Atma Nirbhar Bharat Abhiyan
-
Mission Divyastra: అమ్ములపొదిలో దివ్యాస్త్రం
బాలాసోర్/న్యూఢిల్లీ: మన అమ్ములపొదిలోకి తిరుగులేని ‘దివ్యాస్త్రం’ చేరింది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) మరో అద్భుతం చేసింది. ఒకటికి మించిన లక్ష్యాలను ఒకేసారి అత్యంత కచి్చతత్వంతో ఛేదించగల అత్యాధునిక ఖండాంతర అణు క్షిపణి అగ్ని–5ను తొలిసారి ప్రయోగించింది. నిర్దేశించిన ఒకటికి మించిన లక్ష్యాలను అది విజయవంతంగా ఛేదించింది! శత్రు దేశాలకు వణకు పుట్టించగల ఈ ‘దివ్యాస్త్రం’ ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతమిచ్చేలా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందింది. దీనిలో తొలిసారిగా వాడిన మలి్టపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికిల్ (ఎంఐఆర్వీ) సాంకేతికత ద్వారా ఒకే క్షిపణితో వేర్వేరు లక్ష్యాలపై అనేక వార్ హెడ్లను పూర్తి కచి్చతత్వంతో ప్రయోగించవచ్చు. 5,000 నుంచి 5,800 కిలోమీటర్ల లోపు లక్ష్యాలను అగ్ని–5 ఛేదించగలదు. తక్కువ బరువున్న వార్హెడ్లను అమర్చే పక్షంలో క్షిపణి రేంజ్ ఏకంగా 8,000 కి.మీ. దాకా పెరుగుతుంది! ‘మిషన్ దివ్యాస్త్ర’ పేరిట జరిగిన ఒడిశా తీర సమీపంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి సోమవారం జరిగిన ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. ‘‘మిషన్ దివ్యాస్త్రను దిగ్విజయం చేసిన డీఆర్డీఓ సైంటిస్టులకు హృదయపూర్వక అభినందనలు. వారి ఘనతను చూసి గరి్వస్తున్నా’’అంటూ ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అతి కొద్ది దేశాల సరసన... అగ్ని–5 పరీక్ష విజయవంతం కావడంతో ఎంఐఆర్వీ సామర్థ్యమున్న అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరిందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ‘‘దేశ దీర్ఘకాలిక రక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అగ్ని–5ని అభివృద్ధి చేశాం. భారత శాస్త్ర, సాంకేతిక నైపుణ్యానికి ఇది మచ్చుతునక. ఈ ప్రాజెక్టు డైరెక్టర్ మహిళ కావడం విశేషం. రక్షణ రంగంలోనూ దేశ ప్రగతికి నారీ శక్తి ఎంతగా దోహదపడుతోందో చెప్పేందుకు ఇది తాజా తార్కాణం’’ అని వివరించాయి. అగ్ని–1 నుంచి అగ్ని–4 దాకా ఇప్పటిదాకా అభివృద్ధి చేసిన క్షిపణుల రేంజ్ 700 కి.మీ. నుంచి 3,500 కి.మీ. దాకా ఉంది. ఇవిప్పటికే రక్షణ దళంలో చేరాయి. భూ వాతావరణ పరిధిలోనూ, దాని ఆవల కూడా ఖండాంతర క్షిపణులను ప్రయోగించడంతో పాటు విజయవంతంగా అడ్డగించే సామర్థ్యాల సముపార్జనలో భారత్ ఏటేటా ప్రగతి సాధిస్తూ వస్తోంది. మొత్తం ఆసియా ఖండంతో పాటు యూరప్‌లో కూడా పలు ప్రాంతాలు అగ్ని–5 పరిధిలోకి వస్తాయి! అణు దాడులు చేయడమే గాక వాటిని అడ్డుకునే సత్తా దీని సొంతం. -
‘సెమీ’ ఆశలకు సడన్ బ్రేకులు!
ఆశించిన పురోగతికి అర్ధంతరంగా బ్రేకులు పడినప్పుడు నిరాశ సహజమే! అందులోనూ అది సాక్షాత్తూ ప్రధాని గొప్పగా చెప్పిన ఆత్మనిర్భర ఆశయాలకు భంగకరమని అనిపించినప్పుడు నిరుత్సాహం మరీ ఎక్కువే! భారత దేశ సెమీ కండక్టర్ల (చిప్‌ల) తయారీ ఆకాంక్షలకు ఇప్పుడు అలాంటి అవరోధాలే వచ్చాయి. సెమీ కండక్టర్ల తయారీకి కలసి కృషి చేసేందుకు ఒక్కటైన తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ ‘ఫాక్స్‌కాన్’, భారత సంస్థ ‘వేదాంత’ ఇప్పుడు దేని దారి అది చూసుకోవడం అలాంటి పరిణామమే. దీనివల్ల భారత చిప్ లక్ష్యాలకు ఇబ్బంది ఏమీ ఉండదని కేంద్రం చెబుతున్నప్పటికీ అది సంపూర్ణ సత్యమేమీ కాదు. చిప్‌ల తయారీ నిమిత్తం వేదాంత– ఫాక్స్‌కాన్‌లు గత ఏడాది ఉమ్మడి భాగస్వామ్యానికి దిగి, గుజరాత్ ప్రభుత్వంతో 19.5 బిలియన్ డాలర్ల విలువైన సెమీ కండర్ల కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నాయి. తీరా పట్టుమని పది నెలలకే ఆ గ్రూపు నుంచి వైదొలగుతున్నట్టు ఫాక్స్‌కాన్ ప్రకటించడం ఒక విధంగా ఆకస్మిక బ్రేకనే చెప్పాలి. ఎలక్ట్రానిక్స్ తయారీ, డిజైన్ రంగంలో ప్రపంచ కేంద్రంగా మన దేశం ఆవిర్భవించేందుకు తగిన వాతావరణ పరికల్పనే లక్ష్యంగా పెట్టుకున్న భారత సెమీ కండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)కు ఇది శుభవార్త కానే కాదు. ‘సెమీ కండక్టర్ల ఆలోచనను నిజం చేయడానికి’ వేదాంత సంస్థతో కలసి ఏడాది పైగా కృషి చేసిన ఫాక్స్‌కాన్ పరస్పర అంగీకారంతో, ఈ ఉమ్మడి భాగస్వామ్య ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సోమవారం ప్రకటించింది. అంటే ఇక ఆ బృహత్ ప్రయత్నంలో ఫాక్స్‌కాన్ పేరు ఉండదు. ప్రాజెక్ట్ పూర్తిగా వేదాంత సంస్థకే సొంతమన్నమాట. తొలి ప్రకటన వచ్చిన 24 గంటలలోపే ఇటు ఫాక్స్‌కాన్ సైతం విడిగా తగిన సాంకేతిక భాగస్వామిని చేర్చుకొని, తనదైన వ్యూహంతో ముందుకు నడుస్తుందన్న సంకేతాలొచ్చేశాయి. కలసి అడుగులేసిన సంస్థలు ఏడాదికే ఇలా వేరు కుం పట్లయిన పరిణామానికి కారణాలేమిటన్నది అవి చెప్పలేదు. గుజరాత్లో చిప్‌ల తయారీకి కావాల్సిన లైసెన్స్‌తో కూడిన సాంకేతిక పరిజ్ఞానంకోసం వేదాంత, ఫాక్స్‌కాన్‌లు ఎస్టీమైక్రోను ఆసరాగా బరిలోకి దింపాయి. కానీ, ప్రభుత్వం మాత్రం సదరు యూరోపియన్ చిప్ తయారీ సంస్థ కూడా నిష్పూచీగా మిగలక, ఒప్పందంలో భాగస్వామిగా ఉండాల్సిందే అనడంతో చిక్కొచ్చినట్టుంది. ప్రపంచంలో 37 శాతం చిప్‌లు తైవాన్వే! భారత ఎలక్ట్రానిక్ చిప్ అవసరాలన్నీ ప్రధానంగా దిగుమతి ద్వారానే తీరుతున్నాయి. కొన్నేళ్ళుగా ఏటా దాదాపు 1000 కోట్ల డాలర్ల విలువైన చిప్‌లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అందులో సుమారు 70 శాతం చైనా నుంచి వస్తున్నవే. చిప్‌ల తయారీలోని ఈ అంతరాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఐఎస్ఎం ప్రారంభమైంది. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, అనేక ఐరోపా దేశాలు చిప్‌ల తయారీ సత్తా పెంచుకుంటున్నాయి. తాజాగా భారత్ ఆ పరుగులో చేరింది. దేశంలో చిప్‌ల తయారీ కేంద్రాల్ని నెలకొల్పాలని వచ్చేవారికి పెట్టుబడి రూపంలో ప్రోత్సాహకాలిచ్చేందుకు సిద్ధపడింది. అమెరికా చిప్ తయారీ సంస్థ మైక్రాన్ ఇటీవలే భారత్‌లో చిప్ కేంద్రానికి ఆమోదం పొందింది. కేంద్ర, గుజరాత్ సర్కార్లు దానికి గణనీయంగా పెట్టుబడి సాయం చేస్తున్నాయి. ఆత్మ నిర్భరతకై ఇలాంటి యత్నాలు జరుగుతున్న వేళ భారీ ఒప్పందమైన వేదాంత – ఫాక్స్‌కాన్ చిక్కుల్లో పడడమే విచారకరం. కారణాలేమైనా గత ఏడాది ఫిబ్రవరి 14న ఫాక్స్‌కాన్– వేదాంతల మధ్య మొలకెత్తిన ప్రేమ మూణ్ణాళ్ళ ముచ్చటైంది. గుజరాత్లో చిప్‌ల తయారీ కేంద్రాల ఏర్పాటుకై గత సెప్టెంబర్‌లో చేసుకున్న రూ. 1.54 లక్ష కోట్ల మేర ఒప్పందాలు ఇరుకునపడ్డాయి. ఏ సంస్థకు ఆ సంస్థ విడివిడిగా ముందుకు పోయినా భారత సెమీ కండక్టర్ల మిషన్‌లో జాప్యం తప్పదనిపిస్తోంది. చిప్‌ల తయారీకి తగ్గ పునాది లేకున్నా చిప్ డిజైన్‌లో మాత్రం మన దేశం ముందంజలో ఉంది. దాన్ని ఆయుధంగా మలుచుకోవాలి. సొంత తయారీతో పదునుపెట్టుకోవాలి. పైగా, కరోనాతో సరఫరా వ్యవస్థలకు అంతరాయం, రష్యా – ఉక్రెయిన్ యుద్ధంతో వచ్చిపడ్డ అనివార్యతల రీత్యా రక్షణ, ఎలక్ట్రానిక్స్ తదితర కీలక రంగాల్లో భారత్ ఎంత త్వరగా సొంతకాళ్ళపై నిలబడగలిగితే వ్యూహాత్మకంగా అంత మంచిది. ఆ మాటకొస్తే, ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అమెరికా పైచేయి సాధించగలిగిందీ ఈ చిప్‌ల వల్లేనంటారు విశ్లేషకులు. అమెరికా, చైనాల మధ్య ఇప్పుడు నడుస్తున్న భౌగోళిక రాజకీయాల తోపులాటలోకూ ఇవే కారణం. ఇవాళ దేశాలన్నీ తమ గడ్డపైనే అన్ని రకాల చిప్‌ల రూపకల్పనకు అత్యంత ప్రాధాన్యమిస్తోందీ, ప్రోత్సాహకాలిస్తున్నదీ అందుకే. కాబట్టి, మనకు అవసరమైన చిప్‌ల డిజైనింగ్ నుంచి తయారీ దాకా అన్నీ మన చేతుల్లోనే ఉండడం పోటీలో ముందు ఉండడానికో, ఆర్థిక ప్రయోజనాల రీత్యానో కాకున్నా... వ్యూహాత్మకంగా భారత్‌కు అత్యంత కీలకం. అందుకే, వేదాంత – ఫాక్స్‌కాన్‌ల బంధం విచ్ఛిన్నమైందన్న నిరాశను పక్కనపెట్టి, సెమీ కండక్టర్ల రంగాన్ని దృఢంగా నిర్మించేందుకు మరింతగా కృషి చేయాలి. చైనా లాంటివి పడనివ్వకుండా చేసినా పట్టుదలతో సాగాలి. వేదాంత – ఫాక్స్‌కాన్‌లకు ఇరుకున పెట్టిన ఆర్థిక, సాంకేతిక అంశాలనూ క్షుణ్ణంగా పరిశీలించాలి. భవిష్యత్తులో ఇలాంటి మరో ప్రయత్నానికి ఆ చిక్కులు రాకుండా నివారించాలి. సెమీ కండక్టర్ల రంగంలో సాంకేతిక విజ్ఞాన బదలీని ప్రోత్సహించాలి. పరిశోధన, అభివృద్ధిలో దేశ, విదేశీ సంస్థల మధ్య సహకారాన్నీ పెంచిపోషించడమూ అంతే ముఖ్యం. ఎందుకంటే, ఐఎస్ఎం కింద రూ. 76 వేల కోట్ల కేటాయింపుతో నాలుగు పథకాలు ప్రవేశపెట్టామంటున్న ప్రభుత్వం సంస్థలకు తగిన వాతావరణం కల్పిస్తేనే ఫలితం. మేకిన్ ఇండియాకు బ్రేకులు పడకూడదంటే అది అత్యంత కీలకం. -
Roundup 2022: మెరుపులు..మరకలు
ప్రగతి పథంలో సాగుతున్న ‘స్వతంత్ర’ కవాతుకు అమృతోత్సవ సంబరాలు... ఆదివాసీ మహిళను దేశ అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టిన ప్రజాస్వామ్య సొగసులు... ‘ఆత్మ నిర్భర్’ లక్ష్యంతో రక్షణ రంగంలో అగ్ని, ప్రచండ, విక్రాంత్ మెరుపులు... అంతరిక్ష రంగంలో ఇతర దేశాలతో పోటీ పడేలా తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్–ఎస్ చిమ్మిన నిప్పులు... బ్రిటన్ను దాటేసి ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వడివడిగా పెట్టిన పరుగులు... కంటికి కనిపించని క్రిమిపై పోరాటంలో ప్రపంచ దేశాలకు చూపిన ఆదర్శం... ...ఇవన్నీ ఈ ఏడాది మనం సాధించిన ఘన విజయాల్లో కొన్ని. సైన్యంలో తాత్కాలిక నియామకాలకు తెరలేపిన ‘అగ్ని’పథం, మైనార్టీ మహిళల హిజాబ్ ధారణపై వివాదం ...వంటి కొన్ని మరకలు. ఎంతో ఇష్టం, కొంచెం కష్టంగా సాగిన 2022లో ముఖ్య ఘటనలపై విహంగ వీక్షణం... మెరుపులు ► దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత ఒక ఆదివాసీ మహిళ అత్యున్నత పదవిని అధిష్టించడం ఒక చరిత్రగా నిలిచింది. సంతాల్ గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ము (64) అధికార ఎన్డీయే అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో నెగ్గి కొత్త చరిత్ర లిఖించారు. దేశ 15వ రాష్ట్రపతిగా సగర్వంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ఒడిశాలో మయూర్భంజ్ జిల్లాకు చెందినవారు. ► భారత్ ఈ ఏడాది ఆర్థికంగా పుంజుకొని యూకేను కూడా దాటేసి ప్రపంచంలోని అతి పెద్ద అయిదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని నవంబర్ 15న అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్ఎఫ్) తన నివేదికలో వెల్లడించింది. ► భారత్ తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్–ఎస్ నవంబర్ 18న శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా దూసుకుపోయింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అనే స్టార్టప్ కంపెనీ రూపొందించిన ఈ రాకెట్ మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకువెళ్లింది. ► దేశంలో డిజిటల్ లావాదేవీలు పెంచడానికి, కాగితం కరెన్సీ నిర్వహణకయ్యే ఖర్చుని తగ్గించడం కోసం ఆర్బీఐ డిసెంబర్ 1 నుంచి ప్రయోగాత్మకంగా డిజిటల్ రుపీని అమల్లోకి తీసుకువచ్చింది. ► ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతమిస్తూ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బాహుబలి యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 2న కొచ్చితీరంలో జాతికి అంకితం చేశారు. రూ.20వేల కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ నౌక క్షిపణి దాడుల్ని తట్టుకోగలదు. ఇలాంటి సామర్థ్యం కలిగిన యుద్ధనౌకలున్న అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ సరసన సగర్వంగా తలెత్తుకొని నిల్చున్నాం. భారత వాయుసేనలో తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ప్రచండని అక్టోబర్‌లో ప్రవేశపెట్టారు. ఇక అణు పేలోడ్లను మోసుకువెళ్లే సామర్థ్యం కలిగిన అగ్ని–5 క్షిపణిని డిసెంబర్ 15న విజయవంతంగా ప్రయోగించడంతో త్రివిధ బలగాలు బలోపేతమయ్యాయి. మరకలు ► సైన్యంలో తాత్కాలిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం దేశవ్యాప్తంగా అగ్గిరాజేసింది. యువకులకు నాలుగేళ్లు సైన్యంలో పనిచేసే అవకాశం మాత్రమే కల్పించడంతో పాటు పింఛన్ సదుపాయం కూడా లేని ఈ పథకానికి జూన్ 14న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, తెలంగాణ, ఒడిశా, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆందోళనలు హింసకు దారితీశాయి. ► కర్ణాటకలో ఉడిపిలో కళాశాలలో జనవరిలో హిజాబ్ ధరించి వచ్చినందుకు కొందరు ముస్లిం అమ్మాయిలను తరగతి గదుల్లోకి రానివ్వకపోవడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. వీరికి పోటీగా కొందరు విద్యార్థులు కాషాయ దుస్తులు ధరించి రావడంతో మతఘర్షణలకు దారి తీసింది. కర్ణాటక ప్రభుత్వం ఫిబ్రవరి 5న హిజాబ్‌పై నిషేధం విధిస్తే మార్చి 15న హైకోర్టు దానిని సమర్థిస్తూ తీర్పు చెప్పింది. అక్టోబర్ 13న సుప్రీంకోర్టు భిన్న తీర్పులు వెలువరించడంతో తుది నిర్ణయం భారత ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని బెంచ్ చేతుల్లోకి వెళ్లింది. ► గుజరాత్‌లోని మోర్బిలో అక్టోబర్ 30 కుప్పకూలిపోయిన కేబుల్ వంతెన దుర్ఘటనలో 138 మంది మరణించారు. మానవ తప్పిదాల కారణంగానే ఈ వంతెన కుప్పకూలిపోయింది. ఒకేసారి వంతెనపైకి వంద మంది వెళ్లడానికి మాత్రమే వీలుంటే, నిర్వాహకులు 500 మందిని పంపడంతో ప్రమాదం జరిగింది. ► ఢిల్లీలో నివాసముంటున్న శ్రద్ధా వాకర్ అనే యువతిని ఆమెతో సహజీవనం చేస్తున్న అఫ్తాబ్ పూనెవాలె మే 18న గొంతు కోసి హత్య చేయడంతో పాటు ఆమె మృతదేహాన్ని 35 ముక్కలు చేసి చుట్టుపక్కల అడవుల్లో పారేసిన ఘటన దేశంలో సంచలనం సృష్టించింది. మృతదేహం ముక్కల్ని ఫ్రిజ్‌లో ఉంచి రోజుకి కొన్ని పారేసిన వైనం ఒళ్లు జలదరించేలా చేసింది. నవంబర్ 11న అఫ్తాబ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విషాదాలు ► యావత్ భారతావనిని దుఃఖసాగరంలో ముంచేస్తూ భారతరత్న, గానకోకిల లతామంగేష్కర్ (92); పద్మవిభూషణ్, కథక్ దిగ్గజం పండిట్ బిర్జు మహరాజ్ (83) తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. ► సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ములాయం సింగ్ యాదవ్ కన్నుమూయడంతో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఉజ్జ్వల శకానికి తెర పడింది. యాత్రలు, విజయాలు, చీలికలు ► కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 12 రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన 150 రోజుల భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న ప్రారంభమైంది. ఇటీవల వంద రోజులు పూర్తి చేసుకుంది. ► గాంధీ కుటుంబానికి చెందని సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టి రికార్డు సృష్టించారు. ► ఈ ఏడాది మొదట్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా; చివర్లో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా... ఇలా ఐదు రాష్ట్రాల్లో నెగ్గి బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. కాంగ్రెస్ హిమాచల్‌తో సరిపెట్టుకోగా ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్యంగా పంజాబ్‌లో అఖండ విజయం సాధించింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ నెగ్గి బీజేపీ 15 ఏళ్ల పాలనకు తెరదించింది. జాతీయ పార్టీగానూ అవతరించింది! ► బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి యూ టర్న్ తీసుకున్నారు. ఆగస్టులో ఎన్డీయేకి గుడ్ బైకొట్టి తిరిగి మహాఘట్బంధన్లో చేరి ఆర్జేడీ, కాంగ్రెస్ మద్దతుతో మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టారు. ► మహారాష్ట్రలో శివసేన కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంది. పార్టీని ఏక్నాథ్ షిండే రెండు ముక్కలు చేశారు. భారీగా ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీ మద్దతుతో సీఎం అయ్యారు. ► నేషనల్ హెరాల్డ్ కేసు గాంధీ కుటుంబాన్ని వెంటాడుతోంది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు తొలిసారిగా ఈ ఏడాది ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. కేంద్ర విచారణ సంస్థలైన ఈడీ, సీబీఐ ఈ ఏడాదంతా బిజీగా గడిపాయి. పలు విపక్ష పార్టీల నేతలను విచారించాయి. పలువురిని అరెస్టు చేశాయి. దీని వెనక రాజకీయ కక్షసాధింపు ఉందంటూ విపక్షాలు మండిపడ్డాయి. చరిత్రాత్మక తీర్పులు... ► అత్యంత వివాదాస్పదమైన దేశద్రోహ చట్టంపై 124ఏ అమలుపై స్టే విధిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం మే 11న తీర్పు చెప్పింది. 124ఏపై కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలన పూర్తయ్యేవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు నమోదు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ► మహిళల శరీరంపై వారికే హక్కు ఉందని అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పునిచ్చింది. పెళ్లితో సంబంధం లేకుండా మహిళలందరూ 24 వారాలవరకు సురక్షిత గర్భవిచ్ఛిత్తికి అనుమతినిచ్చింది. సెప్టెంబర్ 29న ఈ తీర్పు చెప్పిన సుప్రీం అబార్షన్ చట్టాల ప్రకారం పెళ్లయినవారు, కాని వారు అన్న తేడా ఉండదని స్పష్టం చేసింది. ► భార్య ఇష్టానికి వ్యతిరేకంగా భర్త శృంగారం చేసినా అది అత్యాచారం కిందకే వస్తుందని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఎంటీపీ చట్టం ప్రకారం మారిటల్ రేప్‌లు కూడా అత్యాచారం కిందకే వస్తాయని స్పష్టం చేసింది. ► ఇంటి అల్లుడు ఇంటి నిర్మాణం కోసం డబ్బులు డిమాండ్ చేసినా అది కట్నం కిందకే వస్తుందని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. విశ్వవేదికపై... ► ప్రపంచంలో అత్యంత శక్తిమంతదేశాల కూటమి జీ20కి అధ్యక్ష బాధ్యతల్ని భారత్ స్వీకరించింది. 2023 నవంబర్ 30 దాకా ఈ బాధ్యతల్లో కొనసాగనుంది. 50 నగరాల్లో 200 సన్నాహక భేటీల అనంతరం 2023 సెప్టెంబర్‌లో ఢిల్లీలో జీ20 సదస్సును నిర్వహించనుంది. ► ఐరాస భద్రతా మండలి అధ్యక్ష హోదాలో కౌంటర్ టెర్రరిజం కమిటీ (సీటీసీ) సదస్సును అక్టోబర్ 28, 29 తేదీల్లో ముంబై, ఢిల్లీల్లో జరిగింది. ► అరుణాచల్‌ప్రదేశ్‌లో తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికుల మధ్య డిసెంబర్ 9న ఘర్షణలు జరిగాయి. వాస్తవాధీన రేఖ దాటి చొచ్చుకొచ్చేందుకు చైనా చేసిన ప్రయత్నాలను మన బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. -
రక్షణ రంగంలో రూ.8,431 కోట్ల ఎగుమతులు
సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ అమలు ద్వారా అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయని రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ సతీష్‌రెడ్డి చెప్పారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బుధవారం విశాఖపట్నం వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. మేకిన్ ఇండియాలో భాగంగా డీఆర్డీవో నుంచి సాంకేతిక బదలాయింపుని ప్రోత్సహించడం ద్వారా రక్షణ సామగ్రి ఉత్పత్తులు పెరిగాయని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. పెరుగుతున్న ఎగుమతులు దేశీయ తయారీ రంగానికి ఉత్తేజం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు రక్షణ పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేసింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారవుతున్న ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతిచేసే స్థాయికి చేరుకున్నాం. 2014–15 నాటికి రూ.2 వేల కోట్ల కంటే తక్కువలో ఉన్న డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ 2020–21 నాటికి రూ.8,431 కోట్లకు చేరుకోవడం విశేషం. పదుల సంఖ్యలో దేశాలకు ఎగుమతులు జరుగుతుండటం శుభపరిణామం. ప్రస్తుతం 334 శాతం పెరుగుదల ఉన్న ఎగుమతులు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. టార్పెడోలు, రాడార్ల ఎగుమతులపై చర్చలు పలు దేశాలు మన రక్షణరంగ పరికరాలతో పాటు ఆయుధ సంపత్తిని తీసుకుంటున్నాయి. త్వరలోనే అత్యంత శక్తిమంతమైన ఆయుధాల ఎగుమతులకు కూడా ఒప్పందాలు జరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆకాష్, టార్పెడోలు, రాడార్లతో పాటు క్షిపణుల ఎగుమతులపై ప్రభుత్వం వివిధ దేశాలతో చర్చిస్తోంది. సాంకేతిక బదలాయింపుతో ప్రోత్సాహం రక్షణ రంగానికి అవసరమైన ఇన్నోవేషన్స్‌ని సృష్టించే అంకుర పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తున్నాం. డిఫెన్స్ ఇన్నోవేషన్ స్టార్టప్ చాలెంజ్ ద్వారా సాంకేతికత బదలాయింపు జరుగుతోంది. ఇప్పటికే డీఆర్డీవో నుంచి 60 పరిశ్రమలకు దాదాపు రూ.250 కోట్లకుపైగా టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ అందించాం. డిఫెన్స్ రంగం వైపు ఎక్కువ స్టార్టప్స్ అడుగులు వేస్తున్నాయి. పరిశోధనల అభివృద్ధి (ఆర్ అండ్ డీ)లోను మార్పులు వస్తున్నాయి. క్వాంటం, హైపవర్ లేజర్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్.. ఇలా ఎన్నో పరిశోధనలు వస్తున్నాయి. వీటిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్ అండ్ డీ బడ్జెట్లో 25 శాతం వరకు పరిశ్రమలు, స్టార్టప్స్, విద్యారంగానికి కేటాయించడం చరిత్రాత్మకమైన నిర్ణయం. ఏఐపీ ప్రయోగాలు విజయవంతమవుతున్నాయి డీఆర్డీవోకి చెందిన నేవల్ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (ఎన్‌ఎంఆర్‌ఎల్)లో అభివృద్ధి చేసిన ఇంధన ఆధారిత ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్(ఏఐపీ) ల్యాండ్ బేస్డ్ ప్రోటోటైప్ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. త్వరలో ఇంటిగ్రేషన్ చేయాలి. ఇతర సాంకేతికతలతో పోల్చిచూస్తే ఫ్యూయల్ బేస్డ్ ఏఐపీ సబ్మెరైన్లకు ఎంతో ఉపయోగపడుతుంది. శారదాపీఠంలో సతీష్‌రెడ్డి పూజలు సింహాచలం: విశాఖపట్నం చినముషిడివాడలోని శ్రీ శారదాపీఠాన్ని బుధవారం కేంద్ర రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు సతీష్‌రెడ్డి దర్శించుకున్నారు. పీఠంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి పూజలు చేశారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి ఆశీస్సులు అందుకున్నారు. -
స్వావలంబనకు స్ఫూర్తి ఖాదీ
అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం గుజరాత్‌కు చేరుకున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అహ్మదాబాద్‌లోని సబర్మతీ రివర్‌ఫ్రంట్ వద్ద నిర్వహించిన ‘ఖాదీ ఉత్సవ్’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభివృద్ధి లక్ష్యాల సాధనకు, ఆత్మనిర్భర్ భారత్(స్వాలంబన)నకు ఖాదీ స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఒకప్పుడు మన ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఖాదీని దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేశారని వాపోయారు. ఖాదీ ఉత్పత్తులను విస్తృతంగా వినియోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాబోయే పండుగ సీజన్లో బంధుమిత్రులకు ఖాదీ గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులను బహుమతులుగా అందజేయాలని అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని 7,500 మంది ఇక్కడ చరఖా తిప్పి సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రధాని మోదీ సైతం స్వయంగా చరఖా తిప్పారు. అహ్మదాబాద్‌లో నూతన ఖాదీ గ్రామోద్యోగ్ భవనాన్ని ప్రారంభించారు. సబర్మతీపై అటల్ బ్రిడ్జి ప్రారంభం గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో సబర్మతీ నదిపై పాదచారులు, సైక్లిస్ట్ల సౌకర్యార్థం నిర్మించిన ‘అటల్ బ్రిడ్జి’ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి స్థానికులు అర్పిస్తున్న నివాళి ఈ వారధి అని చెప్పారు. అటల్ బ్రిడ్జిపై మోదీతోపాటు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సి.ఆర్.పాటిల్ కాసేపు సరదాగా నడిచారు. ప్రజలకు అభివాదం చేశారు. అటల్ బ్రిడ్జి సబర్మతీ నది రెండు ఒడ్డులను అనుసంధానించడమే కాదు, విశిష్టమైన, వినూత్నమైన డిజైన్‌తో ఆకట్టుకుంటోందని మోదీ అన్నారు. అటల్‌జీని గుజరాత్ ఎంతగానో ప్రేమించిందని చెప్పారు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన గాంధీనగర్ నుంచి పోటీచేసి, రికార్డుస్థాయిలో ఓట్లు సాధించి, ఘన విజయం సాధించారని గుర్తుచేశారు. ► అటల్ బ్రిడ్జి పొడవు 300 మీటర్లు. మధ్యభాగంలో దీని వెడల్పు 14 మీటర్లు. ► పాదచారులు, సైకిల్ ప్రయాణికులు మాత్రమే ఉపయోగించుకోవచ్చు. ► విభిన్నమైన డిజైన్, ఎల్ఈడీ లైటింగ్‌తో చూపరులకు కనువిందు చేస్తోంది. ► సబర్మతీ రివర్‌ఫ్రంట్ పశ్చిమ భాగంలోని ఫ్లవర్ గార్డెన్‌ను, తూర్పు భాగంలో రాబోయే ఆర్ట్స్ అండ్ కల్చరల్ సెంటర్‌ను అనుసంధానిస్తుంది. ► 2,600 మెట్రిక్ టన్నుల స్టీల్ పైపులు ఉపయోగించి అటల్ బ్రిడ్జి నిర్మించారు. ► పైకప్పును రంగుల వస్త్రంతో అలంకరించారు. సబర్మతీ నదిపై అటల్ వంతెన (ఇన్సెట్లో) వంతెనను ప్రారంభిస్తున మోదీ -
కేంద్రం తీరు మారితేనే ‘ఆత్మ నిర్భర్’ ఫలప్రదం
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల ఏర్పాటు విషయంలో, ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీరు మారాలని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె. తారక రామారావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం ఫలప్రదం కావాలంటే కేంద్రం ఆలోచనా విధానం మారాలని ఆయన అన్నారు. ఓట్లు్ల.. సీట్లు ఉన్నాయని, పెద్దన్న పాత్ర పోషిస్తున్నామని కేంద్రం పరిశ్రమలను ఇష్టారీతిన తరలించడం సరికాదని విమర్శించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్)లో సుమారు 512 ఎకరాల విస్తీర్ణంలో వెమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న సమీకృత రక్షణ వ్యవస్థల తయారీ కేంద్రానికి మంత్రి కేటీఆర్ బుధవారం భూమి పూజ నిర్వహించారు. వెమ్ టెక్నాలజీస్ చైర్మన్ వెంకటరాజు, రక్షణ శాఖ మాజీ మంత్రి పళ్లంరాజు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వెమ్ టెక్నాలజీస్ భారతదేశపు లాక్‌హీడ్ మార్టిన్ (అమెరికా ఆయుధ కంపెనీ)గా ఎదుగుతుందన్న నమ్మకం తనకుందని అన్నారు. హైదరాబాద్, బెంగళూరులలో ఇప్పటికే కొన్ని రక్షణ రంగ పరిశ్రమలు ఉన్న నేపథ్యంలో.. ఈ రెండు నగరాల మధ్య రక్షణ రంగ తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించేలా ఒక కారిడార్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి గతంలోనే ప్రతిపాదించామని తెలిపారు. ఈ పారిశ్రామిక కారిడార్ కారణంగా తెలంగాణ మాత్రమే కాకుండా ఏపీలోని కర్నూలు, అనంతపురం జిల్లాలకూ ప్రయోజనం చేకూరే అవకాశం ఉండగా.. కేంద్రం దాన్ని ఎకాఎకిన ఎలాంటి మౌలిక సదుపాయాలు లేని బుందేల్‌ఖండ్‌కు తరలించిందని, ఇది సరికాదని ఆన్నారు. స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలి వెమ్ టెక్నాలజీస్ నిమ్జ్‌లో ఏర్పాటు చేస్తున్న ఫ్యాక్టరీలో క్షిపణులు, ఆయుధాలు, రాడార్లు, యుద్ధ విమానాల విడిభాగాలన్నీ తయారవుతాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో పెట్టనున్న ఈ పరిశ్రమతో ప్రత్యక్షంగా రెండు వేల మందికి, పరోక్షంగా నాలుగు వేల మందికి ఉపాధి లభిస్తుందని కేటీఆర్ వివరించారు. ఇక్కడి పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత వెమ్ టెక్నాలజీస్ వంటి సంస్థలపై ఉందని అన్నారు. అవసరమైతే స్థానికులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి మరీ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిననిమ్జ్ ప్రాజెక్టుకు భూములిస్తున్న రైతులకు తగినంత పరిహారం ఇచ్చేందుకు కలెక్టర్లు అన్ని చర్యలూ తీసుకోవాలని చెప్పారు. స్వదేశీ క్షిపణి ‘అసిబల్’ తయారీకి సిద్ధం: వి.వెంకటరాజు 1988లో స్థాపితమైన వెమ్ టెక్నాలజీస్ పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్షిపణిని తయారు చేసేందుకు సిద్ధంగా ఉందని ‘అసిబల్’ పేరుతో తయారయ్యే ఈ క్షిపణి ప్రస్తుతం రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో వాడుతున్న జావెలిన్ తరహా క్షిపణి అని వెమ్ టెక్నాలజీస్ చైర్మన్ వెంకట రాజు తెలిపారు. ప్రైవేట్ రంగంలో తొలిసారి పూర్తిస్థాయి క్షిపణిని తయారు చేసిన కంపెనీగా వెమ్ రికార్డు సృష్టించనుందని ఆయన ‘సాక్షి’తో చెప్పారు. సృష్టికర్త బ్రహ్మ చేతి ఖడ్గం పేరు ‘అసి’ కాగా.. బల్లెం అనే అర్థంలో బల్‌ను ఉపయోగించి క్షిపణి పేరును అసిబల్‌గా నిర్ణయించినట్లు చెప్పారు. ఏడాదికి పదివేల క్షిపణులను తయారు చేసేందుకు సంస్థకు అనుమతులు ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో స్వదేశీ టెక్నాలజీతో ఒక యుద్ధ విమానాన్ని, అత్యాధునిక స్నైపర్ ఆయుధాలు, డ్రోన్లు తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. -
దేశీయంగా 100 యుద్ధ విమానాలు
న్యూఢిల్లీ: ‘ఆత్మ నిర్భర్ భారత్’లో భాగంగా దాదాపు 100 అత్యాధునిక యుద్ధ విమానాలను దేశీయంగా తయారు చేసే దిశగా వాయుసేన భారీ ప్రణాళికల్ని సిద్ధం చేసింది. దీనికి సంబంధించి అంతర్జాతీయ విమాన తయారీ సంస్థలతో చర్చిస్తోంది. ఈ ప్రాజెక్టులో 70 శాతం భారత కరెన్సీనే వాడేలా చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీని వల్ల మేకిన్ ఇండియా ప్రాజెక్టు మరింత బలోపేతం కానుందన్నాయి. ‘‘భారత్‌లో 96 యుద్ధ విమానాల తయారీకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. 36 విమానాల తయారీకి మన కరెన్సీతో పాటు విదేశీ మారక ద్రవ్యమూ చెల్లిస్తాం. 60 విమానాల చెల్లింపులకు పూర్తిగా భారత్ కరెన్సీనే వాడతాం’’ అన్నాయి. -
ఉదయగిరి.. చరిత్రలో ప్రత్యేక స్థానం
ఉదయగిరి.. చరిత్రలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. తిరుమల గిరులను పోలిన ఎత్తైన పర్వతశ్రేణులు, ప్రకృతి సోయగాలు, జలపాతాలతో కనువిందు చేస్తున్న ఉదయగిరి దుర్గం చోళులు, పల్లవులు, రెడ్డి రాజులు, గజపతులు, విజయనగర రాజులు, గోల్కొండ నవాబుల పాలనలో వెలుగు వెలిగింది. ఎంతో కళాత్మకంగా నిర్మించిన ఆలయాలు, మసీదులు, కోటలు, బురుజుల ఆనవాళ్లు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. తాజాగా యుద్ధ నౌకకు ఉదయగిరి పేరు పెట్టడంతో జాతీయ స్థాయిలో ఖ్యాతి లభించింది. సాక్షి, నెల్లూరు/ఉదయగిరి: జిల్లాలోని ఉదయగిరి పేరు జాతీయ స్థాయిలో మారుమోగుతోంది. యుద్ధ నౌకకు ఉదయగిరి పర్వతశ్రేణి పేరు పెట్టారు. మాసాయిపేట కొండపై బంగారు, రాగి, వైట్ క్వార్‌ట్టŠజ్ నిక్షేపాలు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకునేందుకు డ్రిల్లింగ్ పనులు ముమ్మరంగా చేశారు. ఇంకా ఇక్కడ పర్యాటక రంగ అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఆ కాలంలో.. క్రీ.శ 10 నుంచి 19వ శతాబ్దం వరకు ఇక్కడ ఎంతోమంది రాజుల పాలన సాగింది. ఇందులో విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఉదయగిరి దుర్గానికి ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. అందమైన కట్టడాలు, విశాలమైన తటాకాలు ఈయన కాలంలోనే నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయలు కొన్నినెలలపాటు ఉదయగిరి కోటను కేంద్రంగా చేసుకుని పాలన సాగించినట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పటికీ అలనాటి రాజులు, నవాబుల పాలనకు గుర్తుగా ఉదయగిరి కొండపై అద్దాల మేడలు, ఆలయాలు, మసీదులు, కోట బురుజులు దర్శనమిస్తాయి. పేరిలా వచ్చింది సూర్యకిరణాలు ఉదయగిరి కొండ శిఖరంపై ప్రసరించి ప్రకాశవంతంగా దర్శనమిస్తుండడంతో ‘ఉదయ’గిరి పర్వతశ్రేణికి ఉదయగిరిగా పేరు వచ్చినట్లు పెద్దలు చెబుతారు. సముద్రమట్టానికి 3,079 అడుగుల ఎత్తులో ఈ ప్రాంతం ఉంటుంది. తిరుమల గిరులను ఉదయగిరి పర్వతశ్రేణి పోలి ఉంటుంది. ఇందులో 3,600కి పైగా ఔషధ మొక్కలున్నట్లుగా శాస్త్రవేత్తల పరిశోధనలో గుర్తించారు. ఉదయగిరి దుర్గం కోటలు, ఎత్తైన ప్రాకారాలు, దట్టమైన చెట్లు, పక్షుల కిలకిలరావాలు, గలగల పారే జలపాతాలతో నిండి ఉంటుంది. ఓ కోటపైన పర్షియా సంప్రదాయ రీతిలో నిర్మించిన మసీదు ఉంది. దేశంతో ప్రసిద్ధి చెందిన చెక్క నగిషీ బొమ్మల తయారీకి ఉపయోగించే దేవదారు చెక్క ఇక్కడ లభ్యమవుతుంది. పర్యాటకాభివృద్ధి కోసం.. ఉదయగిరిని పర్యాటకరంగ పరంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా కలెక్టర్ చక్రధర్‌బాబు గతంలో ఈ ప్రాంతంలో పర్యటించి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయించారు. హార్సిలీహిల్స్, ఊటీ తరహా వాతావరణం ఉదయగిరి దుర్గంపై ఉంటుంది. అక్కడ పర్యాటకులకు సౌకర్యాలు కల్పించేందుకు సుమారు రూ.100 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర పర్యాటక శాఖకు పంపారు. అభివృద్ధి చెందుతుంది ఉదయగిరి సమీపంలో బంగారు, రాగి నిక్షేపాలు నిక్షిప్తమై ఉన్నాయన్న జాతీయ సర్వే నిపుణుల ప్రకటనలతో ఉదయగిరికి ఖ్యాతి లభించనుంది. ఎక్కడో మారుమూల వెనుకబడి ఉన్న ఈ ప్రాంతంలో బంగారు నిక్షేపాలు వెలుగుచూడడంతో ఈ ప్రాంత అభివృద్ధిపై ఆశాభావం కలుగుతోంది. మొత్తంగా రెండు, మూడురోజల వ్యవధిలో ఉదయగిరికి జాతీయస్థాయిలో గుర్తింపు లభించడం విశేషం. భవిష్యత్‌లో అభివృద్ధి చెందుతుందనే కాంక్ష ఈ ప్రాంతవాసుల్లో బలంగా ఉంది. – ఎస్కే ఎండీ ఖాజా, ఉపాధ్యాయుడు ఉదయగిరికి జాతీయ కీర్తి ఎంతో చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉన్న ఉదయగిరికి జాతీయ గుర్తింపు లభించడం సంతోషం. జిల్లాలో మారుమూల ప్రాంతంలో ఉన్న ఉదయగిరి దుర్గానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. దీంతో వెనుకబడి ఉదయగిరి ప్రాంతం అభివృద్ధితోపాటు రాష్ట్రంలో ఒక గుర్తింపు తగిన పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి చెందుతుంది. రక్షణ రంగంలో కీలక యుద్ధ నౌకకు ఉదయగిరి పేరు పెట్టడం చారిత్రాత్మకం. – గాజుల ఫారుఖ్ అలీ, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర బాధ్యుడు ఖనిజ నిక్షేపాల కోసం.. ఉదయగిరి మండలంలోని మాసాయిపేట కొండపై ఖనిజ నిక్షేపాల కోసం అన్వేషణ జరిగింది. ఈక్రమంలో ఆ కొండపై రాగి, బంగారం, తెల్లరాయి ఖనిజ నిక్షేపాలున్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రాథమికంగా గుర్తించింది.. ప్రస్తుతం ఆ ఖనిజాలు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకునేందుకు డ్రిల్లింగ్ పనులు చేపట్టారు. మొత్తంగా ఐదు ప్రాంతాల్లో 500 నుంచి 1,000 అడుగుల మేర డ్రిల్లింగ్ నిర్వహించి 46 నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. సుమారు రెండు వేల ఎకరాల్లో ఖనిజ నిక్షేపాలున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. అగ్రీ యూనివర్సిటీ మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాలను అగ్రికల్చర్ యూనివర్సిటీ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇటీవల మంత్రి వర్గ సమావేశంలో కూడా తీర్మానం చేశారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి స్మారకార్ధంగా దీనిని నిర్మించి మెట్ట ప్రాంత వ్యవసాయానికి మహర్దశ పట్టించేలా, వ్యవసాయ రంగంపై విద్యార్థులకు కూడా మక్కువ పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. వర్సిటీ కోసం మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సుమారు రూ.250 కోట్ల విలువైన భూములు, ఆస్తులను అప్పగించారు. ఇది ఏర్పాటైతే విద్యార్థులు అగ్రికల్చర్ కోర్సులు చదివేందుకు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. యుద్ధ నౌకకు పేరు ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండు యుద్ధ నౌకలను ఇటీవల కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ముంబైలో ప్రారంభించారు. పోరాట సామర్థ్యానికి మరింత పదును పెట్టే యుద్ధ నౌకకు ఏపీలోని నెల్లూరు జిల్లా రాయలసీమ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఉదయగిరి పర్వతశ్రేణి పేరు పెట్టడంతో ఈ ప్రాంత ఖ్యాతి మరింత చరిత్రపుటల్లోకెక్కింది. దీనిపై నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డితోపాటు ప్రముఖులు రాజ్‌నాథ్‌సింగ్‌కు ధన్యవాదాలు తెలిపారు. -
ఎల్ఐసీ ఐపీవో సక్సెస్
న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ సక్సెస్ అయ్యింది. షేరుకి రూ. 902–949 ధరలో ఈ నెల 4న ప్రారంభమైన ఇష్యూ 9న(సోమవారం) ముగిసింది. చివరి రోజుకల్లా ఇష్యూ మొత్తం 2.95 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. దాదాపు 16.21 కోట్ల షేర్లను ప్రభుత్వ ఆఫర్ చేయగా.. 47.83 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. క్విబ్ కోటాలో 2.83 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 2.91 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. ఇక రిటైలర్ల విభాగంలో ఆఫర్ చేసిన 6.9 కోట్ల షేర్లకుగాను 13.77 కోట్ల షేర్ల కోసం(దాదాపు రెట్టింపు) దరఖాస్తులు లభించాయి. పాలసీదారుల నుంచి 6 రెట్లు, ఉద్యోగుల నుంచి 4.4 రెట్లు అధికంగా బిడ్స్ వచ్చాయి. పాలసీదారులకు రూ. 60, ఉద్యోగులు, రిటైల్ ఇన్వెస్టర్లకు రూ. 45 చొప్పున ఐపీవో ధరలో ఎల్ఐసీ రాయితీ ఇచ్చింది. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 3.5 శాతం వాటాను విక్రయానికి ఉంచిన సంగతి తెలిసిందే. తద్వారా రూ. 20,600 కోట్లవరకూ సమకూర్చుకుంది. ఇతర హైలైట్స్ ► ఐపీవోలో భాగంగా దరఖాస్తుదారులకు ఎల్ఐసీ షేర్లను ఈ నెల 12కల్లా కేటాయించనుంది. ► బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో ఎల్ఐసీ ఈ నెల 17న(మంగళవారం) లిస్ట్‌కానుంది. ► రూ. 20,557 కోట్ల సమీకరణ ద్వారా ఎల్ఐసీ అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డు నెలకొల్పింది. తదుపరి ర్యాంకుల్లో రూ. 18,300 కోట్లతో పేటీఎమ్(2021), రూ. 15,500 కోట్లతో కోల్ ఇండియా(2010), రూ. 11,700 కోట్లతో రిలయన్స్ పవర్(2008) నిలిచాయి. ఆత్మనిర్భర్ భారత్ బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ అన్ని విభాగాల్లోనూ విజయవంతమైనట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంతా పాండే తెలియజేశారు. ఇది ఆత్మనిర్భర్ భారత్‌కు ఉదాహరణగా పేర్కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు ఎల్ఐసీ ఆఫర్‌ను సక్సెస్ చేసినట్లు తెలియజేశారు. తద్వారా విదేశీ ఇన్వెస్టర్లపైనే ఆధారపడిలేమని నిరూపణ అయినట్లు వ్యాఖ్యానించారు. ఇది దేశీ క్యాపిటల్ మార్కెట్లు మరింత బలపడేందుకు దోహదం చేయగలదని అభిప్రాయపడ్డారు. -
మన ఎగుమతులు భేష్
న్యూఢిల్లీ/సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల (రూ.30 లక్షల కోట్లు) విలువైన ఎగుమతుల లక్ష్యాన్ని భారత్ సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మన ఉత్పత్తులకు ప్రపంచమంతటా డిమాండ్ పెరుగుతోందనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ వస్తువుల కోసం దేశాలు ఎదురు చూస్తున్నాయని, మన సప్లై చైన్ రోజురోజుకూ మరింత శక్తివంతంగా మారుతోందని అన్నారు. ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదాన్ని ప్రతి భారతీయుడు అందిపుచ్చుకుంటే లోకల్ గ్లోబల్‌గా మారడానికి ఎక్కువ సమయం పట్టదని చెప్పారు. ఆదివారం ‘మన్ కీ బాత్’లో దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ఏడాదిగా ప్రభుత్వం ఈ–మార్కెట్ ద్వారా రూ.లక్ష కోట్లకుపైగా విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేసిందన్నారు. 1.25 లక్షల మంది చిన్నతరహా వ్యాపారవేత్తలు, దుకాణదారులు తమ ఉత్పత్తులను నేరుగా ప్రభుత్వానికి విక్రయించారని తెలిపారు. గతంలో బడా వ్యాపారులే ప్రభుత్వానికి సరుకులను విక్రయించే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు చిన్న వ్యాపారులు, దుకాణదారులకు కూడా ఆ అవకాశం లభిస్తోందని వెల్లడించారు. భారతీయులంతా చేతులు కలిపితే ఆత్మనిర్భర్‌భారత్ లక్ష్యసాధన సులువేనన్నారు. ఆయుష్కు అద్భుత అవకాశాలు ఆయుష్ ఉత్పత్తులకు మార్కెట్ విస్తరిస్తుండడం సంతోషకరమని మోదీ చెప్పారు. ఈ రంగంలో స్టార్టప్‌లకు అద్భుత అవకాశాలు ఉన్నాయన్నారు. ఆయుష్ పరిశ్రమ మార్కెట్ విలువ రూ.22,000 కోట్ల నుంచి రూ.1.4 లక్షల కోట్లకు చేరిందన్నారు. మన ఉత్పత్తుల ప్రతిష్టను, గిరాకీని మరింత పెంచుకొనేలా కష్టపడి పనిచేద్దామని పిలుపునిచ్చారు. 126 ఏళ్ల వయసులో పద్మశ్రీ అందుకున్న యోగా గురువు స్వామి శివానంద జీవితం నుంచి దేశం ఎంతో స్ఫూర్తిని పొందుతోందని మోదీ అన్నారు. ప్రతి చుక్కనూ ఆదా చేసుకోవాలన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవరాలు నిర్మించుకోవాలన్నారు. ఏప్రిల్ 1న పరీక్షా పే చర్చ ఏప్రిల్ 1న ఢిల్లీ తల్కటోరా స్టేడియంలో ‘పరీక్షా పే చర్చ’లో మోదీ విద్యార్థులతో స్వయంగా మాట్లాడనున్నారు. పరీక్షల పండుగ జరుపుకుందామంటూ విద్యార్థులకు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ మెట్ల బావి ప్రస్తావన తెలంగాణలోని సికింద్రాబాద్‌లో ఇటీవల బయటపడిన మెట్ల బావి గురించి మన్‌కీ బాత్‌లో ప్రధాని ప్రస్తావించారు. ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన మెట్లబావి పునరుద్ధరణకు ప్రజలు చూపిన చొరవను అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, చిత్తూరు జిల్లాల నుంచి బంగినపల్లి, సువర్ణరేఖ మామిడి పండ్లు దక్షిణ కొరియాకు కూడా ఎగుమతి అవుతున్నాయంటూ ఆయన ప్రశంసించారు. -
ఎగుమతులు... కొత్త చరిత్ర!
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్లు (సుమారు రూ.30 లక్షల కోట్లు) విలువైన ఎగుమతుల లక్ష్యాన్ని సాధించినట్టు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఆత్మనిర్భర భారత్ మైలురాయిని అందుకోవడంలో ఇది కీలకమని చెప్పారు. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 9 రోజులు మిగిలి ఉండగానే ఎగుమతుల లక్ష్యాన్ని సాధించినట్టు తెలిపారు. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి 22 వరకు ఎగుమతులు 37 శాతం పెరిగి 400 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. భారతదేశ చరిత్రలో ఎగుమతులు 400 బిలియన్ డాలర్లను చేరుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ‘‘భారత్ 400 బిలియన్ డాలర్ల విలువైన వస్తు ఎగుమతులు చేయాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ లక్ష్యాన్ని మొదటిసారి అధిగమించింది. మన రైతులు, చేనేతకారులు, ఎంఎస్ఎంఈలు, తయారీదారులు, ఎగుమతిదారులు అందరినీ ఈ విజయాన్ని సాధించినందుకు అభినందిస్తున్నాను. మన ఆత్మనిర్భర భారత్ ప్రయాణానికి ఇది కీలకం‘‘అంటూ మోదీ ట్వీట్ చేశారు. స్థానిక ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌కు వెళుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాల సహకారంతో.. ట్విట్టర్లోనే ప్రధాని కొన్ని గ్రాఫిక్స్‌ను కూడా పోస్ట్ చేశారు. రాష్ట్రాల భాగస్వామ్యం, జిల్లా అధికారులు, ఎగుమతిదారులతో సంప్రదింపులు, వారి సమస్యలను వేగంగా పరిష్కరించడం, వివిధ ఎగుమతుల మండళ్లు, పరిశ్రమల మండళ్లు, భాస్వాములతో చురుగ్గా సంప్రదింపులు చేయడం వల్లే ఈ మైలురాయిని చేరుకోవడం సాధ్యపడినట్టు గ్రాఫిక్స్‌ను పరిశీలిస్తే తెలుస్తోంది. ప్రతి నెలా సగటున 33 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధ్యమయ్యాయి. పెట్రోలియం ఉత్పత్తులు..: ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరగడానికి పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ గూడ్స్, తోలు, కాఫీ, ప్లా స్టిక్, రెడీమేడ్ వస్త్రాలు, మాంసం, డెయిరీ, సము ద్ర ఉత్పత్తులు, పొగాకు ఉత్పత్తులు మద్దతుగా నిలిచాయి. 400 బిలియన్ డాలర్ల ఎగుమతు లు నిజం గా గొప్ప మైలురాయిగా భారత ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్ఐఈవో) డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ అన్నారు. రవాణా పరంగా ఎన్నో సవాళ్లు ఉన్నాకానీ, అదనంగా 100 బిలియన్ డాలర్ల ఎగుమతులు పెంచుకోగలిగినట్టు చెప్పారు. స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలకుతోడు, పీఎల్ఐ పథకాలు ఎగుమతుల వృద్ధికి సాయపడినట్టు తెలిపారు. 37 శాతం అధికం.. దేశ చరిత్రలో మొదటిసారి ఎగుమతులు 400 బిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించాయి. ఈ విషయాన్ని బుధవారం కేంద్ర వాణిజ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 37 శాతం పెరిగి 400.8 బిలియన్ డాలర్లుగా మార్చి 21 నాటికి నమోదైనట్టు తెలిపింది. 2020–21లో 292 బిలియన్ డాలర్లు, 2018–19లో 330 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు గణాంకాలు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 21 నాటికి దిగుమతులు 589 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంటే 189 బిలియన్ డాలర్ల మేర వాణిజ్యలోటు ఏర్పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన మరికొన్ని రోజుల్లో 10–12 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు నమోదు కావచ్చని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) సంతోష్ కుమార్ సారంగి తెలిపారు. -
ప్రపంచ ఔషధశాల భారత్.. 100 దేశాలకు కరోనా టీకా
న్యూఢిల్లీ: ఈ ఏడాది దాదాపు 100 దేశాలకు 6.5 కోట్లకుపైగా కరోనా టీకా డోసులను ఎగుమతి చేశామని ప్రధాని మోదీ చెప్పారు. భారత ఆరోగ్యసంరక్షణ రంగం ప్రపంచ దేశాల నమ్మకాన్ని చూరగొన్నదని తెలిపారు. భారత్‌ను ప్రపంచ ఔషధశాలగా (ఫార్మసీ) పరిగణిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని టీకా డోసులను విదేశాలకు ఎగుమతి చేయబోతున్నామని వెల్లడించారు. ఫార్మాస్యూటికల్ రంగానికి సంబంధించి తొలి ‘ప్రపంచ ఆవిష్కరణల శిఖరాగ్ర సదస్సు’ను గురువారం ప్రారంభించారు. మనదేశంలో వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలకు సానుకూల వాతావరణం కల్పిస్తున్నామని, ప్రోత్సాహం అందిస్తున్నామని మోదీ గుర్తుచేశారు. దీనివల్ల కొత్త ఔషధాల అభివృద్ధి, వినూత్న వైద్య పరికరాల తయారీలో భారత్ అగ్రగామిగా ఎదగడం ఖాయమని చెప్పారు. వైద్య రంగాన్ని గొప్ప స్థాయికి చేర్చగల సామర్థ్యం ఉన్న సైంటిస్టులు, సాంకేతిక నిపుణులు మన దేశంలో ఎంతోమంది ఉన్నారని తెలియజేశారు. ఇండియాను స్వయం సమృద్ధ దేశంగా(ఆత్మనిర్భర్) మార్చడానికి దేశంలోని 130 కోట్ల మంది కంకణం కట్టుకున్నారని ప్రధాని పేర్కొన్నారు. టీకాలు, ఔషధాల అభివృద్ధి, ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాలను దేశీయంగానే తయారు చేసుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్నప్పుడు ఇదే స్ఫూర్తిని చాటిచెప్పామని ఉద్ఘాటించారు. 150కిపైగా దేశాలకు ప్రాణరక్షక ఔషధాలు, వైద్య పరికరాలు అందజేశామని వివరించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఫార్మా రంగం ఎంతగానో దోహదపడుతోందని ప్రశంసించారు. డిజిటల్ విప్లవంతో కొత్త సవాళ్లు ఆస్ట్రేలియా డైలాగ్‌లో ప్రధాని మోదీ క్రిప్టోకరెన్సీ వాడకం ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పెరుగుతోందని, ఇది దుష్ట శక్తుల చేతుల్లో పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని∙మోదీ చెప్పారు. డిజిటిట్ విప్లవంతో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు భావ సారుప్యం కలిగిన దేశాలన్నీ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. ‘ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇనిస్టిట్యూషన్’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులతో గురువారం నిర్వహించిన సదస్సులో(సిడ్నీ డైలాగ్) మోదీ ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు. ఆధిపత్యం చెలాయించడానికి టెక్నాలజీ ఉపయోగించుకొనే అవకాశం ఉందని గుర్తుచేశారు. ఫ్యూచర్ టెక్నాలజీలో పరిశోధనలు, అభివృద్ధి కోసం ప్రజాస్వామ్య దేశాలు ఉమ్మడిగా పెట్టుబడులు పెట్టాలని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేసే యత్నాలను అడ్డుకొనేందుకు కృషి చేయాలని చెప్పారు. రాజకీయాలు, ఆర్థిక, సామాజిక రంగాలను డిజిటల్ యుగం పునర్నిర్వచిస్తోందని తెలిపారు. డిజిటల్ విప్లవంతో దేశాల సార్వభౌమత్వం, పరిపాలన, విలువలు, హక్కులు, భద్రత విషయంలో కొత్త ప్రశ్నలు ఉదయిస్తున్నాయని వెల్లడించారు. క్రిప్టోకరెన్సీ విషయంలో అప్రమత్తత అవసరమని ఉద్ఘాటించారు. ఇది మన యువతను నాశనం చేసే ప్రమాదం ఉందన్నారు. భారత్‌లో డేటాను ప్రజల సాధికారత కోసం ఒక వనరుగా ఉపయోగిస్తున్నామని గుర్తుచేశారు. డిజిటల్ విప్లవంతో అభివృద్ధికి నూతన అవకాశాలే కాదు, కొత్త సవాళ్లు సైతం ఎదురవుతున్నాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బ్రాడ్‌బ్యాండ్‌తో భారత్‌లో 6 లక్షల గ్రామాలను అనుసంధానించామని తెలిపారు. -
ఎకానమీకి విస్తృత వ్యాక్సినేషన్ దన్ను!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే వేగవంతమైన పురోగతిని సాధిస్తోందని ఆర్థిక మంత్రిత్వశాఖ తన తాజా నివేదికలో పేర్కొంది. ఆర్థిక వ్యవస్థలో మూల స్తంభాలు పటిష్టంగా ఉండడంతోపాటు, వేగవంతంగా వ్యాక్సినేషన్ పక్రియ జరుగుతుండడం, పండుగల సీజన్ వంటి అంశాలు దేశంలో డిమాండ్ రికవరీ పటిష్టతకు దారితీస్తున్నట్లు తెలిపారు. డిమాండ్–సరఫరాల్లో అంతరం తగ్గుతోందని, ఉపాధి అవకాశాలు గణనీయంగా మెరగుపడుతున్నాయని కూడా ఆర్థిక వ్యవస్థ నెలవారీ సమీక్షా నివేదిక పేర్కొంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► భారతదేశ ఆర్థిక పునరుద్ధరణలో ఆత్మనిర్భర్ భారత్ మిషన్, వ్యవస్థాగత సంస్కరణలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆయా కార్యక్రమాలు, చర్యల వల్ల వ్యాపార అవకాశాలు, డిమాండ్, వ్యయాలు పెరుగుతున్నాయి. ► అధిక విస్తీర్ణంలో రబీ సాగు, మెరుగైన రిజర్వాయర్ స్థాయిలు, ఎరువులు, విత్తనాల విషయంలో రైతులకు తగినంత లభ్యత వంటి అంశాలు వ్యవసాయ రంగం పురోగతికి దోహద పడుతోంది. ఆర్థిక పునరుద్ధరణలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ► వ్యవసాయ–ఎగుమతుల్లో స్థిరమైన పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య ఈ విభాగంలో 22 శాతం వృద్ధి చెందడం గమనార్హం. ఆయా అంశాలు రైతుల ఆదాయాన్ని పెంచడంలో ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తున్నాయి. గ్రామీణ డిమాండ్ పటిష్టంగా ఉంది. 2021 సెప్టెంబర్‌లో ట్రాక్టర్లు, ద్విచక్ర, త్రి చక్ర వాహనాల విక్రయాలు పటిష్ట రికవరీని సూచిస్తున్నాయి. ► రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడి, మార్కెట్లో తగినంత లిక్విడిటీ (ద్రవ్య లభ్యత), బాండ్ల రేట్ల స్థిరత్వం వంటి అంశాలు ఎకానమీకి సానుకూల అంశాలుగా ఉన్నాయి. ► బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలుచేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం) తగ్గింపు ప్రయోజనం వ్యవస్థలో ప్రతిబింబిస్తోంది. 2020 ఫిబ్రవరి– 2021 సెప్టెంబర్ మద్య తాజా రూపీ రుణాలపై సగటు రుణ రేటు 130 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గిడం సానుకూలాంశం. ► భారత్ ఎకానమీ 2021–22 ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుందని 2020–21 ఎకనమిక్ సర్వే పేర్కొంటోంది. పలు రేటింగ్, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల అంచనాలు 9–10 శాతం శ్రేణిలో ఉన్నాయి. -
రూ.100 లక్షల కోట్లతో ‘గతిశక్తి’
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో బహుముఖ అనుసంధానమే లక్ష్యంగా చేపట్టిన గతిశక్తితో రాబోయే 25 ఏళ్ల భారతావనికి పునాది పడిందని ప్రధాని మోదీ చెప్పారు. 16 మంత్రిత్వ శాఖల సమన్వయంతో చేపట్టే ఈ కార్యక్రమం ద్వారా రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల ముఖచిత్రం సమూలంగా మారనుందని తెలిపారు. రూ.100 లక్షల కోట్లతో అమలు చేసే ‘పీఎం గతిశక్తి.. నేషనల్ మాస్టర్‌ప్లాన్ ఫర్ మల్టీ–మోడల్ కనెక్టివిటీ’ కార్యక్రమానికి ప్రధాని బుధవారం శ్రీకారం చుట్టారు. ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో నూతన అంతర్జాతీయ ఎగ్జిబిషన్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆత్మనిర్భర్ భారత్’ సంకల్పంతో రాబోయే 25 సంవత్సరాల భారతదేశానికి పునాది వేస్తున్నామని ఉద్ఘాటించారు. ‘పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్’ 21వ శతాబ్దిలో భారతదేశానికి నూతన ఉత్తేజాన్ని అందిస్తుందని ప్రధాని మోదీ వివరించారు. ప్రగతి కోసం పని, ప్రగతి కోసం సంపద, ప్రగతి కోసం ప్రణాళిక, ప్రగతికే ప్రాధాన్యం.. ఇదే ఈనాటి మంత్రమని అన్నారు. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే విషయంలో దేశంలో చాలా రాజకీయ పక్షాలకు ఓ ఆలోచన లేదని ఎద్దేవా చేశారు. అందుకే ఆయా పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలో వాటికి స్థానం కల్పించడం లేదన్నారు. మౌలిక సదుపాయాల కల్పనను కొన్ని రాజకీయ పక్షాలు విమర్శిస్తుండడం దారుణమని మండిపడ్డారు. ఏమిటీ ‘గతిశక్తి’? ఈ ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్‌ను ప్రధాని మోదీ ఇటీవలే ప్రకటించారు. 5 ట్రిలియన్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకొనే క్రమంలో గతిశక్తి మాస్టర్ ప్లాన్ ఎంతో ఉపకరిస్తుందని కేంద్రం విశ్వసిస్తోంది. గతకాలపు బహుళ సమస్యలను పరిష్కరించడంతోపాటు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుల భాగస్వాముల కోసం ‘గతిశక్తి’ని తీసుకొచ్చారు. ఆరు స్తంభాల పునాదితో.. ప్రాధాన్యీకరణ: దీనిద్వారా వివిధ శాఖలు, విభాగాలు ఇతర రంగాలతో సంప్రదింపుల ద్వారా తమ ప్రాజెక్టుల ప్రాధాన్యాన్ని నిర్ణయించుకోగల అవకాశం లభిస్తుంది. గరిష్టీకరణ: వివిధ మంత్రిత్వ శాఖలు తమ ప్రాజెక్టు ప్రణాళికలను రూపొందించుకోవడంలో జాతీయ బృహత్ ప్రణాళిక తోడ్పాటునిస్తుంది. ఉదాహరణకు ఒకచోట నుంచి మరోచోటికి వస్తువుల రవాణా కోసం సమయం, ఖర్చుపరంగా గరిష్ట ప్రయోజనం గల మార్గాన్ని ఎంచుకునే వీలు కల్పిస్తుంది. కాల సమన్వయం: ప్రస్తుతం మంత్రిత్వ శాఖలు, విభాగాలు వేటికవి తమ పని తాము చేసుకుంటున్నాయి. ప్రాజెక్టుల ప్రణాళిక, అమలులో సమన్వయం లోపించి, పనులు జాప్యమవుతాయి. ‘పీఎం గతిశక్తి’ వీటికి స్వస్తి పలుకుతుంది. ప్రతి విభాగం ఇతర విభాగాలతో సమన్వయం చేసుకోవచ్చు. దీంతో కాలం, శక్తి ఆదా అవుతుంది. విశ్లేషణాత్మకత: 200కిపైగా అంచెలు గల విశ్లేషణాత్మక అంతరిక్ష ఉపకరణాల ఆధారిత గణాంకాలని్నటినీ ఈ ప్రణాళిక అందుబాటులోకి తెస్తుంది. గతిశీలత: ‘జీఐఎస్’ సాయంతో అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఇతర శాఖలకు చెందిన ప్రాజెక్టులను గమనించడంతోపాటు సమీక్షిస్తూ, ప్రగతిని పర్యవేక్షించే సౌలభ్యం ఉంటుంది. ఆ మేరకు ఉపగ్రహ చిత్రాలను క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు అందించడమే కాకుండా ప్రాజెక్టుల ప్రగతి వివరాలు క్రమబద్ధంగా పోర్టల్‌లో నమోదు చేస్తారు. సమగ్రత: పలు మంత్రిత్వ శాఖలు, విభాగాలకు సంబంధించిన ప్రస్తుత, ప్రణాళికల రూపంలో గల అన్ని ప్రాజెక్టులనూ కేంద్రీకృత పోర్టల్‌తో అనుసంధానిస్తారు. దీనివల్ల అన్ని శాఖలు, విభాగాలకు అన్ని ప్రాజెక్టులపై అవగాహన పెరుగుతుంది. తద్వారా ఆయా ప్రాజెక్టులను సకాలంలో, సమగ్రంగా పూర్తి చేసేందుకు వీలుంటుంది. -
‘సోలార్’.. మేమే ఇస్తాం
సాక్షి, అమరావతి: వ్యవసాయ విద్యుత్తుకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన భారీ సౌర విద్యుత్తు ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో కీలక గుర్తింపు లభించింది. అంతే కాదు ఆత్మనిర్భర్ భారత్ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్‌కు 9 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును తామే అందించేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఏటా 3 వేల మెగావాట్ల చొప్పున మూడేళ్లలో మొత్తం 9 వేల మెగావాట్ల ప్రాజెక్టును అందిస్తామని తెలిపింది. కిలోవాట్ అవర్‌కు రూ.2.49 చొప్పున సౌర విద్యుత్తు అందిస్తామని ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ప్రాజెక్టు ఏర్పాటుకు టెండర్లు పిలిచిన విషయం కేంద్రం దృష్టికి రావడంతో ఆ ప్రాజెక్టుకు బదులుగా దీన్ని చేపట్టే అంశాన్ని పరిశీలించాలని పేర్కొంది. ఈ మేరకు ‘ఎస్ఈసీఐ’ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపినట్లు ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ బుధవారం తెలిపారు. తమ ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నట్లు ఎస్ఈసీఐ లేఖలో పేర్కొంది. వినూత్న విధానాలకు ప్రశంసలు.. నాణ్యమైన ఉచిత విద్యుత్తుతో రైతాంగానికి చీకు చింతా లేకుండా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన 10 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వాన్ని బాగా ఆకర్షించింది. ఈ మహాయజ్ఞంలో తామూ పాలుపంచుకుంటామంటూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఈసీఐ) ముందుకు వచ్చింది. తక్కువ వ్యయంతో పునరుత్పాదక శక్తి వనరుల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సరికొత్త విధానాలను ఎస్ఈసీఐ ప్రశంసించింది. 25 ఏళ్ల పాటు వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు ఉచితంగా విద్యుత్ అందించేందుకు 9 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను సరఫరా చేస్తామంటూ ప్రతిపాదించింది. ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’ పధకం ద్వారా సబ్సిడీలు కూడా అందిస్తామని తెలిపింది. ట్రాన్స్మిషన్ చార్జీల మాఫీ కూడా.. రాష్ట్ర ప్రభుత్వం 6,400 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుకు టెండర్లు పిలవగా కొందరు కాంట్రాక్టర్లు కిలోవాట్ అవర్(కేడబ్ల్యూహెచ్)కు రూ.2.49 చొప్పున టారిఫ్ ప్రతిపాదించినట్లు తమ దృష్టికి వచ్చిందని, అయితే అదే టారిఫ్‌కు తాము 9 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను అందిస్తామని ఎస్ఈసీఐ తెలిపింది. 9 వేల మెగావాట్లను మూడేళ్లలో అంటే 2024, 2025, 2026లో మూడు వేల మెగావాట్ల చొప్పున అందుబాటులోకి తెస్తామని ప్రతిపాదించింది. దీనివల్ల డిస్కంలకు కూడా విద్యుత్ కొనుగోలు, సరఫరాపై అంచనాకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొంది. తమ ప్రతిపాదనకు ఏపీ అంగీకరిస్తే సోలార్ విద్యుత్ ప్రాజెక్టు నెలకొల్పేందుకు వెచ్చించే వ్యయం రాష్ట్రానికి మిగులుతుందని, అది ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చని సూచించింది. తాము ఇప్పటికే టెండర్లు పిలిచి సోలార్ పవర్ ప్రాజెక్టులకు కాంట్రాక్టు ఇచ్చినందున దాని నుంచి ఏపీకి సరఫరా చేస్తామని తెలిపింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టం (ఐఎస్టీఎస్) చార్జీల మాఫీ కూడా ఏపీకి వర్తింపజేస్తామని పేర్కొంది. -
ఆయుధాల నవీకరణకు నిధులేవి?
దేశీయంగా ఆయుధ సేకరణ కోసం రక్షణరంగానికి చేసిన భారీ కేటాయింపు.. భారత రక్షణ పారిశ్రామిక పునాదిని విస్తృతపరుస్తుందని, మధ్యతరహా, చిన్న, సూక్ష్మ స్థాయి పరిశ్రమలను ప్రోత్సహించడంపై బహువిధ ప్రభావం వేస్తుందని రక్షణమంత్రి ఘనంగా ప్రకటించారు. ఎంచుకున్న లక్ష్యాలను చూస్తే ఆయన ప్రకటనను తప్పుపట్టలేం. కానీ చేదు నిజం ఏమిటంటే, దేశీయంగా రక్షణ కొనుగోళ్లకు కేటాయించిన రూ. 70,221 కోట్లలో అధికభాగం గతంలో రక్షణశాఖ హామీపడిన చెల్లింపులకు ఖర్చు కావడమే. అంటే పాత చెల్లింపులు పోతే కొత్త కొనుగోళ్లకు మిగిలేది అత్యంత తక్కువ మొత్తమేనని అర్థమవుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన భారీ మొత్తాన్ని పూర్తిగా స్థానిక రక్షణ విక్రేతలకు, నూతన ఒప్పందాల కింద ఆయుధాలు, పరికరాల సరఫరాదారులకు చెల్లిస్తారని భ్రమలు పెట్టుకోవలసిన పనిలేదు. రక్షణ సామగ్రి అవసరాల్లో ఆత్మనిర్భర్ లేక స్వావలంబన సాధించటానికి అధికశాతం ఆయుధ సామగ్రిని దేశీయంగానే సేకరించబోతున్నట్లు కేంద్రప్రభుత్వం ఇటీవల చేసిన ప్రకటనలో స్థానికతకు ఏమాత్రం చోటు లేదనిపిస్తోంది. ఈ ప్రతిపాదనలో కొత్త విషయమూ లేదు. అలాగని అసాధారణమైన అంశమూ లేదు. దీర్ఘకాలంగా వాయిదాలో ఉంటున్న ఈ లక్ష్య సాధనకు తోడ్పడటానికి రక్షణ మంత్రిత్వ శాఖకు కేటాయిస్తున్న ఆర్థిక కేటాయింపుల్లో అతి స్వల్పమాత్రంగానే పెంచడం అనే గత కాలపు ధోరణికి కేంద్రప్రభుత్వ తాజా ప్రకటన ఒక కొనసాగింపే తప్ప దీంట్లే మరే కొత్త విషయమూ లేదు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి దేశ రక్షణకోసం రూ.70,221 కోట్లు లేదా మొత్తం మూలధన కొనుగోలు బడ్జెట్లో 63 శాతం వరకు త్రివిధ దళాలకు దేశీయంగా సేకరించిన రక్షణ సామగ్రిపైనే వెచ్చించనున్నట్లు గత నెలలో రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దిగుమతులను బాగా తగ్గిం చుకుని మేక్ ఇన్ ఇండియా అనే ప్రభుత్వ భావనను బలోపేతం చేసే లక్ష్యం నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,35,061 కోట్ల మూలధన వ్యయంలో రక్షణ రంగంలో కొనుగోలు బడ్జెట్ కింద కేటాయించిన రూ.1,11,714 కోట్ల మొత్తం చిన్న భాగం మాత్రమే. ప్రస్తుత సంవత్సరం సవరించిన రక్షణ కొనుగోళ్ల వ్యయంలో వాస్తవానికి రూ. 2,551 కోట్లను తగ్గించడం గమనార్హం. ప్రధానంగా యుద్ధవిమానాలు, ఏరో ఇంజిన్లు, భారీ, మధ్యతరహా సైనిక వాహనాలతోపాటు త్రివిధ దళాలకు ఇతర పరికరాలను కొనడానికి ఈ మొత్తాన్ని కేటాయించారు. అనేక అధునాతన రక్షణ ప్లాట్‌ఫాంలు, వాటితో ముడిపడిన ప్రోగ్రామ్‌లు, భారతీయ వాయుసేనకు చెందిన ఇతర ప్రత్యేక ప్రాజెక్టుల కొనుగోలుకోసం ఈ కేపిటల్ అక్విజిషన్ బడ్జెట్ (సీఏబీ) నుంచి నిధులు కేటాయిస్తారు. ఈ రక్షణ కొనుగోలు బడ్జెట్ నుంచి చిన్న మొత్తాన్ని దేశీయంగా ఆయుధాల సేకరణపై వెచ్చించడం అనేది అసాధారణం కాదు. ఉదాహరణకు 2014–15 నుంచి 2018–19 (డిసెంబర్ 2019 వరకు) మధ్య కాలంలో రక్షణ రంగంపై చేసిన వ్యయం సీఏబీలో 60 శాతంగా ఉండిందని గ్రహించాలి. న్యూఢిల్లీలో ఈ సంవత్సరం ఒక వెబినార్ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించిన మొత్తం కంటే ఇది 3 శాతం మాత్రమే తక్కువ. ఈ కేటాయింపు భారత రక్షణ పారిశ్రామిక పునాదిని విస్తృతపర్చడంపై, మధ్యతరహా, చిన్న, సూక్ష్మ స్థాయి పరిశ్రమలను ప్రోత్సహించడంపై బహువిధ ప్రభావం వేస్తుందని రక్షణమంత్రి ఘనంగా ప్రకటించారు. అలాగే రక్షణ రంగ అవసరాలను తీర్చే స్టార్టప్‌లు, దేశీయ ఉపాధి అవకాశాలను కూడా ఇది గణనీయంగా పెంచుతుందని మంత్రి పేర్కొన్నారు. ఎంచుకున్న లక్ష్యాలను చూస్తే రక్షణమంత్రి ప్రకటనను తప్పుపట్టలేం. కానీ ప్రకటిత ఉద్దేశాలకు, అసలు వాస్తవానికి మధ్య కాస్త అంతరం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అయితే చేదు నిజం ఏమిటంటే, దేశీయంగా రక్షణ కొనుగోళ్లకు కేటాయించిన రూ. 70,221 కోట్లలో అధికభాగం గతంలో రక్షణశాఖ హామీపడిన చెల్లింపులకు ఖర్చు కావడమే. లేదా గతంలో కొన్న రక్షణ ప్లాట్‌ఫాం, ఆయుధాల కొనుగోళ్లకు చెల్లించాల్సిన అసలు చెల్లింపులకు ఈ కేటాయింపులో అధిక భాగం సరిపోవచ్చు. విశ్వసనీయ అంచనా ప్రకారం ఇలా గతంలోని కొనుగోళ్లకు చెల్లించాల్సిన మొత్తం ప్రభుత్వం తాజాగా ప్రకటించిన రక్షణ కొనుగోళ్ల మొత్తంలో 80 నుంచి 90 శాతం వరకు ఉండటమే. అంటే పాత చెల్లింపులు పోతే కొత్త కొనుగోళ్లకు మిగిలేది అత్యంత తక్కువ మొత్తమేనని మనకు అర్థమవుతుంది. అంటే కేంద్రప్రభుత్వం తాజాగా ప్రకటించిన రూ. 70,221 కోట్ల మొత్తాన్ని పూర్తిగా స్థానిక రక్షణ విక్రేతలకు, నూతన ఒప్పందాల కింద ఆయుధాలు, పరికరాల సరఫరాదారులకు చెల్లిస్తారని భ్రమలు పెట్టుకోవలసిన పనిలేదు. ఈ వాస్తవ పరిస్థితి గురించి మన త్రివిధ బలగాలకు స్పష్టంగా తెలుసు. 2018 సంవత్సరంలోనే అప్పటి వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ శరత్ చంద్ నాటి రక్షణరంగంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి స్పష్టంగా ఒక విషయం తెలిపారు. సీఏబీలో భారత సాయుధ బలగాలకు కేటాయించిన అతి స్వల్ప మొత్తం కారణంగా 2018–19 ఆర్థిక సంవత్సరానికి గానూ, చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఆధునీకరణ ప్రక్రియపై భారత సైన్యం పెట్టుకున్న ఆశలు ఒక్కసారిగా హరీమన్నాయని ఆయన తేల్చిచెప్పారు. భారత సైనిక అవసరాలకు కేటాయించిన ఆర్థిక పొడిగింపు అనేది ద్రవ్యోల్బణాన్ని, పన్నుల పెంపుదలను తటస్థీకరించడానికి మాత్రమే సరిపోతుందని, మేకిన్ ఇండియా ప్రాజెక్టులకు, మౌలిక వనరుల అభివృద్ధికి, సైన్యం చెల్లించాల్సిన చెల్లింపులకు చాలా కొద్దిమొత్తమే మిగులుతుందని నాటి లెఫ్టినెంట్ జనరల్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి మొరపెట్టుకున్నారు. అంతకుమించి పొరుగు దేశంతో నిత్య ఘర్షణల నేపథ్యంలో జరూరుగా అవసరమైన మందుగుండు సామగ్రి, ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల సమర్థ నిర్వహణకు ఇది తూట్లు పొడుస్తుందని శరత్ చంద్ వాపోయారు. అలాగే, సైన్యం వద్ద ఉన్న ఆయుధాల్లో 68 శాతం వరకు పురాతన కేటగిరీలో ఉంటున్నాయని, సమకాలీన అవసరాలకు సరిపోయే ఆయుధాలు 28 శాతం మాత్రమే ఉన్నాయని, అందులోనూ అత్యధునాతన ఆయుధ సామగ్రి 8 శాతం మాత్రమే భారత సైన్యం వద్ద ఉందని, ఈ పరిస్థితుల్లో రక్షణ రంగానికి కేటాయింపులు క్షీణిస్తూ పోతే భారత సాయుధ బలగాల ఆధునీకరణ ప్రక్రియనే అది సవాలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి చెల్లించాల్సిన మొత్తం ఎంత అనేది రక్షణ మంత్రి వెబినార్ సమావేశంలో పేర్కొనలేదు. రక్షణ శాఖ వద్ద ఈ సమాచారం ఉన్నప్పటికీ, పార్లమెంటరీ స్టాడింగ్ కమిటీకి ఈ విషయం ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నప్పటికీ చెల్లించాల్సిన మొత్తం ఎంత అనేది రక్షణ శాఖ బహిరంగపర్చలేదు. రక్షణ బడ్జెట్లలో చెల్లింపులకు తక్కువ కేటాయింపులను చేస్తూ పోవడం వల్ల ఒక దశలో రక్షణ శాఖ ఇకేమాత్రం చెల్లింపులు చేయలేని స్థితికి దిగజారిపోవచ్చని రక్షణపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవలి నివేదికలో హెచ్చరించింది కూడా. దీంతో ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దేశీయ రక్షణ పరిశ్రమను ప్రోత్సహించడానికి అతి తక్కువ మాత్రమే కేటాయించాల్సి వచ్చింది. భారతీయ, విదేశీ రక్షణరంగ పరిశ్రమాధిపతులకు కూడా భారత రక్షణ శాఖ బడ్జెట్ వాస్తవాల గురించిన అవగాహన ఉంది. వెబినార్‌లో తాజాగా రక్షణశాఖ ప్రకటన వీరిలో కాస్త ఉత్సాహాన్ని కలిగించిందంటే దానికి కారణం.. సైనిక సామగ్రి కోసం ప్రపంచ మార్కెట్లో పనిచేస్తున్న ఆయుధాల విక్రేతలు భారతీయ రక్షణరంగ చీకటి జోన్లో ఏదో ఒకరకంగా మనుగడ సాగించాల్సి ఉండటమే. వీరి పరిస్థితి ఎలా ఉంటుం దంటే ద్రవరూప ఆక్సిజన్‌లో వీరు కూరుకుపోయినట్లు ఉంటుంది. దీన్ని మరింత స్పష్టంగా చెప్పాలంటే ద్రవరూప ఆక్సిజన్ వీరిని బతకనీయదు. ఆదే సమయంలో ఆక్సిజన్ వీరిని చావనివ్వదు. ఎందుకంటే జారీ చేసిన టెండర్లు, బహుకరించిన కాంట్రాక్టుల కోసం వీరు నిరంతరం వేచి ఉండాల్సి ఉంటుంది. దశాబ్దాలుగా రక్షణ రంగ వ్యవస్థను మెరుగుపర్చేందుకు ఎలాంటి సత్ప్రయత్నాలు జరగటం లేదు. పైగా ఈ వ్యవస్థలో ఉంటున్న ప్రతి ఒక్కరూ యథాతథ స్థితిని కొనసాగిస్తూ ఉండిపోయారు. ఓ ఒక్కరి ఆచరణలోనూ సాహసోపేతమైన అడుగులు వేయలేదు. వీరిలో చాలామంది రంగం నుంచి తప్పుకున్నారు. పరస్పర ఆరోణలతో మంత్రిత్వ శాఖలోని పౌర సైనిక విభాగాలను మరింత నిరంకుశత్వం వైపు నెట్టేశారు. ప్రతిసారీ లక్ష్య సాధనవైపు అడుగేయడం, లోపభూయిష్టమైన పథకంతో కుప్పగూలడం.. దీంతో సర్వత్రా అనిశ్చితి రాజ్యమేలడం.. జరుగుతూ వస్తున్న క్రమం ఇదే మరి. అమిత్ కౌషిశ్, ఆర్థిక సలహాదారు రాహుల్ బేడీ, సీనియర్ జర్నలిస్ట్ -
కాలం చెల్లిన చట్టాలు మనకొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: కాలం చెల్లిన పురాతన చట్టాలను రద్దు చేయక తప్పదని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. తద్వారా దేశంలో వ్యాపార, వాణిజ్యాన్ని మరింత సులభతరం చేయొచ్చని అన్నారు. ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించడానికి కేంద్ర, రాష్ట్రాలు మరింత సన్నిహితంగా కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగస్వామిగా మారడానికి ప్రైవేట్ రంగానికి పూర్తి అవకాశం ఇవ్వాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఆంక్షల సడలింపుపై రాష్ట్రాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. శనివారం నీతి ఆయోగ్ పాలక మండలి ఆరో సమావేశంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోపన్యాసం చేశారు. దేశ ప్రగతికి ప్రాతిపదిక సహకార సమాఖ్య తత్వమేనని గుర్తుచేశారు. దేశాన్ని పోటీతత్వ సహకార సమాఖ్య దిశగా మళ్లించేందుకు మేధోమథనం చేయడమే ఈ సమావేశ లక్ష్యమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకారం మరింత పెరగాలని ఆకాంక్షించారు. కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి కృషి వల్లే కరోనా మహమ్మారి గడ్డు పరిస్థితిని దేశం అధిగమించగలిగిందని గుర్తు చేశారు. దేశ అత్యున్నత ప్రయోజనాలే పరమావధిగా నీతి ఆయోగ్ సమావేశ ఎజెండాను ఎంపిక చేసినట్లు వెల్లడించా రు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. పేదలకు పక్కా ఇళ్లు ‘దేశంలో ప్రతి పేద పౌరుడికీ పక్కా గృహ వసతి కల్పించే ఉద్యమం కొనసాగుతోంది. పట్టణాలు, గ్రామాల్లో 2014 నుంచి ఇప్పటివరకు 2.40 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. జల్‌జీవన్ మిషన్ ప్రారంభించాక 18 నెలల్లో∙3.5 లక్షల గ్రామీణ నివాసాలకు నల్లా ద్వారా తాగునీరు అందుబాటులోకొచ్చింది. ఇంటర్నెట్తో గ్రామీణ ప్రాంతాల అనుసంధానానికి ఉద్దేశించిన ‘భారత్ నెట్’ పథకం పెను మార్పులకు మాధ్యమం కానుంది. ప్రైవేట్ రంగం శక్తిని గౌరవించాలి : ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌పై సానుకూల ప్రతిస్పందన వ్యక్తమయ్యింది. ఇది దేశం మనోభావాలను బహిర్గతం చేసింది. ఇక సమయం వృథా చేయకుండా వేగంగా ముందడుగు వేయాలన్న దృఢ నిర్ణయానికి దేశం వచ్చింది. ఇండియా ప్రారంభించిన ఈ ప్రగతి ప్రయాణంలో భాగస్వామ్యానికి ప్రైవేట్ రంగం కూడా ఉత్సాహంతో ముందుకువస్తోంది. ఈ నవ్యోత్సాహాన్ని, ప్రైవేట్ రంగం శక్తిని ప్రభుత్వం తనవంతుగా గౌరవిస్తూ స్వయం సమృద్ధ(ఆత్మ నిర్భర్) భారత్ ఉద్యమంలో వీలైనంత ఎక్కువ అవకాశాలు సృష్టించాలి. దేశ అవసరాల కోసమే కాకుండా ప్రపంచం కోసం కూడా ఉత్పత్తి చేయగలిగేలా భారత్ అభివృద్ధి చెందాలి. ఇందుకు స్వయం సమృద్ధ భారత్ ఉద్యమం ఒక మార్గం. ఆవిష్కరణలకు ప్రోత్సాహం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశ ఆకాంక్షల దృష్ట్యా ఆధునిక మౌలిక సదుపాయాల నిర్మాణం వేగంగా చేపట్టాలి. నవీన ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వాలి. విద్యా, నైపుణ్య రంగాల్లో మెరుగైన అవకాశాల కల్పన కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత ఎక్కువగా వాడుకోవాలి. దేశంలో వ్యాపారాలు, సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ), అంకుర సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలోని వివిధ జిల్లాల్లో వాటికే ప్రత్యేకమైన ఉత్పత్తుల తయారీని ప్రోత్సహిస్తున్నాం. ఈ విధానాన్ని మండలాల స్థాయికి విస్తరించాలి. వనరులను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రాల నుంచి ఎగుమతులను పెంచాలి. వివిధ రంగాల కోసం కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని ప్రకటించింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు స్థానిక సంస్థలకు ఆర్థిక వనరులు భారీగా పెరుగుతున్నాయి. స్థానిక పరిపాలన సంస్కరణల్లో సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతోపాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకం. ప్రపంచ దేశాలకు మన ఉత్పత్తులు విదేశాల నుంచి వంటనూనెల దిగుమతికి ప్రతిఏటా రూ.65,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. వాస్తవానికి ఈ సొమ్మంతా మన రైతులకు దక్కాల్సి ఉంది. నూనె గింజల ఉత్పత్తిపై రైతులు దృష్టి పెట్టాలి. అనేక వ్యవసాయ ఉత్పత్తులను దేశ అవసరాల కోసమే కాకుండా ప్రపంచానికి సరఫరా చేయాలి. ఇది జరగాలంటే ఉత్పత్తులను భారీగా పెంచాలి. ఇందుకోసం అన్ని రాష్ట్రాలు ప్రాంతీయ వ్యవసాయ–వాతావరణ ప్రణాళిక వ్యూహాన్ని రూపొందించుకోవాలి. లాభార్జన కోసం కేవలం ముడి ఆహార పదార్థాలను కాకుండా, వాటి నుంచి రూపొందించిన ఉత్పత్తులను ఎగుమతి చేయాలి’ అని మోదీ అన్నారు. మండలి సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎల్జీలు, కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పాలక మండలి చైర్మన్‌గా ప్రధాని మోదీ నీతి ఆయోగ్ పాలక మండలిని కేంద్రం పునర్వ్యవస్థీకరించింది. పాలక మండలి చైర్మన్‌గా ఇకపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవహరిస్తారు. సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, ఢిల్లీ, పుదుచ్చేరి ప్రతినిధులు పాలక మండలిలో ఫుల్‌టైమ్ సభ్యులుగా ఉంటారు. అండమాన్ నికోబార్ దీవులు, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్లు ప్రత్యేక ఆహ్వానితులుగా పనిచేస్తారు. ప్రతిభ మనది.. ఉత్పత్తి మనది కాదు ‘నేను ఇటీవల ఐటీ రంగంలోని వ్యక్తులతో మాట్లాడా. తమలో 95 శాతం మంది ఇప్పుడు ఇంటినుంచే పని చేస్తున్నారని, ఉత్పాదకత పెరిగిందని చెప్పారు. నిబంధనల్లో సంస్కరణలు తేవడం వల్లే ఇది సాధ్యమైంది. జియో స్పేషియల్ డేటాకు సంబంధించిన నియమాలను కూడా సరళీకృతం చేశాం. పదేళ్ల క్రితమే చేయగలిగితే.. బహుశా గూగుల్ వంటివి భారతదేశం వెలుపల నిర్మితమయ్యేవి కావు. మన ప్రజలకు ప్రతిభ ఉంది, కానీ వారు తయారు చేసిన ఉత్పత్తి మనది కాదు’ అని అన్నారు. -
మ్యాపింగ్ పాలసీలో కీలక సడలింపులు
న్యూఢిల్లీ: భారత మ్యాపింగ్ పాలసీలో నిబంధనలను సడలిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జియోస్పేషియల్ డేటా నియంత్రణా నియమావళిలో మార్పులు చేయడం ద్వారా ఈ రంగంలో పబ్లిక్, ప్రైవేట్ సంస్థలకు సమానావకాశాలు ఉండేలా చర్యలు తీసుకుంది. కొత్త నిబంధనల్లో భాగంగా ఈ రంగాన్ని డీరెగ్యులేట్ చేయడంతో పాటు సర్వేయింగ్, మాపింగ్, యాప్స్ అభివృద్ధికి ప్రీ అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా మార్పులు చేసినట్లు సైన్స్అండ్టెక్నాలజీ సెక్రటరీ అశుతోష్ చెప్పారు. దేశీయ సంస్థలు జియోస్పేషియల్ డేటా సేవలందించేందుకు ముందుకు వస్తే ఎలాంటి ముందస్తు అనుమతులు, సెక్యూరిటీ క్లియరెన్సులు, లైసెన్సులు అవసరం లేదన్నారు. జియోస్పేస్ రంగంలో నిబంధనల సడలింపు ఆత్మ నిర్భర్ భారత్‌లో కీలక ముందడుగని ప్రధాని మోదీ అభివర్ణించారు. హైక్వాలిటీ మ్యాప్స్ అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న పలు రంగాలకు ఈ నిర్ణయం మేలు చేస్తుందని సైన్స్అండ్టెక్నాలజీ మంత్రి హర్ష వర్ధన్ అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు సర్వే ఆఫ్ ఇండియా సైతం మ్యాపులు తయారు చేయాలంటే పలు ఏజెన్సీల అనుమతులు తీసుకోవాల్సివచ్చేదని గుర్తు చేశారు. ఇంతవరకు నిషిద్ధ జోన్‌గా పేర్కొనే ప్రాంతాల జియోస్పేషియల్ డేటా సైతం ఇకపై అందుబాటులోకి వస్తుందని, అయితే ఇలాంటి సున్నిత ప్రాంతాలకు సంబంధించిన సమాచార వినియోగానికి సంబంధించి కొన్ని గైడ్‌లైన్స్ తీసుకువస్తామని తెలిపారు. ప్రజా నిధులతో సేకరించే డేటా మొత్తం దేశీయ సంస్థలకు అందుబాటులో ఉంటుందని, కేవలం సెక్యూరిటీ, లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు సేకరించిన డేటా మాత్రం అందుబాటులో ఉండదని వివరించారు. తాజా మార్పులతో 2030 నాటికి రూ.లక్ష కోట్ల విలువైన జియో స్పేషియల్ డేటా అందుబాటులోకి వస్తుందన్నారు. కొత్త నిబంధనలు ఆహ్వానించదగినవని జియోస్పేషియల్ రంగానికి చెందిన ఇస్రి ఇండియా టెక్, జెనిసిస్ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలు వ్యాఖ్యానించాయి. -
'టాటా' యుద్ద విమానాలు వచ్చేస్తున్నాయి!
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఒకటైన టాటా గ్రూపు.. యద్ధ విమానాల తయారీలోనూ తన సత్తా చాటనుంది. ఖరీదైన రక్షణ దిగుమతులకు ప్రత్యామ్నాయంగా... స్థానికంగానే వాటి ఉత్పత్తిని ప్రోత్సహించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ "ఆత్మనిర్భర్ భారత్" కార్యక్రమంలో టాటా గ్రూపు పాలుపంచుకోనుంది. అత్యంత ఎత్తులో విహరించగల ట్విన్ ఇంజన్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీలో తన సామర్ధ్యాలను టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్ లిమిటెడ్. బుధవారం నుంచి(ఈ నెల 3 నుంచి 5 వరకు) బెంగళూరులో జరిగే 'ఏరో ఇండియా 2021" కార్యక్రమంలో ప్రదర్శించనుంది. కంపెనీ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు. రెండేళ్ళకొకసారి బెంగళూరులో ఏరో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. యుద్ధ విమానాల తయారీకి సంబంధించి మేధోపరమైన హక్కులను టాటా అడ్వాన్స్డ్ సి ఇప్పటికే సొంతం చేసుకుంది. టాటా సంస్థ రూపొందించిన మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్ విజయం సాధిస్తే... ప్రైవేటు రంగంలో యుద్ధ విమానాలను తయారు చేయగల తొలి దేశీయ సంస్థగా అవతరించనుంది. ప్రభుత్వ రంగంలోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లీమిటెడ్ ఒక్కటే ఇప్పటి వరకు ఈ సామర్థ్యాలను నిరూపించుకున్న సంస్థ కావడం గమనార్హం. అంతేకాదు, భారత్‌లో తయారీ కార్యక్రమానికి మరింత మద్దతు కూడా లభించనుంది. టాటా నూతన యుద్ద విమానాన్ని సరిహద్దుల్లో నిఘా, సైనిక అవసరాలకు వినియోగించే అవకాశం ఉంటుందని కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. -
నేటి స్టార్టప్‌లే రేపటి ఎమ్ఎన్సీలు
న్యూఢిల్లీ: భారత్‌లో నేటి స్టార్టప్‌లే రేపటి బహుళ జాతి సంస్థలుగా మారుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అది సాధించినప్పుడే ఆత్మ నిర్భర్ భారత్ కల సాకారం అవుతుందని అన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా వివిధ దేశాలకు చెందిన ఎంఎన్‌సీలు భారత్‌లో వ్యాపారం చేశాయని, ఇక భారత్ ఎంఎన్‌సీలు ఇతర దేశాల్లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తాయని అన్నారు. భారతదేశం లోకల్ నుంచి గ్లోబల్ వైపు అడుగులు వేయడానికి ఐఐఎం విద్యార్థులందరూ కలసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఒడిశాలోని సంబల్పూర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) శాశ్వత భవనానికి శనివారం మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. సృజనాత్మక ఆలోచనలతో అందరినీ భాగస్వాముల్ని చేస్తూ కలసి కట్టుగా ముందుకు వెళ్లడమే నిర్వహణ రంగంలో ముఖ్య సూత్రమన్నారు. భారత్ తన కాళ్ల మీద తాను నిలబడడానికి అదే కావాలన్నారు. ప్రతీ విద్యార్థి తమ కెరీర్ లక్ష్యాలను దేశాభివృద్ధికి ఉపయోగపడేలా మలచుకోవాలన్నారు. భారత్ ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండ్ కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఐఐఎం విద్యార్థులు కొత్త కాన్సెప్ట్‌లతో లోకల్ ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్ వచ్చేలా కృషి చేసి ఆత్మనిర్భర్ భారత్ కల సాకారం చేసుకోవడానికి తోడ్పాటునందించాలన్నారు. లోకల్ నుంచి గ్లోబల్ మధ్య ఐఐఎం విద్యార్థులే వారధిగా ఉంటారని మోదీ చెప్పారు. -
కిసాన్ క్రెడిట్.. రూ.7,362 కోట్లు
సాక్షి, అమరావతి: కోవిడ్–19 లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీ కింద.. కిసాన్ క్రెడిట్ కార్డులపై రాష్ట్రంలో పంట రుణాలు, మత్స్య, పశు సంవర్ధక రంగాలకు కలిపి బ్యాంకులు ఇప్పటివరకు రూ.7,362.38 కోట్ల మేర రుణాలు మంజూరు చేశాయి. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. లాక్డౌన్ నేపథ్యంలో మందగించిన ఆర్ధిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు, అలాగే రైతులకు ఎటువంటి పూచీకత్తు లేకుండా కిసాన్ క్రెడిట్ కార్డులపై పంట రుణాలను మంజూరు చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ఉద్దేశంతో కేంద్రం ఈ ప్యాకేజీ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా కిసాన్ క్రెడిట్ కార్డులపై 2.50 కోట్ల మంది రైతులకు పంట రుణాలను మంజూరు చేయించాలని లక్ష్యంగా నిర్ధారించింది. అలాగే దేశ వ్యాప్తంగా 1.50 కోట్ల మంది డెయిరీ రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను మంజూరు చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీని సద్వినియోగం చేసుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించింది. దీంతో గత ఏడాది జూన్ 1వ తేదీ నుంచి నవంబర్ 13వ తేదీ వరకు రాష్ట్రంలో ఆత్మ నిర్భర్ అభియాన్ ప్యాకేజీ కింద 7,66,827 దరఖాస్తులు అందాయి. ఇందులో అర్హత గల దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు పంపించి రుణాలు మంజూరు చేయించడానికి ప్రాధాన్యత ఇచ్చింది. ప్యాకేజీ కింద వీలైనంత ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం కల్పించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టగా బ్యాంకులు సైతం సానుకూలంగా స్పందించాయి. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంతో పాటు పాడి, మత్స్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తుండడంతో బ్యాంకులు కూడా ఆయా రంగాలకు రుణాలు మంజూరు చేస్తున్నాయి. -
ఐఐటీ హైదరాబాద్‌లో టైహాన్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర సిగలో మరో మణిహారం.. నగర శివారు లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ–హైదరాబాద్)లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అడుగు పడింది. మానవ రహిత విమానాలు, రిమోట్ కంట్రోల్‌తో నడిచే వాహనాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం పరీక్షించేందుకు ఉద్దేశించిన ‘టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఫర్ అటానమస్ నేవిగేషన్ సిస్టమ్స్(టైహాన్)’ ఏర్పాటుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ మంగళవారం పునాది వేశారు. వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ దిశగా వేస్తున్న అతిపెద్ద ముందంజగా ఈ ప్రాజెక్టును అభివర్ణించారు. స్వతంత్ర నేవిగేషన్ వ్యవస్థకు సంబంధించిన పలు విభాగాలు ఈ ప్రాజెక్టులో కలసికట్టుగా పనిచేస్తాయన్నారు. మానవ రహి త విమానాల నిర్వహణలో ఎదురయ్యే వాస్తవ సమస్యలు, సవాళ్ల పరిష్కారానికి ఇది ఉపయోగపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు. మానవ రహిత డ్రోన్లు, వాహనాలను ఎలాంటి అడ్డంకులు, ప్రమాదాలు లేకుండా పరీక్షించేందుకు ఇదో మేలైన వ్యవస్థగా రూపొందుతుం దని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీవీఎస్ మూర్తి తెలిపారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం ఐఐటీ–హెచ్‌కు రూ.135 కోట్లు మంజూరు చేశాయి. ప్రాజెక్టులో భాగం గా టైహాన్‌లో టెస్ట్ ట్రాక్‌లు, నిత్యజీవితంలో ఎదురయ్యే రకరకాల పరిస్థితులను తలపించేవి ఏర్పాటవుతాయి. అత్యాధునిక సిమ్యులేషన్ టెక్నాలజీలు, రహదారి వ్యవస్థలు, వీ2ఎక్స్ కమ్యూనికేషన్, డ్రోన్లు ఎగిరేందుకు, దిగేందుకు అవసరమైన రన్వేలు, ల్యాండింగ్ ఏరియాలు ఏర్పాటుచేస్తా రు. ఇటు సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూమ్/గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, హ్యాంగర్లు కూడా ఈ ప్రాజెక్టులో ఉంటాయని ఐఐటీ–హెచ్ ఓ ప్రకటనలో తెలిపింది. -
అరకొర ఉద్దీపన
కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడి ఏడెనిమిది నెలలవుతున్నా అదింకా దారికి రాలేదు. మన దేశంతోపాటు ప్రపంచ దేశాలన్నిటా ఇప్పటికీ ఆ వైరస్ దోబూచులాడుతూనే వుంది. ఈలోగా అన్ని దేశాలూ తమ తమ ఆర్థిక వ్యవస్థలను చక్కబరుచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం 2.65 లక్షల కోట్ల విలువైన ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. ఆమె దీన్ని ఆత్మనిర్భర్ ప్యాకేజీ 3.0 అని నామకరణం చేశారు. లోగడ వెలువరించిన రెండు ఉద్దీపన ప్యాకేజీలనూ కలుపుకుంటే ఇంతవరకూ కరోనా అనంతర ఆర్థిక వ్యవస్థను చక్క దిద్దడానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ. 29 లక్షల 87వేల 641 కోట్ల మొత్తాన్ని వ్యయం చేస్తున్నట్టవుతుందని(జీడీపీలో 15శాతం) ఆమె లెక్క చెప్పారు. ఇందులో ప్రభుత్వం వాటా 9 శాతంకాగా, రిజర్వ్‌బ్యాంకు వాటా 6శాతం. ఇది బహుశా 2021–22 బడ్జెట్‌కు ముందు ప్రకటించిన చివరి ఉద్దీపన అయివుండొచ్చు. మన ఆర్థిక వ్యవస్థ స్వల్పంగానైనా కోలుకుంటున్న సూచనలు కనబడుతున్నాయని ఆర్థిక నిపుణులు కొందరు సంతోషపడుతున్నారు. విద్యుత్ వాడకం పెరగడం, రైల్వేల్లో సరుకు రవాణా, ఈ–వే బిల్లులు పుంజుకోవడం, బొగ్గు ఉత్పత్తి పెరగడం, జీఎస్టీ వసూళ్ల ముమ్మరం వంటివి అందుకు ఉదాహరిస్తున్నారు. మన ఆర్థికవ్యవస్థ దాదాపు కరోనా ముందునాటి పరిస్థితికి చేరుకుంటోందని వారి అంచనా. మన ఆర్థిక వ్యవస్థకు తగిలే దెబ్బపై గతంలోని అంచ నాలను అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు ఈమధ్యే స్వల్పంగానైనా సవరించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే కేంద్రం ప్రకటించిన తాజా ప్యాకేజీ వారిని సంతృప్తిపరిచి వుండొచ్చు. ఈ ఉద్దీపనలు పట్టణ ప్రాంతాల్లో కార్మికుల సంఖ్యను పెంచడానికి, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు, రుణలభ్యత కోసం ఇబ్బందులు పడుతున్న రంగాలను ఆదుకోవడానికి, దేశీయ తయారీరంగం పుంజుకోవడానికి, స్థిరాస్తి రంగం మళ్లీ పరుగులెత్తడానికి తోడ్పడతాయని కేంద్రం చెబుతోంది. రైతులకు ఎరువుల సబ్సిడీగా రూ. 65,000 కోట్ల మేర ప్రకటించారు. ఇదికూడా గ్రామీణ ఉపాధికి ఆసరాగా నిలుస్తుందని భావిస్తోంది. అయితే ఇప్పుడు ప్రకటించిన ప్యాకేజీ అయినా, లోగడ ప్రకటించినవైనా ప్రభుత్వ దృష్టి ఎంతసేపూ ఉత్పత్తి వైపున్నది తప్ప గిరాకీ వైపులేదన్నది స్పష్టమవుతోంది. కొత్తగా చేర్చుకునే ఉద్యోగులకు సంబంధించిన ఈపీఎఫ్ మొత్తాన్ని రెండేళ్లపాటు కేంద్రమే చెల్లించడం...చిన్న పరిశ్రమలు, చిరు వ్యాపారుల కోసం ఇంతకు ముందు ప్రకటించిన అత్యవసర రుణ వితరణ హామీ పథకాన్ని పొడిగించడం, పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన, ప్రోత్సాహకాలు కల్పించడం, గ్రామీణ ఉపాధి హామీకి అదనపు నిధులివ్వడం, స్థిరాస్తి రంగంలోని బిల్డర్లకూ, కొనుగోలుదారులకూ ఆదాయ పన్ను ఉపశమనం వంటివన్నీ ఈ మాదిరివే. ఇందువల్ల ఆయా సంస్థలు పెద్దయెత్తున ఉద్యోగ, ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటాయని... ఆరకంగా జనంలో కొనుగోలు శక్తి పెరుగుతుందని ప్రభుత్వం అంచనా. ఇందులో తప్పుబట్టవలసింది ఏమీ లేదు. కానీ తాము ఉత్పత్తి చేసే సరుకుకు బయట డిమాండు వుంటుందన్న హామీ వుంటే తప్ప ఏ సంస్థా రుణాలు తీసుకోవడానికి ముందుకు రాదు. ఒక్కసారి వెనక్కెళ్లి చూస్తే కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడటానికి ముందు కూడా ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా వున్న వైనాన్ని గమనించి ఎవరూ రుణాలు తీసుకోవడానికి ముందుకు రాలేదు. తీసుకునేవారున్నా రుణాలివ్వడానికి బ్యాంకులు భయపడే పరిస్థితులున్నాయి. బయట గిరాకీ పెద్దగా లేదని తెలిసినపుడు అప్పులిచ్చేవారికీ, తీసుకునేవారికీ కూడా ఇలాంటి భయాలు సహజమే. పైగా తాజా ఉద్దీపనలో కార్పొరేట్ రంగానికి, విదేశాల నుంచి వచ్చే కంపెనీలకు పెద్ద పీట వేశారని చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చెందిన వివిధ సంఘాల కన్సార్షియం సీఐఏ ఆరోపిస్తోంది. గత ప్యాకేజీల్లో ఇచ్చిన రుణ వితరణ వెసులుబాట్లకు సంబంధించిన గడువు పొడిగించడం మినహా కొత్తగా చేసిందేమిటని ప్రశ్నిస్తోంది. లక్షలాదిమందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)లకు ప్రకటించిన రుణ వితరణ పథకాల వినియోగం తగినంతగా లేదని వస్తున్న కథనాలు ఆందోళన కలిగిస్తాయి. అందుకుగల అడ్డంకులేమిటో పాలకులు గమనించారా? లేదని ఆ సంస్థలు చెబు తున్నాయి. ఆ రుణాలకు సవాలక్ష నిబంధనలు పెడుతున్నారని ఆమధ్య కొన్ని సంస్థలు వాపోయాయి. కార్మికులకు ఉపాధి కల్పించలేకపోవడానికి కేవలం వారి ఈపీఎఫ్ మొత్తం చెల్లించే స్థోమత లేకపోవడంవల్లనేనని, రెండేళ్ల రాయితీతో అంతా సర్దుకుంటుందని కేంద్రం భావించడం సరికాదు. ఈఎంఐలపై మారటోరియం గడువు ముగిశాక మొన్న సెప్టెంబర్‌లో 21 శాతం చెక్కులు వెనక్కొచ్చాయని సీఐఏ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. మున్ముందు ఇదింకా పెరగొ చ్చని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. జనం కొనుగోలు శక్తి పెరిగితే ఉత్పత్తయిన సరుకుకు గిరాకీ ఏర్పడుతుంది. అందుబాటులో తగినంత మొత్తం వుంటే తమ అవసరాలు తీర్చుకోవడానికి జనం వెనకాడరు. మన ఆర్థిక వ్యవస్థకైనా, ప్రపంచంలోని ఇతర ఆర్థిక వ్యవస్థలకైనా ఇదే వర్తిస్తుంది. ప్రజానీకానికి నగదు బదిలీ చేస్తే పొదుపుచేస్తారు తప్ప ఖర్చు చేయరని కొందరు ఆర్థికవేత్తలు పెదవి విరుస్తున్నారు. కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్ కె. సుబ్రహ్మణ్యం సైతం ఆమాటే అన్నారు. ప్రపంచంలో అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు మొదలుకొని కొన్ని చిన్న దేశాల వరకూ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి నగదు బదిలీని ఒక మార్గంగా ఎంచుకున్నారు. అందువల్ల ఫలితాలు కనబడుతున్నాయి కూడా. ఉద్యోగ కల్పనకు సమాంతరంగా దాన్నికూడా అమలు చేస్తే మంచిది. అది అసలైన ఆత్మనిర్భరతకు తోడ్పడుతుంది. ఆ దిశగా కేంద్రం ఆలోచించాలి. -
జీడీపీ పరుగులు పెట్టేలా ప్రత్యేక ప్యాకేజీ: నిర్మల
న్యూఢిల్లీ: కోవిడ్-19 కారణంగా ఈ ఏడాది తొలి రెండు త్రైమాసికాలలో జీడీపీ నీరసించినప్పటికీ మూడో క్వార్టర్(అక్టోబర్- డిసెంబర్) నుంచి వృద్ధి బాట పట్టనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పేర్కొన్నారు. జీడీపీ వృద్ధిపై ఆర్బీఐ తాజాగా అంచనాకు వచ్చినట్లు తెలియజేశారు. ఇటీవల కనిపిస్తున్న డిమాండ్ తాత్కాలికమైనదికాదని..ఇకపైనా పటిష్టంగా కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. ఇందుకు నిదర్శనంగా వెల్తువెత్తిన జీఎస్టీ వసూళ్లు, గత నెలలో 12 శాతం పెరిగిన విద్యుత్ వినియోగం, రోజుకి 20 శాతం వృద్ధి చూపుతున్న రైల్వే సరుకు రవాణా, కొత్త రికార్డులను సాధిస్తున్న స్టాక్ మార్కెట్లు తదితరాలను ప్రస్తావించారు. విదేశీ మారక నిల్వలు సైతం రికార్డ్ స్థాయిలో 560 బిలియన్ డాలర్లను తాకినట్లు తెలియజేశారు. గత 11 రోజులుగా పటిష్ట రికవరీ కనిపిస్తున్నట్లు తెలియజేశారు. ఆర్థిక పురోగతికి దన్నునిచ్చేందుకు సహాయక ప్యాకేజీలో భాగంగా ఆత్మనిర్భర్-3ను ప్రకటించారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్థిక మంత్రి సీతారామన్ ఇంకా ఏమన్నారంటే.. హైలైట్స్ - ఎరువుల సబ్సిడీ కింద రైతులకు రూ. 65,000 కోట్ల కేటాయింపు. - జాతీయ మౌలిక సదుపాయాల పెట్టుబడి నిధి(ఎన్ఐఐఎఫ్)కి రూ. 6,000 ఈక్విటీ పెట్టుబడులు. తద్వారా 2025కల్లా ఎన్ఐఐఎఫ్ రూ. 1.1 లక్షల కోట్లను సమీకరించగలుగుతుంది. తద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు నిధులను సమకూర్చగలుగుతుంది. - గరీబ్ కళ్యాణ్ యోజన పథకానికి రూ. 10,000 కోట్ల అదనపు కేటాయింపులు. - రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్‌కు బూస్ట్- డెవలపర్లు, గృహ కొనుగోలుదారులకు పన్ను సంబంధిత ఉపశమన చర్యలు- సెక్షన్ 43సీఏలో సవరణలు! - ఆత్మనిర్భర్ తయారీ పథకంలో భాగంగా 10 చాంపియన్ రంగాలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను అందించనున్నారు. - ఈ పథకం విలువ రూ. 1,45,980 కోట్లు. - అడ్వాన్స్ సెల్ కెమిస్ట్రీ బ్యాటరీకు రూ. 18,100 కోట్లు - ఎలక్ట్రానిక్, టెక్నాలజీ ప్రొడక్టులు రూ. 5,000 కోట్లు - ఆటోమొబైల్, ఆటో విడిభాగాలు రూ. 57,042 కోట్లు - ఫార్మాస్యూటిక్స్, ఔషధాలు రూ. 15,000 కోట్లు - టెలికం, నెట్వర్కింగ్ ప్రొడక్టులు రూ. 12,195 కోట్లు - టెక్స్టైల్ ప్రొడక్టులు రూ. 10,683 కోట్లు - అధిక సామర్థ్యంగల సోలార్ పీవీ మాడ్యూల్స్ రూ. 4,500 కోట్లు - వైట్ గూడ్స్(ఏసీలు, లెడ్) రూ. 6,328 కోట్లు - స్పెషాలిటీ స్టీల్ రూ. 6,322 కోట్లు - స్వావలంబన పథకంలో భాగంగా 12 రకాల చర్యలను ప్రకటించారు. ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన పేరుతో పథకాన్ని ప్రకటించారు. కోవిడ్-19 కారణంగా మార్చి- సెప్టెంబర్ మధ్య కాలంలో ఉపాధి కోల్పోయిన వారికి కొత్తగా ఉద్యోగ కల్పనకు చర్యలు. రూ. 15,000 కంటే తక్కువ వేతనాలు ఆర్జించేవారికి ఈ పథకం వర్తించనుంది. 2020 అక్టోబర్ 1 నుంచీ రెండేళ్లపాటు ఈ పథకం అమలులో ఉంటుంది. - ఈఎల్సీజీ పథకంకింద రూ. 2.05 లక్షల కోట్లను కేటాయించాం. 61 లక్షల రుణగ్రహీతలకు రూ. 1.52 లక్షల కోట్ల రుణాలు విడుదలయ్యాయి. - 21 రాష్ట్రాలు పంపిన ప్రతిపాదనలమేరకు రూ. 1681 కోట్లను పీఎం మత్స్యసంపద పథకానికి కేటాయించాం. - పాక్షిక క్రెడిట్ గ్యారంటీ పథకంలో భాగంగా రూ. 26,889 కోట్ల పీఎస్‌యూ బ్యాంకుల పోర్ట్‌ఫోలియోలను కొనుగోలు చేసేందుకు అనుమతించాం. - ప్రత్యేక లిక్విడిటీ పథకంలో భాగంగా ఎన్బీఎఫ్సీ, హెచ్ఎఫ్సీలకు రూ. 7,227 కోట్లు విడుదలయ్యాయి. - 39.7 లక్షల మంది అసెసీలకు రూ. 1,32,800 కోట్లను ఆదాయపన్ను రిఫండ్స్గా చెల్లించాం. -
షిప్పింగ్ మంత్రిత్వ శాఖ పేరు మారుస్తాం: మోదీ
అహ్మదాబాద్: నౌకాయాన శాఖను విస్తరించి దాన్ని రేవులు, నౌకాయానం, జలరవాణా శాఖగా పేరు మారుస్తామని ప్రధాని మోదీ చెప్పారు. గుజరాత్లో రో–పాక్స్ ఫెర్రీ (నౌక) సర్వీసును ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇది 370 కి.మీ దూరాన్ని ఇది 90 కిలోమీటర్లకు (సముద్ర మార్గం) తగ్గిస్తుంది. ‘ఆత్మనిర్భర్ కార్యక్రమంలో భాగంగా షిప్పింగ్ శాఖ పేరును మారుస్తున్నామని చెప్పారు. నీలి ఆర్థిక వ్యవస్థ కోసం సముద్ర రవాణాను బలోపేతం చేయాల న్నారు. నోట్ల రద్దు దేశంలో నల్లధనాన్ని తగ్గించేందుకు, పన్ను వ్యవహారాల్లో క్లిష్టత తొలగిపోవడానికి, పారదర్శకతను పెంపొందించేందుకు దోహద పడిందని మోదీ చెప్పారు. పెద్ద నోట్లను రద్దు చేసి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ట్వీట్ చేశారు. పన్నుల వ్యవహారాలు మెరుగుపడేందుకు, మెరుగైన పన్ను, జీడీపీ నిష్పత్తికి నోట్ల రద్దు ఎలా దోహదపడిందో తెలిపే గ్రాఫిక్‌ను షేర్ చేశారు.