మహా నగరాలకు ఒక ప్పుడు త్రాగు నీటిని అందించిన స్వచ్ఛమైన జల ప్రవాహాలు ప్రస్తుతం కనీసం పుక్కిలించడానికి కూడా వీలులేని కాలుష్య జలాలుగా కదులు తున్నాయి. ఉద్యోగ, ఉపాధి తదితర బతుకు తెరువు కోసం అసంఖ్యాక జనావళి నగరాలకు తరలి రావడంతో మహానగరాలు ఉక్కిరిబిక్కిరి అవు తున్నాయి. పారిశ్రామిక కాలుష్యం, జన జీవనం అందించే దైనందిన కాలుష్యం... నదీ, నదాలలో కలుస్తున్నాయి. పల్లెల నుంచి నగరాల వరకు జనం నీటి శుద్ధి కేంద్రాలపై ఆధారపడి జీవిస్తున్నారు. నిరుపేద జనసామాన్యం నివాస స్థలాలు, త్రాగు నీరు వంటి కనీస సౌకర్యాల కోసం తపిస్తూ మురికివాడల కాలుష్య కూపాలలో మృత్యుసంక్షోభం ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనం ఆరోగ్యం, సంక్షేమం గురించి కార్యాచరణ దృష్ట్యా మురుగునీటి పారుదలపై దృష్టి సారించవలసి వస్తోంది.
ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ నగరం మధ్యలో ప్రవహిస్తున్న దుర్గంధపూరిత కాలుష్య ప్రవాహం కలిగిన మూసీ పునరుజ్జీవం తెరపైకి తెచ్చింది. ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’ (హైడ్రా)... అక్రమ కట్టడాలనే వంకతో పేదలు కష్టించి నిర్మించుకొన్న మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లు కూల్చడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాలు ఆగ్రహంతో ప్రభుత్వ అమానవీయతపై విరుచు కుపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, దక్షిణ కొరియా సియోల్ నగరం నమూనాలో పథకం అమలుకు ఆలోచిస్తోంది. మూసీ జలాల ప్రక్షాళనను పర్యాటక ఆదాయాభివృద్ధికి ముడి పెట్టడం ప్రతిపక్షాల విమర్శలకు దారి తీస్తోంది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరానికి ఆను కొని ఉన్న సబర్మతి నది... నగరానికి ఒకప్పుడు త్రాగునీటిని అందించి క్రమేపీ మురికి కాలువగా మారింది. అయితే నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ దృఢ దీక్షా సంకల్పంతో మళ్లీ కాలుష్యరహిత జలవాహినిగా రూపొందింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు సాగాలి.
రెండు దశాబ్దాల క్రితం సబర్మతీ ప్రక్షాళన ప్రాజెక్ట్ చేపట్టక ముందే... గుజరాత్ ప్రభుత్వం, పది వేల కుటుంబాలకు పునరావాసం కల్పించింది. అహ్మదాబాద్‌లో 11.5 కి.మీ. పరిధిలో క్రమేపీ చేపట్టిన అభివృద్ధి పథకాలు సబర్మతీ నదీ తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దాయి. 1917 నాటి సబర్మతీ ఆశ్రమం, మహాత్ముని స్మృతి చిహ్నంగా ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా రూపొందింది.
తెలుగు రాష్ట్రాలు గోదావరి, కృష్ణా వంటి భారీ నదుల వరదకే కాకుండా... బుడమేరు, మానేరు వంటి వాగులు, ఉపనదులకూ వచ్చే వరదలూ; నగరాలను ఆనుకుని ప్రవహించే నదుల కాలుష్యంతో సతమతమవుతున్నాయి. ప్రభుత్వాధినేతలు ఆ నదులను బాగుచేయడం ద్వారా ఆ యా ప్రాంతాల్లో పర్యాటక రంగ అభివృద్ధిని సాధించి ఆదాయం పొందడం తప్పు కాదు. అయితే ఈ అభివృద్ధి పేరుతో నిరుపేదలను బజారుపాలు చేసి కన్నీళ్ల సముద్రంలో ముంచడం సమంజసం కాదు.
చదవండి: అకస్మాత్తుగా ఇళ్లను కూల్చివేయడం ప్రజా పరిపాలన అవుతుందా?
ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి రాజధాని నగర రూపకల్పనలో లండన్, సింగపూర్ వంటి నమూనాల ప్రస్తావన ఉంది. తెలంగాణ మూసీ రివర్ ఫ్రంట్‌లో సబర్మతిని గుర్తు చేసే ‘బాపు ఘాట్’ ప్రస్తావన ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని అపురూప అత్యున్నత గాంధీజీ శిలా విగ్రహం నెలకొల్పే మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు... ఇబ్బడిముబ్బడి సుస్థిర పర్యాటక రంగ ఆదాయాన్ని ఆశిస్తోంది. ఏది ఏమైనా ప్రతి రోజూ సుమారు 200 కోట్ల లీటర్‌ల నగరాల మురికినీరు, అంతకంటే ప్రమాద భరితమైన పారిశ్రామిక రసాయన వ్యర్థాల కాలుష్య జలాలతో లక్షలాది జనానికి మృత్యు స్పర్శ అందించే మూసీ కాలుష్యాన్ని నిర్మూలించే పునరుజ్జీవ సత్సంకల్పం సాధ్యం చేయగలిగితే, జన జీవన సౌభాగ్యానికి కంకణం ధరించినట్టే!
- జయసూర్య
సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment