నాలుగు భాగాలుగా మూసీ పునరుద్ధరణ ప్రణాళికలు
తొలి విడతలో మూసీ నీటిశుద్ధి, నిర్వహణ, వ్యర్థాలు, వరదల నియంత్రణ
రెండో దశలో ల్యాండ్ స్కేపింగ్ అభివృద్ధి.. మూడో దఫాగా రవాణా హబ్‌ల ఏర్పాటు
నాలుగో విడతలో మూసీ చుట్టూ వాణిజ్య, సాంస్కృతిక ఆదాయ వనరుల గుర్తింపు
తొలి దశ పనులకు రూ. 5,863 కోట్లు అవసరమని ఎంఆర్‌డీసీఎల్ అంచనా
ప్రపంచ బ్యాంకు నుంచి 70% రుణానికి అనుమతివ్వాలని కేంద్రానికి వినతి
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరంలో కాలుష్యమయంగా మారిన మూసీ నదికి నాలుగు దశల్లో పునరుజ్జీవం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. తొలి విడతలో నదీ జలాల శుద్ధితోపాటు వర్షపునీటి నిర్వహణ, వ్యర్థాలు, వరదల నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అలాగే రెండో దశలో ల్యాండ్‌స్కేపింగ్‌ను అభివృద్ధి చేసి నది సహజసిద్ధ లక్షణాన్ని పునరుద్ధరించాలనుకుంటోంది.
ఇక మూడో విడతలో మూసీ పరీవాహక కారిడార్‌లలో రవాణా హబ్‌లను ఏర్పాటు చేయాలని, నాలుగో దశలో ఆదాయార్జన కోసం మూసీ చుట్టూ వాణిజ్య, సాంస్కృతిక ఆదాయ వనరులను గుర్తించాలనుకుంటోంది. ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు అవసరమైన నిధుల కోసం కసరత్తు మొదలుపెట్టిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్‌డీసీఎల్) తొలి విడత పనులకు రూ. 5,863 కోట్లు అవసరమని అంచనా వేసింది.
అందులో రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం (రూ. 1,763 కోట్లు) నిధులను సమకూరిస్తే మిగిలిన 70 శాతం (రూ. 4,100 కోట్లు) నిధులను ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం తీసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు వరల్డ్ బ్యాంక్ నుంచి రుణానికి అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర సర్కారు కేంద్ర ప్రభుత్వానికి ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్ (పీపీఆర్)ను అందజేసినట్లు విశ్వసనీయ సమాచారం.
2030 డిసెంబర్ 30 నాటికి ప్రాజెక్టు పూర్తి..
హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూనే ప్రపంచ స్థాయిలో మూసీ పునరుద్ధరణకు నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. మూసీ నదిని శుద్ధి చేసి పర్యాటక, వాణిజ్య ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందించింది. 2030 డిసెంబర్ 30 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈస్ట్–వెస్ట్ కారిడార్ నిర్మాణం..
మూసీ ప్రాజెక్టు వల్ల నిరాశ్రయులయ్యే కుటుంబాలకు పునరావాసం కల్పించడంతోపాటు మూసీ భవిష్యత్తు అభివృద్ధికి అవసరమైన భూముల కోసం ల్యాండ్ పూలింగ్‌ను ప్రభుత్వం చేపట్టనుంది. నది వెంట తూర్పు, పడమర ప్రాంతాలను కలుపుతూ కారిడార్‌ను నిర్మించనుంది. దీనివల్ల ఔటర్ రింగ్‌రోడ్ నుంచి ప్రధాన నగరంలోకి రవాణా సులువు కానుంది.
అలాగే మూసీ చుట్టూ 16–18 ప్రాంతాల్లో హెరిటేజ్ బ్రిడ్జీలను నిర్మించడంతోపాటు ఆయా ప్రాంతాల్లో వ్యాపారస్తుల కోసం స్థలాలను కేటాయించనుంది. మూసీ వెంబడి రిక్రియేషనల్ జోన్లు, పార్క్‌లను కూడా ఏర్పాటు చేయనుంది.
రీసైకిల్ వాక్‌వేలు, పార్కింగ్ ప్లేస్‌లు..
మూసీ పరిసర ప్రాంతాల్లో రీసైకిల్ చేసిన వస్తువులు, ఉత్పత్తులతో వాక్ వేలు, పార్కింగ్ ప్రాంతాలను ప్రభుత్వం నిర్మించనుంది. అలాగే వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకొని రెయిన్ గార్డెన్‌లు, గ్రీన్ రూఫ్‌లను ఏర్పాటు చేయనుంది. వరదలు, విపత్తుల నిర్వహణకు ఎలివేటెడ్ స్ట్రక్చర్లు, ఫ్లడ్ బారియర్లను కట్టనుంది.
వరద ముప్పును పసిగట్టడం, నీటి నాణ్యత, నీటి ప్రవాహాలను సమర్థంగా నిర్వహించడంతోపాటు వనరుల కేటాయింపు, ప్రణాళిక, నిర్వహణ వ్యవస్థలను మెరుగుపరిచేందుకు భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్), కృత్రిమ మేథ (ఏఐ) వంటి ఆధునిక సాంకేతికతలను వినియోగించనుంది.
ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం..
పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) ద్వారా పర్యాటకం, ఆతిథ్యం, స్థిరాస్తి రంగాల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబులిటీ (సీఎస్‌ఆర్) కింద నిధులను సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఆయా నిధులను సమకూర్చే సంస్థలకు గ్రీన్‌బాండ్లను జారీ చేయనున్నట్లు తెలిసింది. అలాగే మూసీ చుట్టూ ఉమ్మడి అభివృద్ధి ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్ అభివృద్ధి కార్యక్రమాలతోపాటు స్పానర్‌ప్‌లు, పేర్ల హక్కులు, పర్యాటక కార్యకలాపాలతో ఆదాయ వనరులను సృష్టించనుంది.
Comments
Please login to add a commentAdd a comment