సరళాసాగర్ లిఫ్టు పంపుహౌస్
మదనాపురం : బీడు భూములను సాగులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ సంకల్పం.. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఎత్తిపోతల పథకాలు శిథిలావస్థకు చేరాయి. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కమీషన్లకు కక్కుర్తిపడి దశాబ్దాల పాటు పనిచేయాల్సిన ఎత్తిపోతల పథకాలు ఆదిలోనే మొరాయిస్తున్నాయి. కాంట్రాక్టర్లు కాసులకు కక్కుర్తిపడి నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడంతో లిఫ్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి పాలమూరు జిల్లాకే తలమానిగా ఉన్న సరళాసాగర్ ఎత్తిపోతల పథకాన్ని రామన్‌పాడ్ బ్యాలెన్స్ రిజర్వాయర్ నుంచి నాబార్డు ఆర్థికసాయంతో రూ.1,292 లక్షలు వెచ్చించి 2006లో నిర్మించారు. ఈ లిఫ్టు ద్వారా సరళాసాగర్ ప్రాజెక్టును నింపి 4200 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా అధికారులు డిజైనింగ్ రూపొందించారు.
తరచూ లీకేజీలు
మదనాపురం మండలంలోని శంకరమ్మపేట, దంతనూర్, మదనాపురం, తిర్మలాయపల్లి, రామన్‌పాడు, అజ్జకొల్లు, నర్సింగాపురం, నెల్విడి, వడ్డెవాట గ్రామాలకు సాగునీరు అందించాలని సరళాసాగర్ ఎత్తిపోతల పథకాన్ని రూపకల్పనచేశారు. పథకాన్ని ప్రారంభించిన నాటినుంచి ఇప్పటివరకు ప్రధాన పైప్‌లైన్‌కు 30లీకేజీలు ఉన్నాయి. గత వేసవిలో 20లీకేజీలను సరిచేయగా ఇంకా పదింటిని సరిచేయాల్సి ఉంది. మూడున్నరేళ్లలో నాలుగుసార్లు పైప్‌లైన్ పగిలింది.
మొదటిసారి మదనాపురం చిన్నవాగులో, రెండవ సారి ప్రధాన పంప్‌హౌస్ వద్ద తిర్మలాయపల్లి శివారు, మూడవ సారి మదనాపురం వాగులోని మొదట పగిలిన స్థానంలోనే మళ్లీ పగిలింది. నాలుగోసారి నర్సింగాపురం శివారు కావలి రాములు పొలంలో పైప్‌లైన్ పగిలింది. ఎప్పుడు ఎక్కడ ఏ పైప్‌లైన్ పగులుతుందోనని ఇటు లిఫ్టు నిర్వాహణ కమిటీ, ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల పగిలిన పైప్‌లైన్లకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తన సొంత నిధుల నుంచి రూ.3లక్షలు వెచ్చించి మరమ్మతు చేయించారు.
నాణ్యతలేని పైపులు వేశారు.
తరతరాలుగా రైతులకు అన్నంపెట్టే లిఫ్టును కాంట్రాక్టర్లు కమీషన్ల కోసం నిర్మాణంలో నాణ్యతలేని పైపులు వేశారు. అధికారులు కుమ్మక్కై ఎత్తిపోతల పథకం లక్ష్యాన్ని నీరుగార్చారు. నాటి సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి ఆశయానికి తూట్లు పొడిచారు. తరచూ లీకేజీలతో పొలాలకు నీళ్లు రాక సతమతమవుతున్నాం.. లిఫ్టు మూతపడితే మా పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతుంది.
– వెంకటయ్య, రైతు, నర్సింగాపురం
కాంట్రాక్టర్లు దోచుకున్నారు
లిఫ్టు నిర్మాణ సమయంలో అధికారులు కాంట్రాక్టర్లు కలిసి దోచుకున్నారు. నాణ్యమైన పైపులు, మోటార్లు వేయకపోవడంతో తరచూ ఇబ్బందులు ఎదుర్కుంటున్నాం.. లిఫ్టు నడవకుంటే ప్రస్తుతం వరినాట్లు వేసుకున్న 1600ఎకరాల పంట ఎండిపోతుంది. అధికారులు స్పందించి ఎత్తిపోతల పథకాలను మరమ్మతు చేసి ప్రారంభించారు.
– సూరిబాబు, రైతు, మదనాపురం
నాణ్యతలేని పైపుల వాడకంతోనే..
4,200ఎకరాలకు సాగునీరు అందించే లిఫ్టు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం, నాణ్యత లేని పైపులు, నాసిరకమైన విద్యుత్ మోటార్లను బిగించకపోవడంతోనే అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రధాన పైప్‌లైన్ గుండా ప్రారంభించిన నాటినుంచి తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. కొన్నిసార్లు నీటి ఉధృతిని తట్టుకోలేక పైపులు పగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 1600 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment