అభిప్రాయం
గత నలభై సంవత్సరాలుగా మూసీ నది మృత్యుగానం వినిపిస్తోంది. 1997లో ఈ వ్యాసకర్త మూసీ కాలుష్యం తీరు తెన్నులపై, దాని పరివాహక ప్రాంతంలోని గ్రామాలపై కాలుష్య ప్రభావం గురించి రాసిన పరిశోధనా వ్యాసంలోని అంశాలు... ఆ ప్రాంత ప్రజలను కదిలించాయి. ముఖ్యంగా ఎదులాబాద్ గ్రామ ప్రజలు చేసిన పోరాటం మరువలేనిది. మేధాపట్కర్, గజేంద్రసింగ్‌లు కూడా మూసీ కాలుష్యం, దాని ప్రభావం గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఉద్యమానికి సంఘీబావం ప్రకటించారు. విషపూరిత రసాయనాలతో, మానవ, పశువుల విసర్జనాలతో నిండిన ఈ కలుషిత నీరే అత్యధిక ధాన్య (వడ్లు) ఉత్పత్తికి దోహదపడింది. నిజాం రాచరిక పాలన కాలంలో నిర్మించిన 23 కత్వల (చిన్న ఆనకట్టలు) ద్వారా 25 వేల ఎకరాలకు సాగు నీరు అందించే ఏర్పాటు జరిగింది. నేడు సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది.
‘పిలాయిపల్లి కాల్వ’, ‘బునాది గాని కాల్వ’ అనే రెండు కొత్త కాలువల నిర్మాణం ఇటీవల జరిగింది. అంటే అవే 23 కత్వల కింద ఆయకట్టు దాదాపు పదమూడు రెట్లు పెరిగిందన్నమాట! ఇదెలా సాధ్యమైనట్టు? 1925లో జంట నగరాలకు తాగునీటి సరఫరా రోజుకు 23 మిలి యన్ గాలన్స్‌గా ఉండేది. అది క్రమంగా పెరుగుతూ ఈ రోజు రమారమి 600 మిలియన్ గాలన్స్‌గా ఉంది. ఇందులో 80 శాతం నీరు వాడిన తర్వాత తిరిగి మూసీలో కలుస్తోంది. ఈ కలుషిత నీరే నదిని జీవనదిగా మార్చింది. ఈ నీరే పైన ఉదహరించిన 2 లక్షల ఎకరాల వరి సాగుకు మూలం. లక్షలాది టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోంది. ఎందరికో పని దొరుకు తోంది. అదే సమయంలో కాలుష్య జలాల కారణంగా ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు.
హానికరమైన రసాయనాలతో నిండిపోయిన నది ఉపరితల జలాలు, భూగర్భజలాలు, ఆహార గొలుసంతా విషతుల్యమయింది. బియ్యం, పాలు, కాయగూరలు దేనికీ మినహాయింపు లేదు. బాధ్యతా రహితంగా కంపెనీలు రసాయన వ్యర్థాలను ట్రీట్‌మెంట్ చేయకుండా నదులు, చెరువులు, వాగుల్లోకి వదిలి వేస్తున్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. జంట నగరాల చుట్టూ ఉన్న కంపెనీలు విడుదల చేస్తున్న వ్యర్థాలు మూసీనే కాకుండా వందకు మించిన చెరువులకు కూడా మరణ శాసనం లిఖిస్తున్నాయి. నిజానికి ఇవ్వాళ దేశంలో చాలా నదుల స్థితి ఇదే. తక్షణ దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే పరిమిత వనరులను జాతి శాశ్వతంగా కోల్పోయే ముప్పు పొంచి ఉందన్న భారత సైన్స్ సంస్థ బాధ్యులు డాక్టర్ రామచంద్ర ప్రభు హెచ్చరికల్ని ప్రభుత్వాలు ఇంక ఎంత మాత్రం ఉపేక్షించటానికి వీలులేదు.
జల వనరుల కాలుష్యం వల్ల ఏటా రెండు లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు ‘నీతి ఆయోగ్’ లెక్క గట్టింది. ఈ మధ్యనే విడుదలయిన నదుల నీటి నాణ్యత ఇండెక్స్‌లో మూసీ నది నీటిలో ఆక్సిజన్ స్థాయులను ప్రభావితం చేసే టర్బిడిటీ స్థాయులు 1–4 మధ్యన ఉండాల్సింది... నల్లగొండ జిల్లా వివిధ ప్రాంతాలలో 13, 15 స్థాయులుగా నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా 140 దేశాలలో 258 నదులపై స్విస్ సంస్థ ఒకటి ఔషధ కాలుష్యంపై అధ్యయనం చేసింది. 2022 సంవత్సరంలో ఈ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్యంగా మారిన నదులలో మూసీ నది 22వ స్థానంలో ఉంది. నదిలో 48 రకాల రసాయన అవశేషాలు ఉన్నట్టు ఆ పరీక్షలలో తేలింది.
ఈ రసాయనాల వల్ల మనుషులు వివిధ రకాల క్యాన్సర్, మూత్ర పిండాల వ్యాధులు, చర్మ వ్యాధులు, అబార్షన్లు, కీళ్ల నొప్పులు, కడుపు నొప్పి, గొంతునొప్పి వంటి రోగాల బారిన పడతారని తెల్చింది. ఈ రోగాల ముప్పు అత్యధికంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఉంది. ప్రజలు, పశు పక్ష్యాదుల ఆరోగ్యాలకు ముంచుకొస్తున్న ముప్పు నేపథ్యంలో... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడటాన్ని అర్థం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితిలోనూ ప్రక్షాళన, సుందరీకరణ చేసి తీరుతామని చెప్పటం ఒక శుభ పరిణామం. ఈ విషయంలో సీఎం సీరియస్‌గానే ఉన్నారనే విషయం స్పష్టంగానే కపిస్తోంది. అందుకు ఆయనను అభినందించాలి.
చదవండి: నీటి యుద్ధాలు రానున్నాయా!
అయితే ఈ సమస్యపై అధికార ప్రతిపక్షాల మధ్య సాగు తున్న వాదోపవాదాలు కొంత గందరగోళానికి దారి తీశాయి. దానికి కారణం లేకపోలేదు. ప్రభుత్వం ప్రాజెక్టుపై తన కార్యచరణను తలకిందులుగా మొదలు పెట్టడమే కాకుండా హైడ్రాతో ముడిపెట్టింది. దాంతో నదిలో ఉన్న నివాసాల తొలగింపు మొదలైంది. ఇక్కడ రెండు విషయాల పట్ల ప్రభుత్వం స్పష్టంగా ఉండాలె. ఒకటి నది ప్రక్షాళన అయితే, రెండోది నది ప్రాంత సుందరీకరణ. ఈ రెండింటినీ ఏక కాలంలో చేపట్టాల్సిన అవసరం లేదు. ఏది ముందు ఏది తర్వాత అనేది ప్రశ్న. జవాబు స్పష్టమే! ముందు ప్రక్షాళన, తర్వాతే సుందరీకరణ. నది ప్రక్షాళన కోసం చేయాల్సిందేమిటి? కంపెనీల నుంచి వెలువడే హాని కరమయిన రసాయనాలను, మావన వ్యర్థాలను శుద్ధి చేయకుండా నదిలోనికి వదలొద్దు. వ్యర్థాల శుద్ధి కోసం సమగ్రమైన ప్రణాళిక అవసరం. పెట్టుబడి, పట్టుదల నిజాయితీతో కూడిన కార్యాచరణ ఎంతో అవసరం. ఇదొక దీర్ఘకాలిక ప్రణాళిక. నదికి మొలసిన ఈ నారీ పుండ్లను తొలగిస్తేనే సుందరీకరణ సాధ్యం.
చదవండి: ఈ మార్పులతో ఏం ఒరుగుతుంది?
ఈ సుందరీకరణకు ముందు జరగాల్సింది చాలా ఉంది. ముందు నది వైశాల్యాన్ని తేల్చాలి. దాని వాస్తవిక వైశాల్యం ఎంత ? భారీ వరద వస్తే ఎంత ఎత్తున పారుతుందో (నది పారు ప్రాంతం) గుర్తించాలి. దాని లోపల నివాసాలు ఉన్నట్లయితే తొలగించాల్సిన/సేకరించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ భూసేకరణ చట్టం యొక్క అవసరం ఏర్పడుతుంది. నిర్వాసితుల పునరావాసానికి, వారి ఆర్థిక సామాజిక, సాంస్కృతిక పునర్నిర్మాణానికి 2013 చట్టాన్ని పాటించాలి, ఇంకా మెరుగుపర్చుకోవాలి. నది ప్రక్షాళన, సుందరీకరణ ఎంత ముఖ్యమో ప్రజల జీవితాలు అంతకన్నా ముఖ్యం. ప్రాజెక్టు పేరుతో ఇప్ప టికే ఉన్న ఒక ఆర్థిక, సామాజిక వ్యవస్థను ధ్వంసం చేస్తున్నా మన్న స్పృహ ప్రభుత్వానికి ఉండాలె. అప్పుడే కూల్చిన వ్యవస్థను పునర్నిర్మించడానికి ఆలోచనాపరంగా అడ్డంకులు ఉండవు. ప్రకటించిన ప్రాజెక్టులను ప్రజాగ్రహం మూలంగా వెనుకకు తీసుకోవాల్సిన అవసరం రాదు. ప్రభుత్వానికి ఈ విషయంలో సరైన సలహాలు అవసరం.
- ఆచార్య కట్టా ముత్యం రెడ్డి
ప్రెసిడెంట్, తెలంగాణ ఎకనమిక్ అసోసియేషన్
Comments
Please login to add a commentAdd a comment