
సాక్షి, హైదరాబాద్: లండన్‌లోని థేమ్స్ నదిలా మూసీ నదిని సుందరీకరణ చేస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాబోయే ఐదేళ్లలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేసుకోవడమే మన ముందున్న లక్షమని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.
కాగా, సీఎం రేవంత్ శనివారం గోపన్‌పల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘శేరిలింగంపల్లిని వేగంగా అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. హైదరాబాద్ నగరంలో సమస్యల పరిష్కారానికి, విపత్తుల నిర్వహణకు హైడ్రా అనే నూతన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. లండన్‌లోని థేమ్స్ నదిలా మూసీ సుందరీకరిస్తాం.
మూసీ రివర్ డెవలప్‌మెంట్ కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తర్వలోనే ప్రణాళికలు సిద్ధం చేసి లక్షా 50వేల కోట్లతో పనులను ప్రారంభించబోతున్నాం. హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేసుకోవడమే మన ముందున్న లక్ష్యం. ప్రస్తుతం మూసీ అంటే ముక్కు మూసుకునే పరిస్థితి ఉంది. రాబోయే ఐదేళ్లలో ప్రపంచ పర్యాటకులు సందర్శించేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసాం. మూసీ అభివృద్ధి చూడగానే ప్రజా ప్రభుత్వం గుర్తొచ్చేలా తీర్చిదిద్దుతాం. హైదరాబాద్ అభివృద్ధిలో మీరంతా భాగస్వాములు కావాలి. వచ్చే పదేళ్లలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి మీ అందరి సహకారం ఉండాలని కోరుతున్నాను అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment