Mahbubnagar Common Districts
-
చూస్తూ ఊరుకోం.. యుద్ధం చేస్తాం: కేసీఆర్
సాక్షి,మహబూబ్‌నగర్: పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వమని బతిమాలినా ప్రధాని పట్టించుకోలేదని అందుకు బీజేపీకి ఓటు వేయాలా అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌లో శుక్రవారం(ఏప్రిల్26) జరిగిన బస్సు యాత్ర రోడ్‌షోలో కేసీఆర్ మాట్లాడారు. కేెంద్రం నల్ల చట్టాలు తెచ్చి రైతులను మోసం చేసిందని విమర్శించారు. ‘కొత్త రాష్ట్రానికి ఒక్క నవోదయ పాఠశాల బీజేపీ ఇవ్వలేదు. మోటర్లకు మీటర్లు పెట్టాలని మోదీ చెప్పినా నేను అంగీకరించలేదు. బడేబాయ్..మోడీ..చోటా భాయ్ రేవంత్ రెడ్డికి ఓటు వేసినా వేస్ట్. రైతుల మోటార్లకు మీటర్లు కచ్చితంగా పెడతారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం లేదు. తెచ్చిన తెలంగాణ కళ్లముందే నాశనం అయితుంటే చూసి ఊర్కోం. యుద్ధం చేస్తాం. బీజేపీ, కాంగ్రెస్ రెండు ఏకమై ప్రాంతీయపార్టీలను దెబ్బతీయాలని చూస్తున్నాయి.దేవుని పేరు చెప్పి ఒకరు..దేవుని మీద ఒట్టు పెట్టి ఒకరు ఓటు అడుగుతున్నారు. రాష్ట్రంలో రైతుబందు,రైతుబీమా ఉంటుందో లేదో తెలియని అయోమయ పరిస్దితి నెలకొంది. అందరం ఏకమై ప్రభుత్వం మెడలు వంచాలి’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. -
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎన్నికలు ఫలితాలు 2023 లైవ్: భారీ మెజారిటీతో రేవంత్‌రెడ్డి విజయం
జడ్చర్లలో కాంగ్రెస్ అభ్యర్ధి అనిరుధ్ రెడ్డి గెలుపు మక్తల్‌లో కాంగ్రెస్ అభ్యర్ధి వాకిటి శ్రీహరి గెలుపు దేవరకద్రలో కాంగ్రెస్ అభ్యర్ధి మధుసూధన్ రెడ్డి గెలుపు నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ అభ్యర్ధి కే. రాజేశ్ రెడ్డి గెలుపు 32000 పైచిలుకు ఓట్లతో కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి గెలుపు గాంధీభవన్‌కు బయలుదేరిన రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి భద్రత పెంపు, రేవంత్‌రెడ్డి ఇంటికి డీజీపీ అంజనీకుమార్ కొడంగల్‌లో 23 వేల లీడ్‌లో రేవంత్‌రెడ్డి బర్రెలక్కకు కొల్లాపూర్‌లో ఆరో రౌండ్ పూర్తయ్యాక 1923 ఓట్లు గద్వాలలో 8వేల ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొడంగల్‌లో తొమ్మిదో రౌండ్ ముగిసేసరికి.. రేవంత్‌రెడ్డికి 12,060 ఓట్ల ఆధిక్యం కొడంగల్‌లో మూడో రౌండ్లో రేవంత్‌రెడ్డికి 4,389 ఓట్ల ఆధిక్యం జడ్చర్ల, మక్తల్‌లో కాంగ్రెస్ ఆధిక్యం కొల్లాపూర్‌లో ఇండిపెండెంట్ అభ్యర్ధి బర్రెలక్క ముందంజ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా అభ్యర్ధుల గెలుపోటముల వివరాలు ఈ క్రింది పట్టికలో చూడవచ్చు. క్ర.సం నియోజకవర్గం భారాస కాంగ్రెస్ భాజపా ఆధిక్యం గెలుపు 1 మహబూబ్ నగర్ వి.శ్రీనివాస్‌గౌడ్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి మిథున్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ 2 జడ్చర్ల చర్లకోల లక్ష్మారెడ్డి అనిరుధ్ రెడ్డి చిత్తరంజన్ దాస్ కాంగ్రెస్ కాంగ్రెస్ 3 దేవరకద్ర ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మధుసూధన్ రెడ్డి కొండా ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ 4 కొల్లాపూర్ బీరం హర్షవర్ధన్‌రెడ్డి జూపల్లి కృష్ణారావు ఆల్లెని సుధాకర్ రావు కాంగ్రెస్ కాంగ్రెస్ 5 నాగర్‌కర్నూల్ మర్రి జనార్దన్‌రెడ్డి కే. రాజేశ్ రెడ్డి దిలీప్ చారి కాంగ్రెస్ కాంగ్రెస్ 6 అచ్చంపేట (SC) గువ్వల బాలరాజు చిక్కుడు వంశీ కృష్ణ దేవని సతీష్ మాదిగ కాంగ్రెస్ కాంగ్రెస్ 7 వనపర్తి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి జి చిన్నారెడ్డి అశ్వత్థామ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ 8 గద్వాల బండ్ల కృష్ణమోహన్డ్డి సరితా తిరుపతయ్య బోయ శివ భారాస భారాస 9 అలంపూర్ (SC) విజేయుడు ఎస్ఏ. సంపత్ కుమార్ రాజగోపాల్ భారాస భారాస 10 నారాయణపేట ఎస్ రాజేందర్ రెడ్డి డా. పర్ణికా చిట్టెం రెడ్డి కేఆర్ పాండురెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ 11 కొడంగల్ పట్నం నరేందర్‌రెడ్డి రేవంత్‌రెడ్డి బంతు రమేష్‌కుమార్ కాంగ్రెస్ కాంగ్రెస్ 12 షాద్ నగర్ అంజయ్య యాదవ్ యెల్గనమోని శంకరయ్య అందె బాబయ్య కాంగ్రెస్ కాంగ్రెస్ 13 కల్వకుర్తి జైపాల్ యాదవ్ కశిరెడ్డి నారాయణరెడ్డి తల్లోజు ఆచారి కాంగ్రెస్ కాంగ్రెస్ 14 మక్తల్ చిట్టెం రామ్మోహన్ రెడ్డి వాకిటి శ్రీహరి జలంధర్ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ -
2023 జడ్చర్ల ఎలక్షన్స్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వీళ్ళే
ఉదయం 9గం వరకు జరిగిన పోలింగ్ శాతం: 12% నియోజకవర్గం: జడ్చర్ల జిల్లా: మహబూబ్ నగర్ లోక్‌సభ పరిధి: మహబూబ్ నగర్ రాష్ట్రం: తెలంగాణ మొత్తం ఓటర్ల సంఖ్య: 212,655 పురుషులు: 106,922 మహిళలు : 105,469 ఈ నియోజకవర్గం పరిధిలో నాలుగు మండలాలు ఉన్నాయి: 1. జడ్చర్ల 2. నవాబుపేట 3. బాలానగర్ 4. మిడ్జిల్ 2023లో పోటీ చేస్తున్న అభ్యర్థులు: 1. చిత్తరంజన్ దాస్ - BJP 2. జె.అనిరుధ్ రెడ్డి - INC 3. చర్లకోల లక్ష్మ ర్‌రెడ్డి - BRS నియోజకవర్గం ముఖచిత్రం: ఈ నియోజకర్గం మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంది. 2007లో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జడ్చర్ల నియోజకవర్గం 4 మండలాలుగా విభజింపబడినది. పునర్వవస్థీకరణ ఫలితంగా షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న బాలానగర్, నవాబ్‌పేట మండలాలు జడ్చర్ల నియోజకవర్గంలోకి, జడ్చర్లలో ఉన్న తిమ్మాజీపేట మండలం నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి మార్చబడినది. జడ్చర్ల నియోజకవర్గానికి ఇప్పటివరకు రెండు ఉప ఎన్నికలతో సహా 14 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, కాంగ్రెస్(ఐ)లు కలిసి నాలుగు సార్లు, తెలుగుదేశం పార్టీ ఆరుసార్లు టీఆర్ఎస్ రెండుసార్లు గెలుపొందాయి. ఇక్కడి నుంచి ఇండిపెండెంట్లు కూడా రెండుసార్లు ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి అత్యధికంగా మూడుసార్లు ఎం. చంద్రశేఖర్ టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన మల్లు రవి కొంతకాలం ప్రభుత్వ విప్ పదవి నిర్వహించారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన లక్ష్మారెడ్డికి తెలంగాణ తొలి మంత్రివర్గంలో స్థానం లభించింది. ఈ నియోజకవర్గం మహబూబ్‌నగర్ లోక్‌సభ పరిధిలోకి వస్తుంది. 2023లో జరగబోయే ఎన్నికలలో జడ్చర్ల నియోజకవర్గంలో ప్రధానంగా కాంగ్రెస్, బి.ఆర్.ఎస్‌ల మధ్యే పోటీ జరగనున్నది. ఇక్కడ బి.జే.పి నామమాత్రంగానే పోటీలో ఉంది. 2018లో మంత్రి పదవిలో ఉంటూ టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన డాక్టర్ సి.లక్ష్మారెడ్డి మూడోసారి విజయం సాదించారు. కాని 2018లో గెలిచిన తర్వాత ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడం విశేషం. లక్ష్మారెడ్డి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ది, మాజీ ఎమ్.పి డాక్టర్ మల్లు రవిపై 45082 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. లక్ష్మారెడ్డి ఇంతకుముందు రెండుసార్లు ఇక్కడ నుంచే గెలుపొందారు. లక్ష్మారెడ్డికి 94598 ఓట్లు రాగా, మల్లు రవికి 49516 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన మదుసూదన్ యాదవ్‌కు 3600 ఓట్లు మాత్రమే వచ్చాయి. సి. లక్ష్మారెడ్డి రెండువేల నాలుగులో టిఆర్ఎస్ పక్షాన గెలిచినా, ఆ తర్వాత పదవికి రాజీనామా చేసి 2008 ఉప ఎన్నికలో పోటీచేసి ఓటమి పాలయ్యారు. రెండువేల పద్నాలుగులో లక్ష్మారెడ్డి తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్ ఐ పార్టీ సీనియర్ నేత డాక్టర్ మల్లు రవిపై 14734 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. టిడిపి-బిజెపి కూటమి పక్షాన పోటీచేసిన సిటింగ్ ఎమ్మెల్యే ఎమ్.చంద్రశేఖర్‌కు 11465 ఓట్లు మాత్రమే వచ్చి ఓటమి పాలయ్యారు. మల్లు రవి 2008లో జరిగిన ఉపఎన్నికలో గెలిచి కొంతకాలం విప్ పదవిని నిర్వహించారు. అంతకు ముందు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అదికార ప్రతినిధిగా కూడా ఉన్నారు. నాగర్ కర్నూల్ ఎమ్.పిగా కూడా రెండుసార్లు ఎన్నికయ్యారు. అంతకు ముందు ఆయన సోదరుడు మల్లు అనంతరాములు కూడా నాగర్‌కర్నూల్ నుంచి ఎమ్.పిగా గెలుపొందారు. అనంత రాములు పీసీసీ అధ్యకక్షుడిగా కూడా పనిచేశారు. మల్లురవి మరో సోదరుడు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా మధిర నుంచి 2009, 2014, 2018లలో గెలుపొందారు. ఛీఫ్ విప్, ఉప సభాపతి పదవులను నిర్వహించారు. రవికి మాజీ ఉప ముఖ్యమంత్రి, దివంగత నేత కోనేరు రంగారావు మామ అవుతారు. జడ్చర్లలో కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి నాలుగుసార్లు, తెలుగుదేశం పార్టీ ఆరుసార్లు, టిఆర్ఎస్ మూడుసార్లు గెలిచాయి. ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా గెలిచారు. 1994లో ఇక్కడ గెలిచిన ఎమ్. సత్యనారాయణ హత్యకు గురి అయ్యారు. ఆ తర్వాత 1996లో జరిగిన ఉప ఎన్నికలోను, 1999లోను, తిరిగి 2009లోను సత్యనారాయణ సోదరుడు ఎమ్. చంద్రశేఖర్ గెలుపొందారు. ఇక్కడ నుంచి కాంగ్రెస్ నేత ఎన్.నరసప్ప, టిడిపి నేత కృష్ణారెడ్డి రెండేసి సార్లు గెలిచారు. జడ్చర్లలో ఏడుసార్లు రెడ్డి నేతలు, ఏడుసార్లు బిసి నేతలు (ప్రధానంగా ముదిరాజ్ వర్గం) గెలుపొందారు. ఇది జనరల్ సీటు అయినా ఉప ఎన్నికలో ఎస్.సి.నేత అయిన మల్లురవి పోటీచేసి గెలిచారు.మూడుసార్లు ఇతరులు గెలిచారు. -
వనపర్తి: కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు, కానీ..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి ఓటర్లు విలక్షణ తీర్పు ఇస్తారు. వనపర్తి నియోజకవర్గంలో పార్టీ ఏదైనా మేధావులే అభ్యర్దులుగా పోటీ చేస్తున్నారు. గెలిచిన ప్రతివారు అందరు ఆయా పార్టీల్లో అధినేతలకు సన్నిహితంగా ఉండటంతో నియోజకవర్గ అభివృద్దికి ఎవరిస్దాయిలో వారు పనిచేశారు. అన్ని పార్టీల్లో అసంతృప్తి రాగాలు వినిపిస్తున్నాయి. దూసుకుపోతున్న మంత్రి.. వణుకుతున్న ప్రతిపక్షాలు ప్రస్తుతం మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తి నియోజకవర్గంలో తనదైన పనితనంతో దూసుకుపోతున్నారు. దీంతో ప్రతిపక్షాలు ఆయనను తట్టుకోలేని పరిస్ధితి నెలకొంది. తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్‌కు సన్నిహితంగా ఉన్న నిరంజన్‌రెడ్డి 2014 ఎన్నికల్లో ఓడిపోయినా అయనను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారు. 2018లో నిరంజన్‌రెడ్డి విజయం సాధించారు. వ్యవసాయశాఖ మంత్రి అయ్యారు. ఓడినా, గెలిచినా ప్రజల మధ్యలో ఉండి నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా సాగునీరు, వైద్య, విద్యారంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తున్నారు. సాగునీరు తీసుకురావటంలో ఆయన చేసిన కృషికి ఇక్కడ జనం ఆయనను నీళ్ల నిరంజన్‌రెడ్డిగా పిలుస్తారు. కేవలం ఓకే నియోజకవర్గం మాత్రమే పరిధి ఉన్న వనపర్తిని ప్రత్యేక జిల్లా చేయించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, వేరుశెనగ పరిశోధనా కేంద్రం, ఫిషరీ కళాశాల వంటి ప్రతిష్టాత్మక సంస్ధలను వనపర్తికి తీసుకొచ్చారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పట్టణంలోని రహదారుల విస్తరణ చేయిస్తున్నారు. రైతుల ఆందోళన.. అధికార పార్టీకి మైనస్! కానీ పనులు నత్తనడకన సాగటంపై విమర్శలు వస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా తన పరిధిలోని ఏదుల రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తయ్యేలా కృషి చేశారు. కానీ మిగిలిన ప్రాంతంలో పనులు జరగని కారణంగా నీటిని మాత్రం తరలించలేకపోవటంతో మైనస్‌గా మారింది. ఏళ్ల క్రితం తాము భూములు, ఇళ్లు కోల్పోయినా ఇంకా పునరావాసం దక్కలేదని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. సాగునీటికోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నామని ఏదుల రిజర్వాయర్ పరిధిలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫి, డబుల్బెడ్రూం ఇళ్ల విషయంలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కొంత మైనస్ కానుంది. స్వంత పార్టీకి చెందిన పలువురు నేతలు, అనుచరులు, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీని వీడి మంత్రిపై తిరుగుబాటు చేశారు. భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. భూ సమస్యల్లో తనవారికి అనుకూలంగా పనిచేస్తున్నాడనే ప్రచారం సాగుతుంది. అనుచరులు మంత్రి పేరు చెప్పి సెటిల్మెంట్లకు దిగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యనేతలు పార్టీని వీడటం, ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఉండటం మంత్రికి కొంత ప్రతికూల అంశాలుగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి పట్టు.. మొదటినుంచి వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. 2014లో టీఆర్ఎస్ హవా కొనసాగినా ఇక్కడ మాత్రం కాంగ్రెస్ అభ్యర్దే విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ చిన్నారెడ్డి వనపర్తి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో నిరంజన్‌రెడ్డిని ఓడించిన చిన్నారెడ్డి 2018లో ఆయన చేతిలో ఓడిపోయారు. తర్వాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత చిన్నారెడ్డి నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్లో మంత్రి నిరంజన్‌రెడ్డి విభేదించిన ఎంపీపీలు మోగారెడ్డి, కిచ్చారెడ్డి తదితర నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. అయితే మోగారెడ్డి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలని భావిస్తూ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఆయనకు పోటీగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో సీట్ల పంచాయితీ నడుస్తోంది. అయితే చిన్నారెడ్డికి సీటు ఇస్తే తాము పనిచేసే పరిస్ధితి లేదని పలువురు నేతలు బాహాటంగానే అధిష్టానానికి తేల్చిచెప్పారు. సో ఇక్కడి సీటు కేటాయింపు పార్టీకి తలనొప్పిగా మారింది. వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతుంది. నియోజకవర్గంలో తరచు పర్యటిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాహుల్ భారత్ జోడో యాత్రలో సైతం శివసేనారెడ్డి ఉత్సహాంగా పాల్గొని తన వర్గీయులతో హడావిడి చేశారు. వయస్సు మీదపడిన చిన్నారెడ్డికి కాకుండా యువకుడికి సీటిస్తే కొంత మేలు జరిగే అవకాశం ఉంటుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. మరోనేత నాగం తిరుపతి రెడ్డి పోటీకి సై అంటున్నట్టు నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.కానీ చిన్నారెడ్డి మాత్రం తానే పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నారటా... దాంతో పార్టీలో నెలకొన్న గ్రూపు తగదాలు పార్టీకి తీవ్రంగా నష్టం కలిగించే అంశాలుగా ఉన్నాయి. ఇక్కడ బీజేపీకి బలమైన నాయకుడు లేడు. తెలంగాణలోని ఓ జిల్లాకు అడిషనల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న అధికారి ఈసారి వనపర్తి నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. ఆయనకు బీజేపీ గాలం వేసినట్టు తెలుస్తోంది. ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ మాజీ నాయకుడు అశ్వథామరెడ్డి సైతం బీజేపీ సీటు ఆశిస్తున్నారు.ఇక్కడ టీడీపీ కూడ గతంలో బలంగా ఉండేది.ఇక్కడి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఇప్పుడు పార్టీ క్యాడర్ అంతా టీఆర్ఎస్ లో చేరిన తర్వాత ఆయన రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నారు.ఆయన పార్టీ మారి వేరే పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు కూడ లేవు.కాని ఆయన ఎవరికైనా మద్దతు తెలిపితే కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది.మరి వచ్చే ఎన్నికల నాటికి ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. భౌగోళిక పరిస్థితులు: వ్యవసాయమే ప్రధానంగా జీవనం సాగించే జనం ఉన్నారు. పెద్దగా పరిశ్రమలు లేవు. నదులు: కృష్ణానది ప్రవహిస్తుంది ఆలయాలు: శ్రీరంగపురం రంగనాయక స్వామి ఆలయం పర్యాటకం: సంస్దానం పాలన సాగించిన వనపర్తి రాజా గారి బంగ్లా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్. రాజుల పాలనలోనే ఇక్కడ సస్తసముద్రాలు ఏర్పాటు చేసి జనాలకు తాగునీరు, రైతులకు సాగునీటి కోసం చర్యలు చేపట్టారు. -
నారాయణపేట: డీకే అరుణ ప్రభావం పడనుందా?
నారాయణపేట నియోజకవర్గంలో ఈ సారి త్రిముఖపోటీ అనివార్యం కానుంది. 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్దిగా పోటీచేసిన రాజేందర్‌రెడ్డి గెలిచారు. తర్వాత ఆయన టీఆర్ఎస్లో చేరారు. 2018లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మరోసారి బీఆర్ఎస్ తరపున ఆయనే ఇక్కడి నుంచి పోటీచేసే అవకాశాలే ఉన్నాయి. అధికార పార్టీపై అసంతృప్తి.. అదే బీజేపీకి బలం కానుంది! అయితే అభివృద్ది విషయంలో తన వంతు కృషి చేశారు. నారాయణపేటను నూతన జిల్లాగా ఏర్పాటు చేయించారు. జిల్లా ఆస్పత్రి కూడ వచ్చింది. జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ పూర్తి చేయించారు. అయితే నారాయణపేటకు సాగునీటిని అందించాలనే ఉద్దేశ్యంతో ఇచ్చిన జీఓ 69ని అమలు చేయించటంలో ఆయన విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. జాయమ్మ చెరువు రిజర్వాయర్ చేస్తామన్న హమీ కూడ నెరవేరలేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతానికి సాగునీటిని అందిస్తామన్న హమీకూడ నెరవేరకపోవటంతో ఇక్కడి జనం అసంతృప్తితో ఉన్నారు. అయితే నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండరనే ఆరోపణ ఉంది. పార్టీ కార్యకర్తలతో నేతలతో ముక్కుసూటిగా మాట్లాడుతుండటంతో క్యాడర్లో నైరాశ్యం ఉంది. ముఖ్యంగా బీజేపీ ఇక్కడ బలంగా ఉండటం కొంత మైనస్‌గా మారే అవకాశం ఉంది. తన వర్గీయులకే పెద్దపీఠ వేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్‌పార్టీ ఇక్కడ గడచిన రెండు ఎన్నికల్లో ఓటమి పాలై మూడో స్దానానికే పరిమితమయ్యింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి శివకుమార్‌రెడ్డి 2014లో పోటీ చేసి రెండవస్దానంలో నిలిచారు. 2018లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరిస్తే బీఎల్ఎఫ్ పార్టీ నుంచి పోటీ చేసి మళ్లీ రెండవస్దానంలో నిలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈసారి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఆయనపై ఇటీవల ఓ మహిళ వ్యక్తిగతమైన ఆరోపణలు చేయటం,కేసు నమోదు కావటం కొంత ఇబ్బందిగా మారింది. ఆయనను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి సైతం తప్పించారు. మాస్ ఫాలోయింగ్ ఉండటం ఈయనకు కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత సైతం ప్లస్ అవుతుందని అంటున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి పోటీ చేయాలని వ్యాపారవేత్త సుజేంద్ర శెట్టి ఆసక్తి కనబరుస్తున్నారు. డీకే అరుణ ప్రభావం బీజేపీకి కలిసోచ్చేనా? ఇక్కడ బీజేపీకి మొదటి నుంచి కొంత క్యాడర్ ఉంది. 2014లో రతంగ్ పాండు రెడ్డి పొత్తుల్లో భాగంగా టీడీపీకి సీటు కేటాయించటంతో ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచి 23 వేల ఓట్లు సాధించారు. 2018లో బీజేపీ నుంచి పోటీ చేసిన ఆయన 20 వేల ఓట్లు సాధించారు. అయితే వ్యక్తిగతంగా సౌమ్యుడిగా పేరున్న రతంగ్ పాండు రెడ్డిపై సానుభూతి కూడ ఉంది. ఇటీవల బండి సంజయ్ మార్క్ నిర్వహించిన ప్రజా సంగ్రామయాత్ర, బహిరంగ సభ విజయవంతం కావటంతో ఈసారి బీజేపీ గెలుస్తుందనే ధీమా ఆపార్టీ నేతల్లో కనిపిస్తుంది. బీసీలకు కేటాయించాలని ఆలోచిస్తే పార్టీ సీనియర్ నాయకుడు నాగూరావు నామాజీ, సత్యయాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ డీకే అరుణ ప్రభావం కూడ ఉండే అవకాశం ఉండటం కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. నియోజకవర్గం భౌగోళిక పరిస్థితులు: కర్ణాటక సరిహద్దులో ఉన్న నియోజకవర్గం నారాయణపేట 2019 లో నూతన జిల్లాగా ఏర్పడింది, నారాయణపేట నియోజకవర్గంలోని ధన్వాడ, మరికల్ మండలాల్లోని కొన్ని గ్రామాలు మక్తల్ నియోజకవర్గానికి వెళ్లాయి.నారాయణ చేనేత మరియు పట్టు చీరలకు ప్రసిద్ది,ఇక్కడి బంగారపు ఆభరణకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సాగునీరు లేకపోవటంతో వ్యవసాయభూముల బీళ్లుగా మారాయి.ఉపాధి లేక జనాలు ఇక్కడి నుంచి పెద్దమొత్తంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస పోతున్నారు. ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటి మున్సిపాలిటీ నారాయణపేటలో ఏర్పాటయ్యింది. -
నాగర్ కర్నూల్: అభివృద్ధి మంత్రం ‘ఉత్త’ ముచ్చటేనా?
నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్దానం వచ్చే ఎన్నికల్లో చాలా కీలకంగా మారుతుంది. ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి ఉండటంతో కొంత రాజకీయంగా ప్రాధాన్యత ఉంటుంది. గత ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన నాగం వచ్చే ఎన్నికల్లో గెలువాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. కానీ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌లో తిరిగి చేరుతుండటంతో కాంగ్రెస్ సీట్ల పంచాయితీ మొదలయ్యింది. దీంతో వచ్చే ఎన్నికలు ఇక్కడ పోటీ రసవత్తరంగా మారనుంది. జిల్లాను అభివృద్ధి చేసినా.. ఎమ్మెల్యేకు వ్యతిరేకత! 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పారిశ్రామికవేత్త మర్రి జనార్దన్‌రెడ్డి విజయం సాధించారు. ఈ సారి కూడా ఆయన పోటీ ఖరారైంది. రీసెంట్గా విడుదల చేసిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో మర్రికి టికెట్ దక్కింది. కాగా మర్రి జనార్దన్‌రెడ్డి నియోజకవర్గంలో మొదటి నుంచి ఎంజేఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవకార్యక్రమాలు చేపట్టారు. వందలాది మంది నిరుపేదలకు సామూహిక వివాహాలు చేయించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాగర్ కర్నూల్‌ను జిల్లాగా మార్చారు. జిల్లాకు మెడికల్ కళాశాల అగ్రికల్చర్ డిగ్రీ కళాశాల మంజూరు చేయించి ప్రారంభించారు. సొంత నిధులతో మూడు ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేటు స్దాయిలో తీర్చిదిద్దారు. దీంతో అభివృద్ది విషయంలో మిగిలిన నియోజకవర్గాల కంటే ఎక్కువ నిధులు తీసుకురావటంలో సఫలీకృతులవుతున్నారు. నల్లమట్టి అక్రమ వ్యాపారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. నల్లమట్టిలో వందల కోట్ల రూపాయల దందా సాగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గ్రామాల్లో తన అనుచరులు ముఖ్యులకే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నిర్మిస్తున్న వట్టెం రిజర్వాయర్‌లో నిర్వాసితులకు సకాలంలో సరైన పరిహారం ఇవ్వలేదనే అసంతృప్తితో నిర్వాసితులు ఉన్నారు. మాదిగ సామాజిక ఓట్లు ఇక్కడ అధికంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో వారి ప్రభావం ఉండనుంది. భూ నిర్వాసితుల ప్రభావం ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత కూడ తలనొప్పికానుంది. డబుల్బెడ్రూం ఇళ్లు, రుణమాఫి అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. పైకి బాగానే ఉన్నా.. నేతల మధ్య అంతర్గత విభేధాలు ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి మధ్య అంతర్గత విభేదాలు ఉండటంతో ఆయన పార్టీని వీడుతుండటం కొంతమైనస్గా మారే ప్రమాదం ఉంది. నియోజకవర్గంలో తన క్యాడర్‌ను ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేయటంతో పాటు పోలీసుల సహయంతో కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఎమ్మెల్సీ మీడియా ముందే ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన దామోధర్‌రెడ్డి 2018లో ఎమ్మెల్యేగా సీటు ఆశించి భంగపడ్డారు. ఆయనను సంప్రదించకుండానే నాగం జనార్దర్రెడ్డిని బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని సీటు ఖరారు చేయటంతో ఆగ్రహించిన దామోధర్‌రెడ్డి పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. ఆ ఎన్నికల్లో నాగం ఓడిపోయారు. ఇటీవల రెండవ సారి దామోధర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్సీ ప్రస్తావిస్తే దాన్ని ఎమ్మెల్యే వ్యతిరేకించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బయటికి బాగానే ఉన్నట్టు కనిపించినా లోలోపల వారి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఎమ్మెల్యేకు మైనస్‌గా మారే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ దామోధర్‌రెడ్డి కుమారుడు డాక్టర్ రాజేష్‌రెడ్డి హైదరాబాద్‌లో డెంటల్ డాక్టర్‌గా పనిచేస్తూ తెలంగాణ డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన కూడా నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్ నుంచి సీటు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్దికంగా బలంగా ఉన్నానని, అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్న తనని ప్రజలు మరోసారి గెలిపిస్తారని ఎమ్మెల్యే ధీమాగా ఉన్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత తనకు సన్నిహితంగా ఉండే ముఖ్య నేతలను లోక్‌సభకు పోటీ చేయించాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ ఉన్నారట.. ఆ లిస్టులో మర్రి జనార్దన్ రెడ్డి పేరు కూడ ఉందనే ప్రచారం జరుగుతుంది. ఆయన మల్కాజిగిరి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారనే గుసగసలు సైతం వినిపిస్తున్నాయి. ప్రతి పక్షాలు ఇక్కడ బలహీనంగా ఉండటం ఎమ్మెల్యే ఆర్దికంగా బలంగా ఉండటం కలిసివచ్చే అంశంగా కనిపిస్తోంది. ఇటీవల వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని మర్రి ప్రకటించటం చూస్తే గెలుపుపై ఆయన ఎంత ధీమాగా ఉన్నారో అర్దం అవుతుంది. కాగా అప్పుడే మర్రి జనార్దన్‌రెడ్డి తన నియోజకవర్గంలో మార్నింగ్ వాక్ పేరిట పర్యటిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు యత్నిస్తున్నారు. ఇబ్బందికరంగా కాంగ్రెస్ సీట్ల పంచాయతి.. కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి కొంత ఇబ్బందికరంగానే ఉంది. ముఖ్యంగా నాగం జనార్దన్‌రెడ్డి వయస్సు మీదపడటం.. కాంగ్రెస్ క్యాడర్లో చాలా మంది బీఆర్ఎస్ గూటికి చేరటం ఆయనకు సమస్యగా మారింది. ఎమ్మెల్సీ దామోధర్‌రెడ్డి ఆయన కుమారుడు డాక్టర్ రాజేష్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అయితే రాజేష్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారు. ఈసారి తనకే టికెట్ ఇవ్వాలని నాగం పట్టుబడుతుండటంతో సమస్య జఠిలమవుతుంది. నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు కొంతసానుకూల వాతావరణం వస్తుందన్న తరుణంలో సీట్ల పంచాయితీ కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. మరి అధిష్టానం నాగం జనార్థన్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోధర్‌రెడ్డి మధ్య సయోధ్య కుదుర్చితే తప్పా కుమ్మలాటలు ఉంటే అసలుకే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు. బీజేపీకి ఇక్కడ పెద్ద క్యాడర్ కూడ లేదు. ఆ పార్టీలో దిలీపాచారి, కొండమణేమ్మలు పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన దిలీపా చారికి డిపాజిట్ కూడ దక్కలేదు. కాంగ్రెస్ పార్టీలో జడ్పీటీసీగా పనిచేసిన కొండ మణేమ్మకు నాగం జనార్దన్‌రెడ్డితో పొసగక పోవటంతో పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆమె కూడ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని యోచిస్తుంది. ఆపార్టీ తన ప్రయత్నాలు సైతం మొదలుపెట్టింది. భౌగోళిక పరిస్థితులు: కూలీపనులు,వ్యవసాయంమే ప్రధానంగా జీవనం సాగించే జనం ఉన్నారు.ఎలాంటి పరిశ్రమలు లేవు. ఉపాధి అవకాశాలు చాలా తక్కువ ఆలయాలు: వట్టెం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం -
మక్తల్: ప్రతీసారి భిన్న ప్రజాతీర్పు.. ఈసారి మాత్రం ఉత్కంఠే!
తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో ఉన్న మక్తల్ నియోజకవర్గంలో ప్రతిసారి ఓటర్ల తీర్పు భిన్నంగా ఉంటుంది. ఆ సెగ్మెంట్లో అన్ని పార్టీలో గ్రూపు రాజకీయాలు తీవ్రంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల నుంచి అనేక మంది పోటీ పడుతున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు నువ్వా..నేనా అన్నట్టు సాగే అవకాశం ఉంది. 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి చిట్టెం రాంమోహన్‌రెడ్డి గెలిచారు. తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2018లో ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మరోసారి ఆయన వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అయితే పాత టీఆర్ఎస్ నేతలకు ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇవ్వటం లేదనే ఆరోపణ ఉంది. నియోజకవర్గం కేంద్రంలోని మున్సిపాలిటీని సైతం బీజేపీ కైవసం చేసుకుంది. ఇక్కడ చిట్టెం సోదరి డీకే అరుణ ప్రభావం ఉండటంతో ఎమ్మెల్యేకు కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్లో అధికార టీఆర్ఎస్ కంటే బీజేపీకి అధికంగా ఓట్లు వచ్చాయి. చిట్టెం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారనే పేరుంది. డబుల్ బెడ్రూం ఇళ్లు ఒక్కటి కూడ నిర్మాణం చేయలేదు. సంగంబండ లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేయలేదని ఆరోపణలు ఉన్నాయి. నేరేడుగాం,ఉజ్జెల్లి,సంగంబండ పునరావాస గ్రామాల పరిస్దితి గురించి ఎమ్మెల్యే పట్టించుకోవటం లేదని విమర్శలు ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణ ఎమ్మెల్యే అండదండలతోనే చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది.150 పడకల ఆస్పత్రి, హామీ ఇంకా నేరవేరలేదు ఇటీవల మంజూరీ వచ్చినా పనులు ప్రారంభించలేదనే మైనస్ ఉంది.రాజకీయాల్లో తన భార్య జోక్యం కొంత ఇబ్బందిగా మారవచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇక ఈసారి అక్కడి నుంచి పోటీ చేసేందుకు పారిశ్రామికవేత్త వర్కటం జగన్నాథం ఆసక్తి కనబరుస్తున్నారు. వర్కటం జగన్నాథం కరోనా సమయంలో అనేక సేవకార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య,పాఠశాలల్లో అమ్మాయిలకు మరుగుదొడ్లు,పదవ తరగతి విద్యార్దులకు స్టడీమెటీరియల్ ఇప్పించారు.మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి సైతం బీఆర్ఎస్ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. తనకే సీటువస్తుందనే ధీమాలు ఉన్నారు.అయితే సిట్టింగ్‌లకే సీట్లు ఇస్తామంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఎమ్మెల్యే చిట్టెంకు ఊరటనిస్తుంది.ఇక్కడ సీటు విషయంలో పోటీ నెలకొనటం ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారిందట. బీజేపీకి ఇక్కడ మొదట నుంచి మంచి క్యాడర్ ఉంది.మున్సిపల్ చైర్మన్ పీఠం కూడ ఆ పార్టీకే దక్కింది. ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు ఎమ్మెల్యే వ్యవహారశైలి తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. డీకే అరుణ ప్రభావం కూడ ఇక్కడ ఉండే అవకాశం ఉండటంతో మరింత ప్లస్ కానుంది.అయితే ఇక్కడ కూడ మొదటి నుంచి పార్టీలో ఉండి రెండు సార్లు పోటీ చేసిన కొండయ్యకు,కొత్తగా పార్టీలో చేరిన జలంధర్‌రెడ్డికి మద్య పొసగటం లేదు.ప్రజాసంగ్రామయాత్రలో కూడ పోటాపోటీగా తమ బలప్రదర్శన చేశారు. జలంధర్‌రెడ్డి గత 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసి రెండవ స్దానంలో నిలిచిచారు. ప్రజాసంగ్రామయాత్ర ముగిసిన తర్వాత జలంధర్‌రెడ్డి నియోజవర్గానికి చుట్టపుచూపుగా మారారు. సీటు విషయంలో కొండయ్య,జలంధర్‌రెడ్డి మద్య ఏకాభిప్రాయం కుదిరితే పార్టీకి కలిసివచ్చే అవకాశం ఉంటుంది లేకుంటే అధికార బీఆర్ఎస్కే ప్లస్ అవుతుంది. ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి కొంత ఇబ్బందిగానే ఉంది. ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరాక పార్టీకి సరైన నాయకత్వమే కరువయ్యింది. ఈ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ జోడో యాత్ర విజయవంతం కావటం ఇక్కడి నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహాం నింపింది. మాజీ జడ్పీటీసీ సభ్యుడు శ్రీహరి, మాజీ ఆప్కాబ్ చైర్మన్ దివంగత వీరారెడ్డి తనయుడు ప్రశాంత్‌రెడ్డి, నాగరాజు గౌడ్, ఎన్నారై పోలీస్ చంద్రశేఖర్రెడ్డిలు సీటు కోసం ఆశిస్తున్నారు. వీరారెడ్డి గతంలో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత అది దేవరకద్ర నియోజకవర్గంగా పునర్విభజనలో మారింది. కానీ ఆత్మకూరు, నర్వ, అమరచింత మండలాలు ప్రస్తుతం మక్తల్ నియోజకవర్గంలో ఉండటంతో పాటు, రాహుల్ జోడో యాత్రలో కీలకంగా పనిచేయటం తనకు కలిసి వస్తుందనే అభిప్రాయంతో ప్రశాంత్‌రెడ్డి ఉన్నారు. బీసీ గౌడ్ సామాజికవర్గానికి చెందిన నాగరాజు గౌడ్ గతంలో ఎన్ఎస్యూఐలో పనిచేశాడు. రేవంత్‌రెడ్డికి సన్నిహితంగా ఉంటున్న ఇతను రాహుల్ల్గాం గాంధీ జోడోయాత్రలో హుషారుగా పనిచేసి పార్టీ నేతల దృష్టిని ఆకర్శించారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి సీటు రాకుంటే మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్‌రెడ్డి కూడ కాంగ్రేస్ లో చేరుతారనే ప్రచారం జోరుగాసాగుతుంది.కాంగ్రేస్ అభ్యర్ది అవుతారని ఆయన వర్గీయులు అంటున్నారు.2018లో మక్తల్‌లో టీడీపీ నుంచిపోటీ చేసిన సీతమ్మ భర్త దయాకర్‌రెడ్డి మూడోస్దానంలో నిలువగా 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.ప్రతిపక్షపార్టీలు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై భరోసాపెట్టుకుని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు నేతలు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: ఆత్మకూర్ అమరచింత మండలాలు వనపర్తి జిల్లాలో, మదనాపూర్ మండలంలోని కొన్ని గ్రామాలు దేవరకద్ర నియోజకవర్గములో, ధన్వాడ మరికల్ మండలాల్లోని కొన్ని గ్రామాలు నారాయణపేట నియోజకవర్గములో అనుసంధానమై ఉన్నాయి.ఈ నియోజకవర్గం కర్ణాటక సరిహద్దులో ఉంది. నదులు: కృష్ణా, భీమా నదులు వర్షాకాలంలో పుష్కలంగా ప్రవహిస్తాయి రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది,చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంది. ఆలయాలు: కృష్ణానది తీరాన దత్తపీఠ ఆలయం చాలా ప్రసిద్ధిగాంచింది. తెలంగాణ కర్ణాటక సరిహద్దులో ముడుమాల నిలువు రాళ్లు చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉన్నాయి.కృష్ణాలో మొట్టమొదట రైల్వేస్టేషన్ ఉంది. -
పాలమూరుపై బీజేపీ.. కాంగ్రెస్ స్ట్రాంగ్ ఫోకస్
మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా సాగనుంది. త్రిముఖపోటీ జరుగనుంది. అధికార బీఆర్ఎస్ దీటుగా ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌లు సత్తాచాటేందుకు సమాయత్త మవుతున్నాయి. చేసిన అభివృద్ది.. తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్కు జనాలు మరోసారి పట్టం కాడతారని ఆ పార్టీ భావిస్తుంది. పాత సీటును నిలుపుకునేందుకు కాంగ్రెస్ చూస్తుంటే.. బీజేపీ పాలమూరు సీటుపై ఫోకస్ పెట్టింది. సామాజిక వర్గాల వారిగా చూస్తే ముస్లీం మైనార్టీల ఓట్లు అధికంగా ఉన్నాయి. ముదిరాజ్, యాదవ సామాజిక వర్గం ఓట్లు ఫలితం కూడా ప్రభావితం చేసే స్దాయిలో ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నివాసం ఉంటున్నవారు, ఉద్యోగుల ఓట్లు కూడ ఎక్కువగ ఉన్నాయి. దీంతో ఫలితంపై అన్ని అంశాలు ప్రభావితం చూపే అవకాశం ఉంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014, 2018లో మహబూబ్‌నగర్ సెగ్మెంట్లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాస్‌గౌడ్ పోటీ చేసి విజయం సాధించారు. రెండవసారి గెలిచిన తర్వాత ఆయన మంత్రి అయ్యారు. మూడోసారి ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయనున్నారు. మంత్రిగా నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తున్న ఆయన మరోసారి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ఆరోపణలు.. బీఆర్ఎస్కు అదే మైనస్! బైపాస్ రహదారి పర్యాటకం మయూరి పార్క్, పెద్ద చెరువు ట్యాంక్‌బండ్, శిల్పారామం, నెక్లెస్ రోడ్డు, పట్టణంలో కూడళ్ల అభివృద్ది, సుందరీకరణ ఆయనకు కలిసివచ్చే అంశాలుగా ఉన్నాయి. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో అన్ని నియోజవర్గాల కంటే ముందు వరుసలో ఉన్నా నిర్మాణం జరిగిన ఇళ్లను లబ్దిదారులకు పంపిణీ చేయటంలో జాప్యం జరగటం.. అందులో అవినీతి ఆరోపణలు రావటం కొంత ఇబ్బందిగా మారింది. పరిస్ధితి తనకు తెలిసిన వెంటనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ దిద్దుబాటు చర్యలు దిగారు. అక్రమార్కులపై కేసులు కూడ నమోదయ్యాయి. ఎన్నికల అఫ్రిడవిటిల్లో తప్పుడు వివరాలు నమోదు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తరచుగా జరిగే కొన్ని ఘటనలు ఆయనకు ఇబ్బందిగా మారాయి. ఓ కార్యక్రమ ర్యాలీలో బహిరంగంగా గాలిలో కాల్పులు జరపటంతో విమర్శలు ఎదుర్కొన్నారు. హత్య కుట్ర కేసు వ్యవహారం కూడ ఆయనకు కొంత మైనస్‌గా మారింది. అనారోగ్యం బారిన పడిన వారి బాగుకోసం నిత్యం అందుబాటులో ఉండి వారికి ముఖ్యమంత్రి సహయనిధి నుంచి భారీగా నిధులు ఇప్పించి మెప్పుపొందారు. జిల్లా జనరల్ ఆస్పత్రి అభివృద్ది కోసం విశేష కృషి చేశారు. ముఖ్యంగా కరోనా సందర్భంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరోనా బాధితులు ఇక్కడ మెరుగైన వైద్యసేవలు అందేలా వసతులు కల్పించారు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు బలవంతంగా ఇతర పార్టీల వారిని తన పార్టీలో చేర్చుకుంటున్నారని, లేకుంటే కక్షసాధింపులకు దిగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనుచరులు భూ ఆక్రమణలకు దిగుతున్నారనే అపవాదు కూడ ఉంది. తన అనుచరులకు పెద్దపీట వేసి ఉద్యమకాలంలో పనిచేసిన వారిని విస్మరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇతర పార్టీల్లో ఆయనను తట్టుకుని నిలిచే నేతలు ఇటు కాంగ్రెస్, బీజేపీలో స్దానికంగా లేకపోవటం కలిసి వచ్చే అంశం. రంగంలోకి బీకే అరుణ.. బీఆర్ఎస్కు గట్టి పోటీ తప్పదు అయితే బీజేపీ నుంచి డీకే అరుణ పోటీలో ఉంటే కొంత ఇబ్బందిగా మారుతుందనే అభిప్రాయం ఆయన వర్గీయుల్లో వ్యక్తం అవుతుంది. మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా గెలిచారు. చాలా మంది మంత్రి పదవులు సైతం పొందారు. కానీ ఇప్పుడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి అధ్వాన్నంగా మారింది. పోటీకి బలమైన అభ్యర్ది లేడనే అభిప్రాయం ఉంది. ఉన్నదాంట్లో ఎవరంతకు వాళ్లు తమకు సీటుకావాలనే అశతో ఉన్నారు. పార్టీ బలోపేతంపై పెద్దగా శ్రద్ద కనబరిచిన దాఖలాలు లేవు. చాలా మంది పార్టీని వీడటం కూడ తలనొప్పిగా మారింది. మైనార్టీ ఓట్లు అధికంగా ఉన్న ఈ సెగ్మెంట్లో ఆ సామాజికవర్గాల ఓట్లను తమవైపు మలుపుకునే దిశగా ఎలాంటి కార్యాచరణ చేయటం లేదు. కాంగ్రెస్ పార్టీని గెలిపించినా గెలిచినా అభ్యర్ది ఆ పార్టీలో ఉంటాడో లేదో తెలియని అయోమయం నెలకొంది. దీంతో ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు వేసేందుకు విశ్వసించటం లేదనే అభిప్రాయం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని అంటున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో అక్రమాలు జరిగాయని పేద ప్రజలు గుర్రుగా ఉన్నారని చెప్పుకొస్తున్నారు. ఒబేదుల్లా కోత్వాల్, సంజీవ్ ముదిరాజ్‌లు సీటు ఆశిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధీటుగా నిలిచే అభ్యర్దిని బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కూడ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇంకోవైపు టీటీడీ బోర్డు సభ్యుడు, పారిశ్రామికవేత్త మన్నె జీవన్‌రెడ్డి పేరు కూడ ప్రముఖంగా వినిపిస్తోంది. జోడో యాత్ర, కార్ణాటక గెలుపు కాంగ్రెస్ కలిసి వస్తుందా? రాహుల్ గాంధీ జోడో యాత్ర విజయవంతం కావటం.. కర్ణాటకలో పార్టీ గెలుపు కలిసి వచ్చే అంశంగా మారింది. గతంలో పార్టీని వీడిన నేతలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతుండటంతో ఆ పార్టీలొ కొత్తజోష్ నెలకొంది. 2012 ఉపఎన్నికల్లో ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేసిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డి విజయం సాధించారు. పొత్తులో భాగంగా బీజేపీ నుంచి 1999లో ఏపీ జితేందర్‌రెడ్డి మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం బీజేపీ పాలమూరుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇక్కడి నుంచి ఈ సారి కషాయం జెండా ఎగురవేయాలని యోచిస్తున్నారు. డీకే అరుణను ఇక్కడి నుంచి బరీలో దింపాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో డీకే అరుణకు.. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్‌కు వచ్చిన ఓట్లకంటే అధికంగా రావటంతో పార్టీకి బూస్ట్ ఇచ్చినట్టయ్యింది. జితేందర్‌రెడ్డి కూడ బీజేపీలో ఉండటం, బండి సంజయ్ కుమార్‌కు ప్రజాసంగ్రామయాత్ర ఈ జిల్లాలో విజయవంతం కావటం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సహం నింపింది. ఈసారి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీమంత్రి చంద్రశేఖర్, ఎన్పీ వెంకటేష్‌తో పాటు మరో రెండు మూడు పేర్లు పోటీ చేసే అభ్యర్దుల జాబితాలో కనిపిస్తున్నాయి. అయితే పార్టీలో అంతర్గత విభేదాలు కూడ నష్టం కలిగించే అవకాశం ఉంది. పాత, కొత్త నేతలకు పొసగటం లేదు. పాతవాళ్లు గ్రూపుగా ఏర్పడి కొత్తవారిని ఎదగనీయటం లేదనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత.. మోదీ ప్రభావంతో ఈసారి తప్పకుండా బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తంచేస్తున్నారు. మొత్తంగా మహబూబ్‌నగర్ సెగ్మెంట్లో ఎవరికి వారు తమ అస్త్రాలు సిద్దం చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: వ్యవసాయంమే ప్రధానంగా జీవనం సాగించే జనం ఉన్నారు. పెద్దగా పరిశ్రమలు లేవు. నూతనంగా ఐటీ కారిడార్ ఏర్పాటైనా ఇంకా అందులోకి కంపెనీలు రాలేదు. అడవులు: అప్పన్నపల్లి పరిసరాల్లో అడవులు ఉన్నాయి ఆలయాలు--పేదల తిరుపతిగా పిలిచే మన్యంకొండ శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం పర్యాటకం: మయూరీ నర్సరీ,కోయిల్‌సాగర్ ప్రాజెక్టు -
కొల్లాపూర్‌లో ఎవరికి వారే యమునా తీరే!
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో అన్ని పార్టీల్లో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఏ పార్టీ నుంచి ఎవరికి సీటు ఇచ్చినా ఆపార్టీల్లోని ఇంకోవర్గం వ్యతిరేకంగా పనిచేసే పరిస్ధితి నెలకొంది. అధిష్టానాలు కూడా గ్రూపు రాజకీయాలను చక్కదిద్దటంలో విఫలమవుతున్నాయి. దీంతో ఆ సెగ్మెంట్లో ఎవరికివారు యమునా తీరే అనే రీతిలో వ్యవహారం నడుస్తోంది. నేతల మధ్య వార్.. పార్టీ వీడిన జూపల్లి కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు 5 సార్లు గెలిచి అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్లో మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో జూపల్లి కాంగ్రెస్ అభ్యర్ది హర్షవర్దన్‌రెడ్డి చేతిలో ఓటమి చెందారు. తర్వాత రాజకీయ పరిణామాలతో హర్షవర్దన్ రెడ్డి కాంగ్రెస్‌కు బై చెప్పి టీఆర్ఎస్లో చేరారు. ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య వార్ నడుస్తూనే ఉంది. పార్టీలో హర్షవర్దన్‌రెడ్డి బలపడటం... రోజురోజుకు జూపల్లికి ప్రాధాన్యత తగ్గటం మొదలయ్యింది. దీంతో తన ఉనికిని చాటుకునేందుకు స్దానిక సంస్ధల ఎన్నికల్లో జూపల్లి తన అనుచరులను ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బరిలో దింపి సత్తా చాటారు. ఇద్దరి మధ్య వివాదం రోజురోజుకు పెరిగింది తప్పా ఎక్కడ సమసిపోలేదు. అధిష్టానం కూడా ఇద్దరిని సమన్వయం చేసేందుకు పెద్దగా దృష్టి కూడా పెట్టలేదు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పార్టీపై ఘాటైన విమర్శలు చేయటంతో జూపల్లిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకుని ఢిల్లీలో బుధవారం మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో పార్టీలో చేరారు. దీంతో ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు లైను క్లియర్ అయ్యింది. హర్షవర్ధన్‌రెడ్డి మాత్రం తాను నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నానని చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సోమశిల-సిద్దేశ్వరం వంతెన, రెవెన్యూ డివిజన్ సాధించానని దీంతో ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిన నెరవేరటంతో పాటు ఈప్రాంతం అభివృద్ది చెందేందుకు దోహదపడుతుందని అంటున్నారు. అయితే జీఓ 98 ప్రకారం శ్రీశైలం ముంపు నిర్వాసితులకు ఉద్యోగాలు ఇప్పిస్తానన్న హామీ నెరవేర్చటంలో ఎమ్మెల్యే వైఫల్యం చెందాడనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేపై ఆ వర్గాల అసంతృప్తి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్క డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం జరగకపోవటం, మాదాసి కురువలను ఎస్సీలుగా, వాల్మీకిబోయలను ఎస్టీలుగా గుర్తించేందుకు కృషి చేస్తానంటూ ఇచ్చిన హమీలు నెరవేరకపోవటంతో ఆయా వర్గాలు ఎమ్మెల్యేపై అసంతృప్తిగా ఉన్నారు. ఎమ్మెల్యే అనుచరులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణాలో ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. అనుచరులకే ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారనే ఆరోణలు చేస్తున్నారు. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఎమ్మెల్యేకు మైనస్‌గా మారనుంది. ఇప్పటికే డబ్బులు తీసుకుని కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి మారాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేకు ఫాంహౌజ్ ఎపిసోడ్ సంకటంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరటంతో గతంలో కొల్లాపూర్‌లో మూడు సార్లు టీడీపీ నుంచి పోటీ చేసిన, సీఆర్ జగదీశ్వర్‌రావు కాంగ్రెస్‌లో చేరారు. ఆయన ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగంలో పనిచేసిన రంగినేని అభిలాష్‌రావు కూడా కాంగ్రెస్‌లో చేరాఉ. ఈయన కూడ సీటు ఆశిస్తున్నారు. వీరిద్దరి మధ్య కూడ అంతర్గత విభేదాలు ఉన్నాయి. పార్టీ కార్యక్రమాలను వీరిద్దరు వేరువేరుగా నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. సొంతగూటికి జూపల్లి.. మొదలైన వర్గపోరు ఇంతలోనే జూపల్లి సొంతగూడికి చేరటంతో వచ్చే ఎన్నికల్లో ఆపార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్ది ఎంపిక పార్టీకి తలనొప్పిగా మారింది. అయితే సీటు గ్యారెంటీతోనే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరినట్టు తెలుస్తోంది. జూపల్లి పార్టీలోకి రావటాన్ని స్వాగతిస్తున్నట్టు చెబుతున్న జగదీశ్వర్‌రావు మాత్రం సీటు తనకే కేటాయించాలని కోరుతున్నారు. దీంతో అప్పుడే వర్గపోరు మొదలైనట్టు కనిపిస్తోంది. ఎలాగైనా తాను ఈసారి బరిలో ఉండాలనుకుంటున్న జగదీశ్వర్‌రావుకు సీటు రాకుంటే ఇండిపెండెంటుగానైనా పోటీ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ సీటు విషయంలో గందరగోళం రేగితే బీఆర్ఎస్కు మేలు జరిగే అవకాశం ఉంది. బీజేపీ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎల్లెని సుధాకర్‌రావు నియోజకవర్గ ఇంచార్జీగా కొనసాగుతున్నారు. ఆయన గత ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. కేంద్రప్రభుత్వం కృష్ణానదిపై సోమశిల-సిద్దేశ్వరం బ్రిడ్జి మంజూరు చేసిందని తాను దీనికోసం ప్రయత్నించానని గతంలో హర్షవర్దన్‌రెడ్డి జూపల్లిలకు అవకాశం ఇచ్చారు. ఈసారి తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తానని అంటున్నారు. ఆయన నియోజవర్గంలో పాదయాత్ర నిర్వహించి పార్టీ క్యాడర్లో జోష్ నింపారు. అయితే నియోజకవర్గంలో బీజేపీకి పెద్దగా క్యాడర్ లేకపోవటం పెద్ద మైనస్‌గా ఉంది. అయితే సుధాకర్‌రావు మాత్రం పార్టీ కార్యక్రమాలు విధిగా నిర్వహిస్తూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు కొల్లాపూర్ సంస్ధానాల పాలన సాగిన ప్రాంతం,ఇక్కడ బీసీలు అధికంగా ఉన్న నియోజకవర్గం.మామిడి తోటలకు ప్రసిద్ది చెందిన ప్రాంతం.ఇక్కడి నుంచి మామిడిపడ్లను అంతర్జాతీయంగా వివిధ దేశాలకు ఎగుమతి చేస్తారు. కాగితం పరిశ్రమలు నెలకొల్పేందుకు వీలుగా నల్లమలలో పుష్కలంగా వెదురు లభ్యమవుతుంది. నదులు: కృష్ణానది,దీని ఆదారంగా భగీరధ నీటిని పాలమూరు,రంగారెడ్డి జిల్లాలకు సరఫరా అవుతుంది అడవులు: నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది.ఈ నియోజవర్గంలోని చిన్నంబావి,వీపనగండ్ల,పాన్గల్లు మండలాలు వనపర్తి జిల్లా పరిధిలో ఉన్నాయి.మిగిలినవి నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉన్నాయి. ఆలయాలు: ఈ నియోజవర్గంలో ప్రసిద్దిన అనేక ఆలయాలు ఉన్నాయి సింగోటం శ్రీలక్ష్మి నర్సింహ స్వామి ఆలయం ,కొల్లాపూర్ మాదవస్వామి ఆలయం ,జెటప్రోలు. వేణుగోపాలస్వామి ఆలయాలు,సోమశిలలో సోమేశ్వరాలయం,ద్వాదశలింగల ధామంగా పసిద్ది చెందింది. పర్యాటకం: సోమశిల కృష్ణానది, కే ఎల్ ఐ ప్రాజెక్ట్.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సైతం ఇక్కడి నుంచే నీటిని తరలిస్తారు. -
కల్వకుర్తి: బీఆర్ఎస్కు మైనస్! కాంగ్రెస్ కంటే బీజేపీనే బలంగా..
నాగర్ కర్నూల్ జిల్లాలో చైతన్యవంతులైన ఓటర్లు ఉన్న నియోజకవర్గం కల్వకుర్తి. ఇక్కడి ప్రజలు విలక్షణ తీర్పునిస్తారు. టీడీపీ వ్యవస్దాపకుడు ఎన్టీఆర్‌ను సైతం ఓడించి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్దితులు హాట్‌టాపిక్‌గా సాగుతున్నాయి. ఇక్కడ వచ్చే ఎన్నికల్లో బహుముఖ పోటీ అనివార్యం కానుంది. నియోజకవర్గం పేరు: కల్వకుర్తి మండలాల సంఖ్య: 6 (కల్వకుర్తి , వెల్దండ, ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల, కడ్తాల్) మొత్తం గ్రామపంచాయతీలు: 164 మున్సిపాలిటీలు: కల్వకుర్తి, ఆమనగల్లు ప్రభావితం చూపే పంచాయితీ: మాడ్గుల మొత్తం ఓటర్లు: 2,17,042 పురుషులు: 1,10,975; మహిళలు: 1,06,061 2014లో కాంగ్రెస్ అభ్యర్ది వంశీ చందర్‌రెడ్డి కేవలం 78 ఓట్ల మెజార్టీతో సమీప బీజేపీ అభ్యర్ది ఆచారిపై గెలిచారు. 2018లో టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ 3447 ఓట్ల మెజార్టీలో సమీప బీజేపీ అభ్యర్ది ఆచారిపై గెలిచారు. అధికార టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య విభేదాలు తీవ్రస్దాయిలో ఉన్నాయి. గ్రూపు రాజకీయాలతో ఇక్కడ కూడా పార్టీ క్యాడర్ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఇదీ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తోంది. 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీచేసిన కసిరెడ్డి నారాయణరెడ్డి తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరారు.ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ది జైపాల్‌యాదవ్ మూడో స్దానం నిలిచారు. కసిరెడ్డికి స్దానికసంస్దల తరపున ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వటంతో ఆయన గెలిచారు. 2018 ఎన్నికల్లో కసిరెడ్డి బీఆర్ఎస్ తరపున సీటు ఆశించారు. ప్రోటోకాల్ రగడ.. ఆధిపత్యపోరు కానీ పార్టీ మరోసారి జైపాల్ యాదవ్‌కు అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికల్లో పార్టీ అభ్యర్దికి కసిరెడ్డి సహకరించలేదు. అయినా జైపాల్ యాదవ్ గెలిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నియోజకవర్గంలో జరిగే ప్రతి సమావేశాల్లో ప్రోటోకాల్ రగడ.. ఆధిపత్యపోరు నడిచింది. విషయం అధిష్టానం దృష్టికి వెళ్లిన పెద్దగా పట్టించుకోలేదు. తిరిగి కసిరెడ్డి రెండవసారి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా గెలిచారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఇద్దరి మధ్య అదే గ్యాప్ కొనసాగుతుంది. తిరిగి వచ్చే ఎన్నికల్లో కూడా కసిరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. తన క్యాడర్‌ను కాపాడుకునేందుకు కావాల్సిన కసరత్తు చేస్తూనే ఉన్నారట. ఇప్పటికే రెండుసార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సహజంగా ప్రజల్లో ఉండే వ్యతిరేకతతో పాటు వర్గపోరు కూడా తలనొప్పిగా మారనుంది. ఎవరికి సీటు ఇచ్చినా ఇంకోకరు ఎలా స్పందిస్తారో తెలియని అయోమయం పార్టీలో నెలకొంది. పార్టీలోని చిత్తరంజన్‌దాస్, ఉప్పల వెంకటేష్, జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్లు కూడా జైపాల్ యాదవ్ అభ్యర్దిత్వాన్ని వ్యతిరేకించటమే కాక ఆయనకు సీటు ఇస్తే సహకరించమని ఇటీవల కసిరెడ్డి నేతృత్వంలో ఓ ఫాంహౌజ్‌లో జరిగిన సమావేశంలో తేల్చిచెప్పారట. ఇక జైపాల్ యాదవ్ ఈ నాలుగేళ్లలో నియోజకవర్గంలో తన మార్క్ పని ఏది చేయలేదని..డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కల్వకుర్తిలో జరిగినా పంపిణీ చేయటంలో జాప్యం చేస్తుండటం మైనస్‌గా మారింది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో కూడ తీవ్ర జాప్యం వల్ల తనకోసం పనిచేసిన వారికి మేలు చేయలేక పోయారనే అపవాదు ఉంది. అదే జైపాల్ యాదవ్ ధీమా ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటంతో ఈసారి కూడా తనకే సీటు వస్తుందనే ధీమాలో ఉన్నారు జైపాల్ యాదవ్. ఈ నియోజకవర్గం గుండా రెండు జాతీయరహదారులు హైదరాబాద్-శ్రీశైలం,జడ్చర్ల, కోదాడ ఉండగా కొత్తగా కొట్రనుంచి నంద్యాల వరకు మరో జాతీయరహదారి మంజూరయ్యింది. నిత్యం వేలాదిగా వాహనాల రాకపోకలతో అనేక ప్రమాదాలు జరుగుతున్నా ఎక్కడ ట్రామా కేర్ సెంటర్ లేదు. కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రి వందపడకలు చేస్తామన్న హమీ నేటికీ నెరవేరకపోవటంతో జనాలు వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు పరుగులు పెట్టక తప్పటం లేదు. జైపాల్ యాదవ్, కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి తనయుడు మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం కూడ సీటు ఆశిస్తున్నారు. ఇక్కడ బీసీ, రెడ్డి సామాజికవర్గాల మధ్య అధిపత్యపోరు కూడా జరుగుతోంది. కేవలం ప్రభుత్వ పథకాలపైనే భరోసా పెట్టి ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్దితి ఇక్కడి బీఆర్ఎస్ నేతల వంతవుతుంది. కాంగ్రెస్ పార్టీ తరపున వంశీచందర్ రెడ్డి 2014లో స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2018లో ఆయన మూడోస్దానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత ఆయన నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీ కార్యక్రమాలు సైతం చేయటం లేదట. ఆయన రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారని సొంత పార్టీనేతలు గుసగుసలాడుతున్నారు. దీంతో పార్టీ క్యాడర్ కూడ తమ దారితాము చూసుకుంటున్నారు. ఐక్యతా ఫౌండేషన్ పేరుతో ఎన్ఆర్ఐ రాఘవేందర్‌రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ను నడిపించే నాయకుడే లేడా.. ఆయన కూడ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. సీటు వస్తే కాంగ్రెస్ నుంచి లేకుంటే ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేయాలనే అలోచనలో ఉన్నాడట. మరోవైపు తలకొండపల్లి జడ్పీటీసీ సభ్యుడు ఉప్పల వెంకటేష్ కూడ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారట. సీటు కూడ కావాలని కోరుతున్నట్టు ప్రచారం సాగుతుంది. పార్టీ నేతలతో సంప్రదింపులు కూడ జరిగాయట. కానీ సీటు గ్యారెంటీ లేదని చెప్పినట్టు తెలుస్తోంది. మరి ఆతని నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం కాంగ్రెస్ నడిపించే నాయకుడే కరువయ్యాడు. పారిశ్రామిక వేత్త జూపల్లి గ్రామానికి చెందిన భాస్కర్‌రావు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈయన 2014లో వంశీచందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలువటంలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఏఐసీసీ వ్యవహారాల్లో బిజీబిజీగా ఉంటున్న వంశీచందర్‌రెడ్డి ఈసారి కల్వకుర్తి నుంచి పోటీ చేసే అవకాశంలేదనే ప్రచారం సాగుతుంది. అయితే ఆయన సూచించిన వ్యక్తికే సీటు ఇచ్చే అవకాశం మాత్రం లేకపోలేదు. అందుకే ఆయన వ్యూహత్మకంగా జూపల్లి భాస్కర్‌రావును ప్రోత్సహిస్తున్నట్టు పార్టీలో టాక్ నడుస్తోంది. ఎలాగైన వచ్చే ఎన్నికల్లో గెలవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న వ్యతిరేకత, రుణమాఫి, డబుల్ బెడ్రూం రూం ఇళ్ల నిర్మాణం వంటి అశలు తమకు కలిసివస్తాయని భావిస్తుంది. బీజేపీకి బలంగా మారిన అధికార పార్టీ గ్రూపు రాజకీయాలు ఇక బీజేపీ ఈ నియోజకవర్గంలో బలంగా ఉంది. రెండు ఎన్నికల్లో స్వల్ప తేడాలో ఆ పార్టీ అభ్యర్ది తల్లోజు ఆచారి ఓటమి చెందారు. తర్వాత ఆయన జాతీయ బీసీ కమీషన్ సభ్యుడిగా నియమితులయ్యారు. మరోసారి ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అయితే బీజేపీ ఈసారి ఇక్కడ గెలిచి తీరాలని టార్గెట్ పెట్టుకుంది. అయితే ఇక్కడ బీజేపీ పాత నేతలు, కార్యకర్తలు కొత్తవారిని పార్టీలోకి రానివ్వటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆచారి నియోజకవర్గంలో ఆశించిన స్దాయిలో అందుబాటులో ఉండటం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలోని ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల, కడ్తాల్ మండలాలు రంగారెడ్డి జిల్లాలో ఉండటంతో కొంత బీజేపీకి మేలు జరుగుతుందని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత.. టీఆర్ఎస్లో గ్రూపు తగాదాలు..మోదీ చరిష్మా ఈ సారి తప్పకుండా బీజేపీని గెలిపిస్తోందని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో కల్వకుర్తి సెగ్మెంట్ పోరు రసవత్తరంగా మారనుంది. నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు: ఈ నియోజకవర్గం ఇటు నాగర్‌కర్నూల్ అటూ రంగారెడ్డి జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. హైదరాబాద్ -శ్రీశైలం,కోదాడ-జడ్చర్ల,కొట్ర-నంద్యాల మధ్య మూడు జాతీయ రహదారులు గల నియోజకవర్గంగా ఉంది. దుందుభీ నదీ ప్రవాహం ఉంటుంది. ఆలయాలు: రెండవ భద్రాదీగా పేరున్న సీతారామచంద్రస్వామి ఆలయం సిర్సనగండ్లలో ఉంది. కడ్తల్లో మైసిగండి ఆలయం ఉంది. ప్రధానంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తికాకపోవటం, నిర్వాసితులకు సరైన పరిహారం అందకపోవటంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ఈ ప్రభావం ఎన్నికలపై ఉండే అవకాశం ఉంది. ఉపాధి అవకాశాల కోసం ఎలాంటి పరిశ్రమల స్దాపన చేయకపోవటంతో ఆ వర్గం ఓట్లు కూడ బీఆర్ఎస్కు మైనస్ కానుంది. -
జడ్చర్ల: ఆశావాహులు అడ్డగోలు.. అయోమయం వీడితేనే..!
నియోజకవర్గం: జడ్చర్ల మండలాల సంఖ్య: 6 (జడ్చర్ల, మిడ్జిల్, ఊరుకొండ, బాలానగర్, రాజాపూర్, నవాబుపేట) మొత్తం పంచాయితీలు: 187 మొత్తం ఓటర్లు: 202404 ఓట్లు పురుషులు: 102076; మహిళలు: 100326 ఆ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి . ఉమ్మడి పాలమూరు జిల్లాకు రాజకీయ మూలస్థంభంగా వున్న జడ్చర్ల నియోజక వర్గంలో ప్రధాన పార్టీలలో పోటీ చేయాలనే ఆశావాహుల సంఖ్య పెరుగుతుండటం ఆసక్తిని రేపుతుంది. నేతల వ్యవహారంతో అయా పార్టీలో వున్న కార్యకర్తలు అయోమయానికి గురి అవుతున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ అనివార్యం కానుంది. పారిశ్రామికంగా దినదినాభివృద్ది చెందుతున్న మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా నడుస్తోంది. ఇటు 44 అటు 167 జాతీయ రహదారులు జడ్చర్ల మీదుగా వెళ్తున్నాయి. దీంతో ఇక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ప్రధాన పార్టీలు గురిపెట్టాయి. 2014, 2018 ఎన్నికల్లో జడ్చర్లలో టీఆర్ఎస్ నుంచి డాక్టర్ లక్ష్మారెడ్డి గెలిచారు. ఓ సారి మంత్రిగా పనిచేశారు. సిట్టింగులకే సీట్లంటూ కేసీఆర్ చేసిన ప్రకటనతో మరోసారి ఆయనే పోటీకి రెడీ అయ్యారు. రీసెంట్గా అభ్యుర్థుల ప్రకటించిన అధిష్టానం మరోసారి జడ్చర్ల టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యేకే కెటాయించింది. లక్ష్మారెడ్డి నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. మొదటి నుంచి లక్ష్మారెడ్డి కేసీఆర్‌కు సన్నిహితుడిగా ఉన్నారు. 2008లో ఆయన సూచన మేరకు మొదటి వ్యక్తిగా తన పదవికి రాజీనామా చేసి తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో, 2009లో ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత వరుసగా గెలిచారు. పార్టీల్లో కుమ్ములాటలు రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. ప్రభుత్వం నుంచి అన్ని నియోజకవర్గాలకు వచ్చిన ప్రకారం అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేశారు తప్పా తనకంటూ ప్రత్యేక గుర్తింపు నిచ్చే పని ఏ ఒక్కటి చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరిన వారికి సరైన ప్రాధాన్యత లేదనే అసంతృప్తి చాలా మందిలో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరంతా ఎన్నికల నాటికి లక్ష్మారెడ్డికి హ్యండ్ ఇస్తారనే చర్చ సాగుతుంది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు తగిన న్యాయం చేయలేదనే అపవాదు కూడా ఉంది. ఈ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగటమే కాగా ఇళ్ల పరిహారంలో అక్రమాలు జరిగాయే ఆరోపణలు ఉన్నా న్యాయం చేయటం లేదనే విమర్శలు ఉన్నాయి. జడ్చర్ల మున్సిపాలిటీలో పలువురు కౌన్సిలర్లు భూకబ్జాలు, అవినీతి కార్యకలాపాల్లో తలదూర్చుతున్నా ఎమ్మెల్యే వారిని కట్టడి చేయటంలో విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడ మైనస్‌గా మారే అవకాశం ఉంది. అయితే ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న కుమ్ములాటలు కలిసొస్తాయని ఆశగా ఉన్నారు. ఈసారి జడ్చర్ల నుంచి మన్నె జీవన్‌రెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. ఆయన మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్న కుమారుడు. టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. ఆయనకు కేటీఆర్‌తో మంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో తరచు పర్యటించటం బీఆర్ఎస్ నేతలతో టచ్‌లో ఉండటం చూస్తుంటే ఆయన వచ్చే ఎన్నికల్లో రంగంలో దిగటం ఖాయంగా కనిపిస్తోంది. వ్యూహత్మకంగానే జీవన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇద్దరు సీటు విషయంలో పోటీ పడితే పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉంది. మూడు ముక్కలాట కాంగ్రెస్ పార్టీలో మూడు ముక్కలాట నడుస్తోంది. మొదటి నుంచి ఇక్కడ మల్లురవి ఇంచార్జీగా ఉన్నారు. ఆయన కేవలం 2008లో జరిగిన ఉపఎన్నికల్లో స్వల్ప ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో పోటీ చేయటం ఓడిపోవటం పరిపాటిగా మారింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన మల్లురవి మరోసారి అక్కడి నుంచే పోటీ చేసే అవకాశాలున్నాయి. జడ్చర్లలో ప్రస్తుతం జనుంపల్లి అనురుద్రెడ్డి ఇంచార్జీగా కొనసాగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎం.చంద్రశేఖర్ అలియాస్ ఎర్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరటంతో ముసలం మొదలయ్యింది. మొదటి నుంచి ఆయన రాకను అడ్డుకుంటూ వచ్చారు. ఆయనకు నేరచరిత్ర ఉందని పార్టీలో చేర్చుకోవద్దని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధిష్టానానికి లేఖ రాశారు. తనకు సన్నిహితుడైన అనిరుద్‌రెడ్డికి సీటు విషయంలో ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశ్యంతోనే కోమటిరెడ్డి అడ్డుపడ్డారనే ప్రచారం సాగుతుంది. ఆయన టీడీపీలో ఉన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డి, చంద్రశేఖర్‌కి మంచి సంబంధాలు ఉన్నాయి. దీనికి తోడు బీసీ ఓట్లు అధికంగా ఉన్న జడ్చర్ల నియోజకవర్గంలో గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్ర శేఖర్‌ను పార్టీలో తీసుకుంటే కలిసివస్తుందని భావించి ఆయనను పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు ఇద్దరి మధ్య గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. నియోజకవర్గంలో ఎవరికి వారు తమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎడమొహం..పెడమొహంగా ఉన్నారు. అనిరుధ్ రెడ్డి మాత్రం వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్ధితుల్లో పోటీ చేయటం ఖాయమని ఆయన వర్గీయులు చెబుతున్నారు. సీటు నిరాకరిస్తే వేరే పార్టో లేక ఇండిపెండెంటుగానైనా బరిలో దిగుతారనే ప్రచారం సాగుతుంది. రాహుల్ గాంధీ జోడో యాత్రను నియోజకవర్గంలో విజయవంతం చేయటంలో అనిరుధ్‌రెడ్డి కీలకంగా పనిచేసి పార్టీ డిల్లీ అధినేతలతో శభాష్ అనిపిచ్చుకున్నారు. నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు, పాదయాత్ర నిర్వహిస్తూ అనిరుధ్‌రెడ్డి జనాలకు చేరువయ్యే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కానీ రేవంత్‌రెడ్డికి కాకుండా కోమటిరెడ్డి వెంకట్ట్రెరెడ్డి వర్గీయుడిగా ముద్రపడటం ఆయనకు మైనస్‌గా మారింది. ఎర్రశేఖర్ ప్రస్తుతం నియోజకవర్గంలో తిరుగుతున్నారు. పాత నేతలు, తన వర్గీయులను కలుస్తున్నారు. నియోజకవర్గంలో బీసీ ఓటర్లు అధికంగా ఉండటం ఎర్ర శేఖర్‌కు కలిసి వచ్చే అవకాశంగా ఉంది. గతంలో ఓడిన తర్వాత నియోజకవర్గం వైపు తిరిగి చూడకుండా కార్యకర్తలను పట్టించుకోలేదనే అపవాదు కూడా ఆయనపై ఉంది. నియోజకవర్గంలో బీజేపీ పార్టీ పరిస్థితి ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కు అన్నట్లుగా ఉంది. అయోమయంలో కార్యకర్తలు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు సన్నిహితంగా ఉన్న బాలత్రిపురసుందరీ ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలు తిరుగుతూ పట్టు సాదిస్తుండగా ఆ పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ సైతం ఇక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రచారంలో ఉంది. ఇప్పటికే నియోజకవర్గంలో మూడు, నాలుగు గ్రూపులు బీజేపీ పార్టీలో ఉండగా ప్రస్తుత రాజకీయ అస్పష్టతతో ఎపుడు ఎవరు ఏ గ్రూప్‌లో చేరతారో తెలియకుండా పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. బీఎస్పీ నుంచి బాలవర్థన్ గౌడ్ పోటీ చేసేందుకు సన్నద్దమవుతున్నారు. మొత్తంగా జడ్చర్ల నియోజకవర్గం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రసవత్తరంగా మారనున్న గద్వాల ఎన్నికలు.. గెలుపు ఎవరిది?
నియోజకవర్గం: గద్వాల మండలాల సంఖ్య: 5 (గద్వాల, మల్దకల్, ధరూర్, గట్టు, కేటీదొడ్డి ) మొత్తం పంచాయితీలు: 130 పెద్ద మండలం: గద్వాల మొత్తం ఓటర్లు: 91875 పురుషులు: 45321; మహిళలు: 46544 ప్రతిసారి ఎన్నికలు గద్వాలలో హోరాహోరీగా సాగుతాయి. గడచిన మూడు సాధారణ ఎన్నికల్లో ప్రధానంగా అత్తా అల్లుళ్ల మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్టు సాగింది. కానీ వచ్చే ఎన్నికల్లో కూడ వీరిద్దరు మరోసారి తలబడనున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడ సామాజిక వర్గ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని బలమైన బీసీ అభ్యర్దిని బరిలో దింపటానికి సిద్దమవుతుంది. దీంతో ఈసారి ఈ నియోజకవర్గంలో ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. త్రిముఖపోటీ అనివార్యం కానుంది. కాంగ్రెస్ కంచుకోట.. ఈసారి కూడా బీఆర్ఎస్ వచ్చేనా? సంస్ధానాల పాలన.. జాతీయస్దాయి గుర్తింపు గల చేనేత కార్మికులు.. కృష్ణా తుంగభద్రా నదుల మధ్య గల నడిగడ్డ ప్రాంతంగా పిలువబడే గద్వాల రాజకీయ చైతన్యం గల నియోజకవర్గం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రసవత్తరంగా పోటీ సాగే నియోజకవర్గాల్లో గద్వాల కూడ ఒకటి. మొదటి నుంచి ఇది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే ఏడు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులే విజయం సాధించారు. డీకే కుటుంబ సభ్యులే అక్కడ 8 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. డీకే సమరసింహారెడ్డి, డీకే అరుణ మంత్రులుగా కూడా పనిచేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో డీకే అరుణ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలిచారు. వీరిద్దరు వరుసకు అత్తా-అల్లుళ్లు. గడచిన మూడు ఎన్నికల్లో వీరిద్దరు తలబడితే రెండుసార్లు డీకే అరుణ విజయం సాధించగా కృష్ణమోహన్ రెడ్డి ఒకసారి గెలిచారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో డీకే అరుణ బీజేపీలో చేరారు. 2019లో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి అధికార టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆపార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె బీజేపీ నుంచి పోటీ చేయనున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకురాలిగా అరుణకు గుర్తింపు ఉంది. కాంగ్రెస్ వీడిన తర్వాత గద్వాలలో బీజేపీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు. జిల్లా సాధనకు ఆమె అప్పట్లో గట్టిపోరాటం చేశారు. ప్రజాసమస్యలపై, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఆమె వెంటనే స్పందిస్తుంది. ప్రధానంగా సీఎం కేసీఆర్‌పై సైతం విధానపరమైన విమర్శలు చేస్తూ పార్టీ అధిష్టానంలో తనదైన ముద్రవేసుకుంది. ప్రస్తుతం ఆమె నియోజకవర్గంలో విసృతంగా పర్యటిస్తూ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసింది. నియోజకవర్గంలో ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు దాదాపు 30 వేల వరకు ఉన్నాయి. ఈ ఓట్లు ఒకవేళ పార్టీపరంగా బీజేపీకి వ్యతిరేకంగా పడితే కొంత ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదు. అయితే కేసీఆర్ పాలనతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆపార్టీని ఓడించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని వచ్చే ఎన్నికల్లో గెలుపు బీజేపీదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు డీకే అరుణ వర్గీయులు. సిట్టింగ్‌లకే బీఆర్ఎస్ సీటు సిట్టింగ్‌లకే ఈసారి సీట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించటంతో మరోసారి కృష్ణమోహన్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేయటం ఖాయమైంది. కానీ పార్టీలో కుమ్ములాటలు, అంతర్గత విభేదాలు, గ్రూపు తగదాలు ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారాయి. ఆయన అనుచరులే వ్యతిరేకంగా చాపకింది నీరులా పావులు కదుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితకు ఎమ్మెల్యేకు మధ్య విభేదాలు తారాస్దాయికి చేరటంతో ఇటీవలే ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆమె ఇక్కడి నుంచి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం గాంధీ భవన్లో గద్వాల నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా ఈసారి గద్వాల నుంచి బలహీన వర్గాల అభ్యర్దిని గెలిపించాలని పిలుపునిచ్చారు. దీంతో ఆమెకు సీటు ఖాయమైందని స్పష్టమవుతుంది. అక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్న నేతలు పెద్దగా ప్రభావితం చేసే వాళ్లు కాకపోవటంతో ఈమెకు మార్గం సుగమమయ్యింది. ఈ నియోజవర్గంలో వాల్మీకి బోయలు, కురువల ఓట్లు అధికంగా ఉండటంతో కురువ సామాజిక వర్గానికి చెందిన సరిత పోటీ చేస్తే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దుగా ఉండే గద్వాల నియోజకవర్గంపై ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా ఉంటుందని ఈపార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు తలనొప్పిగా మారాయి. ఎమ్మెల్యే అన్నితానై వ్యవహరిస్తున్నారని సొంత పార్టీ వారే అరోపిస్తున్నారు. తన అనుచరులకే ఎమ్మెల్యే పెద్దపీట వేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులైన బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, బండ్ల రాజశేఖర్‌రెడ్డితో కూడా పొసగటం లేదట. అందుకే బక్కచంద్రన్నగా పిలిచే చంద్రశేఖర్‌రెడ్డి కూడా జడ్పీచైర్ పర్సన్ సరితతో పాటుగా కాంగ్రెస్‌లో చేరారు. ఇది ఎమ్మెల్యేకు తీవ్రంగా నష్టం కలిగిస్తుందని భావిస్తున్నారు. ఇక ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కూడ ఎమ్మెల్యేకు ఇబ్బందిగా మారే ప్రమాదం లేకపోలేదు. అయితే ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ పథకాలే తమపార్టీని గెలిపిస్తాయని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తుండంగా ప్రతిపక్ష బీజేపీ,కాంగ్రేస్ పార్టీ నేతలు సైతం ఈసారి తామే విజయం సాధిస్తామనే ధీమాలో ఉన్నారు.మొత్తంగా నడిగడ్డ రాజకీయాలు ఎన్నికలకు నాలుగు నెలల ముందే రంజుగా సాగుతున్నాయి. త్రిముఖ పోటీలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: ఈ నియోజకవర్గం ఇటు కృష్ణా, అటు తుంగభద్రా నదుల మధ్య ఉండటంతో ఈ ప్రాంతాన్ని నడిగడ్డగా పిలుస్తారు. గద్వాల కేంద్రంగా సంస్దానాల పాలన సాగింది నదులు: కృష్ణానది ,జూరాల ప్రాజెక్టు, నెట్టెంపాడు ప్రాజెక్టు ఆలయాలు: మల్దకల్ స్వయంభు లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం, జమ్మిచేడు జమ్మలమ్మ ఆలయం, పర్యాటకం: జూరాల పర్యాటక కేంద్రంగా డ్యాంలో నీటి నిల్వను, గేట్ల ద్వారా పారే నీటి ప్రవాహాన్ని చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వస్తారు. అదేవిధంగా గద్వాల కోటను చూసేందుకు, గద్వాల పట్టు చీరలను కొనేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతారు. తిరుమల వెంకన్నకు ప్రతిఏటా జరిగే బ్రహ్మోత్సవాలకు ఇక్కడి నుంచి స్వామివారికి జోడుపంచెలు తీసుకెళ్తారు. ఇది వందల ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయం -
దేవరకద్ర ఎమ్మెల్యేకు సొంత పార్టే సమస్య కానుందా?
మహబూబ్ నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పున: వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. ఇందులో 5 మండలాలు ఉన్నాయి. రద్దయిన అమరచింత నియోజకవర్గంలోని దేవరకద్ర (పాక్షికం), చిన్నచింతకుంట మండలాలు, గతంలో వనపర్తి నియోజకవర్గంలో భాగంగా ఉన్న అడ్డాకల్, భూత్పూర్, దేవరకద్ర (పాక్షికం) మండలాలు ఈ నియోజకవర్గంలో కలిశాయి. వర్గపోరు కలిసివచ్చినా.. ప్రభుత్వ వ్యతిరేకతే సమస్య మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి ఆయన అక్కడి నుంచే పోటీ చేయనున్నారు. ప్రతిసారి ఆయనకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గపోరు కలిసి వస్తుంది. ఈసారి కూడా కాంగ్రెస్, బీజేపీలో ఇదే పరిస్ధితి కొనసాగుతుంది. ఇదే తనకు కలిసి వస్తుందనే అభిప్రాయంతో ఎమ్మెల్యే ఉన్నారు. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయనకు పేరుంది. నియోజకవర్గానికి కేటాయించిన డబుల్ బెడ్రూం ఇళ్లను చాలా వరకు నిర్మాణం పూర్తి చేసి లబ్దిదారులకు అందజేశారు. ఎమ్మెల్యేపై కంటే మండల నేతల వ్యవహారంపైనే ఓటర్లు గుర్రుగా ఉన్నారు. పెద్దవాగు, ఊకచెట్టువాగు పై దాదాపు 18 చెక్ డ్యాంల నిర్మాణం చేయించారు. ఎన్నో ఏళ్లుగా వర్నె-ముత్యాలంపల్లి మధ్య వాగులో వంతెన లేక జనాలు వర్షాకాలం అనేక కష్టాలు పడేవారు. ఆ వంతెన మంజూరు చేయించి పనులు చేపట్టడంతో నాలుగైదు గ్రామాల ప్రజల సమస్య తీరుతుంది. కానీ ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత ఈసారి ఆయనకు ఇబ్బందిగా మారనుంది. శంకర సముద్రం రిజర్వాయర్ పనులు పూర్తి అయినా పునరావాసం కొలిక్కిరాకపోవడంతో ఆయకట్టుకు నీరందించటం లేదు. దీంతో పెద్దమందడి, అడ్డాకుల మండలాల ప్రజలు సాగునీటి ఇబ్బందులు పడుతున్నారు. మండలస్దాయిలో పార్టీలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిధిలోని కరివేన రిజర్వాయర్ నీటిరాక ఆలస్యం కావటం కొంత మైనస్‌గా మారే అవకాశం ఉంది. దేవరకద్రకు వందపడకల ఆస్పత్రి మంజూరు కాకపోవటం ఇబ్బందిగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నుంచి 2014, 2018లో డోకూర్ పవన్ కుమార్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తర్వాత ఆయన బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చాలా గ్రూపు రాజకీయాలు ఉన్నాయి. అవే అప్పట్లో పవన్ కుమార్ ఓటమికి కారణమైంది. ఆ సెగ్మెంట్లో న్యాయవాది మధుసూదన్ రెడ్డి( జీఎంఆర్), ప్రదీప్ గౌడ్ వర్గాలు ఉన్నాయి. సీటుకోసం ఎవరంతకు వారు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. సీటు రాని పక్షంలో ఒకరికొకరు ఏ మేరకు సహకరిస్తారో చెప్పలేని విచిత్ర పరిస్దితి ఉంది. దీన్ని అధికార టీఆర్ఎస్ అభ్యర్ది అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందంటున్నారు. అవకాశం వస్తే సీతా దయాకర్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరి దేవరకద్ర సీటు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు డోకూరు పవన్ కుమార్ కూడా తిరిగి కాంగ్రెస్ గూటికీ చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అదే జరిగితే అభ్యర్ది విషయంలో ఇక్కడ నలుగురు నేతల మధ్య పోటీ తీవ్రం అయ్యే అవకాశం లేకపోలేదు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని ఇక్కడి నేతలు భావిస్తున్నారు. పార్టీ గెలిస్తే సీఎం రేసులో ఉన్న రేవంత్ రెడ్డి నేతల మధ్య సమన్వయం చేసేందుకు సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తోంది. గెలుపుపై కాంగ్రెస్ మాత్రం ధీమాగా ఉంది. సొంత పార్టీలోనే ముగ్గురు నేతల పోటీ ఇక బీజేపీలో చేరిన డోకూర్ పవన్ కుమార్ రెడ్డి ఆ పార్టీలో సంతృప్తిగా లేరని తెలుస్తోంది. వరుసగా 2014, 2018 ఎన్నికల్లో ఓటమి చెందిన పవన్ కుమార్‌రెడ్డికి ఈసారి సానుభూతి కలిసి వచ్చే అంశంగా ఉంది. ఇదే సమయంలో స్వంత పార్టీలో పోటీకోసం మరో ముగ్గురు నేతలు ఎగ్గని నర్సింహులు, సుదర్శన్ రెడ్డి, బాలకృష్ణలు సీటు ఆశిస్తుండటం కొంత ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంది. ఇంకోవైపు గత కొన్ని నెలలుగా ప్రజల మధ్యే ఉంటూ ప్రజాసేవ కార్యక్రమంలో పాల్గొంటున్న డీఎస్పీ కిషన్ ఈసారి దేవరకద్ర నుంచి తప్పకుండా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అందుకోసం వివిధ పార్టీలతో ఆయన టచ్‌లో ఉంటూ సీటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు: వ్యవసాయంమే ప్రధానంగా జీవనం సాగించే జనం ఉన్నారు. బీసీ సామాజిక ఓటర్లు అధికంగా ఉన్నారు. భూత్పూర్ నుంచి కొత్తకోట మండలం వరకు NH 44 జాతీయ రహదారి, దేవరకద్ర మీదుగా167 జాతీయ రహదారి కలదు.కొత్తకోటలో చేనేత కార్మికులు,బీడీ కార్మికులు ఉన్నారు పరిశ్రమలు: కొత్తకోట మండలం అప్పరాల దగ్గర కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ కలదు.మూసాపేట మండలంలో ఓ గ్లాస్ పరిశ్రమ ఉంది అడవులు- దేవరకద్ర మండలంలో అడవి అజిలాపురం, బసవయ్య పల్లి పరిసరాల్లో అడవులు ఉన్నాయి. ఆలయాలు- చిన్నచింతకుంట మండలంలో పేదల తిరుపతిగా పిలిచే శ్రీ కురుమూర్తి స్వామిఆలయం,అడ్డాకుల మండలం కందూరులో రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. కాశీ తర్వాత కల్పవృక్షాలు ఇక్కడ ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత. పర్యాటకం: 1), కోయిల్‌సాగర్ ప్రాజెక్టు.2), సరళ సాగర్ ప్రాజెక్ట్ ఆసియాలోనే మొదటిదిగా మరియు ప్రపంచంలో రెండవది ఇక్కడ ప్రత్యేకత మానవ ప్రమేయం లేకుండా వాటర్ వచ్చినప్పుడు గాలి పీడనం (సైఫన్ సిస్టమ్) ద్వారా నీరు బయటికి వస్తుంది. సుదీర్ఘమైన పొడవులో ఊకచెట్టు వాగు ఉంది. -
అలంపూర్: అధికార పార్టీలోనే గ్రూపు రాజకీయాలు.. గెలుపు సాధ్యమేనా?
5వ శక్తి పీఠంగా విరాజిల్లుతున్న అలంపూర్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్లో గ్రూపు రాజకీయాలు కలవరపెడుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి బీఆర్ఎస్లో చేరటంతో అక్కడి రాజకీయ ముఖచిత్రం మారుతుంది. ఇక్కడ బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో దిగుతారనే ప్రచారం జోరందుకోవటంతో బహుముఖపోటీ అనివార్యం కానుంది. నియోజకవర్గం: అలంపూర్ (ఎస్సీ రిజర్వుడ్) మండలాల సంఖ్య: 7 (అలంపూర్, ఉండవెల్లి, మానవపాడు, రాజోలి, వడ్డేపల్లి, ఐజ, ఇటిక్యాల ) పెద్ద మండలం: ఐజ మున్సిపాలిటీలు: అలంపూర్, వడ్డేపల్లి, ఐజ మొత్తం పంచాయతీలు: 125 అత్యంత ప్రభావితం చూపే పంచాయితీ: ఐజ మొత్తం ఓటర్ల సంఖ్య: 222463 పురుషులు: 111024 ; మహిళలు: 111439 సతమతమవుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎస్సీ రిజర్వు నియోజకవర్గం. అలంపూర్ ఎస్సీ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం వర్గపోరుతో సతమతమవుతున్నారు. సౌమ్యుడిగా పేరున్న ఆయనపై సొంతపార్టీ నేతలే అధిష్టానానికి ఫిర్యాదు చేసిన ఘటనలు ఉన్నాయి. గ్రామాలకు వెళ్తే అడ్డుకున్న సందర్భాలు చోటుచేసుకున్నాయి. 2009 ఎన్నికల్లో అబ్రహాం కాంగ్రేస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల్లో పార్టీ టికెట్ రాకపోవటంతో టీడీపీ గూటికి చేరారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన డాక్టర్ అబ్రహం రెండవ స్దానంలో నిలవగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మంద జగన్నాథం తనయుడు మందా శ్రీనాథ్ మూడవ స్దానానికే పరిమితమయ్యారు. తర్వాత అబ్రహం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచే 2018లో పోటీ చేసి విజయం సాధించారు. అయితే అదే నియోజకవర్గానికి చెందిన మాజీఎంపీ,ఢిల్లీలో ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథ్ మధ్య విబేధాలు ఉన్నాయి. దీంతో నియోజకవర్గాలో రెండు వర్గాలుగా పార్టీ నేతలు, కార్యకర్తలు విడిపోయారు. గెలిచిన కొన్నాళ్లు ఎమ్మెల్యే అబ్రహాం బాగానే ఉన్నా తర్వాత పార్టీ నేతలు,కార్తకర్తలతో పొసగలేదు. ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని తమను పట్టించుకోవటం లేదని పలు సందర్భాల్లో బహిరంగంగానే విమర్శించారు. కొన్ని గ్రామాల్లో పార్టీ కార్యక్రమాలకు వెళ్తే అడ్డుకున్నారు. ఇసుక అక్రమ వ్యాపారం ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతుందనే బలమైన ఆరోపణ అయనపై ఉంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపికలో తన వర్గీయులకే ప్రాధాన్యత ఇస్తున్నారని, కమీషన్లు వసూలు చేస్తున్నారని స్వంతపార్టీ నేతలే విమర్శిస్తున్నారు. వందపడకల ఆస్పత్రి అలంపూర్‌లో కాకుండా చౌరస్తాలో ఏర్పాటు చేయటంతో అక్కడి నేతలు సైతం ఆయనపై గుర్రుగా ఉన్నారు. అయితే అబ్రహాం ఈసారి తన తనయుడు అజయ్ కుమార్‌కు సీటు ఇప్పించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన తండ్రికంటే నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ఇది కూడ పార్టీలోని ఇతర నేతలకు రుచించటం లేదు. ఇక ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు నీటిమూటలే అయ్యాయని ఆరోపిస్తున్నారు. స్దానికులు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పరిధిలోని వల్లూరు,మల్లంకుంట రిజర్వాయర్ పనులు చేపట్టలేదు. నియోజకవర్గంలో ఒక్కరికి కూడ డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ జరగలేదు. తెలంగాణలో ఏకైక శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ ఆలయం అభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు తీసుకురాలేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఆయనపై ఈసారి జనాలు గుర్రుగా ఉన్నారు. ఆయన అనుచరుడు యువజన నాయకుడు ఆర్.కిశోర్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మంద జగన్నాథం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట.. ఇవి తనకు చివరి ఎన్నికలనే ఉద్దేశ్యంతో ఉన్నారట అందుకే ఆయన తన ప్రయత్నాలు తీవ్రం చేసినట్టు ప్రచారం సాగుతుంది. అధికార పార్టీ కొంపముంచేట్టుగా గ్రూపు రాజకీయాలు ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకతతో పాటు గ్రూపు రాజకీయాలు కొంపముంచే అవకాశం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ఇటీవలే అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. ఈయనకు ఎమ్మెల్యే అబ్రహంకు మద్య చాలా గ్యాప్ ఉంది. చల్లా పార్టీలో చేరిన తర్వాత అలంపూర్ రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చల్లా ఆశీస్సులు ఉన్నవారికే సీటు వస్తుందని...వారే గెలుస్తారనే నమ్మకం ఉండటంతో ఇప్పుడు నియోజకవర్గంలో అన్ని పార్టీల్లోని తన అనుచరులు, ద్వితీయశ్రేణి నేతలు ఇప్పుడు చల్లా చుట్టు తిరుగుతున్నారు. మరి ఆయన ఎవరికి మద్దతు తెలుపుతాడోననే చర్చ ఆసక్తికరంగా మారింది. అయితే అబ్రహంకు మాత్రం సీటురాకుండా అడ్డుకుంటారనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. కాంగ్రెస్ అలా 2014లో అలంపూర్ నుంచి కాంగ్రేస్ అభ్యర్ది సంపత్ మార్ గెలిచారు. 2018లో ఓడిపోయారు.ఆ నియోజకవర్గంలో ఆయనకు పోటీగా సీటుకోసం ప్రయత్నం చేసే నాయకుడు లేకపోవటంతో పాటు ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న నేపధ్యంలో ఆయనకు సీటు విషయంలో ఇబ్బంది లేదు. ఇప్పటికే సంపత్‌కుమార్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎమ్మెల్యే వైఖరిపై విమర్శలు చేస్తూ జనాలను ఆకర్శించే ప్రయత్నంచేస్తున్నారు. కాని చల్లా వెంకట్రామిరెడ్డి కాంగ్రేస్ పార్టీ వీడి బీఆర్ఎస్లో చేరటం సంపత్‌కుమార్‌కు పెద్దదెబ్బగా భావిస్తున్నారు. పార్టీలో చల్లా అనుచరులు కూడ ఆయన వెంటే వెళ్లటం సంపత్‌కుమార్‌కు సంకటంగా మారనుంది. టీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాటలు,ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని సంపత్వర్గీయులు భావిస్తున్నారు. అయితే సంపత్ ఓడిపోయిన తర్వాత నియోజకవర్గానికి చుట్టపుచూపుగానే వచ్చిపోతారనే విమర్శకూడ ఉంది. నియోజకవర్గంలో కాంగ్రేస్ పార్టీని జనాలు నమ్మె పరిస్దితి లేదనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. బీజేపి ఇలా.. అలంపూర్ సెగ్మెంట్ జనరల్ సీటుగా ఉన్నప్పుడు బీజేపీకి మంచి పట్టుండేది.ఇక్కడి నుంచి మూడు సార్లు బీజేపీ అభ్యర్దులు ఎమ్మెల్యేలుగా గెలిచారు.ఎస్సీ రిజర్వేషన్ మారిన తర్వాత బలమైన నాయకత్వం లేకపోవటంలో పార్టీ చతికిల పడింది.ఇక్కడి నుంచి ఇద్దరు అభ్యర్దులు సీటుకోసం ప్రయత్నిస్తున్నారు.నాగర్‌కర్నూల్‌లో 2019 ఎంపీ ఎన్నికల్లో బీజేపీని పోటీ చేసి ఓడిపోయిన బంగారు శృతి,ఎస్పీ మోర్చ రాష్ట్రనాయకుడు బంగి లక్ష్మణ్ కూడ పార్టీ సీటు కోసం యోచిస్తున్నారు.బంగి లక్ష్మణ్ 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు.వీరంత నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పెద్దగా కృషి చేస్తున్న దాఖలాలు లేవు.మరి రానున్న రోజుల్లో బీజేపీ ఏ మేరకు పుంజుకుంటుందో చూడాలి. నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు: అలంపూర్ నియోజకవర్గ కృష్ణా, తుంగభద్రా రెండు నదుల మధ్యలో ఉండి నడిగడ్డ ప్రాంతంగా పిలవబడుతుంది. ఇటు ఏపీ,అటు కర్ణాటక సరిహద్దులు కలిగిన నియోజకవరం కావటంతో అక్కడి రాజకీయ పరిస్దితుల ప్రభావం ఇక్కడ కూడ ఉండే అవకాశం ఉంటుంది.44 జాతీయ రహదారికి ఇరువైపుల విస్తరించి ఉంది.నియోజకవర్గ ప్రజలు ప్రధానంగా వ్యవసాయమే జీవనోపాధిగా జీవిస్తున్నారు.పత్తి,మిర్చి,పప్పుశెనగను వాణిజ్య పంటగా రైతులు సాగుచేస్తారు.ఆర్డీఎస్ ద్వారా ఇక్కడ పంటపొలాలకు సాగునీరు అందాలి. -
అచ్చంపేట: త్రిముఖ పోరు.. గెలుపు ఎవరిది?
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎస్సీ నియోజకవర్గంగా అచ్చంపేటలో ఈసారీ త్రిముఖపోటీ అనివార్యం కానుంది. గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పథకాలే ప్రధాన ఎజెండాగా అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముందుకెళ్తుండగా ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకతతో పాటు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం తమకు కలిసి వస్తుందని కాంగ్రేస్ భావిస్తుంది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ది గువ్వల బాల్‌రాజు విజయం సాధించారు. ఆయన రెండు సార్లు కాంగ్రెస్ అభ్యర్ది డాక్టర్ వంశీకృష్ణను ఓడించారు. ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్న గువ్వల బాల్‌రాజు మూడోసారి అచ్చంపేట నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. కాని ఆయన వ్యవహారశైలిపై సొంతపార్టీ నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్లు, పార్టీ కార్యకర్తల పట్ల దురుసుగా ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం ప్రభుత్వం అన్ని ప్రాంతాలకు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు తప్పా కొత్తగా తన మార్కు పనులు ఏమీ చేయలేదనే ప్రచారం ఉంది. నియోజకవర్గ సమగ్ర అభివృద్ది కోసం ప్రాధాన్యత ఇవ్వలేదని, ప్రధానంగా ఏజేన్సీ ప్రాంతం అధికంగా ఉన్న అమ్రాబాద్ మండలంలో సాగునీటి సమస్య తీరలేదు. అక్కడ వేలాది మంది రైతులకు చెందిన పోడు భూముల వ్యవహారం కొలిక్కి రాలేదు. దీనికి తోడు ఆయనపై పోడు రైతులు గుర్రుగా ఉన్నారు. బల్మూరు, లింగాల మండలాలకు సాగునీరు అందిస్తామన్న హామీ నేటికి నెరవేరలేదు. పలు మండలాల్లో టీఆర్ఎస్ పార్టీకి కొందరు నేతలు కూడ ఎమ్మెల్యే వైఖరితోనే దూరమవుతున్నారని సొంతపార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. పార్టీ సీనియర్లు, కార్యకర్తలు ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్నా ఆ విషయాన్నిఆయనకు చెప్పే ధైర్యం చేయటం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. భూ వివాదాల్లో కూడా తలదూర్చుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకునియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూం కూడా ఇవ్వలేదు. ఇళ్లస్దలాలు ఇవ్వలేదు. మాదిగా సామాజిక వర్గానికి చెందటం ఆయనకు కలిసి వచ్చే అవకాశంగా ఉంది. ఫాంహౌజ్ ఎపిసోడ్లో గువ్వల బాల్‌రాజ్ కూడ ఉండటంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అచ్చంపేట ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడని సోషల్ మీడియాలో అనేక కామెంట్స్ చక్కర్లు కొట్టడం గువ్వలకు ఇబ్బందిగా మారింది. రంగంలోకి ఎంపీ కొడుకు భరత్ ప్రసాద్? అయితే బాల్‌రాజ్ పక్కన పెడితే నాగర్ కర్నూల్ ఎంపీ రాములుకు సీటు ఇవ్వొచ్చని ఒకవేళ ఆయన వయస్సు మీదపడిందని భావిస్తే ఆయన కుమారుడు భరత్ ప్రసాద్‌ను రంగంలోకి దించే అవకాశం ఉంది. భరత్ ప్రసాద్‌కు నాగర్ కర్నూల్ జడ్పి చైర్మన్‌కి బరిలో నిలిచి చేజాయిరిపోయింది. దానికి ఎమ్మెల్యే గువ్వల బాల్రాజే కారణమని ఆరోపిస్తున్న భరత్ ప్రసాద్ వచ్చే ఎన్నికల్లో అచ్చంపేట నుంచి బీఆర్ఎస్ సీటు ఆశిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో భరత్ ప్రసాద్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. గతంలో అచ్చంపేట ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రస్తుతం ఎంపీగా తన తండ్రి రాములుకు నియోజకవర్గంలో ఉన్న మంచిపేరు కలిసివస్తుందని భావిస్తున్నారు. పార్టీ సీటు ఇవ్వకుంటే స్వతంత్రంగానైనా బరీలో దిగాలనే ఆలోచనలో భరత్ ప్రసాద్ ఉన్నట్టు సమాచారం. దీంతో అధికార బీఆర్ఎస్లో నెలకొన్న గ్రూపు రాజకీయాలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ నుంచి వరుసగా మూడుసార్లు ఓడిన డాక్టర్ వంశీకృష్ణ మరోసారి పోటీకి సిద్దమవుతున్నారు. ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న వంశీకృష్ణ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు,ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సొంత గ్రామం కూడ అచ్చంపేట నియోజకవర్గంలో ఉండటంతో దీనిపై రేవంత్‌రెడ్డి కూడ ప్రత్యేక దృష్టి సారించారు.ఈసీటు తప్పకుండా గెలవాలనే యోచనలో ఉన్నారు.ఎమ్మెల్యే గువ్వలబాల్రాజ్ భూకబ్జాలు,ఇసుక అక్రమ రవాణకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయలేదని మండిపడుతున్నారు. గతంలో పార్టీని వదిలిన నేతలు సైతం తిరిగి సొంతగూటికి వస్తున్న నేపధ్యంలో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే వంశీకృష్ణ భార్య,అమ్రాబాద్ జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ అనురాధను రంగంలోకి దింపితే గెలుపు మరింత సులభమవుతుందనే అభిప్రాయం పార్టీ నేతలు,కార్యకర్తల్లో ఉంది.అయితే మాల సామాజిక వర్గానికి చెందిన వంశీకృష్ణకు మాదిగసామాజిక వర్గ ఓట్లు మైనస్‌గా మారే అవకాశం ఉంది. బీజేపీ నుంచి ఆ ఇద్దరిలో ఎవరూ? బీజేపీ కూడ ఈసారి గెలుపుపే ద్యేయంగా పనిచేయాలని యోచిస్తోంది. బలమైన అభ్యర్దిని రంగంలోకి దింపాలని చూస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల బీజేపీలో చేరిన సతీష్ మాదిగ, శ్రీకాంత్ భీమా పేర్లు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే నేతలు ఎవరు, వారు చర్యలు ప్రారంభించింది.మిగితా బీఎస్పీ,వైఎస్ఆర్టీపీ పార్టీల అభ్యర్దులు పోటీకి ఆసక్తి చూపుతున్నా వారి ప్రభావం నామమాత్రమే కానుంది. నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు: నియోజకవర్గంలో 80 శాతం ప్రజలు వ్యవసాయం పైన ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. పరిశ్రమలు లేవు అడవి విస్తీర్ణం బాగా ఉంటుంది. నియోజకవర్గంలోనే నల్లమలలో దట్టమైన అడవులు ఉన్నాయి. చిరుతలు పెద్దపులులు ఇతర వన్యప్రాణులకు నిలయం నల్లమల్ల. ఉమామహేశ్వర క్షేత్రం, నిరంజన్ షావాలి దర్గా, మద్దిమడుగు, లొద్ది మల్లయ్య, తెలంగాణ అమర్నాథ్గా పలిచే సలేశ్వరం, మామిళ్ళపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలు ప్రసిద్ధిగాంచినవి.అనేక కిలోమీటర్ల పరిధిలో దుందుభినది విస్తరించి ఉంది. ఎస్ఎల్బీసీ నక్కలగండి సాగునీటి ప్రాజెక్టులు పనులు నడుస్తున్నాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో జంగల్ సఫారీ పేరుతో పర్యాటకులను ప్రత్యేకమైన వాహనంలో అడవిలో పర్యటింప చేస్తున్నారు. కే ఎల్ ఐ కాలువ విస్తీర్ణం నియోజకవర్గం లో అధికంగా ఉంది రైతులకు కొంతమేర లబ్ధి జరుగుతుంది. -
కొల్లాపూర్ నియోజకవర్గంనికి తదుపరి పాలకుడు ఎవరు..?
కొల్లాపూర్ నియోజకవర్గం తెలంగాణ అంతటా 2018 ఎన్నికలలో టిఆర్ఎస్ ప్రభంజనం వీచినా కొల్లాపూర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ నేత, అప్పటి వరకు మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన బీరం హర్షవర్దన్‌రెడ్డి 12543 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తదుపరి హర్షవర్దన్ రెడ్డి టిఆర్ఎస్లో చేరిపోవడం విశేషం. కృష్ణారావు వరసగా ఐదుసార్లు గెలిచి 2018లో ఓటమి చెందారు. హర్షవర్దన్‌రెడ్డికి 80611 ఓట్లు రాగా, కృష్ణారావుకు 68068 ఓట్లు దక్కాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన ఇ.సుదాకరరావుకు పదమూడువేలకుపైగా ఓట్లు వచ్చాయి. హర్షవర్దన్ రెడ్డి సామాజికపరంగా రెడ్డి వర్గానికి చెందినవారు. కొల్లాపూర్నియోజకవర్గంలో 2014లో జూపల్లి కృష్ణారావు టిఆర్ఎస్ తరపున ఐదోసారి విజయం సాధించి ముఖ్యమంత్రి కెసిఆర్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. అంతకుముందు వై.ఎస్.రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ క్యాబినెట్లలో మంత్రిగా పనిచేసిన జూపల్లి తెలంగాణ అంశంపైన, కాంగ్రెస్ ఐలో వచ్చిన విబేధాల కారణంగా తన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టిఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత ఉప ఎన్నికలోను, తిరిగి 2014 సాధారణ ఎన్నికలోను ఘన విజయం సాధించారు. కృష్ణారావు 1999లో కాంగ్రెస్ ఐ పక్షాన, 2004లో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్ధిగా ఇండిపెండెంటుగా గెలిచిన ఈయన తిరిగి 2009లో కాంగ్రెస్ ఐ అభ్యర్ధిగా గెలిచారు.తదుపరి రెండుసార్లు టిఆర్ఎస్ అభ్యర్ధిగా గెలిచారు. కాని 2018లో ఓటమిపాలయ్యారు. కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి తొమ్మిది సార్లు, టిడిపి ఒక్కసారి, టిఆర్ఎస్ రెండుసార్లు పిడిఎఫ్ ఒకసారి, ఇండిపెండెంట్లు మూడుసార్లు గెలిచారు. 1978 నుంచి కొత్త వెంకటేశ్వరరావు మూడుసార్లు గెలిస్తే, 1989లో ఈయన సోదరుడు కొత్త రామచంద్రరావు గెలుపొందారు. 1994లో వెంకటేశ్వరరావు ఇండిపెండెంటుగా పోటీచేసి ఓడిపోయారు. 1962లో కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచిన కె. రంగదాసు, 1972లో ఇండిపెండెంటుగా నెగ్గారు. 1985, 89లలో సిపిఐ నాయకుడు సురవరం సుధాకరరెడ్డి ఇక్కడ పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన నల్గొండ నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. కొల్లాపూర్‌లో మూడుసార్లు రెడ్డి నేతలు, పన్నెండు సార్లు వెలమ నేతలు, ఒకసారి బ్రాహ్మణ నేత విజయం సాధించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
కల్వకుర్తి నియోజకవర్గంలో తదుపరి అధికారం ఎవరిది?
కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన జైపాల్ యాదవ్ మూడోసారి గెలిచారు. గతంలో రెండుసార్లు టిడిపి పక్షాన గెలిచిన యాదవ్, టిఆర్ఎస్ లో కి వచ్చి పోటీచేసి విజయం సాదించారు. జైపాల్ యాదవ్ తన సమీప బిజెపి ప్రత్యర్ది తల్లోజు ఆచారిపై 3447 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. ఇక్కడ 2014లో గెలిచి సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ ఐ అభ్యర్ది వంశీచంద్ రెడ్డి మూడోస్థానానికి పరిమితం అవడం విశేషం. ఆయన కు 46523 ఓట్లు వచ్చాయి. కాగా గెలిచిన జైపాల్ యాదవ్‌కు 62892 ఓట్లు రాగా, ఆచారికి 59445 ఓట్లు వచ్చాయి. జైపాల్ యాదవ్ సామాజికవర్గం పరంగా యాదవ వర్గానికి చెందినవారు. కల్వకుర్తి నియోజకవర్గంలో 2014లో ఆసక్తికర ఘట్టం చోటు చేసుకుంది. ఇక్కడ కౌంటింగ్ ముగిసే సమయానికి వంశీచంద్‌రెడ్డి సుమారు 150ఓట్ల ఆధిక్యతలో ఉండగా, చివరన ఒక ఇవిఎమ్. మొరాయించింది. దాంతో ఆ పోలింగ్ బూత్ పరిదిలో ఎన్నికల సంఘం రీపోల్ నిర్వహించింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఆ రీపోల్ తర్వాత 72 ఓట్ల ఆధిక్యతతో యువజన కాంగ్రెస్ అద్యక్షుడుగా కూడా ఉన్న వంశీచంద్ రెడ్డి బిజెపి-టిడిపి కూటమి అభ్యర్ధి టి. ఆచారిపై గెలుపొందారు. కాని 2018లో ఓటమి చెందారు. 2014 ఎన్నికలకు ముందు టిడిపికి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్లోకి మారి పోటీచేసిన అప్పటి సిటింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ 29844 ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో మిగిలారు. 2018లో గెలవగలిగారు. కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి గతంలో నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించిన కల్వకుర్తి నియోజకవర్గానికి విశేష ప్రాధాన్యం ఉంది. తెలుగుదేశం పార్టీని స్థాపించి సంచలనం సృష్టించి, వందల మందికి రాజకీయ జీవితాన్ని అందించిన నందమూరి తారకరామారావు 1989లో ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోవడం ఒక పెద్ద విశేషం. ఎన్.టి.ఆర్.పై కాంగ్రెస్ ఐ అభ్యర్దిగా పోటీచేసిన జె.చిత్తరంజన్ దాస్ గెలిచారు. ఇక్కడ వై.కిష్టారెడ్డి రెండుసార్లు, గెలిచారు. జె. చిత్తరంజన్‌దాస్ రెండుసార్లు గెలిచారు. కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి రాజకీయ జీవితం ఇక్కడ నుంచే ఆరంభమైంది. ఆయన 1969లో జరిగిన ఉప ఎన్నిక ద్వారా తొలిసారి గెలిచి (సిట్టింగ్ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా కోర్టు తీర్పురావడంతో ఉప ఎన్నిక జరిగింది) ఆ తర్వాత వరసగా మరోమూడుసార్లు గెలుపొందారు. జైపాల్‌రెడ్డి మహబూబ్‌నగర్, మిర్యాలగూడలలో రెండేసిసార్లు లోక్‌సభకు ఎన్నికై 2009లో చేవెళ్ళ నుంచి లోక్‌సభక ఎన్నికయ్యారు. కాని 2014లో మహబూబ్‌నగర్‌లో లోక్‌సభకు పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆయన రాజ్యసభకు కూడా ప్రాతినిధ్యం వహించారు. 1980లో ఇందిరాగాంధీపై పోటీచేసి జైపాల్‌రెడ్డి, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ఐలో చేరి కేంద్రమంత్రి కావడం విశేషం. అంతకుముందు యున్కెటెడ్‌ఫ్రంట్ హయాంలో కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. కల్వకుర్తిలో మరోసారి కూడా ఎన్నిక చెల్లకుండా పోవడం వల్ల ఉప ఎన్నిక జరిగంది. కోర్టు తీర్పు కారణంగా 1962లో గెలిచిన అభ్యర్ధి వెంకటరెడ్డి ఎన్నిక చెల్లకుండా పోవడంతో జరిగిన ఉప ఎన్నికలో శాంతాబాయి గెలిచారు. శాంతబాయి ఇక్కడ రెండుసార్లు మక్తల్‌లో ఒకసారి, గగన్‌మహల్‌లో మరోసారి మొత్తం నాలుగుసార్లు గెలిచారు. 1989లో ఎన్.టి.ఆర్.ను ఓడిరచిన చిత్తరంజన్‌దాస్‌కు చెన్నారెడ్డి మంత్రివర్గంలో స్థానం లభించింది. కల్వకుర్తి నియోజకవర్గంలో తొమ్మిదిసార్లు కాంగ్రెస్, కాంగ్రెస్ఐ జనతా పార్టీ రెండుసార్లు, టిడిపి రెండుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి, ఇండిపెండెంట్లు మూడుసార్లు గెలిచారు. కల్వకుర్తిలో ఎనిమిదిసార్లు రెడ్డి సామాజికవర్గం, ఆరుసార్లు బిసి వర్గం నేతలు, రెండుసార్లు బ్రాహ్మణ నేత, రెండుసార్లు ఎస్.సి.నేతలు ఎన్నికయ్యారు. కల్వకుర్తి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
అచ్చంపేట (ఎస్సి) నియోజకవర్గంలో ఇప్పుడు ఆధిపత్యం వహించేది ఎవరు?
అచ్చంపేట (ఎస్సి) నియోజకవర్గం అచ్చంపేట రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి సిటింగ్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రెండోసారి గెలిచారు. టిఆర్ఎస్ పక్షాన మళ్లీ పోటీచేసిన బాలరాజు తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణపై 9114 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. బాలరాజుకు 88073 ఓట్లు రాగా వంశీకృష్ణకు 78959 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన మల్లేశ్వర్‌కు మూడువేలకు పైగా ఓట్లు మాత్రమే వచ్చాయి. అచ్చంపేట రిజర్వుడ్ నియోజకవర్గంలో 2014 నుంచి టిఆర్ఎస్ పాగా వేసింది.2014లో మాజీ మంత్రి టిడిపి నేత రాములు 24199 ఓట్లతో మూడో స్థానానికే పరిమితం కావల్సి వచ్చింది. రాములు ఇక్కడ 1994, 99,2009లలో మూడుసార్లు గెలిచారు. టిఆర్ఎస్ పక్షాన బాలరాజు 2014లో తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణను 11820 ఓట్ల తేడాతో ఓడిరచారు. ఇక్కడ నుంచి నాలుగుసార్లు, నాగర్‌కర్నూల్ నుంచి రెండుసార్లు గెలిచిన సీనియర్ నేత పుట్టపాగ మహేంద్రనాధ్కు టిడిపి నేత రాములు సమీప బంధువు అవుతారు. వీరిద్దరూ మంత్రి పదవులు నిర్వహించారు. మహేంద్రనాధ్ సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేస్తే, రాములు కొంతకాలం చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా వున్నారు. రాములు తదుపరి టిఆర్ఎస్లో చేరి 2019 లోక్‌సభ ఎన్నికలలో నాగర్ కర్నూలు నుంచి గెలుపొందారు. ఇక్కడ ఒకసారి గెలిచిన కె. నాగన్న షాద్‌నగర్, కల్వకుర్తి, అలంపూర్‌లలో కలిపి మొత్తం నాలుగుసార్లు అసెంబ్లీకి గెలిచారు. అచ్చంపేట ఆది నుంచి ఎస్.సి నియోజకవర్గంగానే ఉంది. ఆరుసార్లు, కాంగ్రెస్, కాంగ్రెస్ఐ గెలిస్తే ఐదుసార్లు టిడిపి,రెండుసార్లు టిఆర్ఎస్ గెలిచాయి. ఇది రిజర్వుడ్ నియోజకవర్గం కావడంతో ఎస్.సి.నేతలే ఎన్నికవుతున్నారు. అచ్చంపేట (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఈ సారి గెలుపు ఎవరిదో..!
నాగర్ కర్నూల్ నియోజకవర్గం నాగర్ కర్నూలు నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన మర్రి జనార్దనరెడ్డి రెండోసారి విజయం సాదించారు. ఆయన సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దనరెడ్డిపై 54354 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నాగం టిడిపిని వీడిన తర్వాత కొంతకాలం బిజెపిలో ఉండి, తదుపరి కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ పక్షాన పోటీచేసినా ఫలితం దక్కలేదు. గతంలో నాగం ఆరుసార్లు నాగర్ కర్నూలుకు ప్రాతినిద్యం వహించారు. మర్రి జనార్దనరెడ్డికి 102493 ఓట్లు రాగా, నాగం జనార్దనరెడ్డికి 48139 ఓట్లు వచ్చాయి. ఇక్కడ నుంచి ఎస్.ఎఫ్ బి తరపున పోటీచేసిన సైమన్‌కు ఐదువేలకుపైగా ఓట్లు వచ్చాయి. 2014లో మర్రి జనార్దనరెడ్డి టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి, కాంగ్రెస్ ఐ ప్రత్యర్ధి దామోదరరెడ్డిని 14435 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. నాగర్ కర్నూలులో ఆరుసార్లు గెలిచిన నాగం జనార్ధనరెడ్డి 2014లో మహబూబ్ నగర్ నుంచి లోక్‌సభకు బిజెపి-టిడిపి కూటమి పక్షాన పోటీచేసి ఓడిపోయారు. నాగర్ కర్నూలులో నాగం కుమారుడు శశిధర్ రెడ్డి 2014లో బిజెపి తరపున అసెంబ్లీకి పోటీచేసి 27789 ఓట్లు తెచ్చుకుని మూడో స్థానానికి పరిమితం అయ్యారు. కాంగ్రెస్ ఐ అభ్యర్ధి దామోదరరెడ్డి ఐదుసార్లు ఓటమి చెందడం విశేషం. ఐదుసార్లు టిడిపి తరపున గెలిచిన నాగం జనార్దనరెడ్డి 2012లో తెలంగాణ అంశంపై పార్టీతో విబేధించి టిడిపికి గుడ్ బె చెప్పి శాసనసభకు కూడా రాజీనామా చేశారు. తిరిగి ఆయన నాగర్‌కర్నూల్ నుంచి శాసనసభకు ఇండిపెండెంటుగా పోటీ చేసి కాంగ్రెస్ ఐ అభ్యర్థి దామోదం రెడ్డిపైన గెలుపొందారు. నాగం జనార్దనరెడ్డి తదుపరి బిజెపిలో చేరారు. ఆ ఉపఎన్నికలో టిడిపి పక్షాన పోటీచేసిన మర్రి జనార్దనరెడ్డి టిఆర్ఎస్లోకి మారి గెలుపొందారు. 2018లో కూడా ఆయన గెలిచారు. 1952 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఆరుసార్లు, తెలుగుదేశం ఐదుసార్లు, టిఆర్ఎస్ రెండుసార్లు, ఇండిపెండెంట్లు రెండుసార్లు విజయం సాధించారు. 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు ఇద్దరు ఇండిపెండెంట్లే గెలవగ, 1957లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. 1957లో సీనియర్ నేత మహేంద్రనాద్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, 1962లో కాంగ్రెస్ పక్షాన గెలిచారు. మహేంద్రనాద్ 1967,1972లలో కాంగ్రెస్ పక్షాన అచ్చంపేటలో, 1983,85లలో టిడిపి తరుపున అచ్చంపేటలోనే గెలిచారు. జిల్లాలో అందరికన్నా ఎక్కువగా ఆరుసార్లు గెలిచిన ఘనత మహేంద్రనాద్కు, అలాగే నాగంకు దక్కింది. మహేంద్రనాద్ గతంలో పి.వి. నరసింహారావు, జలగం వెంగళరావు, ఎన్.టి. రామారావుల క్యాబినెట్లలో మంత్రిగా పనిచేశారు. నాగం జనార్ధనరెడ్డి ఆరుసార్లు గెలిస్తే, వి.ఎన్.గౌడ్ మూడుసార్లు, గౌడ్ కుమారుడు మోహన్‌గౌడ్ ఒకసారి గెలిచారు. జనార్ధనరెడ్డి 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. నాగర్ కర్నూల్ నుంచి పది సార్లు రెడ్లు,నాలుగుసార్లు బిసి (గౌడ)ఒకసారి ఇతరులు, మూడుసార్లు ఎస్.సి.నేతలు ఎన్నికయ్యారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
అలంపూర్ (ఎస్సి) నియోజకవర్గానికి పరిపాలించే పాలకుడు ఎవరు?
అలంపూర్ (ఎస్సి) నియోజకవర్గం అలంపూర్ రిజర్వుడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన మల్లెపోగు అబ్రహం గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ ఐ పక్షాన ఒకసారి గెలిచిన అబ్రహం 2018లో టిఆర్ఎస్లో చేరి పోటీచేసి విజయం సాదించారు. ఇక్కడ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ ఐ అభ్యర్ది సంపత్‌కుమార్ ఓటమి చెందారు. తెలంగాణ అసెంబ్లీ నుంచి సంపత్‌ను అనుచిత ప్రవర్తన పేరుతో బహిష్కరించడం వివాదం అయింది. ఆ సానుభూతి కూడా ఆయనకు పనిచేయలేదు. అబ్రహం 44670 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. అబ్రహంకు 102105 ఓట్లు రాగా, సంపత్ కుమార్‌కు 57426 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఎస్.ఎప్.బి తరపున పోటీచేసిన హరిజన అబ్రహంకు 6800 ఓట్లు వచ్చాయి. శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అలంపూర్ నియోజకవర్గం రిజర్వుడు కేటగిరిలోకి వెళ్ళింది. ఆ తర్వాత రెండుసార్లు కాంగ్రెస్ ఐ పార్టీ, ఒకసారి టిఆర్ఎస్ గెలిచాయి. 2014లో కాంగ్రెస్ ఐ అభ్యర్ధి సంపత్ కుమార్, సిటింగ్ ఎమ్మెల్యే వి.ఎమ్.అబ్రహం ను 6730 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు.అబ్రహం కాంగ్రెస్ ఐ నుంచి టిడిపిలోకి వెళ్లి పోటీచేశారు. ఇక్కడ 2014లో టిఆర్ఎస్ తరపున పోటీచేసిన మాజీ ఎమ్.పి మందా జగన్నాధం కుమారుడు శ్రీనాద్ ఓడిపోయారు. శ్రీనాద్కు 38136 ఓట్లు వచ్చాయి.కాగా 2014లో నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజక వర్గానికి టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన మందా జగన్నాధం కూడా ఓడిపోవడం విశేషం. అలంపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఎనిమిదిసార్లు, భారతీయ జనతాపార్టీ మూడుసార్లు, టిడిపి రెండుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి, జనతా ఒకసారి గెలిచాయి. ఒక ఇండిపెండెంటు కూడా నెగ్గారు. బిజెపి నేత రావుల రవీంద్రనాధరెడ్డి ఇక్కడ మూడుసార్లు గెలిచారు. రవీంద్రనాద్ రెడ్డి తదుపరి కాంగ్రెస్ ఐలో చేరినా, టిక్కెట్ రాకపోవడంతో తిరుగుబాటు అభ్యర్ధిగా దేవరకద్రలో పోటీచేసి ఓడిపోయారు. అలంపూర్‌లో రెండుసార్లు గెలిచిన టి. చంధ్రశేఖర్ రెడ్డి, ఒకసారి గెలిచిన రజనీబాబులు సోదరులు. అలాగే రెండుసార్లు శాసనసభకు, మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికైన లక్ష్మీకాంతమ్మ కూడా వీరికి సోదరి అవుతారు. 1952లో ఇక్కడ గెలిచిన నాగన్న కల్వకుర్తి, అచ్చంపేట, షాద్‌నగర్‌లలో కలిపి నాలుగుసార్లు గెలిచారు. ఇక్కడ రెండుసార్లు గెలిచిన పి. పుల్లారెడ్డి, గద్వాలలో కూడా మరోసారి గెలిచారు. 2004లో గెలిచిన చల్లా వెంకట్రామిరెడ్డి, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి మనుమడు అవుతారు. ఈయన తండ్రి రాంభూపాల్‌రెడ్డి మూడుసార్లు చట్టసభకు ఎన్నికయ్యారు. కాగా అలంపూర్ రిజర్వు కావడానికి ముందు తొమ్మిదిసార్లు రెడ్లు, నాలుగు సార్లు కమ్మ, ఒకసారి ఇతరులు ఎన్నికయ్యారు. అలంపూర్ (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
జోగులాంబ గద్వాల్లో ప్రజల ఓట్లను ఎవరు గెలుస్తారు?
గద్వాల నియోజకవర్గం గద్వాల నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, మాజీ మంత్రి డి.కె.అరుణపై 28260 ఓట్ల మెజార్టీతో గెలిచారు. గద్వాలలో గట్టి నేతగా పేరున్న అరుణ 2018లో తనకు మేనల్లుడు అయ్యే కృష్ణవెెూహన్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఎన్నికల తర్వాత అరుణ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బారతీయ జనతా పార్టీలో చేరడం విశేషం. కృష్ణమోహన్ రెడ్డికి 100415 ఓట్లు రాగా అరుణకు 72155 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఇక్కడ ఎస్.ఎప్.బి తరపున పోటీచేసిన అబ్దుల్ మొహిన్ ఖాన్ ఏడువేల ఓట్లకు పైగా తెచ్చుకుని మూడో స్థానంలో ఉన్నారు. కృష్ణమోహన్ రెడ్డి సామాజికపరంగా రెడ్డి వర్గానికి చెందినవారు. గద్వాల శాసనసభ నియోజకవర్గం నుంచి రాజకీయ కుటుంబానికి చెందిన డి.కె.అరుణ మూడుసార్లు శాసన సభకు ఎన్నికయ్యారు. రెండోసారి ఎన్నికయ్యాక డాక్టర్.రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్లో మంత్రి పదవిని పొందారు. తదుపరి రోశయ్య, కిరణ్‌ల మంత్రివర్గాలలో కొనసాగారు. 2014లో ఆమె తన మేనల్లుడు టిఆర్ఎస్ అభ్యర్ధి అయిన కృష్ణమోహన్‌రెడ్డిపై 8260 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. గద్వాలలో పదిహేను సార్లు రెడ్డి సామాజిక వర్గం ఎన్నికైంది. ఒకసారి మాత్రం బిసి (బోయ) ఎన్నికయ్యారు. గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఏడుసార్లు, టిడిపి రెండుసార్లు గెలిచినా, కోర్టు తీర్పు కారణంగా ఒకసారి కాంగ్రెస్ ఐ వశం అయింది. ఒకసారి టిఆర్ఎస్, ఒకసారి జనతా, ఒకసారి సమాజ్‌వాది పార్టీ అభ్యర్ధి గెలుపొందారు. మూడుసార్లు ఇండి పెండెంట్లు గెలిచారు. డి.కె. అరుణ 2004లో కాంగ్రెస్ ఐ టిక్కెట్ రాకపోవడంతో సమాజవాది పక్షాన పోటీచేసి గెలుపొంది కాంగ్రెస్ ఐ అనుబంధ సభ్యులయ్యారు. గద్వాలలో డి.కె. కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ కుటుంబానికి చెందిన సత్యారెడ్డి రెండుసార్లు, ఈయన పెద్ద కుమారుడు డి.కె.సమరసింహారెడ్డి నాలుగుసార్లు, రెండో కుమారుడు భరతసింహారెడ్డి ఒకసారి, భరతసింహారెడ్డి భార్య అరుణ మూడుసార్లు గెలుపొందారు. అంటే మొత్తం తొమ్మిది సార్లు ఈ కుటుంబీకులే గెలుపొందారు. అయితే 1994లో అన్నదమ్ములిద్దరూ పోటీపడితే టిడిపి మద్దతుతో ఇండిపెండెంటుగా ఉన్న భరత్ సింహారెడ్డి గెలవగా, 1999లో బావా మరదళ్ళు పోటీపడి ఇద్దరూ పరాజితులయ్యారు. ఒకసారి టిడిపి అభ్యర్ధి గట్టు భీముడు గెలుపొందారు. 2004,2009లో అరుణ గెలుపొందారు. 2009లో డి.కె. అరుణ, ఆమెకు మేనల్లుడు అయ్యే టిడిపి పక్షాన కృష్ణమోహన్‌రెడ్డి పోటీపడటం విశేషం. 2014లో ఆయన టిఆర్ఎస్లోకి మారారు కాని ఫలితం దక్కలేదు. 2018లో గెలవగలిగారు. 1985లో టిడిపి అభ్యర్ధిగా గెలిచిన గోపాల్‌రెడ్డి ఎన్నిక చెల్లదని, సమరసింహారెడ్డి ఎన్నికైనట్లు కోర్టు ప్రకటించింది. డి.కె. సమరసింహారెడ్డి గతంలో చెన్నా, నేదురుమల్లి, కోట్ల మంత్రివర్గాలలో పనిచేశారు. ఇక్కడ ఒకసారి గెలిచిన పి.పుల్లారెడ్డి అలంపూర్‌లో రెండుసార్లు గెలుపొందారు. కాగా మాజీమంత్రి డి.కె. సమరసింహారెడ్డి తెలుగుదేశంలో చేరడం విశేషం. కాని2004లో ఇక్కడ బిజెపి మిత్రపక్షం పోటీచేయడంతో ఆయనకు అవకాశం రాలేదు.దాంతో ఆయన ఆ పార్టీని వదలివేశారు. గద్వాల నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
వనపర్తి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు?
వనపర్తి నియోజకవర్గం వనపర్తి నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విజయం సాదించారు. ఆయన మొదటి సారి గెలిచారు. 2014 నుంచి ఐదేళ్ళ తెలంగాణ ప్రణాళికా అభివృద్ది మండలి ఉపాద్యక్షుడుగా పనిచేసిన నిరంజన్ రెడ్డి ఎన్నికలలో గెలిచి మంత్రి అయ్యారు. నిరంజన్ రెడ్డి తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, మాజీ మంత్రి జి.చిన్నారెడ్డిపై 51685 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. ఇక్కడ టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర రెడ్డి, కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి కలిసి పనిచేసినా మహాకూటమి ఘోరంగా ఓడిపోవడం విశేషం. నిరంజన్‌రెడ్డికి 111956 ఓట్లు రాగా, చిన్నారెడ్డికి 60271 ఓట్లు వచ్చాయి. బిజెపి పక్షాన పోటీచేసిన కె.అమరేందర్ రెడ్డికి మూడువేల పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి. నిరంజన్ రెడ్డి సామాజిక పరంగా రెడ్డి వర్గం నేత. మాజీ మంత్రి డాక్టర్ జి.చిన్నారెడ్డి వనపర్తిలో 2009లో ఓడిపోయినా, 2014లో విజయం సాధించారు. 2014లో ఆయన టిఆర్ఎస్ సమీప ప్రత్యర్ధి నిరంజన్ రెడ్డిపై 3888 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. 2014లో సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టిడిపి సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డి ఓటమి చెందారు. 45200 ఓట్లు తెచ్చుకుని ఈయన మూడోస్థానానికి పరిమితం అవ్వవలసి వచ్చింది. చిన్నారెడ్డి 1989, 1999, 2004,2014లలో గెలుపొందారు.2018లో ఓటమిచెందారు. రావుల చంధ్రశేఖర్‌రెడ్డి 1994లోను, తిరిగి 2009లో గెలిచారు. వనపర్తి నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి పదిసార్లు, టిడిపి నాలుగుసార్లు, ఒకసారి టిఆర్ఎస్, పి.ఎస్.పి ఒకసారి గెలు పొందాయి. 1957లో వనపర్తిలో పద్మనాభరెడ్డి ఏకగ్రీవంగా గెలుపొందారు. ప్రముఖ రచయిత సురవరం ప్రతాపరెడ్డి 1952లో ఇక్కడ నుంచి గెలుపొందారు. టిడిపి నేత డాక్టర్ ఎ.బాలకృష్ణయ్య రెండుసార్లు గెలిస్తే, జె. కుముదినిదేవి రెండుమార్లు గెలు పొందారు. రావుల చంధ్రశేఖర్ రెడ్డి ఛీప్విప్గా పనిచేయగా, 2002లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. వనపర్తిలో పన్నెండు సార్లు రెడ్డి సామాజికవర్గం గెలు పొందితే, నాలుగుసార్లు బిసిలు గెలిచారు. చిన్నారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో మంత్రి అయ్యారు. వనపర్తి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
మక్తల్ నియోజకవర్గంలో అధికారం వహించేది ఎవరు?
మక్తల్ నియోజకవర్గం మక్తల్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన చిట్టెం రామ్మోహన్ రెడ్డి మూడోసారి విజయం సాదించారు. గతంలో ఆయన ఒక ఉప ఎన్నికతో సహా రెండు సార్లు కాంగ్రెస్ఐ పక్షాన పోటీచేసి గెలిచారు. 2014లో కాంగ్రెస్ ఐ తరపున గెలిచి, తదుపరి పరిణామాలలో ఆయన టిఆర్ఎస్లో చేరిపోయారు. 2018లో టిఆర్ఎస్ అభ్యర్దిగా తన సమీప ప్రత్యర్ది, ఇండిపెండెంట్ అభ్యర్ధి జలంధర్ రెడ్డిపై 48315 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. రామ్మోహన్ రెడ్డికి 78686 ఓట్లు రాగా, జలందర్ రడ్డికి 30371 ఓట్లు వచ్చాయి. మహకూటమిలో భాగంగా ఇక్కడ టిడిపి పక్షాన పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకరరెడ్డికి దాదాపు 25,800 ఓట్లు వచ్చాయి. రామ్మోహన్ రెడ్డి మూడుసార్లు గెలిస్తే ఆయన తండ్రి నర్సిరెడ్డి గతంలో మూడుసార్లు గెలిచారు. రామ్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి డికె.అరుణ సోదరి అవుతారు. 2009 ఎన్నికలలో టిడిపి నేత దయాకరరెడ్డి, ఆయన భార్య సీత ఇద్దరూ గెలుపొంది చట్టసభకు వెళితే 2014లో ఇద్దరూ ఓటమి చెందారు. నారాయణ పేట నుంచి 2014లో మక్తల్‌కు మారిన మాజీ మంత్రి ఎల్లారెడ్డి కూడా ఓటమి చెందారు. చిట్టెం రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ఐ అభ్యర్ధిగా రంగంలో దిగి వీరిద్దరిని ఓడిరచడం విశేషం. ఎల్లారెడ్డి గతంలో టిడిపిలో ఉండి 2014లో టిఆర్ఎస్లోకి మారినా ఓడిపోవలసి వచ్చింది. మక్తల్‌లో ఏడుసార్లు రెడ్డి సామాజికవర్గం, ఆరుసార్లు బిసి సామాజికవర్గాలు మూడుసార్లు ఇతరులు గెలుపొందారు. రెండు సార్లు ఎస్.సి.నేతలు గెలిచారు. మక్తల్ నియోజకవర్గంలో కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐలు కలిసి పదిసార్లు టిడిపి మూడుసార్లు జనతా, జనతాదళ్, టిఆర్ఎస్ ఒక్కొక్కసారి గెలుపొందాయి. 1952, 57లలో ఈ నియోజకవర్గం ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. ఇక్కడ నుంచి కళ్యాణి రామచంద్రరావు మూడుసార్లు, సి. నర్శిరెడ్డి మూడుసార్లు గెలవగా, వై.ఎల్లారెడ్డి ఇక్కడ రెండుసార్లు, కొత్తగా ఏర్పడిన నారాయణపేటలో ఒకసారి గెలుపొందారు. నర్సిరెడ్డి 2009లో గెలిచాక నక్సల్స్ తూటాలకు బలెపోయారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు రామ్మోహనరెడ్డి గెలిచారు. కాని 2009లో గెలవలేకపోయారు. తిరిగి 2014, 2018లలో గెలవగలిగారు. నర్శిరెడ్డి కుమార్తె డి.కె. అరుణ గద్వాల నుంచి గెలిచి మంత్రి అయ్యారు. 2014లో సోదరి, సోదరులైన అరుణ, రామ్మోహన్ రెడ్డిలు శాసనసభలో ఉన్నారు. ఇక్కడ గెలిచిన వారిలో ఇద్దరు మంత్రులు అయ్యారు. కళ్యాణి రామచంద్రరావు గతంలో కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రి వర్గంలో ఉంటే, ఎల్లారెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. 1952లో ఇక్కడ గెలిచిన శాంతాబాయి, కల్వకుర్తిలో రెండుసార్లు, హైదరాబాదులోని గగన్‌మహల్ ఒకసారి మొత్తంమీద నాలుగు పర్యాయాలు ఎన్నికయ్యారు. మక్తల్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం విజేత ఎవరు..!
దేవరకద్ర నియోజకవర్గం 2009లో నియోజకవర్గ పునర్ విభజనలో అమరచింత నియోజకవర్గం రద్దై దేవరకద్ర నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది దేవరకద్ర నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి రెండోసారి గెలిచారు. ఆయన తన సమీప ప్రత్యర్ది, కాంగ్రెస్ ఐ అభ్యర్ధి పవన్ కుమార్ రెడ్డిపై 34385 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. వెంకటేశ్వరరెడ్డి కి 93358 ఓట్లు రాగా, పవన్ కుమార్ రెడ్డికి 58973 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన నర సింహులుకు 5300 పైగా ఓట్లు వచ్చాయి. 2009శాసనసభ ఎన్నికలలో దంపతులైన టిడిపి నేతలు దయాకరరెడ్డి, సీత ఇద్దరూ రెండు నియోజకవర్గాల నుంచి శాసనసభకు ఎన్నికై రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తే, 2014లో ఇద్దరూ పరాజితులు అయ్యారు. దేవరకద్రలో సీతా దయాకరరెడ్డి టిడిపి పక్షాన పోటీచేసి రెండోస్థానంలో కూడా ఉండలేకపోయారు. ఇక్కడ2014లో టిఆర్ఎస్ నేత వెంకటేశ్వరరెడ్డి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి పవన్ కుమార్ రెడ్డిపై 14642 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. సీత భర్త దయాకరరెడ్డి ఒకసారి మక్తల్ నుంచి రెండుసార్లు అమరచింత నియోజకవర్గం నుంచి గెలుపొందారు. దేవరకద్ర, అమరచింత ల నుంచి తొమ్మిది సార్లు రెడ్డి నేతలు గెలుపొందగా,రెండుసార్లు ముస్లింలు, మూడుసార్లు ఇతరులు గెలుపొందారు. అమరచింత (2009లో రద్దు) గతంలో ఉన్న అమరచింత నియోజకవర్గం 2009లో రద్దు అయింది. 1962 వరకు ఆత్మకూరు నియోజకవర్గంగా ఉన్న ఈ ప్రాంతంలో సోంభూపాల్ ఈ రెండుచోట్ల ఇండిపెండెంటుగా గెలిస్తే, 1972లో అమరచింతలో కాంగ్రెస్ పక్షాన ఏకగ్రీవంగా గెలవడం విశేషం. కాంగ్రెస్ ఐ తరుపున కె.వీరారెడ్డి రెండుసార్లు గెలవగా, అమరచింతలో రెండుసార్లు గెలిచిన కె.దయాకరరెడ్డి 2014లో మక్తల్‌లో పోటీ చేసి గెలవడంతో మూడోసార్లు విజయం సాధించినట్లయింది. దేవరకద్ర నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
వచ్చే ఎన్నికల్లో జడ్చర్ల నియోజకవర్గంలో గెలిచేది ఎవరు..?
జడ్చర్ల నియోజకవర్గం మంత్రి పదవిలో ఉంటూ టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన డాక్టర్ సి.లక్ష్మారెడ్డి మూడోసారి విజయం సాదించారు. కాని 2018లో గెలిచిన తర్వాత ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడం విశేషం. లక్ష్మారెడ్డి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ది, మాజీ ఎమ్.పి డాక్టర్ మల్లు రవిపై 45082 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. లక్ష్మారెడ్డి ఇంతకుముందు రెండుసార్లు ఇక్కడ నుంచే గెలుపొందారు. లక్ష్మారెడ్డికి 94598 ఓట్లు రాగా, మల్లు రవికి 49516 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన మదుసూదన్ యాదవ్‌కు 3600 ఓట్లు మాత్రమే వచ్చాయి. సి.లక్ష్మారెడ్డి రెండువేల నాలుగులో టిఆర్ఎస్ పక్షాన గెలిచినా, ఆ తర్వాత పదవికి రాజీనామా చేసి 2008 ఉప ఎన్నికలో పోటీచేసి ఓటమి పాలయ్యారు. రెండువేల పద్నాలుగులో లక్ష్మారెడ్డి తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్ ఐ పార్టీ సీనియర్ నేత డాక్టర్ మల్లు రవిపై 14734 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. టిడిపి-బిజెపి కూటమి పక్షాన పోటీచేసిన సిటింగ్ ఎమ్మెల్యే ఎమ్.చంద్రశేఖర్‌కు 11465 ఓట్లు మాత్రమే వచ్చి ఓటమి పాలయ్యారు. మల్లు రవి 2008లో జరిగిన ఉపఎన్నికలో గెలిచి కొంతకాలం విప్ పదవిని నిర్వహించారు. అంతకు ముందు ఢల్లీిలో రాష్ట్ర ప్రభుత్వ అదికార ప్రతినిధిగా కూడా ఉన్నారు. నాగర్ కర్నూల్ ఎమ్.పిగా కూడా రెండుసార్లు ఎన్నికయ్యారు. అంతకు ముందు ఆయన సోదరుడు మల్లు అనంతరాములు కూడా నాగర్‌కర్నూల్ నుంచి ఎమ్.పిగా గెలుపొందారు. అనంత రాములు పీసీసీ అధ్యకక్షుడిగా కూడా పనిచేశారు. మల్లురవి మరో సోదరుడు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా మధిర నుంచి 2009, 2014, 2018లలో గెలుపొందారు. ఛీఫ్ విప్, ఉప సభాపతి పదవులను నిర్వహించారు. రవికి మాజీ ఉప ముఖ్యమంత్రి, దివంగత నేత కోనేరు రంగారావు మామ అవుతారు. జడ్చర్లలో కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి నాలుగుసార్లు, తెలుగుదేశం పార్టీ ఆరుసార్లు, టిఆర్ఎస్ మూడుసార్లు గెలిచాయి. ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా గెలిచారు. 1994లో ఇక్కడ గెలిచిన ఎమ్. సత్యనారాయణ హత్యకు గురి అయ్యారు. ఆ తర్వాత 1996లో జరిగిన ఉప ఎన్నికలోను, 1999లోను, తిరిగి 2009లోను సత్యనారాయణ సోదరుడు ఎమ్. చంద్రశేఖర్ గెలుపొందారు. ఇక్కడ నుంచి కాంగ్రెస్ నేత ఎన్.నరసప్ప, టిడిపి నేత కృష్ణారెడ్డి రెండేసి సార్లు గెలిచారు. జడ్చర్లలో ఏడుసార్లు రెడ్డి నేతలు, ఏడుసార్లు బిసి నేతలు (ప్రధానంగా ముదిరాజ్ వర్గం) గెలుపొందారు. ఇది జనరల్ సీటు అయినా ఉప ఎన్నికలో ఎస్.సి.నేత అయిన మల్లురవి పోటీచేసి గెలిచారు.మూడుసార్లు ఇతరులు గెలిచారు. జడ్చర్ల నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..