ethipothala scheme
-
‘ఉత్తి’పోతల పథకాలు
టేక్మాల్(మెదక్): ప్రభుత్వం సాగునీటి కోసం కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఎత్తిపోతల పథకాలు, కాలువల మరమ్మత్తులు చేపడుతోంది. అయితే, క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యంతో సాగునీటి పథకాలు నిరుపయోగంగా మారుతున్నాయి. ఫలితంగా వందలాది ఎకరాలు బీడు భూములుగా మారుతుడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. రూ.50 లక్షలతో అచ్చన్నపల్లిలో.. టేక్మాల్ మండలం అచ్చన్నపల్లిలో మంజీర నదిపై 1995లో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. రూ.50 లక్షలతో నిర్మించిన ఈ పథకం ద్వారా అచ్చన్నపల్లి, లక్ష్మణ్, చంద్రుతండాల్లో నాలుగు చెరువులను నింపాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 180 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. రెండేళ్ల పాటు సక్రమంగా పని చేసినా.. నిర్వహణ లోపంతో ప్రస్తుతం వృథాగా మారింది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.77 లక్షలతో గతేడాది పాత ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా వదిలేసి నూతనంగా నిర్మించారు. ఎత్తిపోతల పథకాన్ని ఓ కమిటీ ద్వారా ఎప్పటికప్పుడు ఎంత ఆయకట్టు వేయాలో ముందు నిర్ణయించి.. సాగు చేస్తున్నారు. 2017 ఖరీఫ్, 2018 రబీలో సుమారు 100 ఎకరాలకు ఎత్తిపోతల ద్వారా సాగు చేశారు. అదే అదునుతో ఖరీఫ్‌లో రెట్టింపు సాగు చేయాలని రైతులు గంపెడు ఆశతో భూములన్నీ చదును చేసుకొని.. వరినారు మడులను సిద్ధం చేసుకున్నారు. మరికొందరు రైతులు ముందస్తుగా వరినాట్లు వేశారు. ఎత్తిపోతల ద్వారా రెండు పంటలు నీరు అందకముందే మంజీర ఖాళీ కావడంతో ఆ పథకం కాస్తా నిర్వీర్యం అయ్యింది. ఫలితంగా భూములు బీడులు మారాయి. మరమ్మతులకు నోచుకోని కోరంపల్లి పథకం మండలంలోని కోరంపల్లి ఎత్తిపోతల పథకం కొంతకాలంగా మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఫలితంగా 600 ఎకరాలకు పైగా బీడుగా మారింది. 1992లో రూ.1.50 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించి మంజీర తీరంలో అంతర్గత బావి నిర్మించారు. వేసవిలో ఇసుక తరలించడంతో నీరు ఎక్కువగా నిల్వ ఉండని స్థితి ఏర్పడింది. క్రమేపి నీటిమట్టం పడిపోవడంతో సాగు విస్తీర్ణం 150 ఎకరాలకు తగ్గిపోయింది. ప్రస్తుతం ఎత్తిపోతల పథకం ద్వారా అసలు వ్యవసాయం చేయడం లేదని రైతులు చెబుతున్నారు. సింగూరు నీటిని మంజీర నదిలోకి వదలకపోవడంతో ఈ పథకం వెలవెలబోతుంది. ఫలితంగా బీడు భూములన్నీ సాగులోనికి వస్తాయనుకున్న రైతుల ఆశలు ఆవిరి అవుతున్నాయి. -
లీకేజీలపర్వం
మదనాపురం : బీడు భూములను సాగులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ సంకల్పం.. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఎత్తిపోతల పథకాలు శిథిలావస్థకు చేరాయి. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కమీషన్లకు కక్కుర్తిపడి దశాబ్దాల పాటు పనిచేయాల్సిన ఎత్తిపోతల పథకాలు ఆదిలోనే మొరాయిస్తున్నాయి. కాంట్రాక్టర్లు కాసులకు కక్కుర్తిపడి నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడంతో లిఫ్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి పాలమూరు జిల్లాకే తలమానిగా ఉన్న సరళాసాగర్ ఎత్తిపోతల పథకాన్ని రామన్‌పాడ్ బ్యాలెన్స్ రిజర్వాయర్ నుంచి నాబార్డు ఆర్థికసాయంతో రూ.1,292 లక్షలు వెచ్చించి 2006లో నిర్మించారు. ఈ లిఫ్టు ద్వారా సరళాసాగర్ ప్రాజెక్టును నింపి 4200 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా అధికారులు డిజైనింగ్ రూపొందించారు. తరచూ లీకేజీలు మదనాపురం మండలంలోని శంకరమ్మపేట, దంతనూర్, మదనాపురం, తిర్మలాయపల్లి, రామన్‌పాడు, అజ్జకొల్లు, నర్సింగాపురం, నెల్విడి, వడ్డెవాట గ్రామాలకు సాగునీరు అందించాలని సరళాసాగర్ ఎత్తిపోతల పథకాన్ని రూపకల్పనచేశారు. పథకాన్ని ప్రారంభించిన నాటినుంచి ఇప్పటివరకు ప్రధాన పైప్‌లైన్‌కు 30లీకేజీలు ఉన్నాయి. గత వేసవిలో 20లీకేజీలను సరిచేయగా ఇంకా పదింటిని సరిచేయాల్సి ఉంది. మూడున్నరేళ్లలో నాలుగుసార్లు పైప్‌లైన్ పగిలింది. మొదటిసారి మదనాపురం చిన్నవాగులో, రెండవ సారి ప్రధాన పంప్‌హౌస్ వద్ద తిర్మలాయపల్లి శివారు, మూడవ సారి మదనాపురం వాగులోని మొదట పగిలిన స్థానంలోనే మళ్లీ పగిలింది. నాలుగోసారి నర్సింగాపురం శివారు కావలి రాములు పొలంలో పైప్‌లైన్ పగిలింది. ఎప్పుడు ఎక్కడ ఏ పైప్‌లైన్ పగులుతుందోనని ఇటు లిఫ్టు నిర్వాహణ కమిటీ, ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల పగిలిన పైప్లైన్లకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తన సొంత నిధుల నుంచి రూ.3లక్షలు వెచ్చించి మరమ్మతు చేయించారు. నాణ్యతలేని పైపులు వేశారు. తరతరాలుగా రైతులకు అన్నంపెట్టే లిఫ్టును కాంట్రాక్టర్లు కమీషన్ల కోసం నిర్మాణంలో నాణ్యతలేని పైపులు వేశారు. అధికారులు కుమ్మక్కై ఎత్తిపోతల పథకం లక్ష్యాన్ని నీరుగార్చారు. నాటి సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి ఆశయానికి తూట్లు పొడిచారు. తరచూ లీకేజీలతో పొలాలకు నీళ్లు రాక సతమతమవుతున్నాం.. లిఫ్టు మూతపడితే మా పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతుంది. – వెంకటయ్య, రైతు, నర్సింగాపురం కాంట్రాక్టర్లు దోచుకున్నారు లిఫ్టు నిర్మాణ సమయంలో అధికారులు కాంట్రాక్టర్లు కలిసి దోచుకున్నారు. నాణ్యమైన పైపులు, మోటార్లు వేయకపోవడంతో తరచూ ఇబ్బందులు ఎదుర్కుంటున్నాం.. లిఫ్టు నడవకుంటే ప్రస్తుతం వరినాట్లు వేసుకున్న 1600ఎకరాల పంట ఎండిపోతుంది. అధికారులు స్పందించి ఎత్తిపోతల పథకాలను మరమ్మతు చేసి ప్రారంభించారు. – సూరిబాబు, రైతు, మదనాపురం నాణ్యతలేని పైపుల వాడకంతోనే.. 4,200ఎకరాలకు సాగునీరు అందించే లిఫ్టు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం, నాణ్యత లేని పైపులు, నాసిరకమైన విద్యుత్ మోటార్లను బిగించకపోవడంతోనే అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రధాన పైప్‌లైన్ గుండా ప్రారంభించిన నాటినుంచి తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. కొన్నిసార్లు నీటి ఉధృతిని తట్టుకోలేక పైపులు పగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 1600 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది. -
‘ఉత్తి’ పోతలు
► ఉమ్మడి జిల్లాలో 70 ఎత్తిపోతల పథకాలు ► రూ.315 కోట్లతో నిర్మాణం ► ఆయకట్టు సామర్థ్యం 78 వేల ఎకరాలు ► సాగవుతున్నది కేవలం 28,575 ఎకరాలే.. ► మరో 49,425 ఎకరాలకు సాగునీరందని వైనం ► 70 పథకాల మరమ్మతులకు ప్రతిపాదనలు ► కొనసాగుతున్న కొన్నింటి మరమ్మతు పనులు సాక్షి, నిర్మల్: ఉమ్మడి జిల్లాలో ఎత్తిపోతల పథకాలు అలంకారప్రాయమయ్యాయి. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ పథకాలు బీడు భూములకు ప్రయోజనం చేకూర్చకపోగా ఉత్తిపోతలుగా మారాయి. ఈ ఎత్తిపోతల పథకాలను ఎన్నో ఏళ్ల కింద నిర్మించినా అప్పటి అంచనా సామర్థ్యం ఆయకట్టును ఇప్పటికీ అందుకోలేకపోతున్నాయి. సామర్థ్యంలో సగానికంటే తక్కువ ఆయకట్టుకు సాగునీళ్లు అందించే పరిస్థితులున్నాయి. వీటిని పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసిన పక్షంలో వేలాది మంది రైతులకు ప్రయోజనం చేకూర్చుతుంది. ప్రభుత్వం ఈ ఎత్తిపోతల పథకాల మరమ్మతులపై దృష్టిసారించి రైతులకు మేలు చేకూర్చాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులు, వాగుల్లో నీళ్లు నిండుగా ఉన్నప్పటికీ ఎత్తిపోతల పథకాలు పనిచేయని పరిస్థితుల్లో ఆయకట్టు రైతులకు సాగునీరు అందకపోవడంతో పథకం ఉద్దేశం నిష్ఫలమవుతోంది. 70 ఎత్తిపోతల పథకాలు... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 70 ఎత్తిపోతల పథకాలున్నాయి. అందులో ఆదిలాబాద్ జిల్లాలో 12, కుమురంభీంలో 11, మంచిర్యాలలో 9, నిర్మల్‌లో 38 ఉన్నాయి. ఈ పథకాలను రూ.315 కోట్లతో నిర్మించారు. ఉమ్మడి జిల్లాలో గోదావరి, కడెం, స్వర్ణ, పెన్‌గంగ, ప్రాణహిత నదులతో పాటు ఎస్సారెస్పీ ప్రాజెక్టు, చెలిమెల వాగు, సుద్దవాగు, బజార్హత్నూర్ వాగుతో పాటు పలు ఇతర స్థానిక చిన్న, చితక వాగులు ఈ ఎత్తిపోతల పథకాలకు నీటి వనరులుగా ఉన్నాయి. 78 వేల ఎకరాల ఆయకట్టు సామర్థ్యం ఉండగా 28,575 ఎకరాల ఆయకట్టు మాత్రమే సాగవుతోంది. మరో 49,425 ఎకరాల ఆయకట్టు సాగుకు నోచుకోని పరిస్థితి ఉంది. ఇందులో 13 ఎత్తిపోతలు పనిచేస్తున్నప్పటికీ అవి ఇప్పటికీ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించని పరిస్థితి ఉంది. 16 ఎత్తిపోతల పథకాలు కొంతమేర పనిచేయని పరిస్థితి ఉండడంతో పూర్తి ఆయకట్టుకు ప్రయోజనం అందడం లేదు. 41 పథకాలు అసలుకే పనిచేయకపోవడంతో ఆ ఎత్తిపోతల కింద పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందని పరిస్థితి ఉంది. ప్రతిపాదనలో పదకొండు పథకాలకే మంజూరు 70 ఎత్తిపోతల పథకాలను మరమ్మతులు చేసి మిగిలిన 49,425 ఎకరాల ఆయకట్టును సాగులోకి తెచ్చేందుకు రూ.118.29 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. ఇందులో కేవలం 11 పథకాలకు రూ.14.07 కోట్ల మాత్రమే మంజూరు లభించింది. ఆ పనులు కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన 59 మంది పనులకు సంబంధించి రూ.104.21 కోట్ల ప్రతిపాదనలకు మోక్షం లభిస్తే ఎత్తిపోతల పథకాల ప్రయోజనం నెరవేరుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాల్లో పనిచేయని ఎత్తిపోతల పథకాలు మోటార్ పంపులైన్ల లికేజీలే కారణంగానే అలా ఉన్నాయి. పథకాల నిర్వహణ లేకపోతుండడంతో మూలన పడుతున్నాయి. ప్రభుత్వం కోట్లు వెచ్చించి ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నా నిర్వహణను ఆయకట్టు కమిటీల కింద రైతులే చేపట్టాల్సి ఉంటుంది. దీంతో చిన్నచిన్న మరమ్మతులు వచ్చినా రైతులు చేయించుకోని పరిస్థితిలో ఉన్నారు. ఆయకట్టు కమిటీలు క్రియాశీలకంగా వ్యవహరించి ఎత్తిపోతల పథకాల నిర్వహణను చేయాల్సి ఉంటుంది. ఇలా జిల్లాలో కొన్ని పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. నిర్మల్ జిల్లాలోని గడ్చాంద్ ఎత్తిపోతల పథకం ఏ రోజు కూడా నిర్వహణ లోపంతో ఆగిపోకుండా ఏడాదికి రెండు పంటలకు నీళ్లు అందిస్తుందని, ఇది అక్కడి ఆయకట్టు రైతుల సమష్టి కృషిని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అలాగే మిగితా ఎత్తిపోతల పథకాల ఆయకట్టు కమిటీలు కూడా ఆదర్శంగా ఉన్న ఆయకట్టు కమిటీలను అనుసరించాలని పేర్కొంటున్నారు. ఉపయోగంలోకి తీసుకువస్తాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిరుపయోగంగా ఉన్న ఎత్తిపోతల పథకాలను ఉపయోగంలోకి తీసుకువచ్చి పూర్తి ఆయకట్టుకు సాగునీరందించే చర్యలు తీసుకుంటున్నాం. 70 ఎత్తిపోతల పథకాల్లో 11 పథకాలకు నిధులు మంజూరయ్యాయి. పనులు కొనసాగుతున్నాయి. మిగితా 59 పనులకు మంజూరు లభించగానే పనులు చేపడుతాం. జిల్లాలో మరిన్ని కొత్త ఎత్తిపోతల పథకాలకు రూపకల్పన చేస్తున్నాం. – వి.హంజనాయక్, డిప్యూటీ ఈఈ, నీటి పారుదల అభివృద్ధి సంస్థ