‘బాహుబలి’ ఏనుగుల‌కు పెద్ద క‌ష్టం.... భూమాతకు తీరని శోకం! | why Africa elephant population declines explained here | Sakshi
Sakshi News home page

అత్యంత వేగంగా అంతరించిపోతున్న ఆఫ్రికన్‌ సవన్నా, ఫారెస్ట్‌ ఏనుగులు

Published Wed, Nov 13 2024 1:21 PM | Last Updated on Wed, Nov 13 2024 1:21 PM

why Africa elephant population declines explained here

భూమండలంపై అత్యంత భారీకాయంతో సంచరించే శాకాహార బాహుబలిగా ఏనుగు మనందరికీ చిరపరిచితం. ఆఫ్రికా ఖండంలోని పీఠభూముల్లో సర్వసాధారణంగా కనిపించే ‘సవన్నా’, ‘అటవీ’జాతి ఏనుగులు అత్యంత వేగంగా అంతర్థానమవుతున్నాయి. అటవీప్రాంతాల్లో విచ్చలవిడిగా పెరిగిన మానవ కార్యకలాపాలు, విస్తరిస్తున్న వ్యవసాయం, విజృంభిస్తున్న అక్రమ వేటతో ఏనుగుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. తాజాగా జరిపిన అధ్యయనం ప్రకారం గత యాభై సంవత్సరాల్లో.. సర్వేచేసిన ప్రాంతాల్లో సవన్నా జాతి ఏనుగుల సంఖ్య 70 శాతం తగ్గిపోయింది. ‘ఫారెస్ట్‌’జాతి ఏనుగుల సంఖ్య ఏకంగా 90 శాతం క్షీణించడం ఏనుగుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఏనుగుల సంఖ్య పెరగడం ఒకింత ఉపశమనం కల్పిస్తోంది.

అత్యంత తెలివి 
అత్యంత తెలివితేటలతోపాటు మానవునిలా సామూహికంగా జీవించే నైపుణ్యమున్న వన్యప్రాణిగా ఏనుగు పేరొందింది. 1964 నుంచి 2016 సంవత్సరం దాకా ఆఫ్రికా ఖండంలోని 37 దేశాల్లోని 475 భిన్న ప్రదేశాల్లో ఏనుగుల జాడపై విస్తృతస్థాయి గణన, పరిశోధన చేశారు. ఇటీవలి దశాబ్దాల్లో ఇంతటి విస్తృత సర్వే చేపట్టడం ఇదే తొలిసారి. సంబంధిత నివేదిక సోమవారం వెల్లడైంది. దీనిలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగుచూశాయి. సవన్నా, ఫారెస్ట్‌ జాతి ఏనుగుల సంఖ్య సగటున ఏకంగా 77 శాతం తగ్గిపోయింది. విడిగా చూస్తే సవన్నా జాతి 70 శాతం, ఫారెస్ట్‌ జాతి సంఖ్య 90 శాతం తగ్గిపోయింది. 

ఒకప్పుడు గుంపులగుంపులుగా కనిపించిన కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు అవి ఒక్కటికూడా లేవని సర్వేలో తేలింది. అయితే కొన్ని చోట్ల స్థానిక ప్రభుత్వాల పరిరక్షణ చర్యలతో వాటి సంఖ్య పెరిగిందని నివేదిక పేర్కొంది. ‘‘తగ్గిపోయిన సంఖ్యను ఎలాగూ పెంచలేము. ఉన్న ఏనుగుల సంఖ్యా వేగంగా క్షీణిస్తోంది. మాలి, చాద్, నైజీరియా వంటి దేశాల్లో మరీ దారుణంగా పడిపోయింది’’ అని కొలరాడో స్టేట్‌ వర్సిటీలో వైల్డ్‌లైఫ్‌ కన్జర్వేషన్‌ విభాగ ప్రొఫెసర్‌ జార్జ్‌ విటెమర్‌ చెప్పారు.

కొన్ని చోట్ల మెరుగైన పరిస్థితులు 
ఆఫ్రికా ఖండం దక్షిణ దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఎంతో శ్రమకోర్చి ఏనుగుల సంతతిని కాపాడుతున్నారు. ప్రభుత్వాల చొరవ, స్థానికుల అండతో ఏనుగుల సంఖ్య అక్కడ పెరిగింది. బొట్సావా, జింబాబ్వే, నమీబియాలో ఇప్పటికే వాటి సంఖ్య భారీగానే ఉంది. ‘‘కొన్ని చోట్ల మనం విజయం సాధించాం. ఈ విషయంలో మనకు మనం శెభాష్‌ చెప్పకోవాల్సిందే. అయితే ఇంకా ఏఏ ప్రాంతాల్లో విజయావకాశాలు ఉన్నాయో కనిపెట్టి కార్యసాధకులం కావాల్సిన తరుణమొచ్చింది’’అని ప్రొఫెసర్‌ జార్జ్‌ విటెమర్‌ అన్నారు.

ఏనుగు దంతాలపై మోజుతో.. 
చాలా పొడవుండే ఆఫ్రికన్‌ ఏనుగుల దంతాలకు అంతర్జాతీయ మార్కెట్లో చాలా విలువ ఉంది. వీటి కోసమే వేటగాళ్లు ఏనుగులను చంపేస్తున్నారు. వేటగాళ్లను అడ్డుకోగలిగితే ఈ వన్యప్రాణులను కాపాడవచ్చని జంతుప్రేమికులు చెబుతున్నారు. అడవుల్లో పెరుగుతున్న వ్యవసాయం కారణంగా ఏనుగులు తమ ఆవాసాలను, ఆహార వనరులను కోల్పోతున్నాయి. 

చ‌ద‌వండి: అడవిలో అమ్మప్రేమ.. జంతువులు, పక్షుల్లో అరుదైన మమకారం!

‘‘అడవుల విస్తరణకు ఏనుగులు మూలాధారం. ఎన్నో రకాల చెట్ల కాయలు, పండ్లను తింటూ వాటి గింజలను జీర్ణంచేయకుండా వేర్వేరు చోట్ల విసర్జించి కొత్త మొక్కల అంకురార్పణకు ఆజ్యం పోస్తాయి. నిత్యం వనవృద్ధి కార్యం చేసే ఏనుగుల సంఖ్య తగ్గడం భూమాతకు తీరని శోకం’’ అని సౌత్‌ ఆఫ్రికాలోని నెల్సన్‌ మండేలా యూనివర్సిటీలోని ఆఫ్రికన్‌ కన్జర్వేషన్‌ ఎకాలజీ అధ్యయనకారుడు, నివేదిక సహరచయిత డేవ్‌ బల్ఫోర్‌ ఆందోళన వ్యక్తంచేశారు. 
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement