
హైదరాబాద్: తెలంగాణలో భానుడి భగభగల నుంచి కాస్త ఊరట లభించనుంది. మళ్లీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భూ ఉపరితలం వేడెక్కిన ప్రభావంతో ఏప్రిల్ 1వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని తెలిపింది.
రేపు రాత్రి(ఏప్రిల్ 1వ తేదీ) నుంచి మూడో తేదీ వరకు వానలు కురుస్తాయని, అయితే 4వ తేదీన వర్ష ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఊరుములు, మెరుపులతో కూడిన వాన పడే అవకాశమూ ఉందని హెచ్చరించింది. ఏయే జిల్లాలపై ఈ ప్రభావం ఉంటుందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇక..వర్ష ప్రభావంతో ఏప్రిల్ 2, 3 తేదీల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. కొన్నాళ్ల కిందట అకాల వర్షాలతో తెలంగాణ వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే.