మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా సాగనుంది. త్రిముఖపోటీ జరుగనుంది. అధికార బీఆర్ఎస్ దీటుగా ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌లు సత్తాచాటేందుకు సమాయత్త మవుతున్నాయి. చేసిన అభివృద్ది.. తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్‌కు జనాలు మరోసారి పట్టం కాడతారని ఆ పార్టీ భావిస్తుంది. పాత సీటును నిలుపుకునేందుకు కాంగ్రెస్ చూస్తుంటే.. బీజేపీ పాలమూరు సీటుపై ఫోకస్ పెట్టింది. సామాజిక వర్గాల వారిగా చూస్తే ముస్లీం మైనార్టీల ఓట్లు అధికంగా ఉన్నాయి.
ముదిరాజ్, యాదవ సామాజిక వర్గం ఓట్లు ఫలితం కూడా ప్రభావితం చేసే స్దాయిలో ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నివాసం ఉంటున్నవారు, ఉద్యోగుల ఓట్లు కూడ ఎక్కువగ ఉన్నాయి. దీంతో ఫలితంపై అన్ని అంశాలు ప్రభావితం చూపే అవకాశం ఉంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014, 2018లో మహబూబ్‌నగర్ సెగ్మెంట్లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాస్‌గౌడ్ పోటీ చేసి విజయం సాధించారు. రెండవసారి గెలిచిన తర్వాత ఆయన మంత్రి అయ్యారు. మూడోసారి ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయనున్నారు. మంత్రిగా నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తున్న ఆయన మరోసారి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి ఆరోపణలు.. బీఆర్‌ఎస్‌కు అదే మైనస్!
బైపాస్ రహదారి పర్యాటకం మయూరి పార్క్, పెద్ద చెరువు ట్యాంక్‌బండ్, శిల్పారామం, నెక్లెస్ రోడ్డు, పట్టణంలో కూడళ్ల అభివృద్ది, సుందరీకరణ ఆయనకు కలిసివచ్చే అంశాలుగా ఉన్నాయి. డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో అన్ని నియోజవర్గాల కంటే ముందు వరుసలో ఉన్నా నిర్మాణం జరిగిన ఇళ్లను లబ్దిదారులకు పంపిణీ చేయటంలో జాప్యం జరగటం.. అందులో అవినీతి ఆరోపణలు రావటం కొంత ఇబ్బందిగా మారింది. పరిస్ధితి తనకు తెలిసిన వెంటనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ దిద్దుబాటు చర్యలు దిగారు. అక్రమార్కులపై కేసులు కూడ నమోదయ్యాయి. ఎన్నికల అఫ్రిడవిటిల్లో తప్పుడు వివరాలు నమోదు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తరచుగా జరిగే కొన్ని ఘటనలు ఆయనకు ఇబ్బందిగా మారాయి. ఓ కార్యక్రమ ర్యాలీలో బహిరంగంగా గాలిలో కాల్పులు జరపటంతో విమర్శలు ఎదుర్కొన్నారు. హత్య కుట్ర కేసు వ్యవహారం కూడ ఆయనకు కొంత మైనస్‌గా మారింది.
అనారోగ్యం బారిన పడిన వారి బాగుకోసం నిత్యం అందుబాటులో ఉండి వారికి ముఖ్యమంత్రి సహయనిధి నుంచి భారీగా నిధులు ఇప్పించి మెప్పుపొందారు. జిల్లా జనరల్ ఆస్పత్రి అభివృద్ది కోసం విశేష కృషి చేశారు. ముఖ్యంగా కరోనా సందర్భంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరోనా బాధితులు ఇక్కడ మెరుగైన వైద్యసేవలు అందేలా వసతులు కల్పించారు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు బలవంతంగా ఇతర పార్టీల వారిని తన పార్టీలో చేర్చుకుంటున్నారని, లేకుంటే కక్షసాధింపులకు దిగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనుచరులు భూ ఆక్రమణలకు దిగుతున్నారనే అపవాదు కూడ ఉంది. తన అనుచరులకు పెద్దపీట వేసి ఉద్యమకాలంలో పనిచేసిన వారిని విస్మరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇతర పార్టీల్లో ఆయనను తట్టుకుని నిలిచే నేతలు ఇటు కాంగ్రెస్, బీజేపీలో స్దానికంగా లేకపోవటం కలిసి వచ్చే అంశం.
రంగంలోకి బీకే అరుణ.. బీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ తప్పదు
అయితే బీజేపీ నుంచి డీకే అరుణ పోటీలో ఉంటే కొంత ఇబ్బందిగా మారుతుందనే అభిప్రాయం ఆయన వర్గీయుల్లో వ్యక్తం అవుతుంది. మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా గెలిచారు. చాలా మంది మంత్రి పదవులు సైతం పొందారు. కానీ ఇప్పుడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి అధ్వాన్నంగా మారింది. పోటీకి బలమైన అభ్యర్ది లేడనే అభిప్రాయం ఉంది. ఉన్నదాంట్లో ఎవరంతకు వాళ్లు తమకు సీటుకావాలనే అశతో ఉన్నారు. పార్టీ బలోపేతంపై పెద్దగా శ్రద్ద కనబరిచిన దాఖలాలు లేవు. చాలా మంది పార్టీని వీడటం కూడ తలనొప్పిగా మారింది. మైనార్టీ ఓట్లు అధికంగా ఉన్న ఈ సెగ్మెంట్లో ఆ సామాజికవర్గాల ఓట్లను తమవైపు మలుపుకునే దిశగా ఎలాంటి కార్యాచరణ చేయటం లేదు. కాంగ్రెస్ పార్టీని గెలిపించినా గెలిచినా అభ్యర్ది ఆ పార్టీలో ఉంటాడో లేదో తెలియని అయోమయం నెలకొంది.
దీంతో ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు వేసేందుకు విశ్వసించటం లేదనే అభిప్రాయం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని అంటున్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీలో అక్రమాలు జరిగాయని పేద ప్రజలు గుర్రుగా ఉన్నారని చెప్పుకొస్తున్నారు. ఒబేదుల్లా కోత్వాల్, సంజీవ్ ముదిరాజ్‌లు సీటు ఆశిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధీటుగా నిలిచే అభ్యర్దిని బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కూడ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇంకోవైపు టీటీడీ బోర్డు సభ్యుడు, పారిశ్రామికవేత్త మన్నె జీవన్‌రెడ్డి పేరు కూడ ప్రముఖంగా వినిపిస్తోంది.
జోడో యాత్ర, కార్ణాటక గెలుపు కాంగ్రెస్ కలిసి వస్తుందా?
రాహుల్ గాంధీ జోడో యాత్ర విజయవంతం కావటం.. కర్ణాటకలో పార్టీ గెలుపు కలిసి వచ్చే అంశంగా మారింది. గతంలో పార్టీని వీడిన నేతలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతుండటంతో ఆ పార్టీలొ కొత్తజోష్ నెలకొంది. 2012 ఉపఎన్నికల్లో ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేసిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డి విజయం సాధించారు. పొత్తులో భాగంగా బీజేపీ నుంచి 1999లో ఏపీ జితేందర్‌రెడ్డి మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం బీజేపీ పాలమూరుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇక్కడి నుంచి ఈ సారి కషాయం జెండా ఎగురవేయాలని యోచిస్తున్నారు. డీకే అరుణను ఇక్కడి నుంచి బరీలో దింపాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో డీకే అరుణకు.. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్‌కు వచ్చిన ఓట్లకంటే అధికంగా రావటంతో పార్టీకి బూస్ట్ ఇచ్చినట్టయ్యింది.
జితేందర్‌రెడ్డి కూడ బీజేపీలో ఉండటం, బండి సంజయ్ కుమార్‌కు ప్రజాసంగ్రామయాత్ర ఈ జిల్లాలో విజయవంతం కావటం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సహం నింపింది. ఈసారి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీమంత్రి చంద్రశేఖర్, ఎన్పీ వెంకటేష్‌తో పాటు మరో రెండు మూడు పేర్లు పోటీ చేసే అభ్యర్దుల జాబితాలో కనిపిస్తున్నాయి. అయితే పార్టీలో అంతర్గత విభేదాలు కూడ నష్టం కలిగించే అవకాశం ఉంది. పాత, కొత్త నేతలకు పొసగటం లేదు. పాతవాళ్లు గ్రూపుగా ఏర్పడి కొత్తవారిని ఎదగనీయటం లేదనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత.. మోదీ ప్రభావంతో ఈసారి తప్పకుండా బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తంచేస్తున్నారు. మొత్తంగా మహబూబ్‌నగర్ సెగ్మెంట్లో ఎవరికి వారు తమ అస్త్రాలు సిద్దం చేసుకుంటున్నారు.
నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు:
వ్యవసాయంమే ప్రధానంగా జీవనం సాగించే జనం ఉన్నారు. పెద్దగా పరిశ్రమలు లేవు. నూతనంగా ఐటీ కారిడార్ ఏర్పాటైనా ఇంకా అందులోకి కంపెనీలు రాలేదు.
అడవులు: అప్పన్నపల్లి పరిసరాల్లో అడవులు ఉన్నాయి ఆలయాలు--పేదల తిరుపతిగా పిలిచే మన్యంకొండ శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం
పర్యాటకం: మయూరీ నర్సరీ,కోయిల్సాగర్ ప్రాజెక్టు
Comments
Please login to add a commentAdd a comment