నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్దానం వచ్చే ఎన్నికల్లో చాలా కీలకంగా మారుతుంది. ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి ఉండటంతో కొంత రాజకీయంగా ప్రాధాన్యత ఉంటుంది. గత ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన నాగం వచ్చే ఎన్నికల్లో గెలువాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. కానీ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌లో తిరిగి చేరుతుండటంతో కాంగ్రెస్ సీట్ల పంచాయితీ మొదలయ్యింది. దీంతో వచ్చే ఎన్నికలు ఇక్కడ పోటీ రసవత్తరంగా మారనుంది.
జిల్లాను అభివృద్ధి చేసినా.. ఎమ్మెల్యేకు వ్యతిరేకత!
2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పారిశ్రామికవేత్త మర్రి జనార్దన్‌రెడ్డి విజయం సాధించారు. ఈ సారి కూడా ఆయన పోటీ ఖరారైంది. రీసెంట్‌గా విడుదల చేసిన బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాలో మర్రికి టికెట్ దక్కింది. కాగా మర్రి జనార్దన్‌రెడ్డి నియోజకవర్గంలో మొదటి నుంచి ఎంజేఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవకార్యక్రమాలు చేపట్టారు. వందలాది మంది నిరుపేదలకు సామూహిక వివాహాలు చేయించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాగర్ కర్నూల్‌ను జిల్లాగా మార్చారు.
జిల్లాకు మెడికల్ కళాశాల అగ్రికల్చర్ డిగ్రీ కళాశాల మంజూరు చేయించి ప్రారంభించారు. సొంత నిధులతో మూడు ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేటు స్దాయిలో తీర్చిదిద్దారు. దీంతో అభివృద్ది విషయంలో మిగిలిన నియోజకవర్గాల కంటే ఎక్కువ నిధులు తీసుకురావటంలో సఫలీకృతులవుతున్నారు. నల్లమట్టి అక్రమ వ్యాపారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. నల్లమట్టిలో వందల కోట్ల రూపాయల దందా సాగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
గ్రామాల్లో తన అనుచరులు ముఖ్యులకే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నిర్మిస్తున్న వట్టెం రిజర్వాయర్లో నిర్వాసితులకు సకాలంలో సరైన పరిహారం ఇవ్వలేదనే అసంతృప్తితో నిర్వాసితులు ఉన్నారు. మాదిగ సామాజిక ఓట్లు ఇక్కడ అధికంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో వారి ప్రభావం ఉండనుంది. భూ నిర్వాసితుల ప్రభావం ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత కూడ తలనొప్పికానుంది. డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, రుణమాఫి అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది.
పైకి బాగానే ఉన్నా.. నేతల మధ్య అంతర్గత విభేధాలు
ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి మధ్య అంతర్గత విభేదాలు ఉండటంతో ఆయన పార్టీని వీడుతుండటం కొంతమైనస్‌గా మారే ప్రమాదం ఉంది. నియోజకవర్గంలో తన క్యాడర్‌ను ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేయటంతో పాటు పోలీసుల సహయంతో కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఎమ్మెల్సీ మీడియా ముందే ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన దామోధర్‌రెడ్డి 2018లో ఎమ్మెల్యేగా సీటు ఆశించి భంగపడ్డారు. ఆయనను సంప్రదించకుండానే నాగం జనార్దర్‌రెడ్డిని బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని సీటు ఖరారు చేయటంతో ఆగ్రహించిన దామోధర్‌రెడ్డి పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. ఆ ఎన్నికల్లో నాగం ఓడిపోయారు. ఇటీవల రెండవ సారి దామోధర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్సీ ప్రస్తావిస్తే దాన్ని ఎమ్మెల్యే వ్యతిరేకించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బయటికి బాగానే ఉన్నట్టు కనిపించినా లోలోపల వారి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఎమ్మెల్యేకు మైనస్‌గా మారే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ దామోధర్‌రెడ్డి కుమారుడు డాక్టర్ రాజేష్‌రెడ్డి హైదరాబాద్లో డెంటల్ డాక్టర్‌గా పనిచేస్తూ తెలంగాణ డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన కూడా నాగర్కర్నూల్‌లో బీఆర్ఎస్ నుంచి సీటు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్దికంగా బలంగా ఉన్నానని, అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్న తనని ప్రజలు మరోసారి గెలిపిస్తారని ఎమ్మెల్యే ధీమాగా ఉన్నారు.
అయితే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారిన తర్వాత తనకు సన్నిహితంగా ఉండే ముఖ్య నేతలను లోక్‌సభకు పోటీ చేయించాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ ఉన్నారట.. ఆ లిస్టులో మర్రి జనార్దన్ రెడ్డి పేరు కూడ ఉందనే ప్రచారం జరుగుతుంది. ఆయన మల్కాజిగిరి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారనే గుసగసలు సైతం వినిపిస్తున్నాయి. ప్రతి పక్షాలు ఇక్కడ బలహీనంగా ఉండటం ఎమ్మెల్యే ఆర్దికంగా బలంగా ఉండటం కలిసివచ్చే అంశంగా కనిపిస్తోంది. ఇటీవల వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని మర్రి ప్రకటించటం చూస్తే గెలుపుపై ఆయన ఎంత ధీమాగా ఉన్నారో అర్దం అవుతుంది. కాగా అప్పుడే మర్రి జనార్దన్‌రెడ్డి తన నియోజకవర్గంలో మార్నింగ్ వాక్ పేరిట పర్యటిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు యత్నిస్తున్నారు.
ఇబ్బందికరంగా కాంగ్రెస్ సీట్ల పంచాయతి..
కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి కొంత ఇబ్బందికరంగానే ఉంది. ముఖ్యంగా నాగం జనార్దన్‌రెడ్డి వయస్సు మీదపడటం.. కాంగ్రెస్ క్యాడర్లో చాలా మంది బీఆర్ఎస్ గూటికి చేరటం ఆయనకు సమస్యగా మారింది. ఎమ్మెల్సీ దామోధర్‌రెడ్డి ఆయన కుమారుడు డాక్టర్ రాజేష్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అయితే రాజేష్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారు. ఈసారి తనకే టికెట్ ఇవ్వాలని నాగం పట్టుబడుతుండటంతో సమస్య జఠిలమవుతుంది. నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు కొంతసానుకూల వాతావరణం వస్తుందన్న తరుణంలో సీట్ల పంచాయితీ కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి.
మరి అధిష్టానం నాగం జనార్థన్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోధర్‌రెడ్డి మధ్య సయోధ్య కుదుర్చితే తప్పా కుమ్మలాటలు ఉంటే అసలుకే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు. బీజేపీకి ఇక్కడ పెద్ద క్యాడర్ కూడ లేదు. ఆ పార్టీలో దిలీపాచారి, కొండమణేమ్మలు పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన దిలీపా చారికి డిపాజిట్ కూడ దక్కలేదు. కాంగ్రెస్ పార్టీలో జడ్పీటీసీగా పనిచేసిన కొండ మణేమ్మకు నాగం జనార్దన్‌రెడ్డితో పొసగక పోవటంతో పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆమె కూడ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని యోచిస్తుంది. ఆపార్టీ తన ప్రయత్నాలు సైతం మొదలుపెట్టింది.
భౌగోళిక పరిస్థితులు: కూలీపనులు,వ్యవసాయంమే ప్రధానంగా జీవనం సాగించే జనం ఉన్నారు.ఎలాంటి పరిశ్రమలు లేవు. ఉపాధి అవకాశాలు చాలా తక్కువ
ఆలయాలు: వట్టెం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం
Comments
Please login to add a commentAdd a comment