
17 మందితో ఏపీఎస్‌ఆర్టీసీ బోర్డ్
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఉమ్మడి పాలక మండలి
- చైర్మన్‌గా ఎన్.సాంబశివరావు
సాక్షి, హైదరాబాద్: ఏపీఎస్‌ఆర్టీసీకి 17 మంది సభ్యులతో పాలక మండలి ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏడుగురు, తెలంగాణ తరఫున ఐదుగురు, కేంద్రం తరఫున ఐదుగురితో కలిపి పాలక మండలిని నియమిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.శాంబాబ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఉమ్మడి బోర్డు ఏర్పాటైంది. పాలనాపరంగా ఆర్టీసీ విభజన జరిగినా సాంకేతికంగా కేంద్రం దృష్టిలో ఇంకా ఉమ్మడి ఏపీఎస్‌ఆర్టీసీగానే ఉంది. గతంలో తమకు ప్రత్యేక పాలక మండలి ఏర్పాటు చేయాలన్న తెలంగాణ వినతిని కేంద్ర ఉపరితల రవాణా శాఖ తిరస్కరించింది.తెలంగాణకు ప్రాతినిధ్యం పెంచుతామంది.
దీనికి అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. కాగా, ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా సోమారపు సత్యనారాయణను నియమించింది. టీఎస్ చైర్మన్‌కు పాలకమండలిలో చోటు లేదు. ఏపీ నియమించే చైర్మన్‌కే చోటు కల్పించారు. ఏపీ ఇంతవరకు ఆర్టీసీకి చైర్మన్‌ను నియమించకపోవడంతో ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీ అయిన ఎన్.సాంబశివరావు ఉమ్మడి బోర్డుకు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. త్వరలో జరిగే పాలక మండలి సమావేశంలో ఆర్టీసీ విభజన అంశమే ప్రధాన ఎజెండా కానుంది. ఆస్తులు, విభజనపై తీర్మానం చేసి కేంద్రానికి నివేదించనున్నారు.
పాలక మండలిలో చోటు వీరికే...
ఆంధ్రప్రదేశ్ నుంచి పాలక మండలిలో చైర్మన్, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్, రవాణా, ఆర్‌అండ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ (టీ ఆర్‌అండ్‌బీ ఇంచార్జి) కార్యదర్శి, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (అడ్మిన్), ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (ఐటీ), ఆర్టీసీ ఆర్థిక సలహాదారు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసరు సభ్యులుగా ఉంటారు. తెలంగాణ నుంచి టీఎస్ ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్, రవాణా, ఆర్‌అండ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ముఖ్య కార్యదర్శి/కార్యదర్శి, రవాణా శాఖ అంశం పర్యవేక్షించే ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ముఖ్య కార్యదర్శి/కార్యదర్శి, ఎల్.ఇ.టి అండ్ ఎఫ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ముఖ్య కార్యదర్శి/ కార్యదర్శి. కేంద్రం తరఫున మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ డెరైక్టర్ (రోడ్ సేఫ్టీ), మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ డెరైక్టర్/డిప్యూటీ సెక్రటరీ (ట్రాన్స్‌పోర్టు), మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్‌మెంట్ డెరైక్టర్, అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండర్ టేకింగ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు డెరైక్టర్ సభ్యులుగా ఉంటారు.