స్వావలంబనకు స్ఫూర్తి ఖాదీ | Khadi is an inspiration for Atmanirbhar movement says PM Narendra Modi | Sakshi
Sakshi News home page

స్వావలంబనకు స్ఫూర్తి ఖాదీ

Published Sun, Aug 28 2022 6:19 AM | Last Updated on Sun, Aug 28 2022 6:19 AM

Khadi is an inspiration for Atmanirbhar movement says PM Narendra Modi - Sakshi

అహ్మదాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం గుజరాత్‌కు చేరుకున్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అహ్మదాబాద్‌లోని సబర్మతీ రివర్‌ఫ్రంట్‌ వద్ద నిర్వహించిన ‘ఖాదీ ఉత్సవ్‌’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభివృద్ధి లక్ష్యాల సాధనకు, ఆత్మనిర్భర్‌ భారత్‌(స్వాలంబన)నకు ఖాదీ స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.

ఒకప్పుడు మన ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఖాదీని దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేశారని వాపోయారు. ఖాదీ ఉత్పత్తులను విస్తృతంగా వినియోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాబోయే పండుగ సీజన్‌లో బంధుమిత్రులకు ఖాదీ గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులను బహుమతులుగా అందజేయాలని అన్నారు.  75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని 7,500 మంది ఇక్కడ చరఖా తిప్పి సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రధాని మోదీ సైతం స్వయంగా చరఖా తిప్పారు. అహ్మదాబాద్‌లో నూతన ఖాదీ గ్రామోద్యోగ్‌ భవనాన్ని ప్రారంభించారు.  

సబర్మతీపై అటల్‌ బ్రిడ్జి ప్రారంభం  
గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లో సబర్మతీ నదిపై పాదచారులు, సైక్లిస్ట్‌ల సౌకర్యార్థం నిర్మించిన ‘అటల్‌ బ్రిడ్జి’ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయికి స్థానికులు అర్పిస్తున్న నివాళి ఈ వారధి అని చెప్పారు. అటల్‌ బ్రిడ్జిపై మోదీతోపాటు గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సి.ఆర్‌.పాటిల్‌ కాసేపు సరదాగా నడిచారు. ప్రజలకు అభివాదం చేశారు. అటల్‌ బ్రిడ్జి సబర్మతీ నది రెండు ఒడ్డులను అనుసంధానించడమే కాదు, విశిష్టమైన, వినూత్నమైన డిజైన్‌తో ఆకట్టుకుంటోందని మోదీ అన్నారు. అటల్‌జీని గుజరాత్‌ ఎంతగానో ప్రేమించిందని చెప్పారు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన గాంధీనగర్‌ నుంచి పోటీచేసి, రికార్డుస్థాయిలో ఓట్లు సాధించి, ఘన విజయం సాధించారని గుర్తుచేశారు.  

► అటల్‌ బ్రిడ్జి పొడవు 300 మీటర్లు. మధ్యభాగంలో దీని వెడల్పు 14 మీటర్లు.  
► పాదచారులు, సైకిల్‌ ప్రయాణికులు మాత్రమే ఉపయోగించుకోవచ్చు.  
► విభిన్నమైన డిజైన్, ఎల్‌ఈడీ లైటింగ్‌తో చూపరులకు కనువిందు చేస్తోంది.  
► సబర్మతీ రివర్‌ఫ్రంట్‌ పశ్చిమ భాగంలోని ఫ్లవర్‌ గార్డెన్‌ను, తూర్పు భాగంలో రాబోయే ఆర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ సెంటర్‌ను అనుసంధానిస్తుంది.   
► 2,600 మెట్రిక్‌ టన్నుల స్టీల్‌ పైపులు ఉపయోగించి అటల్‌ బ్రిడ్జి నిర్మించారు.  
► పైకప్పును రంగుల వస్త్రంతో అలంకరించారు.

సబర్మతీ నదిపై అటల్‌ వంతెన (ఇన్‌సెట్‌లో)
వంతెనను
ప్రారంభిస్తున మోదీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement