ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి ఓటర్లు విలక్షణ తీర్పు ఇస్తారు. వనపర్తి నియోజకవర్గంలో పార్టీ ఏదైనా మేధావులే అభ్యర్దులుగా పోటీ చేస్తున్నారు. గెలిచిన ప్రతివారు అందరు ఆయా పార్టీల్లో అధినేతలకు సన్నిహితంగా ఉండటంతో నియోజకవర్గ అభివృద్దికి ఎవరిస్దాయిలో వారు పనిచేశారు. అన్ని పార్టీల్లో అసంతృప్తి రాగాలు వినిపిస్తున్నాయి.
దూసుకుపోతున్న మంత్రి.. వణుకుతున్న ప్రతిపక్షాలు
ప్రస్తుతం మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తి నియోజకవర్గంలో తనదైన పనితనంతో దూసుకుపోతున్నారు. దీంతో ప్రతిపక్షాలు ఆయనను తట్టుకోలేని పరిస్ధితి నెలకొంది. తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్‌కు సన్నిహితంగా ఉన్న నిరంజన్‌రెడ్డి 2014 ఎన్నికల్లో ఓడిపోయినా అయనను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారు. 2018లో నిరంజన్‌రెడ్డి విజయం సాధించారు. వ్యవసాయశాఖ మంత్రి అయ్యారు. ఓడినా, గెలిచినా ప్రజల మధ్యలో ఉండి నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా సాగునీరు, వైద్య, విద్యారంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తున్నారు.
సాగునీరు తీసుకురావటంలో ఆయన చేసిన కృషికి ఇక్కడ జనం ఆయనను నీళ్ల నిరంజన్‌రెడ్డిగా పిలుస్తారు. కేవలం ఓకే నియోజకవర్గం మాత్రమే పరిధి ఉన్న వనపర్తిని ప్రత్యేక జిల్లా చేయించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల, జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాల, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, వేరుశెనగ పరిశోధనా కేంద్రం, ఫిషరీ కళాశాల వంటి ప్రతిష్టాత్మక సంస్ధలను వనపర్తికి తీసుకొచ్చారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పట్టణంలోని రహదారుల విస్తరణ చేయిస్తున్నారు.
రైతుల ఆందోళన.. అధికార పార్టీకి మైనస్!
కానీ పనులు నత్తనడకన సాగటంపై విమర్శలు వస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా తన పరిధిలోని ఏదుల రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తయ్యేలా కృషి చేశారు. కానీ మిగిలిన ప్రాంతంలో పనులు జరగని కారణంగా నీటిని మాత్రం తరలించలేకపోవటంతో మైనస్‌గా మారింది. ఏళ్ల క్రితం తాము భూములు, ఇళ్లు కోల్పోయినా ఇంకా పునరావాసం దక్కలేదని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. సాగునీటికోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నామని ఏదుల రిజర్వాయర్ పరిధిలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రుణమాఫి, డబుల్‌బెడ్‌రూం ఇళ్ల విషయంలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కొంత మైనస్ కానుంది. స్వంత పార్టీకి చెందిన పలువురు నేతలు, అనుచరులు, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీని వీడి మంత్రిపై తిరుగుబాటు చేశారు. భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. భూ సమస్యల్లో తనవారికి అనుకూలంగా పనిచేస్తున్నాడనే ప్రచారం సాగుతుంది. అనుచరులు మంత్రి పేరు చెప్పి సెటిల్‌మెంట్లకు దిగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యనేతలు పార్టీని వీడటం, ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఉండటం మంత్రికి కొంత ప్రతికూల అంశాలుగా ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీకి పట్టు..
మొదటినుంచి వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. 2014లో టీఆర్ఎస్ హవా కొనసాగినా ఇక్కడ మాత్రం కాంగ్రెస్ అభ్యర్దే విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ చిన్నారెడ్డి వనపర్తి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో నిరంజన్‌రెడ్డిని ఓడించిన చిన్నారెడ్డి 2018లో ఆయన చేతిలో ఓడిపోయారు. తర్వాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత చిన్నారెడ్డి నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్‌లో మంత్రి నిరంజన్‌రెడ్డి విభేదించిన ఎంపీపీలు మోగారెడ్డి, కిచ్చారెడ్డి తదితర నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు.
అయితే మోగారెడ్డి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలని భావిస్తూ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఆయనకు పోటీగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో సీట్ల పంచాయితీ నడుస్తోంది. అయితే చిన్నారెడ్డికి సీటు ఇస్తే తాము పనిచేసే పరిస్ధితి లేదని పలువురు నేతలు బాహాటంగానే అధిష్టానానికి తేల్చిచెప్పారు. సో ఇక్కడి సీటు కేటాయింపు పార్టీకి తలనొప్పిగా మారింది. వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతుంది. నియోజకవర్గంలో తరచు పర్యటిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
రాహుల్ భారత్ జోడో యాత్రలో సైతం శివసేనారెడ్డి ఉత్సహాంగా పాల్గొని తన వర్గీయులతో హడావిడి చేశారు. వయస్సు మీదపడిన చిన్నారెడ్డికి కాకుండా యువకుడికి సీటిస్తే కొంత మేలు జరిగే అవకాశం ఉంటుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. మరోనేత నాగం తిరుపతి రెడ్డి పోటీకి సై అంటున్నట్టు నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.కానీ చిన్నారెడ్డి మాత్రం తానే పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నారటా... దాంతో పార్టీలో నెలకొన్న గ్రూపు తగదాలు పార్టీకి తీవ్రంగా నష్టం కలిగించే అంశాలుగా ఉన్నాయి. ఇక్కడ బీజేపీకి బలమైన నాయకుడు లేడు. తెలంగాణలోని ఓ జిల్లాకు అడిషనల్ కలెక్టర్గా పనిచేస్తున్న అధికారి ఈసారి వనపర్తి నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు.
ఆయనకు బీజేపీ గాలం వేసినట్టు తెలుస్తోంది. ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ మాజీ నాయకుడు అశ్వథామరెడ్డి సైతం బీజేపీ సీటు ఆశిస్తున్నారు.ఇక్కడ టీడీపీ కూడ గతంలో బలంగా ఉండేది.ఇక్కడి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రావుల చంద్రశేఖర్రెడ్డి ఇప్పుడు పార్టీ క్యాడర్ అంతా టీఆర్ఎస్ లో చేరిన తర్వాత ఆయన రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నారు.ఆయన పార్టీ మారి వేరే పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు కూడ లేవు.కాని ఆయన ఎవరికైనా మద్దతు తెలిపితే కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది.మరి వచ్చే ఎన్నికల నాటికి ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
భౌగోళిక పరిస్థితులు: వ్యవసాయమే ప్రధానంగా జీవనం సాగించే జనం ఉన్నారు. పెద్దగా పరిశ్రమలు లేవు.
నదులు: కృష్ణానది ప్రవహిస్తుంది
ఆలయాలు: శ్రీరంగపురం రంగనాయక స్వామి ఆలయం
పర్యాటకం: సంస్దానం పాలన సాగించిన వనపర్తి రాజా గారి బంగ్లా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్. రాజుల పాలనలోనే ఇక్కడ సస్తసముద్రాలు ఏర్పాటు చేసి జనాలకు తాగునీరు, రైతులకు సాగునీటి కోసం చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment