పార్లమెంటు ద్వారం వద్ద ఆందోళన చేస్తున్న టీఆర్‌ఎస్ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: తమ న్యాయమైన డిమాండ్లపై హామీ ఇస్తే సభలో కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నామని టీఆర్‌ఎస్ ప్రకటించింది. సోమవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమై, వాయిదా పడిన సందర్భంలో టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఎంపీలు ఎ.పి.జితేందర్‌రెడ్డి, బి.వినోద్‌కుమార్, సీతారాం నాయక్, బూర నర్సయ్య గౌడ్, నగేశ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బీబీ పాటిల్ పాల్గొన్నారు. ధర్నా వద్ద టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘మా డిమాండ్లను పార్లమెంటు ముందు పెట్టాం. రిజర్వేషన్లను రాష్ట్రాలకు వదిలిపెట్టాలి. రాష్ట్రాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాష్ట్రాలు పనిచేస్తాయి. కేంద్రంలో ఉన్న ఉద్యోగాల కోసంగానీ, విద్యా శాఖ లో కానీ రిజర్వేషన్లు అడగడం లేదు. మా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు, విద్యావకాశాల్లో మాత్రమే రిజర్వే షన్లు పెంచుకుంటాం. ఆ దిశగా బిల్లు తెచ్చాం. 9వ షెడ్యూలులో పొందుపరచాలని అడిగాం. నాలుగేళ్లుగా వేచిచూస్తున్నాం. కానీ ఇప్పటివరకు కేంద్రం ఏ ఒక్క అంశాన్ని అమలుచేయలేదు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలు చేయలేదు. ఎయిమ్స్, బయ్యారం స్టీలు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం.. ఏవీ ఇవ్వలేదు. హైకోర్టు విభజించలేదు. అందుకే రెండు వారాలుగా పోరాడుతున్నాం. కచ్చితమైన హామీ వచ్చే వరకు పోరాటం చేస్తాం’ అని స్పష్టం చేశారు.
ఆందోళన కొనసాగుతుంది: జితేందర్‌రెడ్డి
కేంద్రంపై పెట్టిన అవిశ్వాస తీర్మానాలు సభ ముందుకు వచ్చేలా మీరు మద్దతుగా నిలబడితే ఈ అంశాలన్నీ చర్చకు వస్తాయి కదా అని మీడియా ప్రశ్నించగా ‘రెండు వారాలుగా మా డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్నాం. డిమాండ్లను హౌస్‌లో పెట్టి పరిష్కరించుకుంటాం. ఎవ్వరినీ అనుసరించాల్సిన అవసరం మాకు లేదు. సరైన హామీ లభించే వరకు ఆందోళన కొనసాగుతుంది’అని జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పరోక్షంగా బీజేపీకి సహకరిస్తోందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయని ప్రస్తావించగా ‘వాళ్లకు వాళ్లు ఆరోపణలు చేసుకోవడం కాదు. ఈరోజు వాళ్లకు అవిశ్వాస తీర్మానం పెట్టాలని మనసొచ్చింది. మా ప్రజల ఆకాంక్షలు, డిమాండ్లు మాకు ముఖ్యం. మా డిమాండ్లపై వాళ్లు వాగ్దానం చేసి మమ్మల్ని కూర్చోబెడితే కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాం’అని స్పష్టం చేశారు.
చర్చ జరిగితే మాట్లాడుతాం: వినోద్
ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ ‘16వ లోక్‌సభ ప్రారంభమైన మొదటి రోజు నుంచి పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీస్తున్నాం. ఏపీలోకి 7 మండలాలు పోయిన రోజు నుంచి ఆందోళన చేస్తున్నాం. బీజేపీని నిలదీస్తున్న పార్టీల్లో టీఆర్‌ఎస్ మొదటి వరసలో ఉంది. రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం పెంచుతూ తెచ్చిన బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేర్చాలని మేం బడ్జెట్ మలివిడత సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచీ పోరాటం చేస్తున్నాం. అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ అనుమతిస్తే చర్చలో కూడా మేం మాట్లాడుతాం. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను లేవనెత్తుతాం. టీడీపీ ఇప్పటికీ విభజన అశాస్త్రీయంగా జరిగిందని మాట్లాడుతోంది. వాళ్ల హక్కుల గురించి మాట్లాడితే మద్దతు ఇస్తాం. కానీ, ఇప్పటికీ విభజ నను వ్యతిరేకించేలా స్వరం వినిపిస్తోంది. కాం గ్రెస్ నేతల గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. యూపీలో రెండు ప్రాంతీయ పార్టీలు గెలిస్తే వీళ్లు సంబరాలు చేసుకున్నారు’అని అన్నారు.
మేం ఎవరిపై కేసు పెట్టాలి: సీతారాంనాయక్
ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ ‘గిరిజనులు, దళితుల మనోభావాలను కించపరిచినవారిపై అట్రా సిటీ కేసు పెట్టే హక్కును రాజ్యాంగం కల్పించింది. మేం నెలరోజులుగా గిరిజనుల రిజర్వేషన్లపై మాట్లా డుతున్నా పట్టించుకోనప్పుడు ఎవరిపై కేసు పెట్టాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ, ఎస్టీ జనాభా లేనిపక్షంలో రిజర్వేషన్లు కొనసాగించేవారా? నా ఉద్దేశం ఎవరిపైనో కేసులు పెట్టా లని కాదు. ఇంతమంది ఎంపీలం ఆందోళన పట్టించుకోకుంటే ఎవరిని దోషులను చేయాలి’ అని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment