
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్–19 లాక్‌డౌన్ నేపథ్యంలో కుదేలైన వాహన రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కోవిడ్‌తో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వాహనాల కొనుగోళ్లు సగానికి సగం పడిపోయాయి. అన్‌లాక్ అమల్లోకి వచ్చాక రెండో త్రైమాసికంలో వాహనాల కొనుగోళ్లు జోరందుకున్నాయి. కోవిడ్–19 నేపథ్యంలో ప్రజా రవాణా కంటే వ్యక్తిగత వాహనాలే మిన్న అని ప్రజలు భావించడంతో మోటార్‌సైకిళ్లు, కార్ల కొనుగోళ్లు రెండో త్రైమాసికంలో బాగా పెరిగాయి.
ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికం (ఏప్రిల్ నుంచి జూన్ వరకు)లో రవాణా రంగం ద్వారా రూ.781 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా లాక్‌డౌన్‌తో కేవలం రూ.367 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే.. సగానికి సగం వాహనాల కొనుగోళ్లు పడిపోయాయి. దీంతో ఆదాయం కూడా అదే స్థాయిలో తగ్గిపోయింది. రెండో త్రైమాసికంలో (జూలై నుంచి సెప్టెంబర్ వరకు) రవాణా రంగం ద్వారా రూ.728 కోట్లు రావాల్సి ఉండగా రూ.694 కోట్ల ఆదాయం వచ్చింది. తొలి త్రైమాసికంలో 50 శాతం తిరోగమనంలో ఉండగా రెండో త్రైమాసికంలో తిరోగమనం 30 శాతానికే పరిమితమైంది.
ఇక నుంచి ఊపందుకుంటుంది
తొలి త్రైమాసికంలో రవాణా రంగం ద్వారా సగానికిపైగా ఆదాయం పడిపోయినప్పటికీ రెండో త్రైమాసికంలో ఆదాయం సాధారణ స్థాయికి వచ్చింది. మిగతా రెండు త్రైమాసికాల్లో అనుకున్న మేరకు ఆదాయం వస్తుందని ఆశిస్తున్నాం. రెండో త్రైమాసికంలో వ్యక్తిగత వాహనాల కొనుగోళ్లు బాగా పెరిగాయి. పండుగల సీజన్ నేపథ్యంలో మరింత పెరుగుతాయని భావిస్తున్నాం.
– ప్రసాదరావు, అదనపు కమిషనర్, రవాణా శాఖ
Comments
Please login to add a commentAdd a comment