Sabarmati river
-
హైదరాబాద్‌ను ఫినిష్ చేసేయత్నం
సాక్షి, హైదరాబాద్: ‘‘గుజరాత్‌తో పోటీపడుతోందన్న అక్కసుతో హైదరాబాద్‌ను ఫినిష్ చేయాలని చూస్తున్నారు. మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగు రోడ్డు, రేడియల్ రాడార్, ఇరిగేషన్ ప్రాజెక్టులతో పురోగతి సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం.. గుజరాత్‌కు పోటీ ఇస్తుందనే విషయం తెలిసే బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి మా ప్రయత్నాలను ఆపాలని చూస్తున్నాయి..’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు.అందుకే కాంగ్రెస్ సర్కారు నిర్ణయాలను బీఆర్ఎస్ వ్యతిరేకించిన మరుసటి రోజే కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు కూడా తప్పుపడతారని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఏబీపీ నెట్వర్క్ ‘సదరన్ రైజింగ్ సమ్మిట్–2024’ను సీఎం రేవంత్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. వివరాలు రేవంత్ మాటల్లోనే.. ‘‘గుజరాత్ రాష్ట్రంలో సబర్మతి రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ మేం మూసీ పునరుజ్జీవం చేస్తామంటే మాత్రం బీజేపీ నేతలు అడ్డుకుంటారు. మూసీ పునరుజ్జీవంతోపాటు బాపూఘాట్ అభివృద్ధిని కూడా బీజేపీ వ్యతిరేకిస్తోంది. మీకు నచ్చకపోతే ఇంట్లో కూర్చోండి. మా ప్రభుత్వాన్ని పనిచేయనివ్వండి. మా ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలని చూడొద్దు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నది గుర్తుంచుకోండి. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కదు తెలంగాణ ప్రజల ఆలోచనలను పట్టించుకోకపోతే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే పడగొట్టాలని అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే నాకు మద్దతుగా నిలిచారు. పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపించిన కేసీఆర్ పది సార్లు కూడా సెక్రటేరియట్‌కు రాలేదు. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే పది నిమిషాలు అసెంబ్లీలో కూర్చుని వెళ్లిపోయారు.కేసీఆర్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకముంటే ఎందుకు బయటకు రావడం లేదు? తానో జమీందార్ అని, ప్రజలందరూ గులాములని కేసీఆర్ భావిస్తారు. అందుకే బయటికి రావడం లేదు. ఈసా, మూసా నదులు కలిసే చోట బాపూఘాట్ ఉంది. అంతర్జాతీయ స్థాయిలో గాంధీ ఐడియాలజీ కేంద్రంగా దానిని అభివృద్ధి చేస్తాం. గాంధీజీ వారసులుగా మేం ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలా బాపూఘాట్ అభివృద్ధి చేయబోతున్నాం. గుజరాత్లో పటేల్ విగ్రహం తరహాలోనే బాపూఘాట్లో గాంధీజీ విగ్రహం ఏర్పాటు చేస్తాం. ప్రజల కోసం మోదీ ఏం చేశారు? నెహ్రూ మొదలుకుని ఇందిర, రాజీవ్, పీవీ, మన్మోహన్ వంటి కాంగ్రెస్ ప్రధానులందరూ దేశంలో అనేక సంస్కరణలతో పాటు విప్లవాలు తీసుకువచ్చారు. కానీ దేశానికి మూడోసారి ప్రధాని అయిన మోదీ ఏం విప్లవం తెచ్చారో, దేశ ప్రజల కోసం ఏం చేశారో, ఎవరికి ప్రయోజనం చేకూర్చారో చెప్పాలి. పార్టీలను, ప్రభుత్వాలను విడగొట్టడం, పడగొట్టడం, భావోద్వేగాలతో రాజకీయాలు చేయడం తప్ప ప్రజలకు మోదీ ఏమీ చేయలేదు. ఈ దేశంలో ఉత్తర, దక్షిణ భారతాలనే విభజన తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరిగేది. ఉత్తరాది రాష్ట్రాలకు కూడా నిధులు కేటాయించి అభివృద్ధి చేసేవారు. కానీ ఎన్డీఏ హయాంలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. గతంలో ఉత్తర భారతం నుంచి ప్రధాని ఉంటే.. దక్షిణ భారతం నుంచి రాష్ట్రపతిని చేసే సంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీ పాటించింది. కానీ మోదీ ఈ సంప్రదాయాన్ని తుంగలో తొక్కి కేవలం ఎన్నికల్లో గెలుపు కోసమే పనిచేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పన్నులు తీసుకుంటున్నా.. కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. దక్షిణ భారత రాష్ట్రాలకు మోదీ నుంచి అందిన సహకారం చాలా తక్కువ. ఉత్తరప్రదేశ్ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో ఒక్క రూపాయి వెళితే.. 7 రూపాయలు వెనక్కు ఇస్తున్నారు. అలాగే బీహార్‌కు 6 రూపాయలు వెనక్కి ఇస్తున్నారు. తెలంగాణ నుంచి రూపాయి వెళితే.. కేవలం 40పైసలు మాత్రమే వెనక్కి ఇస్తున్నారు. ప్రధాని మోదీ ఉత్తర భారతదేశానికి చెందిన వ్యక్తి కావడంతోనే దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నారన్న విషయాన్ని ప్రజలు గమనించాలి..’’ అని సీఎం రేవంత్ ఆరోపించారు. -
దేశం కోసం ఖాదీ... జాతీయ జెండా కోసం చైనీస్ పాలిస్టర్
న్యూఢిల్లీ: దేశం కోసం ఖాదీ కానీ జాతీయ జెండా కోసం చైనీస్ పాలిస్టర్ అని కాంగ్రెస్ నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ పై విమర్శలు ఎక్కుపెట్టారు. ఎప్పటిలాగే ఆయన పనులుకు మాటలకు పొంతన ఉండదంటూ మోదీ పై మండిపడ్డారు. ఈ మేరకు ప్రధాని మోదీ అహ్మదా బాద్‌లో సబర్మతి రివర్‌ఫ్రంట్ లో ఖాదీ ఉత్తవం సందర్భంగా ఖాదీ గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ మోదీ పై ఈ విమర్శల దాడి చేశారు. మోదీ ఆ ఉత్సవంలో అభివృద్ధి చెందిన స్వావలంబనతో కూడిన భారతదేశ కలను సాధించడానికి ఖాదీ ఒక ప్రేరణగా మారుతుందని అన్నారు. దీందో రాహుల్‌గాంధీ ఫ్లాగ్ కోడ్ విషయాన్ని ప్రస్తావిస్తూ ...కేంద్రం ఫ్లాగ్ కోడ్‌ని సవరించడాన్ని కూడా తప్పుపట్టారు. జాతీయ జెండాను చేతితో చేసే నూలు లేదా యంత్రంతో తయారు చేసిన పత్తి /పాలిస్టర్/ ఉన్ని/ పట్టు ఖాదీని వినియోగించవచ్చని కేంద్రం సవరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐతే గతంలో మిషన్‌తో చేసే పాలిస్టర్ జెండాలను ఉపయోగించేందుకు అనుమతించలేదనే విషయాన్ని గుర్తు చేశారు. పైగా మోదీ ఆ ఖాదీ ఉత్సవంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఖాదీ లేదా హోమ్‌స్పన్ నాసిరంకంగా ఉత్పత్తిగా పరిగణించారని చెప్పారు. అంతేకాదు రానున్న పండుగలో గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులైన ఖాదీ మాత్రమే బహుమతిగా ఇవ్వాలని ప్రజలను కోరారు కూడా. దీంతో రాహుల్ గాంధీ మోదీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. (చదవండి: స్వావలంబనకు స్ఫూర్తి ఖాదీ) -
స్వావలంబనకు స్ఫూర్తి ఖాదీ
అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం గుజరాత్‌కు చేరుకున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అహ్మదాబాద్‌లోని సబర్మతీ రివర్‌ఫ్రంట్ వద్ద నిర్వహించిన ‘ఖాదీ ఉత్సవ్’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభివృద్ధి లక్ష్యాల సాధనకు, ఆత్మనిర్భర్ భారత్(స్వాలంబన)నకు ఖాదీ స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఒకప్పుడు మన ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఖాదీని దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేశారని వాపోయారు. ఖాదీ ఉత్పత్తులను విస్తృతంగా వినియోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాబోయే పండుగ సీజన్లో బంధుమిత్రులకు ఖాదీ గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులను బహుమతులుగా అందజేయాలని అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని 7,500 మంది ఇక్కడ చరఖా తిప్పి సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రధాని మోదీ సైతం స్వయంగా చరఖా తిప్పారు. అహ్మదాబాద్‌లో నూతన ఖాదీ గ్రామోద్యోగ్ భవనాన్ని ప్రారంభించారు. సబర్మతీపై అటల్ బ్రిడ్జి ప్రారంభం గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో సబర్మతీ నదిపై పాదచారులు, సైక్లిస్ట్ల సౌకర్యార్థం నిర్మించిన ‘అటల్ బ్రిడ్జి’ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి స్థానికులు అర్పిస్తున్న నివాళి ఈ వారధి అని చెప్పారు. అటల్ బ్రిడ్జిపై మోదీతోపాటు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సి.ఆర్.పాటిల్ కాసేపు సరదాగా నడిచారు. ప్రజలకు అభివాదం చేశారు. అటల్ బ్రిడ్జి సబర్మతీ నది రెండు ఒడ్డులను అనుసంధానించడమే కాదు, విశిష్టమైన, వినూత్నమైన డిజైన్‌తో ఆకట్టుకుంటోందని మోదీ అన్నారు. అటల్‌జీని గుజరాత్ ఎంతగానో ప్రేమించిందని చెప్పారు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన గాంధీనగర్ నుంచి పోటీచేసి, రికార్డుస్థాయిలో ఓట్లు సాధించి, ఘన విజయం సాధించారని గుర్తుచేశారు. ► అటల్ బ్రిడ్జి పొడవు 300 మీటర్లు. మధ్యభాగంలో దీని వెడల్పు 14 మీటర్లు. ► పాదచారులు, సైకిల్ ప్రయాణికులు మాత్రమే ఉపయోగించుకోవచ్చు. ► విభిన్నమైన డిజైన్, ఎల్ఈడీ లైటింగ్‌తో చూపరులకు కనువిందు చేస్తోంది. ► సబర్మతీ రివర్‌ఫ్రంట్ పశ్చిమ భాగంలోని ఫ్లవర్ గార్డెన్‌ను, తూర్పు భాగంలో రాబోయే ఆర్ట్స్ అండ్ కల్చరల్ సెంటర్‌ను అనుసంధానిస్తుంది. ► 2,600 మెట్రిక్ టన్నుల స్టీల్ పైపులు ఉపయోగించి అటల్ బ్రిడ్జి నిర్మించారు. ► పైకప్పును రంగుల వస్త్రంతో అలంకరించారు. సబర్మతీ నదిపై అటల్ వంతెన (ఇన్సెట్లో) వంతెనను ప్రారంభిస్తున మోదీ -
సీ ప్లేన్కు బ్రేక్
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో ఎంతో అట్టహాసంగా అక్టోబర్ 31 న అహ్మదాబాద్–కెవాడియా మధ్య ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సీ ప్లేన్ సేవలు నెలలోనే ఆగిపోయాయి. మెయింటెనెన్స్ కోసం నిర్వాహకులు సీ–ప్లేన్‌ను మాల్దీవులకు పంపించారు. అయితే నిర్వహణ, మరమ్మతులు పూర్తి చేసుకొని తిరిగి సీప్లేన్ సేవలు కనీసం 15 రోజుల తర్వాతే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పౌర విమానయాన విభాగం డైరెక్టర్ అజయ్ చౌహాన్ మాట్లాడుతూ, సీప్లేన్ ఫ్లైయింగ్ అవర్స్ ముగిశాయని, ఈ పరిస్థితుల్లో విమానానికి సర్వీసింగ్ అవసరమని, అందుకే సీప్లేన్‌ను మాల్దీవులకు తిరిగి పంపించామని తెలిపారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ – కెవడియాలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) మధ్య తిరిగే సీ ప్లేన్ సేవలు ఆగిపోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. అక్టోబర్ 31న ప్రారంభోత్సవం జరిగిన తరువాత, నవంబర్ 1 నుంచి ప్రజల కోసం సీ ప్లేన్ సేవలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ నెల రోజుల్లో ఇప్పటికే 3–3 రోజుల పాటు రెండుసార్లు ఈ సీప్లేన్‌ను అధికారులు నిలిపివేశారు. ఆ సమయంలో క్రూ మెంబర్స్‌కు విరామాన్ని ఇచ్చేందుకు సేవలు ఆపినట్లు అధికారులు తెలిపారు. సీ ప్లేన్ వివరాలు సిట్టింగ్ కెపాసిటీ : 19 మంది బరువు: 3,377 కిలోలు వేగం: 170 కి.మీ./గంటకు ఇంధన సామర్థ్యం: 1,419 లీటర్లు పొడవు: 16 మీటర్లు 1 ఎత్తు: 6 మీటర్లు ఇంధన శక్తి: 272 లీటర్లు / గంటకు బరువు సామర్థ్యం: 5670 కిలోలు టికెట్ ధర (ఒక్కరికి): రూ.4,0005,000 సందర్శకుల సంఖ్య రోజుకు 13వేలు అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ సందర్శకుల సంఖ్య రోజుకు 10 వేలు -
ప్రకాశం బ్యారేజీ నుంచి సీ ప్లేన్ సేవలు..!
న్యూఢిల్లీ: గుజరాత్ రాష్ట్రం నర్మదా జిల్లాలోని సర్దార్ పటేల్ ఐక్యతా శిల్పం నుంచి అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్‌ఫ్రంట్ వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సీ ప్లేన్ సర్వీసు విజయవంతం కావడంతో ఇలాంటి ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్తగా 14 వాటర్ ఏరోడ్రోమ్‌లు నిర్మించాలని భావిస్తోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం బ్యారేజీ కూడా ఉంది. వాటర్ ఏరోడ్రోమ్ అంటే ప్రయాణికులు సీ ప్లేన్ ఎక్కడానికి, దిగడానికి అనువుగా నదిలో నిర్మించే కాంక్రీట్ కట్టడం. ఇది నీటిపై ఎయిర్‌పోర్టు లాంటిదే. ఆంధ్రప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్, అస్సాం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో సీ ప్లేన్ సేవలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని కేంద్ర సర్కారు నిర్ణయానికి వచ్చింది. రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ (ఆర్సీఎస్)–ఉడాన్ పథకంలో కొత్త ఏరోడ్రోమ్‌లు నిర్మించాలని యోచిస్తోంది. సీ ప్లేన్ సేవలపై హైడ్రోగ్రాఫిక్ సర్వే చేపట్టాలని ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ)ను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), పౌర విమానయాన శాఖ కోరాయి. అలాగే నదుల్లో కాంక్రీట్ జెట్టీల(వాటర్ ఏరోడ్రోమ్) నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేసినట్లు నౌకాయాన శాఖ వర్గాలు చెప్పాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని ప్రకాశం బ్యారేజీ సీ ప్లేన్ సేవలకు అనువైన ప్రాంతంగా గుర్తించినట్లు నౌకాయాన శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. గుజరాత్లో నర్మదా నదిలో, సబర్మతి రివర్‌ఫ్రంట్‌లో ఏరోడ్రోమ్‌ల నిర్మాణాన్ని ఐడబ్ల్యూఏఐ రికార్డు స్థాయిలో తక్కువ సమయంలోనే పూర్తి చేసింది. ఐక్యతా శిల్పం నుంచి సబర్మతి రివర్‌ఫ్రంట్ 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధాని మోదీ కేవలం 40 నిమిషాల్లోనే ఈ రెండు ప్రాంతాల మధ్య సీ ప్లేన్‌లో ప్రయాణించారు. -
సబర్మతీకి డొనాల్డ్ ట్రంప్!
ఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన నేపథ్యంలో గుజరాత్‌లోని సబర్మతీ నది తీరాన్ని సందర్శించనున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వెల్లడించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నార్త్ ఢిల్లీలోని శాస్త్రి నగర్ ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన హామీ మేరకు ఆసియాలోనే సబర్మతీ నదిని అత్యంత పరిశుభ్రమైన నదిగా మార్చారని వెల్లడించారు. ఇంతకముందు భారత పర్యటనకు వచ్చిన జపాన్, ఇజ్రాయెల్ ప్రధానులు సబర్మతీ నది తీరాన్ని సందర్శించారని గుర్తుచేశారు.(ఫిబ్రవరి 21న భారత్‌కు రానున్న ట్రంప్!) ఈసారి భారత పర్యటనకు రానున్న ట్రంప్ సబర్మతీ నదీ తీరాన్ని సందర్శించనున్నారని.. కానీ ఆయన పర్యటన తేదీలు ఇంకా ఖరారు కాలేదని విజయ్ రూపానీ తెలిపారు. కాగా ట్రంప్ పర్యటనకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. వచ్చే నెల 24-26 మధ్య ట్రంప్ భారత్‌కు రానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ట్రంప్ పర్యటనలో ప్రధానంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య అంశాలపై పలు కీలక ఒప్పందాలు జరగనున్నాయి. 2019 గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా డొనాల్డ్ ట్రంప్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కొన్ని అనివార్య కారణాల వల్ల ట్రంప్ అప్పట్లో హాజరుకాలేకపోయారు. -
కలిసి బతకనివ్వట్లేదు.. ఇక వచ్చే జన్మలోనే...
‘కలిసి బతికేందుకే ఈ లోకాన్ని విడిచిపోతున్నాం. మాకు ఏ మగతోడు లేదు. ఒకరి అభిరుచులు మరొకరికి నచ్చి దగ్గరయ్యాం. కానీ, ఆ సమాజం మమల్ని ఒక్కటిగా బతకనివ్వట్లేదు. అందుకే కలిసి చావాలనుకుంటున్నాం. బహుశా ఇక మేం ఒకటిగా బతికేది వచ్చే జన్మలోనే’... అంటూ సూసైడ్ నోట్ రాసిన ఓ లెస్బియన్ జంట పసిపాపతోసహా సబర్మతీ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అహ్మదాబాద్: పోలీసుల కథనం ప్రకారం.. బావ్లా పట్టణానికి చెందిన ఆశా(30) తన ఇద్దరు పిల్లలతో, అదే ప్రాంతంలో భావన(28) అనే మరో మహిళ తన ఇద్దరు కుమారులతో నివసిస్తున్నారు. భర్తలు దూరం కావటంతో ఓ ఫ్యాక్టరీలో పని చేస్తూ వీరిద్దరూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య బంధం బలపడింది. గత ఏడు నెలలుగా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న వీరిద్దరూ... త్వరలో వివాహం చేసుకునేందుకు సిద్ధపడ్డారు. అయితే కుల పెద్దలు మాత్రం వీరి సంబంధాన్ని వ్యతిరేకించారు. దీంతో భావన, ఆశా తన కూతురు మేఘాను తీసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఊరి నుంచి వెళ్లిపోయారు. అయితే తర్వాత ఏం జరిగిందో తెలీదుగానీ అనూహ్యాంగా నదిలో శవాలై కొట్టుకొచ్చారు. పోలీసుల కథనం ప్రకారం... సోమవారం సబర్మతి నదీ తీరంలో ఓ మహిళ మృత దేహాం కొట్టుకువచ్చిందని గుజారీ బజార్ ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఆ మృత దేహాన్ని వెలికి తీసే క్రమంలో మరో మహిళ మృత దేహాం కూడా బయటపడింది. ఆ రెండు దేహాలు కట్టేసి ఉన్నాయి. కాస్త దూరంలో ఒడ్డున కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఓ చిన్నారిని గుర్తించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. నదీ తీరం వెంబడి ఉన్న గోడపై లిప్ స్టిక్‌తో సూసైడ్ నోట్ రాసింది. కాస్త దూరంలో కూడా ఓ పేపర్ ప్లేట్‌పై తమ ఆవేదనను వెల్లగక్కుతూ మరో నోట్ రాశారు. అక్కడికి కాస్త దూరంలో దొరికిన బ్యాగులో ఆధార్ కార్డుల ఆధారంగా మృతులను గుర్తించి బంధువులకు పోలీసులు సమాచారం అందించారు. జూన్ 8వ తేదీన వారు ఇంట్లోంచి వెళ్లిపోయినట్లు బంధువులు చెబుతున్నారు. -
గుజరాత్‌కు మంత్రి ఈటెల బృందం: ఎంపీ వినోద్
న్యూ ఢిల్లీ: సబర్మతి నదీ పరీవాహక ప్రాంత తరహాలో కరీంనగర్‌లోని మిడ్‌మానేరును అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సంకల్పించిందని ఎంపీ వినోద్ తెలిపారు. అందులో భాగంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలోని బృందం శనివారం అహ్మదాబాద్‌లోని సబర్మతి నదిని పరిశీలించడానికి వెళ్లనుందని తెలిపారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో జాతీయ ఉపరితల రవాణా శాఖ కార్యదర్శి సంజయ్ మిత్రను కలసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో జాతీయ రహదారుల కోసం ప్రకటించిన నిధులు వెంటనే విడుదల చేయాలని, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని కోరినట్టు ఆయన తెలిపారు. జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేస్తే.. వెంటనే పనులు ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని సంజయ్‌మిత్ర చెప్పినట్టు వినోద్ తెలిపారు. -
సబర్మతీ నదిలో మునిగిపోయిన ఆరుగురు యువకులు
అహ్మదాబాద్: విహార యాత్ర వారిపాలిట మృత్యువుగా మారింది. శబర్కంత జిల్లాలోని రస్లోడ్ గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు సబర్మతీ నదీ తీరంలోని గల్టేశ్వర్ లో ఉన్నపురాతన శివాలయం దగ్గరికి విహారయాత్రకు గురువారం వెళ్లారు. అనంతరం స్నానం చేయడానికని నదిలోకి దిగి మునిగి పోయారని పోలీసు అధికారి తెలిపారు. స్థానిక మత్సకారుల సాయంతో శవాలను వెలికితీశారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరళించారు. ప్రమాదవశాత్తు మరణించినట్టుగా కేసును నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
కొడుకు చదువు కోసం ఓ తండ్రి సాహసం
ముంబై: ఆకలి రుచి ఎరుగదు అంటారు. ఆకలి ప్రాణాలను కూడా లెక్కచేయదు అనుకోవాల్సి వస్తుంది దబేశ్ ఖనాల్ చేసిన సాహసం గురించి తెలుకుంటే. 500 రూపాయల కోసం అతడు తన ప్రాణాలను ఫణంగా పెట్టాడు. పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న దబేశ్ తన కొడువు చదువు కోసం ప్రాణాలకు తెగించి నదిలోకి దూకాడు. పోలీసుల సాయంతో చివరకు ప్రాణాలతో బయటపడ్డాడు. నేపాల్ కు చెందిన అతడు ముంబైలో రోజువారి కూలీగా పనిచేస్తున్నాడు. వారం రోజులుగా పని దొరక్కపోవడంతో తినడానికి డబ్బుల్లేకపోవడంతో స్వచ్ఛంద సంస్థలు పెడుతున్న భోజనంతో కడుపు నింపుకుంటున్నాడు. అయితే తన కొడుకు చదువుకు డబ్బులు అవసరమవడంతో 41 ఏళ్ల ఖనాల్ ఈ సాహసానికి పూనుకున్నాడు. సబర్మతి నదిలో ఈత కొట్టే పందానికి ఒప్పుకున్నాడు. నదిలోకి దూకి కొంతదూరం ఈతకొట్టిన తర్వాత నీటిలో మునిగిపోబోతూ కేకలు పెట్టాడు. అతడిని పోలీసులు కాపాడడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. 'కేటరింగ్ లో రోజువాలి కూలీగా పనిచేస్తున్నాను. రోజంతా కష్టపడితే రూ.400 ఇస్తారు. వారం రోజులుగా పనిలేకపోవడంతో ఖాళీగా ఉన్నాను. నా కుమారుడి చదువు కోసం రూ.500 అప్పుకావాలని సాగర్ తపా అనే స్నేహితుడిని అడిగాను. సబర్మతీ నదిలో ఈత కొడితే రూ.500 ఇస్తానని అతడు పందెం కాయడంతో ఈ సాహసం చేశాను' అని ఖనాల్ చెప్పాడు. ఆరేళ్ల క్రితం తండ్రి చనిపోవడంతో బతుకుతెరువు కోసం అతడు ముంబైకి వచ్చాడని పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో బీఎస్సీ చదువును మధ్యలోనే ఆపేసిన ఖనాల్ పలుచోట్ల పనిచేశాడని వెల్లడించారు. -
'మణికట్టు కోసుకుని నదిలోకి దూకాడు'
అహ్మదాబాద్: గుజరాత్ లోని అహ్మదాబాద్ లో సబర్మతి నదిలోకి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం నెహ్రు బ్రిడ్జి పైనుంచి దూకి అతడు ప్రాణాలు తీసుకున్నాడు. అగ్నిమాపక సిబ్బంది సోమవారం రాత్రి అతడి మృతదేహాన్ని నది నుంచి బయటకు తీశారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. మృతదేహాన్ని నవరంగపుర పోలీసులకు అప్పగించారు. స్కూటర్ మీద వచ్చిన అతడు నదిలోకి దూకడానికి ముందు మణికట్టు కోసుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్టు పోలీసులు వెల్లడించారు. మృతుడి వయసు 30 ఏళ్లు ఉండొచ్చన్నారు. అతడి వద్ద వివరాలేమి లభ్యం కాలేదన్నారు.