జనతా కర్ఫ్యూకి ఏడాది | India Janata curfew completes One Year | Sakshi
Sakshi News home page

జనతా కర్ఫ్యూకి ఏడాది

Published Mon, Mar 22 2021 4:32 AM | Last Updated on Mon, Mar 22 2021 10:07 AM

India Janata curfew completes One Year - Sakshi

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఆదివారం లాక్‌డౌన్‌తో నిర్మానుష్యంగా మారిన రహదారి

న్యూఢిల్లీ: ప్రపంచంపై విరుచుకుపడుతున్న కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో భాగంగా భారతదేశం జనతా కర్ఫ్యూ పాటించి నేటికి సరిగ్గా సంవత్సరం. మార్చి 22 ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత సంవత్సరం మార్చి 19న ప్రకటించారు. ఆ రోజు ఇళ్ల నుంచి ఎవరు బయటకు రావద్దని, ఇది రానున్న రోజులకు సిద్ధమవడం, స్వీయ నియంత్రణ అలవాటు చేసుకోవడం వంటిదని పేర్కొన్నారు. అలాగే, ఆ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రజలంతా తమ ఇంటి ముందుకు లేదా బాల్కనీల్లోకి వచ్చి 5 నిమిషాల పాటు చప్పట్లు కొట్టడం కానీ, పళ్లేలపై శబ్దం చేయడం కానీ చేసి కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తదితర ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు కృతజ్ఞతలు తెలియజేయాలని కోరారు.

కచ్చితంగా భౌతిక దూరం పాటించడం అలవాటు చేసుకోవాలని ప్రజలను కోరారు. ప్రధాని పిలుపునకు దేశమంతా స్పందించింది. ఆ రోజు అత్యవసర సేవలు మినహా జనజీవనం స్తంభించింది. దాదాపు అదే సమయంలో, కరోనా వైరస్‌ వ్యాప్తి చైనాలోని వుహాన్‌ నుంచి ప్రారంభమైందని తేలింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అప్పటికే లాక్‌డౌన్‌ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అప్పటికి, భారత్‌లో కరోనా వ్యాప్తి తక్కువగానే ఉంది. పరిస్థితి చాలావరకు మెరుగ్గానే ఉంది. అయినప్పటికీ, వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించాలని కేంద్రం నిర్ణయించింది. మార్చి 24 రాత్రి ప్రధాని మోదీ లాక్‌డౌన్‌ ప్రకటన చేశారు. మార్చి 25 నుంచి 21 రోజుల పాటు తొలివిడత లాక్‌డౌన్‌ ప్రకటించారు.

ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలని, ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని స్పష్టం చేశారు. నిత్యావసరాలకు మాత్రం మినహాయింపునిచ్చారు. లాక్‌డౌన్‌తో ఒక్కసారిగా జనజీవితం అస్తవ్యస్తమైంది. ఒకవైపు వైరస్‌ భయం, మరోవైపు, నిలిచిపోయిన జీవనోపాధితో ఆదాయం కోల్పోయి లక్షలాది కుటుంబాలు కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఉపాధి సహా వివిధ కారణాలతో స్వస్థలం విడిచినవారు అనూహ్యంగా ఎక్కడివారక్కడ చిక్కుకుపోయారు. పేదలు, సామాన్యులను ఆదుకునేందుకు ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ సహా పలు కార్యక్రమాలను కేంద్రం ప్రారంభించింది. కరోనా సవాళ్లను ఎదుర్కొనేందుకు ‘కోవిడ్‌ 19 టాస్క్‌ఫోర్స్‌’ను ఏర్పాటు చేసింది.

కరోనా వైరస్‌తో వచ్చే వ్యాధి ‘కోవిడ్‌ 19’ బాధితులకు చికిత్స అందించేందుకు దేశవ్యాప్తంగా ఆరోగ్య వసతులను కల్పించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. మరోవైపు, ఉపాధి కోసం ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌ వంటి మహా నగరాలకు వచ్చిన వలస కూలీలు అక్కడి నుంచి తమ స్వస్థలాలకు కాలినడకన వెళ్లడం ప్రారంభించారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు కష్టనష్టాలను ఓర్చుకుని వందల కిలోమీటర్ల దూరంలోని సొంతూళ్లకు కాలి నడకన పయనమయ్యారు. ఆ క్రమంలో ఎంతోమంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోయారు. అకస్మాత్తుగా లాక్‌డౌన్‌ విధించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్‌కు మించిన ప్రత్యామ్నాయం లేదన్న వాదన ప్రారంభమైంది.

ముఖ్యంగా, ఆరోగ్య వసతులు అరకొరగా ఉన్న భారత్‌లో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగితే.. దేశంలోని వైద్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదమున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ తప్పనిసరి అని భావించారు. లాక్‌డౌన్‌ ప్రకటించేనాటికి భారత్‌లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 536. కోవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 10. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం కరోనా విలయ తాండవాన్ని చూస్తున్న వారు.. భారత్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోందని భయపడ్డారు. కానీ ఇప్పుడు, సంవత్సరం తరువాత, ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే.. అభివృద్ధి చెందిన చాలా దేశాల కన్నా కరోనాను భారత్‌ సమర్ధంగా ఎదుర్కొన్న విషయం స్పష్టమవుతుంది. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పాటు, భారతీయుల్లోని సహజసిద్ధ రోగ నిరోధక శక్తి అందుకు కారణంగా విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 70కి పైగా దేశాలకు భారత్‌ కరోనా వ్యాక్సీన్‌ను పంపిస్తోంది. లాక్‌డౌన్‌తో ప్రజల జీవన విధానంలో, వారి ఆలోచన విధానంలో గణనీయ మార్పు వచ్చింది. ఆరోగ్యంపై శ్రద్ధ, ఆర్థిక ప్రణాళిక అలవాటయ్యాయి.  దీంతోపాటు లాక్‌డౌన్‌తో కుదేలయిన  భారత ఆర్థిక రంగం.. లాక్‌డౌన్‌ ముగిసిన తరువాత, అదే స్థాయిలో  పునరుజ్జీవనం దిశగా వేగంగా పరుగులు తీయడం ప్రారంభించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement