో చేసుకున్న ఒప్పందంలోని అంశాలకు విరుద్ధంగా వ్యవహరించినందున, తదుపరి రవాణా శాఖకు సంబంధించి ఎలాంటి టెండర్లలో పాల్గొనకుండా ఆ సంస్థను డిబార్ చేస్తున్నట్టు రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు, టెండర్ ఒప్పందాలను ఉల్లంఘించినందుకు ఆ సంస్థపై చట్టపరంగా చర్యలు తీసుకుంది. -
ఇక వాహన శాశ్వత రిజిస్ట్రేషన్లూ షోరూంలలోనే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాహనాలు కొనుగోలు చేసిన షోరూంలలోనే శాశ్వత రిజిస్ట్రేషషన్లు చేసేందుకు రవాణా శాఖ తాజాగా కసరత్తు చేపట్టింది. వాహన యజమానులకు ఇబ్బందులు తలెత్తకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడంపై దృష్టి సారించింది. ఇప్పటికే ఈ విధానం ఏపీలో విజయవంతంగా అమలవుతుండటంతో ఇక్కడ సైతం అదే పద్ధతిని అమలు చేసేందుకు అనుసరించాల్సిన విధివిధానాలపై అధ్యయనం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని వాహనాల షోరూంల వివరాలతోపాటు నిత్యం నమోదయ్యే వాహనాల వివరాలను సేకరిస్తోంది. ఒక్కో డీలర్ విక్రయించే వాహనాల సంఖ్య, షోరూంలలోనే వాహనాల శాశ్వత నమోదు ప్రక్రియ చేపడితే అవసరమయ్యే సాంకేతిక పరిజా్ఙనం తదితర అంశాలపై ఈ కసరత్తు చేపట్టింది. లోక్‌సభ ఎన్నికల అనంతరం షోరూంలలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం షోరూంలలో వాహనాలకు తాత్కాలిక రిజిస్ట్రేషన్లు (టీఆర్) చేస్తున్నారు. రవాణాశాఖ నుంచే ఈ టీఆర్‌లు అందుతున్నప్పటికీ అందుకోసం వాహనదారులు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లట్లేదు. వాహనంతోపాటు షోరూంలోనే టీఆర్ పత్రాలను తీసుకుంటున్నారు. పర్మినెంట్ రిజిస్ట్రేషన్ (పీఆర్) కూడా షోరూంలకే బదిలీ అయితే వాహనదారులకు ఇకపై పీఆర్ స్మార్ట్ కార్డులు చేతికి అందుతాయి. 2016లోనే కేంద్రం మార్గదర్శకాలు... కేంద్రం ప్రభుత్వం రహదారి భద్రత చట్టంలో వాహనదారులకు ఊరట కలి్పంచే అనేక అంశాలను పొందుపరిచింది. వాహనాల రిజి్రస్టేషన్లను షోరూంలలోనే పూర్తి చేసేలా 2016లోనే మార్గదర్శకాలు రూపొందించింది. ఏపీ సహా పలు రాష్ట్రాలు ఈ సదుపాయాన్ని వాహనదారులకు అందుబాటులోకి తెచ్చాయి. కానీ తెలంగాణలో మాత్రం వాహనాలు కొనుగోలు చేసిన సమయంలో మొదట టీఆర్ తీసుకొని ఆ తరువాత సంబంధిత ప్రాంతీయ రవాణా కార్యాలయంలో పీఆర్ పొందే విధానం కొనసాగుతోంది. అయితే ఈ ప్రక్రియ దళారులతోపాటు కొందరు అధికారుల అక్రమార్జనకు దోహదం చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. కేంద్రం మార్గదర్శకాలు రాష్ట్రంలోనూ అమలైతే షోరూంలోనే పీఆర్ స్మార్ట్ కార్డుతోపాటు వాహనానికి హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ కూడా లభించనుంది. గ్రేటర్లో భారీగా వాహనాల అమ్మకాలు గ్రేటర్ హైదరాబాద్‌లోని పది ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో నిత్యం సుమారు 2,500 కొత్త వాహనాల అమ్మకాలు జరుగుతున్నాయి. వాటిలో 1,600కుపైగా ద్విచక్ర వాహనాలుకాగా మిగతావి కార్లు, ఇతర వాహనాలు ఉన్నాయి. ప్రస్తుతం వాహనదారుల చిరునామా పరిధిలోని ఆర్టీఓ కార్యాలయంలో శాశ్వత రిజి్రస్టేషన్ చేస్తున్నారు. ఒక్కో కార్యాలయంలో రోజుకు వందల సంఖ్యలో శాశ్వత రిజి్రస్టేషన్ల వల్ల వాహనాల రద్దీతోపాటు అందరి సమయం వృథా అవుతోంది. అలాగే ఆన్లైన్లో స్లాట్ నమోదు మొదలు అధికారుల తనిఖీ పూర్తయ్యే వరకు వాహనదారులు ఆర్టీఏ ఏజెంట్లను ఆశ్రయించాల్సి వస్తోంది. షోరూం రిజిస్ట్రేషన్లు అమల్లోకి వస్తే దళారుల అక్రమ దందాకు తెరపడనుంది. -
‘టీజీ’ స్మార్ట్ కార్డులేవీ ?
సాక్షి, హైదరాబాద్: వాహనాల నంబర్ ప్లేట్లపై రాష్ట్ర కోడ్ టీఎస్ నుంచి టీజీగా మారింది. ఈనెల 15 నుంచి రిజిస్టర్ అయ్యే వాహనాలకు టీజీ సీరీస్ కేటాయిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ రోజుకు దాదాపు 10 వేల వరకు కొత్త వాహనాలు రాష్ట్రంలో రోడ్డెక్కుతాయి. ఇప్పటి వరకు ఏ వాహనానికి కూడా టీజీ సీరిస్ ఆర్‌సీబుక్ గానీ, కొత్త లైసెన్సు స్మార్ట్‌కార్డు గానీ జారీ కాలేదు. అయితే దీనిపై రవాణాశాఖ ఎక్కడా స్పష్టత ఇవ్వకపోవటం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. స్మార్ట్ కార్డుల జారీ బాధ్యత ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకొని, చిప్‌తో కూడి కార్డు సరఫరా చేస్తారు. గత ప్రభుత్వ హయాంలో వీటికి సంబంధించి ఒప్పందాలు జరిగాయి. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి వాటి జారీ ఆగిపోయింది. చార్జీల వసూలు సరే... ఆర్సీ, నంబర్ ప్లేట్, లైసెన్స్ బట్వాడా పేరిట చార్జీలు వసూలు చేస్తున్న రవాణాశాఖ వాటిని వారంరోజులుగా ఇవ్వకపోవడంపై వాహనదా రులు షోరూమ్ నిర్వాహకులనో, రవాణాశాఖ అధికారులనో ప్రశ్నిస్తే.. సంబంధిత సాఫ్ట్‌వేర్‌లో ఆమేరకు మార్పు చేయాల్సి ఉందని, అందుకే కొంత జాప్యం జరుగుతోందన్నారు. రెండుమూడు రోజుల్లో వాటి బట్వాడా మొదలవుతుందని చెబుతున్నారు. వాహనాల రాష్ట్ర కోడ్ మారినందున సాఫ్ట్‌వేర్‌ను కూడా యుద్ధప్రాతిపదికన మార్చాలి. ఈనెల 15 నుంచి రాష్ట్ర కోడ్ మారుతుందని రవాణాశాఖకు స్పష్టమైన అవగాహన ఉంది. వెంటనే సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేయొచ్చు. కానీ వారం రోజులు గడుస్తున్నా అప్డేట్ కాలేదని పేర్కొంటుండటం విచిత్రంగా ఉంది. రాష్ట్ర కోడ్ మార్పు అమలులోకి రావటానికి మూడు రోజుల ముందు నుంచే కార్డుల జారీ నిలిచిపోయిందని తెలుస్తోంది. ఇన్ని రోజులుగా సాఫ్ట్‌వేర్‌ను ఎందుకు అప్డేట్ చేయటం లేదో..ఎందుకు జాప్యం జరుగుతోందో సమాచారం లేదు. దీనిపై ఉన్నతాధికారులు కూడా స్పందించటం లేదు. ఆర్సీ, లైసెన్స్ స్మార్ట్‌కార్డులు లేక వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు తనిఖీ చేస్తే డౌన్లోడ్ చేసుకున్న పత్రాలను చూపండి అంటూ రవాణాశాఖ సిబ్బంది సలహా ఇస్తున్నారు. కానీ, రాష్ట్ర సరిహద్దులు దాటే చోట ఉండే చెక్‌పోస్టుల్లో సిబ్బంది ఆ కాగితాలను పరిగణనలోకి తీసుకోవటం లేదని, చిప్ ఉన్న స్మార్ట్ కార్డులే చూపాలని పేర్కొంటున్నారని వాహన దారులు చెబుతున్నారు. -
వాహనాల ఆర్సీలకు మళ్లీ చిప్‌లు
సాక్షి, హైదరాబాద్: దాదాపు ఏడాది విరామం తర్వాత రాష్ట్రంలో మళ్లీ వాహనాల లైసెన్సులు, ఆర్సీ స్మార్ట్ కార్డులకు చిప్‌ల ఏర్పాటు ప్రారంభమైంది. విదేశాల నుంచి తీసుకువస్తున్న ఈ చిప్‌లకు కొరత ఏర్పడి దిగుమతి నిలిచిపోవటంతో చిప్‌లు లేకుండానే కార్డులను జారీ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ చిప్, క్యూఆర్ కోడ్లతో కూడిన స్మార్ట్ కార్డుల జారీని రవాణాశాఖ ప్రారంభించింది. గురువారం నుంచి వాటి బట్వాడా మొదలైంది. ఉక్రెయిన్ యుద్ధం.. తైవాన్‌లో కొరత పేరుతో.. రాష్ట్రంలో దాదాపు ఏడాది కిందట వరకు వాహనాల లైసెన్సులు, ఆర్సీ స్మార్ట్ కార్డులకు చిప్‌లను బిగించేవారు. ఆ చిప్ ముందు చిప్ రీడర్‌ను ఉంచగానే.. వాహనానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలిసిపోతుంది. టెండర్ల ప్రక్రియ ద్వారా ప్రైవేటు కంపెనీకి ఈ స్మార్ట్ కార్డుల తయారీ బాధ్యత అప్పగించారు. ఆ సంస్థనే చిప్‌ల వ్యవహారం కూడా చూస్తుంది. అయితే చిప్‌లకు కొరత ఏర్పడిందన్న పేరుతో స్మార్ట్ కార్డుల తయారీ, జారీ నిలిపేశారు. ఉక్రెయిన్, తైవాన్, చైనాల నుంచి ఆ చిప్స్ దిగుమతి అవుతాయని, చైనాతో సత్సంబంధాలు లేక వాటి దిగుమతిని కేంద్రం ఆపేసిందని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆ దేశం నుంచి కూడా ఆగిపోయాయని, ఇక స్థానికంగా డిమాండ్ పెరిగి చిప్‌ల ఎగుమతిని తైవాన్ తాత్కాలికంగా నిలిపివేసిందని అధికారులు అప్పట్లో పేర్కొన్నారు. చివరకు చిప్‌లు లేకుండానే కార్డుల జారీకి అనుమతించారు. మహారాష్ట్ర అధికారుల అభ్యంతరంతో.. ఆరు నెలల క్రితం తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో తెలంగాణ వాహనాలను తనిఖీ చేసినప్పుడు చిప్ లేకుండా ఉన్న కార్డులపై ఆ రాష్ట్ర అధికారులు అనుమానాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. అవి అసలైనవో, నకిలీవో గుర్తించటం ఎలా అంటూ వాహనదారులను ప్రశ్నించారు. దీంతో పాటు రవాణాశాఖకు కూడా ఫిర్యాదులు పెరుగుతూ వచ్చాయి. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుని తిరిగి చిప్‌లను ఏర్పాటు చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు కాంట్రాక్టు సంస్థను ఆదేశించింది. దాంతో ఆ సంస్థ చిప్‌లను సమకూర్చుకుని స్మార్ట్ కార్డుల తయారీని సిద్ధం చేసింది. గురువారం నుంచి చిప్‌లతో కూడిన స్మార్ట్ కార్డుల జారీని రవాణాశాఖ అధికారులు ప్రారంభించారు. స్మార్ట్ కార్డు ముందు వైపు చిప్ ఉంటుండగా, వెనక వైపు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో సగటున నిత్యం 3,500 లైసెన్సులు, 5,500 ఆర్సీ కార్డులు జారీ అవుతున్నాయి. ఇప్పుడు ఆ కొరతను ఎలా అధిగమించారో? అప్పట్లో చిప్‌లకు కొరత ఎందుకు వచ్చిందో, ఇప్పుడు చిప్‌లు ఎలా సమకూర్చుకుంటున్నారో అధికారులు స్పష్టం చేయాలని తెలంగాణ ఆటోమోటార్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దయానంద్ డిమాండ్ చేశారు. -
9999 నంబరుకు రూ.4.61లక్షలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): వాహనాల నంబర్లకు ఆన్లైన్ బిడ్డింగ్‌లో మంచిర్యాల జిల్లా రవాణా శాఖా కార్యాలయానికి బుధవారం భారీగా ఆదాయం సమకూరింది. టీఎస్ 19 హెచ్ సిరీస్ ముగింపుతోపాటు టీఎస్ 19 జే సిరీస్ ప్రారంభంలో రవాణాశాఖకు భారీ ఆదాయం వచ్చింది. టీఎస్ 19 హెచ్ 9999 నంబర్‌కు ఆన్లైన్ బిడ్డింగ్‌లో గత ఏడాది సిరీస్‌లో రూ.3 లక్షల వరకు రాగా ఈ ఏడాది రూ.4,61,111 ఆదాయం వచ్చింది. ఇక బుధవారం ఒక్క రోజే 12 వాహనాల లక్కీ నంబర్లకు ఆన్లైన్లో బిడ్డింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో టీఎస్ 19 హెచ్ 9999 నంబరు కోసం ఆన్లైన్లో నలుగురు పోటీ పడగా విక్టర్ దినేశ్ రూ.4,61,111కు దక్కించుకున్నాడు. టీఎస్ 19 జే 0001 నంబరు కోసం ముగ్గురు పోటీ పడగా అరికెపూడి శివకుమార్ రూ.1.17 లక్షలకు సొంతం చేసుకున్నాడు. టీఎస్ 19 జే 0006 నంబరు కోసం ఇద్దరు పోటీ పడగా మంచిర్యాలకు చెందిన కంకణాల శ్యాంసుందర్ రూ.95 వేలకు సొంతం చేసుకున్నాడు. టీఎస్ 19 జే 0009 నంబరు కోసం ఇద్దరు పోటీ పడగా మంచిర్యాలకు చెందిన రాజశేఖర్ అతి తక్కువలో అంటే రూ.50,000కే సొంతం చేసుకోవడం గమనార్హం. ఇవే కాకుండా టీఎస్ 19 హెచ్ 9988 నంబరుకు రూ.5 వేలు, టీఎస్ 19 హెచ్ 9995 నంబరుకు రూ.2 వేలు, టీఎస్ 19 జే 0008 నంబరుకు 13,600, టీఎస్ 19 హెచ్ 9996 నంబరు రూ.5 వేలు, టీఎస్ 19 జే 0005 నంబరు రూ.10 వేలు, టీఎస్ 19 హెచ్ 9998 నంబరు రూ.5 వేలు, టీఎస్ 19 హెచ్ 9008 నంబరు రూ.5 వేలు, టీఎస్ 19 జే 0003 నంబరు రూ.10 వేలు, టీఎస్ 19 హెచ్ 9969 నంబరు రూ.5 వేలతో బిడ్డింగ్ పలికింది. ఇక రవాణా శాఖకు ఈ నంబర్ల ఫీజుల ద్వారా రూ.2,04,000, మొత్తం బిడ్డింగ్ ద్వారా రూ.7,11,712 వరకు ఆదాయం సమకూరినట్లు డీటీఓ కిష్టయ్య తెలిపారు. కాగా రవాణా శాఖలో వాహన నంబర్ల కేటాయింపు సిరీస్ ముగింపు, ప్రారంభంలో రవాణా శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. -
లైసెన్స్టు కిల్!
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు భారీ వాహన డ్రైవర్లకు లైసెన్సు రెన్యువల్ సమయంలో ఒకరోజు అవగాహన, శిక్షణ కార్యక్రమం ఇవ్వడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం జారీ చేసిన ఆదేశాలకు అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. డబ్బు వసూలే ధ్యేయంగా ఏర్పడ్డ కొన్ని ప్రైవేటు డ్రైవింగ్ స్కూళ్లతో కుమ్మక్కైన కొందరు అధికారులు రవాణాశాఖలో తెరవెనక చక్రం తిప్పుతున్నారు. సాక్షి, హైదరాబాద్: ట్రక్కుల్లాంటి భారీ వాహనాలు నడిపే డ్రైవర్లకు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ తప్పనిసరి. తమ లైసెన్సులను ప్రతి ఐదేళ్లకోసారి (ట్రాన్స్‌పోర్టు కేటగిరీ) రెన్యువల్ చేసుకోవాలి. అదే ప్రమాదకర పదార్థాలు తరలించే వాహనాల డ్రైవర్లు మూడేళ్లకోసారి రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ సమయంలో కేంద్రప్రభుత్వ నిర్దేశిత పద్ధతిలో డ్రైవర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలి. వాహనాలు నడపడం, జాగ్రత్తలు తీసుకోవడం, ప్రమాదాలను తప్పించేందుకు అనుసరించాల్సిన పద్ధతులు, ప్రమాదాన్ని నివారించలేని పక్షంలో వీలైనంతవరకు దాని తీవ్రత తగ్గేలా చూడటం, రోడ్లలో వస్తున్న మార్పులు.. ఇలా పలు అంశాల్లో ఆధునిక సాంకేతికత ఆధారంగా ఆ శిక్షణ కార్యక్రమం ఉండాలి. ఆ శిక్షణ పూర్తి చేసినట్టు సర్టిఫికెట్ వచ్చిన వారికి మాత్రమే లైసెన్స్ రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. కొందరు డ్రైవర్లు మధ్యలో కొన్నేళ్లపాటు వేరే ఉద్యోగంలో ఉండి, మళ్లీ డ్రైవింగ్‌కు వచ్చే వారుంటారు. వారు డ్రైవింగ్ ఆపేసిన తర్వాత స్కిల్స్ తగ్గిపోతాయన్నది శాస్త్రీయంగా నిరూపణ అయింది. ఇలాంటి వారికి ఈ తరహా శిక్షణ అవశ్యమని కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలో సిరిసిల్లలోని ‘టైడ్స్’ ఎంపిక గత ఏడాది మన దేశంలో రోడ్డు ప్రమాదాల రూపంలో లక్షన్నర కంటే ఎక్కువ మంది చనిపోయారు. కొన్నేళ్లుగా ఈ సంఖ్య ఇదే రీతిలో నమోదవుతుండటంతో సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీంతో వాటిని నివారించేందుకు కేంద్రం కొన్ని సూచనలు చేసింది. అందులో భారీ వాహనాలను నడిపే డ్రైవర్లు తరచూ.. ఇటు డ్రైవింగ్, అటు వాహనాల్లో వస్తున్న మార్పులు, ఇతర అంశాలపై అవగాహన పెంచుకోవాల్సి ఉంది. రాష్ట్రంలో ఈ శిక్షణ కోసం సిరిసిల్ల సమీపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ (టీఐడీఎస్)’ను ఎంపిక చేసింది. ఏం జరుగుతోంది? గతంలో ప్రైవేట్ డ్రైవింగ్ స్కూళ్ల నుంచే డ్రైవర్లు శిక్షణ సర్టిఫికెట్ పొందేవారు. చాలా డ్రైవింగ్ స్కూళ్లలో శిక్షణ ఇవ్వకుండానే, రూ.5 వేల వరకు వసూలు చేసి సర్టిఫికెట్ ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం... రూ.20 కోట్ల వ్యయంతో ఆత్యాధునికంగా తీర్చిదిద్దిన సిరిసిల్లలోని టైడ్స్‌ను శిక్షణకు ఎంపిక చేసింది. దీంతో కొందరు ప్రైవేటు డ్రైవింగ్ స్కూళ్ల యజమానులు పైరవీ అధికారులతో కుమ్మక్కయ్యారు. సిరిసిల్లకు వెళ్లి డ్రైవర్లు శిక్షణ తీసుకోవటం కష్టమని, అన్ని ప్రాంతాల్లో డ్రైవింగ్ స్కూళ్లు అందుబాటులో ఉన్నందున వాటిల్లో శిక్షణకు అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దీన్ని అమల్లోకి తెచ్చేందుకు అధికారులు ఉన్నతస్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. లైసెన్సు ఇచ్చేప్పుడు ప్రైవేటు డ్రైవింగ్ స్కూళ్ల నుంచి తెచ్చిన సర్టిఫికెట్లనే పరిగణనలోకి తీసుకున్నప్పుడు, రెన్యువల్‌కు అంగీకరిస్తే ఏంటన్న కోణంలో ఈ ఒత్తిళ్లు నడుస్తున్నట్టు సమాచారం. దీంతో రాష్ట్రంలో వేరువేరు ప్రాంతాల్లో అనుబంధ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న సూచనలు వస్తున్నాయి. అవసరమైతే, ఆర్టీసీ శిక్షణ కేంద్రాల సహకారం తీసుకోవాలని కూడా చెబుతున్నారు. -
ఇక ‘క్యాష్‌లెస్’ చెక్‌పోస్టులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: రవాణాశాఖలో ఇప్పటికే అన్ని రకాల లైసెన్సులను ఆన్లైన్ విధానంలో అందిస్తున్న రవాణాశాఖ.. ఇక సరిహద్దుల్లో కూడా ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అంతర్రాష్ట్ర రవాణా చెక్‌పోస్టులను ఇక క్యాష్‌లెస్‌గా మార్చేందుకు శ్రీకారం చుట్టింది. రవాణాశాఖకు చెందిన అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల్లో యూపీఐ పేమెంట్స్ విధానాన్ని ప్రారంభించింది. తద్వారా చెక్‌పోస్టుల్లో అవినీతిని కట్టడికి ఉపయోగపడుతుందని రవాణాశాఖ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15 రవాణాశాఖ చెక్‌పోస్టుల్లో ఈ విధానం అమల్లోకి వచ్చింది. అన్ని చెక్‌పోస్టుల్లో క్యాష్‌లెస్ విధానం అమలు కావడంతో అవినీతికి అడ్డుకట్ట పడుతుందని రవాణాశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. అన్ని ట్యాక్స్‌లూ ఆన్లైన్లోనే.. వాస్తవానికి రవాణాశాఖ చెక్‌పోస్టుల్లో అవినీతి జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. క్యాష్‌లెస్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయాలని రవాణాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. బోర్డర్ ట్యాక్స్, టెంపరరీ పర్మిట్ ట్యాక్స్, వలంటరీ ట్యాక్స్, కంపౌండింగ్ ఫీజు ఇలా అన్నింటినీ అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కానింగ్ చేయడం ద్వారా చెల్లించే వెసులుబాటు కల్పించారు. అంతేకాకుండా హెచ్‌టీ టీపీఎస్://ఏపీఆర్టీఏసిటిజెన్ డాట్ ఈ ప్రగతి డాట్ ఓఆర్జీ ద్వారా చెల్లించే వెసులుబాటు కల్పించారు. ఆన్లైన్ విధానంతో అవినీతి కట్టడితో పాటు చెక్‌పోస్టుల వద్ద లైన్లలో నిలబడి చెల్లించే బాధ తప్పనుంది. తద్వారా వాహనాలను ఎక్కువ సమయం నిలిపి ఉంచే సమయం కూడా తగ్గడం ద్వారా వాహన రవాణా ప్రయాణ సమయం కూడా తగ్గనుందని రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. రవాణాశాఖ చెక్పోస్టులివే.. రాష్ట్రానికి అటు కర్ణా్ణటక, ఇటు తమిళనాడు, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలకు మధ్య అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను రవాణాశాఖ నిర్వహిస్తోంది. మొత్తం 15 చెక్‌పోస్టులు.. ఇచ్ఛాపురం, జీలుగువిుల్లి, పంచలింగాల, పెనుకొండ, సున్నిపెంట, తిరువూరు, గరికపాడు, పలమనేరు, తడ, బీవీ పాలెం, రేణిగుంట, నరహరిపేట, దాచేపల్లి, మాచర్ల, బెండపూడి ప్రాంతాల్లో రవాణాశాఖ నిర్వహిస్తోంది. సీఎం ఆదేశాలతో చెక్‌పోస్టుల వద్ద క్యాష్‌లెస్ విధానాన్ని ప్రవేశపెట్టాం. ఇక నుంచి చెక్‌పోస్టుల్లో నగదు లావాదేవీలను పూర్తిగా నిలిపివేశాం. అవినీతిరహిత పరిపాలన దిశగా ముఖ్యమంత్రి ఆదేశాలతో ఎటువంటి మధ్యవర్తులకు తావులేకుండా ఈ విధానం తోడ్పడనుంది. ట్రాఫిక్ ఇబ్బందులకు కొత్త విధానంతో చెక్ పడుతుంది. – మనీష్‌కుమార్ సిన్హా, రవాణాశాఖ కమిషనర్ -
ఇక వాహనాల తుక్కు యూనిట్లు
సాక్షి, అమరావతి: కాలం చెల్లిన వాహనాలకు సెలవు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వాహనాల తుక్కు విధానం’ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. అందుకోసం జిల్లాస్థాయిలో ‘వెహికల్ స్క్రాపింగ్ యూనిట్లు’ నెలకొల్పనుంది. దాంతోపాటు ప్రైవేట్ రంగంలోనూ వెహికల్ స్క్రాపింగ్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహించాలని తాజాగా నిర్ణయించింది. అందుకోసం ఔత్సాహిక వ్యాపారులకు అనుమతులు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. కేంద్ర విధానం ప్రకారం 15 ఏళ్ల జీవిత కాలం దాటిన వాణిజ్య వాహనాలు, 20 ఏళ్ల జీవిత కాలం దాటిన వ్యక్తిగత వాహనాలను తుక్కుగా మార్చాల్సి ఉంది. ఈ ఏడాది నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం స్పష్టంగా నిర్దేశించింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగంలో వాహనాల స్క్రాపింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ రిజిస్టర్ అథారిటీగా నిర్ణయించారు. అంటే స్క్రాపింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అనుమతులు మంజూరు చేసే అధికారం రవాణా శాఖ కమిషనర్‌కు అప్పగించారు. ఇక అప్పిలేట్ అథారిటీగా రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వ్యవహరిస్తారు. రవాణా శాఖ కమిషనర్ దరఖాస్తును తిరస్కరిస్తే ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించేందుకు అప్పిలేట్ అథారిటీని సంప్రదించవచ్చు. కాల పరిమితి దాటిన వాహనాలు 2 లక్షలు రాష్ట్రంలో దాదాపు 1.50 కోట్ల వాహనాలు ఉన్నాయి. వాటిలో 1.20 కోట్లు వ్యక్తిగతవి కాగా.. 30 లక్షలు వాణిజ్య వాహనాలు. 15 ఏళ్లు జీవిత కాలం దాటిన వాణిజ్య వాహనాలు, 20 ఏళ్ల జీవిత కాలం దాటిన వ్యక్తిగత వాహనాలు కలిపి దాదాపు 2 లక్షల వాహనాలు ఉంటాయని అంచనా. వాటిని తుక్కుగా మార్చాల్సి ఉందని గుర్తించారు. తరువాత ఏటా జీవిత కాలం ముగిసే వాహనాలను తుక్కు కింద మారుస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ వాహనాల్లోనే దాదాపు 3,500 వాహనాలకు జీవితకాలం ముగిసిందని ఇటీవల నిర్ధారించారు. మొదట ఆ వాహనాలను తుక్కుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం అన్ని శాఖలకు త్వరలోనే ఆదేశాలు జారీ చేయనుంది. జిల్లాకు రెండు యూనిట్లు జిల్లాకు కనీసం రెండు చొప్పున వెహికల్ స్క్రాపింగ్ యూనిట్లు నెలకొల్పాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అందుకు తగిన స్థలం, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులను ప్రోత్సహిస్తారు. వాహనాల ఫిట్నెస్ను పూర్తిగా కంప్యూటర్ ఆధారంగా నిర్ధారించేందుకు ఆటోమేటెడ్ వెహికిల్ చెకింగ్ యూనిట్లను నెలకొల్పాలి. అలా వాహనాల ఫిట్నెస్ను నిర్ధారించి సర్టిఫికెట్లు జారీ చేస్తారు. మరమ్మతులు, రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసేందుకు కూడా పనికిరావు అని నిర్ధారించే వాహనాలను తుక్కు కింద మార్చాల్సి ఉంది. వాటితోపాటు జీవితకాలం పూర్తయిన వాహనాలను కూడా యజమానులు తుక్కు కింద మార్చవచ్చు. తుక్కు కింద ఇచ్చే కార్లు, బస్సులు, లారీలు, ఆటోలకు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు సాŠక్రపింగ్ యూనిట్లు చెల్లిస్తాయి. స్క్రాపింగ్ యూనిట్లు జారీ చేసే సర్టిఫికెట్‌ను సమర్పిస్తే కొత్త వాహనం కొనుగోలుపై వాహనాల కంపెనీలు డిస్కౌంట్లు ఇస్తాయి. ఆ మేరకు వాహన తయారీ కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. స్క్రాపింగ్ యూనిట్లలో వాహనాల తుక్కును ఆ కంపెనీలకు విక్రయిస్తారు. స్క్రాపింగ్ సర్టిఫికెట్ సమర్పిస్తే కొత్త వాహనాల కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం పన్ను రాయితీ ఇస్తుంది. దాంతో కాలం చెల్లిన వాహనాలను తుక్కు కింద మార్చి, కొత్త వాహనాల కొనుగోలుకు ప్రోత్సాహం లభిస్తుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. రోడ్లపై తిరుగుతున్న కాలం చెల్లిన వాహనాలపై రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటారు. ఆ వాహనాల యజమానులపై జరిమానాలు విధిస్తారు. దాంతో కాలుష్య నియంత్రణ సాధ్యమవడంతోపాటు రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని రవాణా శాఖ భావిస్తోంది. -
మోటారు వాహనాల చట్ట సవరణ అమలులోకి.. పెరగనున్న లైఫ్ టాక్స్
సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి వాహనాల ఎక్స్‌షోరూమ్ ధరల మీదనే జీవిత పన్ను విధిస్తారు. ఇంతకాలం వాహనం కొనుగోలుపై షోరూమ్ నిర్వాహకులు ఇచ్చే డిస్కౌంట్ పోను, మిగతా మొత్తం మీద మాత్రమే పన్ను విధించేవారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోటారు వాహనాల చట్ట సవరణ ఇప్పుడు అమలులోకి వచ్చింది. చట్ట సవరణ బిల్లుకు గత నెల చివరలో గవర్నర్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చట్టం అమలుకు వీలుగా ప్రభుత్వం గెజిట్ విడదుల చేసి, అమలు ప్రారంభించింది. మార్చికి ముందు కారుకొన్నా.. ఏప్రిల్‌లో రిజిస్ట్రేషన్ చేస్తే కొత్త విధానమే.. చట్ట సవరణ నేపథ్యంలో అమలుపై రవాణాశాఖ స్పష్టతనిచ్చింది. కారు ఏప్రిల్‌కు ముందు కొన్నా, రిజిస్ట్రేషన్ ఇప్పుడు జరిగితే, కొత్త విధానమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ కొత్త విధానం అమలులోకి రావటానికి ముందు గత నెలలో కార్లు కొన్నవాళ్లు చాలామంది ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే కారు కొన్నందున తమకు కొత్త విధానం వర్తించదన్న ధీమాతో ఉన్నారు. కానీ, కారు ఎప్పుడు కొన్నా.. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కొత్త విధానమే వర్తిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. పెరగనున్న పన్ను.. ధర ఎక్కువ కార్లపైనే ఈ కొత్త విధానం ప్రభావం ఉండనుంది. కారు కొన్నప్పుడు ఎక్స్‌షోరూం ధరపైన షోరూం నిర్వాహకులు డిస్కౌంట్ ఇవ్వటం సహజమే. ధర ఎక్కువగా ఉండే కార్లపై ఈ మొత్తం ఎక్కువగా ఉంటుంది. ఈ డిస్కౌంట్‌ను సాకుగా చూపి చాలామంది కొంతమేర పన్ను ఎగవేస్తున్నారు. ఇప్పుడు దానికి అవకాశం లేదు. రూ.5 లక్షల ధర ఉన్న కార్లపై 13 శాతం, రూ.5 లక్షలు దాటి రూ.10 లక్షల లోపు ఉండే కార్లపై 14 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉండే కార్లపై 17 శాతం, రూ.20 లక్షలకంటే ఎక్కువ ధర ఉండే కార్లపై 18 శాతం చొప్పున జీవిత పన్నును సవరిస్తూ గతేడాది రవాణాశాఖ ఉత్తర్వు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజా సవరణ ప్రకారం.. డిస్కౌంట్ మొత్తం మినహాయించక ముందు ఉండే ఎక్స్‌షోరూం ధరలపై పైన పేర్కొన్న నిర్ధారిత శాతంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తుల పేరు మీద కాకుండా సంస్థలు, కంపెనీల పేరుతో ఉండే కార్లపై అదనంగా రెండు శాతం, రెండో కారు తీసుకునేవారు అదనంగా 2 శాతం చెల్లించాల్సి ఉంటుంది. -
రూ. 232 కోట్లు ఎగ్గొట్టి ‘పరుగులు’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 2,17,930 రవాణా వాహనాలు మూడు నెలలకోసారి చెల్లించాల్సిన త్రైమాసిక పన్ను ఎగ్గొట్టి రహదారులపై యథేచ్ఛగా పరుగులు తీస్తున్నాయి. ఏకంగా రూ. 232 కోట్లను కొన్ని నెలలుగా చెల్లించకుండానే దర్జాగా దూసుకెళ్తున్నాయి. వాటిలో కనిష్టంగా 3 నెలల కాలపరిమితి నుంచి గరిష్టంగా 18 నెలల వరకు పన్ను చెల్లించాల్సిన వాహనాలు వేలల్లోనే ఉన్నాయి. కొన్నిచోట్ల కోవిడ్ కాలం నుంచి కూడా పన్ను చెల్లించని వాహనాలు భారీగానే ఉన్నట్లు అంచనా. హైదరాబాద్‌లోనే అధికం.. త్రైమాసిక పన్ను ఎగ్గొట్టి తిరుగుతున్న 2.17 లక్షల వాహనాల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్‌లోనే లక్షకుపైగా ఉన్నాయి. ఈ క్రమంలో చాలాకాలం తర్వాత అధికారులు కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల రవాణా కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్ పన్ను ఎగవేత వాహనాలపై సమీక్ష నిర్వహించారు. ఒకవైపు లక్ష్యానికి మించిన ఆదాయాన్ని ఆర్జించడంపట్ల ప్రశంసిస్తూనే పన్ను ఎగవేత వాహనాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రేటర్‌లోని మూడు జిల్లాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన రవాణా వాహనాలను తనిఖీ చేయాలని అధికారులకు లక్ష్యాలను నిర్దేశించారు. గ్రేటర్లో ఆటోలు మినహా... సాధారణంగా వ్యక్తిగత వాహనాలకు ఒకసారి జీవితకాల పన్ను చెల్లిస్తే చాలు. కానీ రవాణా వాహనాలకు మాత్రం ప్రతి 3 నెలలకోసారి త్రైమాసిక పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వాహనాల సామర్థ్యం మేరకు దీనిని నిర్ణయిస్తారు. వెయిట్ గ్రాస్ వెహికల్ (డబ్ల్యూజీవీ) ప్రకారం వాహనం బరువుకు అనుగుణంగా త్రైమాసిక పన్ను కనిష్టంగా రూ. 535 నుంచి గరిష్టంగా రూ. 15,000 వరకు ఉంటుంది. గతంలో ఇచ్ఛిన ఎన్నికల హామీ మేరకు జీహెచ్ఎంసీలోని సుమారు 1.4 లక్షల ఆటోలను ఈ త్రైమాసిక పన్ను జాబితా నుంచి ప్రభుత్వం మినహాయించింది. మిగతా అన్ని రకాల రవాణా వాహనాలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ జాబితాలో స్కూల్ బస్సులు, ప్రైవేట్ బస్సులు, లారీలు, క్యాబ్‌ల వంటి వాహనాలు ఉన్నాయి. కోవిడ్ కాలంలో పన్ను చెల్లించని రవాణా వాహనదారులు... కోవిడ్ ఆంక్షలను సడలించాక చాలా వరకు చెల్లించారు. కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆర్టీఏ అధికారులు అప్పట్లో ఉదారంగా వ్యవహరించడం కూడా ఇందుకు కారణమైంది. ఎంవీఐలకు పన్ను వసూలు టార్గెట్లు! ఈ నెలాఖరు నాటికి బకాయిలు వసూలు చేయాల ని రవాణా కమిషనర్ అధికారులను మౌఖికంగా ఆదేశించినట్లు తెలిసింది. అలాగే వారికి టార్గెట్లు విధించారని తెలియవచ్చింది. గతంలో జీహెచ్ఎంసీ పరిధిలోప్రతి ఎంవీఐకి రూ. 6 లక్షల చొప్పున టార్గెట్ విధించగా ప్రస్తుతం దాన్ని రూ. 7 లక్షలకు పెంచారని సమాచారం. ఈ లెక్కన ఆర్టీఏ కార్యాలయాల్లో పౌరసేవలు అందించే ఎంవీఐలు స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా రోజుకు పన్ను చెల్లించని 5 వాహ నాలను జఫ్తు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అ లాగే ఎన్ఫోర్స్మెంట్ విధుల్లో ఉన్నవారు రోజుకు 10 వాహనాలను జఫ్తు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అయితే జఫ్తు చేసిన వాహనాలను నిలిపేందుకు సరైన పార్కింగ్ సదుపాయం లేక ఇబ్బందులకు గురవుతున్నట్లు ఓ ఎంవీఐ పేర్కొన్నారు. స్వచ్ఛందంగా ముందుకొస్తేనే ఊరట... త్రైమాసిక పన్ను పెండింగ్ జాబితాలో ఉన్న వాహన యజమానులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పన్ను చెల్లిస్తే అపరాధ రుసుము ఉండదని అధికారులు చెబుతున్నారు. తనిఖీల్లో పట్టుబడితే మాత్రం 200 శాతం వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. బ్లాంక్ డీడీలతో దళారుల వసూళ్లు స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా సీజ్ చేసిన వాహనాలపై పెనాల్టితో సహా కట్టాల్సిన బకాయిల మొత్తానికి డీడీ తీసుకురావాలని అధికారులు చెబుతుండటంతో దళారులు రంగప్రవేశం చేస్తున్నారు. వారు అప్పటికే వివిధ మొత్తాలతో బ్యాంకుల నుంచి తెచ్చిన ఖాళీ డీడీలు చూపి ఒక్కో డీడీపై ‘సర్విస్ చార్జీ’గా రూ.200 వసూలు చేస్తున్నారు. దీంతో ఆరొందల నుంచి రూ.1200 వరకు ఆ రూపంలో అదనపు భారం పడుతోంది. కళ్లముందే ఈ దందా జరుగుతున్నా రవాణాశాఖ అధికారులు చర్యలు తీసుకోవట్లేదు. -
దూసుకుపోతున్న ఎలక్ట్రిక్ వాహనాలు
సాక్షి, అమరావతి: దేశంలో విద్యుత్ వాహనాలు దూసుకుపోతున్నాయి. ఏటేటా ఈ వాహణాల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలోనూ నాలుగేళ్లుగా వీటి సంఖ్య పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోల్చితే విద్యుత్ వాహనాల ధరలు, ఇంధన వ్యయం తక్కువగా ఉండటంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తుండటంతో గత నాలుగేళ్లలో దేశంలో ఏకంగా 16.85 లక్షలకు ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరిగింది. గత ఏడాది దేశశ్యాప్తంగా 10 లక్షలకు పైగా వాహనాలు అమ్ముడుపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫేమ్ ఇండియా–1, ఫేమ్ ఇండియా–2 అమలు చేస్తోంది. ఫేమ్–ఇండియా–2 కింద ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఇటీవల పార్లమెంట్లో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ప్రోత్సాహక రాయితీని రూ. 10,000 నుంచి రూ. 15,000కు పెంచినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫేమ్ తొలి దశ ఏప్రిల్ 2015 నుంచి 2019 మార్చి నెలాఖరు కొనసాగింది. ఏప్రిల్ 2019 నుంచి ఫేమ్–2 ప్రారంభమైంది. ఇది 2024 వరకు కొనసాగుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్‌ను సృష్టించడంతో పాటు చార్జింగ్ సౌకర్యాలు కల్పనకు, అన్ని రకాల వాహనాలను ప్రోత్సహించడానికి రూ.10 వేల కోట్లు కేటాయించినట్లు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి, అలాగే చార్జర్లు, చార్జింగ్‌పైన జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించినట్లు పేర్కొంది. రాష్ట్రంలో 2022లో భారీగా పెరిగిన ఎలక్ట్రికల్ వాహనాలు రాష్ట్రంలోనూ వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2019లో రాష్ట్రంలో 1,474 ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు జరగ్గా.. 2022 సంవత్సరంలో ఏకంగా 25,721 వాహనాల కొనుగోళ్లు జరిగాయి. ఈ నెలలో 23వ తేదీ వరకు 1,675 వాహనాల కొనుగోళ్లు జరిగాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఎలక్ట్రికల్ వాహనా సంఖ్య 38,026కు చేరింది. రాష్ట్రంలో ఎక్కువగా ద్విచక్ర వాహనాలు, ఆటోల సంఖ్య పెరుగుతోంది. ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయని రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. చార్జింగ్ స్టేషన్లు వస్తే మరింతగా పెరగనున్న వాహనాల సంఖ్య పెట్రోల్, డీజిల్ బంక్‌లు తరహాలో విరివిగా బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ఈ వాహనాల సంఖ్య మరింత పెరుగుతుందని రవాణా శాఖ అదనపు కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను లేకపోవడంతో ఇటీవలి కాలంలో వాటి వినియోగం పెరుగుతోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయని, దీంతో భవిష్యత్‌లో మరింతగా వీటి వినియోగం పెరుగుతుందని ఆయన తెలిపారు. -
ప్రతి కదలిక.. తెలిసిపోతుందిక..
సాక్షి, అమరావతి: అక్రమ రవాణాను అరికట్టడం, రహదారి భద్రత దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని ప్రయాణ, సరుకు రవాణా వాహనాల గమనాన్ని ట్రాకింగ్ చేసే వ్యవస్థను నెలకొల్పనుంది. అందుకోసం అన్ని వాహనాలకు ట్రాకింగ్ పరికరాల ఏర్పాటును తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. వాహనాల ట్రాకింగ్‌ను పర్యవేక్షించేందుకు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)తో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనుంది. రాష్ట్రంలో దాదాపు 1.52 కోట్ల వాహనాలున్నాయి. వాటిలో రవాణాయేతర (వ్యక్తిగత) వాహనాలు 1.35 కోట్ల వరకు ఉంటాయని అంచనా. మిగిలిన దాదాపు 17 లక్షల వాహనాలు వాణిజ్య వాహనాలు. వాటిలో ప్రయాణ వాహనాలు, సరుకు రవాణా వాహనాలు ఉన్నాయి. ఈ 17 లక్షల వాహనాలకు ట్రాకింగ్ పరికరాల ఏర్పాటును ప్రభుత్వం తప్పనిసరి చేయనుంది. కేంద్ర రవాణాశాఖ తాజా మార్గదర్శకాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకుంది. వాహనాలకు ట్రాకింగ్ పరికరాల ఏర్పాటును 2023 ఏప్రిల్ నుంచి దశలవారీగా అమలు చేయాలని రవాణాశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. మొదట ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల బస్సులకు ట్రాకింగ్ పరికరాలు అమరుస్తారు. ట్రాకింగ్ విధానాన్ని పర్యవేక్షిస్తారు. లోటుపాట్లు ఉంటే సరిచేసిన అనంతరం అన్ని ప్రయాణ, సరుకు రవాణా వాహనాలకు ట్రాకింగ్ పరికరాలు ఏర్పాటుచేస్తారు. 2024 జనవరి నాటికి రాష్ట్రంలో అన్ని వాహనాలకు ట్రాకింగ్ పరికరాల ఏర్పాటు పూర్తిచేయాలని రవాణాశాఖ భావిస్తోంది. 24/7 పర్యవేక్షణ ట్రాకింగ్ పరికరాలు ఏర్పాటు చేసిన వాహనాల ట్రాకింగ్‌ను 24/7 పర్యవేక్షించేందుకు రాష్ట్రస్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఐసీతో రవాణాశాఖ త్వరలో ఒప్పందం చేసుకోనుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు రూ.20 కోట్లు వెచ్చించనున్నారు. వాహనాల ట్రాకింగ్‌ను పకడ్బందీగా పర్యవేక్షించేందుకు అవసరమైన ఆధునిక సమాచార సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు అక్కడ విధులు నిర్వర్తించే ఉద్యోగులకు ఎన్ఐసీ శిక్షణ ఇస్తుంది. అక్రమాలు, నేరాలకు అడ్డుకట్ట అక్రమ రవాణాను అరికట్టడం, రహదారి భద్రత కోసమే ట్రాకింగ్ పరికరాల ఏర్పాటును తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రాకింగ్ పరికరం ఏర్పాటుతో వాహనాలు ఏ మార్గంలో ఏ సమయంలో ఎంతవేగంతో ప్రయాణిస్తోంది పర్యవేక్షించవచ్చు. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న వాహనాలను గుర్తించి సంబంధిత ప్రాంతంలోని పోలీసు, రవాణాశాఖ అధికారులను అప్రమత్తం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ విషయమై ఆ వాహనాల యజమానులకు సమాచారం ఇస్తారు. దీంతో యజమానులు తమ డ్రైవర్‌కు ఫోన్‌చేసి వేగాన్ని నియంత్రించమని ఆదేశించేందుకు అవకాశం ఉంటుంది. వాహనాల యజమానులు కూడా తమంతట తాముగా ఆ వాహనాల ట్రాకింగ్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. ఇక అక్రమ రవాణాను సమర్థంగా అరికట్టేందుకు ఈ ట్రాకింగ్ వ్యవస్థ ఉపయోగపడుతుంది. స్మగ్లింగ్, ఇతర దందాల్లో ఉపయోగించే వాహనాలు ఏయే మార్గాల్లో ప్రయాణించిందీ, అక్రమంగా తరలించే సరుకును ఇతర వాహనాల్లోకి మార్చినా ఇట్టే కనిపెట్టవచ్చు. అక్రమ రవాణా దందాకు కేంద్రస్థానం, వాటి గమ్యస్థానాన్ని కూడా గుర్తించవచ్చు. ఇక కిడ్నాప్‌లు, ఇతర నేరాల్లో నేరస్తులు ఉపయోగించే వాహనాల గమనాన్ని గుర్తించి సంబంధిత ప్రాంతంలో పోలీసులను అప్రమత్తం చేయవచ్చు. కేసు విచారణలో ట్రాకింగ్ రికార్డును సాక్ష్యాధారాలుగా సమర్పించవచ్చు. ఇది దోషులకు శిక్షలు విధించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. గుర్తింపు పొందిన డీలర్ల ద్వారానే విక్రయం రాష్ట్రంలో ప్రయాణ, సరుకు రవాణా వాహనాలకు అవసరమైన ట్రాకింగ్ పరికరాల సరఫరాకు రవాణాశాఖ కసరత్తు మొదలు పెట్టింది. వాహన యజమానులు తమ వాహనాలకు ట్రాకింగ్ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలి. గుర్తింపు పొందిన డీలర్ల నుంచే ట్రాకింగ్ పరికరాలు కొనుగోలు చేయాలని స్పష్టం చేయనుంది. తగిన నాణ్యత ప్రమాణాలతో ట్రాకింగ్ పరికరాలను సరఫరాచేసే డీలర్లకు రవాణాశాఖ గుర్తింపునిస్తుంది. ఒక ట్రాకింగ్ పరికరం ధర రూ.4 వేల నుంచి రూ.5 వేలలోపు ఉండేలా చూడాలని భావిస్తోంది. వాహన యజమానులకు పెద్దగా ఆర్థికభారం లేకుండానే ఈ విధానాన్ని సక్రమంగా అమలు చేయాలన్నది రవాణాశాఖ ఉద్దేశం. -
వాహనాల గ్రీన్‌ట్యాక్స్ భారీగా తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు పాత వాహనాలపై కేంద్రం విధించిన హరిత పన్ను (గ్రీన్ ట్యాక్స్)ను రాష్ట్రప్రభుత్వం భారీగా తగ్గించేసింది. వాహనాలు పాతబడేకొద్దీ వాటి నుంచి వెలువడే కాలుష్యం తీవ్రత పెరుగుతుంది. దీంతో పాత వాహనాల వినియోగాన్ని కట్టడి చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ట్యాక్సును విధించిన విషయం తెలిసిందే. 15 సంవత్సరాలు దాటిన భారీ వాహనాలకు గరిష్టంగా రూ.25 వేల వరకు గ్రీన్ ట్యాక్స్ విధిస్తున్నారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నిక సమయంలో లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో మంత్రులు భేటీఅయి, గ్రీన్ ట్యాక్సును ఎత్తేయాలన్న వారి డిమాండ్‌పై చర్చించారు. అత్యంత భారీగా ఉన్న గ్రీన్‌ట్యాక్స్‌ను నామమాత్రపు స్థాయికి తీసుకొస్తామన్నట్టుగా మంత్రులు ఆ భేటీలో హామీ ఇచ్చారు. ఈ మేరకు దాన్ని తగ్గిస్తూ రవాణాశాఖ కొత్త ధరలను అమలులోకి తెచ్చింది. కొత్త ధరలు.. మార్పులు ఇలా.. గతంలో వాహనాల వయసు ఆధారంగా మూడు శ్లాబుల్లో పన్ను విధింపు ఉండేది. ఏడు నుంచి 12 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాహనాలకు ఒక త్రైమాసిక పన్నులో సగం మొత్తాన్ని గ్రీన్ టాక్స్‌గా విధించేవారు. 12–15 ఏళ్ల మధ్య ఉన్న వాహనాలకు ఒక త్రైమాసిక పన్నుతో సమంగా విధించేవారు. 15 ఏళ్లు పైబడ్డ వాహనాలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు విధించేవారు. ఇప్పుడు ఆ మూడు శ్లాబులను రెండుగా మార్చారు. 7 నుంచి 15 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాహనాలకు రూ.1500, 15 ఏళ్ల పైబడి వయసు ఉన్న వాహనాలకు రూ.3 వేలు పన్ను నిర్ధారించారు. రాష్ట్రంలో ఐదున్నర లక్షల వరకు వాణిజ్యపరమైన వాహనాలున్నాయి. వీటిల్లో 70 శాతం వాహనాలు గ్రీన్‌ట్యాక్స్ చెల్లిస్తున్నాయి. ఇప్పుడు ఆ ట్యాక్సును భారీగా తగ్గించడం పట్ల వాటి యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ, వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న పాత వాహనాల విషయంలో నిబంధనలను మరీ సరళతరం చేయటం సరికాదంటూ పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. -
Andhra Pradesh: పన్ను చెల్లింపు సులభతరం
మద్యం అక్రమ తయారీ, నిరోధంపై గట్టి చర్యలు తీసుకోవాలి. నాటుసారా తయారీ వృత్తిగా కొనసాగిస్తున్న వారి జీవితాలను మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను వారికి అందుబాటులోకి తీసుకు రావాలి. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలి. – సీఎం వైఎస్ జగన్ రిజిస్ట్రేషన్ ఆదాయాలపై ఐఏఎస్ అధికారులు కృష్ణబాబు, రజత్ భార్గవ, నీరబ్ కుమార్ ప్రసాద్, గుల్జార్ సభ్యులుగా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలి. రెండు వారాల్లోగా ఈ కమిటీ నివేదిక ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ అవసరమయ్యే సేవలు ఏమిటి? వాటివల్ల ఎలాంటి హక్కులు ఉంటాయి? దాని వల్ల ప్రజలకు ఏమి ఉపయోగం? అనే విషయాలపై అవగాహన కల్పించాలి. రిజిస్ట్రేషన్ చేయించుకునే వారికి సులభతర, పారదర్శక విధానాలను అందుబాటులోకి తీసుకురావాలి. ప్రొఫెషనల్ ఏజెన్సీల సహాయం తీసుకుంటూ నాన్ రిజిస్ట్రేషన్ పరిస్థితులను పూర్తిగా తొలగించాలి. సాక్షి, అమరావతి: పన్ను చెల్లింపుదారులకు సులభతర, పారదర్శక విధానాలను అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పన్నుల్లో ఎక్కడా లీకేజీలు (ఎగవేతలు, ఆదాయాన్ని తక్కువ చేసి చూపడం, తప్పుడు లెక్కలు) లేకుండా చూసుకోవాలని, వాటిని అరికట్టడానికి అవసరమైతే ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ల సహాయం తీసుకోవాలని స్పష్టం చేశారు. మద్యం అక్రమ తయారీ, విక్రయాలపై నిరంతరం నివేదికలు తెప్పించుకోవాలని చెప్పారు. గ్రామాల్లో మహిళా పోలీసుల నుంచి తప్పనిసరిగా ప్రతి రోజూ నివేదికలు తీసుకుంటూ, వాటి ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వాణిజ్య, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, గనులు, అటవీ, రవాణా శాఖల కార్యకలాపాలపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శక, సులభతర విధానాలపై కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. అనుమతులు పొందిన లీజుదారులు మైనింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, వారికేమైనా ఇబ్బందులు ఉంటే తీర్చాలని ఆదేశించారు. రవాణా శాఖలో ఆదాయం పెంపుపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఆదాయాల ప్రగతి ఆశాజనకంగా ఉందని, జీఎస్టీ వసూళ్లు బాగున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం ► ఆస్తుల విలువ మదింపు, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయి? తదితర అంశాలపై హేతుబద్ధత ఉండేలా చూడాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రజలకు సులభతరం చేసేందుకు, అందుకు తగిన చర్యలు తీసుకునేందుకు ప్రొఫెషనల్ ఏజెన్సీల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలి. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో సంపూర్ణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నడిచేందుకు తగిన మార్గదర్శకాలను రూపొందించాలి. భూములు, ఆస్తులే కాకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోతగిన సేవల వివరాలను పోస్టర్ల రూపంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు, గ్రామ, వార్డు సచివాలయాలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ ఫిర్యాదు నంబరు ఉంచాలి. ► మైనింగ్ కోసం ఇప్పటికే అనుమతులు పొందిన వారు, లీజు లైసెన్సులు పొందిన వారు మైనింగ్ ఆపరేషన్ కొనసాగించేలా చూడాలి. దీనివల్ల ఆదాయాలు పెరుగుతాయి. ఆపరేషన్‌లో లేని వాటిపై దృష్టి పెట్టి, లీజుదారులకున్న ఇబ్బందులను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. ► మైనింగ్ ఆపరేషన్ చేయకపోవడానికి కారణం ఏంటి? వారికున్న ఇబ్బందులు ఏంటి? వారికి చేదోడుగా ఎలా నిలవాలి? తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఒక మార్గదర్శక ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రతి నెలా సమగ్ర సమీక్ష జరిపి, ఆదాయాలు వృద్ధి చెందేలా తగిన చర్యలు తీసుకోవాలి. లక్ష్యాలను చేరుకుంటున్నామా? లేదా? అన్న దానిపై నిరంతరం సమీక్ష చేయాలి. ► రవాణా శాఖలో ఆదాయం పెంచుకునేలా చర్యలు తీసుకోవాలి. కేవలం పన్నులు పెంచడమే దీనికి పరిష్కారం కాదు. వినూత్న ఆలోచనలు చేయాలి. పక్క రాష్ట్రాలతో పోలిస్తే.. వాహనాల కొనుగోలుకు రాష్ట్రంలో తగిన సానుకూల పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం నుంచి డీలర్లు డబ్బు తీసుకుని, వాహనాలు ఇవ్వని ఘటనలు వెలుగు చూశాయి. వీటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ► ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (ఎక్సైజ్ శాఖ) కె.నారాయణస్వామి, విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, అటవీ పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, ఎక్సైజ్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ వై మధుసూధన్‌రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, కమర్షియల్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. లక్ష్యం దిశగా ఆదాయం ► ‘గనులు, ఖనిజాల నుంచి గతేడాది సెప్టెంబర్ వరకు రూ.1,174 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది సెప్టెంబర్ వరకు రూ.1,400 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తంగా 19 శాతం పెరుగుదల నమోదైంది. మొత్తం ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 43 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా వేశాం’ అని అధికారులు సీఎంకు తెలిపారు. ‘ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో జీఎస్టీ వసూళ్లు సహా.. ఇతర ఆదాయాలు నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరువలో ఉన్నాయి. పారదర్శక విధానాలు, నిబంధనలు కచ్చితంగా అమలు చేయడం వల్లే ఇది సాధ్యమైంది. 2022 సెప్టెంబర్ వరకు లక్ష్యం రూ.27,445 కోట్లు కాగా, రూ.25,928 కోట్ల ఆదాయం వచ్చింది. 94.47% లక్ష్యం చేరుకున్నాం’ అని చెప్పారు. ► లీకేజీలను అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టంను అభివృద్ధి పరిచామని, హెచ్ఓడీ కార్యాలయంలో డేటా అనలిటిక్స్ సెంటర్ ఏర్పాటు చేసి.. సిబ్బందిని కూడా నియమించామని తెలిపారు. -
ఆర్సీలు, లైసెన్సులు రావట్లే!
సాక్షి, హైదరాబాద్: సుధీర్ నెల క్రితం కొత్త వాహనం కొన్నాడు. రిజిస్ట్రేషన్ పూర్తయింది. కానీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) కార్డు మాత్రం అతనికి అందలేదు. కర్నూలుకు వెళ్తుండగా చెక్‌పోస్టు వద్ద అధికారులు తనిఖీ చేశారు. ఫోన్లో ఉన్న ఆర్సీని చూపాడు. కానీ స్మార్ట్ కార్డు కావాల్సిందేనని పట్టుబట్టిన అధికారులు, రూ.4 వేల ఫైన్ వసూలు చేశారు. కార్డు సిద్ధమైనా బట్వాడా జరగకపోవడమే ఇందుకు కారణం. ఒక్క ఆర్సీ కార్డులే కాదు.. కొత్త డ్రైవింగ్ లైసెన్సులు, రెన్యువల్స్, డూప్లికేట్లు సంబంధిత స్మార్ట్ కార్డులు తెలంగాణ రవాణా శాఖ కార్యాలయాల్లో గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. రోజుకు దాదాపు 15 వేలకు పైగా కార్డులు సిద్ధమవుతాయి. వీటిని స్పీడ్ పోస్టు ద్వారా వినియోగదారులకు పంపాలి. బట్వాడా చేసే బాధ్యత తపాలాశాఖది. కానీ గత రెండు నెలలుగా తపాలాశాఖ ఆ బట్వాడా జరపటం లేదు. దీంతో కార్డులన్నీ కార్యాలయాల్లోనే ఉండిపోతున్నాయి. బట్వాడా ఎందుకు నిలిచింది? ఏ స్మార్ట్ కార్డునైనా ఆ ప్రక్రియ పూర్తయిన వారం రోజుల్లో వాహనదారులకు పంపాలి. స్పీడ్ పోస్టు ద్వారా ఇళ్లకు బట్వాడా చేసినందుకు ప్రతి కార్డుకు రూ.17 చొప్పున పోస్టల్ చార్జీ కింద తపాలా శాఖకు రవాణా శాఖ చెల్లిస్తుంది. అయితే దాదాపు ఏడాది కాలంగా ఈ చెల్లింపులు నిలిచిపోయాయి. ఏకంగా రూ.నాలుగైదు కోట్ల మొత్తాన్ని రవాణా శాఖ బకాయి పడింది. ఆ బకాయిల కోసం అడిగీఅడిగీ విసిగిపోయిన తపాలా శాఖ రెండు నెలల క్రితం బట్వాడా నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రజల దగ్గర రెట్టింపు వసూలు చేస్తున్నా.. వాహనదారులు ఆయా సేవల కోసం రవాణా శాఖలో దరఖాస్తు చేసినప్పుడే, నిర్ధారిత ఫీజుతో పాటు సంబంధిత స్మార్ట్ కార్డు ఇంటికి పంపేందుకు గాను పోస్టల్ చార్జీల కింద రూ.35 చొప్పున వసూలు చేస్తుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తుంది. వాహనదారుల నుంచి రూ.35 వసూలు చేస్తున్నా.. తపాలా శాఖకు మాత్రం రూ.17 మాత్రమే చెల్లిస్తోంది. అంటే జనం నుంచి రెట్టింపు మొత్తం రవాణాశాఖ వసూలు చేస్తోందన్నమాట. అయినా సదరు చార్జీలు తపాలా శాఖకు చెల్లించకుండా బకాయి పడింది. ప్రభుత్వం నుంచి రవాణా శాఖకు నిర్వహణ ఖర్చుల కోసం నిధులు విడుదల కావాల్సి ఉండగా, ఆ మొత్తం అందక పోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. ఆడిట్ అభ్యంతరంతో.. తపాలాశాఖ ‘బుక్ నౌ.. పే లేటర్’అన్న నినాదాన్ని అవలంబిస్తోంది. చార్జీలు ముందుగా చెల్లించకున్నా సేవలు అందిస్తుంది. ఇలా ఏడాదిగా రవాణా శాఖ చెల్లించకున్నా సేవలు కొనసాగించింది. కానీ రెండు నెలల క్రితం అంతర్గత ఆడిట్ విభాగం దీన్ని తప్పుబట్టింది. రవాణా శాఖ దరఖాస్తుదారుల నుంచి చార్జీలు వసూలు చేసి కూడా పోస్టల్‌కు చెల్లించకపోవడం సరికాదని, అలాంటప్పుడు సేవలు ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే తపాలా శాఖ బట్వాడా నిలిపివేసింది. వాహనదారులు కార్డు అందలేదని కార్యాలయాలకు వచ్చి నిలదీస్తే రవాణా శాఖ సిబ్బంది అప్పటికప్పుడు వెతికి ఇస్తున్నారు. మిగతావారు ఎదురుచూపుల్లోనే గడుపుతున్నారు. మొత్తం మీద అన్ని రుసుములు చెల్లించిన తర్వాత కూడా, కార్డుల బట్వాడాలో రవాణా శాఖ వైఫల్యం కారణంగా వాహనదారులు తనిఖీల సమయంలో జరిమానాలు కట్టాల్సి వస్తోంది. -
ఏఎంవీఐ నోటిఫికేషన్ ఉపసంహరణ
సాక్షి,హైదరాబాద్: రవాణాశాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కొలువుల భర్తీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) జూలైలో విడుదల చేసిన నోటిఫికేషన్‌ను శనివారం ఉపసంహరించుకుంది. నోటి ఫికేషన్ వెలువడిన నాటికి అభ్యర్థులకు తప్పకుండా హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలన్న నిబంధనపై నిరుద్యోగుల నుంచి పెద్ద సంఖ్యలో వినతులు వచ్చాయి. అర్హతలపై మరోమారు పరిశీలించాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరడంతో నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ ఉపసంహరించుకుంది. -
ఎలక్ట్రిక్ వాహనాలు రయ్..రయ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరుగుతోంది. ప్రధానంగా ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు, కార్ల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. గత ఏడాది (2021) మార్చి నాటికి రాష్ట్రంలో మొత్తం 20,294 ఎలక్ట్రిక్ వాహనాలుండగా ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఆ సంఖ్య 35,677కు పెరిగింది. అంటే ఏడాదిలోనే 15,383 ఎలక్ట్రిక్ వాహనాలు పెరిగాయి. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు మధ్యనే 12 వేల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. గత ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో 9,762 ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లుండగా.. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఆ సంఖ్య 21,765కు పెరిగింది. అంటే ఏడాదిలోనే 12,003 ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు అమ్ముడయ్యాయి. కార్లూ పెరుగుతున్నాయ్ మరోవైపు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ కార్ల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గత ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో 7,957 ఎలక్ట్రిక్ కార్లుండగా.. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఆ సంఖ్య 8,427కు చేరింది. అలాగే ఏడాది కాలంలో రాష్ట్రంలో ఈ–రిక్షాల సంఖ్య రెట్టింపైంది. గత ఏడాది మార్చి నాటికి ఈ–రిక్షాల సంఖ్య 672 కాగా.. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఆ సంఖ్య 1,322కు పెరిగింది. ఎలక్ట్రిక్ మూడు చక్రాల గూడ్స్ వాహనాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. గత ఏడాది మార్చి నాటికి ఎలక్ట్రిక్ మూడు చక్రాల గూడ్స్ వాహనాలు కేవలం 16 మాత్రమే ఉంటే.. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి 170కు పెరిగాయి. చార్జింగ్ స్టేషన్లు వస్తే మరింత పెరుగుదల పెట్రోల్, డీజిల్ బంకుల తరహాలో బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య మరింత పెరుగుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను లేకపోవడంతో ఇటీవల వాటి వినియోగం పెరుగుతోంది. ఎలక్ట్రిక్ కార్ల వినియోగం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. 2030 నాటికి పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగంలోకి తేవాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. భవిష్యత్‌లో ఈ వాహనాల వినియోగం మరింత పెరుగుతుంది. – ప్రసాదరావు, అదనపు కమిషనర్, రవాణా శాఖ -
ఇక వేగంగా సరకు రవాణా
సాక్షి, అమరావతి: పొడవైన తీర ప్రాంతం కలిగిన రాష్ట్రాన్ని సరకు రవాణాకు (లాజిస్టిక్‌కు) కేంద్ర బిందువుగా మార్చాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన పోర్టులను అనుసంధానిస్తూ నూతన జాతీయ రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన ప్రతిపాదనలు కార్యరూపంలోకి వస్తున్నాయి. ఇప్పటికే విశాఖ, కాకినాడ పోర్టులను అనుసంధానిస్తూ ఆరు రహదారులకు కేంద్రం ఆమోదం తెలపగా, తాజాగా కృష్ణపట్నం పోర్టును అనుసంధానిస్తూ రెండు జాతీయ రహదారులకు ఆమోదం లభించింది. రూ. 2,308.31 కోట్ల అంచనాతో వీటి నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదించింది. తిరుపతి జిల్లా నాయుడుపేట నుంచి తూర్పు కానుపూరు వరకు ఆరు లేన్ల రహదారి నిర్మిస్తారు. తద్వారా కృష్ణపట్నం పోర్టును నాయుడుపేటతో అనుసంధానిస్తారు. మొత్తం 34.88 కి.మీ. ఈ రహదారి నిర్మాణానికి రూ.1,398.84 కోట్లు ఖర్చవుతుంది. ఇది పూర్తిగా గ్రీన్‌ఫీల్డ్ రహదారి. రెండోది ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని చిలకూరు క్రాస్ నుంచి తూర్పు కానుపూరు వరకు నిర్మిస్తారు. ఇది నాలుగు లేన్ల రహదారి. కృష్ణపట్నం పోర్టు దక్షిణ గేటు నుంచి జాతీయ రహదారిని అనుసంధానిస్తూ నిర్మించే ఈ మార్గం గ్రామాల వద్ద ఫ్లై ఓవర్లు, అప్రోచ్ రోడ్లతో సహా మొత్తం 36.05 కి.మీ. ఉంటుంది. రూ.909.47 కోట్లతో దీనిని నిర్మిస్తారు. వీటికి త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టి ఈ ఏడాది చివర్లో పనులు ప్రారంభించాలని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) భావిస్తోంది. 2024 జనవరి నాటికి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 13 రహదారులకు ప్రతిపాదన ఆగ్నేయాసియా దేశాలతో సరకు రవాణాకు విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులను ప్రధాన కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఈ మూడు పోర్టులను జాతీయ రహదారులతో అనుసంధానిస్తూ 277 కిలోమీటర్ల మేర 13 రహదారులను నిర్మించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖకు ప్రతిపాదనలు పంపింది. సీఎం వైఎస్ జగన్ 2019లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై ఈ ప్రతిపాదనలపై చర్చించారు. వాటిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం మూడు పోర్టుల అనుసంధానానికి 8 రహదారులకు ఆమోదం తెలిపింది. పారిశ్రామికాభివృద్ధికి ఊతం ఈ రెండు రహదారులతో కృష్ణపట్నం పోర్టు నుంచి వాహనాలు చెన్నై – కోల్‌కతా జాతీయ రహదారికి సులువుగా చేరుకోవచ్చు. దాంతో పోర్టు నుంచి ఎగుమతులు, దిగుమతులు మరింత వేగం పుంజుకుంటాయి. ప్రధానంగా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కూడిన గ్రేటర్ రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి ఇవి దోహదం చేస్తాయి. ఇప్పటికే ఎస్పీఆర్ఎస్ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని ఎస్ఈజెడ్లలో తయారీ పరిశ్రమలు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో పారిశ్రామిక క్లస్టర్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ పరిశ్రమల నుంచి సరకు రవాణాకు ఈ రహదారులు మరింతగా తోడ్పడతాయి. మరోవైపు కృష్ణపట్నం పోర్టు ద్వారా తూర్పు కర్ణాటక ప్రాంతానికి సరకు రవాణా మరింతగా పెరుగుతుంది. దాంతో రాయలసీమ లాజిస్టిక్ కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. -
ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న 896 మంది ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలకు సంబంధించి విధివిధానాలను ఖరారు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్టీసీ, జిల్లా కలెక్టర్ల పూల్ కింద కారుణ్య నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ముందు సర్వీసులో ఉండగా.. 896 మంది ఉద్యోగులు మరణించారు. 2016 నుంచీ సర్వీసులో ఉండి.. మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2020 జనవరి 1 నుంచి ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైంది. విలీనమైన తరువాత సర్వీసులో ఉండి మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులకు కారుణ్య నియామకాలు కూడా చేపట్టింది. కాగా అంతకుముందు 2016 నుంచి పెండింగ్‌లో ఉన్న 896 కారుణ్య నియామకాలు కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్టీసీ, కలెక్టర్ పూల్‌కింద ఉన్న ఉద్యోగాల్లో నియమించేందుకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి. ► పెండింగ్‌లో ఉన్న 896 మంది కారుణ్య నియామకాల జాబితాను ఆర్టీసీ ఎండీ సంబంధిత జిల్లా కలెక్టర్లకు పంపుతారు. ► వారిలో అర్హులను గుర్తించి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కలెక్టర్లు నియమిస్తారు. మిగిలిన అభ్యర్థుల జాబితాను ఆర్టీసీ ఎండీకి పంపిస్తారు. ► అలా మిగిలిన వారి జాబితాలోని అర్హతలను బట్టి ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లుగా నియమిస్తారు. అప్పటికి ఇంకా మిగిలి ఉంటే ఆ జాబితాను తిరిగి సంబంధిత జిల్లా కలెక్టర్లకు పంపుతారు. ► ఆర్టీసీ ఎండీ నుంచి వచ్చిన జాబితాలో ఉన్నవారికి కలెక్టర్లు ఆయా జిల్లాల్లో ప్రభుత్వ విభాగాల్లో ఉన్న ఖాళీలలో భర్తీ చేస్తారు. సీఎం గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఆర్టీసీలో 2016 నుంచి పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధిత కుటుంబాల్లో వెలుగులు నింపుతూ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులకు గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్టీసీ, ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించడం గొప్ప విషయం. – చెంగయ్య, అధ్యక్షుడు, ఆర్టీసీ వైఎస్సార్ ఎంప్లాయీస్ యూనియన్ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలపై సానుకూల నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. ప్రభుత్వంలో విలీనానికి ముందు సర్వీసులో ఉండి మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల పట్ల సానుకూల దృక్పథంతో మంచి నిర్ణయం తీసుకున్నారు. – పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు, ఎన్ఎంయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు -
రవాణాశాఖ వింత వ్యవహారం .. కామ్‌గా కట్టించేస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: బస్సు చార్జీలు పెంచినప్పుడు ఆర్టీసీ అధికారులు బహిరంగంగానే వెల్లడించారు.. కరెంటు చార్జీలు పెరిగితే అధికారులు ముందే చెప్పారు.. కానీ వాహనాలకు సంబంధించి జీవిత కాల పన్ను, హరిత పన్నులు పెంచిన రవాణా శాఖ ఒక్కమాట కూడా బహిరంగంగా చెప్పలేదు. ఏయే చార్జీలు ఏ మేరకు, ఎప్పటి నుంచి పెరుగుతున్నాయన్నది అధికారులెవరూ చెప్పలేదు. కానీ పన్ను చెల్లించే సమయంలో భారీ చార్జీలు చూసి జనం నోరెళ్లబెట్టాల్సి వస్తోంది. రూ.12 లక్షల విలువైన వాహ నాన్ని కొంటే.. వారం కిందటి వరకు రూ.1,68,000 (14 శాతం) జీవితకాల పన్ను (లైఫ్ ట్యాక్స్) చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడది రూ.2,04,000కు (17శాతానికి) పెరిగింది. ఇంత ప్రభావం చూపే మార్పు జరిగితే ఎక్కడా రవాణా శాఖ నుంచి జనానికి తెలియజేసే అధికారిక ప్రకటన వెలువడలేదు. గత ఆర్థిక సంవత్సరం జీవితకాల పన్ను రూపంలో రూ.2,900 కోట్ల ఆదాయాన్ని పొందింది. తాజా ఉత్తర్వులతో అదనంగా మరో రూ.1,400 కోట్లమేర ఆదాయం లభిస్తుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫిట్నెస్ పంచాయితీ.. రవాణా వాహనాలు ఏడాదికోసారి తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్ష చేయించి సర్టిఫికెట్ పొందాలి. ఇలా ఫిట్నెస్ పరీక్షలు చేయించకుండా తిరిగే ట్రాన్స్‌పోర్టు వాహనాలకు రోజుకు రూ.50 చొప్పున పెనాల్టీ విధించాలి. కేంద్రం ఈ సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి దీన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర రవాణా శాఖ మాత్రం ఎన్ని సంవత్సరాల నుంచి ఫిట్నెస్ చేయించటం ఆపేశారో.. అప్పటి నుంచీ లెక్కగట్టి పెనాల్టీలు వసూలు చేస్తోంది. ► హైదరాబాద్‌కు చెందిన అష్రాఫ్ అనే ఆటోడ్రైవర్ ఏడేళ్లుగా ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా ఆటో నడుపుతున్నాడు. కొత్త నిర్ణయం రావటంతో పెనాల్టీలు కట్టే బాధ ఉండొద్దని ఫిట్నెస్ పరీక్ష కోసం వెళ్లాడు. ఏడేళ్ల నుంచి రోజుకు రూ.50 చొప్పున పెనాల్టీ కలిపి మొత్తంగా రూ.1.13 లక్షలు కట్టాలని అధికారులు చెప్పారు. దీనితో బెంబేలెత్తిన అష్రాఫ్ ఆటోను తీసుకెళ్లి ఇంట్లో పెట్టేశాడు. ఆటో నడిపితేనే రోజు గడిచే ఆయన.. ఇప్పుడు దానిని బయటికి తీయట్లేదు. ఇలా 75వేల ఆటోలు పాత బకాయిల పేరిట భారీ పెనాల్టీ చెల్లించాల్సిన పరిస్థితి ఉందని.. దీనితో దాదాపు 40వేల మంది డ్రైవర్లు ఆటోలను బయటికి తీయడం మానేశారని యూనియన్ నేతలు చెప్తున్నారు. ఇదే తరహాలో దాదాపు 4 వేల టాటా ఏస్ మినీ ట్రక్లు, మరో 2 వేల వరకు డీసీఎం వాహనాలు, చిన్న లారీలు ఇలాగే మూలకు చేరాయని అంటున్నారు. ఆటో అమ్ముకోలేక, కొత్తది కొనలేక ఇబ్బందిపడుతున్నారు. ఫీజులు పెంచిన తర్వాత నాలుగు రోజుల క్రితం ఓ లారీకి వచ్చిన పన్ను మొత్తం రూ.13,920 కాలుష్యం పేరిట... వాహనాలు పాతబడే కొద్దీ కాలుష్యం పెరుగుతుందన్న ఉద్దేశంతో వాటి వాడకాన్ని తగ్గించడానికి హరితపన్ను (గ్రీన్ ట్యాక్స్) విధిస్తున్నారు. రవాణాశాఖ ఇటీవలే హరితపన్నును పెంచింది. దీనినీ మూడు శ్లాబులు చేసింది. ఈ విషయాన్నీ బయటికి వెల్లడించలేదు. ఏ శ్లాబుకు ఎంత పన్ను చెల్లించాలో వాహన యజమానులకు తెలియదు. రవాణాశాఖ కార్యాలయంలో వివరాలన్నీ నమోదుచేశాక వచ్చే పన్నుమొత్తం చూసి బెంబేలెత్తుతున్న పరిస్థితి ఉంది. ► పాత రేట్ల ప్రకారం ఓ లారీకి గ్రీన్‌టాక్స్ రూ.238 మాత్రమే ఉండేది. అదనంగా ప్రభుత్వ ఫీజు చెల్లించాల్సి వచ్చేది. ► గతంలో ద్విచక్ర వాహనానికి గ్రీన్‌ట్యాక్స్ రూ.285, ప్రభుత్వ ఫీజు రూ.735 ఉండగా.. ఫీజులు పెంచాక గ్రీన్‌ట్యాక్స్ రూ.2,035, ప్రభుత్వ ఫీజు రూ.1,400గా మారింది. ► కార్లకు సంబంధించి గ్రీన్‌ట్యాక్స్ రూ.535, ప్రభుత్వ ఫీజు రూ.1,200 ఉండేది. ఇప్పుడు ట్యాక్స్ రూ.5035, ఫీజు రూ.1,500 అయింది. ఆదాయం కోసం దొడ్డిదారిన పన్ను పెంచారు గ్రీన్‌ట్యాక్స్ పెంచినంత మాత్రాన వాతావరణంలో కాలుష్యం తగ్గుతుందా..? ఇదేం విడ్డూరం. కాలుష్యం వెదజల్లుతున్న వాహనాలను సీజ్ చేయండి, లేదా మరమ్మతు చేయించుకునేలా చేయండి. అలాకాకుండా పన్ను చెల్లించి పొగవదిలితే ఉపయోగం ఉంటుందా? కేవలం ఆదాయం పెంచుకునేందుకు ఇలా దొడ్డిదారిన గ్రీన్‌ట్యాక్స్ పెంచారు. – మంచిరెడ్డి రాజేందర్‌రెడ్డి, తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు 40వేలకుపైగా రవాణా వాహనాలు నిలిచిపోయాయి ఏళ్లపాటు ఫిట్నెస్ పెనాల్టీ లెక్కగట్టి బెదిరిపోయేలా చేశారు. దాదాపు 40 వేలకుపైగా రవాణా వాహనాలు రోడ్డెక్కకుండా చేసిన ఈ పెనాల్టీ విధానాన్ని ఉపసంహరించుకోవాలి. ఆరు నెలల గడువిస్తే అన్ని వాహనాలకు ఫిట్నెస్ చేయించేసుకుంటారు. అలాగాకుండా ఆదాయం కోసం దీన్ని ఆయుధంగా వాడటం సరికాదు – ఎ.సత్తిరెడ్డి, తెలంగాణ ఆటో డ్రైవర్ల సమాఖ్య ప్రధాన కార్యదర్శి -
‘ఫ్లాట్‌ఫుట్’తో దక్కని కొలువు
సాక్షి, అమరావతి: చదునైన పాదం (ఫ్లాట్ ఫుట్) ఉంటే అదృష్టం అంటారు. కానీ, ఓ యువకుడికి అది దురదృష్టంగా మారింది. ప్రభుత్వోద్యోగాన్ని దూరం చేసింది. చివరకు ఆ యువకుడు రెండేళ్ల పాటు న్యాయపోరాటం చేసినా ఫలితం దక్కలేదు. ఫ్లాట్ ఫుట్ ఉన్న వ్యక్తులు అసిస్టెంట్ మోటారు వెహికల్స్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ)గా నియమితులు కావడానికి అనర్హులని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రభుత్వం ఇచ్చిన జీఓలను, నోటిఫికేషన్‌ను హైకోర్టు సమర్థించింది. వీటిని అతను సవాల్‌చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఇదీ వివాదం.. రవాణా శాఖలో ఏఎంవీఐ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ 2018లో నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో వైఎస్సార్ కడప జిల్లా, రాయచోటి మండలానికి చెందిన నల్లమల నాగేశ్వరయ్య దరఖాస్తు చేసుకున్నారు. 2019లో నిర్వహించిన పరీక్షల్లో నాగేశ్వరయ్యకు 300 మార్కులకు గాను 194.26 మార్కులు వచ్చాయి. మెరిట్ జాబితాలో అతనిది రెండో స్థానం. అనంతరం మెడికల్ టెస్ట్ నిర్వహించగా ఫలితాల్లో అతని పేరులేదు. కుడిపాదం చదునుగా ఉండటంతో అతన్ని ఎంపిక చేయలేదు. దీంతో నాగేశ్వరయ్య నోటిఫికేషన్‌తో పాటు ఇందుకు సంబంధించిన జీఓలను సవాలు చేస్తూ 2020లో హైకోర్టును ఆశ్రయించారు. ఇవన్నీ కూడా ఏపీ రవాణా సబార్డినేట్ సర్వీస్ రూల్స్‌కు, దివ్యాంగుల చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సీజే ధర్మాసనం ఇటీవల విచారించింది. వైకల్యం కారణంగా వివక్ష చూపడానికి వీల్లేదని నాగేశ్వరయ్య తరఫు న్యాయవాది వాదించారు. ఫ్లాట్‌ఫుట్ ఆ పోస్టుకు అనర్హతే.. దివ్యాంగుల చట్టం ప్రకారం ఫ్లాట్‌ఫుట్ వైకల్యం కాదని, అందువల్ల నాగేశ్వరయ్య ఆ చట్టం కింద రిజర్వేషన్ కోరలేరని ప్రభుత్వ, ఏపీపీఎస్సీ న్యాయవాదులు వాదించారు. ప్రభుత్వ సర్వీసు రూల్స్ ప్రకారం ఏఎంవీఐ పోస్టుకు ఫ్లాట్‌ఫుట్ ఉన్న వ్యక్తి అనర్హుడని, అందువల్ల అతన్ని ఎంపిక చేయలేదన్నారు. ఏఎంవీఐ, మెటారు వాహనాల ఇన్స్పెక్టర్ (పదోన్నతి ద్వారా), అసిస్టెంట్ మోటారు వాహనాల ఇన్స్పెక్టర్ (పదోన్నతి, ప్రత్యక్ష భర్తీ), ట్రాన్స్పోర్ట్ హెడ్ కానిస్టేబుల్ (పదోన్నతి), ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ (ప్రత్యక్ష భర్తీ) పోస్టులకు దివ్యాంగుల రిజర్వేషన్‌ను మినహాయిస్తూ ప్రభుత్వం 2021లో జీఓ కూడా ఇచ్చిందని కోర్టుకు నివేదించారు. ఈ పోస్టులన్నింటికీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరన్నారు. అందువల్ల ఈ పోస్టుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ కల్పించడం లేదన్నారు. వీటన్నింటి దృష్ట్యా పిటిషనర్ ఏఎంవీఐగా నియామకం కోరజాలరని వారు కోర్టుకు విన్నవించారు. రిజర్వేషన్‌ను మినహాయించొచ్చు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వ, ఏపీపీఎస్సీ న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ తీర్పు వెలువరించింది. ఉద్యోగ స్వభావాన్ని బట్టి రిజర్వేషన్‌ను మినహాయించే అధికారం ప్రభుత్వానికి ఉందని, ఇదే విషయాన్ని దివ్యాంగుల చట్టం చెబుతోందని ధర్మాసనం పేర్కొంది. అంతేకాక.. ‘ఫ్లాట్ ఫుట్ కలిగి ఉన్న వ్యక్తి ఏఎంవీఐగా అనర్హుడని తేల్చడం చట్ట విరుద్ధమన్న పిటిషనర్ వాదన అర్ధరహితం. ఫ్లాట్‌ఫుట్ అనేది అంగవైకల్యం కానప్పటికీ, ఏఎంవీఐగా విధులు నిర్వర్తించేందుకు అది అడ్డంకి అవుతుంది. అది ఉన్న వ్యక్తికి నడిచేందుకు, పరిగెత్తేందుకు సరైన పట్టు ఉండదు. ఇది విధి నిర్వహణలో అతనికి ఇబ్బందవుతుంది. కాబట్టి పిటిషనర్, ఆ నిబంధనలను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరలేరు’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. -
‘ఉచిత విద్యుత్’పై కేంద్రం కుట్ర
సూర్యాపేట రూరల్: తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర సంస్థలు రుణాలు నిలిపివేయడంపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాపై కేంద్రం కుట్ర చేస్తోందన్నారు. గురువారం సూర్యాపేటలో రవాణా శాఖ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరాకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 17 వేల మెగా వాట్లకుపైగా విద్యుత్ డిమాండ్ వచ్చినా సరఫరాకు సిద్ధంగా ఉన్నామన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో ముందు వరుసలో ఉన్న తెలంగాణను ప్రోత్సహించాల్సిన కేంద్రం, వివక్ష చూపెడుతోందని దుయ్యబట్టారు. విద్యుత్‌కు అధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో.. ఇతర సంస్థలు తెలంగాణకు విద్యుత్ విక్రయించవద్దంటూ కేంద్రం బెదిరిస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ ఉన్నంత వరకు తెలంగాణ రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ చార్జీల పాపం కేంద్రానిదేనని అన్నారు. బొగ్గు దిగుమతుల ధరలు, పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో పాటు, కేంద్రం అడ్డగోలుగా పన్నులు విధించడం వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు పెంచాల్సి వచ్చిందని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ వెంకట్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ జీడి భిక్షం తదితరులు పాల్గొన్నారు. -
కొత్త చరిత్రకు 'దారులు'
ఆంధ్రప్రదేశ్ రహదారుల చరిత్రలో ఓ చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమయ్యింది. రూ.21,559 కోట్లతో 51 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒకే రోజు జరిగాయి. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమాలలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ. 3 లక్షల కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తామని గడ్కరీ ప్రకటించడమే కాదు దేశంలో నిర్మించనున్న 32 గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలలో ఆరు ఏపీకే మూంజూరు చేశామని వెల్లడించారు. ఏపీ త్వరితగతిన అభివృద్ధి చెందుతోందని, గ్రీన్ ఎనర్జీ గ్రోత్ సెంటర్‌గా అడుగులు వేస్తున్న రాష్ట్రానికి అన్ని విధాలా కేంద్ర సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్రాల మధ్య ఒప్పందం చేసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో కలిసి వచ్చి బెంజి సర్కిల్ రెండో ఫై్లఓవర్ను ప్రారంభించారు. అక్కడి నుంచి తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లారు. తన గౌరవార్థం సీఎం ఇచ్చిన విందును స్వీకరించారు. రాష్ట్రంలో రహదారి ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి విషయాల గురించి అక్కడ ఆయన రివ్యూ నిర్వహించారు. సీఎం జగన్ ప్రతిపాదనలన్నిటినీ ఆమోదిస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రూ.3 లక్షల కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో నిర్మించనున్న 32 గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలలో ఆరు ఏపీకే మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలో పోర్టులు, రోడ్లు, రైలు కనెక్టివిటీ అభివృద్ధి పరచడం ద్వారా పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన లక్ష్యాలను సాధిస్తామన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రూ.21,559 కోట్లతో 51 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఏకకాలంలో నిర్వహించడం ఆంధ్రప్రదేశ్‌లో చరిత్రాత్మక ఘట్టం అని అభివర్ణించారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తామన్నారు. ఇందులో భాగంగా విద్యుత్, నీరు, రవాణా, కమ్యూనికేషన్ రంగాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తామన్నారు. తాను మహారాష్ట్ర మంత్రిగా ఉన్న రోజుల్లో అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి సూచనల మేరకు రూపొందించిన ‘ప్రధాన మంత్రి గ్రామీణ్ సడక్ యోజన’ పథకంతో దేశంలో రూ.1.10 లక్షల కోట్ల జీడీపీ పెరిగిందని చెప్పారు. దేశ అభివృద్ధిలో మౌలిక వసతుల కల్పన ఎంతటి కీలకమనడానికి ఈ పథకమే తార్కాణమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పోర్టుల ఆధారంగా ఎగుమతులను ప్రోత్సహించడంపై దృష్టి సారించాలని సూచించారు. దిగుమతులు తగ్గించి ఎగుమతులు పెంపొందించడం ద్వారానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించగలమన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే అగ్రగామిగా చేయడంలో ఆంధ్రప్రదేశ్ పాత్ర అత్యంత కీలకమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి ఏ రాష్ట్రం పట్లా వివక్ష లేదన్నారు. దేశం అంటే అందరిదీ అని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. తమ మంత్రిత్వ శాఖకు ఏనాడూ నిధుల కొరత లేదన్నారు. గడ్కరీ ఇంకా ఏమన్నారంటే.. ఏపీకి ఆరు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలు ► దేశంలో నిర్మిస్తోన్న 32 గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలలో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి ఆరు ఉన్నాయి. విశాఖపట్నం–రాయ్‌పూర్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే సరుకు రవాణాలో అత్యంత ముఖ్యమైనది. ఛత్తీస్గడ్, ఒడిశా, ఏపీలను కలుపుతూ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను 465 కి.మీ మేర రూ.16,102 కోట్లతో నిర్మిస్తున్నాం. 2024 చివరి నాటికి పూర్తి చేస్తాం. ► నాగ్‌పూర్ నుంచి విజయవాడ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణంలో ఉంది. నా నియోజకవర్గం నాగ్‌పూర్ నుంచి మొదలవుతోంది కాబట్టి ఈ రహదారిపై నాకు ప్రత్యేక ఆసక్తి ఉంది. రూ.15 వేల కోట్లతో 405 కి.మీ మేర నిర్మిస్తున్న ఈ హైవేను 2025 నాటికి పూర్తి చేస్తాం. ► చిత్తూరు నుంచి తమిళనాడులోని తాచ్చూర్ వరకు 116 కి.మీ ఎక్స్‌ప్రెస్ హైవేను రూ.5 వేల కోట్లతో నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టును 2024లో పూర్తి చేస్తాం. ► రూ.6 వేల కోట్లతో నిర్మిస్తున్న హైదరాబాద్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ హైవేను 2025 నాటికి పూర్తి చేస్తాం. ► బెంగళూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవేను 262 కి.మీ మేర రూ.17 వేల కోట్లతో నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏపీ పరిధిలో రూ.5 వేల కోట్ల మేరకు రహదారి నిర్మిస్తాం. తద్వారా ఏపీకి తమిళనాడు, కర్ణాటకలతో మరింత మెరుగైన అనుసంధానం సాధ్యమవుతుంది. ► కర్నూలు–సోలాపూర్ ఎక్స్‌ప్రెస్ హైవేను 318 కిలోమీటర్ల మేర రూ.420 కోట్లతో నిర్మిస్తాం. 2025 మార్చి నాటికి పూర్తి అవుతుంది. సరుకు రవాణా వ్యయం తగ్గించాలి ► దేశంలో సరుకు రవాణా వ్యయాన్ని బాగా తగ్గించాలి. వస్తువు ధరలో సరుకు రవాణా వ్యయం చైనాలో 8 శాతం నుంచి 10 శాతం, అమెరికా, యూరోపియన్ దేశాల్లో 12 శాతం ఉండగా, మన దేశంలో 16 శాతం నుంచి 18 శాతం వరకు ఉంది. ► దాంతో మన దేశంలో వస్తువుల ధరలు అధికంగా ఉంటుండటంతో ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. అందుకే దేశంలో సరుకు రవాణా వ్యయాన్ని 8 శాతానికి తగ్గించాలని మా మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. వీలైతే ఆరు శాతానికి కూడా తగ్గించేందుకు యత్నిస్తాం. ► దేశంలో యాక్సిస్ కంట్రోల్ ఎక్స్‌ప్రెస్ హైవేలతో ఇంధన వ్యయం తగ్గుతుంది. ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణం పూర్తి అయితే రహదారులపై వాహనాల వేగ పరిమితి పెంచుతాం. బయో డీజిల్, గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలి ► దేశంలో బయో డీజిల్, గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలి. డీజిల్ ట్రక్కుల స్థానంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు ప్రారంభించాలని నిర్ణయించాం. డీజిల్ స్థానంలో ఎల్ఎన్జీని ప్రోత్సహించాలి. డీజిల్ రూ.100 వ్యయం అయితే ఎల్ఎన్జీ రూ.40కు, సీఎన్జీ రూ.60కు వస్తోంది. ► గ్రీన్ హైడ్రోజన్ వినియోగంపై కసరత్తు చేస్తున్నాం. మురుగు నీటి నుంచి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశీలించాలి. నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ మురుగు నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం మహారాష్ట్ర ప్రభుత్వానికి విక్రయం ద్వారా ఏటా రూ.325 కోట్లు ఆదాయం ఆర్జిస్తోంది. ► రూఫ్‌టాప్ సోలార్, విండ్ మిల్లులతో విద్యుత్ వ్యయం చాలా తగ్గుతుంది. ఎలక్ట్రోలైజర్లను గ్రీన్ హైడ్రోజన్‌గా పరిగణించవచ్చు. బియ్యం, చెరకు రసం, మోలాసిస్ నుంచి ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించాలి. వ్యవసాయ రంగాన్ని ఇంధన, విద్యుత్ రంగాల దిశగా మళ్లించాలి. పెట్రోల్, డీజిల్ రెండింటితోనూ పనిచేసే ఫ్లెక్స్ ఇంజిన్ వాహనాలను ప్రోత్సహించాలి. గ్రీన్ ఎనర్జీ గ్రోత్ సెంటర్‌గా ఏపీ ► దేశానికి ఉపయోగపడేలా తక్కువ వ్యయం, కాలుష్య రహిత దేశీయ ఇంధనంగా ఇథనాల్, గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలి. మిగులు బియ్యం నిల్వలు ఉన్న ఆంధ్రప్రదేశ్ అందుకు గ్రోత్ సెంటర్‌గా మారాలి. బయో ఇంధనం, గ్రీన్ ఇంధనం దేశానికి తక్షణ అవసరం. ► ప్రజా రవాణా వ్యవస్థలో విద్యుత్తు వాహనాలను ప్రోత్సహిస్తున్నాం. రోప్‌వే, కేబుల్ వే వంటివి హిమాచల్‌ప్రదేశ్‌లో 16 ప్రాజెక్టులు, ఉత్తరాఖండ్‌లో 15 ప్రాజెక్టులు ఇచ్చాం. ఆంధ్ర ప్రదేశ్‌లో ఏమైనా ఈ తరహా ప్రాజెక్టులు ప్రతిపాదిస్తే ఆమోదిస్తాం. బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్–2 ప్రారంభం సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ బెంజ్ సర్కిల్ రెండో ఫ్లైఓవర్‌ను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి గురువారం జాతికి అంకితం చేశారు. సాయంత్రం 3.40 గంటలకు వారు బెంజ్‌సర్కిల్ రెండో ఫ్లైఓవర్ వద్దకు వచ్చారు. ఈ ఫ్లైఓవర్‌పై శిలాఫలకాన్ని ఆవిష్కరించి, ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు. కాగా, బెంజ్ సర్కిల్‌కు తూర్పు వైపున ఇదివరకే మొదటి ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ఇప్పుడు పడమర వైపున రెండో ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేశారు. ఈ వంతెనను జ్యోతిమహల్ జంక్షన్ నుంచి రమేష్ హాస్పిటల్ జంక్షన్ వరకు 2.47 కిలోమీటర్ల మేర మూడు వరసల్లో ఏడాదిలోనే (గడువుకు ఆరు నెలల ముందే) నిర్మించారు. ఇందుకోసం రూ.96 కోట్లు వెచ్చించారు. గడువుకు ముందే ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు ప్రభుత్వాన్ని, నిర్మాణ సంస్థను కేంద్ర మంత్రి గడ్కరీ అభినందించారు. దుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రులు ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను గురువారం కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డిలు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, శంకరనారాయణలు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. అనంతరం కేంద్ర మంత్రులు మహా గణపతి ప్రాంగణం వద్ద మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ప్రతిపాదనలను ఆమోదిస్తున్నామని చెప్పారు. కొన్ని పనులకు ఇప్పటికే కేంద్రం అనుమతులు ఇచ్చిందని, ఆయా పనులకు అంచనాలు తయారు చేస్తున్నారన్నారు. మరికొన్ని పనులు త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఎయిర్పోర్ట్లన్నింటికీ రోడ్లను అనుసంధానం చేసేందుకు కేంద్రం కృషి చేస్తుందన్నారు. విశాఖపట్నంకు కోస్టల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందని తెలిపారు. ముంబైలో నిర్మిస్తున్న కోస్టల్ కారిడార్‌ను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాక, వైజాగ్ కారిడార్‌కు ప్రణాళికలను సిద్ధం చేస్తామన్నారు. అంతకు ముందు వారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, కేశినేని నాని, దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ ఈవో భ్రమరాంబ, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో దుర్గగుడి ఘాట్‌రోడ్డు పై నుంచి కనకదుర్గ ఫ్లై ఓవర్‌ను కేంద్ర మంత్రులు పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రులు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. దేశ వ్యాప్తంగా కేంద్రం చేపడుతున్న పలు అభివృద్ధి అంశాలను పార్టీ శ్రేణులకు వివరించారు. పలువురు పార్టీ కార్యకర్తలు గడ్కరీకి వినతిపత్రాలు అందజేశారు. అనంతరం ఆయన్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు సుజనా చౌదరి, జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్, ఎమ్మెల్సీలు మాధవ్, వాకాటి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రేపు రాష్ట్రంలో కేంద్రమంత్రి గడ్కరీ పర్యటన
సాక్షి, అమరావతి: కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ రేపు (గురువారం) రాష్ట్రంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కేంద్రమంత్రి గడ్కరీ గురువారం ఉదయం 11.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని నేరుగా విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియానికి వస్తారు. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ రాష్ట్రంలో రూ.11,157 కోట్లతో నిర్మించిన 20 రహదారులు, ఇతర ప్రాజెక్టులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి ప్రారంభిస్తారు. రూ.10,401 కోట్లతో నిర్మించనున్న 31 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు భూమిపూజ చేస్తారు. ఈ సందర్భంగా స్టేడియంలో నిర్వహించే బహిరంగసభలో కేంద్రమంత్రి గడ్కరీ, సీఎం వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. అనంతరం బెంజ్ సరిŠక్ల్కు చేరుకుని కొత్తగా నిర్మించిన పశ్చిమదిశ ఫ్లై ఓవర్‌ను ప్రారంభిస్తారు. అనంతరం కేంద్రమంత్రి సీఎం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుని రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. కేంద్రమంత్రి గౌరవార్థం ముఖ్యమంత్రి విందు సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కేంద్రమంత్రి గడ్కరీ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. అనంతరం విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. సాయంత్రం 5.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని నాగ్‌పూర్‌కు ప్రయాణమవుతారు. కేంద్రమంత్రి పర్యటన, బహిరంగసభ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. -
AP: రాష్ట్రంలో రహదారులకు మహర్దశ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రహదారులు శరవేగంతో అభివృద్ధి చెందనున్నాయి. మొత్తం రూ.10,401 కోట్లతో 741 కిలోమీటర్ల మేర నిర్మించనున్న 31 రహదారులకు ఈ నెల 17న కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రూ.11,157 కోట్లతో ఇప్పటికే నిర్మించిన 20 రహదారులను ప్రారంభించబోతున్నారు. మొత్తంగా రాష్ట్రంలోని 51 రహదారులకు మహర్దశ పడుతోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 17న విజయవాడ రానున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధిపై ఆయనతో చర్చించిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా రాష్ట్రంలోని పోర్టులు, పర్యాటక ప్రదేశాలు, వెనుకబడిన ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ రహదారులను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. తద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక, పర్యాటక అభివృద్ధి వీలవుతుందని గడ్కరీ దృష్టికి తెచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి కోసం భారీగా నిధులు కేటాయించారు. వాటిలో కొన్ని నిర్మాణాలు ఇప్పటికే పూర్తవ్వగా, మరికొన్నింటిని నిర్మించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో ఒకేసారి రహదారులకు ప్రారంభోత్సవం, కొత్తగా నిర్మించనున్న వాటికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావించింది. నితిన్ గడ్కరీ పర్యటన నేపథ్యంలో ఈ మేరకు షెడ్యూల్ రూపొందించింది. ఈ నెల 17న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో గడ్కరీ, సీఎం వైఎస్ జగన్ తదితరులు పాల్గొననున్నారు. ఇందుకోసం ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేసింది. భూమి పూజ చేయనున్న ప్రాజెక్టులివీ.. ► రాష్ట్రంలో కొత్తగా 31 జాతీయ రహదారుల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. రూ.10,401 కోట్లతో 741 కిలోమీటర్ల మేర వీటిని నిర్మించనున్నారు. వీటిలో కేంద్ర రోడ్డు, రవాణా శాఖ రూ.5,740 కోట్లతో 571 కిలోమీటర్ల మేర 24 ప్రాజెక్టులు నిర్మించనుంది. ఇక జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) రూ.4,661 కోట్లతో 170 కిలోమీటర్ల మేర ఏడు ప్రాజెక్టులు నిర్మిస్తోంది. -
తెలుగు రాష్ట్రాల మధ్య మరో వారధి.. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే..
సాక్షి, అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ కొత్త జాతీయ రహదారి ఏర్పాటవుతోంది. ఇందుకోసం కృష్ణా నదిపై వంతెన కూడా నిర్మాణం కానుంది. తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాల బైపాస్ రోడ్డు వరకు ఆరులేన్ల జాతీయ రహదారి నిర్మాణానికి రూపొందించిన ప్రణాళికను కేంద్ర ఉపరితల రవాణా శాఖ సమ్మతించింది. ఈ మేరకు రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఆమోదిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఇదీ ప్రణాళిక.. ► ఏపీ, తెలంగాణలను అనుసంధానిస్తూ 174 కి.మీ. మేర జాతీయ రహదారి (ఎన్‌హెచ్–167కె)ను రూ.600 కోట్లతో నిర్మిస్తారు. తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి సమీపంలోని కొట్రా జంక్షన్ నుంచి ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల వరకు నిర్మించాలని నిర్ణయించారు. ► ఏపీ పరిధిలో కర్నూలు జిల్లాలోని ఎర్రమఠం, ముసిలిమాడ్, ఆత్మకూరు, వెలుగోడు, సంతజుటూరు, కరివెనపై బైపాస్ రోడ్లు నిర్మిస్తారు. ► తెలంగాణ పరిధిలో కల్వకుర్తి, తాడూరు, నాగర్ కర్నూలు, కొల్లాపూర్‌లలో బైపాస్ రోడ్లు నిర్మించనున్నారు. ► అలాగే, ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణానదిపై రూ.600 కోట్లతో ఓ వంతెననూ నిర్మిస్తారు. ► కర్నూలు జిల్లా సిద్ధేశ్వరం.. తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల మధ్య దాదాపు 2 కి.మీ. మేర ఈ వంతెన నిర్మాణం జరుగుతుంది. ► కేంద్రం డీపీఆర్‌ను ఆమోదించడంతో త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టి రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేయాలని భావిస్తున్నామని ఎన్హెచ్ఏఐ అధికార వర్గాలు తెలిపాయి. 80కి.మీ. మేర తగ్గనున్న దూరం ఈ వంతెన రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధికి దోహదపడుతుంది. కర్నూలు జిల్లాలోని వరద ముంపు గ్రామాలకు రోడ్ కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఆ జిల్లాలోని ఆత్మకూరు, నందికొట్కూరు, పడిగ్యాల, కొత్తపల్లి మండలాల్లోని దాదాపు 35 గ్రామాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. ఆ గ్రామాల ప్రజలు వరదల సమయంలో నదిలో ప్రయాణించాల్సిన అవసరం లేకుండా రోడ్ కనెక్టివిటీ ఏర్పడుతుంది. ► మొత్తం మీద ఏపీ, తెలంగాణ మధ్య 80కి.మీ. మేర దూరం తగ్గుతుంది. ప్రస్తుతం నంద్యాల నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే కర్నూలు, పెబ్బేరు, కొత్తకోట మీదుగా వెళ్లాల్సి వస్తోంది. ► ఈ వంతెన నిర్మిస్తే నంద్యాల నుంచి నేరుగా నాగర్‌కర్నూలు మీదుగా హైదరాబాద్ వెళ్లిపోవచ్చు. ► తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు కూడా వ్యయ ప్రయాసలు తగ్గుతాయి. తండ్రి ఆశయం.. తనయుడి సాకారం 2007లో నాటు పడవలో కృష్ణా నదిని దాటుతూ ప్రమాదానికి గురై 61మంది మరణించారు. దీంతో కర్నూలు జిల్లా సిద్ధేశ్వరం.. తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల మధ్య నూతనంగా ఓ వంతెన నిర్మించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్ణయించి 2008లో శంకుస్థాపన చేశారు. ఆయన హఠాన్మరణంతో ఆ వంతెన నిర్మాణం నిలిచిపోయింది. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు దానిని పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వం 2018లో ఒకట్రెండుసార్లు దానిపై చర్చించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. 2019లో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) కల్వకుర్తి–నంద్యాల రహదారిని ఎన్‌హెచ్–167కెగా ప్రకటించి కృష్ణా నదిపై వంతెనతో సహా ఆరులేన్లుగా రహదారి నిర్మాణానికి నిర్ణయించింది. -
కొత్తగా మరో జాతీయ రహదారి.. హైదరాబాద్–తిరుపతి.. మరింత దగ్గర
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ కొత్తగా మరో జాతీయ రహదారి ఏర్పాటుకానుంది. దీనివల్ల హైదరాబాద్, తిరుపతి మధ్యదూరం దాదాపు 70 కిలోమీటర్ల మేర తగ్గనుంది. తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాల బైపాస్ రోడ్డు వరకు ఆరులేన్ల జాతీయ రహదారి (కొల్లాపూర్ ఎన్‌హెచ్ –167కే) నిర్మాణానికి రూపొందించిన ప్రణాళికకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం తెలిపింది. ఈ రహదారిలో భాగంగా కృష్ణా నదిపై సోమశిలవద్ద వంతెనను కూడా నిర్మించనున్నారు. ఈ మేరకు రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఆమోదిస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. అలాగే మహబూబ్‌నగర్ నుంచి కర్ణాటకలోని చించోలి వరకు ఎన్‌హెచ్–167ఎన్ విస్తరణకు కూడా గ్రహణం వీడింది. దీని అలైన్మైంట్ ఖరారు కావడంతో పాటు నిర్మాణానికి రూ.703.68 కోట్లు మంజూరయ్యాయి. ఈ రహదారుల నిర్మాణంతో వివిధ ప్రాంతాలకు దూరం తగ్గనుండడంతో ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది. కొల్లాపూర్ ఎన్‌హెచ్‌కు టెండర్లే తరువాయి.. కొల్లాపూర్ జాతీయ రహదారి–167కే నిర్మాణానికి కేంద్రం గతేడాది గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు 173.73 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్న ఈ రహదారి పనులకు రూ.600 కోట్లు, మార్గ మధ్యలో కొల్లాపూర్ వద్ద సోమశిల సమీపంలోని కృష్ణానదిపై 2 కిలోమీటర్ల మేర చేపట్టనున్న ఐకానిక్ వంతెన నిర్మాణానికి మరో రూ.600 కోట్లను కేంద్రం కేటాయించింది. ఈ రహదారి డీపీఆర్‌కు కేంద్రం ఆమోదముద్ర వేయడంతో నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలవడమే తరువాయని తెలుస్తోంది. తెలంగాణలోని కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, రాంపూర్.. ఆంధ్రప్రదేశ్‌లోని మందుగుల, శివాపురం, కరివెన మీదుగా నంద్యాల వరకు నిర్మించనున్న ఈ రహదారి పూర్తయితే హైదరాబాద్, తిరుపతి మధ్య దాదాపు 70 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. ఈ మార్గంలో పది ప్రాంతాల్లో బైపాస్ రోడ్లు, జంక్షన్లను అభివృద్ధి చేయనున్నారు. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేయాలని భావిస్తున్నట్లు ఎన్హెచ్ఏఐ అధికారవర్గాలు తెలిపాయి. కల్వకుర్తి కొట్రా జంక్షన్ టు నంద్యాల బైపాస్ తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని కొట్రా జంక్షన్ నుంచి కొల్లాపూర్ ఎన్‌హెచ్–167కే ప్రారంభమవుతుండగా.. కల్వకుర్తి, తాడూరు, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్‌లలో బైపాస్ రోడ్లు నిర్మించనున్నారు. సోమశిల సమీపంలో కృష్ణా నదిపై రీ–అలైన్మెంట్ బ్రిడ్జి, ఆ తర్వాత ఏపీలోని కర్నూలు జిల్లాలో ఎర్రమఠం, ముసిలిమాడ్, ఆత్మకూరు, వెలుగోడు, సంతజుటూరు, కరివెనపై నంద్యాల బైపాస్ రోడ్డు వరకు రహదారి నిర్మిస్తారు. చివరగా అక్కడ జాతీయ రహదారి–40 జంక్షన్‌కు అనుసంధానించనున్నట్లు డీపీఆర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం నంద్యాలనుంచి హైదరాబాద్ రావాలంటే కర్నూలు, వనపర్తి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ మార్గం పూర్తయితే నంద్యాలనుంచి నేరుగా నాగర్‌కర్నూలు మీదుగా హైదరాబాద్‌కు చేరుకోవచ్చు. అలైన్మెంట్ ఖరారు ఇలా.. మహబూబ్‌నగర్ జిల్లాలోని భూత్పూర్ ఫ్లైఓవర్, పాలకొండ, పాలమూరు యూనివర్సిటీ మీదుగా ఎన్‌హెచ్–167ఎన్ అలైన్మెంట్ ఖరారైంది. ఆ తర్వాత వీరన్నపేట, డంప్ యార్డు మీదుగా చిన్న దర్పల్లి, హన్వాడ.. నారాయణపేట జిల్లాలోని కోస్గి, వికారాబాద్ జిల్లాలోని కొడంగల్, తాండూరు మీదుగా కర్ణాటకలోని చించోలి వరకు విస్తరణ పనులు చేపట్టనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం చుట్టూ 8 కి.మీ.లు, కొడంగల్‌లో 5 కి.మీ.లు, తాండూర్‌లో 6 కి.మీ.ల మేర బైపాస్ రోడ్లు నిర్మించనున్నారు. ఎన్‌హెచ్–167ఎన్ నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ నుంచి ముంబైకి వెళ్లే వారికి దూరం తగ్గనుంది ఎన్‌హెచ్–167ఎన్.. రూ.703 కోట్లు మంజూరు మహబూబ్‌నగర్–చించోలి అంతర్రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్పు చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గతేడాది ప్రకటించారు. ఈ మేరకు సర్వే పూర్తి కాగా.. అలైన్‌మెంట్‌పై కూడా స్పష్టత వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్‌హెచ్–44పై ఉన్న భూత్పూర్ ఫ్లైఓవర్ నుంచి కర్ణాటకలోని చించోలి వరకు జాతీయ రహదారి–167ఎన్ను విస్తరించేందుకు డీపీఆర్ సిద్ధమైంది. దీంతో ఇటీవల రూ.703.68 కోట్లు మంజూరు చేస్తున్నట్లు గడ్కరీ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ రహదారి మొత్తం 190 కిలోమీటర్ల నిడివి ఉండగా.. మహబూబ్‌నగర్ నుంచి వికారాబాద్‌లోని కర్ణాటక సరిహద్దు వరకు 126కి.మీ.లు, కర్ణాటక రాష్ట్రం పరిధిలో 64కి.మీ.లు విస్తరించనున్నారు. పట్టణాలు, గ్రామాలు కలిసే చోట 120 అడుగులు, మిగతా చోట్ల 100 అడుగుల మేర రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. -
ఎమ్మెల్సీగా తాతా మధు ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన తాతా మధుసూదన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ అమీనుల్ హసన్ జాఫ్రి తాతా మధుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి శాసనసభా వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మంత్రి సత్యవతి రాథోడ్, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ లెజిస్లేచర్ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తదితరులు హాజరయ్యారు. -
ఇంట్లోనే వాహన చార్జింగ్
సాక్షి, అమరావతి: ఇకపై విద్యుత్ వాహనాన్ని ఇంట్లోనే చార్జింగ్ చేసుకోవచ్చు. దీనికోసం ఎక్కడో ఉన్న చార్జింగ్ కేంద్రాలకు వెళ్లి, సమయాన్ని వృథా చేసుకోవాల్సిన పని ఉండదు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించింది. వాతావరణ, వాయు కాలుష్యాన్ని తగ్గించాలంటే ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అయితే, వీటికి చార్జింగ్ ప్రధాన సమస్య కావడంతో ఎక్కువ మంది కొనడంలేదు. దీంతో ఇంట్లోనే చార్జింగ్ పెట్టుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఏర్పాటు చేసిన విద్యుత్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని ఇంటిలోనో, ఆఫీసులోనో సెల్‌ఫోన్ మాదిరిగానే చార్జింగ్ పెట్టుకోవచ్చు. గృహాలు, ఆఫీసుల వినియోగానికి వర్తించే టారిఫ్ ప్రకారమే చార్జీ చెల్లించాలి. ఈవీ పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ (పీసీఎస్)లకు ఎటువంటి లైసెన్స్ అవసరం లేదు. అయితే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, బీఈఈ సూచించిన విధంగా అన్ని రకాల భద్రత, నాణ్యత ప్రమాణాలు ఉండాలి. వీటికి సర్వీస్ చార్జీలను నిర్ణయించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. రాష్ట్రంలో లక్ష కేంద్రాలు దేశవ్యాప్తంగా 9,47,876 విద్యుత్ వాహనాలు ఉన్నట్లు రవాణా శాఖ రికార్డులు చెబుతున్నాయి. కానీ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) నివేదిక ప్రకారం చార్జింగ్ స్టేషన్లు 1,028 మాత్రమే ఉన్నాయి. 2030 నాటికి దేశంలో ప్రైవేటు కార్లు 30 శాతం, వాణిజ్య వాహనాలు 70 శాతం, బస్సులు 40 శాతం, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు 80 శాతం ఈవీలుగా మార్చాలనేది లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌లో 2024 నాటికి వీటి సంఖ్యను 10 లక్షలకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీటి కోసం రాష్ట్రంలో 2030కి లక్ష చార్జింగ్ కేంద్రాలు నెలకొల్పాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ (ఎన్ఆర్ఈడీసీఏపీ) నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో మూడు కిలోమీటర్లకు ఒకటి, జాతీయ రహదారుల్లో 25 కిలోమీటర్లకు ఒకటి చొప్పున తొలి దశలో మొత్తం 300 చార్జింగ్ కేంద్రాలను నెలకొల్పాలని సంకల్పించింది. వచ్చే ఫిబ్రవరి నాటికి 60 కేంద్రాలను విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. వీటి ఏర్పాటులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈవీ పాలసీని ప్రకటించింది. రాష్ట్రంలో పీసీఎస్‌ల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించింది. యూనిట్‌కు రూ.12 చొప్పున వసూలు చేసి, దాని నుంచి డిస్కంలకు విద్యుత్ చార్జీ రూ.6, స్థల యజమానికి రూ.2.55 చెల్లిస్తామంటూ ఢిల్లీ, గుజరాత్, తమిళనాడుకు చెందిన సంస్థలు టెండర్లు వేశాయి. -
ఆయిల్ కంపెనీల టెండర్ల కోసమే అక్రమ రిజిస్ట్రేషన్లు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన ఆయిల్ కంపెనీలను బురిడీ కొట్టించి టెండర్లు దక్కించుకునేందుకే రాష్ట్రంలో కొందరు సిండికేట్ సభ్యులు ట్యాంకర్ల ఫేక్ రిజిస్ట్రేషన్ల దందా సాగించినట్టు రవాణాశాఖ నిర్ధారించింది. ట్యాంకర్లు లేకపోయినా ఉన్నట్టుగా రిజిస్ట్రేషన్లు చేయడం వెనుక మతలబు ఇదేనని ప్రాథమికంగా తేల్చింది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలు కేంద్రంగా సాగుతున్న ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కోసం పోలీసుశాఖ సమాయత్తమవుతోంది. ఆయిల్ కార్పొరేషన్లు ఏటా ట్యాంకర్ల సరఫరా కోసం టెండర్లు ఆహ్వానిస్తాయి. టెండర్లలో పాల్గొనేందుకు నిర్ణీత సంఖ్యలో ట్యాంకర్లు ఉండాలనే నిబంధన విధిస్తాయి. దీంతో ఆయిల్ ట్యాంకర్లు లేనప్పటికీ ఉన్నట్టుగా చూపించి అర్హత సాధించేందుకు ఓ ముఠా ఈ ఎత్తుగడ వేసింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వెలుగుచూసిన ట్యాంకర్ల అక్రమ రిజిస్ట్రేషన్ల రాష్ట్రవ్యాప్తంగా విస్తరించినట్టు రవాణాశాఖ గుర్తించింది. ఇప్పటికే కృష్ణాజిల్లాలో కూడా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రవాణాశాఖ అధికారుల పూర్తి సహకారంతోనే ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం సాగించారు. నిబంధనల ప్రకారం మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ వాహనాలను పరిశీలించి సంబంధిత పత్రాలను ఆమోదించాలి. అనంతరం ఆర్టీవో స్థాయి అధికారి రిజిస్ట్రేషన్లు చేయాలి. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో ఏకంగా 110 ట్యాంకర్లు లేకుండానే ఎంవీఐ బి.గోపీనాయక్ ఉన్నట్టుగా పత్రాల్లో పేర్కొన్నారు. గూడూరు వంటి చిన్న పట్టణంలో అంత భారీసంఖ్యలో ఆయిల్ ట్యాంకర్లు ఒకేసారి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారో అని ఆర్టీవో సి.మల్లికార్జునరెడ్డి సందేహించకపోవడం విడ్డూరంగా ఉంది. ఇక కృష్ణాజిల్లాలో అయితే మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ కాకుండా కేవలం విఠల్ అనే సీనియర్ అసిస్టెంటే అక్రమ రిజిస్ట్రేషన్ల తతంగాన్ని నడిపించడం విస్మయపరుస్తోంది. కృష్ణాజిల్లాలో 11 ట్యాంకర్లను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్టు గుర్తించారు. రికార్డుల పరిశీలన కొనసాగుతుండటంతో మరిన్ని అక్రమ రిజిస్ట్రేషన్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. రవాణాశాఖ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఆయిల్ ట్యాంకర్ల రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తోంది. ఈ వ్యవహారాన్ని మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు సమాయత్తమవుతోంది. రవాణాశాఖ ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు కోసం బృందాన్ని ఈశాన్య రాష్ట్రాలకు పంపించనున్నారు. కేవలం ఆయిల్ కంపెనీల టెండర్లు దక్కించుకునేందుకే ఈ కుట్రకు పాల్పడ్డారా.. ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసు అధికారులు దృష్టిసారించనున్నారు. -
ఆర్టీసీ పాలక మండలి భేటీ
సాక్షి, అమరావతి: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని సద్వినియోగం చేసుకుంటూ సంస్థను అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని ఆర్టీసీ పాలకమండలి నిర్ణయించింది. ఏటా రూ.3 వేల కోట్ల వేతన భారాన్ని ప్రభుత్వమే భరిస్తున్నందున సంస్థకు గణనీయంగా ఆర్థిక వెసులుబాటు కలిగిందని పేర్కొంది. ఆర్టీసీ నూతన పాలకమండలి సమావేశాన్ని బుధవారం విజయవాడలో నిర్వహించారు. కీలకమైన 45 అంశాలతో కూడిన అజెండాపై పాలకమండలి సుదీర్ఘంగా చర్చించింది. సమావేశంలో మాట్లాడుతున్న మల్లికార్జునరెడ్డి కొత్త బస్సుల కొనుగోలు, ఆర్టీసీ బస్ స్టేషన్లలో సదుపాయాల మెరుగుదల తదితర అంశాలపై చర్చ సాగింది. కాగా, డ్రైవర్లు, కండక్టర్లను కాంట్రాక్టు విధానంలో నియమించేందుకు ప్రభుత్వ అనుమతి కోరాలని నిర్ణయించినట్టు తెలిసింది. సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ ఎ.మల్లికార్జునరెడ్డి, ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు, ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, రవాణా, ఆర్థిక, సాధారణ పరిపాలన శాఖల ముఖ్య కార్యదర్శులు ఎంటీ కృష్ణబాబు, ఎస్ఎస్ రావత్, శశిభూషణ్‌కుమార్, కేంద్ర ఉపరితల రవాణా శాఖ అధికారి పరేశ్‌కుమార్, సీఐఆర్టీ డైరెక్టర్ కేవీఆర్కే ప్రసాద్, ఏఎస్ఆర్టీయూ ఈడీ ఆర్.ఆర్.కె.కిషోర్ పాల్గొన్నారు. -
ఉన్నత స్థానాలు చేరుకునేందుకే నైపుణ్య శిక్షణ
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలు ఉన్నత స్థానాలు చేరుకునేందుకు నైపుణ్య శిక్షణ, మార్గదర్శకత్వం అందిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ (సీహెచ్ఎస్ఎస్) సౌజన్యంతో ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం నిర్వహించిన ఉచిత ఇంటెర్న్షిప్ కార్యక్రమం ముగింపు వేడుకను విజయవాడ ఆర్టీసీ హౌస్‌లో సోమవారం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలు ఇటువంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని తమ రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ ఉద్యోగుల పిల్లల కెరీర్ గైడెన్స్ కోసం ఈ శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. ఆన్లైన్లో నిర్వహించిన ఈ శిక్షణకు 700 మంది హాజరయ్యారన్నారు. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఏపీఎస్ ఆర్టీసీ పాలక మండలి నియామకం
సాక్షి, అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీ పాలక మండలిని ప్రభుత్వం నియమించింది. ఆర్టీసీ చైర్మన్ ఎ.మల్లికార్జునరెడ్డి నేతృత్వంలోని ఈ పాలకమండలిలో ఓ వైస్‌చైర్మన్, నలుగురు ఆర్టీసీ జోనల్ చైర్మన్లతోపాటు మరో ఆరుగురు రాష్ట్ర ఉన్నతాధికారులు, ఐదుగురు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ మేరకు రోడ్లు, భవనాలు, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఆర్టీసీకి పూర్తిస్థాయిలో పాలక మండలిని నియమించడంపై నేషనల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. పాలక మండలి ఇదీ.. చైర్మన్: ఎ.మల్లికార్జున రెడ్డి, వైస్‌చైర్మన్–డైరెక్టర్: మెట్టపల్లి చిన్నప్పరెడ్డి విజయానందరెడ్డి, డైరెక్టర్లు: గాదల బంగారమ్మ, తాతినేని పద్మావతి, బత్తుల సుప్రజ, మల్యావతం మంజుల, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, జీఏడీ కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ, ఆర్టీసీ అదనపు కమిషనర్/ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆర్టీసీ ఆర్థిక సలహాదారు, అసోíసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ డైరెక్టర్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్. -
ఆర్టీసీ ఉద్యోగులకు 1నే జీతాలు!
సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తారీఖునే జీతాలు అందేలా సంస్థ ఆర్థిక స్థితిని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తానని ఆర్టీసీ కొత్త ఎండీ వీసీ సజ్జనార్ భరోసా ఇచ్చారు. ప్రస్తుతం సంస్థ ఆర్థిక పరిస్థితి సరిగా లేక రాష్ట్ర ప్రభుత్వ సాయంపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు. వీలైనంత త్వరలో ప్రభుత్వంపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా స్వయం సమృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆర్టీసీకి ఎండీగా నియమితులైన సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్, బస్‌భవన్‌లోని తన చాంబర్లో శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ఖైరతాబాద్‌లోని ట్రాన్స్‌పోర్టు భవన్లో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. బస్‌భవన్‌కు తిరిగొచ్చి మీడియాతో మాట్లాడారు. డీజిల్ ధరల పెరుగుదలతో పెనుభారం ‘గత రెండేళ్ల కాలంలో లీటరు డీజిల్‌పై రూ.22 పెరుగుదల నమోదైంది. ఇది ఆర్టీసీపై పెనుభారాన్ని మోపింది. అలాగే బస్సులకు వాడే విడిభాగాల ధరలు కూడా పెరిగాయి. రోజువారీ ఆదాయ వ్యయాల్లో రూ.8 కోట్ల వ్యత్యాసం కనిపిస్తోంది. దీన్ని వెంటనే సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇది జరగాలంటే సంస్థ ఆదాయం పెరగాలి. అది టికెట్ ద్వారా సాధించాలా, లేదా కార్గో విభాగం లాంటి ప్రత్యామ్నాయాల ద్వారా పొందాలా అన్నది ఆలోచిస్తాం. ఆర్టీసీ ఆదాయం ఎలా పెంచుకోవాలన్న దానిపై శాస్త్రీయ అధ్యయనం జరిపేందుకు ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ అధ్యయనంలో తేలిన అంశాల ఆధారంగా చర్యలు తీసుకుంటాం’అని సజ్జనార్ తెలిపారు. మూడు లక్ష్యాలు సాధించేలా.. ‘ప్రజలు ఆర్టీసీ బస్సులను ఆదరించి దాని ఆదా యం పెరిగేందుకు సహకరించాలి. సురక్షితమైన ప్రయాణం చేయాలి. స్వయం సమృద్ధి సాధించ టం, ప్రయాణికులు సంతృప్తి చెందేలా సేవలందించటం, ఉద్యోగుల సంక్షేమం.. ఈ మూడు లక్ష్యాలు సాధించేలా పని ప్రారంభిస్తున్నాం. ఆర్టీసీని సంస్కరించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో మాజీ అధికారులతో కూడా మాట్లాడుతున్నాం. వారి సూచనలు కూడా పరిగణనలోకి తీసుకుంటాం..’అని చెప్పారు. సంక్షేమ మండళ్ల వైపే మొగ్గు గతంలో ఆర్టీసీ సమ్మె సమయంలో కార్మిక సంఘాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రెండేళ్లపాటు వాటిని దూరం పెట్టిన విషయం తెలిసిందే. రెండేళ్లు గడిచినా మళ్లీ కార్మిక సంఘాలను గుర్తించలేదు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల దిశగా చర్యలు తీసుకోలేదు. కార్మిక సంఘాలకు ఉద్యోగులు దూరంగా ఉండేలా చూస్తోంది. అందులో భా గంగా డిపో స్థాయిలో ఉద్యోగులకు సంక్షేమ మండళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సజ్జనార్ కూడా సంక్షేమ మండళ్లవైపే మొగ్గు చూపు తున్నారు. కార్మిక సంఘాల గురించి ప్రశ్నించగా, ప్రస్తుతం డిపోల్లో సంక్షేమ మండళ్లు అందుబాటులో ఉన్నందున వాటితోనే కార్మికుల సంక్షేమంపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే బస్సుల వివరాలు ప్రయాణికులకు తెలిసేలా జీపీఎస్ ఆధారిత ఆధునిక సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఎర్ర తివాచీ స్వాగతం సజ్జనార్‌కు అధికారులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. బస్‌భవన్ ప్రాంగణమంతా ఆయన మినీ కటౌట్లు, పూల అలంకరణలతో ముస్తాబు చేశారు. ప్రధాన ద్వారం నుంచి లోపలివరకు ఎర్ర తివాచీ పరిచి దాని మీదుగా నడిచివచ్చేలా ఏర్పాటు చేశారు. దారికి రెండువైపులా ఉద్యోగులు నిలబడి పూలను చల్లుతూ ఆహ్వానం పలికారు. కాగా అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో సజ్జనార్ విడివిడిగా భేటీ అయ్యారు. ఉదయం నుంచి రాత్రి వరకు బస్‌భవన్‌లోనే గడిపిన ఆయన.. రాత్రి తన కార్యాలయానికి వచ్చిన కుటుంబసభ్యులను అధికారులకు పరిచయం చేశారు. -
సీసీఎస్ బకాయిల కోసం రూ.500 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులు దాచుకున్న సహకార పరపతి సంఘం (సీసీఎస్) నిధులను పూర్తిగా వాడేసుకుని ఉద్యోగులకు రుణాలు, విశ్రాంత ఉద్యోగులకు వడ్డీ చెల్లించకుండా గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎట్టకేలకు ప్రభుత్వం పరిస్థితి చక్కదిద్దేందుకు సిద్ధపడింది. కేవలం సీసీఎస్ బకాయిలు చెల్లించేందుకు వీలుగా నేషనల్ కో–ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) నుంచి రూ.400 కోట్ల రుణం తీసుకుని ఆర్టీసీకి అందించాలని నిర్ణయించింది. ఈ రుణానికి రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వనుంది. సీసీఎస్ నిల్వ మొత్తాన్ని వాడుకోవడం, ప్రతినెలా దానికి జమ చేయాల్సిన మొత్తాన్ని ఎగ్గొడుతున్న ఫలితంగా దానికి ఆర్టీసీ దాదాపు రూ.950 కోట్ల వరకు బకాయి పడింది. ఇప్పుడు ఆ మొత్తాన్ని ఒకేసారి చెల్లించడం కష్టంగా మారడంతో ముందుగా రూ.500 కోట్లు చెల్లించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఎన్సీడీసీ నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించింది. అప్పుడు వద్దనుకుని.. నిజానికి ఎన్సీడీసీ నుంచి రుణం తీసుకునే అంశం దాదాపు మూడు నెలల క్రితమే చర్చకొచ్చింది. అప్పుడు ఆ కార్పొరేషన్‌తో అధికారులు చర్చించారు. సాధారణంగా ఎన్సీడీసీ వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు చెందిన సహకార సంస్థలకే రుణాలిస్తుంది. సీసీఎస్ కూడా సహకార సంస్థే కావటంతో రుణం ఇచ్చేందుకు అప్పట్లో అంగీకరించినట్లు తెలిసింది. అయితే రుణం నేరుగా సీసీఎస్‌కే ఇస్తామని, ఆర్టీసీకి ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొన్నట్టు సమాచారం. తీసుకునే రుణంలో కొంత సీసీఎస్‌కు ఇచ్చి, మిగతాది తమ అవసరాలకు వాడుకోవాలన్న యోచనలో ఉన్న ఆర్టీసీ అందుకు అంగీకరించలేదు. ఫలితంగా అప్పట్లో ఆ రుణ అంశం అటకెక్కిందని తెలిసింది. ఇప్పుడు సీసీఎస్ పరిస్థితి దారుణంగా తయారు కావటంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో డబ్బు దాచుకుని నెలనెలా వడ్డీ పొందుతున్న విశ్రాంత ఉద్యోగులు ఇటీవల బస్‌భవన్ ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. దీనికి సంబంధించి ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. సీసీఎస్‌లో సభ్యత్వం ఉండటం.. నెలనెలా జీతంలో కోత పడుతుండటంతో ఏకంగా సభ్యత్వాలనే మూకుమ్మడిగా రద్దు చేసుకోవాలని ఉద్యోగులు భావిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ సీసీఎస్ మూసివేతకు రంగం సిద్ధం అయిన తీరుపై ‘సాక్షి’కథనాన్ని ప్రచురించింది. దీంతో రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, ఈడీలు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు తదితరులు హాజరయ్యారు. గతంలో వద్దనుకున్న ఎన్సీడీసీ రుణాన్ని తిరిగి తీసుకోవాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తు ఇవ్వాలనే విషయంపై చర్చించారు. దీనికి ఆర్థిక శాఖ అంగీకరించడంతో ఆ రుణం పొందేందుకు మార్గం సుగమమైంది. బడ్జెట్లో పేర్కొన్న రుణం అందినట్టే.. బడ్జెట్(2021–22)లో ఆర్టీసీకి రూ.1,500 కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు ఇటీవల ఓ ప్రభుత్వ బ్యాంకు నుంచి రూ.వేయి కోట్ల రుణంపై చర్చించగా, తొలుత రూ.500 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. ఆ మొత్తం దాదాపు నెలన్నర క్రితం అందింది. అది ఖర్చు చేశాక మరో రూ.500 కోట్ల రుణం ఇవ్వనున్నట్లు ఆ బ్యాంకు పేర్కొంది. వెరసి రూ.వేయి కోట్లు అక్కడి నుంచి రానుండగా, తాజాగా ఎన్సీడీసీ నుంచి మరో రూ.400 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించడంతో ప్రభుత్వ రుణం దాదాపు ఆర్టీసీకి అందినట్లు అవుతుంది. ఉద్యోగుల బకాయిలకు వినియోగం? దాదాపు నెలన్నర క్రితమే అందిన రూ.500 కోట్ల బ్యాంకు రుణాన్ని ఎలా ఖర్చు చేయాలనే విషయంలో ఓ నిర్ణయానికి రాలేక అలాగే ఉంచారు. ఇప్పుడు వాటిని ఉద్యోగుల బకాయిల కింద వాడాలని భావిస్తున్నట్లు సమాచారం. సీసీఎస్‌కు ఎన్సీడీసీ రుణాన్ని ఇవ్వనుండగా, ఉద్యోగులకు ఉన్న బాండ్ల బకాయిలు, వేతన సవరణ బకాయిలు, విశ్రాంత ఉద్యోగుల బకాయిలకు వాటిని వాడాలని భావిస్తున్నట్లు తెలిసింది. అద్దె బస్సు బకాయిలు కూడా చెల్లించాలని అనుకుంటున్నట్లు సమాచారం. వాటి వ్యయంపై ముఖ్యమంత్రి నుంచి స్పష్టత వచ్చాక వెల్లడించాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. -
హైదరాబాద్: 11 హై ఎండ్ లగ్జరీకార్లు సీజ్
-
హైదరాబాద్‌లో 11 హై ఎండ్ లగ్జరీకార్లు సీజ్, ఇదే తొలిసారి
సాక్షి, హైదరాబాద్: పన్ను ఎగవేసి తిరుగుతున్న హై ఎండ్ లగ్జరీ కార్లపై ఆర్టీఏ కొరడా ఝుళిపించింది. రవాణ శాఖ అధికారులు ఆదివారం ఆకస్మిక దాడులు చేసి 11 వాహనాలను సీజ్ చేశారు. వివరాలు... డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ కె.పాపారావు నేతృత్వంలో మోటారు వాహన తనిఖీ అధికారులు, సహాయ మోటారు వాహన తనిఖీ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రర్ అయిన ఈ లగ్జరీ కార్లు రవాణా శాఖకు జీవితకాల పన్ను చెల్లించకుండా హైదరాబాద్‌లో తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆర్నెల్లుగా ఇలాంటి వాహనాలపై పక్కా నిఘా పెట్టి పథకం ప్రకారం దాడులు నిర్వహించి 11 కార్లను సీజ్ చేశారు. జఫ్తు చేసిన వాహనాల నుంచి జీవితకాల పన్ను రూపంలో రూ.5 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశంఉంది. సీజ్ చేసిన వాటిలో మెర్సెడస్ బెంజ్, మాసరట్టి, పెర్రారి, రోల్స్ రాయిస్, బీఎండబ్ల్యూ, లాంబోర్గీని తదితర ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. హై ఎండ్ వాహనాలపై దాడులు నిర్వహించడం ఆర్టీఏ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి కావడం గమనార్హం. -
వాహన బీమాలకు 'నకిలీ' మకిలి
రోడ్డుపై పరుగులు తీసే వాహనాలకు బీమా తప్పనిసరి. బీమా ఉంటే అదో ధీమా. ఊహించని ప్రమాదం జరిగి ఎవరైనా మరణించినా, గాయపడినా బాధిత కుటుంబానికి బీమా ఆర్థిక భరోసా ఇస్తుంది. వాహనాలకు ఇంతటి అవసరమైన బీమాలను కూడా నకిలీవి తయారు చేస్తున్నాయి. ప్రముఖ బీమా కంపెనీల పేరిట నకిలీ పాలసీలు విచ్చలవిడిగా చేస్తూ అటు ప్రజలకు..ఇటు ప్రభుత్వ జీఎస్టీ ఆదాయానికి గండి కొడుతున్నాయి. సాక్షి, అమరావతి: విజయవాడ–హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారిపై ఐదేళ్ల క్రితం జరిగిన ఓ లారీ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. ఆ లారీకి వాహన బీమా ఉండటంతో థర్డ్‌పార్టీ పరిహారం కోసం దరఖాస్తు చేశారు. కానీ సదరు బీమా కంపెనీ తాము అసలు ఆ లారీకి బీమానే చేయలేదని చెప్పడంతో అటు లారీ యజమాని, ఇటు బాధిత కుటుంబం అవాక్కయ్యారు. తాము బీమా చేశాము కదా అని సంబంధిత పత్రాలు చూపిస్తే అసలు అవి తమ కంపెనీవే కావని ఆ సంస్థ తేల్చిచెప్పింది. లారీ యజమాని, బాధిత కుటుంబం కోర్టుని ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనతో తమ కంపెనీ పేరిట నకిలీ బీమా దందా సాగుతోందని గ్రహించిన ఆ సంస్థ అప్పట్లో టీడీపీ ప్రభుత్వంలో రవాణా శాఖ దృష్టికి తీసుకువెళ్లింది. కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆ తరువాత ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా రాష్ట్రంలో నకిలీ వాహన బీమా రాకెట్ దర్జాగా విస్తరించింది. ఏకంగా 12 కంపెనీల పేరిట నకిలీ వాహన బీమాలు చేయిస్తూ యథేచ్ఛగా మోసం చేస్తోంది. ఇదీ రాష్ట్రంలో నకిలీ వాహన బీమా దందా బాగోతం. అటు ప్రజలను నష్టపరుస్తూ ఇటు ప్రభుత్వానికి జీఎస్టీ ఆదాయానికి గండి కొడుతున్న ఈ దందాపై తాజాగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వర్గాలు దృష్టి సారించాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం విశ్వాసం కల్పించడంతో ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బీమా కంపెనీలు సమాయత్తమవుతున్నాయి. దాదాపు 25% నకిలీ పాలసీలే.. రాష్ట్రంలో నకిలీ బీమా పాలసీల దందాపై డీఆర్ఐ అధికారులు దృష్టి సారించారు. ఈ బాగోతాన్ని అరికట్టేందుకు కార్యాచరణకు ఉపక్రమించారు. ర్యాండమ్‌గా 12 బీమా కంపెనీలకు చెందిన 3 లక్షల వాహన పాలసీలను పరిశీలించారు. వాటిలో 25 శాతం బీమా పాలసీలు నకిలివేనని ప్రాథమికంగా నిర్ధారించారు. రాష్ట్రంలో కోట్ల సంఖ్యలో ఉన్న పాలసీలను పరిశీలిస్తే మరెన్ని నకిలీ బీమా పాలసీలు బయటపడతాయో అంతుచిక్కడం లేదని అధికారులు భావిస్తున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి కట్టడికి తగిన విధివిధానాలను అమలు చేయాలని నిర్ణయించారు. మరోవైపు బీమా కంపెనీల ప్రతినిధులు కూడా ఈ వ్యవహారంపై డీఆర్ఐ అధికారులను కలిసి పరిస్థితిని వివరించారు. ఇది క్రిమినల్ చర్య కూడా కావడంతో దీనిపై పోలీసు అధికారులకు కూడా ఫిర్యాదు చేయాలని డీఆర్ఐ అధికారులు వారికి సూచించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని బీమా కంపెనీలు కూడా నిర్ణయించాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తాం ‘మా కంపెనీ పేరిట నకిలీ బీమా పాలసీలు చేస్తున్నట్లుగా గుర్తించాం. దీనిపై మా కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. ఈ విషయంలో దర్యాప్తునకు డీఆర్ఐ, పోలీసు అధికారులకు సహకరిస్తాం. – జితేంద్ర సాహూ, జనరల్ మేనేజర్, మాగ్మా ఇన్సూరెన్స్ కంపెనీ, ముంబై కాలుష్య తనిఖీ వాహనాలు, సెకండ్ హ్యాండ్ వాహన షోరూమ్‌లే కేంద్రంగా... రాష్ట్రంలో దాదాపు ఏడేళ్లుగా నకిలీ వాహన బీమా రాకెట్ వేళ్లూనుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా టీడీపీ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతినిచ్చిన కాలుష్య తనిఖీ వాహనాలు కేంద్రంగా ఈ దందా కేంద్రీకృతమైంది. మరోవైపు సెకండ్ హ్యాండ్ వాహనాలు విక్రయించే షోరూమ్‌ల నుంచి కూడా ఈ బాగోతం సాగుతోంది. టీడీపీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా వ్యవహరించిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత అండదండలతో ఈ రాకెట్ బలోపేతమైంది. వాహన బీమాలు అందించే అధీకృత ఏజెంట్ల కంటే ఈ కాలుష్య నియంత్రణ తనిఖీ వాహనాలు, సెకండ్ హ్యాండ్ వాహనాల విక్రయ షోరూమ్‌లలో తక్కువ మొత్తానికే బీమా పాలసీలు అందుబాటులో ఉంచారు. కాలుష్య తనిఖీల కోసం తమ వాహనాలను తీసుకువచ్చిన వాహనదారులకు అదే పనిగా బీమా పాలసీలు చేయిస్తారు. ఆ విధంగా అధీకృత ఏజంట్ వద్ద కంటే 50% తక్కువకే అందిస్తుండటంతో వాహనదారులు ఆకర్షితులై నకిలీ బీమా పాలసీలు చేసుకుంటున్నారు. ఆ విధంగా ఒక్కో నకిలీ బీమా పాలసీ చేసే కాలుష్య పరీక్షలు/సెకండ్ హ్యాండ్ షోరూమ్ సిబ్బందికి రూ.500వరకు కమీషన్ ముట్టజెబుతారు. దాంతో ఈ నకిలీ వాహన బీమా పాలసీల దందా అడ్డూఅదుపు లేకుండా సాగిపోయింది. -
6 వరుసలుగా నాగ్‌పూర్ హైవే
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ చిక్కులతో విలవిల్లాడుతున్న 44వ నంబర్ జాతీయ రహదారి(నాగ్‌పూర్– నిజామాబాద్ హైవే)ని హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఆరు వరుసలకు విస్తరించనున్నారు. ఈ మేరకు భారత జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రతిపాదించింది. హైదరాబాద్‌లోని బోయిన్పల్లి నుంచి మేడ్చల్ తర్వాత ఉండే కాల్లకల్ వరకు దాదాపు 24 కి.మీ. మేర రహదారిని విస్తరించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖకు తాజాగా ప్రతిపాదించింది. ఇందుకు దాదాపు రూ.1,300 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. దీనికి కేంద్రం నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఈ జాతీయ రహదారికి ఇరువైపులా మేడ్చల్ వరకు కొత్త కాలనీలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ చిక్కులు ఏర్పడుతున్నాయి. కూడలి ప్రాంతాల్లో సిగ్నల్ పడితే కిలోమీటర్ మేర వాహనాల బారులు తీరుతున్నాయి. దీంతో ఈ రహదారిని విస్తరించాలని చాలాకాలం నుంచి ప్రజలు కోరుతున్నారు. భారీ ఎలివేటెడ్ కారిడార్లతో.. బోయిన్పల్లి నుంచి మేడ్చల్ వరకు కీలక కూడళ్లలో భారీ ఎలివేటెడ్ కారిడార్లకు ప్రణాళిక రచించారు. హైదరాబాద్ నుంచి మేడ్చల్ వెళ్లే దారిలో తొలుత కీలక జంక్షన్ అయిన సుచిత్ర కూడలి వద్ద 2 కి.మీ. పొడవైన వంతెన నిర్మించనున్నారు. ఇక్కడి నుంచి 10 కి.మీ. అంటే గుండ్లపోచంపల్లి వరకు మూడు భారీ వంతెనలు ఉంటాయి. సుచిత్ర కూడలి మొద టిది కాగా, సినీప్లానెట్ కూడలి వద్ద 560 మీటర్ల పొడవుతో రెండో వంతెన, కొంపల్లి–దూలపల్లి మధ్య 1.2 కి.మీ. మేర మూడో వంతెన నిర్మిస్తారు. అక్కడి నుంచి మేడ్చల్ దాటేవరకు రోడ్డును పూర్తి స్థాయిలో విశాలంగా మారుస్తారు. మేడ్చల్ దాటే వరకు రెండున్నర కి.మీ. మేర వంతెన నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టును రెండు భాగాలుగా విభజించారు. బోయిన్పల్లి నుంచి గుండ్ల పోచంపల్లి వరకు పనులకు రూ.450 కోట్లు, అక్కడి నుంచి మేడ్చల్ వరకు చేపట్టే పనులకు రూ.850 కోట్లు ప్రతిపాదించారు. -
డ్రైవింగ్ లైసెన్సులు ఇక ప్రైవేటు చేతుల్లోకి..
సాక్షి, హైదరాబాద్: డ్రైవింగ్ లైసెన్సులు ఇక ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లనున్నాయి. అధికారిక ధ్రువీకరణకు మాత్రమే ఆర్టీఏ పరిమితం కానుంది. ప్రస్తుతం వాహనాల రిజిస్ట్రేషన్లలో ఆటోమొబైల్ సంస్థల భాగస్వామ్యం పెరిగినట్లుగానే డ్రైవింగ్‌లో శిక్షణ, నైపుణ్య పరీక్షలు సైతం ప్రైవేట్ సంస్థలే నిర్వహించనున్నాయి. ఈ దిశగా రవాణాశాఖ సన్నాహాలు చేపట్టింది. కేంద్రం కొత్తగా రూపొందించిన ‘అక్రెడిటెడ్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్’పథకం అమలుకు రవాణాశాఖ సన్నాహాలు చేపట్టింది. డ్రైవింగ్ పరీక్షా కేంద్రం ఏర్పాటుకు అవసరమైన రెండెకరాల భూమి, అధునాతన శిక్షణా కేంద్రం, తేలికపాటి, భారీ వాహనాలు తదితర మౌలిక సదుపాయాలు కలిగిన సంస్థలు లేదా వ్యక్తులు కొత్త అక్రిడేటెడ్ ట్రైనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ సంస్థలిచ్చే శిక్షణను ఆర్టీఏ అధికారులు ప్రామాణికంగా భావించి డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేస్తారు. అంటే ఒకసారి అక్రెడిటెడ్ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ కోసం చేరితే నెల రోజులపాటు శిక్షణ ఇవ్వడంతోపాటు ఈ స్కూళ్లే ఫారమ్–5 ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తాయి. దీని ఆధారంగా రవాణా అధికారులు డ్రైవింగ్ లెసెన్సులు ఇస్తారు. ఇదంతా డ్రైవింగ్ కేంద్రాల నుంచి ఆర్టీఏ కార్యాలయాలకు డేటా రూపంలో ఆన్లైన్లో చేరిపోతుంది. వీలైనంత వరకు అభ్యర్థులు ఆర్టీఏకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే లైసెన్సులు చేతికొచ్చేస్తాయి. కొరవడిన నాణ్యత... ►ప్రస్తుతం భారీ వాహనాలు నడిపేందుకు, కార్లు వంటి తేలికపాటి వాహనాలు నడిపేందుకు డ్రైవింగ్ స్కూళ్లు శిక్షణ ఇస్తున్నాయి. కొన్ని స్కూళ్లు మాత్రమే సిమ్యులేటర్లను ఏర్పాటు చేసుకొని నాణ్యమైన శిక్షణ ఇస్తుండగా వందలాది స్కూళ్లు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే అభ్యర్థుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ►అరకొర శిక్షణ పొందిన వ్యక్తులు దళారులు, ఏజెంట్ల సహాయంతో డ్రైవింగ్ లైసెన్సులు తీసుకొని వాహనాలు నడుపుతున్నారు. ఇలాంటివారు ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతూ తరచుగా ప్రమాదాలకు కారణమవుతున్నారు. ►ప్రస్తుతం ఉన్న స్కూళ్లలో శిక్షణ పొందినప్పటికీ ఆర్టీఏ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లలో అధికారులు మరోసారి అభ్యర్థుల నైపుణ్యాన్ని పరీక్షించిన అనంతరమే లైసెన్సులు ఇస్తున్నారు. నైపుణ్యానికి మెరుగులు... ►కొత్తగా ఏర్పాటయ్యే శిక్షణా కేంద్రాల్లో రెండెకరాల విశాలమైన స్థలంలో టెస్ట్ ట్రాక్ ఉంటుంది. దాంతోపాటు నెల రోజులు సిద్ధాంతపరమైన అంశాల్లో శిక్షణనిస్తారు. ►అభ్యర్థులకు మొదట సిమ్యులేటర్ శిక్షణనిచ్చి ఆ తరువాత వాహనాలను అప్పగిస్తారు. ఏ రోజుకారోజు అభ్యర్థుల హాజరు, శిక్షణ తీరు, నైపుణ్యం తదితర అంశాలను పరిశీలించి చివరకు ఫారమ్–5 ధ్రువీకరణతోపాటు శిక్షణ పొందిన వారి వివరాలను ఆర్టీఏకు అందజేస్తారు. ►ప్రాంతీయ రవాణా అధికారిస్థాయిలో అభ్యర్థులు పొందిన శిక్షణను పరిశీలించి డ్రైవింగ్ లైసెన్సులు జారీచేస్తారు. ఆర్టీఏ డ్రైవింగ్ కేంద్రాలు అలంకారప్రాయమే.. –ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో నాగోల్, మేడ్చల్, ఉప్పల్, కొండాపూర్, ఇబ్రహీంపట్నంలలో డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాలు ఉన్నాయి. –ప్రతిరోజు సుమారు 300 మందికి పైగా అభ్యర్థులు ఈ కేంద్రాల్లో మోటారు వాహన తనిఖీ అధికారుల సమక్షంలో డ్రైవింగ్ పరీక్షలకు హాజరవుతారు. –అక్రిడేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాలు అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో వీటి అవసరం ఉండకపోవచ్చు. ఆహ్వానించదగ్గ పరిణామమే: పాండురంగ్ నాయక్, జేటీసీ, హైదరాబాద్ డ్రైవింగ్‌లో నాణ్యత, నైపుణ్యం పెరిగేందుకు ఈ శిక్షణ కేంద్రాలు దోహదపడతాయి. నిరుద్యోగులకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రభుత్వం స్వయంగా ఇలాంటి శిక్షణ ఇచ్చేందుకు అవకాశం తక్కువ. అందుకే ప్రైవేట్ సంస్థలను ఆహ్వానిస్తున్నాం. -
కాలం చెల్లితే.. 'తుక్కే'
సాక్షి, అమరావతి: కాలుష్యాన్ని నివారించి అనుకూలమైన పర్యావరణాన్ని నెలకొల్పే చర్యల్లో భాగంగా 15 సంవత్సరాలకు పైగా వినియోగించిన రవాణా (ట్రాన్స్పోర్ట్) వాహనాలను ఫిట్నెస్ ఆధారంగా తుక్కు చేయడాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 20 ఏళ్లు పైబడి వినియోగించిన రవాణేతర (నాన్–ట్రాన్స్పోర్ట్) పాత వాహనాల ఫిట్నెస్ ఆధారంగా తుక్కు చేయించేలా వాటి యజమానులను ప్రోత్సహించాలని ప్రతిపాదించింది. ఇందుకోసం తొలి దశలో పాత వాహనాల ‘వలంటీరీ స్క్రాపింగ్’ (స్వచ్ఛందంగా తుక్కు చేసే) విధానాన్ని ప్రకటించింది. పాత వాహనాలను తుక్కు చేసి.. వాటి స్థానంలో కొత్త వాహనాలను కొనుగోలు చేసే వారికి వాహన పన్నుల్లో రాయితీలు ఇవ్వాలని ప్రతిపాదించింది. ఇందుకోసం రవాణా, రవాణేతర రంగాల వాహనాలకు వేర్వేరుగా రాయితీలను ప్రకటించింది. ఇందుకోసం రిజిస్టర్డ్ వాహనాల స్క్రాపింగ్ ఫెసిలిటీలను (తుక్కు చేసే సదుపాయ కేంద్రాలు) ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. ఫెసిలిటీలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా రాయితీలిచ్చి ప్రోత్సహిస్తాయా అనే అంశంతో పాటు పాత వాహనాలను తుక్కు చేసి కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారికి ఇచ్చే రాయితీలపై కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ అధికారులు శుక్రవారం రాష్ట్రాల్లోని రవాణా శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదింపులు జరిపారు. స్క్రాపింగ్ ఫెసిలిటీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వాలు భూమిని రాయితీపై కేటాయించే అంశంపైనా కేంద్రం చర్చించింది. పాత వాహనాలను తుక్కు చేయాలంటే ఆ వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ రద్దు చేయాలంటే సంబంధిత వాహనాల పన్ను బకాయిలు గానీ, గ్రీన్ ట్యక్స్గానీ, చలానా బకాయిలు గానీ ఉండకూడదు. పాత వాహనాలను తుక్కు చేసేందుకు ముందుకొచ్చే వారిని ప్రోత్సహించేందుకు వీలుగా ఆ బకాయిలను ఏడాది పాటు రద్దు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది. రాయితీల ప్రతిపాదన ఇలా.. ► పాత వాహనాన్ని తుక్కు చేసినందుకు దాని విలువలో 5 శాతం నగదును వాహనదారుడికి చెల్లించాలని కేంద్రం సూచించింది. ► వాటి స్థానంలో కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారికి ఆ వాహనాల ధరలో 5 శాతం రాయితీ ఇచ్చేలా సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్‌తో సంప్రదింపులు జరుపుతోంది. ► రాష్ట్రంలో మొత్తం 1,41,50,277 వాహనాలుండగా.. 15 ఏళ్ల వినియోగం దాటిన వాహనాలు వచ్చే ఏడాది మార్చి నాటికి 27,47,943 ఉంటాయని రాష్ట్ర రవాణా శాఖ లెక్క తేల్చింది. ► పాత వాహనాలను తుక్కు చేసిన సర్టిఫికెట్ చూపి కొత్తగా కొనుగోలు చేసే రవాణేతర (నాన్–ట్రాన్స్‌పోర్టు) వాహనాలకు 15 ఏళ్ల పన్నుపై 25 శాతం, రవాణా (ట్రాన్స్‌పోర్టు) వాహనాలకైతే 8 ఏళ్ల పన్నులో 15 శాతం రాయితీ ఇవ్వాలని సూచించింది. -
3.15 లక్షల మందికి వైఎస్సార్ వాహన మిత్ర!
సాక్షి, అమరావతి: వరుసగా మూడో ఏడాది ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. గత ఏడాది కంటే ఈసారి 15 శాతం మేర లబ్ధిదారులు పెరగనున్నట్లు రవాణా శాఖ అంచనా వేస్తోంది. అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించేలా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. 2021–22కిగాను వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద లబ్ధిదారులకు జూన్‌లో ఆర్థిక సహాయం అందించేందుకు రవాణా శాఖ సన్నాహాలు ముమ్మరం చేసింది. పెరగనున్న లబ్ధిదారులు వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టిన 2019–20లో 2,36,334 మంది లబ్ధిదారులకు రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించారు. రెండో ఏడాది అంటే 2020–21లో 2,73,985 మందికి ప్రయోజనం కల్పించారు. ఈసారి 15 శాతం మందికి అదనంగా అంటే దాదాపు 3.15 లక్షల మందికి పథకం కింద లబ్ధి కలిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2020 మే నుంచి 2021 మే 16 వరకు రాష్ట్రంలో కొత్తగా 17,362 ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్‌లు రిజిస్ట్రేషన్లు అయ్యాయి. మరోవైపు కొత్తగా వేలాది వాహనాల యాజమాన్య హక్కులు బదిలీ అయ్యాయి. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు పెరగనున్నారు. జూన్ 15న లబ్ధిదారులకు సాయం వైఎస్సార్ వాహన మిత్ర పథకం అర్హుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాలు, రవాణా శాఖ ఉప కమిషనర్ కార్యాలయాల వద్ద బుధవారం నుంచి ప్రదర్శిస్తారు. ఇప్పటికే అర్హులు, కొత్త వాహనాలు కొనుగోలుదారులు, యాజమాన్య హక్కులు బదిలీ అయినవారి వివరాలు ఈ జాబితాలో ఉంటాయి. వీటిపై అభ్యంతరాలను జూన్ 3 వరకు స్వీకరిస్తారు. జూన్ 8 నాటికి జిల్లా కలెక్టర్లు లబ్ధిదారుల తుది జాబితాలను ఖరారు చేస్తారు. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 వేలు చొప్పున జమ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను సంబంధిత 8 కార్పొరేషన్ల ఎండీలు జూన్ 9, 10వ తేదీల్లో పూర్తి చేస్తారు. జూన్ 15న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సాయాన్ని జమ చేస్తారు. -
నిలిచిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు
సాక్షి, అమరావతి: కోవిడ్ ఉధృతి నేపథ్యంలో శనివారం నుంచి రాష్ట్రంలో 880 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రాకపోకలు నిలిచిపోయాయి. కరోనా నేపథ్యంలో బస్సుల్లో 50 శాతం సీట్లతోనే నడపాలని నిబంధన విధించడంతో పాటు ప్రజలు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి కనపరచడం లేదు. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు తమంతట తాముగానే శనివారం నుంచి 880 బస్సులు తిప్పడాన్ని నిలిపేస్తున్నట్లు రవాణా శాఖకు ముందుగానే తెలియజేశారు. కోవిడ్ నేపథ్యంలో బస్సులను నడపలేమని ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు రవాణా శాఖకు తెలియజేశారు. రవాణా శాఖ కూడా ఈ బస్సులకు సంబంధించిన పాత పన్నులేమైనా చెల్లించాల్సి ఉంటే వాటిని వసూలు చేసింది. ముందస్తుగా రవాణా శాఖకు సమాచారం ఇవ్వడంతో ఆ తిప్పని కాలానికి బస్సులకు పన్ను నుంచి మినహాయింపు పొందడానికి వీలుంటుందని రవాణా శాఖ అధికార వర్గాలు తెలిపారు. -
రవాణా ఆదాయం రయ్!
సాక్షి, అమరావతి: లాక్డౌన్ ఎత్తివేత అనంతరం రవాణా రంగం ఆదాయం పుంజుకుంది. గత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో కోవిడ్ కారణంగా లాక్డౌన్ విధించడంతో రవాణా రంగం ఆదాయం గణనీయంగా పడిపోయింది. లాడ్‌డౌన్ సడలింపుల సమయం రెండో త్రైమాసికంలో కొంతమేర పుంజుకుంది. మూడో త్రైమాసికం నుంచి వృద్ధిలోకి వచ్చింది. గత ఆర్ధిక ఏడాది తొలి త్రైమాసికంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు రవాణా ఆదాయం –53.03 శాతంతో తిరోగమనంలో ఉంది. రెండో త్రైమాసికంలో లాక్డౌన్ సడలింపులతో జూలై నుంచి సెప్టెంబర్ వరకు కొంత మేర పుంజుకుని –4.54 శాతం వృద్ది నమోదైంది. మూడో త్రైమాసికంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రవాణా రంగం ఆదాయంలో 7.07 శాతం వృద్ధి నమోదైంది. నాల్గో త్రైమాసికంలో ఈ ఏడాది జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు ఏకంగా 21.71 శాతం వృద్ధి నమోదైంది. 2019 – 20లో రవాణా రంగం ఆదాయం రూ.3,175.45 కోట్లు ఉండగా 2020–21లో రూ.2,973.33 కోట్లు సమకూరింది. అంటే అంతకుముందు ఆర్ధిక ఏడాదితో పోల్చితే రవాణా రంగం ఆదాయం వృద్ధి –6.37 శాతంగా ఉంది. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే మెరుగు పొరుగు రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఏపీలో రవాణా రంగం ఆదాయం మెరుగ్గానే ఉంది. తమిళనాడు, ఢిల్లీ, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ మన రాష్ట్రం కన్నా వెనుకబడి ఉన్నాయి. -
డ్రైవింగ్ లైసెన్సు లేదు.. సార్!
సాక్షి, అమరావతి: గత రెండు నెలల్లో జరిపిన వాహనాల తనిఖీల్లో 22,130 మంది వద్ద డ్రైవింగ్ లైసెన్సులు లేనట్లు రవాణా శాఖ అధికారులు తేల్చారు. కానీ రాష్ట్రంలో మొత్తం 1.08 కోట్ల మందికి డ్రైవింగ్ లైసెన్సులున్నట్లు రవాణా శాఖ వద్ద గణాంకాలున్నాయి. అదే సమయంలో ద్విచక్ర వాహనాలు కాకుండా భారీ వాహనాలు నడిపే దాదాపు 10 వేల మంది కూడా లైసెన్సులు లేవని చెప్పడంతో రవాణా శాఖ అధికారులు విచారణ చేపట్టగా.. కొత్త విషయం వెల్లడైంది. కేవలం లైసెన్సు సస్పెన్షన్ నుంచి తప్పించుకునేందుకే.. తనిఖీల్లో పట్టుబడినప్పుడు ఈ విధంగా చెబుతున్నారని తేల్చారు. ప్రతి వంద మంది వాహనదారుల్లో 70 మంది ఇలాగే చెబుతున్నట్లు వెల్లడైంది. డ్రైవింగ్ లైసెన్స్‌లేదని చెప్పడంతో రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధించి వదిలేస్తున్నారు. అదే లైసెన్సు ఉందని చెబితే సస్పెండ్ చేస్తున్నారు. దీని వల్ల తమకు ఉపాధి పోతుందని భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు చెబుతున్నారు. ఆధార్‌తో లింక్ చేస్తే తేలిపోతుంది.. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కూడా రవాణా సేవలన్నింటికీ ఆధార్ లింక్‌ను అనుమతించింది. రాష్ట్రంలో రవాణా శాఖ కూడా ఈ ప్రక్రియను ప్రారంభించింది. ఇటీవల కాలంలో అన్ని జిల్లాల్లో కలిపి సుమారు 20 వేల వరకు లైసెన్సులను సస్పెండ్ చేసినట్లు రవాణా శాఖ చెబుతోంది. సస్పెండ్ చేసిన లైసెన్సులను ఆధార్‌తో లింక్ చేయడం వల్ల వాహనదారుడు ఎట్టి పరిస్థితిలోనూ పోగొట్టుకున్నానని చెప్పేందుకు వీలుండదు. కొత్త కార్డు పొందేందుకూ అవకాశముండదు. అలాగే ఆధార్‌తో లింక్ చేస్తే వాహనదారుడికి అసలు లైసెన్సు ఉందా? లేదా? అన్నది కూడా తేలిపోతుంది. ఈ నేపథ్యంలో ఆధార్‌తో లైసెన్సు డేటాను పరిశీలించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు రవాణా శాఖ అదనపు కమిషనర్ ప్రసాదరావు ‘సాక్షి’కి తెలిపారు. -
అరకు ప్రమాదం; కోలుకుంటున్న క్షతగాత్రులు
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: అనంతగిరి మండలం డముకు మలుపు వద్ద శుక్రవారం రాత్రి ప్రైవేటు బస్సు లోయలో పడిపోయిన ఘోర ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు కోలుకుంటున్నారు. హైదరాబాద్ షేక్‌పేటకు చెందిన 27 మంది పర్యాటకులు విహార యాత్రలో భాగంగా విశాఖ జిల్లా అరకు వచ్చి తిరిగి వెళ్తుండగా.. అనంతగిరి మండలం డముకు ఘాట్‌రోడ్డు మలుపు వద్ద వారు ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు లోయలో పడిపోయిన విషయం విదితమే. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందగా, 23 మంది గాయాల పాలయ్యారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు హుటాహుటిన రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, పోలీస్ బృందాలు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలించారు. వీరిలో 16 మంది శనివారం నాటికి పూర్తిగా కోలుకున్నారు. మిగిలిన ఏడుగురికి కేజీహెచ్‌లోనే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నారు. ఆరుగురికి శస్త్ర చికిత్స చేయగా కోలుకుంటున్నారు. మరో మహిళ కొట్టం చంద్రకళ (50) పరిస్థితి కొంత విషమంగానే ఉంది. మరో 24 గంటలు గడిస్తేగాని చెప్పలేమని వైద్యులు తెలిపారు. ప్రమాదంలో మరణించిన కొట్టం సత్యనారాయణ (61), నల్ల లత (45), సరిత (40), కొట్టం శ్రీనిత్య (8 నెలలు) మృతదేహాలను హైదరాబాద్‌కు తరలించారు. 16 మంది స్వస్థలాలకు పయనం ప్రమాదంలో గాయపడి కోలుకున్న క్షతగాత్రుల్లో 16 మంది శనివారం హైదరాబాద్‌లోని స్వస్థలానికి బయలుదేరారు. విశాఖ జిల్లా అధికారులు తెలంగాణ ప్రభుత్వాధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. గాయపడి పూర్తిగా కోలుకున్న 16 మందిని మరో రోజు వైద్యుల పరిశీలనలో ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. క్షతగాత్రులు మాత్రం మృతదేహాల వెంట తాము కూడా హైదరాబాద్ వెళ్లిపోతామని అధికారులను కోరారు. దీనిపై ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చ సాగింది. ఇక్కడి వైద్యులు వెళ్లొద్దని వారించినా.. క్షతగాత్రులు మాత్రం వెళ్లేందుకు సిద్ధపడటంతో అధికారులు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. పరామర్శించేందుకు వచ్చిన బంధువులతో పాటు 16 మందిని రాత్రి 9 గంటలకు ఇక్కడి నుంచి పంపించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం క్షతగాత్రులకు నాలుగు వైద్య బృందాల (ఆర్థో, న్యూరో, ప్లాస్టిక్ సర్జరీ, జనరల్ సర్జరీ)తో మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్య శాఖ) ఆళ్ల నాని చెప్పారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్ వినయ్‌చంద్‌తో కలిసి శనివారం ఆయన పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను డ్రైవర్ శ్రీశైలం నుంచి తెలుసుకున్నారు. అనంతరం ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయపడిన వారందరికీ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. క్షతగాత్రుల్లో 16 మంది పూర్తి సురక్షితంగా ఉన్నారని, ఆరుగురికి శస్త్ర చికిత్స చేయగా కోలుకుంటున్నారని, కొట్టం చంద్రకళ (50) పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని చెప్పారు. కొట్టం కల్యాణి (30)కి ప్లాస్టిక్ సర్జరీ చేయించామని చెప్పారు. ఈ ఘటనపై జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ప్రభుత్వం ఓ కమిటీ వేయనుందని తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే బస్సు ప్రమాదం ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిద్రమత్తే కారణమని రవాణా శాఖ ప్రాథమికంగా తేల్చింది. అలసట కారణంగా డ్రైవర్ నిద్రమత్తుకు లోనవటంతో ఈ ప్రమాదం సంభవించిందని ప్రభుత్వానికి పంపిన ప్రాథమిక నివేదికలో అధికారులు పేర్కొన్నారు. బ్రేకులు ఫెయిల్ కావడం వల్ల ప్రమాదం జరిగిందన్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. కోలుకుని హైదరాబాద్ పయనమైన వారి వివరాలు కొట్టం లత (45), యు.కృష్ణవేణి (50), కొట్టం అరవింద్‌కుమార్ (35), కొట్టం నరేష్కుమార్ (38), కొట్టం స్వప్న (32), కొట్టం శివాని (07), కొట్టం దేవాన్‡్ష(05), కొట్టం శాన్వి (05), కొట్టం విహాన్ (03), కొట్టం ఇషా (05), అనూష(26), కొట్టం హితేష్ (17), కొట్టం మౌనిక (27), కొట్టం అనిత(50), కొట్టం శ్రీజిత్(14), లోఖిశెట్టి నందకిశోర్ (25) కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారు కొట్టం కల్యాణి (30), కొట్టం జ్యోతి (55), కొట్టం శైలజ (30), కొట్టం అభిరామ్ (07), మీనా (38), కొట్టం చంద్రకళ (50), బస్సు డ్రైవర్ సర్రంపల్లి శ్రీశైలం ప్లాస్టిక్ సర్జరీతో పాతరూపు అనంతగిరి మండలం డముకు మలుపు వద్ద బస్సు ప్రమాదంలో కొట్టం కల్యాణి (30)కి ముఖంపై తీవ్రగాయాలు కావడంతో ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్, ప్లాస్టిక్ సర్జరీ స్పెషలిస్ట్ డాక్టర్ పివీ సుధాకర్ ఆధ్వర్యంలోని బృందం ఆమెకు ప్లాస్టిక్ సర్జరీ చేసింది. కల్యాణి ముఖాన్ని ప్రమాదానికి ముందు ఎలా ఉందో అలా తీర్చిదిద్దారు. -
ఇక డ్రైవింగ్ ట్రాక్‌ల ఆటోమేషన్
సాక్షి, అమరావతి: వీడియో ఆధారిత సెన్సర్ల వినియోగం ద్వారా శాస్త్రీయ పద్ధతిలో డ్రైవింగ్ సామర్థ్య పరీక్షల నిర్వహణకు రవాణా శాఖ సన్నద్ధమవుతోంది. రూ.13.4 కోట్లతో రాష్ట్రంలో తొమ్మిది చోట్ల డ్రైవింగ్ ట్రాక్‌ల ఆటోమేషన్ నిర్మాణాలను చేపట్టనుంది. ఇందుకు కేంద్రం ఏపీకి రూ.9 కోట్లు కేటాయించగా, మిగిలిన రూ.4.4 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. రాష్ట్రంలోని రవాణా కార్యాలయాల్లో సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోట్ల ఈ ఆటోమేషన్ డ్రైవింగ్ ట్రాక్‌లు నిర్మిస్తారు. వైజాగ్, చిత్తూరు, అనంతపురం, విజయవాడ, తిరుపతి, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులలో ఈ ట్రాక్‌లకు టెండర్లు ఖరారయ్యాయి. మార్చి నెలాఖరుకల్లా విశాఖ, అనంతపురం, చిత్తూరు, విజయవాడలలో, డిసెంబర్ నాటికి తిరుపతి, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రొద్దుటూరులలో ట్రాక్‌ల్ నిర్మాణాన్ని పూర్తిచేస్తారు. ఆటో మేషన్ డ్రైవింగ్ ట్రాక్ అంటే.. డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ప్రస్తుతం మోటారు వాహన తనిఖీ అధికారులు మాన్యువల్ విధానంలో పరీక్షలు నిర్వహించి సామర్థ్యాన్ని నిర్ధారిస్తున్నారు. ఈ విధానంలో ఏజెంట్లు, మధ్యవర్తులు, డ్రైవింగ్ స్కూళ్ల ప్రమేయం ఎక్కువగా ఉంటోంది. దీంతో నైపుణ్యం లేని వారికి కూడా తేలిగ్గా లైసెన్స్‌లు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ పరీక్షలను మానవ ప్రమేయ రహితంగా, పారదర్శకంగా నిర్వహించాలని రవాణా శాఖ నిర్ణయించింది. వీడియో సెన్సర్లే కీలకంగా పనిచేస్తాయి. ట్రాక్‌లో వాహనం నడిపే వ్యక్తి కదలికలను ఇవి నమోదు చేస్తాయి. వాహనాన్ని నడిపే తీరు, వేగం, వాహనం కండిషన్, పార్కింగ్ చేసే పద్ధతి, వాహనాన్ని వెనక్కి తీసుకోవడం, ఎత్తయిన ప్రాంతాల్లో, కచ్చా రోడ్లపైన, ట్రాఫిక్ రద్దీలో నడిపేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలపై కచ్చితమైన అంచనాలు ఉంటాయి. -
ట్రాఫిక్ ఉల్లంఘన.. రోజుకు 9 మంది మృతి
సాక్షి, అమరావతి: మన రాష్ట్రంలో ట్రాఫిక్ ఉల్లంఘనల కారణంగా రోజుకు తొమ్మిదిమంది మృత్యువాత పడుతున్నారు. ప్రతి వంద రోడ్డు ప్రమాదాల్లో 36 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రంలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించేవారు 40 శాతం మంది ఉన్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ తేల్చింది. గత నాలుగేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషిస్తూ ట్రాన్స్‌పోర్టు రీసెర్చి వింగ్ ఇటీవలే ఓ నివేదిక వెల్లడించింది. మన రాష్ట్రంలో ప్రమాదాలు, కారణాలు తదితర అంశాలను ఈ నివేదిక విశ్లేషించింది. మన రాష్ట్రంలో ఏటా 35 శాతం ద్విచక్ర వాహనాలు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయి. వీటిని నడుపుతున్నవారిలో 80 శాతం మంది హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు గాయాలై ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు చెక్ పెట్టేందుకు, రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోకుండా నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల భారీగా జరిమానాలు పెంచిన సంగతి తెలిసిందే. ఈ జరిమానాల పెంపుతో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని రవాణారంగ నిపుణులు పేర్కొంటున్నారు. వాహన తనిఖీలను ముమ్మరం చేసి రహదారి భద్రతపై పూర్తి అవగాహన కల్పించాలని రవాణా, పోలీస్ శాఖలు నిర్ణయించాయి. నేటి (సోమవారం) నుంచి జాతీయ రహదారి భద్రత కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. నెలరోజుల పాటు జరగనున్నాయి. ప్రతి రోజూ రవాణా శాఖ అధికారులకు ఓ కార్యక్రమాన్ని నిర్దేశించింది. ఆటో, లారీ డ్రైవర్లకు కంటి పరీక్షలు, ట్రాఫిక్ ఉల్లంఘనలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై రాష్ట్రంలో రోజూ 80 నుంచి 120 వరకు కేసులు నమోదవుతున్నాయి. డ్రైవింగ్ లైసెన్సు ఉండి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడేవారికి జాతీయ రహదారి భద్రత కార్యక్రమాల్లో భాగంగా పునశ్చరణ తరగతులు నిర్వహించడంపై ప్రణాళిక రూపొందించారు. ఈ వారోత్సవాలకు సంబంధించి సుప్రీంకోర్టు కమిటీ కూడా కొన్ని సూచనలు చేసింది. వాహనదారుడు హెల్మెట్ ధరించడం నిబంధనగా కాకుండా బాధ్యతగా తీసుకునేలా అవగాహన కల్పించాలని పేర్కొంది. రవాణా వాహనాలు నడిపే డ్రైవర్లు తప్పనిసరిగా ఆరు నెలలకోసారి కంటి పరీక్షలు చేయించుకోవాలని, ఈ వారోత్సవాల్లో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించేందుకు శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. రహదారి భద్రత చర్యలు పాటించకుండా పదేపదే ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులపై కఠిన చర్యలు చేపట్టాలి. 8 శాతం తగ్గిన ట్రాఫిక్ ఉల్లంఘనలు రాష్ట్రంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎనిమిది శాతం వరకు తగ్గాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండటానికి ప్రధాన కారణమైన ఓవర్ స్పీడ్, హెల్మెట్ ధరించకపోవడం వంటి కేటగిరీల్లో అయితే ఏకంగా పది నుంచి 15 శాతం వరకు ఉల్లంఘనలు తగ్గిపోయాయి. ట్రాఫిక్ ఉల్లంఘనలకు భారీ జరిమానాలు విధించేలా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబరులో నోటిఫికేషన్ జారీచేసి పక్కాగా అమలు చేస్తుండటమే ఇందుకు కారణమని రవాణా శాఖ పేర్కొంటోంది. గతంలో రాష్ట్రంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు 40 శాతం వరకు ఉన్నట్లు పేర్కొన్న రీసెర్చి వింగ్ ఇప్పుడు జరిమానాల పెంపు భయంతో తగ్గిపోయాయని తెలిపింది. ఉల్లంఘనలు ఇంకా తగ్గుముఖం పడితే రోడ్డు ప్రమాదాలు, మరణాలు గణనీయంగా తగ్గిపోతాయని రవాణా అధికారులు పేర్కొంటున్నారు. హెల్మెట్ ధరించేవారి సంఖ్య పెరిగింది గతంలో హెల్మెట్ ధరించకపోతే రూ.100 జరిమానా విధించేవారు. ఇప్పుడు జరిమానా రూ.వెయ్యికి పెంచడంతో ఉల్లంఘించేవారి సంఖ్య 15 శాతానికి తగ్గింది. ఈ ఏడాది సెప్టెంబరు 20 నుంచి అక్టోబరు 20 వరకు హెల్మెట్ ధరించని వారిపై 1,947 కేసులు నమోదు చేశారు. తరువాత నెలలో 1,650 కేసులు నమోదయ్యాయి. అంటే హెల్మెట్ ధరించేవారిసంఖ్య 15 శాతం పెరిగింది. ఓవర్ స్పీడ్‌కు జరిమానా రూ.వెయ్యి నుంచి రూ.10 వేల వరకు పెంచారు. దీంతో కేసులు వెయ్యి నుంచి 900కు (పదిశాతం) తగ్గాయి. -
తిరుగు ప్రయాణానికి ‘ప్రత్యేక’ ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: స్వగ్రామాల్లో కుటుంబసభ్యులు, బంధువుల మధ్య సంతోషంగా సంక్రాంతి పండగ జరుపుకున్నవారంతా మళ్లీ ‘నగర’బాట పట్టారు. వీరందరితో బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు 2,057 ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు ప్రత్యేక సర్వీసులు తిప్పుతోంది. ఇప్పటికే ఈ ప్రాంతాలకు ఆర్టీసీ రెగ్యులర్‌గా 3 వేల సర్వీసులు నడుపుతోంది. ఇప్పుడు 2,057 సర్వీసులు అదనంగా చేరాయి. హైదరాబాద్‌కు అత్యధిక సర్వీసులు.. ఆర్టీసీ ఈనెల 19 వరకు ఏపీలోని అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్‌కు అత్యధికంగా 954 ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. ఆ తర్వాత బెంగళూరుకు 409, చెన్నైకి 131 ప్రత్యేక సర్వీసులు కేటాయించింది. ఆదివారం(17వ తేదీ) ఒక్క రోజే ఏకంగా 359 సర్వీసులు అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్‌కు తిప్పనున్నారు. ఇక బెంగళూరుకు 142, చెన్నైకి 51 సర్వీసులు నడుపుతున్నారు. ప్రైవేటు ట్రావెల్స్‌పై 816 కేసులు నమోదు.. ప్రైవేటు బస్సుల్ని రవాణా శాఖ కట్టడి చేయడంతో ఈ ఏడాది ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలంతా తమ సొంతూళ్లలో పండుగ జరుపుకోగలిగారు. ప్రయాణికుల అవసరాన్ని సొమ్ము చేసుకుందామని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ప్రైవేటు ట్రావెల్స్‌కు రవాణా శాఖ అధికారులు మళ్లీ హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే పర్మిట్ రద్దు చేసేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. పండుగ నేపథ్యంలో ఇప్పటికే అధిక టికెట్ రేట్లు వసూలు చేసిన ప్రైవేట్ ట్రావెల్స్‌పై అధికారులు 816 కేసులు నమోదు చేశారు. -
ప్రయాణికులపై 'ప్రైవేట్' బాదుడు
సాక్షి, అమరావతి: ఎప్పటిలాగే ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు ఈ పండుగ సీజన్లోనూ దోపిడీకి తెగబడ్డారు. సంక్రాంతికి సొంతూరుకు వెళ్దామనుకునే వారికి రెండ్రోజులుగా చార్జీలు పెంచి చుక్కలు చూపిస్తున్నారు. డిమాండ్ ఉన్న తేదీల్లో అయితే మరీ బాదేస్తున్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఆర్టీసీ టికెట్ ధర రూ.900 ఉంటే, ప్రైవేటు ట్రావెల్స్‌లో మాత్రం రూ.1,500 వరకు వసూలుచేస్తున్నారు. ఆర్టీసీ ఏసీ బస్సుల్లో హైదరాబాద్‌నుంచి గుంటూరుకు రెగ్యులర్ సర్వీసుల్లో రూ.530 వరకు ఉంది. అదే స్పెషల్ బస్సు అయితే రూ.795 వసూలుచేస్తున్నారు. కానీ, ప్రైవేటు బస్సులో ఏకంగా రూ.1,130–1,200 వరకు తీసుకుంటున్నట్లు ఆన్లైన్లో ఉంచారు. నాన్ ఏసీ ఆర్టీసీ బస్సుల్లో ఇదే మార్గంలో రెగ్యులర్ సర్వీసులకు రూ.418 అయితే, స్పెషల్ బస్సుల్లో రూ.568 వసూలుచేస్తున్నారు. ప్రైవేటు బస్సుల్లో నాన్ ఏసీ టికెట్ల ధరలు రూ.850–రూ.950 వరకు ఉన్నాయి. ప్రయాణికుల్ని ఇబ్బంది పెడితే ఊరుకోం టికెట్ రిజర్వేషన్లు చేసే రెడ్‌బస్, అభీబస్‌ల నిర్వాహకులతో ఇప్పటికే మాట్లాడాం. ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టినా.. అధిక రేట్లకు విక్రయించినా.. ట్రావెల్స్ నిర్వాహకులపైనే కాదు.. బస్ టికెట్ కంపెనీలపై కూడా కేసులు నమోదు చెయ్యొచ్చు. నేటి నుంచి తనిఖీలు ముమ్మరం చేస్తాం. ప్రైవేటు బస్సుల ఆపరేటర్లు తమ బస్సుల్లో ‘రవాణా అధికారులు ఎక్కడైనా తనిఖీలు చేస్తారు.. వారికి సహకరించాలి’ అని బోర్డులు పెట్టుకోవాలి. – ప్రసాదరావు, రవాణా శాఖ అదనపు కమిషనర్ ప్రైవేట్ దోపిడీపై రవాణా శాఖ కన్ను ఇలా ప్రయాణికుల్ని దోచుకుంటున్న ప్రైవేటు ట్రావెల్స్, టికెట్ బుకింగ్ వెబ్సైట్లపై రవాణా అధికారులు దృష్టిసారించారు. మోటారు వెహికల్ యాక్టు ప్రకారం కేసులు నమోదు చేయనున్నారు. అంతేకాక.. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందితే భారీ జరిమానాలు విధించనున్నారు. సంక్రాంతి పండుగ సీజన్ మొదలుకావడంతో రాష్ట్ర సరిహద్దుల్లోనే ప్రైవేటు బస్సులను తనిఖీలు చేసేందుకు జిల్లాల వారీగా బృందాలను ఏర్పాటుచేశారు. ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించినా తీరు మార్చుకోకపోతే వాటిని సీజ్ చేయనున్నారు. అలాంటి ట్రావెల్స్ నిర్వాహకులకు రూ.25 వేల వరకు జరిమానాలు విధించనున్నారు. కేసులు నమోదు చేసిన ట్రావెల్స్ వివరాలను అన్ని చెక్‌పోస్టులకు పంపించాలని కమిషనరేట్ అధికారులు సూచించారు. ఇతర రాష్ట్రాల బస్సులకు సైతం కేసుల నమోదు విషయంలో మినహాయింపులేదని రవాణా శాఖాధికారులు స్పష్టంచేశారు. మరోవైపు.. టికెట్ల ధరలు తగ్గిస్తామని రవాణా శాఖ మంత్రి పేర్ని నానికి ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు గతేడాది హామీ ఇచ్చినప్పటికీ ఈ ఏడాది కూడా అధికంగానే వసూలుచేయడం గమనార్హం. -
జనవరి నుంచి ‘రవాణా’ తనిఖీలు ముమ్మరం
సాక్షి, అమరావతి: రవాణా వాహనానికి సంబంధించి ఏ పత్రం లేకపోయినా కేసులు నమోదు చేసేందుకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం రవాణాశాఖకు ఆదేశాలిచ్చింది. కోవిడ్ కారణంగా రవాణా వాహనాల పర్మిట్లు, రిజిస్ట్రేషన్లు, లైసెన్సుల గడువు ఫిబ్రవరితో తీరిపోయినా.. ఈ ఏడాది డిసెంబర్ వరకు చెల్లుబాటయ్యేలా లాక్డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రం ఆదేశాల ప్రకారం రవాణాశాఖ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి ఆ మేరకు కేసుల నమోదులో వెసులుబాటు కల్పించింది. ఈ గడువు ఈనెలాఖరుతో ముగుస్తున్నందున వచ్చే ఏడాది ప్రారంభం నుంచి కఠినంగా రోడ్ సేఫ్టీ నిబంధనలు అమలు చేసేందుకు రవాణాశాఖ కింది స్థాయి అధికారులకు ఆదేశాలిచ్చింది. దీంతో చెక్‌పోస్టుల్లో తనిఖీలు ముమ్మరం చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి మోటారు వాహన చట్టాన్ని కేంద్రం గత ఏడాది సెప్టెంబర్ నుంచి అమల్లోకి తెచ్చింది. దీన్ని అనుసరించి ఈ ఏడాది జరిమానాలను భారీగా పెంచుతూ మోటారు వాహన చట్టంలో సెక్షన్ 177 నుంచి 199 వరకు కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త ఏడాదిలో రోడ్ సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ ఉల్లంఘనుల భరతం పట్టనున్నారు. పన్నులు చెల్లించకుండా వాహనం తిప్పితే 200 శాతం జరిమానా రవాణా వాహనానికి పర్మిట్ లేకపోయినా, పన్నులు చెల్లించకుండా వాహనం నడిపినా 200 శాతం జరిమానా విధించనున్నారు. అంతర్రాష్ట్ర పర్మిట్లపైనా రవాణాశాఖ దృష్టి సారించనుంది. వచ్చే ఏడాది నుంచి రవాణా వాహనాలకు సంబంధించి పూర్తిస్థాయి తనిఖీలు చేపడతామని సుప్రీంకోర్టు రోడ్ సేఫ్టీ కమిటీకి ఇటీవలే రవాణాశాఖ నివేదించింది. లాక్డౌన్ సమయంలో రవాణా శాఖ సేవలు లాక్డౌన్ సమయంలో పలు సేవలందించినట్లు సుప్రీంకోర్టు రోడ్ సేఫ్టీ కమిటీకి రవాణాశాఖ తెలిపింది. డ్రైవర్లకు లక్ష శానిటైజర్ల కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రోడ్ సేఫ్టీ కమిటీ వలస కూలీల తరలింపులో ముఖ్యపాత్ర పోషించిందని, 3,252 ఆర్టీసీ బస్సుల ద్వారా 96,700 మంది వలస కార్మికులను రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు తరలించినట్లు వివరించింది. జాతీయ రహదారుల వెంబడి ప్రతి 20 కిలోమీటర్లకు ఒకటి వంతున 118 ఫుడ్ అండ్ రిలీఫ్ సెంటర్లు ఏర్పాటు చేసి వలస కార్మికులకు సేవలందించినట్లు తెలిపింది. 69 శ్రామిక్ రైళ్ల ఏర్పాటులో కీలకంగా వ్యవహరించి 1,07,338 మంది కూలీలను పొరుగు రాష్ట్రాలకు తరలించినట్లు పేర్కొంది. కాలి నడకన వచ్చే 15 వేల మంది కూలీలను 464 ఆర్టీసీ బస్సుల్లో వారి స్వస్థలాలకు పంపినట్లు తెలిపింది. -
అబలకు అభయం
సాక్షి, అమరావతి: అక్క చెల్లెమ్మల ఆర్థిక, రాజకీయ స్వావలంబనే లక్ష్యంగా కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి రక్షణ, భద్రతకు ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. మహిళల అభ్యున్నతికి సువర్ణాక్షరాలతో లిఖించదగే కార్యక్రమాలను గత 17 నెలల కాలంలో చేపట్టామన్నారు. ఆటోలు, ట్యాక్సీలలో ఒంటరిగా ప్రయాణించే పిల్లలు, మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘అభయం ప్రాజెక్టు’ (యాప్)ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. తొలుత విశాఖలో పైలట్ ప్రాజెక్టుగా 1,000 ఆటోలలో ట్రాకింగ్ పరికరాలను ఏర్పాటు చేసి దీన్ని అమలు చేయనున్నారు. వచ్చే ఏడాది నవంబర్ నాటికి విజయవాడ, తిరుపతిలో కూడా అమలులోకి తెచ్చి లక్ష వాహనాల్లో ట్రాకింగ్ డివైజ్‌లు అమర్చాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏమన్నారో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ‘అభయం’ ప్రారంభ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్, హోంమంత్రి సుచరిత, అధికారులు నిస్సందేహంగా మహిళా పక్షపాత ప్రభుత్వం.. ‘‘రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకు అండగా మన ప్రభుత్వం ఎన్నో అడుగులు ముందుకు వేసింది. నిస్సందేహంగా మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకునేలా పనిచేస్తున్నాం. అమ్మ ఒడి పథకం, ఆసరా, చేయూత, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్, విద్యా దీవెన, వసతి దీవెన.. ఇలా ఏ పథకాన్ని తీసుకున్నా నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో సాయాన్ని జమ చేయడం ద్వారా ఆర్థిక స్వావలంబన చేకూర్చి చరిత్రలో నిలిచే ఘట్టం ఆవిష్కృతమవుతోంది. సగం మహిళలకు కేటాయిస్తూ చట్టాలు.. నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో 50 శాతం మహిళలకు ఇచ్చేలా ఏకంగా చట్టాలు చేసిన ప్రభుత్వం మనది. రాజకీయంగా అక్క చెల్లెమ్మలను అన్ని రకాలుగా పైకి తీసుకురావాలని ఆరాటపడుతున్నాం. హోంమంత్రిగా నా చెల్లెమ్మ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా మరొక చెల్లెమ్మ ఉండడం మహిళల రాజకీయ సాధికారతకు నిదర్శనం. ఆ మాటలను మరువలేదు.. రక్షణ, భద్రత విషయంలో రాజీ పడొద్దు. శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్లు, ఎస్పీలతో నా మొట్టమొదటి కాన్ఫరెన్సులో చెప్పిన మాటలు గుర్తున్నాయి. దేశంలో తొలిసారిగా దిశ బిల్లు ప్రవేశపెట్టి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాం. ఈరోజు ప్రతి జిల్లాలో దిశ ప్రత్యేక పోలీసు స్టేషన్లు కనిపిస్తున్నాయి. దిశ కోర్టుల్లో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉండే విధంగా ప్రభుత్వం నామినేట్ చేసింది. దిశ యాప్ బటన్ నొక్కిన 10 నిమిషాల వ్యవధిలోనే పోలీసులు వచ్చి తోడుగా నిలబడే విధంగా చర్యలు తీసుకున్నాం. సచివాలయాల్లో మహిళా పోలీసులను నియమించాం. మహిళా పోలీసు మిత్రలను కూడా తయారు చేస్తున్నాం. మరో అడుగు ముందుకు.. ఇవాళ మహిళల కోసం ‘అభయం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇది ఒక యాప్ లేదా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ప్రాజెక్టు అనుకోవచ్చు. దిశ యాప్‌ను పోలీసు శాఖ నిర్వహిస్తుండగా అభయం యాప్ (ప్రాజెక్టు) రవాణా శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. అక్క చెల్లెమ్మలు, చిన్నారులు ఆటోలు, టాక్సీలలో నిర్భయంగా ప్రయాణించేందుకు, ప్రయాణ సమయంలో ఏ ఆపద రాకుండా చూసేలా అభయం ఐవోటీ ఉపకరణాన్ని ఆటో, టాక్సీల్లో అమరుస్తాం. ఆటోలు, టాక్సీలు నడిపే సోదరుల మీద నమ్మకం లేక ఇదంతా చేయడం లేదు. వారిపై ప్రయాణికులకు మరింత నమ్మకం కల్పించి నిశ్చింతంగా ఉండేందుకే ఈ ఏర్పాటు. ఏమిటీ ‘అభయం’?.. ఆటోలు, టాక్సీల్లో ఐవోటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) ఉపకరణాన్ని అమరుస్తారు. ఆటో / టాక్సీ ఎక్కిన వెంటనే అక్క చెల్లెమ్మలు స్మార్ట్ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే వెంటనే పూర్తి వివరాలు నమోదవుతాయి. ఏదైనా ఆపద సమయంలో వారివద్ద స్మార్ట్ ఫోన్ లేకుంటే రెడ్ బటన్ నొక్కితే పోలీసులు తక్షణమే అక్కడకు చేరుకుని ఆదుకుంటారు. క్యాబ్‌లకు ధీటుగా భద్రత... వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వతేదీ నాటికి 5 వేల వాహనాల్లో, జూలై 1 నాటికి 50 వేల వాహనాల్లో, నవంబరు నాటికి లక్ష వాహనాల్లో అభయం ఐవోటీ ఉపకరణాలను ఏర్పాటు చేస్తాం. తద్వారా ఉబెర్, ఓలా లాంటి బహుళ జాతి సంస్థల క్యాబ్‌లకు ధీటుగా ప్రయాణికులకు భద్రత కల్పిస్తున్నారనే విశ్వాసం కలుగుతుంది. ఇలా అందరికీ మేలు జరగాలని కోరుకుంటున్నా’’ సోదరుడిలా అండగా సీఎం – మేకతోటి సుచరిత, హోంమంత్రి ‘మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాలలు, మహిళల భద్రత కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో చర్యలు చేపట్టారు. దిశ చట్టం, సైబర్ మిత్ర, మహిళా మిత్రల ద్వారా భద్రత కల్పిస్తున్నారు. ఇప్పుడు అభయం ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఆంధ్రప్రదేశ్ అంటే మహిళలకు ఒక అభయ హస్తం మాదిరిగా, ఒక సోదరుడిలా అండగా నిలిచిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ ఎర్ర బటన్ నొక్కగానే ఇంధనం బంద్ అభయం ఐఓటీ ఉపకరణంలో రెడ్ బటన్ నొక్కగానే అలారమ్ మోగడంతోపాటు వాహనానికి ఇంధన సరఫరా నిల్చిపోతుందని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు వివరించారు. అభయం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రవాణా శాఖ కమిషనర్ పీఎస్ఆర్ ఆంజనేయులు, పోలీసు, రవాణా శాఖలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు పాల్గొనగా జిల్లాల అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. భద్రతపై నిశ్చింత.. అభయం పానిక్ బటన్‌పై మా కాలేజీలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇది చూసిన తర్వాత మాకు భద్రత ఉంటుందనే నమ్మకం కలిగింది. యాప్‌ను ఇప్పటికే సెల్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకున్నాం. – గమ్య, డిగ్రీ విద్యార్థిని, విశాఖపట్నం అలా చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు.. కార్యనిర్వాహక రాజధానిగా ఎంపికైన విశాఖ నుంచి అభయం ప్రాజెక్టు మొదలైంది. ఆర్నెల్లుగా పోలీసు కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశాం. దీనిద్వారా మహిళలు, బాలికలకు మరింత భద్రత ఉంటుంది. అభయం డివైజ్‌ను ఎవరైనా డ్రైవర్లు ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసి వాహనాన్ని సీజ్ చేస్తాం’ – జీసీ రాజారత్నం, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, విశాఖపట్నం -
మహిళలకు ‘అభయం’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ‘అభయం’ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును అమలు చేయనున్నాయి. ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణించే మహిళలకు అవాంఛనీయ ఘటనలు ఎదురైతే వారు ప్రయాణించే వాహనం ఎక్కడుందో తెలుసుకుని వెంటనే పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన ప్రాజెక్టు ఇది. రవాణాశాఖ పర్యవేక్షణలో అమలయ్యే ఈ ప్రాజెక్టును నేడు (సోమవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.138.48 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వం నిర్భయ స్కీం కింద 2015లో రాష్ట్రానికి రూ.80.09 కోట్లు కేటాయించింది. దీన్లో 58.64 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.55.39 కోట్లు కేటాయించాల్సి ఉంది. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును పర్యవేక్షించి టెండర్లను పరిశీలించింది. గతేడాది ‘యష్’ టెక్నాలజీస్ ఈ టెండరును దక్కించుకుంది. దశలవారీగా రాష్ట్రంలో లక్షరవాణా వాహనాలకు ట్రాకింగ్ డివైస్‌లు బిగించి వచ్చే ఏడాది నవంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అమలు చేయాలని రవాణాశాఖ లక్ష్యం పెట్టుకుంది. తొలిదశలో విశాఖపట్టణంలో వెయ్యి ఆటోల్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) పరికరాలు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత తిరుపతిలో అమలు చేస్తారు. ‘అభయం’ అమలు ఇలా.. – రవాణా వాహనాల్లో ట్రాకింగ్ డివైస్‌లు ఏర్పాటు చేస్తారు. – రవాణా వాహనాలకు దశలవారీగా ఐవోటీ బాక్సులు అమర్చాలి. – తొలుత వెయ్యి ఆటోల్లో సోమవారం ఈ పరికరాలు ఏర్పాటు చేస్తారు. వచ్చే ఫిబ్రవరి 1 నాటికి ఐదువేల వాహనాలు, జూలై 1కి 50 వేల వాహనాలు, వచ్చే ఏడాది నవంబరు 31కి లక్ష వాహనాల్లో ఈ పరికరాలు అమరుస్తారు. ప్రాజెక్టు నిర్వహణ 2025 వరకు ఉంటుంది. – ఆటోలు, క్యాబ్‌ల్లో ప్రయాణించే వారు తమ మొబైల్లో ‘అభయం’ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. వాహనంఎక్కేముందు వాహనానికి అంటించిన క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. – స్కాన్ చేయగానే డ్రైవరు ఫోటో, వాహనం వివరాలు మొబైల్‌కు వస్తాయి. – స్మార్ట్ ఫోన్ వినియోగించే మహిళలు తమ ప్రయాణంలో ఇబ్బందులు ఎదురైతే మొబైల్ యాప్ నుంచి సంబంధిత వాహనం నంబరు పంపితే వాహనం ఎక్కడుందో జీపీఎస్ ద్వారా తెలుసుకుని పట్టుకునేందుకు వీలుంటుంది. – స్మార్ట్ ఫోన్ లేని ప్రయాణికులు వాహనానికి బిగించిన ఐవోటీ పరికరంలోని ప్యానిక్ బటన్ నొక్కితే సమాచారం కమాండ్ కంట్రోల్ సెంటరుకు చేరుతుంది. క్యాబ్/ఆటో వెంటనే ఆగిపోతుంది. ఆ వెంటనే సమీపంలోని పోలీస్ అధికారులకు సమాచారం పంపి పట్టుకుంటారు. – ఐవోటీ ఆధారిత బాక్సుల్ని ఆటోలు, క్యాబ్‌లకు అమర్చాక డ్రైవర్ల లైసెన్సులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ టెక్నాలజీ (ఆర్ఎఫ్ఐడీ) కార్డులు ఇస్తారు. – ఆటోలు స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఆర్ఎఫ్ఐడీ లైసెన్సు కార్డులను ఇంజన్ల వద్ద అమర్చిన ఐవోటీ బాక్సుకు స్వైప్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది. -
ఫాస్టాగ్ ఉంటేనే ఫిట్నెస్ సర్టిఫికెట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని భారీ, చిన్నతరహా వాహనాలకు వచ్చే జనవరి 1నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2019 డిసెంబర్ నుంచి దేశ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఈటీసీ) విధానం అమలు చేయాలని నిర్ణయించినా సాధ్యపడలేదు. ఆ తర్వాత కోవిడ్ కారణంగా ఈ విధానం అమలు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో జనవరి 1నుంచి వాహనానికి ఫాస్టాగ్ ఉంటేనే ఫిట్నెస్ సర్టిఫికెట్ రెన్యువల్ చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింది. కేంద్ర మోటారు వాహన చట్టం–1989ను సవరించడం ద్వారా ప్రతి వాహనానికి ఫాస్టాగ్ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం వాహనం కొనుగోలు సమయంలోనే డీలర్లు ఫాస్టాగ్‌ను అందిస్తున్నారు. ఈ మేరకు గతంలోనే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2017 డిసెంబర్‌కు ముందు కొనుగోలు చేసిన వాహనాలకు కచ్చితంగా ఫాస్టాగ్ ఉండాలని కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయడంతో రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. 2021 ఏప్రిల్ 1 నుంచి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కోసం చెల్లుబాటయ్యే ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేసింది. డిసెంబర్ నెలాఖరు నాటికి ఫాస్టాగ్ స్టిక్కర్లు డిసెంబర్ నెలాఖరు నాటికి అన్ని వాహనాలకు ఫాస్టాగ్ స్టిక్కర్లు అతికించాలని నిర్ణయించారు. ఫాస్టాగ్ లేకపోతే వాహనానికి ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేయవద్దని రవాణా శాఖకు ఆదేశాలు అందాయి. ఏపీ పరిధిలోని జాతీయ రహదారులపై 42 చోట్ల టోల్‌ప్లాజాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు 75 శాతం ఫాస్టాగ్ లైన్లు, 25 శాతం డబ్బు చెల్లించేందుకు లైన్లు ఏర్పాటు చేశారు. ఇకపై మొత్తం ఫాస్టాగ్ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర రహదారులపైనా 16 చోట్ల టోల్‌ప్లాజాలు ఉన్నాయి. వీటిలోనూ ఫాస్టాగ్ లైన్లు ఏర్పాటు చేయాలని, ఇందుకు అవసరమైన ఖర్చును కేంద్రం 70 శాతం భరిస్తుందని గతంలోనే కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర రహదారులపై ఈటీసీ మార్గాలను ఏర్పాటు చేయనుంది. -
6 నెలల్లో 43,958 కేసులు
సాక్షి, అమరావతి: రహదారి భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ప్రమాదాల నివారణే లక్ష్యంగా పెట్టుకుంది. దీన్లో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై రాజీలేకుండా రవాణాశాఖ కేసులు నమోదు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి 43,958 కేసులు నమోదు చేసింది. ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు అత్యధికంగా విశాఖ జిల్లాలో 11,602, తరువాత శ్రీకాకుళం జిల్లాలో 6,772 కేసులు నమోదయ్యాయి. అతి తక్కువగా 242 కేసులు విజయనగరం జిల్లాలో నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారిపై 11,686 కేసులను నమోదు చేసింది. రోజుకు 8 గంటలకుపైగా పనిచేసిన డ్రైవర్ల మీద కూడా రవాణాశాఖ కేసులు నమోదు చేస్తోంది. పరిమితికి మించి ప్రయాణికుల్ని ఎక్కించుకోవడం, ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్ వాహనాలపైన కూడా భారీగా కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలను రాత్రి 8 గంటలకే మూసేయాలని ఆదేశించడంతో మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య తగ్గినట్లు అధికారవర్గాలు తెలిపాయి. -
కీచకుల్ని ఇట్టే పట్టేస్తారు
సాక్షి, అమరావతి: ఆటోలు, ట్యాక్సీల్లో ప్రయాణించే మహిళల రక్షణకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలోనే ఓ ప్రాజెక్ట్ అమల్లోకి రానుంది. పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రయోగాత్మకంగా విశాఖలో తొలుత వెయ్యి ఆటోలకు ట్రాకింగ్ డివైస్‌లు బిగించి.. ఆటోల్లో ప్యానిక్ బటన్లు అమరుస్తారు. ఈ నెలాఖరున రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం ఇందులో సాంకేతిక లోపాలు, ఇబ్బందులు ఏమైనా ఎదురైతే వాటిని సరిచేసి రాష్ట్రమంతటా ఈ విధానాన్ని అమల్లోకి తెస్తారు. ఈ ప్రాజెక్ట్ అమలుకు రూ.138 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసిన కేంద్ర ప్రభుత్వం 2015లోనే రాష్ట్రానికి రూ.80 కోట్లు కేటాయించింది. అయితే.. అప్పటి చంద్రబాబు సర్కారు ఈ ప్రాజెక్ట్ అమలుపై నాన్చివేత ధోరణి అవలంభించింది. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి సారించడంతో త్వరలోనే పట్టాలెక్కబోతోంది. ఇలా పని చేస్తుంది రవాణా వాహనాలకు దశల వారీగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) బాక్స్‌లు అమరుస్తారు. తద్వారా ఆ వాహనాలన్నీ రవాణా, పోలీస్ శాఖ కాల్ సెంటర్లు, కంట్రోల్ రూమ్‌లతో అనుసంధానం అవుతాయి. ఐఓటీ బాక్సుల్ని ఆటోలు, క్యాబ్‌లకు అమర్చాక డ్రైవర్ల లైసెన్సులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ టెక్నాలజీ (ఆర్ఎఫ్ఐడీ) కార్డులు ఇస్తారు. ఆ కార్డులను వాహనం ఇంజన్ వద్ద అమర్చిన ఐఓటీ బాక్సుకు స్వైప్ చేస్తేనే సదరు వాహనం స్టార్ట్ అవుతుంది. ప్రయాణంలో మహిళలు ఎవరైనా ఆపదలో చిక్కుకుంటే.. ప్యానిక్ బటన్ నొక్కితే సరిపోతుంది. సదరు వాహనం ఎక్కడ ఉందో తెలుసుకుని పోలీసులు ఇట్టే పట్టేస్తారు. వెనువెంటనే వాహనం వద్దకు చేరుకుని ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు క్షణాల్లోనే భద్రత కల్పించి అకృత్యాలకు అడ్డుకట్ట వేస్తారు. ప్రాజెక్ట్ అమలు ఇలా.. ఈ ఏడాది జనవరిలో రవాణా శాఖ ఓ యాప్‌ను రూపొందించింది. క్యాబ్‌లు, ట్యాక్సీలు, ఆటోల్లో ట్రాకింగ్ డివైస్‌లు ఏర్పాటు చేస్తారు. వాటిని అనుసంధానిస్తూ ప్రతి ఆటో, క్యాబ్‌లో ప్యానిక్ బటన్లు అమరుస్తారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) ద్వారా ఆ వాహనాలు ఎక్కడెక్కడ ప్రయాణిస్తున్నాయో తెలుసుకునే వీలు కలుగుతుంది. వాటిలో ప్రయాణించే మహిళలకు ఏదైనా ఆపద, అవాంఛనీయ ఘటనలు ఎదురైతే ప్యానిక్ బటన్ నొక్కితే.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఆధారంగా రవాణా శాఖ కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సమాచారం వెళుతుంది. ఆ తర్వాత మహిళలు, చిన్నారుల రక్షణకు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 112కు ఫిర్యాదు వెళుతుంది. ట్రాకింగ్ డివైస్‌లను ఆటో, క్యాబ్ ఇంధన ట్యాంకులతో అనుసంధానించడం వల్ల ఆపదలో అవి ఎక్కువ దూరం ప్రయాణించలేవు. -
పుంజుకుంటున్న వాహన రంగం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్–19 లాక్డౌన్ నేపథ్యంలో కుదేలైన వాహన రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కోవిడ్‌తో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వాహనాల కొనుగోళ్లు సగానికి సగం పడిపోయాయి. అన్‌లాక్ అమల్లోకి వచ్చాక రెండో త్రైమాసికంలో వాహనాల కొనుగోళ్లు జోరందుకున్నాయి. కోవిడ్–19 నేపథ్యంలో ప్రజా రవాణా కంటే వ్యక్తిగత వాహనాలే మిన్న అని ప్రజలు భావించడంతో మోటార్‌సైకిళ్లు, కార్ల కొనుగోళ్లు రెండో త్రైమాసికంలో బాగా పెరిగాయి. ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికం (ఏప్రిల్ నుంచి జూన్ వరకు)లో రవాణా రంగం ద్వారా రూ.781 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా లాక్‌డౌన్‌తో కేవలం రూ.367 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే.. సగానికి సగం వాహనాల కొనుగోళ్లు పడిపోయాయి. దీంతో ఆదాయం కూడా అదే స్థాయిలో తగ్గిపోయింది. రెండో త్రైమాసికంలో (జూలై నుంచి సెప్టెంబర్ వరకు) రవాణా రంగం ద్వారా రూ.728 కోట్లు రావాల్సి ఉండగా రూ.694 కోట్ల ఆదాయం వచ్చింది. తొలి త్రైమాసికంలో 50 శాతం తిరోగమనంలో ఉండగా రెండో త్రైమాసికంలో తిరోగమనం 30 శాతానికే పరిమితమైంది. ఇక నుంచి ఊపందుకుంటుంది తొలి త్రైమాసికంలో రవాణా రంగం ద్వారా సగానికిపైగా ఆదాయం పడిపోయినప్పటికీ రెండో త్రైమాసికంలో ఆదాయం సాధారణ స్థాయికి వచ్చింది. మిగతా రెండు త్రైమాసికాల్లో అనుకున్న మేరకు ఆదాయం వస్తుందని ఆశిస్తున్నాం. రెండో త్రైమాసికంలో వ్యక్తిగత వాహనాల కొనుగోళ్లు బాగా పెరిగాయి. పండుగల సీజన్ నేపథ్యంలో మరింత పెరుగుతాయని భావిస్తున్నాం. – ప్రసాదరావు, అదనపు కమిషనర్, రవాణా శాఖ -
వాహన సామర్థ్య పరీక్ష కేంద్రం నిర్మాణ బాధ్యతలు కేంద్రానికి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటయ్యే వాహనాల శాస్త్రీయ ఫిట్నెస్ పరీక్షా కేంద్రం (ఐ అండ్ సీ) నిర్మాణ బాధ్యతల్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ఈ కేంద్రం నిర్మాణంపై కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకోనుంది. విశాఖ నగర సమీపంలో గంభీరం వద్ద ఏర్పాటు చేయనున్న ఐ అండ్ సీ (ఇన్స్పెక్షన్ అండ్ సెంటర్) నిర్మాణానికి కేంద్రం గతంలోనే రూ.16.50 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం 25 ఎకరాల విలువైన భూమిని కేంద్రానికి అప్పగించింది. ఇందులో అధునాతన డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌తోపాటు వాహనం బ్రేక్ నుంచి హెడ్లైట్లు, కాలుష్య స్థాయిలు, స్టీరింగ్ సామర్థ్యం, టైర్లు, సీటింగ్ స్థానాలు వంటి ఇతర ముఖ్యమైన భాగాలను తనిఖీ చేయడానికి అత్యాధునిక సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఉన్న మాన్యువల్ మోటార్ వాహన ఫిట్నెస్ పరీక్షలు అవసరం లేకుండా చేస్తుంది. రాష్ట్ర విభజనతో ఏపీకి ఐ అండ్ సీ మంజూరు.. ► కేంద్ర ప్రభుత్వం సొంత నిధులతో ఐ అండ్ సీని మంజూరు చేసింది. గత ప్రభుత్వం దీని ఏర్పాటును పట్టించుకోలేదు. ► ఈ నెలలో సీఎం వైఎస్ జగన్‌తో శంకుస్థాపన చేయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ► నిర్మాణం తర్వాత ఈ కేంద్రాన్ని పుణెకు చెందిన ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) తొలి ఏడాది నిర్వహిస్తుంది. ఆ తర్వాత ఆర్టీఏ అధికారులకు అవసరమైన శిక్షణ ఇచ్చి రవాణా శాఖకు అప్పగిస్తుంది. ప్రస్తుతం ప్రతి రోజూ ఉత్తరాంధ్రలో దాదాపు 250 వాహనాలకు పైగా ఫిట్నెస్ పరీక్షలు మాన్యువల్‌గా నిర్వహిస్తున్నారు. ► నిబంధనల ప్రకారం రవాణా వాహనాలు ట్రక్కులు, క్యాబ్‌లు, పాఠశాల బస్సులు సంవత్సరానికి ఒకసారి ఫిట్నెస్ పరీక్ష చేయించుకోవాలి. ఈ సెంటర్లో కంప్యూటర్ ఆధారితంగా దాదాపు 30 నుంచి 40 ఫిట్నెస్ పరిమితుల్లో వాహనాల తనిఖీ జరుగుతుంది. ► పాఠశాల బస్సులు, భారీ రవాణా వాహనాలకు సరైన ఫిట్నెస్ లేని కారణంగా చాలావరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలను అరికట్టడంలో ఐ అండ్ సీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. -
రేపటి నుంచి ‘సచివాలయ’ ఉద్యోగ రాత పరీక్షలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆదివారం నుంచి రాతపరీక్షలు మొదలు కానున్నాయి. ఈసారి మొత్తం 16,208 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏడు రోజుల పాటు రోజుకు రెండేసి చొప్పున మొత్తం 14 రకాల రాతపరీక్షలను నిర్వహించనున్నారు. రోజూ ఉదయం పది గంటలకు, మధ్యాహ్నం రెండున్నర గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయి. కరోనా నేపథ్యంలో పరీక్ష రాసే అభ్యర్థులందరికీ థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తారు. ఉదయం పరీక్ష రాసేవారు 8 గంటల కల్లా, సాయంత్రం పరీక్ష రాసేవారు ఒంటి గంట కల్లా పరీక్ష కేంద్రం వద్ద రిపోర్ట్ చేయాలని అధికారులు తెలిపారు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి మించి ఒక్క నిమిషం లేటుగా వచ్చినా పరీక్ష హాల్లోకి అనుమతించబోమన్నారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉన్నప్పటికీ తెలుగు అనువాదం కూడా ఉంటుందని చెప్పారు. తప్పుగా గుర్తించిన జవాబులకు నెగిటివ్ మార్కులుంటాయన్నారు. పరీక్షల తర్వాత కూడా బస్సులు విజయవాడ, విశాఖపట్నంలలో శనివారం నుంచి సిటీ సర్వీసులు అందుబాటులోకి వస్తున్నట్లు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ ఎంటీ కృష్ణబాబు తెలిపారు. శుక్రవారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షల అనంతరం కూడా సిటీ బస్సులు నడుపుతామన్నారు. హాల్‌టికెట్‌లో ఫొటో స్పష్టంగా లేకుంటే.. ► మొత్తం 10,56,391 మంది పరీక్షలు రాస్తుండగా.. అందులో 6,81,664 మంది తొలిరోజునే పరీక్షకు హాజరవుతారు. శుక్రవారం సాయంత్రం వరకు 8,72,812 మంది హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. హాల్‌టికెట్‌లో ఫొటో స్పష్టంగా లేకున్నా, బ్లాక్ అయిన ఫొటో, చాలా చిన్న సైజులో ఫొటో, సంతకం లేని ఫొటో ఉంటే అభ్యర్థులు గెజిటెడ్ ఆఫీసర్‌తో సంతకం చేయించుకున్న మూడు ఫొటోలు వెంట తెచ్చుకోవాలి. హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు కూడా తప్పనిసరి. ► ఓఎంఆర్ షీట్లో బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో మాత్రమే జవాబులు నింపాల్సి ఉంటుంది. పెన్సిల్, ఇంక్ పెన్, జెల్ పెన్‌తో నింపకూడదు. ► కరోనా అనుమానిత లక్షణాలున్న వారు రాతపరీక్షకు హాజరయ్యేందుకు వీలుగా ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక ఐసోలేషన్ రూమును అధికారులు ఏర్పాటు చేశారు. ఈ రూముల్లో ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్లను అందజేస్తారు. ► అభ్యర్థులకు మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లు తప్పనిసరి. పరీక్ష సమయంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే పరీక్ష కేంద్రం అధికారుల దృష్టికి తెచ్చి ఐసోలేషన్ రూముకు వెళ్లాలి. -
ప్రైవేట్ బస్సుల్లో అధిక చార్జీలకు బ్రేకులు
సాక్షి, అమరావతి: ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు గత వారం రోజులుగా ప్రైవేట్ బస్సులు తిరుగుతున్నాయి. ప్రతి రోజూ 150 బస్సులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు వెళుతున్నాయి. ఈ బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగారు. తొలుత విజయవాడ–హైదరాబాద్ రూట్లో తనిఖీలకు శ్రీకారం చుట్టారు. ► టీఎస్ ఆర్టీసీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంతర్రాష్ట్ర ఒప్పందం విషయంలో వెనక్కు తగ్గేది లేదని తెగేసి చెబుతోంది. దీంతో ఆర్టీసీ బస్సులు తిప్పే అంశంపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ వివాదం కొనసాగుతుండటం ప్రైవేట్ ఆపరేటర్లకు కలిసొచ్చింది. ► ప్రతి రోజూ ఏపీ నుంచి హైదరాబాద్‌కు ప్రైవేటు బస్సుల్లో 4 వేల మంది వెళుతున్నారు. ప్రైవేట్ బస్సులే దిక్కు కావడంతో ప్రయాణికుల నుంచి అధిక రేట్లు వసూలు చేస్తున్నారు. ► హైదరాబాద్ నుంచి విజయవాడకు స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ.1,200 వరకు వసూలు చేస్తున్నారు. అదే ఆర్టీసీలో రూ.800. ► నాన్ ఏసీ టికెట్ ధర ఆర్టీసీలో రూ.400 వరకు ఉండగా, ప్రైవేట్ ఆపరేటర్లు రూ.700 నుంచి రూ.800 వరకు వసూలు చేస్తున్నారు. ► మరోవైపు ట్రావెల్స్ నిర్వాహకులు క్వార్టర్లీ ట్యాక్స్ చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు ప్రైవేట్ ట్రావెల్స్ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే బస్సులు నడపాలి. ప్రయాణికుల అవసరాలను అవకాశంగా తీసుకుని అధిక రేట్లు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. హైదరాబాద్–విజయవాడ రూట్లో తనిఖీలు చేపడుతున్నాం. – ప్రసాదరావు, రవాణా శాఖ అదనపు కమిషనర్ -
ఆ వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్
సాక్షి, అమరావతి: సుప్రీం ఉత్తర్వుల ప్రకారం ఈ ఏడాది మార్చి 31 నాటికి తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసుకున్న బీఎస్–4 వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ చేసేందుకు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల్లో టీఆర్ (టెంపరరీ రిజిస్ట్రేషన్) జరిగిన వాటికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ నెలాఖరులోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని రవాణా అధికారులు సూచించారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 30న పెండింగ్‌లో ఉన్న బీఎస్–4 వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. అయితే వీటిలో కొన్ని వాహనాలకు వాహన యజమాని సెకండ్ వెహికల్ ట్యాక్స్ కట్టాల్సి ఉంది. వీటి రిజిస్ట్రేషన్ కార్డు, ఈ వాహనాలపై ఇతర ట్రాన్సాక్షన్స్‌ను రవాణా అధికారులు నిలిపి ఉంచారు. మళ్లీ ఇప్పుడు టీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకుని శాశ్వత రిజిస్ట్రేషన్ లేని బీఎస్–4 వాహనాలకు ఈ నెలాఖరు వరకు అవకాశం కల్పించారు. ► సెకండ్ వెహికల్ ట్యాక్స్‌ను ్చpట్ట్చఛిజ్టీజ్డీ్ఛn. ్ఛpట్చజ్చ్టజిజీ.ౌటజ ద్వారా చెల్లించాలి. ► ట్యాక్స్ చెల్లించిన వెంటనే ఈ వివరాలు రవాణా అధికారులకు తెలియజేస్తే ఆ వాహనంపై పెట్టిన లాక్ రిలీజ్ చేసి రవాణా అధికారులు ఆర్సీ పంపుతారు. ► రవాణా శాఖ అన్ని రకాల సేవల్ని గ్రామ/వార్డు సచివాలయాల్లోనూ అందుబాటులోకి తెచ్చింది. -
ఆర్టీఏ: ఆన్లైన్లో మరో ఆరు సేవలు
సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖలో కొత్తగా మరో ఆరు సేవలను ఆన్‌లైన్‌తో అనుసంధానించారు. డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ, లైసెన్స్‌లో చిరునామా మార్పు, ప్రమాదకర వస్తువులు తరలించే వాహన లైసెన్స్ (హజార్డస్ లైసెన్స్) పొందటం, గడువు ముగిసిన లెర్నర్స్ లైసెన్స్ స్థానంలో కొత్తది తీసుకోవటం, వాహన కేటగిరీ మారినప్పుడు కొత్త లెర్నర్స్ లైసెన్స్ పొందటం, డ్రైవింగ్ లైసెన్స్ గడువు తీరిపోతే మళ్లీ లెర్నర్స్ లైసెన్స్ జారీ తదితర ఆరు సేవలను ఆన్‌లైన్‌తో అనుసంధానించారు. వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే కూర్చుని ఈ సేవలను పొందవచ్చని, ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. (కరోనా పిల్లల వార్డుల్లోకి తల్లిదండ్రులకు అనుమతి) జూన్ 24న, డూప్లికేట్ లెర్నర్ లైసెన్స్, పాత లైసెన్స్ కార్డు స్థానంలో స్మార్ట్‌కార్డు పొందటం, లైసెన్స్ హిస్టరీ షీట్ పొందే సేవలను ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏజెంట్ల ప్రమేయం లేకుండా, గంటల తరబడి కార్యాలయాల్లో ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా వివిధ సేవలను ఆన్లైన్ ద్వారా పొందేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. దీనికి మంచి స్పందన వస్తోందని, సేవలను మరింత సులభతరం చేసేందుకు రవాణా శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. గతంలో ఐదు సేవలు ఆన్లైన్ ద్వారా అందు బాటులో ఉండేవని, ఇప్పుడు వాటికి అదనంగా మరో ఆరు సేవలను చేర్చామని రవాణా శాఖ కమిషనర్ ఎంఆర్ఎం రావు పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా వాహనదారులు జాప్యం లేకుండా సేవలు పొందే వీలు కలుగుతుందని తెలిపారు. (ప్రత్యేక రైళ్లకు అన్‌లాక్) -
మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి అరెస్ట్
అనంతపురం క్రైం: జేసీ బ్రదర్స్ దివాకర్ ట్రావెల్స్ ముసుగులో పాల్పడ్డ అక్రమాలకు సంబంధించి శనివారం తెల్లవారుజామున అనంతపురం పోలీసులు హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డిలను అరెస్ట్ చేశారు. అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు రెండు బృందాలుగా వెళ్లి వారిని హైదరాబాద్ నుంచి అనంతపురానికి తీసుకొచ్చారు. ► దివాకర్ రోడ్ లైన్స్‌కు చెందిన రెండు బస్సులకు నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్లు సమర్పించి, విక్రయించారని ఉప రవాణా శాఖాధికారి ఇటీవల వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ► ఈ కేసులో ఏ1గా జేసీ ఉమారెడ్డి (జేసీ ప్రభాకర్ రెడ్డి సతీమణి), ఏ2గా జేసీ ప్రభాకర్ రెడ్డి, ఏ3గా నాగేంద్ర, ఏ4గా బాబయ్య, ఏ5గా జేసీ విజయ (జేసీ దివాకర్ రెడ్డి సతీమణి), ఏ6గా జేసీ అస్మిత్ రెడ్డిలపై 420, 467, 468, 471, 472, 120బీ, 201, ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ► జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డిలకు అనంతపురం సర్వజనాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ► ఏ3 నాగేంద్ర, ఏ4 బాబయ్య ఇప్పటికే రిమాండ్‌లో ఉన్నారు. ఏ1 జేసీ ఉమారెడ్డి, ఏ5 జేసీ విజయలను అరెస్టు చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా దివాకర్ ట్రావెల్స్‌పై అనంతపురం వన్‌టౌన్‌లో 8, తాడిపత్రిలో 16 కేసులు, నకిలీ సర్టిఫికెట్లకు సంబంధించి ఒక కేసు నమోదైంది. ► అనంతపురం వన్‌టౌన్‌లో నమోదైన కేసుల్లో కొన్నింటికి ముందస్తు బెయిల్ లభించింది. ప్రస్తుతం ఒక కేసు విషయంలో వీరిని రిమాండ్‌కు తరలించారు. మరో కేసుపై నేడో రేపో పీటీ వారెంట్ నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ► ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలను పోలీసులు రెడ్డిపల్లి సబ్ జైలుకు తరలించారు. అయితే అక్కడ కరోనా పాజిటివ్ కేసులు ఉండటంతో తిరిగి అనంతపురం తీసుకువచ్చారు. -
ఈ సంవత్సరమూ ‘వైఎస్సార్ వాహన మిత్ర’
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అమలుచేసిన తొలి పథకం ‘వైఎస్సార్ వాహన మిత్ర’ కింద అందించిన ఆర్థిక సాయాన్ని ఈ ఏడాది కూడా ఇచ్చేందుకు రంగం సిద్ధంచేసింది. ఇందులో భాగంగా.. సొంతంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌లున్న డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. జూన్ 4న సీఎం వైఎస్ జగన్ ఈ పథకం కింద ఆన్లైన్ చెల్లింపులు చేయనున్నట్లు వెల్లడించారు. విజయవాడలోని రవాణా శాఖ కమిషనరేట్‌లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు ఈ నెల 18 నుంచి 26వ తేదీలోగా తమ దరఖాస్తులను గ్రామ/వార్డు సచివాలయాల్లో అందించాలన్నారు. జూన్ 1వ తేదీలోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తామన్నారు. గత ఏడాది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, వారికి కేవలం సోషల్ ఆడిట్ మాత్రమే జరుగుతుందన్నారు. ఈ ఏడాది మే 17 వరకు రవాణా శాఖలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆటో/ట్యాక్సీ/మ్యాక్సీ క్యాబ్‌ల యజమాని కమ్ డ్రైవర్లు ఈ పథకానికి అర్హులని మంత్రి చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► ఆర్టీసీలో ఒక్క ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని కూడా తొలగించలేదు. తొలగించినట్లు ఆధారాలు ఉంటే చూపించాలి. లేదంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ► ప్రజా రవాణాపై సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకుంటారు. ఆయన నుంచి ఆదేశాలు రాగానే 24 గంటల్లో బస్సు సర్వీసులను పునఃప్రారంభించేందుకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ► కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతి ప్రయాణికుడు మాస్క్ ధరించాలి. విధిగా శానిటైజర్లు వాడాలి. అలాగే, భౌతిక దూరం పాటించాలి. ► బస్సుల్లో నగదు రహిత కార్యకలాపాల్ని నిర్వహించేందుకు కండక్టరు లేకుండా సర్వీసులు తిప్పుతాం. ► ముందుగా విజయవాడ, విశాఖల్లో ప్రయోగాత్మకంగా అమలుచేసి ఆ తర్వాత రాష్ట్రం మొత్తం అమలుచేస్తాం. గత లబ్ధిదారుల్లో అధిక సంఖ్యలో బీసీలే.. కాగా, ఈ పథకం కింద గత ఏడాది ఎంపికైన మొత్తం 2,36,334 మంది లబ్ధిదారుల్లో 54,485 మంది ఎస్సీలు, 1,05,932 మంది బీసీలు, 13,091 మంది ఓసీలు, 27,107 మంది కాపులు.. 8,762 మంది ఎస్టీలు.. 25,517 మంది మైనార్టీలు.. 509 బ్రాహ్మణ, 931 మంది క్రైస్తవులు ఉన్నారు. -
రాష్ట్ర సరిహద్దులు మూత
సాక్షి, అమరావతి: ఆంధప్రదేశ్‌లో కరోనా వైరస్ వాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రాష్ట్ర సరిహద్దులను మంగళవారం నుంచి మూసివేశారు. తెలంగాణ సరిహద్దు (బోర్డర్)తో పాటు తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలతో సంబంధం ఉన్న అన్ని మార్గాలు దిగ్బంధించారు. సరిహద్దుల వద్ద పోలీసులు గస్తీ కాస్తున్నారు. అత్యవసర వాహనాలు మినహా వేటినీ అనుమతించడం లేదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రజా, ప్రైవేట్ రవాణాను నిలిపివేసిన సంగతి తెల్సిందే. మూడు రోజుల క్రితమే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ప్రజా రవాణాను ఆపేసి సరిహద్దులు మూసివేశాయి. ఇప్పటికే రాష్ట్రంలో ప్రజారవాణా నిలిపివేసినప్పటికీ సొంత వాహనదారులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘించడంతో పోలీసులు మంగళవారం నుంచి మరిన్ని కఠిన చర్యలు చేపట్టారు. - రాష్ట్ర సరిహద్దుల్లో, రహదారుల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆంక్షలు ధిక్కరించి వస్తున్న వాహనదారులకు కరోనా తీవ్రతను వివరిస్తూ పోలీసులు, రవాణా శాఖ అధికారులు నచ్చజెప్పడంతో వారు వెనుదిరుగుతున్నారు. కొన్ని చోట్ల పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. - విజయవాడ రామవరప్పాడు రింగ్‌రోడ్ వద్ద ఆంక్షలు ఉన్నా ఓ వాహనదారుడు వేగంగా వచ్చి కానిస్టేబుల్‌ను ఢీకొట్టడంపై డీజీపీ సవాంగ్ సీరియస్‌గా స్పందించారు. జరిగిన ఘటనపై వివరాలు సేకరించాలని స్థానిక పోలీసు అధికారులను ఆదేశించారు. - కోదాడ, భద్రాచలం, నాగార్జున సాగర్లతో పాటు అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఇరువైపులా వాహనాలను నిలిపివేస్తున్నారు. - సరుకు రవాణా వాహనాల డ్రైవర్లకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన అనంతరం ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతించాలనే ప్రతిపాదనను పోలీసులు పరిశీలిస్తున్నారు. - పాలు, కూరగాయలు, ఔషధాలు వంటి నిత్యవసర సరుకులు సరఫరా చేసే వాహనాలనే అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు. -
తిమ్మిని బమ్మిని 'జేసీ'..
సాక్షి, అమరావతి: అక్రమ ‘మార్గాల్లో’ దోచేయడంలో టీడీపీ నేతలైన జేసీ బ్రదర్స్‌ను మించిన వారు లేరని మరోమారు నిరూపితమైంది. పర్మిట్లు లేకుండా బస్సులు తిప్పినా.. ఫోర్జరీ పత్రాలతో లారీలు, బస్సులను విక్రయించినా తమకు అడ్డే లేదన్నట్లు వ్యవహరించారు. ఈ అక్రమాలను మించి రవాణా శాఖ నివ్వెరపోయేలా మరో అక్రమ బాగోతం బయటపడింది. కాలం చెల్లిన అమ్మకూడని లారీలను తయారీ సంస్థ స్క్రాప్ (తుక్కు) కింద అమ్మేస్తే.. వాటిని దక్కించుకుని ఏకంగా నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్లు చేయించుకుని యథేచ్ఛగా దేశవ్యాప్తంగా తిప్పుతూ దోపిడీ చేస్తున్నారు. ఈ వ్యవహారం రవాణా శాఖ విచారణలో తేలింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 70 లారీలను ఇలా అక్రమ మార్గాల్లో తిప్పుతుండటంపై అధికార వర్గాలే నిర్ఘాంతపోతున్నాయి. నేషనల్ ఫ్రాడ్‌గా ఈ వ్యవహారాన్ని రవాణా శాఖ పేర్కొనడం గమనార్హం. సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేసి మరీ.. కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని బీఎస్–3 వాహనాలను నిషేధిస్తూ 2017లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుతో వాహన కంపెనీలు ఆ వాహనాల అమ్మకాలను నిలిపేశాయి. 2017లో చంద్రబాబు జమానాలో జేసీ బ్రదర్స్ 70 బీఎస్–3 వాహనాలను దక్కించుకుని నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేయించారు. సాధారణంగా నాగాలాండ్ రిజిస్ట్రేషన్ అంటేనే రవాణా శాఖకు అనుమానాలు తలెత్తాలి. కానీ అధికారం అండ ఉండటంతో అప్పట్లో రవాణా శాఖ అధికారులు పట్టించుకోలేదు. దీంతో జేసీ బ్రదర్స్ ఆ కాలం చెల్లిన లారీలను అప్పటి నుంచి సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా రోడ్లపై తిప్పుతున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగారు. లారీల ఛాసిస్, ఇంజన్ వివరాలను అశోక్ లేలాండ్ కంపెనీ ప్రతినిధులకు మెయిల్ చేశారు. ఈ లారీలను తాము స్క్రాప్ కింద అమ్మేశామని కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు. రవాణా శాఖ అధికారుల బృందం కొన్ని రోజుల క్రితం నాగాలాండ్‌కు వెళ్లింది. నిషేధించిన లారీల రిజిస్ట్రేషన్‌కు జేసీ బ్రదర్స్ బినామీలు ఏ పత్రాలు సమర్పించారని అక్కడి రవాణా అధికారులను అడగ్గా, వారు కొన్ని రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వివరాలను అందజేశారు. వాటిని పరిశీలించిన రవాణా అధికారుల బృందం జేసీ బ్రదర్స్ నిషేధిత వాహనాలను తిప్పుతున్నారని నిర్ధారించింది. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించిన వైనంపై క్రిమినల్ కేసుల్ని నమోదు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ అక్రమ బాగోతంలో జేసీ బ్రదర్స్ బినామీ సంస్థ.. జటాధర ఇండస్ట్రీస్, జేసీ అనుచరుడు గోపాలరెడ్డి ఉన్నట్లు తేలింది. దీంతో 70 లారీలను సీజ్ చేయనున్నారు. వీటిలో 43 లారీలు అనంతపురం ప్రాంతంలో.. మరో 27 లారీలు బెంగళూరులో ఉన్నట్లు రవాణా అధికారులు గుర్తించారు. ఫోర్జరీ పత్రాలతో రెండు బస్సుల విక్రయం నకిలీ పత్రాలతో, పోలీసుల ఫోర్జరీ సంతకాలతో నిరభ్యంతరాల పత్రాలు చూపి ఆరు లారీలను బెంగళూరులో విక్రయించిన వైనంపై అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసులు కేసులు నమోదు చేసి జేసీ ట్రావెల్స్ ఉద్యోగులు ఇద్దరిని గురువారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారమంతా దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం కనుసన్నల్లోనే సాగినట్టు వారిద్దరూ పోలీసుల విచారణలో వెల్లడించారు. లారీలనే కాకుండా రెండు బస్సులను కూడా ఇదే విధంగా అమ్మినట్లు అధికారులు గుర్తించారు. దీనిపైనా కేసు నమోదు చేశారు. జేసీ బ్రదర్స్ అక్రమాలకు రవాణా శాఖలో కొందరు మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు ఊతమిచ్చారన్న విమర్శలున్నాయి. వీరిపైనా చర్యలు తీసుకునేందుకు రవాణా శాఖ ఉన్నతాధికారులు సన్నద్ధమయ్యారు. -
రేపటి నుంచి ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులే
సాక్షి, అమరావతి: జనవరి 1 నుంచి ఆర్టీసీ కార్మికులందరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులేనని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ ఇప్పటికే రూ.6,400 కోట్ల మేరకు నష్టాల్లో ఉందన్నారు. దీనికితోడు ఏటా రూ.3,600 కోట్ల భారాన్ని ప్రభుత్వం తన భుజాన వేసుకుందని చెప్పారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నాని మీడియాతో మాట్లాడారు. 54 వేల ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందరూ జేజేలు పలకాలని కోరారు. సీఎం తీసుకున్న నిర్ణయం దేశంలోనే ఒక చరిత్రాత్మక సంఘటనగా నిలిచిపోతుందన్నారు. సంక్రాంతికి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి వచ్చే వారి నుంచి ప్రైవేటు ట్రావెల్స్ రెండు, మూడు రెట్లు అధికంగా చార్జీలు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికొచ్చిందని.. ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా అధికంగా చార్జీలు వసూలు చేస్తే 8309887955 నంబర్‌కు వాట్సాప్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. చంద్రబాబు మాటలే జర్నలిస్టులపై దాడికి కారణం రాజధాని ప్రాంతంలో మహిళా జర్నలిస్టు దీప్తి, మరికొందరిపై దాడి చేస్తే జర్నలిస్టు సంఘాలు ఎందుకు స్పందించలేదని మంత్రి నాని ప్రశ్నించారు. అక్రెడిటేషన్ కార్డుల కోసం బయలుదేరే జర్నలిస్టు సంఘాలు, యూనియన్లు.. హరీష్ (ఎన్టీవీ), వసంత్ (మహాటీవీ), కెమెరామెన్లు, డ్రైవర్లపై దాడి జరిగితే ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. దాడికి గురైన జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంటికి వెళ్లి చంద్రబాబు ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పిన మాటలే ఇలాంటి సంఘటనలకు కారణమని ధ్వజమెత్తారు. టీవీ9 ఇటీవల వరకూ వారు చెప్పినట్లు వార్తలు ఇచ్చిందని.. ఇప్పుడు అలా చేయడం లేదనే అక్కసుతోనే దాడి చేశారన్నారు. తమపై రోజూ విషం చిమ్మే ఏబీఎన్, టీవీ5 చానెళ్లను ఏనాడైనా వైఎస్సార్సీపీ కార్యకర్తలు ముట్టుకున్నారా? అని ప్రశ్నించారు. సుజనా చౌదరి భారతీయ తెలుగుదేశం పార్టీకి చెందిన వారని.. ఆయన మాటలు టీడీపీవేనని.. అందువల్ల ఆయన చెప్పే మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇక పవన్ నాయుడు ఎవరి కోసం పని చేస్తారో అందరికీ తెలిసిందేనని చెప్పారు. 51,488 మంది ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ధి జనవరి 1 నుంచి ఆర్టీసీ సిబ్బంది ప్రజా రవాణా ఉద్యోగులుగా మారనున్నారు. దేశంలో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ మినహాయించి ఏ రాష్ట్రంలోనూ ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల ఆ సంస్థలో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న 51,488 మందికి లబ్ధి చేకూరనుంది. ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ప్రజా రవాణా శాఖలో విలీనమైన వెంటనే చెల్లించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. విలీనంతో ఆర్టీసీ ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలు.. - సంస్థకు ఆర్థిక భద్రత చేకూరడం వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఉద్యోగ భద్రత ఉంటుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందుతాయి. - ఆర్టీసీ లాభనష్టాలతో సిబ్బందికి సంబంధం ఉండదు. పదవీ విరమణ వయసు 60 ఏళ్లుగా ఉంటుంది. - కార్మికులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను రెండేళ్లలో చెల్లిస్తారు. చంద్రబాబు హయాంలో ఆర్టీసీ ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కింద రూ.47 కోట్ల మేర బాండ్లు ఇచ్చారు. ఆ బాండ్లకు నగదు చెల్లిస్తారు. - ఆర్టీసీ సిబ్బందిపై అనవసర ఒత్తిళ్లు ఉండవు.. అధికారుల పెత్తనం తగ్గుతుంది. పనిష్మెంట్లు ఇష్టారీతిన ఇచ్చేందుకు కుదరదు. ప్రజా రవాణా శాఖ ఏర్పాటు రవాణా, ఆర్ అండ్ బీ పరిపాలన నియంత్రణలోనే పీటీడీ శాఖ రవాణా, ఆర్ అండ్ బీ పరిపాలన నియంత్రణలో ప్రజా రవాణా శాఖ (పీటీడీ)ను ఏర్పాటు చేస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రజా రవాణా శాఖ ఏర్పాటైంది. ఆర్టీసీ విలీనంపై రిటైర్డ్ ఐపీఎస్ ఆంజనేయరెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ సెప్టెంబర్‌లో ప్రభుత్వానికి నివేదిక అందించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పీటీడీ ఏర్పాటుపై కార్యదర్శుల కమిటీ కొన్ని సూచనలు చేసింది. పిదప ఆర్టీసీ బోర్డు కూడా విలీనాన్ని ఆమోదించింది. దీంతో జనవరి 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం కానున్నారు. ఫిబ్రవరి 1న వీరికి ప్రభుత్వమే వేతనాలు చెల్లించనుంది. కార్యదర్శుల కమిటీ ఇచ్చిన నివేదికపై ఆర్థిక శాఖ చర్యలు చేపట్టనుంది. ప్రజా రవాణా శాఖ ఉద్యోగులుగా మారిన ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల చెల్లింపులు ఏపీసీఎఫ్ఎంఎస్ (ఆంధ్రప్రదేశ్ కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం) ద్వారా జరుగుతాయి. వేతన సవరణ అమలు చేసే వరకు ప్రస్తుతం ఆర్టీసీలో కొనసాగుతున్న అలవెన్సులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కార్యదర్శుల కమిటీ ప్రతిపాదించిన పే స్కేల్స్‌ను వేతన సవరణ కమిటీకి నివేదించి అనుమతి తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పీటీడీ వ్యవస్థాగత నిర్మాణం ఇలా.. రవాణా శాఖ మంత్రి.. ప్రజా రవాణా శాఖ మంత్రిగా, రవాణా, ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి.. ప్రిన్సిపల్ సెక్రటరీగా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కమిషనర్/డైరెక్టర్‌గా.. ఏపీఎస్ఆర్టీసీ ఎండీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రధాన కార్యాలయంలో ఈడీలు అదనపు కమిషనర్లుగా, రీజినల్ మేనేజర్లు జాయింట్ కమిషనర్లుగా, డివిజనల్ మేనేజర్లు డిప్యూటీ కమిషనర్లుగా, డిపో మేనేజర్లు అసిస్టెంట్ కమిషనర్లుగా వ్యవహరిస్తారు. జోనల్/రీజియన్లలో ఉండే ఈడీలు, ఆర్ఎంలు, డీవీఎంలు, డీఎంలకు ఇవే హోదాలు వర్తిస్తాయి. వీరు జిల్లాల్లో ఉంటారు. -
రోడ్డు ప్రమాదాలకు.. డెమో కారిడార్లతో చెక్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కళ్లెం వేసేందుకు అన్ని జిల్లాల్లో డెమో కారిడార్లు ఏర్పాటుచేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. 2020 నాటికి ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించాలంటే ఈ కారిడార్ల నిర్మాణం ఒక్కటే మార్గమని అభిప్రాయపడింది. దీంతో రహదారులు, భవనాల శాఖ సహకారంతో వీటిని చేపట్టాలని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. మొత్తం 13 జిల్లాల్లో వెయ్యి కిలోమీటర్ల మేర వీటిని ఏర్పాటుచేసేందుకు అధ్యయనం చేయాలని ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానించింది. రెండు నెలల్లో ఇందుకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని రోడ్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సూచించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఈ కారిడార్లు ఏర్పాటుచేయాలనే అంశంపై రవాణా, ఆర్ అండ్ బీ శాఖలు సంయుక్తంగా నివేదిక రూపొందిస్తాయి. ఏ జిల్లాల్లో ఏ రహదారిపై అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయో.. ఈ నివేదికలో పొందుపర్చాలని ఆయా జిల్లాల్లో రోడ్ సేఫ్టీ కమిటీలకు చైర్మన్లుగా వ్యవహరిస్తున్న కలెక్టర్లను రవాణా శాఖ కోరింది. మరో నాలుగుచోట్ల కూడా.. కడప, అనంతపురం జిల్లాలకు మరో డెమో కారిడార్‌ను ప్రతిపాదించారు. దీనిని రాజంపేట–రాయచోటి–కదిరి మధ్య ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అలాగే, అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న గుంటూరు జిల్లా కొండమోడు–పేరేచర్ల.. కృష్ణా జిల్లా విజయవాడ–పునాదిపాడు, నూజివీడు–పశ్చిమగోదావరిలోని భీమవరం వరకు కూడా ప్రతిపాదించారు. వీటితోపాటు ఇతర ప్రమాదకర రహదార్లను గుర్తించి ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రతిపాదనలు పంపించాలని రవాణా శాఖ ఇప్పటికే కోరింది. డెమో కారిడార్ అంటే.. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ఓ రహదారిని ఎంచుకుని ఆ రహదారిని మలుపులు లేకుండా నిర్మిస్తారు. ఈ రహదారిపై సైన్ బోర్డులు ఏర్పాటుచేస్తారు. బ్లాక్ స్పాట్లు, రహదారిలో గుంతలు ఎక్కడా లేకుండా చూస్తారు. ఈ రహదారిపై నిర్దేశించే బరువున్న వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. ఇందుకోసం ఆ మార్గంలో కాటా యంత్రాలను ఏర్పాటుచేస్తారు. ప్రమాదానికి గురైతే వెంటనే ఆస్పత్రికి చేర్చేలా అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచుతారు. రేణిగుంట– రాయలచెరువు కారిడార్‌తో సత్ఫలితాలు 2012లో రేణిగుంట–రాయలచెరువు మధ్య 139 కి.మీ.మేర డెమో కారిడార్ ఏర్పాటుచేసేందుకు ప్రపంచ బ్యాంకు రూ.36 కోట్లు అందించింది. 2013లో ఈ రహదారిలో రోడ్డు ప్రమాదాలు 250 నమోదయ్యాయి. కారిడార్ ఏర్పాటుతో 2015 నాటికి ఇవి సగానికి తగ్గాయి. 2017లో వంద వరకు నమోదు కాగా.. 2018 నాటికి పదుల సంఖ్యలోకి వచ్చాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి కిలోమీటర్ల మేర వీటిని ఏర్పాటుచేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఒక్కో కారిడార్‌కు రూ.30 కోట్లకు పైగా వెచ్చించనుంది. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యం రోడ్ సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. 2020 నాటికి 15 శాతం రోడ్డు ప్రమాదాలను తగ్గిస్తాం. అన్ని జిల్లాల్లో కలిపి వెయ్యి కిలోమీటర్ల వరకు డెమో కారిడార్ల నిర్మాణం చేపట్టాలని రోడ్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో నిర్ణయించాం. ఆర్అండ్బీ శాఖ సహకారంతో డెమో కారిడార్లను నిర్మిస్తాం. –పీఎస్సార్ ఆంజనేయులు, రవాణా శాఖ కమిషనర్ -
ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల పథకం ‘వైఎస్సార్ వాహన మిత్ర’
సాక్షి, అమరావతి: ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయానికి ‘వైఎస్సార్ వాహన మిత్ర’గా నామకరణం చేసినట్లు రవాణా శాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. ఈ పథకం డ్రైవర్ల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. అక్టోబర్ 5న లబ్ధిదారులకు నేరుగా చెల్లింపుల రశీదులు అందిస్తామని చెప్పారు. సొంతంగా ఆటోలు, ట్యాక్సీలు నడుపుకునే డ్రైవర్లకు అందించే రూ.10 వేలు వాహన బీమా, ఫిట్నెస్, మరమ్మతులకు ఉపయోగపడతాయన్నారు. బుధవారం అర్ధరాత్రితో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసిం దని.. ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా మొత్తం 1.83 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ దరఖాస్తుల్ని గ్రామ/వార్డు వలంటీర్లకు పంపించామని ఇప్పటి వరకు 74 వేల దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని చెప్పారు. ఈ నెల 30 వరకు దరఖాస్తులపై పరిశీలన జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో అందిన దరఖాస్తుల్ని ఎంపీడీవోలు, పట్టణాలు, నగరాల్లో మున్సిపల్ కమిషనర్లు 45,223 దరఖాస్తుల్ని ఆమోదించారన్నారు. 17,230 దరఖా స్తులకు కలెక్టర్లు మంజూరు అనుమతులిచ్చారని వివరించారు. అధికంగా విశాఖపట్నం, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల నుంచి దరఖాస్తులు అందాయన్నారు. అక్టోబర్ 5న అర్హులైన డ్రైవర్లకు నగదు చెల్లింపుల రశీదులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సందేశంతో కూడిన పత్రాన్ని గ్రామ/వార్డు వలంటీర్లు అందిస్తారని చెప్పారు. -
రూ.10 వేల సాయం.. 12నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు
సాక్షి, అమరావతి: సొంతంగా ఆటో, టాక్సీ నడుపుకుంటున్న వారికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏడాదికి రూ.10 వేల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు గాను ఈ నెల 12వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి తిరుమల కృష్ణబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 10 నుంచే ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టాలని అనుకున్నామన్నారు. కానీ మార్గదర్శకాలు సరళతరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. లేనిపోని నిబంధనలతో పథకాన్ని నిరాకరించే విధంగా, విసుగు తెప్పించే విధంగా ఉండకూడదని స్పష్టం చేశారని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు మార్గదర్శకాలను సరళీకరిస్తున్నామన్నారు. మార్గదర్శకాలన్నింటిని మీడియా ద్వారా వెల్లడించిన తర్వాత ఈ నెల 12న ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంచుతామని కృష్ణబాబు తెలిపారు. -
రూ. 10 వేల సాయంపై విధి విధానాలు జారీ
సాక్షి, అమరావతి: ఆటో రిక్షాలు, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ. 10 వేల ఆర్థిక సాయంపై విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జారీ చేసింది. నేటి (మంగళవారం) నుంచి అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్లు, ప్రాంతీయ రవాణా అధికారులు, మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. అర్హులైన డ్రైవర్లు తమ వాహనం, లైసెన్సుతో ఆధార్‌ను లింక్ చేసుకోవాలి. రవాణా శాఖ వెబ్సైట్ డేటాబేస్‌లో ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. 15 రోజుల్లోగా నిర్ధిష్టమైన (అన్ ఎన్కంబర్డ్) ఖాతాను తెరవాలి. ఈ ఖాతాను తెరిచేందుకు లబ్ధిదారుడికి గ్రామ/వార్డు వలంటీర్ సాయపడతాడు. ఒక వ్యక్తికి, ఒక వాహనానికి మాత్రమే ఈ సాయం వర్తిస్తుంది. దరఖాస్తులు ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి గ్రామ సచివాలయం/మున్సిపాలిటీలు/నగర కార్పొరేషన్లకు వెళతాయి. అర్బన్ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవో పర్యవేక్షణలో దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. అనంతరం కలెక్టరు అనుమతి తీసుకుని సీఎఫ్ఎంఎస్ డేటాబేస్ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. ఈ వివరాల ఆధారంగా రవాణా శాఖ కమిషనర్ లబ్ధిదారులకు సమగ్ర బిల్లు అందించేందుకు అనుమతిస్తారు. గ్రామ/వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఇంటింటికీ రూ. పది వేల చెల్లింపు రశీదులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సందేశంతో కూడిన పత్రాన్ని అందిస్తారు. కాగా, దరఖాస్తులు చేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్ల పరిశీలన కోసం రవాణా, ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రూ. పది వేల సాయానికి అర్హతలివే.. - ఆటో రిక్షా/ట్యాక్సీ/మ్యాక్సీ క్యాబ్ సొంతదై ఉండి, సొంతగా నడుపుకోవాలి. - ఆటో రిక్షా/లైట్ మోటారు వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి. - సంబంధిత వాహనానికి రికార్డులు (రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, పన్నుల రశీదులు) సరిగా ఉండాలి. - అర్హుడు దారిద్య్ర రేఖకు దిగువన/తెల్లరేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు కలిగి ఉండాలి. - దరఖాస్తు చేసుకునే సమయానికి వాహనం లబ్ధిదారుడి పేరిట ఉండాలి. -
ఆర్టీఏ కార్డుల జారీలో జాప్యాన్ని నివారించాలి
సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖ కార్యాలయాల్లో లైసెన్స్, రిజిస్ట్రేషన్ కార్డుల జారీలో నెలకొన్న జాప్యాన్ని పక్షం రోజుల్లో నివారించాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సమస్య తీవ్రంగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మంచిర్యాల జిల్లాల కార్యాలయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.30 లక్షల కార్డుల జారీ పెండింగ్‌లో పడిన నేపథ్యంలో వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం ఆయన రవాణా శాఖ అధికారులతో సమీక్షించారు. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, జేటీసీలు రమేశ్, పాండురంగ నాయక్, ఇతర అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సంబంధిత కాంట్రాక్టర్ ఆ కార్డుల జారీకి కావాల్సిన రిబ్బన్లను సరఫరా చేయకపోవటంతో సమస్య తలెత్తిందని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. సమస్య తీవ్రంగా ఉన్న నాలుగు జిల్లాల కార్యాలయాలకు మూడు రోజుల్లో కార్డుల జారీకి కావాల్సిన సరంజామాను సరఫరా చే యాలని మంత్రి ఆదేశించారు. పక్షం రోజు ల్లో ఆ నాలుగు జిల్లాల్లో పెండింగ్‌ను క్లియర్ చేయాలని తెలిపారు. సాధారణ ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేకంగా ఓ వ్యక్తిని కేటాయించి ఓ ల్యాండ్ లైన్ నంబరు, వాట్సాప్ నంబర్, ఈమెయిల్ ఐడీ కేటాయించాలని సూచించారు. ఆన్లైన్ సేవల పరిశీలనకు కమిటీ.. ప్రస్తుతం రవాణా శాఖ అందిస్తున్న ఆన్లైన్ సేవల తీరును పరిశీలించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆర్టీఏ మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తేవాలని తెలిపారు.కమిషనర్ అధ్యక్షతన ఏర్పడే ఈ కమిటీ పక్షం రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించారు. అనంతరం ఆయన కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. -
రోడ్డు ప్రమాదాలు అడ్డుకునేదెలా?
సాక్షి, అమరావతి: మొక్కుబడి నిధుల కేటాయింపు, తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో రాష్ట్రంలో రహదారి భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. రాష్ట్రంలో రోజు రోజుకు అంతకంతకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కళ్లెం వేయాలంటే ఏటా రహదారి భద్రతకు రూ.30 కోట్లు కేటాయించాలని రవాణా శాఖ రెండేళ్ల క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అయితే ప్రభుత్వం మొక్కుబడిగా రూ.10 కోట్లు నిధులు కేటాయించి చేతులు దులుపుకుంది. రవాణా శాఖలో అదనపు పోస్టులతో పాటు అవసరమయ్యే నిధులను, మౌలిక వసతులు కేటాయించాలని రవాణా శాఖ సమగ్ర ప్రతిపాదనలు రూపొందించినా.. సర్కారు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోంది. రవాణా శాఖకు అదనంగా సిబ్బంది, నిధులు కేటాయిస్తే 2020 నాటికి రోడ్డు ప్రమాద మరణాలను 15 శాతానికి తగ్గిస్తామని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో రోడ్ సేఫ్టీ లీడ్ ఏజెన్సీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎన్ఫోర్సుమెంట్ యూనిట్లు ఏర్పాటు చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని రవాణా శాఖ ప్రతిపాదించింది. రాష్ట్ర స్థాయి రోడ్ సేఫ్టీ లీడ్ ఏజెన్సీ కింద 18 పోస్టులు, జిల్లా స్థాయిలో 21 పోస్టులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. రవాణా శాఖ ప్రతిపాదనలివే... రాష్ట్ర స్థాయిలో రోడ్డు భద్రతకు ప్రత్యేకంగా 18 పోస్టులు, జిల్లా స్థాయిలో 21 పోస్టులను కేటాయించాలి. రాష్ట్ర స్థాయిలో డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్, ప్రాంతీయ రవాణా అధికారి స్థాయిలో ఓ అసిస్టెంట్ సెక్రటరీ, మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్–2 పోస్టులు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, సర్కిల్ ఇన్స్పెక్టర్–2, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు (ఆర్అండ్బీ), హోం గార్డులు–5, డేటా ఎంట్రీ ఆపరేటర్లు–2, పరిపాలనాధికారి స్థాయిలో ఓ మేనేజరు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ మొత్తం 18 పోస్టులు మంజూరు చేయాలి. జిల్లా స్థాయిలో ప్రాంతీయ రవాణా అధికారి, మోటారు వెహికల్ ఇన్స్పెక్టరు, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టరు–2, హోం గార్డులు–10, సర్కిల్ ఇన్స్పెక్టరు, సబ్ ఇన్స్పెక్టర్లు–2, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, మేనేజరు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం 21 మందిని రహదారి భద్రత కోసం కేటాయించాలి. ఈ పోస్టులకుగాను పే అండ్ అలవెన్సుల కింద మొత్తం రూ.15.10 కోట్లు, వాహనాలకు రూ.81 లక్షలు, కార్యాలయ భవనాలకు రూ.45 లక్షలు కలిపి మొత్తం ఏడాదికి రూ.16.36 కోట్లు, రహదారి భద్రత కింద స్పీడ్ గన్లు, బ్రీత్ ఎనలైజర్లు, ఇతర సాంకేతిక పరికరాలకు రూ.15 కోట్ల కలిపి మొత్తం రూ.30 కోట్లు మంజూరు చేయాలని ప్రతిపాదించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఈ నిధులు కేటాయించాలని రవాణా శాఖ ప్రభుత్వానికి నివేదించినా.. ఇంతవరకు పట్టించుకోలేదు. రూ.3 వేల కోట్లకు పైగా రవాణా ఆదాయం రవాణా శాఖ ఆదాయం రూ.3 వేల కోట్లకు చేరింది. రయ్ రయ్‌మని ఆదాయం ఏ ఏటికాయేడు గణనీయంగా పెరుగుతోంది. కానీ ప్రభుత్వం రహదారి భద్రత కోసం నిధుల కేటాయింపులు మాత్రం మొక్కుబడిగా విదిల్చడం గమనార్హం. -
‘ట్రావెల్స్ అక్రమ రవాణాను అడ్డుకోండి’
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ట్రావెల్స్ అక్రమ రవాణాతో ఆర్టీసీకి రూ.వందల కోట్ల నష్టం వాటిల్లుతోందని నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) నేతలు ఎం.నాగేశ్వరరావు, కమాల్‌రెడ్డి, మౌలానా, రఘురాం తదితరులు పేర్కొన్నారు. రవాణా శాఖ తక్షణమే వీటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ రవాణాపై ముఖ్యమంత్రి నియమించిన కో ఆర్డినేటర్ చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. తక్షణమే ప్రైవేటు ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోకపోతే రవాణా శాఖ కార్యాలయం వద్ద నిరసన చేపడతామని గురువారం హెచ్చరించారు. -
టూరిస్టు బస్సులకు నేషనల్ పర్మిట్!
- అమలుపై కేంద్ర ప్రభుత్వ యోచన - గుజరాత్‌లోని వడోదరలో నేడు కీలక సమావేశం సాక్షి, హైదరాబాద్: సరుకు రవాణా వాహనాల తరహాలో టూరిస్టు బస్సులకు కూడా నేషనల్ పర్మిట్ విధానాన్ని అమలులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో పన్ను చెల్లిస్తూ నడుస్తున్న బస్సులు.. కొత్త విధానంతో ఏదైనా ఓ రాష్ట్రంలో పన్ను చెల్లిస్తే సరిపోతుంది. అక్కడ జారీ అయ్యే నేషనల్ పర్మిట్‌తో దేశంలో ఎక్కడికైనా వెళ్లి రావచ్చు. మధ్యలో మళ్లీ ఎక్కడా పన్ను చెల్లించాల్సిన పని ఉండదు. దీనికి సంబంధించి కొంతకాలంగా కసరత్తు చేస్తున్న కేంద్ర ఉపరితల రవాణా శాఖ నేడు కీలక నిర్ణయం తీసుకోబోతోంది. మంగళవారం గుజరాత్‌లోని వడోదరలో జరిగే జాతీయ రవాణా అభివృద్ధి మండలి సమావేశంలో ప్రధాన ఎజెండాగా దీనిపై చర్చించనుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, అధికారులు, కేంద్ర ఉపరితల రవాణా శాఖ కార్యదర్శి పాల్గొననున్నారు. ఆర్టీసీలకు ఉరి.. అసలే దివాలా దిశలో ఉన్న ప్రభుత్వ రవాణా సంస్థలకు ఈ నిర్ణయం శరాఘాతం కాబోతోంది. చాలా రాష్ట్రాల్లో రవాణా సంస్థలు అత్యంత బలహీనంగా ఉన్నాయి. ఆర్థిక సంక్షోభంలో కునారిల్లుతున్నాయి. తెలంగాణ ఆర్టీసీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేని సంగతి తెలిసిందే. టూరిస్టు పర్మిట్లు పొంది అక్రమంగా స్టేజీ క్యారియర్లుగా తిరుగుతున్న బస్సుల వల్ల ఆర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లుతున్నా వాటిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి చేతులు రావటం లేదు. ఇప్పుడు కేంద్రం ఏకంగా టూరిస్టు బస్సులకు లారీల తరహాలో నేషనల్ పర్మిట్లు ఇస్తే ఆర్టీసీ మరింత సంక్షోభంలో పడిపోతోందని రవాణా రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రైవేటుకు పండుగ.. ప్రమాదంలో భద్రత ఇప్పటికే ప్రైవేటు బస్సులు అక్రమంగా స్టేజీ క్యారియర్లుగా తిరుగుతూ ఆర్టీసీని దెబ్బకొడుతున్నాయి. బస్సుల్లో బెర్తులు వేసుకోవటానికి, పన్ను చెల్లించకుండా రాష్ట్రాల మధ్య తిరిగేందుకు నిబంధనలు అడ్డువస్తుండటంతో కొద్దోగొప్పో అవి తటపటాయిస్తున్నాయి. ఇప్పుడు నేషనల్ పర్మిట్ ఇచ్చి తలుపులు బార్లా తెరిస్తే వాటికి ఇక పట్టపగ్గాలు ఉండవు. ఏమాత్రం అనువుగా లేని డొక్కు బస్సులకు పర్మిట్లు పొంది దూరప్రాంతాలకు తిరిగి ప్రయాణికుల ప్రాణాలనూ పణంగా పెడతాయి. వాటిని పర్యవేక్షించటం రవాణా శాఖకు సాధ్యమయ్యే పనికాదు. కమీషన్లకు కక్కుర్తి పడి తనిఖీ లేకుండా వదిలేసే సిబ్బంది సంఖ్య ఆర్టీఏలో ఎక్కువగా ఉందన్న ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. పైగా సిబ్బంది లేక తనిఖీలు కూడా సరిగా జరగటం లేదు. నిబంధనలను ఖాతరు చేయని బస్సులకు ప్రభుత్వమే స్వేచ్ఛ ఇస్తే ఇక అడ్డు అదుపు ఉండదు. ఫిట్నెస్ లేకున్నా రాష్ట్రాల మధ్య తిరిగితే ప్రమాదాల సంఖ్య ఎక్కువయ్యే వీలుంది. వడోదర బస్‌పోర్టును సందర్శించనున్న మహేందర్‌రెడ్డి జీఎస్టీ తర్వాత పెరిగిన పన్నుల ప్రభావం, జాతీయ స్థాయిలో లైసెన్సుల జారీ, ఆటోమే టెడ్ డ్రైవింగ్ ట్రాక్‌ల ఏర్పాటు తదితర అంశాలపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు. వడోదరలో అత్యాధునికంగా నిర్మించిన బస్‌పోర్టును రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ సందర్శించనున్నారు. అదే తరహాలో తెలంగాణలో నిర్మించే అంశాన్ని పరిశీలించనున్నారు. -
ప్రైవేటు బస్సుల జప్తు షురూ
- వేరే రాష్ట్రాల్లో రిజిస్టరై ఇక్కడ స్టేజీ క్యారియర్లుగా రాకపోకలు - చెక్‌పోస్టుల్లో రవాణా శాఖ తనిఖీలు.. 15 బస్సులు సీజ్ - ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సుల ఏర్పాటు - నేటి నుంచి ప్రారంభ పాయింట్ల వద్దనే తనిఖీలు సాక్షి, హైదరాబాద్: వేరే రాష్ట్రాల్లో రిజిస్టరై నిబంధనలకు విరుద్ధంగా స్థానికంగా స్టేజీ క్యారియర్లుగా తిరుగుతున్న ప్రైవేటు బస్సులను కనిపించినవి కనిపించినట్టుగా రవాణాశాఖ జప్తు చేస్తోంది. మంగళ వారం రాత్రి ఐదు బస్సులను సీజ్ చేసిన అధికారులు.. బుధవారం మరో పదింటిని జప్తు చేశారు. అరుణాచల్‌ప్రదేశ్, పాండిచ్చేరి రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఈ బస్సులు ఆయా ప్రాంతాలకు వెళ్లకుండా తెలుగు రాష్ట్రాలు కేంద్రంగా వేరే ప్రాంతాల మధ్య స్టేజీ క్యారి యర్లుగా తిరుగుతున్నాయి. మార్నింగ్‌స్టార్, ఆరెంజ్ తదితర ప్రైవేటు సంస్థలకు చెందిన ఈ బస్సులను వివిధ చెక్‌పోస్టుల వద్ద అడ్డుకుని.. అక్కడే సీజ్ చేసి ఉంచారు. ‘తనిఖీలు నిరంతరాయంగా సాగుతాయి. వేరే రాష్ట్రాల రిజిస్ట్రేషన్ ఉండి, ఆయా ప్రాంతాలతో సంబంధం లేకుండా వేరే ప్రాంతాలకు నడిచే బస్సులు కేంద్ర మోటారు వాహనాల చట్టం నిబంధ నలు అతిక్రమిం చినట్టే. అవి ఎక్కడ కనిపించినా సీజ్ చేయమని అధికారుల ను ఆదేశించాం. ఇప్పటికే 15 బస్సులు సీజ్ చేశాం. వాటిల్లోని ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయమని ఆర్టీసీ ఎండీని ఆదేశించాం. ప్రైవే టు బస్సు నిర్వాహకులపైనా చర్యలు తీసుకుంటాం’ అని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి బుధవారం సచివాలయంలో మీడియాకు వెల్లడించారు. మధ్యలో బస్సు జప్తు చేస్తే ఇబ్బందులు.. చెక్‌పోస్టుల వద్ద బస్సులను తనిఖీ చేయాలని మంగళ వారం రాత్రే రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఎక్కడికక్కడ తనిఖీ చేసి ఐదు బస్సులను సీజ్ చేశారు. కానీ అప్పటికప్పుడు దిగిపొమ్మంటే ప్రయాణికులకు ఇబ్బందులు ఎదుర య్యాయి. రవాణా శాఖ అధికారుల విజ్ఞప్తి మేరకు ఆర్టీసీ తమ బస్సుల్లో ప్రయాణికులను గమ్యస్థానా లకు చేర్చింది. అయితే.. ఆర్టీసీ బస్సులు వచ్చేసరికి జాప్యం కావడం, తాము ఏసీ బస్సుల్లో ఉంటే సాధారణ బస్సుల్లో పంపటం ఏమిటని కొందరు ప్రయాణికులు అధికారులను నిలదీశారు. ఈ నేప థ్యంలో.. ప్రైవేటు బస్సులు ప్రారంభమయ్యే చోటనే తనిఖీ చేసి వాటిని సీజ్ చేయాలని రవాణా శాఖ నిర్ణ యించింది. అక్రమంగా తిరిగే ప్రైవేటు బస్సులను స్వాధీనం చేసుకుని, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని జేటీసీ రఘునాథ్ ‘సాక్షి’తో చెప్పారు. కొరత లేదు: ఆర్టీసీ ఎండీ రవాణా శాఖ ప్రైవేటు బస్సులను సీజ్ చేస్తే వాటి ల్లోని ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యా మ్నాయ ఏర్పాట్లు చేసేం దుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ ఎండీ రమణారావు పేర్కొన్నారు. ఎన్ని బస్సులు అవసరమైనా పంపుతామని ‘సాక్షి’కి చెప్పారు. మంగళవారం రాత్రి ఐదు బస్సులు పంపామని, ఇప్పటికే వంద బస్సులు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. -
కొత్త జాతీయ రహదారులకు డీపీఆర్‌లు
సాక్షి, హైదరాబాద్: కొత్తగా మంజూరైన జాతీయ రహదారులకు డీపీఆర్‌లు రూపొందించేందుకు టెండర్ల అనుమతులు, కొత్త రహదారులకు డీపీఆర్ కోసం అనుమతులు కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర భూ ఉపరితల రవాణా శాఖకు జాబితా అందించనుంది. ఈమేరకు రోడ్లు భవనాల శాఖ జాతీయ రహదారుల విభాగం ఈఎన్సీ గణపతిరెడ్డి సోమవారం జాబితా తీసుకుని ఢిల్లీ వెళ్లనున్నారు. 2017–18 సంవత్సరానికి గాను ఎన్‌హెచ్‌డీపీ కింద రూ.4,470 కోట్ల విలువైన పనులకు సంబంధించి ఈ జాబితా రూపొందించారు. ఇందులో వరంగల్–ఖమ్మం సెక్షన్, ఘట్ కేసర్ ఆరు వరుసల రోడ్డు, ఆరాంఘర్–శంషాబాద్ రోడ్డు విస్తరణ, ఎల్బీనగర్ ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు, హైదరాబాద్–శ్రీశైలం రోడ్డు మెరుగుపరిచే పనులు ఉన్నాయి. ఇక కొత్త రహదారుల డీపీఆర్‌లకు సంబంధించి... బోధన్– బాసర–భైంసా, మెదక్–ఎల్లారెడ్డి– బాన్సువాడ–రుద్రూర్, భద్రాచలం– అశ్వారావుపేట, చౌటుప్పల్–షాద్‌నగర్, మెదక్ –ఎల్కతుర్తి, తాండూరు– కొడంగల్–మహబూబ్‌నగర్, జహీరాబాద్–బీదర్ లైన్లు, కొత్త రహదారుల నిర్మాణం కోసం... హైదరాబాద్–నర్సాపూర్–మెదక్, జహీరాబాద్–బీదర్, సిరిసిల్ల–కామారెడ్డి, సిద్దిపేట–ఎల్కతుర్తి, బాసర–భైంసా, బైపాస్‌ల కోసం జడ్చర్ల, మహబూబ్‌నగర్, మెదక్ బైపాస్‌లు, రహదారి భద్రత చర్యలు, మియాపూర్–బీహెచ్ఈఎల్, పుణె–హైదరాబాద్, హైదరాబాద్–శ్రీశైలం రోడ్లు ఉన్నాయి. -
రాష్ట్రానికి మరో జాతీయ రహదారి
కొత్తకోట–గద్వాల–గూడూరు – మంత్రాలయం మధ్య నిర్మాణం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి మరో జాతీయ రహదారి మంజూరైంది. కొత్తకోట– గద్వాల– గూడూరు– మంత్రా లయం మధ్య దీన్ని నిర్మించనున్నారు. హైదరాబాద్– మంత్రాలయం– రాయచూర్ అనుసంధానంగా కర్ణాటక రాష్ట్రం ఈ రోడ్డును ప్రతిపాదించగా.. కేంద్ర భూ ఉపరితల రవాణా శాఖ తాజాగా పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి కొత్తకోట వరకు జాతీయ రహదారి ఉండటంతో అక్కడి నుంచి కొత్త జాతీయ రహదారి నిర్మించనున్నారు. రాష్ట్ర భూభాగంలో దాదాపు 70 కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ రోడ్డును రోడ్లు భవనాల శాఖ పరిధిలోని జాతీయ రహదారుల విభాగం నిర్మించనుంది. రహదారి నిర్మాణానికి దాదాపు రూ.400 కోట్లు ఖర్చవుతుందని అంచనా. త్వరలో డీపీఆర్‌లు రూపొందించి ఢిల్లీకి పంపనున్నట్లు జాతీయ రహదారుల విభాగం ఈఎన్సీ గణపతిరెడ్డి వెల్లడించారు. కాగా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకు 2,915 కిలోమీటర్ల నిడివి గల 21 జాతీయ రహదారులను కేంద్రం మంజూరు చేసింది. తాజాగా కర్ణాటక ప్రతిపాదనతో ఈ 22వ జాతీయ రహదారి మంజూరైంది. అనుసంధానమే: మంత్రి తుమ్మల దేశంలోని హైవేలను అనుసంధానించే క్రమంలో ఇలాంటి లింకు రోడ్లను కేంద్రం మంజూరు చేస్తోందని మంత్రి తుమ్మల తెలిపారు. రాయచూర్ 167 నం జాతీయ రహదారితో అనుసంధానించే క్రమంలో ఈ రోడ్డు నిర్మాణం జరుగుతోందన్నారు.