
2020, మార్చి 22.. ఆదివారం.. ఐదు సంవత్సరాల క్రితం ఇదే రోజున దేశవ్యాప్తంగా రోడ్లపై నిశ్శబ్దం ఆవరించింది. భారతదేశ చరిత్రలో ఉత్తరాది నుండి దక్షిణాది వరకూ.. తూర్పు నుండి పశ్చిమం వరకు దేశం అంతటా నిశ్శబ్దం నెలకొంది. ఇలాంటి పరిస్థితి భారతదేశ చరిత్రలో అదే మొదటిసారి.
ఆరోజు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశ ప్రజలు స్వచ్ఛందంగా ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. జనం బయటకు వెళ్లేందుకు ఎటువంటి పరిమితులులేనప్పటికీ, దేశవ్యాప్తంగా ప్రజలంతా తమ ఇళ్లనుండి బయటకు వెళ్లకూడదని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు. పెరుగుతున్న కరోనా మహమ్మారి విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనమంతా తమకు తాము కట్టడి విధించుకున్నారు. నాడు కేంద్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి తీవ్రతను ప్రజలకు తెలియజేయాలని భావించింది. కరోనా నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం జనతా కర్ఫ్యూ(Janata Curfew)కు పిలుపునిచ్చింది. అయితే ఈ ప్రజా కర్ఫ్యూ వాస్తవానికి లాక్‌డౌన్‌కు సిద్ధం కావడానికి ఒక మార్గమని ఆ తరువాత స్పష్టమైంది.
2020, మార్చి 22న సాయంత్రం 5 గంటలకు దేశ ప్రజలంతా చప్పట్లు కొడుతూ, ప్లేట్లు చప్పుడు చేస్తూ కరోనా మహమ్మారి(Corona pandemic) విషయంలో అప్రమత్తమయ్యారు.ఆ రోజున ఉదయం 7 గంటల నుండి రాజ్యమేలిన నిశ్శబ్దం సాయంత్రానికి అప్రమత్తను గుర్తుచేసేదిగా మారింది. సాయంత్రం 5 గంటలకు దేశంలోని ప్రజలంతా తమ ఇళ్ల బాల్కనీలలోకి వచ్చి చప్పట్లు కొట్టడం, ప్లేట్లు కొట్టడం, గంటలు మోగించడం చేశారు. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న దేశ ఆరోగ్య కార్యకర్తలకు గౌరవసూచకంగా, సాయంత్రం 5 గంటలకు దేశ ప్రజలంతా చప్పట్లు, లేదా ప్లేట్లతో శబ్ధం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ ప్రజా కర్ఫ్యూ మార్చి 22న ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. దీని తరువాత రెండు రోజులు అంతా సాధారణంగానే ఉంది. ఆ తర్వాత 24వ తేదీ సాయంత్రం ప్రధాని మోదీ లాక్‌డౌన్ ప్రకటించారు. మొత్తం 21 రోజుల పాటు కఠినమైన లాక్‌డౌన్ విధించారు.
ఈ లాక్‌డౌన్(Lockdown) ఏప్రిల్ 14న ముగియాల్సి ఉంది. కానీ దానిని పొడిగిస్తూ వచ్చారు. లాక్‌డౌన్ వ్యవధిని స్టేజ్ -2లో 19 రోజులు, స్టేజ్ -3లో 14 రోజులు, స్టేజ్ -4లో 14 రోజులు పొడిగించారు. ఈ విధంగా దేశంలో మొత్తం 68 రోజులు పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను విధించారు. ఈ లాక్‌డౌన్ మే 31 వరకు కొనసాగింది. దీని తరువాత జూన్ ఒకటి నుండి లాక్‌డౌన్‌ను క్రమంగా సడలిస్తూ వచ్చారు. ఈ ఆకస్మిక లాక్‌డౌన్ కారణంగా దేశంలో ఇంతకు ముందెన్నడూ లేనటువంటి పరిస్థితి ఎదురయ్యింది. లక్షలాది మంది కార్మికులు నగరాల నుండి తమ స్వగ్రామాల వైపు తరలివెళ్లారు. వాహనాలు అందుబాటులో ఉన్నవారు వాటిలో పయనమవగా, వాహనాలు లభించని వారు వందల కిలోమీటర్లు నడిచి తమ స్వగ్రామాలకు చేరుకున్నారు.
ఇది కూడా చదవండి: బీజేపీ గూటికి శశిథరూర్?.. ఖచ్చితమైన సంకేతాలివే..