ప్రేమ కథ అన్నారు.. పులి బొమ్మ వేశారేంటనేగా మీ డౌటు.. ఏం.. మనుషులకేనా ప్రేమ కథలు.. పులులకుండవా.. ఇది జానీగాడి ప్రేమ కథ.. లవర్ కోసం వందల కిలోమీటర్లు వాకింగ్ చేసొచ్చిన ఓ పెద్ద పులి కథ..
కట్ చేస్తే..
మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం.. జానీ ఉండేది ఇక్కడే. గత నెల్లో ఒకానొక శుభముహూర్తాన మనోడికి ‘ప్రేమ’లో పడాలనిపించింది. తీరా చూస్తే.. తనకు ఈడైన జోడు అక్కడ ఎవరూ కనిపించలేదు. దాంతో తోడు కోసం తన ప్రేమ ప్రయాణం మొదలుపెట్టాడు. వెతుక్కుంటూ.. వెతుక్కుంటూ.. ఏకంగా 200 కిలోమీటర్లు నడిచి మన రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా అడవుల్లోకి వచ్చేశాడు.
అక్టోబర్ 25న నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడెల్లి ప్రాంతంలోకి వచ్చిన జానీ.. ఎక్కడా కుదురుగా ఉండటం లేదు. ఓసారి వెనక్కి మహారాష్ట్ర సరిహద్దు దాకా వెళ్లాడు.. మళ్లా తిరిగొచ్చాడు. రోజుకో మండలమన్నట్లు తిరుగుతూనే ఉన్నాడు. ఈ నెల 10వ తేదీనైతే.. రాత్రిపూట మహబూబ్ ఘాట్ రోడ్డుపై కనిపించి అందరికీ కంగారు పెట్టించేశాడు. పెద్ద పులంటే మాటలా మరి.. మంగళవారం మామడ–పెంబి అటవీ ప్రాంతంలో ఎద్దుపై దాడిచేసి చంపేశాడు. ప్రస్తుతం జానీ అదే ప్రాంతంలో తిరుగుతున్నాడు. తన తోడు కోసం.. గూడు కోసం..
ఇంతకీ అటవీ అధికారులేమంటున్నారు?
మిగతా క్రూర జంతువులతో పోలిస్తే పులులు కొంచెం డిఫరెంటుగానే ఉంటాయట. మేటింగ్ సీజన్‌లో తగిన తోడు, గూడు దొరికేదాకా ఎంత దూరమైనా వెళ్తాయట. ఇప్పటివరకూ జానీ.. 500 కిలోమీటర్ల దూరం నడిచాడట. నిర్మల్– ఆదిలాబాద్ మధ్య దట్టమైన అడవులు, నీటి వనరులు, వన్యప్రాణులు ఉండటంతో ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నాడట. ఇలా వచ్చిన పులులను సంరక్షించేందుకు చర్యలు చేపడుతున్నామని.. ‘జానీ’ అనే ఈ పులి ఎటువైపు వెళ్తుందో గమనిస్తూ ఆయా ప్రాంతాల వారిని అప్రమత్తం చేస్తున్నామని, పులి సంరక్షణకు సంబంధించిన సూచనలు చేస్తున్నామని నిర్మల్ డీఎఫ్‌వో నాగిని భాను తెలిపారు.
చదవండి: ‘బాహుబలి’ ఏనుగులకు పెద్ద కష్టం... భూమాతకు తీరని శోకం!
Comments
Please login to add a commentAdd a comment