![BJP MP DK Aruna Satirical Comments On CM revanth](/styles/webp/s3/article_images/2025/02/15/BJP-MP-DK-Aruna_1.jpg.webp?itok=98LhAbnb)
సాక్షి, మహబూబ్‌నగర్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ డీకే అరుణ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ముఖ్యమంత్రిగా ఉండి ప్రధాని మోదీ కులం గురించి మాట్లాడడానికి సిగ్గు అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. రేవంత్ ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నానని అనుకుంటున్నారు. ఇదే సమయంలో రేవంత్‌ను లక్కీ లాటరీ సీఎం అని అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.
ప్రధాని మోదీపై సీఎం రేవంత్ వ్యాఖ్యల విషయంలో ఎంపీ డీకే అరుణ స్పందించారు. ఈ క్రమంలో తాజాగా డీకే అరుణ మాట్లాడుతూ.. మిస్టర్ రేవంత్ రెడ్డినోరు జారితే ఊరుకోను. ప్రధాని మోదీ సామాజికవర్గం గురించి మాట్లాడే స్థాయి నీకు ఎక్కడిది. రేవంత్ రెడ్డికి మతి తప్పింది.. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయి ఫస్ట్రేషన్‌లో ఇలా మాట్లాడుతున్నారు. ప్రజల దృష్టిలో మరల్చడానికి ఇలాంటి చిల్లర కామెంట్స్ చేస్తున్నాడు. ముఖ్యమంత్రిగా ఉండి ప్రధాని మోదీ కులం గురించి మాట్లాడడానికి సిగ్గు అనిపించడం లేదా?.
నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే.. తెలంగాణలో రెండోసారి కులగణన ఎందుకు?. ముందు దీనికి సమాధానం చెప్పండి. మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టే రెండోసారి కులగణన చేయాల్సి వస్తోంది. మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు, బీసీలు లేరు, మీకు ఓట్లేసిన కార్యకర్తలు కూడా నమ్మడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు దింపేద్దామని ప్రజలే చూస్తున్నారు. ఇప్పటికైనా నీ స్థాయి ఏంటో తెలుసుకో రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావ్. ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నారని అనుకుంటున్నారా?. అందుకే ఆయన భాష, ప్రవర్తన అలానే ఉంది.. ఇంకా మార్చుకోలేదు. నీలాగా అధికారం ఉందనే గర్వంతో రెచ్చిపోయినవాళ్లు ఇప్పుడు ఎక్కడున్నారో గుర్తుంచుకోవాలి. మాట తీరు మార్చుకో.. ముఖ్యమంత్రి కుర్చీకి గౌరవం ఇవ్వండి.
ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్‌కు గాడిద గుడ్డు ఇచ్చినా వీళ్ళకు ఇంకా అహంకారం తగ్గలేదు. మీకు దమ్ముంటే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయండి. మీరు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ప్రధాని మోదీ దేశ ప్రతిష్టను నలుమూలల చాటుతుంటే ఆయనకు వస్తున్న ఆదరణ చూసి మీరు ఓర్వలేకపోతున్నారు. ఇప్పటికైనా మోదీని చూసి నేర్చుకోండి. పేదరికం నుంచి ప్రధాని వరకు ఆయన ఎలా పైకి వచ్చారో తెలుసుకోండి. రేవంత్.. నువ్వు ఈ స్థాయికి ఎలా వచ్చావో అందరికీ తెలుసు. నువ్వు లక్కీ లాటరీ సీఎం. కాంగ్రెస్ పార్టీకి దిక్కులేక నిన్ను సీఎం సీట్లో కూర్చోపెట్టింది. ఇవ్వన్నీ తెలుసుకోకుండా ప్రధాని మోదీ గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment