Boinapally Vinod Kumar
-
ఉద్యోగాలిచ్చి కూడా చెప్పుకోలేకపోయాం: వినోద్‌కుమార్
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలిచ్చి కూడా ప్రచారం చేసుకోకపోవడం వల్లే నష్టపోయామని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్లో వినోద్‌కుమార్ గురువారం(అక్టోబర్10) మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ గురి పెట్టిన చరిత్ర రేవంత్‌రెడ్డిది. మార్కెటింగ్‌లో మాత్రం ఆయనను మించినవాడు లేడు. మలిదశ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన చరిత్ర నాకుంది. నాకెవవరూ ఉద్యోగం ఇవ్వలేదు. నేను స్వయంగా అడ్వకేట్‌ను. నేను తెలంగాణ వాదిని. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని రేవంత్‌రెడ్డి గతంలో చెప్పాడు. ఎన్నికల హామీ మేరకు డిసెంబర్ నాటికి 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. కేసీఆర్ ప్రభుత్వం లక్షా 60వేల ఉద్యోగాలు నింపలేదని భట్టి చెప్పగలరా? ఖాళీగా ఉన్న ఉద్యోగాలను గుర్తించే బాధ్యతను ఎమ్మెల్సీ కోదండరాం తీసుకోవాలి.జేఏసీని నడిపిన అనుభవం ఉన్న కోదండరాం.. సీఎం రేవంత్‌కు ఉద్యోగాలపై సమాచారం ఇవ్వాలి. రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో కూడా ప్రభుత్వం దగ్గర సమాచారం లేదు. నియామక పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని రేవంత్ రాజకీయ సభల మాదిరి నిర్వహిస్తున్నారు.ఉద్యోగాల నియామకం ఎలా జరుగుతుందో కూడా మంత్రులు భట్టి, పొన్నంకు తెలియదు.బీఆర్ఎస్ హాయాంలో ఒక లక్షా 61వేల 572మందికి ఉద్యోగాలు ఇచ్చాం.కేసీఆర్ సీఎంగా ఇచ్చిన ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇస్తున్నారు.కేసీఆర్ హాయాంలో నింపిన ఉద్యోగాల సమాచారం.. మంత్రులకే తెలియకపోవడం దౌర్భాగ్యం’అని వినోద్‌కుమార్ అన్నారు.కేసీఆర్ హయాంలో ‘2014 నుంచి 2023’ వరకు జరిగిన ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఇవే..ఇదీ చదవండి: కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా -
చంద్రబాబుపై బీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: చంద్రబాబు నాయుడిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో గనుక చంద్రబాబు గెలిస్తే తన శిష్యుడితో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేస్తాడని అన్నారు. వినోద్ కుమార్ కరీంగనగర్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడారు.‘హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు దగ్గర పడింది. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో పొత్తు పెట్టుకుని హైద్రాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తాడు. బీజేపీ ఆలోచనలు కూడా హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలన్నట్టుగానే సాగుతున్నాయి. పార్లమెంట్లో గళం విప్పాలంటే నేను గెలువాలి. బండి సంజయ్ బీజేపీ కుర్చోమంటే కూర్చుంటూ.. లెమ్మంటే లేచే వ్యక్తి’ అని మండిపడ్డారు. -
కరీంనగర్ లోక్‌సభ సెగ్మెంట్: నెగిటివ్ ప్రచారం కొత్త పుంతలు!
ఎన్నికల టైమ్‌లో ప్రత్యర్థుల లోపాలు వెతికి నెగిటివ్ ప్రచారం చేయడం మామూలే. కాని కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఈ నెగిటివ్ ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోందని టాక్. మూడు పార్టీల ప్రధాన నేతలు ఎదుటివారి మైనస్‌లను పట్టుకుని ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిగత ప్రచారాలను ఆపడానికి ఏకంగా పోలీసుల ఫిర్యాదుల వరకు వెళుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముంగిట ప్రత్యర్థి నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో రచ్చ రచ్చగా మారుతోంది. ఈ నాయకులు చేస్తున్న ఆరోపణలేంటి? ఆ నేతలు ఎవరు? గులాబీ పార్టీ తరపున కరీంనగర్ లోక్‌సభ స్థానానికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ మరోసారి పోటీ చేస్తారని వినిపిస్తోంది. ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఆయనైతే ప్రచారంలో నిమగ్నమైపోయారు. ఇదిలా ఉంటే..వినోద్‌కుమార్‌కు సమీప బంధువు ఒకరికి జెన్కోలో ఉద్యోగం ఇప్పించారంటూ సోషల్ మీడియాలో జరిగిన రచ్చ... ఆ మాజీ ఎంపీ మనస్సును తీవ్రంగా గాయపర్చింది. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ.. వినోద్ ఓ ప్రెస్ మీట్ నిర్వహించి వివరణ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో క్యాష్ చేసుకునేందుకే తనను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరైతే జెన్కోలో ఉద్యోగం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారో ఆ వ్యక్తి ఇంటి పేరు.. తన ఇంటి పేరూ ఒకటైనంత మాత్రాన తన బంధువని ఎలా అంటారంటూ ఫైరయ్యారు వినోద్. బండి సంజయ్ తన అనుచరులతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఎదుర్కోలేక బీజేపీ, కాంగ్రెస్‌లు ఏకమై తన మీద దుష్ప్రచారం చేస్తున్నాయన్నది బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ వాదన. అయితే ఈ రచ్చ అంతటితో ఆగలేదు. వినోద్ విమర్శలపై బీజేపీ నేతలు కూడా కౌంటర్ అటాక్ ప్రారంభించారు. ఈ ఇద్దరు నేతల మాటల యుద్ధం పార్లమెంట్ ఎన్నికల ముంగిట కరీంనగర్ లో పొలిటికల్ హీట్‌ను బాగా పెంచాయి. బంధుప్రీతి లేకుంటే కరీంనగర్ మేయర్ గా సునీల్ రావు ఎలా అయ్యాడని.. కరీంనగర్ కార్పొరేషన్లో అవినీతి ఎలా రాజ్యమేలుతుందో చెప్పాలంటూ బీజేపీ నేతలు పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు. వినోద్ ప్రమేయం లేకుంటే ఆయనెందుకంత ఉలికి పడుతున్నారో చెప్పాలని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా మరోసారి గెలవాలన్న తలంపుతో అందరికంటే ముందస్తుగానే బండి సంజయ్ తన వ్యూహాల్ని తాను రచించుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇప్పటివరకూ వినోద్ పేరే వినిపిస్తుండటం.. ఆయనే పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం కలియ తిరుగుతుండటంతో.. ఇప్పటివరకు వీరిద్దరి మధ్యే గట్టి పోటీ కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సోదరుడైన శ్రీనుబాబుతో పాటు.. ఈటల రాజేందర్ పేరు కూడా ప్రచారంలోకొస్తున్నాయి. బరిలోకి దిగే అభ్యర్థిని బట్టి కరీంనగర్లో జరగబోయేది ముఖాముఖీ పోటీనా.. లేక, ముక్కోణపు పోటీనా అన్నది తేలుతుంది. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, బీఆర్ఎస్ తరపున మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌లు మరోసారి తలపడతారని తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఎవరో తేలితే ఇక కరీంనగర్ హీట్ మామూలుగా ఉండదంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. చదవండి: బీజేపీ, కాంగ్రెస్ మళ్లీ కలిసి పని చేయబోతున్నాయి: కేటీఆర్ -
ప్రతీ 600 మందికి ఒక వైద్యుడు
సాక్షి, హైదరాబాద్: ప్రతీ జిల్లాకు వైద్య కళాశాల ఏర్పాటు చేయడం వల్ల రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రతీ 600 మందికి ఒక డాక్టర్ ఉంటారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఏఐఎఫ్‌టీవో) జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యా రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని, వెయ్యికి పైగా రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేసిందని, ప్రతీ విద్యార్థిపై ఏడాదికి రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తోందని తెలిపారు. విదేశాల్లో చదివే పేద విద్యార్థులకు రూ.20 లక్షలు అందిస్తోందన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఏఐఎఫ్‌టీవో జాతీయ అధ్యక్షుడు అశ్వినికుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగులకు నష్టం కలిగిస్తున్న కాంట్రి బ్యూటరీ పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్యమ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సంఘం సెక్రటరీ జనరల్ చగన్‌లాల్ రోజ్, జాతీయ ఉపాధ్యక్షుడు పి. శ్రీపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు పాల్గొన్నారు. -
రైల్వేలో ఖాళీగా ఉన్న 3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి
సాక్షి, హైదరాబాద్: రైల్వే శాఖలో వివిధ కేటగిరీలలో ఖాళీగా ఉన్న 3,15,823 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రైల్వేశాఖలో ఉన్న ఖాళీ ఉద్యోగాల జాబితాను రాజ్యసభలో కేంద్ర రైల్వేమంత్రి అశ్విన్ వైష్ణవ్ విడుదల చేశారని, ఇందులో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే 17,134 వివిధ కేటగిరీల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వివరించారు. రాష్ట్రం నుంచి ఎన్నికైన నలుగురు బీజేపీ ఎంపీలు ఖాళీగా ఉన్న రైల్వే ఉద్యోగాల భర్తీ కోసం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులు రైల్వే ఉద్యోగాలు పొందే విధంగా బీజేపీ ఎంపీలు కృషి చేయాలని సూచించారు. కేంద్రం వెంటనే రైల్వే శాఖతో పాటు ఇతర శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం చర్యలు తీసుకోవాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. -
ఒక్క గుజరాత్‌కే కేంద్రం నిధులా..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాలకు కేంద్ర నిధులను విడుదల చేసే విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివక్ష చూపుతున్నారని, కేవలం గుజరాత్ రాష్ట్రానికే నిధుల మంజూరు విషయంలో పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. 9 నెలల కాలంలో ఒక్క గుజరాత్ రాష్ట్రానికే రూ.1,37,655 కోట్ల విలువైన ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఇతర పనులకు ప్రధాని మోదీ కేంద్ర నిధులు మంజూరు చేశారని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ దాదాపు 40 సార్లు రాష్ట్రంలో పర్యటించి నిధుల వరద పారించారని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు నిధులు మంజూరు చేసే విషయంలో మాత్రం మోదీ వివక్ష చూపుతున్నారన్నారు. ప్రధాని హోదాలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమానంగా చూడాల్సిన మోదీ, ఒక్కో రాష్ట్రాన్ని ఒక్కో రకంగా చూడటం ప్రజాస్వామ్య మనుగడకు మంచిది కాదన్నారు. -
తెలంగాణ పంచాయతీరాజ్ గ్రూప్ ఏర్పాటు చేయాలి
దిల్సుఖ్నగర్: ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ (ఐపీజీ) తరహాలోనె తెలంగాణ పంచాయతీరాజ్ గ్రూపును ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. పార్లమెంట్ స్పీకర్ అధ్యక్షుడుగా ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ 1949లో ఏర్పాటు అయిందని, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఈ గ్రూప్‌కు ఆద్యులని తెలిపారు. బీజేఆర్ భవన్లో స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అథితిగా పాల్గొని మాట్లాడారు. స్థానిక సంస్థల ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు కలిసి తెలంగాణ పంచాయతీరాజ్ గ్రూప్‌ను చట్టబద్ధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. పంచాయతీరాజ్ చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వులపై ఎప్పటికప్పుడు సమీక్షలు, అప్పుడప్పుడు సెమినార్లు, అంతర్‌జిల్లాల స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చలు జరిపి, ఆయా అంశాలను ఎంపీలు, ఎమ్మేల్యేలు, ఎమ్మేల్సీల దృష్టికి తీసుకొని రావాలన్నారు. ప్రజాప్రతినిధులు సోషల్ ఇంజనీర్లని, సమాజ నిర్మాణంలో వారి పాత్ర కీలకమని అభిప్రాయపడ్డారు. -
ప్రముఖులతో పాఠాలు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ విద్యార్థులకు తరగతి గదుల్లో పాఠ్యపుస్తకాల చదువులను తగ్గించి, సామాజిక అవగాహన మేళవించి సరికొత్త బోధనను అందుబాటులోకి తేనున్నారు. రాజకీయ ప్రముఖులు, ఆర్థికవేత్తలు, మాజీ ఐఏఎస్‌లు, ఇతర మేధావులతో పాఠాలు చెప్పించబోతున్నారు. ఈ దిశగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి బీఏ ఆనర్స్ కోర్సులను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ మంగళవారం హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజీలో ఈ కొత్త కోర్సును లాంఛనంగా ప్రారంభించారు. ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కోఠి ఉమెన్స్ కాలేజీలో బీఏ ఆనర్స్ (పొలిటికల్), నిజామ్ కాలేజీలో బీఏ ఆనర్స్ (ఎకనామిక్స్)ను అమలు చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే మొదలుపెట్టనున్న ఈ కోర్సులో ఒక్కో కాలేజీలో 60 సీట్లు ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న దోస్త్ మూడో దశ కౌన్సెలింగ్‌లో వీటిని చేరుస్తారు. రెండు కాలేజీల్లో లభించే ఆదరణను బట్టి రాష్ట్రవ్యాప్తంగా కోర్సును విస్తరించే వీలుందని మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. ప్రస్తుతానికి మూడేళ్ల కాలపరిమితితోనే కోర్సు ఉంటుందని, మున్ముందు నాలుగేళ్లకు పెంచుతామని అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవీ, ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ రవీందర్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకట రమణ పాల్గొన్నారు. కోర్సు లక్ష్యం ఇదీ.. ఉమ్మడి రాష్ట్రంలో కొన్నేళ్ల క్రితం బీఏ ఆనర్స్ కోర్సును సమర్థవంతంగా నిర్వహించారు. అప్పట్లో ఈ కోర్సు చేసిన వారికి ఇంటర్మీడియెట్ బోధించే అర్హత కూడా ఉండేది. సైన్స్ కోర్సుల ప్రాధాన్యం పెరగడంతో ఆనర్స్ తెరమరుగైంది. సంప్రదాయ బీఏ కోర్సుల్లో చేరే వారి సంఖ్య 16 శాతానికి పరిమితమైంది. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో బీఏ చదివే వారి సంఖ్య పెరుగుతోంది. అదీగాక ఈ కోర్సు కోసం ఇక్కడి నుంచి విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోనూ అందుబాటులోకి తెస్తున్నారు. సామాజిక అవగాహన పెంచడమే దీని ముఖ్య ఉద్దేశమని ఉన్నత విద్యామండలి తెలిపింది. పాఠ్యపుస్తకాల్లో అంశాలకు 50 శాతం మార్కులిస్తే, సామాజిక అవగాహనకు మరో 50 మార్కులు ఇస్తారు. ఆనర్స్ కోర్సును వ్యాపారం కాకుండా, ప్రభుత్వ కాలేజీల్లో నిర్వహిస్తే బాగుంటుందని వినోద్‌కుమార్ సలహా ఇచ్చారు. సమాజాన్ని అర్థం చేసుకోకపోతే అది చదువే కాదని, దీన్ని గుర్తించే ఆనర్స్ తెస్తున్నట్టు తెలిపారు. -
కేసీఆర్ వెంటే మేము.. మంత్రి హరీశ్, బి. వినోద్ రాకతో..
సాక్షి, హైదరాబాద్/కమలాపూర్: టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే కొనసాగుతామని హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలానికి చెందిన ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ మేరకు వారు మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌లతో శనివారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. భేటీ అయినవారిలో కమలాపూర్ ఎంపీపీ తడక రాణీ శ్రీకాంత్, పీఏసీఎస్ చైర్మన్ పేరాల సంపత్‌రావు, డీసీసీబీ డైరక్టర్ పి.కృష్ణప్రసాద్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారికి హరీశ్, వినోద్ కౌన్సెలింగ్ నిర్వహించారు. ‘పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న మీరందరూ అధినేత కేసీఆర్ నిర్ణయాన్ని గౌరవించి టీఆర్ఎస్ వెంటే నడవండి. పార్టీ మీకు అన్నివిధాలా అండగా నిలబడుతుంది. ఈటల రాజేందర్ పట్ల ఎవరికీ వ్యక్తిగతంగా ద్వేషం లేదు. కానీ, పార్టీకి నష్టం చేసే కార్యకలాపాలు చేసినందు వల్లే ముఖ్యమంత్రి ఆయనను మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేశారు’అని పేర్కొన్నారు. అనంతరం కమలాపూర్ నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్లో ఉన్నామని, రెండో ఆలోచనకు తావు లేకుండా తాము టీఆర్ఎస్ నీడలోనే పనిచేస్తామని స్పష్టం చేశారు. పార్టీ కేడర్ అంతా కేసీఆర్ వెంటే నడుస్తుందని, నియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కొనసాగుతున్న మంతనాలు పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇన్‌చార్జీలుగా పనిచేస్తున్న నేతలు కేడర్‌తో మంతనాలను ముమ్మరం చేశారు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావులు పార్టీ ప్రజాప్రతినిధులు, వివిధ స్థాయిల నేతలెవరూ మాజీమంత్రి ఈటల వైపు వెళ్లకుండా కౌన్సెలింగ్ చేస్తున్నారు. జిల్లాస్థాయిలో మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్రస్థాయిలో హరీశ్, వినోద్‌కుమార్‌లు నేతలతో మాట్లాడి నచ్చచెబుతున్నారు. ఇదిలా ఉండగా, శుక్రవారం సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసానికి వెళ్లారు. వారి మధ్య హుజూరాబాద్ నియోజకవర్గ రాజకీయాలు ప్రస్తావనకు వచ్చి ఉంటాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. -
టీఆర్ఎస్ కేడర్ కట్టడికి కమిటీ.. రంగంలోకి మంత్రి హరీశ్ రావు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ఏకాకిని చేయడం లక్ష్యంగా సాగుతున్న పరిణామాల్లో మరింత వేడి పెరిగింది. ఇప్పటికే ఈటల అనుకూల, ప్రతికూల వర్గాలుగా హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో కేడర్ చీలిపోయింది. ప్రతికూల వర్గం నేతలు తాము పార్టీ వెంటే ఉంటామని ప్రకటనలు చేస్తుండగా, అనుకూల నేతలు ఈటల రాజేందర్ వెంట నడుస్తామని తేల్చి చెబుతున్నారు. మంగళవారం నుంచి 3 రోజుల పాటు నియోజకవర్గంలో మకాం వేయాలని ఈటల నిర్ణయించారు. దీంతో రాజకీయ విమర్శలు ఊపందుకోవడంతో పాటు, అనుకూల ప్రతికూల వర్గాల నడుమ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. పార్టీ కేడర్‌పై పట్టు సాధించేందుకు అటు టీఆర్ఎస్, ఇటు ఈటల పావులు కదుపుతుండటంతో హుజూరాబాద్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. కేడర్‌పై పట్టు కోసం కమిటీ ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్ హుజూరాబాద్ నియోజకవర్గ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి టీఆర్ఎస్ కేడర్‌పై పట్టు బిగిస్తున్నారు. దీంతో ఈటల, గంగుల పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటుండటంతో కరీంనగర్ జిల్లా రాజకీయం వేడెక్కుతోంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి ఈటల రాజీనామా చేసినా కేడర్ చెక్కు చెదరకుండా ఉండాలని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు అంతర్గత కమిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్రస్థాయిలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్, కరీంనగర్ జిల్లా స్థాయిలో గంగుల కమలాకర్.. పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయనున్నారు. వీరితో పాటు క్షేత్ర స్థాయిలో మరో నలుగురు ముఖ్య నేతలకు కూడా హుజూరాబాద్ బాధ్యతలు అప్పగించారు. క్షేత్ర స్థాయి కేడర్‌తో మంతనాలు.. హుజూరాబాద్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, మండలాలకు నలుగురు ముఖ్య నేతలను ఇన్చార్జిలుగా నియమించారు. హుజూరాబాద్‌లో కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, ఇల్లంతకుంట, జమ్మికుంట మండలాల్లో శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ జీవీ రామకృష్ణారావు ఇన్‌చార్జీలుగా పనిచేస్తారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు వీణవంక, కిమ్స్ రవీందర్‌రావుకు కమలాపూర్ మండల బాధ్యతలు అప్పగించారు. తమకు అప్పగించిన మండలాలు, మున్సిపాలిటీల్లో పార్టీ కేడర్‌తో పాటు, స్థానిక సంస్థల ప్రతినిధులు, సర్పంచ్‌లు పార్టీ వెంట నడిచేలా వీరు చూడాల్సి ఉంటుంది. గంగుల, ఈటల నడుమ మాటల యుద్ధం ఇటీవలి వరకు మంత్రివర్గంలో సహచరులుగా ఉన్న గంగుల కమలాకర్, ఈటల రాజేందర్ నడుమ మాటల యుద్ధం ముదురుతోంది. ఈటల హైదరాబాద్‌లో ఓసీ.. హుజూరాబాద్‌లో బీసీ అని విమర్శిస్తూ.. ఆయన భూ కబ్జాలు చేశారంటూ గంగుల ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ వ్యాపారంలో అక్రమాలపై గంగులను ఉద్దేశించి ఈటల మంగళవారం విమర్శలు గుప్పించారు. మరోవైపు ఒకరినొకరు తీవ్ర స్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
ప్రభుత్వ పాలనలో ప్రణాళికా శాఖ పాత్ర కీలకం
సాక్షి, హైదరాబాద్: దైనందిన పాలనలో ప్రణాళికా శాఖ పాత్ర కీలకమని, ప్రభుత్వంలోని ప్రతి శాఖకు ప్రణాళిక శాఖ దిక్సూచిగా నిలుస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మంగళవారం గణాంకభవన్‌లో ‘తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్’పుస్తకాన్ని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళికా శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి వినోద్ కుమార్ ఆవిష్కరించారు. రాష్ట్రానికి సంబంధించిన జీఎస్డీపీ అంచనాలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వివిధ పథకాల పురోగతి, పలు సర్వేలు, గణాంక శాఖల సమాచారం, రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి వివరాలను ఈ పుస్తకంలో పొందుపర్చారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రణాళికా శాఖ ముఖ్య భూమికను పోషిస్తోందని తెలిపారు. రాష్ట్ర సమగ్ర కార్యాచరణ సమాచారాన్ని క్రోడీకరించి పుస్తక రూపంలో అందుబాటులోకి తీసుకు రావడం గొప్ప విషయమని చెప్పారు. ఈ సమగ్ర సమాచారం http://tsdps. telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉందని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు విధిగా ఈ వెబ్సైటును ఉపయోగించాలని, ఆయా సమావేశాల్లో ఈ గణాంకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈవో జి.దయానంద్, రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీనివాస్‌రెడ్డి, సిజిస్ సంస్థ ప్రతినిధి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
దేశం గర్వించే నేత పీవీ నర్సింహారావు..
సాక్షి, హైదరాబాద్ : సామాజిక విప్లవం తీసుకొచ్చిన నేత దివంవత పీవీ నరసింహరావు అని పీవీ శతాబ్ది ఉత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు పీవీ రాజకీయ ప్రాతినిధ్యం కల్పించారని, ఎల్పీజీ సృష్టికర్త అని కొనియాడారు. పీవీ నరసింహరావు శత జయంతి ఉత్సవాల లోగోను గురువారం కేశవరావు రవీంద్ర భారతిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీవీ దేశనాయకుడని అన్నారు. ఈనెల 28న హైదరాబాద్‌లోని పీవీ జ్ఞానభూమిలో శతజయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయని, ఏడాదిపాటు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. (అందుకు గర్వపడుతున్నా: మహమూద్ అలీ) జయంతి వేడుకల వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్ వివరిస్తారని కేశవరావు తెలిపారు. ఉత్సవాలపై పలు కమిటీలు వేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డలుగా ఈ ఉత్సవాలు నిర్వహించడం గర్వకారణమన్నారు. పీవీ డాక్యుమెంటరీని తయారు చేస్తామని, పీవీతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులతో కమిటీని విస్తరిస్తాన్నారు. ఆర్థిక సంస్కర్తగా, భూసంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తిగా పీవీకి మంచి పేరు ఉందన్నారు. దేశం గర్వించే నేత, విద్యా సంస్కరణలు అనేకం తీసుకొచ్చారని పీవీ నరసింహరావును ప్రశంసించారు. శతజయంతి ఉత్సవాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని పీవీ నరసింహరావు కుమార్తె వీణాదేవి అన్నారు. వేడుకలు నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. (హరితహారం: మొక్కలు నాటిన కేటీఆర్) కేశవరావు నాయకత్వంలో కేసీఆర్ ఓ కమిటీని ఏర్పాటు చేయడం హర్షనీయమని టీఆర్ఎస్ నేత వినోద్ తెలిపారు. యాభై దేశాల్లో ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రపంచ పటంలో దేశం గర్వపడేలా తీర్చిదిద్దిన నేత పీవీ అని, దేశ ఆర్ధిక స్థితిగతుల్ని మార్చిన నేత అని పేర్కొన్నారు. రాజకీయాల కారణంగా ఆయనకు రావాల్సిన కీర్తి ప్రతిష్టలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ భారత్ నుంచి దేశాన్ని పాలించిన నేత పీవీ అని వినోద్ గుర్తు చేశారు. ఉత్సవాలు నిర్వహించాలన్న కేసీఆర్ నిర్ణయం గొప్పదని పీవీ ప్రభాకర్ అన్నారు. పీవీ గురించి తెలిసింది తక్కువ అని తెలియాల్సింది ఎక్కువ ఉందన్నారు. నాన్నకు టెక్నాలజీ అంటే చాలా ఇష్టమని, ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రాం కోసం ఆయన పని చేశారని గుర్తు చేశారు. ఇదే విషయాన్ని అటల్ జీ కూడా చెప్పారన్నారు. ఇవాళ చంద్ర మండలం వెళ్తున్నామంటే పీవీ వేసిన బాటలేనని ప్రభాకర్ పేర్కన్నారు. -
కరీంనగర్ కింగ్ ఎవరు..?
సాక్షి, కరీంనగర్ : ఉత్తర తెలంగాణలో కీలక నియోజకవర్గంగా కరీంనగర్ లోక్‌సభ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. డిసెంబర్ 7న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తికాగా సరిగ్గా 125 రోజులకు అంటే ఏప్రిల్ 11న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుందుభి మోగించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీతో పోలిస్తే లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ సరళిలో లేదా ఓటర్ల తీర్పులో మార్పు ఉంటుందా? రాష్ట్ర, జాతీయ రాజకీయాలకు, సీఎంను ఎన్నుకునే విషయంలో ఒక విధంగా, ప్రధానిని ఎన్నుకునే విషయంలో మరోలా ప్రజలు స్పందిస్తారా అనేది ఇప్పుడు కరీంనగర్ విషయంలో ఆసక్తికరంగా మారింది. అదీగాకుండా ఇటీవల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు రావడంతో, మొత్తం మూడు ఎమ్మెల్సీ సీట్లలో రెండు కరీంనగర్ పరిధిలో ఉండడంతో లోక్‌సభ ఎన్నికలపై ఈ ఫలితాల ప్రభావం ఏ మేరకు ఉంటుందన్నది చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ముఖ్యంగా కరీంనగర్ లోక్‌సభ స్థానంలో భారీ మెజారిటీ సాధించాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తోంది. టీఆర్ఎస్ పక్షాన ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్‌కుమార్ బరిలో నిలిచారు. ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల్లో వీరి మధ్య త్రిముఖపోరు నెలకొంటుందా లేక టీఆర్ఎస్–కాంగ్రెస్ లేదా టీఆర్ఎస్–బీజేపీ మధ్య ద్విముఖ పోటీగా మారుతుందా అనేది వేచిచూడాలి. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో గతంతో పోలిస్తే తమ జీవితాలు మెరుగ్గానే ఉన్నాయని, ఉద్యోగ, ఉపాధి కల్పనతో పాటు, రైతులను ఆదుకునేందుకు మరిన్ని చర్యలు కావాలని ప్రజలు కోరుతున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఇదీ పరిస్థితి సిరిసిల్ల: ఇది టీఆర్ఎస్కు పెట్టని కోట. సంస్థాగతం గా బలంగా ఉంది. గతంలో సిరిసిల్ల నుంచి గెలిచిన వారెవరూ మంత్రిగా బాధ్యతలు నిర్వహించలేదు. 2014లో గెలిచి కేటీఆర్ మంత్రి అయ్యాక విస్తృతం గా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రోడ్లు, వంతెనలు, ఇతర పనుల రూపంలో గత ఐదేళ్లలో రూ. వేలాది కోట్ల మేర నిధులు ఖర్చుచేశారు. చేనేత కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకున్నారు. ఇక్క డ కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులు కరువయ్యా రు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్‌రెడ్డి నిరుత్సాహంతో ఉన్నారు. బీజేపీ పరిస్థితీ ఏమంత మెరుగ్గా లేదు. వేములవాడ: ఇది టీఆర్ఎస్కు బలమైన సెగ్మెంట్. గతంతో పోలిస్తే ఇక్కడ మంచినీటి సరఫరా మెరుగుపడింది. వేసవిలో తరచుగా ఎదురయ్యే సమస్యలు అంతగా లేవని స్థానికులు చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సిరిసిల్ల, వేములవాడ ఇతర నియోజకవర్గాలు ప్రయోజనం పొందనున్నాయి. మిషన్ భగీరథ ద్వారా ఇప్పటికే 60 నుంచి 70 శాతం దాకా తాగునీరు సరఫరా అవుతోంది. ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ఇప్పుడు అందుబాటులో ఉంటున్నారని ప్రజలు అంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభావం కొంత ఉంటుంది. లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌కు ఇక్కడి వారితో అనుబంధం ఉంది. బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే. హుజూరాబాద్: రాజకీయంగా టీఆర్ఎస్ బలంగానే ఉంది. మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సెగ్మెంట్లో అభివృద్ధి పనులు బాగానే చేపట్టారు. 2014తో పోలిస్తే గత ఎన్నికల్లో తన మెజారి టీ కొంత మేర తగ్గడంపై ఇటీవల కార్యకర్తల సమావేశంలో ఈటల అసంతృప్తి వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ నుంచి లక్ష మెజా రిటీని సాధించడం ద్వారా దానిని భర్తీచేయాలని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి కొంత మేర మద్దతు దొరికే అవకాశాలున్నాయి. ఆ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ సామాజిక వర్గం వారు ఇక్కడ ఎక్కువమంది ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ నుంచి జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీచైర్మన్ తుమ్మిడి సమ్మిరెడ్డి, వి.రవీందర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. ఇక్కడి యువకులు కొందరిపై వీహెచ్‌పీ, బజ్రంగ్దళ్ ప్రభావం ఉండటంతో సామాజిక మాధ్యమాల్లో లోక్‌సభ అభ్యర్థి సంజయ్ కుమార్‌కు అనుకూల ప్రచారం సాగుతోంది. చొప్పదండి: అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ఇక్కడ పటిష్టంగానే ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో భారీ గా చేరికలు సాగాయి. కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయి లో పుంజుకోవాల్సి ఉంది. ప్రధాని మోదీ ప్రభావం యువతపై కొంత మేర ఉండే అవకాశాలున్నాయి. హిందుత్వ భావజాలం కారణంగా బీజేపీ అభ్యర్థిపై ఇక్కడి యువకులు ఆకర్షితులవుతున్నట్టు చెబుతున్నారు. కరీంనగర్: ఇక్కడ టీఆర్ఎస్కు సానుకూలత ఉంది. కాంగ్రెస్, బీజేపీ కంటే టీఆర్ఎస్ ఆశీర్వాద సభలు, రోడ్‌షోలు, కుల సంఘాల సమావేశాలతో ప్రచారం లో ముందుంది. వరస విజయాలతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు స్థానికంగా సంబంధాలు మరింత మెరుగయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసిన బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ రెండు, మూడు స్థానాలకు పరిమితమయ్యారు. వీరిద్దరూ కూడా కరీంనగర్ పట్టణవాసు లు కావడంతో వారి మద్దతుదారులు పెద్దసంఖ్య లోనే ఉన్నారు. వీరికి బీసీ సామాజికవర్గాల ఓట్లు పడే అవకాశాలున్నాయి. సంస్థాగతంగా కాంగ్రెస్ ఇక్కడ బలంగానే ఉంది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలొచ్చాక కాంగ్రెస్ నుంచి ఐదుగురు కార్పొరేటర్లు టీఆర్ఎస్లో చేరారు. ఇది కాంగ్రెస్‌కు ప్రతికూలం కావచ్చు. హిందూ అనుకూల ఓటుబ్యాంక్‌తో అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన సంజయ్ లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగిస్తారా అనేది చర్చనీయాంశమైంది. మానకొండూరు: ఇక్కడి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు ప్రజలతో సంబంధాలు బాగానే ఉన్నాయి. టీఆర్ఎస్ కేడర్ బలంగానే ఉంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిన సీనియర్ నేత ఆరేపల్లి మోహన్ తాజాగా టీఆర్ఎస్ లో చేరడం కాంగ్రెస్ పార్టీపై కొంత మేర ప్రభావం చూపొచ్చునని చెబుతున్నారు. సీనియర్‌నేత కవ్వం పల్లి సత్యనారాయణకు సముచిత స్థానం కల్పించడం ద్వారా ఆ నష్టం భర్తీకి పొన్నం చర్యలు తీసుకుంటున్నారు. హిందువుల కోసం పోరాడే వ్యక్తిగా సంజయ్‌కు ఇక్కడి యువతలో గుర్తింపు ఉంది. ఇక్కడ టీఆర్ఎస్–కాంగ్రెస్–బీజేపీల మధ్య పోటా పోటీగా ఉండొచ్చునని అంచనావేస్తున్నారు. హుస్నాబాద్: ఈ నియోజకవర్గాన్ని అన్నీ తానై మా జీ మంత్రి టి.హరీశ్‌రావు నడిపించారు. ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌తో పాటు తాను జవాబుదారీగా ఉం టూ ఇక్కడి ప్రజల్లో నమ్మకం కలిగించారు. ప్రస్తుతం ఈ సెగ్మెంట్లోని కొంత భాగం కొత్తగా ఏర్పడిన సిద్దిపేట జిల్లాలో ఉంది. టీఆర్ఎస్కు స్థానిక నాయకులు, కార్యకర్తల మద్దతుంది. కాంగ్రెస్‌కు ఇక్కడ మద్దతుదారులున్నా పార్టీని చురుకుగా నడిపించే నాయకులు లేరు. ఇక్కడ కొంతమేర సీపీఐ ప్రభావం ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ పెద్దగా కేడర్ లేదు. అభివృద్ధే ఎజెండా రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ముందు కెళుతున్నాం. ప్రచారానికి వెళ్లినపుడు ప్రజల్లో స్పందన బాగుంటోంది. ఓటర్లు స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో జాతీయస్థాయిలో తమ ఎంపీ ఉండాలని కరీంనగర్ ప్రజలు కోరుకుంటున్నారు. ఐదేళ్లలో రాష్ట్ర ఎంపీలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగాం. నీటిపారుదల ప్రాజెక్టులు, ఇతర కార్యక్రమాలకు అనుమతులు, మంజూర్లు పొందగలిగాం. కేంద్ర ప్రభుత్వంలో కూడా టీఆర్ఎస్కు పాత్ర ఉంటే ఇంకా సాధిస్తాం. విభజన చట్టంలో పేర్కొన్న తెలంగాణలోని ఒక ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంలో కాంగ్రెస్, బీజేపీ విఫలమయ్యాయి. ఈసారి దానిని సాధించేందుకు కృషి చేస్తాం. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ప్రసక్తే లేదు. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి 4,5 వార్డుల్లో ప్రభావం చూపగలుగుతారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా ఆ పార్టీకి రావు. అందువల్ల కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులెవరూ నాకు పోటీ కాదు. – బోయినపల్లి వినోద్‌కుమార్, టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ ఆయన ఓడినా నష్టమేం లేదు.. స్థానికుడిని. ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటాను. 2009–14 మధ్యకాలంలో ఎంపీగా సాధించిన అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర సాధనకు ఢిల్లీలో పోషించిన కీలకపాత్ర నన్ను గెలిపిస్తాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడినా ప్రజలకొచ్చే పెన్షన్లు, రైతుబంధు ఇతర సంక్షేమ పథకాలు ఆగిపోవు. రాష్ట్ర ప్రభుత్వంపై ఏ ప్రభావం పడదు. హిందూ–ముస్లింల మధ్య వైషమ్యాలు పెంచడం ద్వారా ఇక్కడ రాజకీయంగా లాభపడాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలు ఫలించవు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ చేయడం పొరబాటు. కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని మిగతా 6 నియోజకవర్గాలను కవర్ చేశాక, చివరకు కరీంనగర్ అసెంబ్లీపై దృష్టి పెడదామనుకున్నా. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు రావడంతో అధిష్టానం ఆదేశాలతో పోటీ చేయాల్సి వచ్చింది. పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకగా, కరీంనగర్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేసే వ్యక్తిగా ప్రజలు ఈసారి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్, ఇతర జిల్లాల బుద్ధిజీవులు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పే ఎంపీ ఎన్నికలపుడు కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఇస్తారని ఆశిస్తున్నాను. – పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ అభ్యర్థి నన్ను గెలిపించే ఆలోచనలో ఉన్నారు.. మరోసారి నరేంద్రమోదీని ప్రధానిని చేసేందుకు ఇక్కడి నుంచి బీజేపీ ఎంపీగా నన్ను పంపించాలనే అభిప్రాయంతో ఇక్కడి ప్రజలున్నారు. నేను గెలిస్తే స్వయంగా ప్రధానిని, కేంద్రమంత్రులను కలిసి, నియోజకవర్గ అభివృద్ధికి నేరుగా నిధులు తెచ్చే అవకాశం ఉంది. అదే టీఆర్ఎస్ నాయకుల విషయానికొస్తే వారు సీఎం కేసీఆర్‌నే కలిసే పరిస్థితే ఉండదు. లోక్‌సభ ఎన్నికలు జాతీయ రాజకీయాలకు సంబంధించినవి కాబట్టి ప్రజలు భిన్నమైన తీర్పునిస్తారనే నమ్మకముంది. ఇక్కడ టీఆర్ఎస్కు ఓటేసినా ఎంఐఎంకు వేసినట్టే. కాంగ్రెస్‌కు వేస్తే టీఆర్ఎస్కు వేసినట్లే. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత బయటపడింది. బీజేపీకి గెలుపు అవకాశాలు మెరుగయ్యాయని భావిస్తున్నాను. రెండు సార్లు అసెంబ్లీకి పోటీచేసి ఓటమి చెందాననే సానుభూతి ప్రజల్లో ఉంది. ఏడు సెగ్మెంట్లలో బీజేపీకి ఆదరణ పెరుగుతోంది. గతంలో కాంగ్రెస్, టీఆర్ఎస్కు అవకాశమిచ్చినందున ఈసారి నన్ను గెలిపిద్దామనే ఆలోచనతో ప్రజలున్నారు. మాకు సైలెంట్ ఓటింగ్ పడుతుంది. – బండి సంజయ్‌కుమార్, బీజేపీ అభ్యర్థి లోక్‌సభ ఓటర్లు పురుషులు :8,07,233 మహిళలు : 8,25,565 ఇతరులు : 26 మొత్తం ఓటర్లు : 16,32,824 2018 అసెంబ్లీ ఎన్నికలు లోక్‌సభ పరిధిలో పార్టీలకు పోలైన ఓట్లు టీఆర్ఎస్ 6,91,885 కాంగ్రెస్ 3,45,149 బీజేపీ 1,02,014 మొత్తం పోలైన ఓట్లు 15,42,685 -
అనర్గళ విద్యా ‘సాగరు’డు
సాక్షి, కరీంనగర్: రాజకీయాల్లో తలపండిన నేతలు.. కాకలు తీరిన యోధులు.. ఒక్కసారైనా రాజ్యాంగపరంగా ప్రాధాన్యత ఉన్న గవర్నర్ పదవి చేపట్టాలని ఆశిస్తారు. అలాంటి రాజ్యాంగపరమైన పదవిలో రాణిస్తున్నారు చెన్నమనేని విద్యాసాగర్‌రావు (77). మూడు దశాబ్దాల పాటు రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న విద్యాసాగర్‌రావు 2014 ఆగస్ట్ 30న మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. విద్యాసాగర్‌రావు మూడుసార్లు శాసనసభ్యుడిగా, రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా.. ఐదేళ్లు కేంద్ర మంత్రిగా పని చేశారు. తెలంగాణ ప్రాంతం నుంచి గవర్నర్ స్థాయికి ఎదిగిన రెండో వ్యక్తి విద్యాసాగర్‌రావు. మొదటి వ్యక్తి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి. పిట్టకథలు, వాగ్దాటితో ఆకట్టుకునే ‘సాగర్జీ’ ప్రస్థానంపై కథనం.. విద్యార్థి దశలో రచన, రాజకీయం.. విద్యాసాగర్‌రావు ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ చదువుతుండగా విద్యార్థి నాయకుడిగా వర్సిటీ స్థాయి ఎన్నికల్లో పాల్గొన్నారు. బీఎస్సీ ఎల్ఎల్బీ చదివారు. ఇందిర ఎమర్జెన్సీ సమయంలో అరెస్టయి జైలుకెళ్లారు. జైలులో ఉండగా పలు కథలు, వ్యాసాలు రాశారు. విద్యాసాగర్‌రావు సోదరుడు చెన్నమనేని రాజేశ్వర్‌రావు కమ్యూనిస్టు నేతగా ఉండగా విద్యాసాగర్‌రావు మాత్రం ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా పనిచేశారు. 1983లో తొలిసారి కరీంనగర్ జిల్లా చొప్పదం డిలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. 1985లో మెట్పల్లి నుంచి పోటీచేసిన విద్యాసాగర్‌రావు ఆపై 1989, 1994 ఎన్నికల్లో వరుస విజయా లు సాధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా, శాసనసభలో శాసనసభాపక్ష నేతగా పనిచేశారు. 1998లో కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి 12వ లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. అప్పట్లో వాజ్‌పేయి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడంతో 1999లో వచ్చిన ఎన్నికల్లో రెండోసారి ఎంపీ అయ్యారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. కేసీఆర్‌పై పోటీ.. 2004 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఉద్యమ నేతగా కరీంనగర్ నుంచి కేసీఆర్ పోటీ చేయగా అప్పటికే సిట్టింగ్ ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్న విద్యాసాగర్‌రావు మూడోసారి బరిలో దిగారు. తెలంగాణ వాదం బలంగా ఉండటంతో విద్యాసాగర్‌రావు ఓటమిపాలయ్యారు. 2009లో వేములవాడ ఎమ్మెల్యేగా పోటీచేసిన విద్యాసాగర్‌రావు తన సోదరుడు రాజేశ్వర్‌రావు, తనయుడు రమేశ్‌బాబు చేతిలో ఓటమిపాలయ్యా రు. బాబాయిని ఓడించిన అబ్బాయిగా రమేశ్‌బాబు వార్తల్లో నిలిచారు. 2014లో కరీంనగర్ లోక్‌సభ నుంచి పోటీ చేసిన విద్యాసాగర్‌రావు మరోసారి ఓటమిపాలయ్యారు. మహారాష్ట్ర గవర్నర్‌గా.. తెలంగాణ ప్రాంత సీనియర్ బీజేపీ నేతగా గుర్తింపు పొందిన విద్యాసాగర్‌రావు 2014లో బీజేపీ సర్కార్ కేంద్రంలో అధికారంలోకి రావడంతో మహారాష్ట్ర గవర్నర్‌గా 2014 ఆగస్టు 30న బాధ్యతలు స్వీకరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో మరణించిన సందర్భంగా తమిళనాట నెలకొన్న నాటకీయ పరిణామాలను నిశితంగా గమనించిæనాటి తమిళనాడు ఇంఛార్జి గవర్నర్‌గా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. మాటల మరాఠీ.. విద్యాసాగర్‌రావుకు మాటల మాం త్రికుడని పేరు. వేదికలపై అనర్గళంగా మాట్లాడుతూ కుల సంఘాల పేర్లను ఉచ్చరిస్తారు. ప్రసంగం మధ్యలో పిట్టకథలు చెబుతూ సభికులను ఆకట్టుకుంటారు. అసెంబ్లీ వేదికగా సాగే చర్చల్లోనూ తనదైన శైలిలో సాధికారంగా మాట్లాడటం ఆయన ప్రత్యేకత. సభ ఏదైనా తన వాగ్ధాటితో మెప్పిస్తారు. విద్యాసాగర్‌రావును ముద్దుగా ‘సాగర్జీ’ అంటారు. ప్రసంగం మధ్యలో చమత్కారాలు, తెలంగాణ నుడికారాలు, సామెతలు చెబుతూ రక్తికట్టిస్తారు. ఇంతట ‘మాటల నేత’ ప్రస్తుతం గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కమాటా మాట్లాడకుండా గంభీరంగా ఉండటం విశేషం. కుటుంబమంతా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం నాగారానికి చెందిన చెన్నమనేని శ్రీనివాస్‌రావు–చంద్రమ్మ దంపతుల చిన్నకొడుకుగా 1942 ఫిబ్రవరి 12న జన్మించిన విద్యాసాగర్‌రావు పాఠశాల స్థాయి నుంచే చురుకైన వక్త. ఆయన భార్య వినోద. పిల్లలు వివేక్, వినయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. చిన్నబ్బాయి వికాస్ డాక్టర్. విద్యాసాగర్‌రావు పెద్దన్నయ్య రాజేశ్వర్‌రావు సీనియర్ రాజకీయ నేత కాగా మరో అన్నయ్య పద్మవిభూషణ్ హన్మంతరావు ఆర్థికవేత్త. ఇంకో అన్నయ్య వెంకటేశ్వర్రావు కమ్యూనిస్టు నాయకుడు. విద్యాసాగర్‌రావు సోదరి కుమారుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ప్రస్తుత కరీంనగర్ ఎంపీ కాగా సోదరుడు రాజేశ్వరరావు కొడుకు రమేశ్‌బాబు వేములవాడ శాసనసభ్యుడిగా ఉన్నారు. సొంత డబ్బుతో స్కూలు, చెరువు.. నాగారంలోని రెండున్నర ఎకరాల భూమిని గురుకుల విద్యాలయానికి దానంగా ఇచ్చారు. గ్రామం లోని 85 మంది రైతులకు రూ.1.32 కోట్ల సొంత ఖర్చులతో బోర్లు వేయించారు. 105 మంది పేద బీడీ కార్మికులకు ప్రభుత్వ పరంగా ఇళ్లు కట్టించారు. 1993లో నాగారంలో రూ.60 లక్షలతో తొలి ఊట చెరువు నిర్మించారు. తల్లి చంద్రమ్మ పేరిట ట్రస్ట్ పెట్టి సిరిసిల్లలో సాగునీటి కాలువలు తవ్వించారు. కార్గిల్ వీరుల స్మారకార్థం 2000లో కార్గిల్ లేక్‌ను ఏర్పాటు చేశారు. - వూరడి మల్లికార్జున్, సిరిసిల్ల -
అవిశ్వాసం ఎందుకు పెట్టారో?
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘అవిశ్వాస తీర్మానం ఎవరిని అడిగి పెట్టారు? వారెందుకు పెట్టారో, ఏం కారణాలు చెబుతున్నారో చూసి మేం చర్చలో మాట్లాడతాం’’అని టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్ అన్నారు. బుధవారమిక్కడ ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘వారు అవిశ్వాసం పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా మాకు సంబంధం లేదు. ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుకుంటున్నాం’’అని వ్యాఖ్యానించారు. ‘‘ఈ రోజు ఉన్న వాతావరణమే ఈ 18 రోజులు ఉండి బిల్లులు ఆమోదం పొందుతాయని అనుకుంటున్నాం. హైకోర్టు విభజన చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం. హైకోర్టు విభజనకు గతంలోనే కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. దాన్ని అమలుకు సభలో కోరతాం. బయ్యారం ఉక్కు కర్మాగారం అంశాన్ని లేవనెత్తుతాం. కాళేశ్వరం ఆపాలని, అనుమతులు రద్దు చేయాలని ఏపీ సీఎస్ మూడు పేజీల లేఖ రాశారు. వాళ్ల(ఏపీ) ఆలోచనలు, మా ఆలోచనలు వేరు’’ అని అన్నారు. మాకు నచ్చలేదు: సీతారాం నాయక్ ‘‘కాళేశ్వరాన్ని అడ్డుకోవడం ఏపీకి తగదు. ఓవైపు ప్రాజెక్టులను అడ్డుకుంటూ మరోవైపు అవిశ్వాసానికి మా మద్దతు అడగడం నచ్చలేదు. చర్చలో పాల్గొంటం. కేంద్రం ద్వంద్వ వైఖరిని నిలదీస్తాం’’ అని సీతారాం నాయక్ చెప్పారు. -
వేములవాడను గొప్పక్షేత్రంగా తీర్చిదిద్దుతాం
వేములవాడ : వేములవాడ ఆలయాన్ని గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. వేములవాడలో ఆలిండియా వెలమసంఘం భవనాన్ని సోమవారం ఎమ్మెల్సీ భానుప్రసాద్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, మాజీ ఎమ్మెల్యే కడారి దేవేందర్‌రావు, ఆలిండియా వెలమ సంఘం అధ్యక్షుడు చల్మెడ లక్ష్మీనర్సింహారావులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మిడ్‌మానేరు నుంచి నేరుగా వేములవాడ గుడి చెరువు, మూలవాగులో 365 రోజులు గోదావరి జలాలు ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. త్వరలోనే సీఎం కేసీఆర్ శృంగేరి పీఠాధిపతులను వేములవాడకు తీసుకుని రానున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు మాట్లాడుతూ ఆలిండియా వెలమ సంఘం భవనాన్ని వెలమలకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని కోరారు. ఆలిండియా వెలమ సంఘం అధ్యక్షుడు చల్మెడ లక్ష్మీనర్సింహారావు మాట్లాడుతూ అనాథలు, నిరుపేదలను ఆదుకోవడమే సంస్థ లక్ష్యమన్నారు. స్థలదాత పాలెపు నర్సింగారావు, ఐవా జనరల్ సెక్రటరీ రామ్మోహన్రావు, ట్రెజరర్ జోగినపల్లి వెంకటనర్సింగారావు, శ్రీనివాస్‌రావు, మున్సిపల్ చైర్పర్సన్ నామాల ఉమ, వెలమ సంఘం నాయకులు, సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
‘ఎంపీ వినోద్ సహకారం మరువలేనిది’
సాక్షి, వరంగల్ : ఉప్పల్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణలో ఎంపీ వినోద్ కుమార్ సాకారం మరువలేనిదని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం కమలాపూర్ మండలం ఉప్పల్‌లో 66 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పాత హుజురాబాద్ నియోజకవర్గంలో 175 కోట్ల రూపాయలతో 4 జాతీయ రహదారులు నిర్మించుకున్నామని తెలిపారు. కమలాపూర్ మండలంలో నిత్యం 5000 మంది విద్యార్థులు ఉండేలా విద్యా హబ్ రూపు దిద్దుకుంటుందని, కమలాపూర్ మండలాన్ని సరస్వతి నిలయంగా తయారు చేస్తామని పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాల్లోనే కాకుండా రహదారుల విషయంలో కూడా కమలాపూర్ మండలంలో అభివృద్ధి జరుగుతుందని బరోసా ఇచ్చారు. త్వరలోనే ఉప్పల్ రైల్వే స్టేషన్ ఆర్వోబీ వంతెనను పూర్తి చేసి కమలాపూర్ ప్రజలకు అంకితం చేస్తామన్నారు. నియోజకవర్గ ప్రజల కల సాకారం కాబోతోంది: ఎంపీ వినోద్ వరంగల్ : దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న పాత కమలాపూర్ నియోజకవర్గ ప్రజల కల ఆర్వోబీ వంతెనతో సాకారం కాబోతోందని కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. ఉప్పల్ వంతెన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి హాఫ్ ఆర్వోబీ వంతెనని, ఇది మొదటిసారిగా నూతన టెక్నాలజీతో రూపుదిద్దుకోబోతుందని తెలిపారు. -
రామయ్యను దర్శించుకున్న ఎంపీ వినోద్‌కుమార్
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారిని కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గర్భగుడిలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వినోద్ కుటుంబసభ్యులు.. ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీతాయా రు అమ్మవారు, అభయాంజనేయ స్వామి వారి ఆలయాలను కూడా దర్శించుకొని పూజలు చేశా రు. వారికి ఆలయ అర్చకులు స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఏఈఓ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘వారి పాలన రైతులకు చుక్కలు చూపించింది’
సాక్షి, రాజన్న సిరిసిల్ల: మంత్రి కేటీఆర్, ఎంపీ వినోద్ కుమార్ జిల్లాలోని బోయినపల్లి మండలం విలాసాగర్లో మంగళవారం రైతు బంధు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీడీపీ పాలన రైతులకు చుక్కలు చూపిస్తే, టీఆర్ఎస్ ప్రభుత్వం చెక్కులు ఇస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏళ్ళు అధికారంలో ఉండి రైతులకు ఐదు రూపాయల సహాయం చేయలేదని, కానీ నాలుగేళ్ళ టీఆర్ఎస్ పాలనలో నాలుగు వేల చెక్కు ఇస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు జానారెడ్డి మాటలు వింటే బాదేస్తుందని, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డిలా గడ్డం పెంచుకుంటే సన్నాసుల్లో కలుస్తారు తప్ప సమస్యలు పరిష్కారం కావని తెలిపారు. రెండు లక్షల వరకు పంట రుణం మాఫీ చేస్తామంటున్న కాంగ్రెస్ నాయకులకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన అన్నారు. రైతు మోహంలో ఎప్పూడూ సంతోషం ఉండడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రైతు బంధు పథకంతో దేశానికే తెలంగాణ ఆదర్శంగా మారిందని కేటీఆర్ అన్నారు. దేశంలో హరిత విప్లవానికి తెలంగాణా కేంద్ర బిందువు అవుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 46 వేల చెరువులు నింపేందుకు మిషన్ కాకతీయ ద్వారా కృషి చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 86 ఏళ్ల తర్వాత భూ రికార్డుల ప్రక్షాళన చేసి 60 లక్షల మంది రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తున్న నాయకుడని కొనియాడారు. తెలంగాణలో కోటి 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర కార్యక్రమానికి కేసీఆర్ కంకణం కట్టుకున్నారని తెలిపారు. వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానం చేసే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నారు. -
హామీ వస్తే కూర్చుంటాం..!
సాక్షి, న్యూఢిల్లీ: తమ న్యాయమైన డిమాండ్లపై హామీ ఇస్తే సభలో కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నామని టీఆర్ఎస్ ప్రకటించింది. సోమవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమై, వాయిదా పడిన సందర్భంలో టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఎంపీలు ఎ.పి.జితేందర్‌రెడ్డి, బి.వినోద్‌కుమార్, సీతారాం నాయక్, బూర నర్సయ్య గౌడ్, నగేశ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బీబీ పాటిల్ పాల్గొన్నారు. ధర్నా వద్ద టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘మా డిమాండ్లను పార్లమెంటు ముందు పెట్టాం. రిజర్వేషన్లను రాష్ట్రాలకు వదిలిపెట్టాలి. రాష్ట్రాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాష్ట్రాలు పనిచేస్తాయి. కేంద్రంలో ఉన్న ఉద్యోగాల కోసంగానీ, విద్యా శాఖ లో కానీ రిజర్వేషన్లు అడగడం లేదు. మా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు, విద్యావకాశాల్లో మాత్రమే రిజర్వే షన్లు పెంచుకుంటాం. ఆ దిశగా బిల్లు తెచ్చాం. 9వ షెడ్యూలులో పొందుపరచాలని అడిగాం. నాలుగేళ్లుగా వేచిచూస్తున్నాం. కానీ ఇప్పటివరకు కేంద్రం ఏ ఒక్క అంశాన్ని అమలుచేయలేదు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలు చేయలేదు. ఎయిమ్స్, బయ్యారం స్టీలు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం.. ఏవీ ఇవ్వలేదు. హైకోర్టు విభజించలేదు. అందుకే రెండు వారాలుగా పోరాడుతున్నాం. కచ్చితమైన హామీ వచ్చే వరకు పోరాటం చేస్తాం’ అని స్పష్టం చేశారు. ఆందోళన కొనసాగుతుంది: జితేందర్‌రెడ్డి కేంద్రంపై పెట్టిన అవిశ్వాస తీర్మానాలు సభ ముందుకు వచ్చేలా మీరు మద్దతుగా నిలబడితే ఈ అంశాలన్నీ చర్చకు వస్తాయి కదా అని మీడియా ప్రశ్నించగా ‘రెండు వారాలుగా మా డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్నాం. డిమాండ్లను హౌస్‌లో పెట్టి పరిష్కరించుకుంటాం. ఎవ్వరినీ అనుసరించాల్సిన అవసరం మాకు లేదు. సరైన హామీ లభించే వరకు ఆందోళన కొనసాగుతుంది’అని జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి సహకరిస్తోందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయని ప్రస్తావించగా ‘వాళ్లకు వాళ్లు ఆరోపణలు చేసుకోవడం కాదు. ఈరోజు వాళ్లకు అవిశ్వాస తీర్మానం పెట్టాలని మనసొచ్చింది. మా ప్రజల ఆకాంక్షలు, డిమాండ్లు మాకు ముఖ్యం. మా డిమాండ్లపై వాళ్లు వాగ్దానం చేసి మమ్మల్ని కూర్చోబెడితే కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాం’అని స్పష్టం చేశారు. చర్చ జరిగితే మాట్లాడుతాం: వినోద్ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ ‘16వ లోక్‌సభ ప్రారంభమైన మొదటి రోజు నుంచి పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీస్తున్నాం. ఏపీలోకి 7 మండలాలు పోయిన రోజు నుంచి ఆందోళన చేస్తున్నాం. బీజేపీని నిలదీస్తున్న పార్టీల్లో టీఆర్ఎస్ మొదటి వరసలో ఉంది. రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం పెంచుతూ తెచ్చిన బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేర్చాలని మేం బడ్జెట్ మలివిడత సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచీ పోరాటం చేస్తున్నాం. అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ అనుమతిస్తే చర్చలో కూడా మేం మాట్లాడుతాం. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను లేవనెత్తుతాం. టీడీపీ ఇప్పటికీ విభజన అశాస్త్రీయంగా జరిగిందని మాట్లాడుతోంది. వాళ్ల హక్కుల గురించి మాట్లాడితే మద్దతు ఇస్తాం. కానీ, ఇప్పటికీ విభజ నను వ్యతిరేకించేలా స్వరం వినిపిస్తోంది. కాం గ్రెస్ నేతల గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. యూపీలో రెండు ప్రాంతీయ పార్టీలు గెలిస్తే వీళ్లు సంబరాలు చేసుకున్నారు’అని అన్నారు. మేం ఎవరిపై కేసు పెట్టాలి: సీతారాంనాయక్ ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ ‘గిరిజనులు, దళితుల మనోభావాలను కించపరిచినవారిపై అట్రా సిటీ కేసు పెట్టే హక్కును రాజ్యాంగం కల్పించింది. మేం నెలరోజులుగా గిరిజనుల రిజర్వేషన్లపై మాట్లా డుతున్నా పట్టించుకోనప్పుడు ఎవరిపై కేసు పెట్టాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ, ఎస్టీ జనాభా లేనిపక్షంలో రిజర్వేషన్లు కొనసాగించేవారా? నా ఉద్దేశం ఎవరిపైనో కేసులు పెట్టా లని కాదు. ఇంతమంది ఎంపీలం ఆందోళన పట్టించుకోకుంటే ఎవరిని దోషులను చేయాలి’ అని వాపోయారు. -
కాజీపేట - కరీంనగర్ రైల్వే లైన్‌కు ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్ : కాజీపేట నుంచి కరీంనగర్‌కు నేరుగా రైల్వేలైన్ నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు టీఆర్ఎస్ ఎంపీ వినోద్ తెలిపారు. ప్రస్తుతం కాజీపేట నుంచి కరీంనగర్ వెళ్లేందుకు పెద్దపల్లి మార్గంలో రైల్వే లైన్ ఉంది. కొత్త ప్రతిపాదనల ప్రకారం.. కాజీపేట నుంచి వయా హుజురాబాద్ మీదుగా కరీంనగర్‌కు రైల్వేలైన్ నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు అధ్యయనం చేయనున్నట్లు ఎంపీ వినోద్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్‌తో తెలంగాణ ఎంపీలు బుధవారం సమావేశమై కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో రాష్ర్టానికి రైల్వే కేటాయింపుల ప్రాధాన్యాలు, పెండింగ్ పనులపై చర్చించారు. ఈ సమావేశానికి ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్, కే కేశవరావు, నగేష్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, సీతారాం నాయక్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పసునూరి దయాకర్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మల్లారెడ్డి హాజరయ్యారు. రైల్వే జీఎంతో సమావేశం ముగిసిన అనంతరం ఎంపీ వినోద్ మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీలని నెరవేర్చాలని రైల్వే జీఎంను కోరినట్లు వినోద్ తెలిపారు. తెలంగాణలో మూడు రైల్వే లైన్లు మాత్రమే ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కొత్తపల్లి - మనోహరాబాద్ పనులు వేగంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. పెద్దపల్లి - నిజామాబాద్ రైల్వే లైన్‌ను ఎలక్ట్రిఫికేషన్ చేయాలని కోరామని తెలిపారు. ఇందుకు టెండర్లు కూడా పిలిచినట్లు లిఖితపూర్వంగా రైల్వే జీఎం సమాధానం ఇచ్చారని చెప్పారు. ఈ మార్గాన్ని ఎలక్ట్రిఫికేషన్ చేస్తే మెమో, లోకల్ రైళ్లు తిరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణలో జాతీయ రహదారులు, రైల్వే లైన్లు తక్కువగా ఉన్నాయని వినోద్ తెలిపారు. ఈ క్రమంలో రైల్వే లైన్ల కిలోమీటర్లను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ... దక్షిణ మధ్య రైల్వే ఆదాయంలో ముందు ఉందని పేర్కొన్నారు. కానీ సమస్యల పరిష్కారంలో దక్షిణ మధ్య రైల్వే ఆలస్యం చేస్తున్నదని తెలిపారు. 1997లో నల్లగొండ - మాచర్ల మధ్య లైన్ మంజూరైనప్పటికీ.. 20 ఏండ్లు అయినా పనులు ప్రారంభం కాలేదని ఎంపీ గుర్తు చేశారు. పగిడిపల్లి - నల్లపాడు డబ్లింగ్ పనుల గురించి అడిగితే కేంద్రం పట్టించుకోలేదని తెలిపారు. జగ్గయ్యపేట - మేళ్లచెర్వు గూడ్స్ మార్గాన్ని ప్యాసింజర్ లైన్‌గా మార్చాలని రైల్వే జీఎంకు విజ్ఞప్తి చేశామని గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. -
అలా అయితే బిల్లును అడ్డుకుంటాం: టీఆర్ఎస్ ఎంపీ
కరీంనగర్ : తెలంగాణలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయకుండా ఏపీకి మాత్రమే ఇస్తూ పార్లమెంటులో బిల్లు పెడితే అడ్డుకుంటామని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ హెచ్చరించారు. కరీంనగర్లో ఎంపీ వినోద్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చడం లేదని విమర్శించారు. విభజన చట్టంలోని హామీలపై శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై కోర్టు వివరణ ఇవ్వాలని కోరారు. ఎవ్వరైనా చట్టాన్ని గౌరవించక తప్పదని చెప్పారు. -
అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్ పని
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కొత్తగా ఏర్పడిన తెలంగాణలో జరుగుతున్న కనీవినీ ఎరుగని అభివృద్ధిని చూసి.. తమ ఉనికిని కోల్పోతామనే భయంతో కాంగ్రెస్ పార్టీ నేతలు అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారని కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ విమర్శించారు. శనివారం కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రైతాంగానికి వరప్రదాయినిగా మారనున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరగకుండా అడుగడుగునా కాంగ్రెస్ మోకాలడ్డుతోందని ఆరోపించారు. కోర్టు కేసులను ఛేదించి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అనుమతులను సకాలంలో తీసుకువచ్చామన్నారు. ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సాధించలేని ఘనతను టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిందని, మహారాష్ట్ర సర్కార్‌తో మాట్లాడి అనుమతులు పొందామని ఎంపీ వినోద్ వివరించారు. చివరకు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేసి నాలుగు నెలలు పనులు అడ్డుకున్నారని అన్నారు. తెలంగాణ ఎంపీలమంతా ఢిల్లీలో మకాం వేసి కాంగ్రెస్ ఎత్తులను చిత్తుచేశామన్నారు.విభజన సమయంలో ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిదులు ఇచ్చేందుకు ఒప్పుకుని ఇప్పటికీ 9 వేల కోట్లు కట్టబెట్టిందన్నారు. అదే తరహాలో మన కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు తెచ్చేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. విలేకరుల సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మేయర్ రవీందర్‌సింగ్, డిప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేశ్, గ్రంథాలయ చైర్మన్ రవీందర్‌రెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ చైర్మన్ అక్బర్‌హుస్సేన్ పాల్గొన్నారు. -
గ్యాస్ కనెక్షన్లు పెంచండి: ఎంపీ వినోద్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ కనెక్షన్ల మంజూరు సంఖ్యను పెంచాల్సిందిగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌కు ఎంపీ వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో ఆయనను కలసిన వినోద్ వినతిపత్రాన్ని సమర్పించారు. అలాగే గ్యాస్ డీలర్లకు ఇస్తున్న కమీషన్‌ను పెంచాలని, వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. తెలంగాణలోని గ్రామీణ పాంత్రాల్లో గ్యాస్ సరఫరాకు వీలుగా రాష్ట్ర ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం వినోద్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రదాన్‌ను కలసిన వారిలో గ్యాస్ డీలర్ల సమాఖ్య అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు దీపక్‌సింగ్ గెహ్లాట్ తదితరులు ఉన్నారు. -
ఎల్ఎండీ, మిడ్‌మానేరు కట్టిందెవరూ?
ఎంపీ వినోద్‌కుమార్‌పై జీవన్‌రెడ్డి ఫైర్ సాక్షి, జగిత్యాల: కరీంనగర్ ఎంపీ బి. వినోద్‌కుమార్‌పై సీఎల్పీ ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రూ. కోట్లు వృథా అయ్యాయని.. ఇలా చేస్తే ఇతర దేశాల్లో ఉరి తీసేవారని.. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు సాగు నీరందుతుందంటూ’ఎంపీ కవితతో కలసి ఆదివారం వినోద్‌కుమార్ చేసిన వ్యాఖ్యలపై జీవన్‌రెడ్డి స్పందించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఎల్ఎండీ, మిడ్‌మానేరు ఎవరి హయాంలో పూర్తయ్యాయి? 2004–09 వరకు వైఎస్ హయాంలో వరద కాలువ ప్రవహించింది నిజం కాదా? మిడ్‌మానేరు ప్రాజెక్టు పూర్తయి మూడేళ్లు గడుస్తున్నా ఇంతవరకు సాగునీరివ్వని దయనీయ స్థితి మీ ప్రభుత్వానిది కాదా?’ అని ప్రశ్నించారు. శాంతిగా ఉన్న సిరిసిల్ల జిల్లాను అప్రకటిత కల్లోలిత ప్రాంతంగా మార్చింది టీఆర్ఎస్సే అన్నారు. ప్రచార్భాటాలకే పరిమితమైన టీఆర్ఎస్ నేతలు ఎన్ని విశ్వప్రయత్నాలు చేసినా.. జగిత్యాలలో మాత్రం మాయ చేయలేరని స్పష్టంచేశారు. ప్రచారార్భాటాలకే పరిమితమైన టీఆర్ఎస్ నేతలు ఎన్ని విశ్వప్రయత్నాలు చేసిన జగిత్యాలలో మాత్రం మాయ చేయలేరని స్పష్టం చేశారు.