
రాష్ట్రంలో ఈ నెల 7 నుంచి 21 వరకు రోజువారీ పాజిటివ్ కేసులతో పోలిస్తే రికవరీలు ఇలా పెరిగాయి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి గణ నీయంగా తగ్గుతోంది. పక్షం రోజుల క్రితం వరకు నిర్ధారణ పరీక్షల్లో దాదాపు పదిశాతం వరకు పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం వ్యాప్తి తీవ్రత సగానికి తగ్గింది. ప్రస్తుతం చేస్తున్న నిర్ధారణ పరీక్షల్లో 5 శాతం నుంచి 6 శాతం మధ్య పాజిటివిటీ కనిపిస్తోంది. అదేవిధంగా రికవరీ రేటు వేగంగా పెరుగుతోంది. రెండువారాల క్రితం రికవరీ రేటు 84.81 శాతం ఉండగా..ప్రస్తుతం 91.33 శాతానికి పెరిగింది. జాతీయ సగటు (87.2%)తో పోలిస్తే రాష్ట్రంలో రికవరీ రేటు 4.1 శాతం అధికంగా ఉన్నట్లు రా ష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
లాక్‌డౌన్ నేపథ్యంలో..
గతనెలాఖరు నుంచి రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించినప్పటికీ కేసుల తీవ్రత తగ్గకపోవడంతో, ఆ తర్వాత ప్రతిరోజూ ఉదయం 10గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కేవలం 4 గంటల సడలింపుతో ప్రభుత్వం లాక్‌డౌన్‌అమలు చేస్తోంది. దీంతో ప్రయాణాలు, ప్రజల రాకపోకలు, ఎక్కువ సంఖ్యలో గుమికూడేందుకు వివాహాలు..ఇతర శుభాకార్యాలు గణనీయంగా తగ్గి వైరస్ వ్యాప్తి కట్టడిలోకి వచ్చినట్లు స్పష్టమవుతోంది. ఈనెల 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం లాక్‌డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈనెల 30వ తేదీ వరకు లాక్‌డౌన్ అమలు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి వైరస్ వ్యాప్తి కాస్త తగ్గిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. ఉదయం పూట సడలింపులున్న సమయంలో రోడ్లపై రద్దీ విపరీతంగా ఉండడం వైరస్ వ్యాప్తికి దోహదపడుతోందని వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొనడంతో పోలీసు శాఖ ఇటీవల మరింత కఠినతరం చేసింది. ఇది కూడా సత్ఫలితాలు ఇస్తున్నట్టు అధికారులు భావిస్తున్నారు.
పాజిటివ్ 66,087 .. రికవరీ 94,993
ప్రస్తుతం పాజిటివ్ కేసుల కంటే రికవరీ అవుతున్నవారి సంఖ్యే ఎక్కువ. గత 2 వారాలుగా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ నెల 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 66,087 మంది కోవిడ్–19 బారిన పడ్డారు. ఇదే సమయంలో 94,993 మంది రికవరీ అయ్యారు. దీనిని బట్టి పాజిటివిటీ కంటే రికవరీ రేటు దాదాపు ఒకటిన్నర రెట్లు అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment