Wanaparthy
-
సిద్ధార్థ్,అదితి రావు హైదరీల పెళ్లి ఆ గుడిలోనే ఎందుకు..?
నటుడు సిద్ధార్థ్ తన ప్రియురాలు, నటి అదితి రావు హైదరీని వివాహం చేసుకున్నారు. వారు గతంలో చెప్పినట్లుగానే తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో వీరి పెళ్లి జరిగింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఇరు కుటుంబాల పెద్దలతో పాటు కొద్దిపాటు బంధువుల సమక్షంలో వారి పెళ్లి వేడుక జరిగింది. వనపర్తి రంగనాథస్వామి ఆలయంతో అదితి రావు కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. అందుకే అక్కడే నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లి కూడా అక్కడే చేసుకున్నారు. దీని వెనకున్న అసలు స్టోరీ ఇదే.అదితి రావు మన తెలుగమ్మాయి అనే విషయం అందరికీ తెలిసిందే. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ రాజ కుటుంబాలకు చెందినవారే. ఆమె తండ్రి పేరు ఎహసాన్ హైదరీ. తల్లి విద్యారావు. ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్‌కు ప్రధానమంత్రిగా ఉన్న అక్బర్ హైదరీకి మనవడే అదితి తండ్రి అని తెలిసిందే. తల్లి విద్యా రావు ఏమో వనపర్తి సంస్థానానికి చెందిన జానంపల్లి రామేశ్వరరావు కుమార్తె. అలా వనపర్తి సంస్థానానికి వారసురాలిగా ఆమెకు గుర్తింపు ఉంది. అలాగే అస్సాం మాజీ గవర్నర్ మహ్మద్ సాలెహ్ అక్బర్‌కు కూడా అదితి హైదరి మనవరాలు అవుతుంది. సినీ నిర్మాత, ఆమిర్ ఖాన్ భార్య కిరణ్ రావు, అదితి రావు కజిన్ అవుతుందనే విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: ఒక్కటైన సిద్ధార్థ్-అదితీ.. ఫొటోలు వైరల్)ఆమె ఆరవ ఏటనే భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో ఉన్న రిషీ వ్యాలీ స్కూల్ లో ప్రాథమిక విద్య అభ్యసించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన లేడీ శ్రీరాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. ఈ పెళ్లితో అదితి రావు తన పూర్వీకుల సంప్రదాయాన్ని కొనసాగించింది. తమ కుటుంబంలో ఎలాంటి శుభకార్యక్రమైనా సరే శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో జరగాల్సిందే. అదీ వారికి వారసత్వంగా వస్తున్న సెంటిమెంట్. సుమారు 400 ఏళ్ల చరిత్ర అక్కడి ఆలయానికి ఉంది. ఈ వేడుకతో ఆమె తన రూట్స్‌ను గౌరవిస్తోందని చెప్పవచ్చు. అదితి రావు హైదరీ 2002లో సత్యదీప్ మిశ్రాను పెళ్లి చేసుకుంది. వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. వనపర్తి రంగనాథస్వామి ఆలయంలో పెళ్లి చేసుకునేందుకు తెలంగాణ నుంచే కాకుండా కర్నాటకలోని గుల్బర్గా, రాయచూర్ వంటి ప్రాంతాల నుంచి కూడా నమ్మకంతో వస్తుంటారు. అక్కడ వివాహం జరిగితే వారి బంధం బలంగా ఉంటుందనేది అందరి నమ్మకం. దీంతో అక్కడ ప్రతి ఏడాది సుమారు 500కు పైగా వివాహాలు జరుగుతాయి. రాయలకాలంలో ఈ గుడిని నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి. -
7 అడుగుల నాగు..17 ఏళ్ల వయసు
వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలోని చందాపూర్ రోడ్డు పీర్లగుట్ట సమీపంలోని ఓ ఇంట్లోకి అతి పెద్ద నాగుపాము వచ్చింది. శుక్రవారం సాయంత్రం ఇంటి యజమాని రాంబాబు బాత్రూంలోకి వెళుతుండగా.. బుసలు కొడుతున్న శబ్దం విని ఆగిపోయాడు. ఆ తర్వాత చూడగా పెద్ద నాగుపాము కనిపించింది. దీంతో భయపడిన రాంబాబు సాగర్ స్నేక్ సొసైటీ నిర్వాహకుడు చీర్ల కృష్ణసాగర్‌కు ఫోన్ చేశాడు.వెంటనే ఆయన తన బృందంతో అక్కడకు చేరుకొని పామును పట్టుకున్నా డు. పాము పొడవు ఏడు అడుగులు ఉండగా, వయసు 16 నుంచి 17 ఏళ్లకు పైబడి ఉంటుందని కృష్ణసాగర్ చెప్పాడు. తాను ఇప్పటి వరకు 7,013 పాములు పట్టుకున్నానని, కానీ ఇంతపెద్ద నాగుపామును చూడటం ఇదే మొదటిసారి అని కృష్ణసాగర్ తెలిపాడు. ఈ విషయంపై వెటర్నరీ ఏడీ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ పాము వయసు ఎక్కువే ఉండొచ్చని.. దాన్ని సమీపంలోని అడవిలో వదిలిపెట్టినట్టు తెలిపారు. -
Wanaparthy: కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డిపై దాడికి యత్నం
వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డిపై సొంతపార్టీ నాయకులే పెట్రోల్‌తో దాడికి యత్నించడం కలకలం రేపింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో పలువురు చేరడంతో ఆ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి వర్గీయులు హల్చల్ చేశారు. చేరికలను నిరసిస్తూ తాడిపర్తి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గణేష్ గౌడ్, తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో గణేష్ గౌడ్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకోవడమే కాకుండా.. చేరికలపై మాట్లాడుతున్న ఎమ్మెల్యే మేఘారెడ్డిపై పెట్రోల్‌తో దాడికి ప్రయత్నించి నానా హంగామా సృష్టించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టారు. చిన్నారెడ్డి ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని మేఘారెడ్డి వర్గీయులు హెచ్చరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డిపై పెట్రోల్‌తో దాడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరికలపై మాట్లాడుతున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై పెట్రోల్‌తో దాడికి ప్రయత్నించిన తాడిపర్తి గ్రామానికి చెందిన చిన్నారెడ్డి వర్గీయుడు గణేష్ గౌడ్ అనుచరులు. చిన్నారెడ్డి… pic.twitter.com/yTCuOrbKaf — Telugu Scribe (@TeluguScribe) April 18, 2024 -
Siddharth-Aditi Rao Photos: ఆ వార్తల్లో నిజమెంత?.. ట్రెండింగ్ లో సిద్దార్థ్ ,అదితిరావు హైదరీ
-
వనపర్తి: ఘోర రోడ్డు ప్రమాదానికి కారణం ఇదే..
వనపర్తి: పెళ్లి ముహూర్తం పెట్టుకోవడానికి పిల్లలు, పెద్దలందరితో ఇంటి నుంచి బయల్దేరిన ఓ కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటన సోమవారం తెల్లవారుజామున వనపర్తి జిల్లా కొత్తకోట శివారులో చోటుచేసుకుంది. అతివేగం, కునికి పాటు ఈ ఘోర ప్రమాదానికి కారణమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. కారు డ్రైవింగ్ చేసిన పెళ్లి కుమారుడు ఖాజాకుత్బుద్దీన్ మాట్లాడుతూ బళ్లారిలోని బసవన్నకుంట నుంచి బయల్దేరిన తాము కర్నూలు పట్టణం దాటిన తర్వాత అర్ధరాత్రి సుమారు ఒంటిగంట ప్రాంతంలో ఒక హోటల్ వద్ద కుటుంబ సభ్యులంతా భోజనం చేశామని చెప్పారు. అప్పుడే రైలులో వెళ్తున్న వారు కాల్ చేసి ఎక్కడి వరకు వచ్చారు.. నిద్ర వస్తే.. హైవేపై ఉన్న పెట్రోల్ పంపులో ఆగి కొద్దిసేపు నిద్రించి తెల్లవారుజామున బయల్దేరాలని సూచన చేశారు. కానీ, ఆలస్యం అవుతుందని భావించి భోజనం తర్వాత మళ్లీ బయల్దేరామని, కునికిపాటు రావడంతో కారు పక్కకు వెళ్లినట్లు గుర్తించలేదని, ఒక్కసారిగా భారీ శబ్దంతో కారు చెట్టును ఢీకొట్టడం, కారులోని అందరం చెల్లాచెదురుగా పడిపోవడంతో మేలుకువ వచ్చిందని వాపోయాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించినవనపర్తి ఎస్పీ రక్షితా కె.మూర్తి ఇది మూడో ఘటన.. 2009లో అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే మిత్రులు ప్రమాణ స్వీకారం చూడాలనే ఉద్దేశంతో మారుతీ వ్యాన్‌లో హైదరాబాద్‌కు వెళ్తుండగా.. తెల్లవారుజామున వాహనం అదుపు తప్పడంతో చోటుచేసుకున్న సంఘటనలో నలుగురు మృతి చెందారు. ● 2020లో మహారాష్ట్ర నుంచి శ్రీశైలం వెళ్తుండగా క్లూజర్ వాహనం డ్రైవర్ నిర్లక్ష్యం కారణం కల్వర్టును ఢీకొట్టడంతో ప్రమాదంతో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. సంఘటనా స్థలంలో నలుగురు మృతిచెందగా.. మరో వ్యక్తి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృత్యువాతపడ్డారు. ● తాజాగా ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. జాగ్రత్తలు పాటించాలి అర్ధరాత్రి ప్రయాణాల విషయంలో డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలని వనపర్తి ఎస్పీ రక్షితా కె.మూర్తి అన్నారు. రాత్రి సమయంలో డ్రైవింగ్ చేసే అనుభవం లేనివారు వాహనాలు నడపడం శ్రేయస్కరం కాదన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా డ్రైవర్లకు అవగాహన కల్పిస్తామన్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించగా.. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి నిద్రించడం, అతివేగంగా కారు నడపడమే కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు చెప్పారు. మృతుల్లో 95 ఏళ్ల వృద్ధురాలు.. ఏడు నెలల పసికందు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఐదుగురిలో 95 ఏళ్ల సలీమాబీ, 7 నెలల పసికందు వాసీఫారిఫత్ అనే చిన్నారితోపాటు 39 ఏళ్ల అబ్దుల్ రహమన్, రెండేళ్ల రుమానా, నాలుగేళ్ల రోషిణి ఉన్నారు. మరో ఆరేళ్ల చిన్నారి సుమేర ఎలాంటి గాయాలు కాకుండా బయటపడటం గమనార్హం. -
వనపర్తి: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
సాక్షి, కొత్తకోట: వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఇక, మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. వివరాల ప్రకారం.. ఈరోజు తెల్లవారుజామున కొత్తకోట పరిధి జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఇక, కారు కర్ణాటకలోని బళ్లారి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతిచెందిన వారి వివరాలు.. అబ్దుల్ రహమాన్ (62), సలీమా జీ (85), చిన్నారులు వాసిర్ రవుత్ (7 నెలలు), బుస్రా (2), మరియా (5). -
వనపర్తి: కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు, కానీ..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి ఓటర్లు విలక్షణ తీర్పు ఇస్తారు. వనపర్తి నియోజకవర్గంలో పార్టీ ఏదైనా మేధావులే అభ్యర్దులుగా పోటీ చేస్తున్నారు. గెలిచిన ప్రతివారు అందరు ఆయా పార్టీల్లో అధినేతలకు సన్నిహితంగా ఉండటంతో నియోజకవర్గ అభివృద్దికి ఎవరిస్దాయిలో వారు పనిచేశారు. అన్ని పార్టీల్లో అసంతృప్తి రాగాలు వినిపిస్తున్నాయి. దూసుకుపోతున్న మంత్రి.. వణుకుతున్న ప్రతిపక్షాలు ప్రస్తుతం మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తి నియోజకవర్గంలో తనదైన పనితనంతో దూసుకుపోతున్నారు. దీంతో ప్రతిపక్షాలు ఆయనను తట్టుకోలేని పరిస్ధితి నెలకొంది. తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్‌కు సన్నిహితంగా ఉన్న నిరంజన్‌రెడ్డి 2014 ఎన్నికల్లో ఓడిపోయినా అయనను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారు. 2018లో నిరంజన్‌రెడ్డి విజయం సాధించారు. వ్యవసాయశాఖ మంత్రి అయ్యారు. ఓడినా, గెలిచినా ప్రజల మధ్యలో ఉండి నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా సాగునీరు, వైద్య, విద్యారంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తున్నారు. సాగునీరు తీసుకురావటంలో ఆయన చేసిన కృషికి ఇక్కడ జనం ఆయనను నీళ్ల నిరంజన్‌రెడ్డిగా పిలుస్తారు. కేవలం ఓకే నియోజకవర్గం మాత్రమే పరిధి ఉన్న వనపర్తిని ప్రత్యేక జిల్లా చేయించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, వేరుశెనగ పరిశోధనా కేంద్రం, ఫిషరీ కళాశాల వంటి ప్రతిష్టాత్మక సంస్ధలను వనపర్తికి తీసుకొచ్చారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పట్టణంలోని రహదారుల విస్తరణ చేయిస్తున్నారు. రైతుల ఆందోళన.. అధికార పార్టీకి మైనస్! కానీ పనులు నత్తనడకన సాగటంపై విమర్శలు వస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా తన పరిధిలోని ఏదుల రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తయ్యేలా కృషి చేశారు. కానీ మిగిలిన ప్రాంతంలో పనులు జరగని కారణంగా నీటిని మాత్రం తరలించలేకపోవటంతో మైనస్‌గా మారింది. ఏళ్ల క్రితం తాము భూములు, ఇళ్లు కోల్పోయినా ఇంకా పునరావాసం దక్కలేదని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. సాగునీటికోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నామని ఏదుల రిజర్వాయర్ పరిధిలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫి, డబుల్బెడ్రూం ఇళ్ల విషయంలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కొంత మైనస్ కానుంది. స్వంత పార్టీకి చెందిన పలువురు నేతలు, అనుచరులు, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీని వీడి మంత్రిపై తిరుగుబాటు చేశారు. భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. భూ సమస్యల్లో తనవారికి అనుకూలంగా పనిచేస్తున్నాడనే ప్రచారం సాగుతుంది. అనుచరులు మంత్రి పేరు చెప్పి సెటిల్మెంట్లకు దిగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యనేతలు పార్టీని వీడటం, ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఉండటం మంత్రికి కొంత ప్రతికూల అంశాలుగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి పట్టు.. మొదటినుంచి వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. 2014లో టీఆర్ఎస్ హవా కొనసాగినా ఇక్కడ మాత్రం కాంగ్రెస్ అభ్యర్దే విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ చిన్నారెడ్డి వనపర్తి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో నిరంజన్‌రెడ్డిని ఓడించిన చిన్నారెడ్డి 2018లో ఆయన చేతిలో ఓడిపోయారు. తర్వాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత చిన్నారెడ్డి నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్లో మంత్రి నిరంజన్‌రెడ్డి విభేదించిన ఎంపీపీలు మోగారెడ్డి, కిచ్చారెడ్డి తదితర నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. అయితే మోగారెడ్డి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలని భావిస్తూ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఆయనకు పోటీగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో సీట్ల పంచాయితీ నడుస్తోంది. అయితే చిన్నారెడ్డికి సీటు ఇస్తే తాము పనిచేసే పరిస్ధితి లేదని పలువురు నేతలు బాహాటంగానే అధిష్టానానికి తేల్చిచెప్పారు. సో ఇక్కడి సీటు కేటాయింపు పార్టీకి తలనొప్పిగా మారింది. వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతుంది. నియోజకవర్గంలో తరచు పర్యటిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాహుల్ భారత్ జోడో యాత్రలో సైతం శివసేనారెడ్డి ఉత్సహాంగా పాల్గొని తన వర్గీయులతో హడావిడి చేశారు. వయస్సు మీదపడిన చిన్నారెడ్డికి కాకుండా యువకుడికి సీటిస్తే కొంత మేలు జరిగే అవకాశం ఉంటుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. మరోనేత నాగం తిరుపతి రెడ్డి పోటీకి సై అంటున్నట్టు నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.కానీ చిన్నారెడ్డి మాత్రం తానే పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నారటా... దాంతో పార్టీలో నెలకొన్న గ్రూపు తగదాలు పార్టీకి తీవ్రంగా నష్టం కలిగించే అంశాలుగా ఉన్నాయి. ఇక్కడ బీజేపీకి బలమైన నాయకుడు లేడు. తెలంగాణలోని ఓ జిల్లాకు అడిషనల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న అధికారి ఈసారి వనపర్తి నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. ఆయనకు బీజేపీ గాలం వేసినట్టు తెలుస్తోంది. ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ మాజీ నాయకుడు అశ్వథామరెడ్డి సైతం బీజేపీ సీటు ఆశిస్తున్నారు.ఇక్కడ టీడీపీ కూడ గతంలో బలంగా ఉండేది.ఇక్కడి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఇప్పుడు పార్టీ క్యాడర్ అంతా టీఆర్ఎస్ లో చేరిన తర్వాత ఆయన రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నారు.ఆయన పార్టీ మారి వేరే పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు కూడ లేవు.కాని ఆయన ఎవరికైనా మద్దతు తెలిపితే కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది.మరి వచ్చే ఎన్నికల నాటికి ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. భౌగోళిక పరిస్థితులు: వ్యవసాయమే ప్రధానంగా జీవనం సాగించే జనం ఉన్నారు. పెద్దగా పరిశ్రమలు లేవు. నదులు: కృష్ణానది ప్రవహిస్తుంది ఆలయాలు: శ్రీరంగపురం రంగనాయక స్వామి ఆలయం పర్యాటకం: సంస్దానం పాలన సాగించిన వనపర్తి రాజా గారి బంగ్లా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్. రాజుల పాలనలోనే ఇక్కడ సస్తసముద్రాలు ఏర్పాటు చేసి జనాలకు తాగునీరు, రైతులకు సాగునీటి కోసం చర్యలు చేపట్టారు. -
వనపర్తిలో ఓ డాక్టర్ మౌనపోరాటం..
వనపర్తి: వనపర్తికి చెందిన ఒక మహిళా డాక్టర్ పట్ల ఆమె భర్త అమానుష వైఖరితో వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ మౌనపోరాటం చేస్తున్నారు. ఈ మేరకు సంబంధిత మంత్రి కల్పించుకుని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ వనపర్తి జిలా కలెక్టరుకు లేఖ రాశారు. డా. లక్ష్మి కుమారి వనపర్తిలో ప్రైవేటుగా ప్రాక్టీస్ చేస్తోన్న చర్మవ్యాధి నిపుణురాలు. ఆమె భర్త ఎం.ఎన్. ప్రమోద్ కుమార్ గృహ నిర్వహణలో ఏమాత్రం సహాయపడకపోగా తనను చాలాకాలంగా వేధిస్తున్నారని, 23 ఏళ్లుగా అతనితో నరకాన్ని అనుభవిస్తున్నానని ఆమె లేఖలో రాశారు. చిన్న క్లినిక్ నడుపుకుంటూ కుటుంబాన్ని వెళ్లదీస్తున్నానని ఇప్పుడైతే భర్త వేధింపులు మరీ ఎక్కువయ్యాయని.. శారీరకంగానూ, మానసికంగానూ, మాటలతోనూ ఇబ్బంది పెడుతూ క్లినిక్ మూసివేయాలని ఒత్తిడి చేస్తూ నానా హింసలకు గురిచేస్తూ శాడిస్టులా ప్రవర్తిస్తున్నాడని తెలిపారు. నా పని నన్ను చేసుకోనీయకుండా ఇంట్లోనే ఉంచి బంధించడం, క్లినిక్ కు తాళాలు వేసేయడం వంటి పిచ్చి పనులు చేస్తున్నాడు. దీంతో నేను పేషేంట్ లకు క్లినిక్ బయట రోడ్డు మీదే ట్రీట్మెంట్ చేయాల్సి వస్తోంది. దయచేసి సంబంధిత మంత్రిగారు కల్పించుకుని నన్ను, నా బిడ్డను కాపాడాలని కోరుతూ మౌనపోరాటం చేస్తున్నాను. ఇంతవరకు జిల్లా అధికారులు ఎవ్వరూ నా క్లినిక్ విషయమై నాకు ఎలాంటి అభయం ఇవ్వలేదని తెలిపారు. ఇది కూడా చదవండి: Karimnagar: గుండెపోటు.. వ్యక్తి ప్రాణాలు బలిగొన్న రైల్వేగేటు.. -
2 వేల ఏళ్ల క్రితమే ఇనుము పరిశ్రమలు
సాక్షి, హైదరాబాద్: ఇనుము తయారు చేసిన తర్వాత మిగిలిన వ్యర్ధమిది.. దీన్ని చిట్టెంగా పేర్కొంటారు. ఈ చిట్టెం రాళ్ల వయసు దాదాపు 2 వేల ఏళ్లు. శాతవాహనుల కాలంలోనే మన వద్ద ఇనుము పరిశ్రమ విలసిల్లిందనటానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా వనపర్తి జిల్లా చిట్యాల గ్రామ శివారులో ఇలాంటి చిట్టెం నిల్వలను గుర్తించారు. ఈ ప్రాంతం ఒకప్పుడు ఇనుము పరిశ్రమలకు నిలయంగా ఉండేదని, నాటి పరిశ్రమ తాలూకు అవశేషాలుగా ఇప్పుడు ఈ చిట్టెం రాళ్లు వెలుగుచూస్తున్నాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ వెల్లడించారు. చిట్యాలలో తమ బృందం సభ్యులు బైరోజు చంద్రశేఖర్, డాక్టర్ శ్యాంసుందర్‌లు స్థానిక మూలోని గుట్ట సమీపంలోని తాళ్లగడ్డలో వ్యవసాయ క్షేత్రంలో చిట్టెం రాళ్లను గుర్తించినట్టు ఆయన పేర్కొన్నారు. గతంలో ఈ ప్రాంతంలో భూమిని వ్యవసాయయోగ్యంగా మార్చే పనులు చేస్తున్నప్పుడు 20 అడుగుల చుట్టు కొలతగల ఇటుకల కట్టడం ఆనవాళ్లు వెలుగుచూసినట్టు స్థానికులు పేర్కొంటున్నారు. ఇనుము కరిగించేందుకు వాడే మూసలు, పెద్ద గొట్టాలు, భారీ గాగుల పెంకులు లభించినట్టు పేర్కొన్నారు. బయటపడిన భారీ ఇటుకలు 16 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉన్న భారీ ఇటుకలు కూడా బయటపడినట్టు వెల్లడిస్తున్నారు. ఇనుము కరిగించగా మిగిలిన బొగ్గు బూడిద కూడా వెలుగు చూస్తోందని పేర్కొంటున్నారు. యుద్ధానికి అవసరమైన ఆయుధాలు, వ్యవసాయ పనిముట్లు, ఇతర పరికరాలకు ఈ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇనుము పరిశ్రమలు ఉండేవనటానికి ఈ ఆధారాలు, ఇనుము దేవతగా పేర్కొనే మమ్మాయి దేవతారాధన ఆనవాళ్లు స్థానికంగా ఉన్నాయని హరగోపాల్ పేర్కొన్నారు. చిట్టెం పతం నుంచే చిట్యాల ఊరి పేరు వచి్చందని ఆయన వెల్లడించారు. సమీపంలోని పెద్ద మందడి, చిన్న మందడి, అమ్మాయిపల్లి, గణపురం, మానాజిపేటల్లో నాటి చారిత్రక ఆధారాలున్నాయని తెలిపారు. -
నా తనువు మట్టిలో కలిసినా.. కన్నీరు పెట్టిస్తున్న నిఖిల్ కవిత
మనుషుల్లో స్వార్థం పెరిగిపోతోంది. మానవ సంబంధాలు కేవలం డబ్బు చుట్టూరానే తిరుగుతున్నాయి. మనం బాగుంటే చాలూ.. పక్కవాడు ఏమైపోతే మాకేం అనుకునేవాళ్లు మనమధ్యే ఉన్నారు. రోడ్డు మీద ప్రాణం పోతున్నా పట్టించుకోకుండా సెల్ఫోన్లతో బంధించే యువత ఉన్న ఈ రోజుల్లో.. చదువుకున్న ఓ యువకుడి ఆలోచన శెభాష్ అనిపించడమే కాదు.. జీవితాన్ని ముందే పసిగట్టి అతను రాసిన లేఖ కంటతడి పెట్టిస్తోంది కూడా. చిన్ని నిఖిల్.. వనపర్తి జిల్లా అమరచింతకి చెందిన యువకుడు. బెంగళూరులో బీఏఎంస్ చేసి.. అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నాడు కూడా. అంతా సవ్యంగా ఉందనుకున్న టైంలో విధికి కన్నుకుట్టిందేమో.. 24 ఏళ్ల నిఖిల్‌ను రోడ్డు ప్రమాదం చలనం లేకుండా చేసేసింది. ఏప్రిల్ 29వ తేదీన బెంగళూరు నుంచి కావలికి వెళ్తున్న సమయంలో నిఖిల్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తలకు బలమైన గాయం కావడంతో.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు కుటుంబ సభ్యులు. చివరకు మే 1వ తేదీన చికిత్స పొందుతున్న నిఖిల్‌కు బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే.. అంత శోకంలోనూ కొడుకు ఆశయం నెరవేర్చాలని ఆ తల్లిదండ్రులు రమేష్, భారతిలు ముందుకొచ్చారు. ప్రత్యేక ఆంబులెన్స్‌లో నిఖిల్‌ను సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. ఆరుగురికి అవయవదాతగా నిలిచాడు. స్టూడెంట్‌గా ఉన్న టైంలోనే.. ఆర్గాన్ డొనేషన్ ప్రతిజ్ఞ చేసిన నిఖిల్ అందుకు సమ్మతి పత్రాన్ని సైతం ఓ ఆర్గనైజేషన్‌కు అందజేశాడు. ఆ సమయంలో ఆ పత్రాలకు అతను జత చేసిన కవిత ఇలా ఉంది.. నా తనువు మట్టిలో కలిసినా.. అవయవదానంతో మరొకరిలో జీవిస్తా.. ఒక అమ్మకు బిడ్డగా మరణించినా.. మరో అమ్మ పిలుపులో బతికే ఉంటా.. ఏనాడూ వెలుగులు చూడని అభాగ్యులకు నా కళ్లు.. ఆగిపోవడానికి సిద్ధంగా ఉన్న గుండెకు బదులుగా నా గుండె కిడ్నీలు కోల్పోయిన వారికి మూత్రపిండాలు ఊపిరి అందక ఊగిసలాడుతున్న వారికి ఊపిరితిత్తులు కాలేయం పని చేయక కాలం ముందు ఓడిపోతున్న వారికి నా కాలేయం నాలోని ప్రతీ అణువూ అవసరమైన వారికి ఉపయోగపడాలి ఆపదలో ఉన్నవారిని ఆదుకోండి ఇదే మీకు నాకు ఇచ్చే గొప్ప బహుమతి ఇలా మీరు చేస్తే నేను కూడా సదా మీ మదిలో నిలుస్తాను.. చిరంజీవినై ఉంటాను అవయవదానం చేద్దాం.. మరో శ్వాసలో శ్వాసగా ఉందాం అంటూ పిలుపు ఇచ్చాడు నిఖిల్. ఇదీ చదవండి: తనలాంటి వాళ్లకు కృష్ణప్రియ చేసే సాయం ఇది -
మంత్రి నిరంజన్‌రెడ్డికి షాక్.. ఆత్మాభిమానం చంపుకోలేకేనన్న నేతలు!
సాక్షి, మహబూబ్‌నగర్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇలాకా వనపర్తి జిల్లాలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లో ముసలం మొదలైంది. మంత్రికి సన్నిహితులుగా పేరొందిన ముఖ్య నాయకులు సైతం పార్టీకి రాజీనామా చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్.లోక్‌నాథ్ రెడ్డితోపాటు వనపర్తి, పెద్దమందడి ఎంపీపీలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు ఐ.సత్యారెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ సాయిచరణ్‌రెడ్డి రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. ఈ మేరకు ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పత్రాలు ప్రదర్శించారు. వీరితోపాటు మరో 11 మంది సర్పంచ్‌లు, ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు, పలువురు ఉపసర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తున్నట్లు స్వయంగా ప్రకటించడమే కాకుండా బీఆర్ఎస్ లో తాము ఎదుర్కొన్న బాధలను వెళ్లగక్కారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేక..: ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ మామూలు కార్మికులు సైతం ఆత్మగౌరవం కోరుకుంటారని.. అలాంటిది అధికారంలో ఉండి కూడా ఆత్మగౌరవాన్ని పొందలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్లో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేకే రాజీనామా చేసినట్లు వెల్లడించారు. నిరంజన్‌రెడ్డికి పేరొచ్చిందంటే మేమే కారణం పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి మాట్లాడుతూ మంత్రి నిరంజన్‌రెడ్డికి నీళ్ల నిరంజన్‌రెడ్డి అనే పేరు వచ్చేందుకు తమ శ్రమే కారణమన్నారు. ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చింది ఎవరో వారి మనసులో ఉందని.. త్వరలోనే వారు బాహాటంగా చెప్పే రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నియంత పాలన అంతం కోసం ఇక నుంచి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పారు. కాగా, నియోజకవర్గంలో ఇప్పటివరకు తిరుగులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న మంత్రి నిరంజన్ రెడ్డికి అతడి సొంత సెగ్మెంట్ నుంచే వ్యతిరేకత పెల్లుబికడంతో పాటు తాజా పరిణామాలు ఎదురుదెబ్బేనని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. -
కొనసాగుతున్న ప్రాక్టికల్స్
వనపర్తిటౌన్: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు గరువారం ఉదయం నిర్వహించిన జనరల్, ఒకేషనల్ ప్రాక్టికల్స్‌లో 807 మందికి గాను, 773 హాజరు కాగా.. 34 మంది గైర్హాజరయ్యారని, మధ్యాహ్న సెషన్లో 478 మందికి గాను, 455 మంది హాజరు కాగా.. 23 మంది గైర్హాజరయ్యారని డీఈసీ మెంబర్స్ ప్రకాశంశెట్టి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. రెండో రోజు 52 మంది హాజరు వనపర్తిటౌన్: జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ప్రారంభమైన డిప్లమా ఇన్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో రెండో రోజు 52 మంది హాజరైనట్లు పరీక్షల సహాయ సంచాలకులు మధుకర్ తెలిపారు. ఈ మేరకు గురువారం నిర్వహించిన పరీక్షలో తెలుగు మీడియంలో 31 మంది, ఇంగ్లీష్ మీడియంలో 26 మంది మొత్తం 57 మంది అభ్యర్థులను అలాట్మెంట్ చేయగా.. తెలుగు మీడియంలో 28 మంది, ఇంగ్లీష్ మీడియంలో 24 మంది మొత్తం 52 మంది హాజరైనట్లు చెప్పారు. తెలుగులో ముగ్గురు, ఇంగ్లీష్‌లో ఇద్దరు చొప్పున మొత్తం ఐదుగురు అభ్యర్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. దీంతో 91 శాతం హాజరు నమోదయినట్లు వెల్లడించారు. -
రేపు ‘సాక్షి’ ఫోన్ ఇన్
‘సాక్షి’ ఆధ్వర్యంలో శనివారం ఆత్మకూర్ మున్సిపల్ కమిషనర్ బీఎన్కే రమేష్‌తో ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఆయా పట్టణ ప్రజలు ఫోన్ చేసి మున్సిపాలిటీ పరిధిలో కుక్కలు, కోతులు, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు తదితర అంశాలపై ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయవచ్చు. వీటి పరిష్కారానికి కమిషనర్లు సమాధానమిస్తారు. ఆత్మకూర్ మున్సిపాలిటీ వాసులు శనివారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు 63034 35647 నంబర్‌కు ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఆత్మకూర్ పట్టణ ప్రజలు ఫోన్ చేయాల్సిన నంబర్ 63034 35647 -
ఏడాదిన్నరలో బీజేపీ పీడ విరగడవుద్ది
వనపర్తి: ఎనిమిదిన్నర ఏళ్లుగా దేశ ప్రజలకు పట్టిన బీజేపీ శని మరో ఏడాదిన్నరలో విరగడవుద్దని, దివాలా తీసిన కాంగ్రెస్ పార్టీ సత్తువ కోల్పోయిందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనల శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా పెద్దగూడెం శివారులో జ్యోతిబాపూలే బీసీ వ్యవసాయ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల, జిల్లా కేంద్రంలోని నర్సింగాయపల్లి శివారులో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల భవనాల ప్రారంభోత్సవంలో మంత్రులు సబితాఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ‘రానున్న సాధారణ ఎన్నికల్లో బీఎస్ఆర్ కేంద్రంలో అధికారంలోకి రావాలని జోగుళాంబ అమ్మవారిని మొక్కి వచ్చాను. ధరలు పెంచి.. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్న బీజేపీకి పాలించే అర్హత లేదు’అని అన్నారు. నిరంజన్‌రెడ్డి సీఎంకు చాలా దగ్గరుంటడు.. ఏది కావాలన్నా ఈయనకు ఇస్తడు.. అందుకే చిన్నదైన వనపర్తి జిల్లాను ఇంతగా అభివృద్ధి చేశారన్నారు. అంతకుముందు నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని సామాజిక వర్గాలకు సమాన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పదులసంఖ్యలో ఉన్న గురుకులాలను వంద సంఖ్యలోకి మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని సబిత చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర పాలకులు ఈ ప్రాంతాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని కమలాకర్ అన్నారు. కార్యక్రమంలో ఎంపీ రాములు, జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, జ్యోతిబాపూలే గురుకులాల రాష్ట్రకార్యదర్శి మల్లయ్యభట్టు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
Medchal: పెళ్లై ఆరు నెలలు గడవకముందే యువకుడి ఆత్మహత్య
సాక్షి, మేడ్చల్: పెద్దలను ఒప్పించి మరీ ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడు పెళ్లైన ఆరు నెలలు తిరగకముందే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. వనపర్తి జిల్లాకు చెందిన వినయ్ అనే వ్యక్తి ఓ యువతిని ప్రేమించాడు. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం తన భార్యతో కలిసి హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వెంకటాపురంలో కాపురం పెట్టాడు. దంపతుల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. వినయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం రాత్రి వినయ్ ఇంటి నుండి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా వినయ్ ఫ్యానుకు ఉరేసుకొని విగత జీవిగా కనిపించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. కాగా అయిదు రోజుల క్రితమే వినయ్ ఆత్మహత్య చేసుకొని ఉండచ్చని పోలీసులు భావిస్తున్నారు. పెళ్లైన ఆరు నెలలకే యువకుడు ఆత్మహత్య చేసుకోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. వినయ్ ఆత్మహత్య విషయాన్ని పోలీసులు అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే భార్య వేధింపుల కారణంగానే వినయ్ ప్రాణం తీసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. కుటుబం సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: యువతి కిడ్నాప్ కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు -
వనపర్తి–మంత్రాలయం మధ్య నేషనల్ హైవే!
సాక్షి, హైదరాబాద్: వనపర్తి నుంచి గద్వాల మీదుగా మంత్రాలయానికి కొత్త జాతీయ రహదారి నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త జిల్లా కేంద్రమైన వనపర్తికి నేరుగా ఏ జాతీయ రహదారి అనుసంధానం లేదు. అలాగే గద్వాల నుంచి ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయానికి సరైన రోడ్డు మార్గం లేదు. ఇప్పుడు వనపర్తిని గద్వాలతో అనుసంధానిస్తూ.. అక్కడి నుంచి మంత్రాలయానికి నాగులదిన్నె మీదుగా జాతీయ రహదారి నిర్మించే ప్రతిపాదనలపై కేంద్రం సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది. తెలంగాణ జాతీయ రహదారుల విభాగం నుంచి అందిన ప్రతిపాదనలను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ పరిశీలిస్తోందని.. త్వరలోనే మంజూరయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ జిల్లాల నుంచి ఏపీలోని మంత్రాలయానికి వెళ్లాలంటే.. కర్నూలు మీదుగా ప్రయాణిస్తున్నారు. అదే కొత్త హైవే ఏర్పాటై గద్వాల నుంచి ఐజా మీదుగా వెళ్తే దాదాపు 50 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. నాలుగు రహదారుల విస్తరణకు గ్రీన్‌సిగ్నల్ వచ్చే రెండేళ్లలో తెలంగాణలో నాలుగు జాతీయ రహదారులను విస్తరించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ సంవత్సరమే పనులు ప్రారంభం కానున్నాయి. మెదక్–ఎల్లారెడ్డి మధ్య 43.9 కిలోమీటర్ల రోడ్డును రూ.399.01 కోట్లతో రెండు వరసలు, పేవ్డ్ షోల్డర్స్‌తో.. ఎల్లారెడ్డి–రుద్రూరు మధ్య 37.28 కిలోమీటర్ల మార్గాన్ని రూ.499.88 కోట్లతో రెండు వరసల రోడ్డుగా విస్తరించనున్నారు. ఇక ఖమ్మం–కురవి మధ్య 37.43 కిలోమీటర్ల రోడ్డును రూ.455.76 కోట్లతో, ఆదిలాబాద్–బేల మధ్య 32.97 కిలోమీటర్ల రోడ్డును రూ.490.92 కోట్లతో విస్తరించనున్నారు. ఈ రోడ్ల నిర్మాణంతో తెలంగాణలోని మెదక్, ఆదిలాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో మెరుగైన రోడ్ నెట్వర్క్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. -
‘వైఎస్సార్‌లా తెలంగాణ కూడా స్వచ్ఛమైనది’
సాక్షి, వనపర్తి: మహానేత వైఎస్సార్ కుటుంబాన్ని ప్రేమించే ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలని పేర్కొన్నారు వైఎస్ విజయమ్మ. తెలంగాణలో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర 2వేల కిలోమీటర్ల మైలురాయి పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం జిల్లాలోని కొత్తకోట బస్టాండ్ వద్ద పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వైఎస్ విజయమ్మ పాల్గొని ప్రసంగించారు. ‘‘వైఎస్సార్ కుటుంబాన్ని ప్రేమించే ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతం వైఎస్సార్. వైఎస్సార్‌లా తెలంగాణ కూడా స్వచ్ఛమైంది. మీ ప్రేమ, ఆప్యాయతలతోనే షర్మిల 2వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయగలిగింది. నడిచింది షర్మిలే అయినా.. నడిపించింది మీరే అంటూ అక్కడి కార్యక్రమానికి హాజరైన ప్రజలను, వైఎస్సార్టీపీ నేతలు.. కార్యకర్తలను ఉద్దేశించి వైఎస్ విజయమ్మ ధన్యవాదాలు తెలియజేశారు. బంగారు తెలంగాణ కోసమే షర్మిల అడుగులు వేస్తోందని, అందుకు తెలంగాణ ప్రజానీకం ఆశీర్వాదం కావాలని ఆకాక్షించారు వైఎస్ విజయమ్మ. ఇదిలా ఉంటే.. 148 రోజుల్లో 2వేల కిలోమీటర్ల ప్రజాప్రస్థానం పూర్తి చేసుకున్నారు వైఎస్ షర్మిల. వనపర్తి జిల్లాలో షర్మిల పాదయాత్ర మైలురాయి దాటగా.. కొత్తకోట వద్ద పైలాన్ ఆవిష్కరించారు. ఇదీ చదవండి: తెలంగాణలో వెస్ట్ బెంగాల్ వ్యూహమా? -
పెళ్లికి నిరాకరించిందని హత్య
ఖిల్లాఘనపురం: ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందని కక్షగట్టిన ప్రియుడు మాట్లాడుకుందామని పిలిచి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా ఖిల్లాఘనపు రం మండలం మానాజీపేటలో ఈ నెల 5న జరగగా 8వ తేదీ సాయంత్రం వెలుగు చూసింది. మానాజీపేటకు చెందిన బత్తని అంజన్న 20 ఏళ్లుగా కుటుంబంతో కలిసి శంషాబాద్ దగ్గర జీవనం సాగిస్తున్నాడు. అతని చిన్న కుమారుడు శ్రీశైలంకు మిత్రుల ద్వారా హైదరాబాద్‌లోని కాటేదాన్‌కు చెందిన కావటి వెంకటేశ్ కూతురు సాయిప్రియ(20)తో పరిచయమైంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని శ్రీశైలం ఇరు కుటుంబాలకు చెప్పడంతో అమ్మాయి కుటుంబీకులు నిరాకరించారు. దీంతో సాయిప్రియ శంకర్‌తో మాట్లాడటం మానేసింది. తర్వాత కరోనా ప్రభావంతో రెండేళ్ల క్రితం శ్రీశైలం కుటుంబం మానాజీపేటకు వెళ్లింది. మళ్లీ మాటలు కలిసి.. మూడు నెలల క్రితం ఇద్దరి మధ్య మళ్లీ మాటలు కలిశాయి. ఈ క్రమంలో నెల 5న సాయిప్రియ భూత్పూర్ వరకు రాగా అక్కడి నుంచి శంకర్ బైక్‌పై మానాజీపేటలోని తన షెడ్ సమీపంలోని గుట్ట వద్దకు తీసుకెళ్లాడు. పెళ్లి విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన శంకర్ సాయిప్రియ మెడలోని చున్నీతో గొంతు నులిమి చంపాడు. తన బంధువు శివతో కలిసి సమీపంలోని కేఎల్ఐ కాల్వ దగ్గర గుంత తవ్వి అందులో పూడ్చిపెట్టారు. మిస్సింగ్ కేసు విచారణతో.. సాయిప్రియ ఇంటికి రాకపోవడంతో మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్లో ఆమె తండ్రి ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం ఖిల్లాఘనపురం పోలీసుల సహకారంతో శ్రీశైలంను అదుపులోకి తీసుకుని విచారించగా తానే చంపానని అంగీకరించాడు. గురువారం సంఘటనాస్థలానికి చేరుకుని తహసీల్దార్ సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీసి అక్కడే పోస్టుమార్టం చేశారు. -
పాలమూరులో వైద్య కళాశాలలు
-
పిల్లి దేవత.. వాహనమూ మార్జాలమే..! ఆ ఊరు పేరు కూడా..
సాక్షి, హైదరాబాద్: పిల్లి అపశకునమనే భావన చాలామందిలో ఉంటుంది. పురాణాల్లోనూ పిల్లిని శుభసూచకంగా చూపిన దాఖలాలు లేవు. కానీ ఓ ఊళ్లో మాత్రం పిల్లినే దేవతగా పూజిస్తున్నారు. ఆ శివాలయంలో మార్జాలమాత ప్రత్యేక స్థానంలో కనిపిస్తోంది. ఆ దేవత వాహనం కూడా మార్జాలమే. విచిత్రమేంటంటే ఆ ఊరు పేరు కూడా ఈ పిల్లితో పుట్టిందే. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని బెక్కం.. శ్రీశైలం ముంపు గ్రామం. నేలబిల్కు, పెద్ద బిల్కులనే రెండు చిన్నగ్రామాలు కలిపి బెక్కంగా ఏర్పడింది. ఈ ఊళ్లో ఓ శివాలయం ఉంది. స్వామిని ‘బెక్కేశ్వరుడు’గా కొలుస్తున్నారు. ఈ గుడి గోడ గూటిలో ఓ పెద్ద శిల్పం ఉంది. పైన కుడి చేతితో తామరపుష్పాన్ని ధరించి, ఉత్కుటాసన భంగిమలో అమ్మవారి రూపం (పార్వతి?) ఉంది. ఆ శిల్పం దిగువన మార్జాల ముఖం, మానవ శరీరాకృతితో, మార్జాల వాహనధారిౖయె అర్ధ పద్మాసనంలో ఉన్న మరో అమ్మవారి రూపం ఉంది. పిల్లి ముఖం కలిగి ఉండటం, పిల్లి వాహనంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆలయంలోని ఈ ప్రత్యేకతను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్యాంసుందర్, చంద్రశేఖర్ సోదరులు గుర్తించారని ఆ బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. పిల్లి పేరుతోనే ఊరు ‘పూర్వం ఆ గ్రామంలోని తాటివనంలో ఓ పుట్ట మీద ఆవు పాలు కురిపిస్తుంటే ఓ పిల్లి తాగుతూ ఉండేదని, దాన్ని గుర్తించి స్థానికులు అక్కడి పుట్టను తవ్వగా శివలింగం వెలుగుచూసిందని గాథ అక్కడ ప్రచారంలో ఉంది. కన్నడంలో పిల్లిని బెక్కగా పిలుస్తారు. ఆ పిల్లి పేరుమీదుగానే ఆ శివుడికి బెక్కేశ్వరుడని, గ్రామానికి బెక్కం అని పేరు పెట్టారన్నది స్థానికుల కథనం. ఈ ఆలయానికి 1065 జూలై11న కేతరస, రాజరసలనేవారు త్రైలోక్యమల్ల 1వ సోమేశ్వరుడి పాలన కాలంలో భూదానం చేసినట్టు శాసనం కూడా బయటపడింది. రాష్ట్రకూట శైలిలో నిర్మించిన ఇక్కడి త్రికూటాలయంలో లలాటబింబంగా గజలక్ష్మి ఉంది. ఓ గర్భాలయంలో ఛత్రాపరితల సమలింగం ఉండగా, ప్రతి గర్భాలయానికి ఎదురుగా వేర్వేరు కాలాలకు చెందిన నంది శిల్పాలున్నాయి.’ అని హరగోపాల్ పేర్కొన్నారు. -
మట్టి కొట్టుకుపోతున్న రాజమహళ్లు, గడీలు
సాక్షి నెట్వర్క్: దర్పానికి, రాజసానికి దర్పణంగా నిలిచిన చారిత్రక కట్టడాలు నిర్లక్ష్యంతో శిథిలమై నిశీథిలోకి జారుకుంటున్నాయి. అబ్బుర పర్చే నిర్మాణ శైలికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచి ఇప్పుడు నిర్వహణాలోపానికి తలవంచి మట్టికొట్టుకుపోతున్నాయి. రెండొందల ఏళ్ల సంస్థానాధీశుల పాలనలో అనేక ప్రత్యేకతలతో నిర్మాణమైన రాజమహళ్లు, గడీలుశిథిల వైభవానికి చిరునామాలవుతున్నాయి. 1948లో సంస్థానాల పాలన అంతమైన అనంతరం రాష్ట్రంలోని పలుచోట్ల సంస్థానాధీశులు ఆ భవనాలను ప్రజోపయోగ పనుల కోసం ప్రభుత్వానికి అప్పగించారు. వీటిల్లో గత యాభై ఏళ్లు సజావుగా కార్యకలాపాలు నిర్వహించారు. కానీ, కొంతకాలంగా వీటిలో కనీస నిర్వహణ కరువైంది. ఈ భవనాలు శిథిలమవుతున్న తీరుపై సంస్థానాధీశుల వారసు లతోపాటు చరిత్రకారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ భవనాల పరిరక్షణతో పర్యాటకం పెరగటమేకాక ఈ తరానికి ఆర్కిటెక్చర్‌కు సంబంధించి కొత్తపాఠాలు చెప్పినట్లు అవుతుందని వారు అంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించి ఈ భవనాల వైభవాన్ని ముందు తరాలకు అందించేవిధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కళ చెదిరిన.. రంగ్ మహల్ వనపర్తిలో నూటాఏభై ఎనిమిది ఏళ్ల క్రితం సరికొత్త నిర్మాణశైలితో సంస్థానాధీశుని కోసం నిర్మితమైన ‘రంగుమహల్’ ఇప్పుడు కళ తప్పింది. హైదరాబాద్ స్టేట్‌లో సొంత కరెన్సీ– అరబ్బులుసహా భారీ సైనిక బల గాలతో 152 గ్రామాల్లో 605 చద రపు మైళ్లు కలిగిన అతిపెద్ద సంస్థానం వన పర్తి. ఎత్తైన గోపురాలతో విదేశీ శిల్పుల ఆధ్వర్యంలో 1849లో ప్రారంభమైన ఈ భవననిర్మాణం 1864లో పూర్తయింది. ఇండియాలో విలీనమైన అనంతరం చివరి సంస్థానాధీశుడు రాజారామేశ్వర రావు దీన్ని ప్రభుత్వానికి అప్పగించారు. దీనిలో 1958లో అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ చేతుల మీదుగా రాష్ట్రంలోనే తొలి పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించారు. అయితే భవనం నిర్వహణ లోపాలతో ఈ మధ్య పెచ్చులూడిపోతుండటంతో క్లాసులను వేరే చోటికి తరలించి ప్రస్తుతం పరిపాలన, గ్రంథాలయం కోసం వినియో గిస్తున్నారు. కళాత్మకమైన ఆర్చీలు ఇప్పటికీ చెదరలేదు. అయితే నిర్వహణ లోపాలతో గడీ మొదటి అంతస్తు మొత్తం శిథిలావస్థకు చేరుకుంది. తక్షణ మరమ్మతుల కోసం రూ.4.20 కోట్ల అంచనా వ్యయంతో ఫైలు ప్రభుత్వానికి పంపినా ఇప్పటివరకు ఆమోదం పొందలేదు. వనపర్తి సంస్థాన వారసురాలు నందినీరావు హైదరాబాద్‌లో విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు నిలబెట్టుకున్న సిర్నాపల్లి 1910–13లలో నిజామాబాద్ జిల్లా సిర్నాపల్లిలో ఇండో– యూరోపియన్ నిర్మాణశైలితో గడీ నిర్మితమైంది. సిమెంట్, స్టీల్, కాంక్రీట్ వాడకుండా ఈ గడీని నిర్మించడం విశేషం. గడీకి ముందు భాగంలో ఇరువైపులా ఎత్తైన గోపురాలు, మధ్యలో రాజసం ఉట్టిపడేలా గంభీరంగా చూస్తూ నిలుచున్న రెండు సింహాలు ఉంటాయి. ఈ గడీ నిర్మాణంలో పూర్తిగా మట్టి, ఇటుకలు, రాళ్లు, డంగుసున్నం, పొడవాటి ఇనుప స్తంభాలు ఉపయోగించారు. గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేందుకు వీలుగా ముఖద్వారం ఉత్తరం వైపు ఉండేలా నిర్మాణం చేపట్టారు. నిర్మాణ శైలి, వాడిన పదార్థాల మూలంగా ఈ గడిలో ఉష్ణోగ్రతలు సమతూకంగా ఉంటాయి. చలికాలం వెచ్చగా, వేసవికాలం చల్లగా ఉంటుంది. 1921లో జానకీబాయి మరణానంతరం బందిపోట్లు, రజాకార్ల దాడుల్లో ఇతర బంగ్లాలు ధ్వంసమైనప్పటికీ గడీ మాత్రం పటిష్టంగానే ఉంది. తదనంతర కాలంలో ఇది దాదాపు మూడు దశాబ్దాలకుపైగా ప్రభుత్వ పాఠశాలగా సేవలు అందించింది. దీనిని శీలం జానకీబాయి వారసులు గ్రామస్తుల విరాళాలతో కాపాడుకుంటూ వస్తున్నారు. గ్రామస్తులు రూ.20 వేల విరాళాలు, జానకీబాయి వారసురాలు అనురాధారెడ్డి రూ.60 వేలు అందించారు. గ్రామ పంచాయతీ నుంచి మరో రూ.5 లక్షలు ఖర్చు పెట్టి మరమ్మతులు చేయించి పెయింటింగ్ వేయించారు. ఉపాధిహామీ కింద దీనికి ఒక వాచ్‌మన్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ గడీని పోటీ పరీక్షలకు సిద్ధపడే విద్యార్థుల కోసం గ్రంథాలయంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. జానకీబాయి వారసురాలు అనురాధారెడ్డి హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. దొంగల పాలైన.. ఇందారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గడీ దొంగల పాలైంది. దేశ, విదేశాల నుంచి తెచ్చిన విలువైన సామగ్రి, కలపను ఎత్తుకుపోయారు. నిజాంరాజుకు నమ్మినబంటు అయినా గోనె వెంకట ముత్యంరావు ఆధ్వర్యంలో ఈ గడీని 1927లో హైదరాబాద్ స్టేట్‌లోనే ఓ ప్రత్యేకత శైలితో నిర్మించారు. ఈ గడీ కేంద్రంగా సిరోంచ, గడ్చిరోలి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 300 గ్రామాల పాలన సాగేది. 1948లో నిజాం లొంగుబాటు తర్వాత గోనె వెంకట ముత్యంరావు కుటుంబం హైదరాబాద్‌కు తరలివెళ్లింది. (క్లిక్: తెలంగాణకే తలమానికం! ట్విన్ టవర్స్) టూరిజం సర్క్యూట్‌గా ఏర్పాటు చేయాలి ‘200 ఏళ్ల క్రితమే హైదరాబాద్ స్టేట్‌లో అత్యున్నత శైలిలో భవనాలు నిర్మించారు. అన్ని ప్రాంతాల్లోని సంస్థాన భవనాలపై ప్రభుత్వం తక్షణ శ్రద్ధ చూపి టూరిజం సర్క్యూట్‌గా ప్రమోట్ చేయాలి. దీనివల్ల ఆయా ప్రాంతాల ప్రాచుర్యంతోపాటు అనేకమందికి ఉపాధి కేంద్రాలుగా మారుతాయి’ –అనురాధారెడ్డి, కన్వీనర్, ఇంటాక్ -
వామ్మో! చేపల వలలో భారీ కొండ చిలువ
సాక్షి, వనపర్తి: పట్టణంలోని రాజనగరం అమ్మచెరువు కల్వర్టు వద్ద ఏర్పాటు చేసిన చేపల వలలో ఆదివారం కొండ చిలువ చిక్కింది. అటుగా వెళ్లేవారు గుర్తించి గ్రామస్తులకు సమాచారమిచ్చారు. 8 అడుగుల కొండ చిలువను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారు. అనంతరం స్నేక్ సాగర్‌కు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని సురక్షితంగా పట్టుకొని అడవిలో వదిలేశారు. చదవండి: Photo Feature: కుక్క.. కోతి సయ్యాట -
నిర్లక్ష్యం చేస్తే ఎండలో నిలబెడతా: వనపర్తి కలెక్టర్
సాక్షి,వనపర్తి: ‘ప్రజావాణిలో సమస్యల పరిష్కారం కోసం వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి.. నిర్లక్ష్యం చేసిన అధికారులను ఎండలో నిలబెట్టేందుకు వెనుకాడబోం..’ అంటూ కలెక్టర్ షేక్‌యాస్మిబాషా మండిపడ్డారు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ‘ప్రజావాణి’లో అడిషనల్ కలెక్టర్ ఆశిష్‌సంగ్వాన్‌తో కలిసి ఆమె మొత్తం 20అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకే సమస్యపై అర్జీదారులు రెండోసారి రాకుండా పరిష్కరించాలన్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, ఉదయం 11 గంటలలోగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలన్నారు. ఆ తర్వాత అధికారులు తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని, ‘ప్రజావాణి’కి వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. హెచ్‌హెచ్‌పీపై కలెక్టర్ ఆగ్రహం వేరే వారి విద్యుత్ లైన్‌ను తమ పొలంలో వేయటంతో ఇటీవల షార్ట్ సర్క్యూట్ అయిందని కలెక్టర్‌కు గోపాల్పేట మండలం ధర్మాతండాకు చెందిన నార్యానాయక్ ఫిర్యాదు చేశారు. దీంతో ఎనిమిది ఎకరాల్లోని మామిడితోటలో కొన్ని చెట్లు కాలిపోయాయన్నారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదన్నారు. విద్యుత్ అధికారులను ఎప్పుడు అడిగినా.. ‘కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒత్తిడి ఉందంటూ..’ ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితుడు చెప్పారు. కలెక్టరేట్ నుంచి ఎవరు ఒత్తిడి తెచ్చారని గట్టిగా అడిగితే ధరణి ఆపరేటర్ (హ్యాండ్ హోల్డింగ్ పర్సన్) అనడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాను ఎవరికీ ఫోన్ చేయలేదని హెచ్‌హెచ్‌పీ చెప్పుకొచ్చారు. ఇక జిల్లా కేంద్రంలో 8సమస్యలను పరిష్కరించాలని అఖిలపక్షం నాయకులు కోరారు. కొందరు నాయకులు ఉపాధ్యాయ భవన్ స్థలంలో షాపులు నిర్మించి స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు. చదవండి: వంట విషయంలో తల్లి, కూతురు గొడవ.. ఖాళీ బీరు సీసా తీసుకుని.. ∙ -
Wanaparthy: రూ.1.20కోట్ల ప్యాకేజీతో అమెజాన్‌లో ఉద్యోగం
సాక్షి, పాన్‌గల్ (వనపర్తి): మండలంలోని కేతేపల్లి గ్రామానికి చెందిన వంగూరు బాలీశ్వర్‌రెడ్డి, వసంతలక్ష్మి దంపతుల ద్వితీయ కుమారుడు అనీష్కుమార్రెడ్డి అమెరికాలో అమెజాన్ సంస్థలో ఏడాదికి రూ.కోటి 20లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడని కుటుంబ సభ్యులు గురువారం తెలిపారు. అనీష్‌కుమార్ రెడ్డి పదవ తరగతి వరకు హైదరాబాద్‌లోని సెయింట్ జోసెఫ్ పాఠశాలల్లో, ఇంటర్ విద్యను శ్రీ చైతన్య కళాశాలలో, బీటెక్ (సీఎస్) గీతం యూనివర్సిటీ హైదరాబాద్, ఎంఎస్‌ను అమెరికాలో మిస్సోరి యూనివర్సిటీలో పూర్తిచేసి ఉద్యోగం సాధించారు. ఏడాదికి రూ.1.20కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సాధించడంపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తంచేశారు. చదవండి: (సర్కారు వారి పాట) -
వామ్మో.. ఇన్ని పాములా..!
సాక్షి, వనపర్తి: వనపర్తి శివారు నాగవరం వద్ద ఉన్న రామన్‌పాడు మెయిన్ వాల్వ్‌కు లీకేజీ ఏర్పడింది. బుధవారం మరమ్మతు చేసేందుకు సిబ్బంది అందులోకి దిగారు. అందులో కుప్పలుగా పాములు, పిల్లలు కనిపించడంతో ఒక్కసారిగా బయటకు వచ్చారు. వెంటనే స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణసాగర్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన అక్కడికి చేరుకొని మెయిన్ వాల్వ్‌లో ఉన్న 3 పెద్దపాములు, 50 దాకా పాము పిల్లలను బయటకు తీసి సురక్షితంగా అడవిలో వదిలేశారు. పట్టుకున్న పాములు నీరుకట్ట అని కృష్ణసాగర్ తెలిపారు. చదవండి: నువ్వే నా లోకమంటూ ప్రేమ పేరిట దగ్గరై..