► ఉమ్మడి జిల్లాలో 70 ఎత్తిపోతల పథకాలు
► రూ.315 కోట్లతో నిర్మాణం
► ఆయకట్టు సామర్థ్యం 78 వేల ఎకరాలు
► సాగవుతున్నది కేవలం 28,575 ఎకరాలే..
► మరో 49,425 ఎకరాలకు సాగునీరందని వైనం
► 70 పథకాల మరమ్మతులకు ప్రతిపాదనలు
► కొనసాగుతున్న కొన్నింటి మరమ్మతు పనులు
సాక్షి, నిర్మల్: ఉమ్మడి జిల్లాలో ఎత్తిపోతల పథకాలు అలంకారప్రాయమయ్యాయి. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ పథకాలు బీడు భూములకు ప్రయోజనం చేకూర్చకపోగా ఉత్తిపోతలుగా మారాయి. ఈ ఎత్తిపోతల పథకాలను ఎన్నో ఏళ్ల కింద నిర్మించినా అప్పటి అంచనా సామర్థ్యం ఆయకట్టును ఇప్పటికీ అందుకోలేకపోతున్నాయి. సామర్థ్యంలో సగానికంటే తక్కువ ఆయకట్టుకు సాగునీళ్లు అందించే పరిస్థితులున్నాయి. వీటిని పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసిన పక్షంలో వేలాది మంది రైతులకు ప్రయోజనం చేకూర్చుతుంది.
ప్రభుత్వం ఈ ఎత్తిపోతల పథకాల మరమ్మతులపై దృష్టిసారించి రైతులకు మేలు చేకూర్చాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులు, వాగుల్లో నీళ్లు నిండుగా ఉన్నప్పటికీ ఎత్తిపోతల పథకాలు పనిచేయని పరిస్థితుల్లో ఆయకట్టు రైతులకు సాగునీరు అందకపోవడంతో పథకం ఉద్దేశం నిష్ఫలమవుతోంది.
70 ఎత్తిపోతల పథకాలు...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 70 ఎత్తిపోతల పథకాలున్నాయి. అందులో ఆదిలాబాద్ జిల్లాలో 12, కుమురంభీంలో 11, మంచిర్యాలలో 9, నిర్మల్‌లో 38 ఉన్నాయి. ఈ పథకాలను రూ.315 కోట్లతో నిర్మించారు. ఉమ్మడి జిల్లాలో గోదావరి, కడెం, స్వర్ణ, పెన్‌గంగ, ప్రాణహిత నదులతో పాటు ఎస్సారెస్పీ ప్రాజెక్టు, చెలిమెల వాగు, సుద్దవాగు, బజార్‌హత్నూర్ వాగుతో పాటు పలు ఇతర స్థానిక చిన్న, చితక వాగులు ఈ ఎత్తిపోతల పథకాలకు నీటి వనరులుగా ఉన్నాయి. 78 వేల ఎకరాల ఆయకట్టు సామర్థ్యం ఉండగా 28,575 ఎకరాల ఆయకట్టు మాత్రమే సాగవుతోంది.
మరో 49,425 ఎకరాల ఆయకట్టు సాగుకు నోచుకోని పరిస్థితి ఉంది. ఇందులో 13 ఎత్తిపోతలు పనిచేస్తున్నప్పటికీ అవి ఇప్పటికీ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించని పరిస్థితి ఉంది. 16 ఎత్తిపోతల పథకాలు కొంతమేర పనిచేయని పరిస్థితి ఉండడంతో పూర్తి ఆయకట్టుకు ప్రయోజనం అందడం లేదు. 41 పథకాలు అసలుకే పనిచేయకపోవడంతో ఆ ఎత్తిపోతల కింద పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందని పరిస్థితి ఉంది.
ప్రతిపాదనలో పదకొండు పథకాలకే మంజూరు
70 ఎత్తిపోతల పథకాలను మరమ్మతులు చేసి మిగిలిన 49,425 ఎకరాల ఆయకట్టును సాగులోకి తెచ్చేందుకు రూ.118.29 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. ఇందులో కేవలం 11 పథకాలకు రూ.14.07 కోట్ల మాత్రమే మంజూరు లభించింది. ఆ పనులు కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన 59 మంది పనులకు సంబంధించి రూ.104.21 కోట్ల ప్రతిపాదనలకు మోక్షం లభిస్తే ఎత్తిపోతల పథకాల ప్రయోజనం నెరవేరుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.
జిల్లాల్లో పనిచేయని ఎత్తిపోతల పథకాలు మోటార్ పంపులైన్ల లికేజీలే కారణంగానే అలా ఉన్నాయి. పథకాల నిర్వహణ లేకపోతుండడంతో మూలన పడుతున్నాయి. ప్రభుత్వం కోట్లు వెచ్చించి ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నా నిర్వహణను ఆయకట్టు కమిటీల కింద రైతులే చేపట్టాల్సి ఉంటుంది. దీంతో చిన్నచిన్న మరమ్మతులు వచ్చినా రైతులు చేయించుకోని పరిస్థితిలో ఉన్నారు. ఆయకట్టు కమిటీలు క్రియాశీలకంగా వ్యవహరించి ఎత్తిపోతల పథకాల నిర్వహణను చేయాల్సి ఉంటుంది. ఇలా జిల్లాలో కొన్ని పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
నిర్మల్ జిల్లాలోని గడ్‌చాంద్ ఎత్తిపోతల పథకం ఏ రోజు కూడా నిర్వహణ లోపంతో ఆగిపోకుండా ఏడాదికి రెండు పంటలకు నీళ్లు అందిస్తుందని, ఇది అక్కడి ఆయకట్టు రైతుల సమష్టి కృషిని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అలాగే మిగితా ఎత్తిపోతల పథకాల ఆయకట్టు కమిటీలు కూడా ఆదర్శంగా ఉన్న ఆయకట్టు కమిటీలను అనుసరించాలని పేర్కొంటున్నారు.
ఉపయోగంలోకి తీసుకువస్తాం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిరుపయోగంగా ఉన్న ఎత్తిపోతల పథకాలను ఉపయోగంలోకి తీసుకువచ్చి పూర్తి ఆయకట్టుకు సాగునీరందించే చర్యలు తీసుకుంటున్నాం. 70 ఎత్తిపోతల పథకాల్లో 11 పథకాలకు నిధులు మంజూరయ్యాయి. పనులు కొనసాగుతున్నాయి. మిగితా 59 పనులకు మంజూరు లభించగానే పనులు చేపడుతాం. జిల్లాలో మరిన్ని కొత్త ఎత్తిపోతల పథకాలకు రూపకల్పన చేస్తున్నాం.
– వి.హంజనాయక్, డిప్యూటీ ఈఈ, నీటి పారుదల అభివృద్ధి సంస్థ