ఆ ఇద్దరు సీనియర్లు.. టీఆర్‌ఎస్ లోకసభ పక్ష నేతగా పని చేసిన అనుభవం ఒకరిది. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర మాజీ మంత్రిగా సుదీర్ఘ అనుభవం మరొకరిది. రాజకీయాల్లో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఇరువురూ తమ పార్టీలను వీడి గత లోక్‌సభ ఎన్నికల ముందు కాషాయ కండువా కప్పుకున్నారు. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ పార్టీని బూత్ స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. అందులో ఒకరు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మరొకరు మాజీ మంత్రి డీకే అరుణ.
సాక్షి, మహబూబ్‌నగర్: గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో సీనియర్లు జితేందర్‌రెడ్డి, డీకే అరుణలు బీజేపీలో చేరడంతో ఆ పార్టీకి బాగా కలిసొచ్చేందనే చెప్పాలి. రోజురోజుకు బలోపేతమవుతోన్న ఆ పార్టీ పలు పట్టణాల్లో అధికార టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టేలా తయారైంది. అయితే.. ఈనెల 22న జరగనున్న ‘పుర’పోరు వీరికి ప్రతిష్టాత్మకంగా మారింది. వీరిద్దరి సారథ్యంలో బీజేపీ ఎన్ని పీఠాలు కైవసం చేసుకుంటుందో అనే చర్చ ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.
ఇందులో భాగంగా ఇప్పటికే ఇరువురు నేతలు మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, నారాయణపేట జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి, వనపర్తి జిల్లా అధ్యక్షుడు అయ్యగారి ప్రభాకర్, గద్వాల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డిలను సమన్వయం చేసుకుంటూ బీజేపీ అభ్యర్ధిత్వాల ఖరారుతో పాటు ప్రచార వ్యూహాలపై సమీక్షలు నిర్వహించుకుంటున్నారు.
టార్గెట్ ‘టెన్’..
మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ ఈసారి ఎలాగైనా కనీసం పది పుర పీఠాలు కైవసం చేసుకోవాలనే యోచనలో ఉంది. ఈ క్రమంలో అధిష్టానం గెలుపు బాధ్యతను డీకే అరుణ, జితేందర్‌రెడ్డిలకే ప్రధానంగా అప్పగించింది. ఇద్దరు సీనియర్లు కావడం ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో చెప్పుకోదగ్గ నాయకులు పార్టీలో లేకపోవడంతో ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలతో పాటు అభ్యర్థిత్వాల ఖరారు విషయంలోనూ వీరినే ముందుంచింది.
ఈ ‘పుర’ ఫలితాలపైనే ఇరువురు నేతల రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉందనే ప్రచారమూ కాషాయ శ్రేణుల్లో జరుగుతోంది. ఆశించిన ఫలితాలు సాధిస్తేనే కేంద్రంలో ఉన్న బీజేపీ నేతల ఆశీస్సులు అందే పరిస్థితి నెలకొంది. దీంతో ఈ ఎన్నికలు ఇరువురు నేతలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ క్రమంలో డీకే అరుణ తన సొంత జిల్లా కేంద్రమైన గద్వాలతో పాటు అలంపూర్, వడ్డేపల్లి, అయిజ, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకున్నారు. దాదాపు అన్ని చోట్లా టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఢీ కొనే స్థాయిలో బీజేపీ అభ్యర్థిత్వాలు ఖరారుకు కసరత్తు చేస్తున్నారు. వీటితో పాటు ఉమ్మడి జిల్లాలో మిగతా మున్సిపాలిటీల్లోనూ ప్రచారం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
అయితే ప్రచారానికి ఐదు రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఈ నెల 16నుంచి తనకు కేటాయించిన మున్సిపాలిటీల్లో విస్తృత ప్రచారం చేసి.. మిగతా చోట్ల సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఇటు జితేందర్‌రెడ్డి మహబూబ్‌నగర్, నారాయణపేట, మక్తల్, భూత్పూర్, కోస్గి మున్సిపాలిటీలపై కాషాయం జెండా ఎగురవేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ మహబూబ్‌నగర్, గద్వాల, నారాయణపేట, మక్తల్, భూత్పూర్, అమరచింత, ఆత్మకూరు, కోస్గిలో బలంగా ఉంది. ఇతర మున్సిపాలిటీలను అటుంచితే.. మహబూబ్‌నగర్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న స్థానిక మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను ఢీ కొట్టడం జితేందర్‌రెడ్డికి సవాల్‌గా మారింది.
ఇటు గద్వాలకు చెందిన మాజీ మంత్రి డీకే అరుణకు స్థానిక టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కూడా గట్టిపోటీ ఇస్తున్నారు. దీంతో ఆ పుర పీఠంపై గులాబీ జెండా ఎగురుతుందా? కాషాయం జెండా ఎగురుతుందా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇదీలావుంటే... 1999లోనే బీజేపీ నుంచి మహబూబ్‌నగర్ లోక్‌సభ సభ్యుడిగా గెలిచిన జితేందర్‌రెడ్డి 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి గెలుపొందారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇటు 1996 నుంచి రాజకీయాల్లో ఉన్న డీకే అరుణకు ఉమ్మడి జిల్లాలో బలమైన కేడర్ ఉంది.
చదవండి: అలాంటి వారిని గుర్తించలేరా? : డీకే అరుణ
Comments
Please login to add a commentAdd a comment