
2020 మార్చి 24.. జనతా కర్ఫ్యూ... అదే లాక్‌డౌన్ గుర్తుందా? ఆనాడు రోజులను గుర్తుపెట్టుకోవడం కూడానా అని ముఖం చిట్లిస్తున్నారా?నిజమే చేదు అనుభవాలను అదేపనిగా గుర్తుపెట్టుకోనక్కరలేదు! కానీ కష్టకాలంలో అందిన సేవలు, సహాయాన్ని మాత్రం మరువకూడదు కదా!అలా కోవిడ్ టైమ్‌లో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా నిలబడ్డ నర్స్‌లు, డాక్టర్లు, పోలీసులు అందించిన సేవలు, సాయం గురించి మార్చి 24 లాక్‌డౌన్ డే సందర్భంగా ఒక్కసారి గుర్తుచేసుకుందాం.. ఓ సిరీస్‌గా! అందులో భాగంగా నేడు .. సికిందరాబాద్ గాంధీ ఆసుపత్రి సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ శిరీష ఏం చెబుతున్నారంటే..
ఆ రోజులను తలచుకుంటే ఇప్పటికీ భయమే! నేనప్పుడు ఉస్మానియాలో పనిచేసేదాన్ని. గాంధీ హాస్పిటల్‌ని కోవిడ్ హాస్పిటల్‌గా కన్వర్ట్ చేశారు. కోవిడ్ పాజిటివ్ అని తేలాకే అందులో జాయిన్ చేసుకునేవారు. జనరల్ పేషంట్స్, కోవిడ్ లక్షణాలున్న వాళ్లు ఉస్మానియాకు వచ్చేవాళ్లు. టెస్ట్ చేసి.. పాజిటివ్ అని తేలితే గాంధీకి పంపేవాళ్లం.
ఉస్మానియా కోవిడ్ కాదు, ఎన్ 95 మాస్క్‌లు, పీపీఈ కిట్స్ ఖరీదైనవి కూడా .. కాబట్టి వాటిని ముందు డాక్టర్స్‌కే ఇచ్చారు. అయితే నిత్యం పేషంట్స్‌తో ఉంటూ వాళ్లను కనిపెట్టుకునేది నర్సింగ్ స్టాఫే కాబట్టి మాస్క్‌లు, పీపీఈ కిట్‌లు ముందు వాళ్లకు కావాలని మాకు ఇప్పించారు అప్పటి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ సర్.
మామపోయాడు.. అల్లుడు బతికాడు
ఒక కేస్‌లో మామ, అల్లుడు ఇద్దరికీ కోవిడ్ సోకింది. ఇద్దరినీ గాంధీలో చేర్పించాం. మాకు రెండు ప్రాణాలూ ఇంపార్టెంటే! ఇద్దరికీ ఈక్వల్ సర్వీసే ఇస్తాం. దురదృష్టవశాత్తు పెద్దాయన అంటే మామ చనిపోయాడు. ఆ అమ్మాయి భర్త డిశ్చార్జ్ అయ్యాడు.
అల్లుడిని చూసి అత్తగారు తన భర్త కూడా తిరిగొస్తాడనుకుంది. వెంటనే నిజం చెబితే ఆమెకేమన్నా అయిపోతుందన్న భయంతో నెల తర్వాత అసలు విషయం చెప్పారురు. ఇలా ఎన్నికేసులో! కోవిడ్ నుంచి బయటపడగలమా అని దిగులేసేది. అలాంటి సిట్యుయేషన్ ఎప్పటికీ రావద్దు!
వెంటిలేటర్ మీదుంచే స్థితిలో..
లాక్‌డౌన్ టైమ్‌లో మాకు వారం డ్యూటీ, వారం సెలవు ఉండేది. రెండో వారమే నాకు కాళ్లు లాగడం, కళ్లు మండటం స్టార్టయింది. దాంతో తర్వాత వారం కూడా సెలవు తీసుకున్నాను. ఇది కోవిడా లేక నా అనుమానమేనా అని తేల్చుకోవడానికి డ్యూటీలో జాయినయ్యే కంటే ముందురోజు అంటే పదమూడో రోజు టెస్ట్ చేయించుకున్నాను. స్వాబ్ టెస్ట్‌లో నెగటివ్ వచ్చింది.
సీటీ స్కాన్ కూడా చేయిస్తే.. సీవియర్‌గా ఉంది కోవిడ్. ఆ రిపోర్ట్స్‌ని మా హాస్పిటల్‌లోని అనస్తీషియా డాక్టర్‌కి పంపాను. వాటిని చూసిన ఆవిడ ‘వెంటిలెటర్ మీదుంచే స్థితి తెలుసా నీది? అసలెలా ఉన్నావ్?’ అంటూ గాభరాపడ్డారు. కానీ నేను మాత్రం బాగానే ఉన్నాను. అయినా ఆవిడ కొన్ని జాగ్రత్తలు చె΄్పారు. తెల్లవారి డ్యూటీలో జాయిన్ అయ్యాను.
అయితే డాక్టర్స్, కొలీగ్స్ చాలా కేర్ తీసుకున్నారు. ఇంట్లో మా ఆయన, పిల్లలు కూడా! డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి మావారు వేడినీళ్లు పెట్టి ఉంచేవారు. మా పెద్దబ్బాయి రోజూ నాన్‌వెజ్ చేసిపెట్టేవాడు.‘ నువ్వు డ్యూటీ చేయాలి కదమ్మా.. మంచి ఫుడ్ అవసరం’ అంటూ. అందరూ చాలా స΄ోర్ట్‌గా ఉన్నారు.
అంత విషాదంలోనూ సంతోషమేంటంటే..
మా నర్సింగ్ స్టాఫ్‌లో డెబ్భై శాతం మందికి కోవిడ్ సోకింది. ఐసొలేషన్ పీరియడ్ అయిపోగానే వెంటనే డ్యూటీకొచ్చారు.. భయపడలేదు. పీపీఈ కిట్‌తో ఉక్కపోతగా ఉండేది. అది వేసుకున్న తర్వాత ఒక్కసారి తీసినా మళ్లీ పనికిరాదు. దాంతో వాష్‌రూమ్‌కి కూడా వెళ్లేవాళ్లం కాదు. దానివల్ల డీహైడ్రేషన్ అయింది. అయినా, సహనం కోల్పోలేదు.
కోవిడ్ మా సర్వీస్‌కి పరీక్షలాంటిది. నెగ్గాలి.. మానవ సేవను మించిన పరమార్థం లేదు అనుకునేదాన్ని! అంత విషాదంలోనూ సంతోషమేంటంటే మా నిబద్ధత, సేవ ప్రజలకు అర్థమైంది. ప్రభుత్వాసుపత్రుల మీదున్న చెడు అభిప్రాయం పోయింది. మమ్మల్ని గౌరవిస్తున్నారు.
– సరస్వతి రమ
(చదవండి: లాభాల తీరం మత్స్య సంపద యోజన)
Comments
Please login to add a commentAdd a comment