నారాయణపేట: డీకే అరుణ ప్రభావం పడనుందా? | Mahabubnagar: Who Next Incumbent in Narayanpet Constituency | Sakshi
Sakshi News home page

నారాయణపేట: డీకే అరుణ ప్రభావం పడనుందా?

Published Thu, Aug 10 2023 1:32 PM | Last Updated on Tue, Aug 29 2023 10:40 AM

Mahabubnagar: Who Next Incumbent in Narayanpet Constituency - Sakshi

నారాయణపేట నియోజకవర్గంలో ఈ సారి త్రిముఖపోటీ అనివార్యం కానుంది. 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్దిగా పోటీచేసిన రాజేందర్‌రెడ్డి గెలిచారు. తర్వాత ఆయన టీఆర్ఎస్‌లో చేరారు. 2018లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మరోసారి బీఆర్‌ఎస్‌ తరపున ఆయనే ఇక్కడి నుంచి పోటీచేసే అవకాశాలే ఉన్నాయి.

అధికార పార్టీపై అసంతృప్తి.. అదే బీజేపీకి బలం కానుంది!

అయితే అభివృద్ది విషయంలో తన వంతు కృషి చేశారు. నారాయణపేటను నూతన జిల్లాగా ఏర్పాటు చేయించారు. జిల్లా ఆస్పత్రి కూడ వచ్చింది. జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ పూర్తి చేయించారు. అయితే నారాయణపేటకు సాగునీటిని అందించాలనే ఉద్దేశ్యంతో ఇచ్చిన జీఓ 69ని అమలు చేయించటంలో ఆయన విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. జాయమ్మ చెరువు రిజర్వాయర్ చేస్తామన్న హమీ కూడ నెరవేరలేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతానికి సాగునీటిని అందిస్తామన్న హమీకూడ నెరవేరకపోవటంతో ఇక్కడి జనం అసంతృప్తితో ఉన్నారు. అయితే నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండరనే  ఆరోపణ ఉంది. పార్టీ కార్యకర్తలతో  నేతలతో ముక్కుసూటిగా మాట్లాడుతుండటంతో క్యాడర్లో నైరాశ్యం ఉంది. ముఖ్యంగా బీజేపీ ఇక్కడ బలంగా ఉండటం కొంత మైనస్‌గా మారే అవకాశం ఉంది.
తన వర్గీయులకే పెద్దపీఠ వేస్తారనే ఆరోపణలు ఉన్నాయి.

కాంగ్రెస్‌పార్టీ ఇక్కడ గడచిన రెండు ఎన్నికల్లో ఓటమి పాలై మూడో స్దానానికే పరిమితమయ్యింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి శివకుమార్‌రెడ్డి 2014లో పోటీ చేసి రెండవస్దానంలో నిలిచారు. 2018లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరిస్తే బీఎల్ఎఫ్ పార్టీ నుంచి పోటీ చేసి మళ్లీ రెండవస్దానంలో నిలిచారు. తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈసారి ఆయన కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఆయనపై ఇటీవల ఓ మహిళ వ్యక్తిగతమైన ఆరోపణలు  చేయటం,కేసు నమోదు కావటం కొంత ఇబ్బందిగా మారింది. ఆయనను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి సైతం తప్పించారు. మాస్ ఫాలోయింగ్ ఉండటం ఈయనకు కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత సైతం ప్లస్ అవుతుందని అంటున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఈసారి పోటీ చేయాలని వ్యాపారవేత్త సుజేంద్ర శెట్టి ఆసక్తి కనబరుస్తున్నారు.

డీకే అరుణ ప్రభావం బీజేపీకి కలిసోచ్చేనా?

ఇక్కడ బీజేపీకి మొదటి నుంచి కొంత క్యాడర్ ఉంది. 2014లో రతంగ్ పాండు రెడ్డి పొత్తుల్లో భాగంగా టీడీపీకి సీటు కేటాయించటంతో ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచి 23 వేల ఓట్లు సాధించారు. 2018లో బీజేపీ నుంచి పోటీ చేసిన ఆయన 20 వేల ఓట్లు సాధించారు. అయితే వ్యక్తిగతంగా సౌమ్యుడిగా పేరున్న రతంగ్ పాండు రెడ్డిపై సానుభూతి కూడ ఉంది. ఇటీవల బండి సంజయ్‌ మార్క్‌ నిర్వహించిన ప్రజా సంగ్రామయాత్ర, బహిరంగ సభ విజయవంతం కావటంతో ఈసారి బీజేపీ గెలుస్తుందనే ధీమా ఆపార్టీ నేతల్లో కనిపిస్తుంది. బీసీలకు కేటాయించాలని ఆలోచిస్తే పార్టీ సీనియర్ నాయకుడు నాగూరావు నామాజీ, సత్యయాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ డీకే అరుణ ప్రభావం కూడ  ఉండే అవకాశం ఉండటం కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు.

నియోజకవర్గం భౌగోళిక పరిస్థితులు: కర్ణాటక సరిహద్దులో ఉన్న నియోజకవర్గం నారాయణపేట 2019 లో నూతన జిల్లాగా ఏర్పడింది, నారాయణపేట నియోజకవర్గంలోని ధన్వాడ, మరికల్ మండలాల్లోని కొన్ని గ్రామాలు  మక్తల్ నియోజకవర్గానికి వెళ్లాయి.నారాయణ చేనేత మరియు పట్టు చీరలకు ప్రసిద్ది,ఇక్కడి బంగారపు ఆభరణకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సాగునీరు లేకపోవటంతో  వ్యవసాయభూముల బీళ్లుగా మారాయి.ఉపాధి లేక జనాలు ఇక్కడి నుంచి పెద్దమొత్తంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస పోతున్నారు. ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటి మున్సిపాలిటీ నారాయణపేటలో ఏర్పాటయ్యింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement