గుజరాత్‌తో పోటీపడుతున్నామని బీజేపీ, బీఆర్‌ఎస్‌ల అక్కసు
ఏబీపీ సదరన్ రైజింగ్ సదస్సులో సీఎం రేవంత్ ఆరోపణ
గుజరాత్‌లో సబర్మతి రివర్‌ఫ్రంట్ ఏర్పాటు చేయొచ్చు.. ఇక్కడ మూసీ పునరుజ్జీవం వద్దా?
మీకు నచ్చకుంటే ఇంట్లో కూర్చోండి..మా ప్రభుత్వాన్ని పనిచేయనివ్వండి
ఎన్డీయే హయాంలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం
పార్టీలు, ప్రభుత్వాలను విడగొట్టడం తప్ప ప్రజలకు మోదీ చేసిన మేలేంటో చెప్పాలి
అంతర్జాతీయ స్థాయిలో గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూఘాట్
సర్దార్ పటేల్ విగ్రహం తరహాలోనే ఇక్కడ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ‘‘గుజరాత్‌తో పోటీపడుతోందన్న అక్కసుతో హైదరాబాద్‌ను ఫినిష్ చేయాలని చూస్తున్నారు. మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగు రోడ్డు, రేడియల్ రాడార్, ఇరిగేషన్ ప్రాజెక్టులతో పురోగతి సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం.. గుజరాత్‌కు పోటీ ఇస్తుందనే విషయం తెలిసే బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కలిసి మా ప్రయత్నాలను ఆపాలని చూస్తున్నాయి..’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
అందుకే కాంగ్రెస్ సర్కారు నిర్ణయాలను బీఆర్‌ఎస్ వ్యతిరేకించిన మరుసటి రోజే కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు కూడా తప్పుపడతారని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఏబీపీ నెట్‌వర్క్ ‘సదరన్ రైజింగ్ సమ్మిట్–2024’ను సీఎం రేవంత్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. వివరాలు రేవంత్ మాటల్లోనే..
‘‘గుజరాత్ రాష్ట్రంలో సబర్మతి రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ మేం మూసీ పునరుజ్జీవం చేస్తామంటే మాత్రం బీజేపీ నేతలు అడ్డుకుంటారు. మూసీ పునరుజ్జీవంతోపాటు బాపూఘాట్ అభివృద్ధిని కూడా బీజేపీ వ్యతిరేకిస్తోంది. మీకు నచ్చకపోతే ఇంట్లో కూర్చోండి. మా ప్రభుత్వాన్ని పనిచేయనివ్వండి. మా ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలని చూడొద్దు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నది గుర్తుంచుకోండి.
వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కదు
తెలంగాణ ప్రజల ఆలోచనలను పట్టించుకోకపోతే వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీలకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే పడగొట్టాలని అనుకున్నారు. కానీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే నాకు మద్దతుగా నిలిచారు. పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపించిన కేసీఆర్ పది సార్లు కూడా సెక్రటేరియట్‌కు రాలేదు. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే పది నిమిషాలు అసెంబ్లీలో కూర్చుని వెళ్లిపోయారు.
కేసీఆర్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకముంటే ఎందుకు బయటకు రావడం లేదు? తానో జమీందార్ అని, ప్రజలందరూ గులాములని కేసీఆర్ భావిస్తారు. అందుకే బయటికి రావడం లేదు. ఈసా, మూసా నదులు కలిసే చోట బాపూఘాట్ ఉంది. అంతర్జాతీయ స్థాయిలో గాంధీ ఐడియాలజీ కేంద్రంగా దానిని అభివృద్ధి చేస్తాం. గాంధీజీ వారసులుగా మేం ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలా బాపూఘాట్ అభివృద్ధి చేయబోతున్నాం. గుజరాత్‌లో పటేల్ విగ్రహం తరహాలోనే బాపూఘాట్‌లో గాంధీజీ విగ్రహం ఏర్పాటు చేస్తాం.
ప్రజల కోసం మోదీ ఏం చేశారు?
నెహ్రూ మొదలుకుని ఇందిర, రాజీవ్, పీవీ, మన్మోహన్ వంటి కాంగ్రెస్ ప్రధానులందరూ దేశంలో అనేక సంస్కరణలతో పాటు విప్లవాలు తీసుకువచ్చారు. కానీ దేశానికి మూడోసారి ప్రధాని అయిన మోదీ ఏం విప్లవం తెచ్చారో, దేశ ప్రజల కోసం ఏం చేశారో, ఎవరికి ప్రయోజనం చేకూర్చారో చెప్పాలి. పార్టీలను, ప్రభుత్వాలను విడగొట్టడం, పడగొట్టడం, భావోద్వేగాలతో రాజకీయాలు చేయడం తప్ప ప్రజలకు మోదీ ఏమీ చేయలేదు. ఈ దేశంలో ఉత్తర, దక్షిణ భారతాలనే విభజన తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరిగేది. ఉత్తరాది రాష్ట్రాలకు కూడా నిధులు కేటాయించి అభివృద్ధి చేసేవారు. కానీ ఎన్డీఏ హయాంలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. గతంలో ఉత్తర భారతం నుంచి ప్రధాని ఉంటే.. దక్షిణ భారతం నుంచి రాష్ట్రపతిని చేసే సంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీ పాటించింది. కానీ మోదీ ఈ సంప్రదాయాన్ని తుంగలో తొక్కి కేవలం ఎన్నికల్లో గెలుపు కోసమే పనిచేస్తున్నారు.
దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పన్నులు తీసుకుంటున్నా.. కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. దక్షిణ భారత రాష్ట్రాలకు మోదీ నుంచి అందిన సహకారం చాలా తక్కువ. ఉత్తరప్రదేశ్ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో ఒక్క రూపాయి వెళితే.. 7 రూపాయలు వెనక్కు ఇస్తున్నారు. అలాగే బీహార్‌కు 6 రూపాయలు వెనక్కి ఇస్తున్నారు. తెలంగాణ నుంచి రూపాయి వెళితే.. కేవలం 40పైసలు మాత్రమే వెనక్కి ఇస్తున్నారు. ప్రధాని మోదీ ఉత్తర భారతదేశానికి చెందిన వ్యక్తి కావడంతోనే దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నారన్న విషయాన్ని ప్రజలు గమనించాలి..’’ అని సీఎం రేవంత్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment