సబర్మతి నదీ పరీవాహక ప్రాంత తరహాలో కరీంనగర్‌లోని మిడ్‌మానేరును అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సంకల్పించిందని ఎంపీ వినోద్ తెలిపారు.
న్యూ ఢిల్లీ: సబర్మతి నదీ పరీవాహక ప్రాంత తరహాలో కరీంనగర్‌లోని మిడ్‌మానేరును అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సంకల్పించిందని ఎంపీ వినోద్ తెలిపారు. అందులో భాగంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలోని బృందం శనివారం అహ్మదాబాద్‌లోని సబర్మతి నదిని పరిశీలించడానికి వెళ్లనుందని తెలిపారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో జాతీయ ఉపరితల రవాణా శాఖ కార్యదర్శి సంజయ్ మిత్రను కలసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణలో జాతీయ రహదారుల కోసం ప్రకటించిన నిధులు వెంటనే విడుదల చేయాలని, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని కోరినట్టు ఆయన తెలిపారు. జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేస్తే.. వెంటనే పనులు ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని సంజయ్‌మిత్ర చెప్పినట్టు వినోద్ తెలిపారు.