మూసీ.. కాస్త మెరిసీ.. | Musi River Water Quality Little Increasing Pollution Control Board Report | Sakshi
Sakshi News home page

మూసీ.. కాస్త మెరిసీ..

Published Thu, Apr 14 2022 4:00 PM | Last Updated on Thu, Apr 14 2022 4:00 PM

Musi River Water Quality Little Increasing Pollution Control Board Report - Sakshi

(ఫైల్‌ ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ జీవనరేఖ.. చారిత్రక మూసీ నది నీటి నాణ్యత స్వల్పంగా మెరుగుపడింది. మూసీ నీటిలో హానికారక కోలిఫాం బ్యాక్టీరియా మోతాదు గణనీయంగా తగ్గినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదికలో వెల్లడైంది. కాలుష్య మోతాదును నిర్ధారించేందుకు పలు రకాల నాణ్యతా పరీక్షలు నిర్వహించగా.. బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ మూసీలో క్రమంగా తగ్గుముఖం పట్లినట్లు తేలింది.

మార్చి చివరి నాటికి జలాల్లో బీఓడీ మోతాదు లీటరు నీటిలో 21 మిల్లీ గ్రాములుగా నమోదైంది. అంతకు ముందు సంవత్సరం ఇది 40 మిల్లీ గ్రాములుగా నమోదవడం గమనార్హం. మానవ మల, మూత్రాదుల్లో ఉన్న హానికారక కోలిఫాం బ్యాక్టీరియా ఉనికి కూడా తగ్గుముఖం పట్టడం విశేషం. ఈ బ్యాక్టీరియా మోతాదు సైతం సీపీసీబీ పరిమితి ప్రకారం మోస్ట్‌ ప్రాపబుల్‌ నంబరు పరిమితులకు లోపలే ఉన్నట్లు తేలింది. 

కారణాలివే.. 
గతేడాది సీజన్‌లో భారీ వర్షాలు కురియడంతో మూసీ మురికి వదిలింది. ఎగువ ప్రాంతంలో ఉన్న హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ జంట జలాశయాల గేట్లను వర్షాకాల సీజన్‌లో సుమారు పది సార్లు వదిలి వరద ప్రవాహాన్ని దిగువనకు వదిలిపెట్టారు. దీంతో వ్యర్థ జలాలు తొలగి నాణ్యత మెరుగుపడింది. ఇటీవలి కాలంలో జలమండలి, జీహెచ్‌ఎంసీ, పీసీబీ, మూసీరివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్లు తీసుకుంటున్న కొన్ని చర్యలు నీటినాణ్యత స్వల్పంగా మెరుగు పడేందుకు కారణమని పీసీబీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక నగరంలో రోజువారీగా ఉత్పన్నమవుతోన్న 1800 మిలియన్‌ లీటర్ల మురుగు నీటిలో సగానికి పైగా జలమండలి నిర్వహిస్తోన్న 22 ఎస్టీపీల్లో శుద్ధి చేసి మూసీలోకి వదలడం కూడా నాణ్యత పెరిగేందుకు మరో కారణంగా కనిపిస్తోంది. 

మూసీ కష్టాలివే..
వికారాబాద్‌ జిల్లా అనంతగిరి కొండలు మూసీ జన్మస్థానం. అక్కడి నుంచి సుమారు 95 కి.మీ ప్రవహించి.. బాపూఘాట్‌ వద్ద మూసీ నగరంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ప్రతాపసింగారం వరకు సుమారు 44 కి.మీ మేర నగరంలో నది ప్రవహిస్తోంది. ఈ మార్గంలోనే నదిలోకి గృహ, వాణిజ్య, పారిశ్రామిక వాడల నుంచి వ్యర్థజలాలు చేరడమే మూసీ పాలిట శాపంగా పరిణమిస్తోంది. ఈ పరిస్థితిని సమూలంగా మార్చేందుకు తక్షణం మాస్టర్‌ప్లాన్‌ సిద్ధం చేసి దాని ప్రకారం పనులు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement