
వేలాది మంది ప్రాణాలు బలితీసుకున్న వైరస్
జిల్లాలో వీధిన పడిన వేల కుటుంబాలు
వైరస్ కట్టడికి అహర్నిశలు శ్రమించిన యంత్రాంగం
మునుపెన్నడూ చూడని.. వినని విపత్తు జనాన్ని అతలాకుతలం చేసింది. ఎవరిని తాకితే ఏమవుతుందో.. ఏం తింటే ఏమైపోతామో అన్న భయం అందరినీ వెంటాడింది. చికిత్స ఎలా, మందులు ఏమిటి అన్న విషయం తెలియక వైద్యులు సతమతమైన తరుణాన ప్రజలైతే బెంబెలేత్తిపోయారు. ఆ వైరస్ పేరు కరోనా. ఆ భయానక అనుభవం ఎదురై ఐదేళ్లు కావొస్తుండగా.. ఇప్పటికీ ఆ రోజులు గుర్తుకొస్తే వైరస్ బారిన పడిన కుటుంబాలు విలవిల్లాడిపోతున్నాయి. జిల్లాలో తొలి కరోనా కేసు 2020 ఏప్రిల్ 6ననమోదైంది. అంతకుముందు మార్చి 24వ తేదీ నుంచే ప్రభుత్వం లాక్‌డౌన్ విధించగా జనజీవనం స్తంభించింది. రాకపోకల నిలిపివేతతో ఎక్కడి వారు అక్కడే ఉండిపోగా.. ఉపాధి కరువై, ఇళ్లలో సామగ్రి లేక పలువురు అర్ధాకలితో అలమటించారు. సుమారు 40 రోజులు రవాణా వ్యవస్థ స్తంభించిన ఆ సమయంలో... ప్రభుత్వ యంత్రాంగం, స్వచ్ఛంద సంస్ధలు నిత్యావసరాలు పంపిణీ చేసినా అవి ఏ మాత్రం సరిపోక ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
పిట్టల్లా రాలిన జనం
ఒపక్క పనిలేక తిండికి ఇబ్బంది పడుతున్న ప్రజలను కోవిడ్ వ్యాప్తి కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఎవరి ద్వారా ఎవరికి వ్యాపిస్తుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించారు. కోవిడ్ మొదటి వేవ్‌లో ప్రభుత్వం మాత్రమే ఆర్‌టీపీసీఆర్, ర్యాపిడ్ టెస్టులు నిర్వహించేది. దీంతో ఏ చిన్న లక్షణం కనిపించినా పరీక్ష చేయించుకోవడం.. ఆపై ప్రభుత్వం ఇచ్చే కిట్‌లో మందులు వాడేవారు. కొందరైతే సొంతంగా ఐసోలేషన్‌లో ఉంటూ కుటుంబాలకు దూరంగా గడిపారు.
ఏడాది పాటు తొలి వేవ్
కరోనా మొదటి వేవ్ 2020 ఏప్రిల్ నుండి 2021 మార్చి వరకు కొనసాగింది. యంత్రాంగం ఎంత కష్టపడినా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడలేదు. లాక్‌డౌన్ సడలింపు వేళలో ప్రజలు నిత్యవసరాల కోసం రావడం, ఇతర ప్రాంతాలకు వెళ్తుండడం.. ఆ సమయాన జాగ్రత్తలు పాటించకపోవడంతో కేసులు గణనీయంగా పెరిగాయి. మొదటి వేవ్‌లో జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ర్యాపిడ్, ఆర్‌టీపీసీఆర్ టెస్టులు 3,02,156మందికి నిర్వహించగా 23,789 మందికి కరోనా నిర్ధారణ అయింది. అయితే ఇంటి వద్ద చికిత్స చేయించుకున్న వారు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకున్న వారితో కలిపితే ఈ లెక్కలు మరింత పెరుగుతాయి. కాగా, మొదటి వేవ్‌లో కరోనా వ్యాక్సిన్ రావడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. తొలుత ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ అందించిన ప్రభుత్వం.. ఆతర్వాత అందరికీ ఇవ్వడానికి రెండేళ్లు పట్టింది.
రెండో వేవ్‌లో అల్లాడిన జనం
కోవిడ్ రెండో వేవ్ 2021 ఏప్రిల్‌లో ప్రారంభం కాగా డిసెంబర్ వరకు కొనసాగింది. ఈ వేవ్‌లో రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే ఖమ్మం జిల్లానే ఎక్కువ తల్లడిల్లింది. కోవిడ్ సోకిన రెండు, మూడు రోజులకే కొందరు మృతి చెందడమే కాక వృద్ధుల మరణాలు గణనీయంగా నమోదయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పడకలు సరిపోక చికిత్స అందకపోవడంతో గంటల్లోనే ప్రాణాలు వదలడం సాధారణంగా మారింది. దీనికి తోడు చాలాచోట్ల ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఇదే సమయాన కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో మృతుల అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబీకులు సైతం ముందుకు రాని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రెండో వేవ్‌లో కరోనాకు రెమిడిసివర్ ఇంజక్షన్ అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగానే సరఫరా చేసినా ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.50 వేల నుండి రూ.70 వేల వరకు వసూలుచేశారు.
అధికారికంగా మరణాలు.. 1,185
కరోనా రెండో వేవ్‌లో ప్రభుత్వ పరంగా 14,06,253 మందికి ర్యాపిడ్, ఆర్‌టీపీసీఆర్ టెస్టులు నిర్వహించగా 68,030మంది కోవిడ్ బారిన పడినట్లు తేలింది. ఇందులో 1,185మంది మాత్ర మే మృతి చెందినట్లు అధికారికంగా లెక్కలు చూపారు. కానీ ఈ మరణాల సంఖ్య రెండింతలు ఉంటుందని చెబుతారు. ఇక 2022 కరోనా మూడో వేవ్ వచ్చినా 4,01,743 మందికి పరీక్షలు చేసి 18,359 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు. ఇందులో 52 మంది మృతి చెందారు. అలాగే, 2023లో 25,200 మందికి పరీక్షలు చేయగా 216 మందికి కోవిడ్ సోకగా ఎవరూ మృతి చెందలేదు. అప్పటికే అందరూ రెండు డోస్‌ల వ్యాక్సిన్ వేసుకుని ఉండడం.. కరోనాకు అన్ని వ్యాధుల మాదిరి చికిత్స సాధారణంగా మారడంతో 2024 నుండి కోవిడ్ ప్రభావం పూర్తిగా క్షీణించింది.
ప్రసవాలు ఆపలేదు..
కోవిడ్ సమయాన ఎంసీహెచ్‌లో గైనిక్ హెచ్‌ఓడీగా ఉన్నా. వైద్యులు, సిబ్బంది కోవిడ్ బారిన పడినా ప్రసవాలు నిర్వహించాం. కోవిడ్ బారిన పడిన 500మంది గర్భిణులకు ప్రసవాలు చేశాం. ఖమ్మం కేంద్రంగా అందించిన గైనిక్ సేవలకు మన్ననలు అందాయి.
– కృపా ఉషశ్రీ, గైనిక్ హెచ్‌ఓడీ, తిరుమలాయపాలెం
సంతృప్తి మిగిలింది..
పెద్దాస్పత్రిలో కరోనా మొదటి, రెండో వేవ్ సమయాన పడకలు సరిపోకపోయేవి. బాధితుల తాకిడి దృష్ట్యా కిందే బెడ్లు వేసి వైద్యం చేశాం. ఎందరో ప్రాణాలు నిలిపామన్న సంతృప్తి మాకు మిగిలింది. వైద్యులు, సిబ్బంది అలాంటి అనుభవం మరెప్పుడూ రాదు.
– డాక్టర్ రాజశేఖర్ గౌడ్, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి
వేలాది మృతదేహాలకు అంత్యక్రియలు
కుటుంబీకులు మరణించినా అంత్యక్రియలు నిర్వహించడానికి చాలా మంది ముందుకు రాలేదు. దీంతో ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ ప్రాంతాల్లో 3వేల మృతదేహలకు అంత్యక్రియలు నిర్వహించాం. మానవధర్మం ప్రకారం పనిచేశాం.
– శ్రీనివాసరావు, అన్నం ఫౌండేషన్ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment