న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా శనివారం దేశ పౌరులకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను హిందీలో చదివి వినిపించి తన ట్విటర్ అకౌంట్‌లో పోస్టు చేశారు. కోవిడ్–19పై పోరాటంలో విజయం వైపుగా భారత్ ప్రయాణిస్తోందని ఆత్మవిశ్వాసంతో చెప్పారు. భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదగాలన్న కల సాకారమయ్యే రోజు ఎంతో దూరంలో లేదన్న మోదీ తన లేఖలో గత ఏడాది పాలనాకాలంలో సాధించిన విజయాలను, ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను, కరోనా గడ్డు పరిస్థితుల్లోనూ భారత్ చేస్తున్న పోరాటాన్ని ప్రస్తావించారు. మోదీ లేఖలోని కొన్ని ముఖ్యమైన అంశాలు..
ఎన్నో సమస్యలకు పరిష్కారం
‘గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో మా గెలుపు భారత ప్రజాస్వామ్య చరిత్రలో స్వర్ణయుగం. కొన్ని దశాబ్దాల తర్వాత పూర్తి స్థాయి మెజార్టీతో వరసగా రెండో సారి ఒకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన శుభ సమయం. భారత్‌ని అత్యున్నత స్థానంలోకి తీసుకువెళ్లి గ్లోబల్ లీడర్‌గా చూడాలని కలలు కన్న భారతీయులు మమ్మల్ని గెలిపించారు. ఆ కల సాకారం చేసే దిశగా గత ఏడాదిలో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం. ఆర్టికల్ 370 రద్దు ద్వారా జాతి ఐక్యత, సమగ్రతా స్ఫూర్తిని చాటి చెప్పాం. రామజన్మభూమి వివాదానికి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా పరిష్కారం లభించడం హర్షణీ యం. అత్యంత అనాగరికమైన ట్రిపుల్ తలాక్ విధానాన్ని చెత్తబుట్టలో పడేశాం. పౌరసత్వ చట్ట సవరణల ద్వారా భారత్ దయాగుణం, కలిసిపోయే తత్వాన్ని తెలియజేశాం’.
రైతులు, మహిళలు, యువత సాధికారత
‘మహిళలు, యువత, రైతుల సా«ధికారతకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తాం. పీఎం సమ్మాన్ నిధి పథకం ద్వారా 9 కోట్ల 50 లక్షల మందికిపైగా రైతుల అకౌంట్లలో రూ.72 వేల కోట్లు జమచేశాం. గ్రామీణ భారత్‌లో 15 కోట్ల ఇళ్లకు జల్ జీవన్ మిషన్ ద్వారా స్వచ్ఛమైన మంచినీరు అందించే ప్రయత్నాలు సాగుతున్నాయి. రైతులు, రైతు కూలీలు, అసంఘటిత రంగంలో ఉన్న 60 ఏళ్లు పై బడిన వారికి నెలకి రూ.3 వేలు పింఛన్ ఇవ్వాలని హామీ ఇచ్చాం’
తొలిగిపోతున్న గ్రామీణ, పట్టణ అంతరాలు
‘పట్టణాలు, గ్రామాల మధ్య అంతరాలు తొలగిపోతున్నాయి. పట్టణాల్లో ప్రజల కంటే 10శాతం ఎక్కువగా గ్రామీణ ప్రాంత ప్రజలు ఇంటర్నెట్‌ను వాడుతున్నారు. స్వయం సహాయక గ్రూపుల్లో 7 కోట్ల మందికిపైగా గ్రామీణ మహిళలకు ఆర్థికంగా అండగా ఉంటున్నాం. ఇన్నాళ్లూ రూ.10 లక్షల రుణ పరిమితిని రూ.20 లక్షలకు పెంచాం. ఆదివాసీ పిల్లల విద్య కోసం 400కిపైగా ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలల్ని నిర్మిస్తున్నాం’
కరోనాపై ఐక్య పోరాటం
‘ఏడాది కాలంలో తీసుకున్న ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలతో దేశం ప్రగతి పట్టాలెక్కింది. అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఎన్నో సమస్యలు మనకి సవాళ్లు విసురుతున్నాయి. నేను రేయింబగళ్లు కష్టపడుతున్నాను. నాలోకూడా కొన్ని లోటుపాట్లు ఉండే ఉంటాయి. కానీ మన దేశానికి లోటు లేదు. నా మీద నాకున్న నమ్మకం కంటే మీ మీద, మీ బలం మీద, మీ సామర్థ్యం మీద ఉన్న విశ్వాసం ఎక్కువ. కరోనాపై పోరులో ఐక్యతను చూసి ప్రపంచ దేశాలు విస్తుపోయాయి’
ఆత్మనిర్భర్ భారత్‌తో కొత్త దశ దిశ
‘లాక్‌డౌన్ సమయంలో మన కూలీలు, వలస కార్మికులు, చేతివృత్తుల వారు, కళాకారులు, కుటీర పరిశ్రమల్లో పనిచేసేవారు, ఇలా సాటి పౌరులెందరో చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. వారిని సమస్యల నుంచి గట్టెక్కించడానికి మనందరం పట్టుదలతో, ఐక్యతగా పనిచేస్తున్నాం. స్వయం సమృద్ధ భారత్‌ను సాధించడం ద్వారా మనం దేని మీదనైనా విజయం సాధించగలం. ఇటీవల ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీతో మన దేశ దశ, దిశ మారుతుంది. ఈ ప్యాకేజీ ద్వారా రైతులు, కార్మికులు, యువత, చిన్న తరహా పరిశ్రమలు నడిపేవారు ప్రతీ భారతీయుడికి ఉపాధి దొరికి కొత్త శకం ప్రారంభమవుతుంది’.
గ్లోబల్ లీడర్‌గా భారత్!
Published Sun, May 31 2020 4:14 AM | Last Updated on Sun, May 31 2020 8:24 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment