ఇందిరమ్మ రాజ్యమంటే.. ఆకలి చావులే! | CM KCR Shocking Comments on Congress Party | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ రాజ్యమంటే.. ఆకలి చావులే!

Published Mon, Nov 20 2023 4:51 AM | Last Updated on Mon, Nov 20 2023 4:51 AM

CM KCR Shocking Comments on Congress Party - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/సాక్షి, నాగర్‌ కర్నూల్‌: కాంగ్రెస్‌ నాయకులు ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారని.. ఇందిరమ్మ పాలన అంటే ఆకలి చావులు, ప్రజలను కాల్చి చంపుడేనని బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. నాడు జరిగింది నక్సలైట్ల ఉద్యమాలు, ప్రజలను కాల్చిచంపుడు, ఎన్‌కౌంటర్లేనని.. ప్రజలను రాచిరంపాన పెట్టారని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యమంత దరిద్రపు రాజ్యం ఇంకోటి లేదని పేర్కొన్నారు.

అలాంటి రాజ్యం మళ్లీ తెస్తామంటున్న కాంగ్రెస్‌ పాలన కావాలా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ కోసమే పుట్టిందని చెప్పారు. ప్రజలు అన్నీ ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఆదివారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అలంపూర్, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘ఇందిరమ్మ రాజ్యం పొడుగునా ఏం జరిగింది. ప్రజలను రాచిరంపాన పెట్టారు. దోపిడీ చేశారు. ఇందిరమ్మ రాజ్యం బాగుంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టే వారు కాదు. ఆ రాజ్యంలో సుభిక్షంగా ఉంటే రూ.2కే కిలో బియ్యం ఎందుకు అవసరమొచ్చింది? ఇందిరమ్మ రాజ్యమంత దరిద్రపు రాజ్యం ఇంకోటి లేకుండె. ఇది అందరికీ తెలుసు. ప్రజలను ఆగం చేసేందుకు ఢిల్లీ గద్దలు వాలుతున్నాయి. మనకు రావాల్సిన 24వేల కోట్లు ఆపిన బీజేపీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతోంది? 

పదవులొస్తే స్వార్థానికి వాడుకున్నారు 
ఉమ్మడి ఏపీలో తెలంగాణ మీద జరిగిన దాడులు, దోపిడీ వల్ల రైతాంగం ఎన్ని అవస్థలకు గురైందో అందరికీ తెలుసు. కృష్ణా, తుంగభద్ర మధ్యనున్న నడిగడ్డకు జరిగిన అన్యాయంపై బాధపడ్డాం. వలసలతో ఘోరమైన పరిస్థితిని చూశాం. ఇక్కడి కాంగ్రెస్‌ నాయకులు చేసిన పొరపాటు వల్ల తెలంగాణను ఆంధ్రలో కలిపితే 55 ఏళ్లు గోసపడ్డాం. భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడులకు పెండింగ్‌ ప్రాజెక్టులుగా పేరుపెట్టి చేతులు ముడుచుకుని కూర్చున్నారే తప్ప ఏమీ చేయలేదు. కాంగ్రెస్‌ నాయకులు పదవులు వస్తే వారి స్వార్థానికే వాడుకున్నారు. 

ఆర్డీఎస్‌ కోసం పోరాటం చేపట్టాం 
 ఆర్డీఎస్‌ ద్వారా 85వేల ఎకరాలకు నీరు పారాల్సి ఉంటే.. పది వేల ఎకరాలైనా పారకపోయేది. అలంపూర్‌కు జరుగుతున్న అన్యాయాన్ని చూసి 2002లో పాదయాత్ర ద్వారా పోరాటం మొదలుపెట్టాం. కేసీఆర్‌ ఒత్తిడికి తలొగ్గి ఆర్డీఎస్‌ తూములు మూసేస్తే బాంబులు పెట్టి లేపేస్తామని రాయలసీమ నాయకులు మాట్లాడారు. అలా చేస్తే మీ సుంకేశుల బ్యారేజీని వంద బాంబులు పెట్టి దుమ్ములో కలిపేస్తామని చెప్పా. మాకూ బాంబులేసే మొగోడు పుట్టాడు, మాకూ నీళ్లొస్తాయని ప్రజలు సంతోషపడ్డారు.

ఇలా తూములను బద్దలు కొట్టి నీళ్లు తీసుకెళుతున్నా, పెండింగ్‌ ప్రాజెక్టులపైనా ఎవరూ మాట్లాడలేదు. కాంగ్రెస్‌ నాయకులు ఎవరి స్వార్థానికి వారు పదవులను వాడుకున్నారే తప్ప ప్రజల గురించి ఆలోచించలేదు. ఇప్పుడు మేం ఆర్డీఎస్‌ మీద తుమ్మిళ్ల ఎత్తిపోతల కడుతున్నాం. మల్లమ్మకుంట రిజర్వాయర్‌ పూర్తి చేస్తాం. వాల్మికి బోయలను బీసీల్లో కలిపింది కాంగ్రెస్‌ పార్టీయే. వారిని ఎస్టీల్లో కలపాలని బీఆర్‌ఎస్‌ సర్కారు తీర్మానం చేసి పంపితే మోదీ ప్రభుత్వం పక్కన పడేసి కూర్చుంది. కేంద్రం మెడలు వంచైనా వాల్మికి బోయలను ఎస్టీల్లో చేర్చేలా చూస్తాం. 

మూడు గంటల కరెంటు చాలా? 
కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రూ.200 ముఖాన కొట్టి ఇదే పెన్షనని చెప్పారు. ఈ రోజు మేం రూ.2 వేలు ఇస్తున్నాం. మళ్లీ గెలిస్తే రూ.5వేలు చేస్తాం. రైతుబంధు వృథా అని పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతున్నారు. అది వృథానా? రైతుబంధు ఉండాలంటే బీఆర్‌ఎస్‌ గెలవాలి. తెలంగాణలో 30లక్షల పంపు సెట్లు ఉన్నాయి. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు సరిపోతుందని, 10 హెచ్‌పీ మోటార్లు పెట్టుకోవాలని పీసీసీ అధ్యక్షుడు చెప్తున్నారు.

ఇది రైతులను, తెలంగాణను ఆగం పట్టించే కుట్ర. మూడే గంటలు కరెంటు చాలా, 24 గంటలు ఇచ్చే బీఆర్‌ఎస్‌ కావాలా? ప్రజలు ఆలోచించాలి. ప్రజాస్వామ్యానికి కావాల్సింది ఫ్యాక్షనిస్టులు, గూండాగిరీ, దాదాగిరీ చేసే వాళ్లు కాదు. మంచి పాలన కొనసాగిస్తే మేలు జరుగుతుంది. 

పాలమూరు ఎత్తిపోతలతో సస్యశామలం 
ఇందిరమ్మ రాజ్యం పొడవునా కాంగ్రెస్‌ వాళ్లు మనకు పెట్టినపేరు వెనుకబడ్డ గరీబ్‌ ప్రాంతమని. జొన్నలే పండించుకోవాలని, వడ్లు వద్దని అన్నారు. అలాంటిది ఇప్పుడు మూడు కోట్ల టన్నుల వడ్లు పండుతున్నాయి. నాడు కృష్ణా, తుంగభద్ర పక్కనే ఉన్నా నీళ్లు ఇవ్వకుండా నడిగడ్డ ప్రజలను ఇబ్బందులు పెట్టారు.

పాలమూరు ఎత్తిపోతలతో ఇక్కడి ప్రాంతం సస్యశామలం కానుంది. ఎన్నికలు రాగానే ఆగం కావొద్దు. అంతా ఆలోచించి ఓటు వేయాలి..’’అని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ సభల్లో మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్సీ వెంకట్రామ్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థులు బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, విజయుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

కాంగ్రెస్‌ వాళ్లది భూమాత స్కీం కాదు.. భూమేత.. 
కాంగ్రెస్‌కు ఓటేస్తే ధరణి తీసేస్తామంటున్నా రు. ఒకరి భూమి ఇంకొకరికి రాసి కోర్టుల చుట్టూ తిప్పే ప్రక్రియతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసేందుకు కుట్రలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ వాళ్లు ధరణి తీసేసి భూమాత స్కీం తెస్తామంటున్నారు. అది భూమాత కాదు భూమేత. ఆ స్కీంతో రైతుల భూములను మింగుతారు. దళారీ రాజ్యం వస్తుంది. ప్రతి దానికి వేల రూపాయలు లంచం అడుగుతారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement