wild animals
-
సింహాల ఆవాసంలో 5 రోజులు
అడవి మధ్యలో చిన్న పిల్లాడు.. చుట్టూ గర్జించే సింహాలు.. ఘీంకరించే ఏనుగులు. జంగిల్ బుక్‌లోని మోగ్లీ గుర్తొస్తున్నాడు కదూ! అది కల్పిత కథ. నిజ జీవితంలో అంతకు మించిన సాహసాన్ని చేశాడు జింబాబ్వేకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు. ఐదురోజులపాటు క్రూర మృగాల ఆవాసంలో బతికాడు. ఈ ఆధునిక మోగ్లీ పేరు.. టినోటెండా పుదు. పండ్లు తింటూ.. చెలిమల్లో నీళ్లు తాగుతూ.. జింబాబ్వేలోని మాటుసడోనా గేమ్ పార్క్.. టెనోటెండా పుదు ఇంటికి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎందుకు? ఎలా? వెళ్లాడో తెలియదు. ఒక్కసారి అడవిలోకి వెళ్లాక బయటపడటానికి మార్గం తెలియలేదు. అయితేనేం అధైర్య పడలేదు. బతికేందుకు అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అడవి పండ్లు తింటూ ఆకలి తీర్చుకున్నాడు. ఎండిపోయిన నదీ తీరాల వెంబడి.. కర్రలతో చిన్న చిన్న చెలిమెలు తవ్వి వచ్చిన నీటితో దాహం తీర్చుకుని ప్రాణాలు నిలుపుకొన్నాడు. రాత్రిపూట రాతి బండలపై నిద్రపోయాడు. మరోవైపు కనిపించకుండా పోయిన బాలుని కోసం ఊరంతా వెదికిన తల్లిదండ్రులు చివరకు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్థానిక బృందాలతో కలిసి సెర్చ్ పార్టీ ప్రతిరోజూ డ్రమ్ములు మోగిస్తూ బాలుడిని పట్టుకోవడానికి విఫల ప్రయత్నాలు చేసింది. నాలుగురోజులపాటు వెదికి ఆశలు వదులుకుంది. చివరి అవకాశంగా 5వ రోజు పార్క్ రేంజర్లు వాహనంపై అడవిమొత్తం గాలించడం మొదలుపెట్టారు. వాహనం శబ్దం విన్న బాలుడు అరుస్తూ పరుగెత్తుకుంటూ వచ్చాడు. కానీ అప్పటికే అక్కడినుంచి దూరంగా వచ్చేశారు. చివరకు తడిగా ఉన్న ఓ ప్రాంతంలో చిన్న చిన్న తాజా పాదముద్రలు కనిపించడంతో బాలుడు ఇక్కడే ఉంటాడని భావించారు. వాహనాన్ని వెనక్కి తిప్పి వెళ్లారు. ఎట్టకేలకు పుదుని కనిపెట్టగలిగారు. ప్రశంసల వర్షం.. జింబాబ్వే పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ మేనేజ్ మెంట్ అథారిటీ ప్రకారం ఆఫ్రికాలో అత్యధిక సింహాలున్న పార్క్ అదే. ప్రస్తుతం అక్కడ 40 సింహాలున్నాయి. 1,470 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఉద్యానవనం సింహాలతోపాటు జీబ్రాలు, ఏనుగులు, హిప్పోలు, జింకలకు నిలయంగా ఉంది. అలాంటి పార్క్ నుంచి ప్రాణాలతో బయటపడటం అసాధ్యం. కానీ ఎంతో ధైర్యంతో ప్రాణాలతో బయటపడ్డ బాలుని స్టోరీని.. స్థానిక ఎంపీ ముట్సా మురోంబెడ్జి ఎక్స్‌లో పంచుకున్నారు. పుదు ధైర్యసాహసాలపై సోషల్ మీడియాలో ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వన్యప్రాణులకు స్మగ్లింగ్ ముప్పు
వన్యప్రాణుల అక్రమ రవాణా మన దేశంలో అంతకంతకూ పెరిగిపోతోంది. ఈశాన్య రాష్ట్రాల్లోని సరిహద్దులు, ఎయిర్‌పోర్టుల ద్వారా వన్యప్రాణుల అక్రమ రవాణా జరుగుతున్నట్టు గుర్తించారు. దీనికి చెన్నై, ముంబై ఎయిర్‌పోర్టులు కీలక హబ్‌లుగా మారాయని వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో చెబుతోంది. ఈ ఏడాదిలో అక్రమ రవాణాకు సంబంధించి 40కిపైగా కేసులు నమోదయ్యాయి. వన్యప్రాణుల దంతాలు, విడిభాగాలు, చర్మానికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉండటంతో అక్రమ రవాణా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా జరుగుతోంది. ప్రధానంగా రైనో (ఖడ్గమృగం) కొమ్ము, పులి శరీర భాగాలు సంప్రదాయ ఔషధాల తయారీకి వినియోగిస్తారు. వాటి మాంసాన్ని కొన్నిచోట్ల తింటారు కూడా. అతిపెద్ద వ్యవస్థీకృత నేరాల్లో నాలుగోదిఅడవి జంతువుల అక్రమ రవాణా వల్ల ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం దెబ్బతినడంతోపాటు జీవవైవిధ్యం సమతుల్యత లోపిస్తోంది. ఆరి్థక వ్యవస్థలపైనా దీని ప్రభావం పడుతోంది. అక్రమ రవాణా అనేక దేశాలలో విస్తరించింది. రక్షిత వన్యప్రాణులను వేటాడటం, స్మగ్లింగ్ చేయడం, చట్టవిరుద్ధంగా సేకరించడం, పట్టుకోవడం వంటివి నిరాటంకంగా జరుగుతోంది. డ్రగ్స్, మానవ అక్రమ రవాణా, నకిలీల తర్వాత నాలుగో అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరంగా వన్యప్రాణుల అక్రమ రవాణా కొనసాగుతున్నట్టు గుర్తించారు. ఈ అక్రమ రవాణా విలువ సంవత్సరానికి రూ.1,500 కోట్లు ఉంటుందని వైల్డ్ లైఫ్ నిపుణులు చెబుతున్నారు. వన్యప్రాణుల అక్రమ రవాణా జరుగుతున్న టాప్–20 దేశాల్లో మన దేశం ఒకటి. విమానాల ద్వారా అక్రమ రవాణా జరుగుతున్న టాప్–10 దేశాల్లో మన దేశం కూడా ఉండటం గమనార్హం. ఏనుగుదంతాలదే మొదటి స్థానంస్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదిక ప్రకారం భారతదేశం నుంచి అత్యధికంగా అక్రమ రవాణా అవుతున్నవి ఏనుగు దంతాలు. ఆ తర్వాత తాబేళ్లు. వీటిలో నక్షత్ర తాబేళ్ల స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతోంది. ఖడ్గమృగం కొమ్ముల వ్యాపారం కూడా పెరిగింది. ఇటీవల కాలంలో పాంగోలిన్ వేట, అక్రమ రవాణాకు మన దేశం ప్రధాన కేంద్రంగా మారింది. పులుల శరీర భాగాల వ్యాపారం కూడా యథేచ్ఛగా కొనసాగుతోంది. స్నేక్‌హెడ్ ఫిష్, జీబ్రా లోచ్ వంటి అలంకార చేపలను లైవ్ అక్వేరియంలో ఉంచడం కోసం అక్రమ రవాణా చేస్తుండడంతో వాటి సహజ ఆవాసాలు అంతరించిపోతున్నాయి. వీటితోపాటు నక్కలు, ఎలుగుబంట్లు, చిరుతలు, ముంగిసలు, కప్పలను అక్రమంగా రవాణా చేసి వాటి శరీర భాగాలను ఔషధాల తయారీలో వినియోగిస్తున్నారు.రవాణా జరిగే రూట్లుమనదేశంలోనూ, మన దేశం నుంచి ఇతర దేశాల్లోకి వన్యప్రాణుల అక్రమ రవాణా ప్రధానంగా రెండు మార్గాల ద్వారా జరుగుతున్నట్టు గుర్తించారు. ఈశాన్య ప్రాంతంలోని పొడవైన అంతర్జాతీయ సరిహద్దు ద్వారా ఎక్కువ రవాణా జరుగుతుండగా, విమానాశ్రయాల ద్వారా రెండో మార్గంలో జరుగుతోంది. దిమాపూర్, గౌహతి, ఇంఫాల్ వంటి ఈశాన్య నగరాల నుంచి నేపాల్, మయన్మార్, చైనా సరిహద్దుల్లో ఖడ్గమృగాల కొమ్ములు, పులి భాగాలు, పాంగోలిన్ పొలుసుల అక్రమ రవాణా విపరీతంగా జరుగుతున్నట్టు గుర్తించారు. ఇండియా–బంగ్లాదేశ్ సరిహద్దులో పక్షులు, సరీసృపాల అక్రమ రవాణా కూడా చాలా ఎక్కువగా ఉంది. నక్షత్ర తాబేళ్లు ప్రపంచంలోనే అత్యధికంగా రవాణా అవుతున్న వన్యప్రాణులు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల నుంచి వీటిని థాయ్‌లాండ్, సింగపూర్, మలేషియాకు విమానాల ద్వారా సరఫరా చేస్తున్నారు.విమానాల్లో తీసుకెళ్లే లగేజీల రూపంలో 50 శాతానికిపైగా రవాణా ఎక్కువగా జరుగుతోంది. మరో 15 శాతం రవాణా ఎయిర్ కార్గో ద్వారా జరుగుతోంది. చెన్నై, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ ఎయిర్‌పోర్టుల్లో తరచూ ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. ఇవీ కారణాలు ప్రపంచంలో 8 శాతం వన్యప్రాణులు మన దేశంలో ఉండగా.. అధిక జనాభా వల్ల వన్యప్రాణుల ఉత్పత్తులు మన మార్కెట్లలోకి సులభంగా ప్రవేశిస్తున్నాయి. ఒకసారి మార్కెట్లలోకి వచి్చన తర్వాత వాటిని గుర్తించడం అసాధ్యంగా మారుతోంది. చైనా, మయన్మార్, పలు ఆగ్నేయాసియా దేశాలతో సరిహద్దులు ఉండడం, పెరుగుతున్న విమానయాన మార్కెట్, వేగంగా విస్తరిస్తున్న విమానాశ్రయాలు, సోషల్ మీడియాను కూడా ఆన్లైన్ మార్కెట్లుగా ఉపయోగిస్తుండడంతో అక్రమ రవాణా పెరిగిపోతోంది.– సాక్షి, అమరావతి -
‘బాహుబలి’ ఏనుగులకు పెద్ద కష్టం.... భూమాతకు తీరని శోకం!
భూమండలంపై అత్యంత భారీకాయంతో సంచరించే శాకాహార బాహుబలిగా ఏనుగు మనందరికీ చిరపరిచితం. ఆఫ్రికా ఖండంలోని పీఠభూముల్లో సర్వసాధారణంగా కనిపించే ‘సవన్నా’, ‘అటవీ’జాతి ఏనుగులు అత్యంత వేగంగా అంతర్థానమవుతున్నాయి. అటవీప్రాంతాల్లో విచ్చలవిడిగా పెరిగిన మానవ కార్యకలాపాలు, విస్తరిస్తున్న వ్యవసాయం, విజృంభిస్తున్న అక్రమ వేటతో ఏనుగుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. తాజాగా జరిపిన అధ్యయనం ప్రకారం గత యాభై సంవత్సరాల్లో.. సర్వేచేసిన ప్రాంతాల్లో సవన్నా జాతి ఏనుగుల సంఖ్య 70 శాతం తగ్గిపోయింది. ‘ఫారెస్ట్’జాతి ఏనుగుల సంఖ్య ఏకంగా 90 శాతం క్షీణించడం ఏనుగుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఏనుగుల సంఖ్య పెరగడం ఒకింత ఉపశమనం కల్పిస్తోంది.అత్యంత తెలివి అత్యంత తెలివితేటలతోపాటు మానవునిలా సామూహికంగా జీవించే నైపుణ్యమున్న వన్యప్రాణిగా ఏనుగు పేరొందింది. 1964 నుంచి 2016 సంవత్సరం దాకా ఆఫ్రికా ఖండంలోని 37 దేశాల్లోని 475 భిన్న ప్రదేశాల్లో ఏనుగుల జాడపై విస్తృతస్థాయి గణన, పరిశోధన చేశారు. ఇటీవలి దశాబ్దాల్లో ఇంతటి విస్తృత సర్వే చేపట్టడం ఇదే తొలిసారి. సంబంధిత నివేదిక సోమవారం వెల్లడైంది. దీనిలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగుచూశాయి. సవన్నా, ఫారెస్ట్ జాతి ఏనుగుల సంఖ్య సగటున ఏకంగా 77 శాతం తగ్గిపోయింది. విడిగా చూస్తే సవన్నా జాతి 70 శాతం, ఫారెస్ట్ జాతి సంఖ్య 90 శాతం తగ్గిపోయింది. ఒకప్పుడు గుంపులగుంపులుగా కనిపించిన కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు అవి ఒక్కటికూడా లేవని సర్వేలో తేలింది. అయితే కొన్ని చోట్ల స్థానిక ప్రభుత్వాల పరిరక్షణ చర్యలతో వాటి సంఖ్య పెరిగిందని నివేదిక పేర్కొంది. ‘‘తగ్గిపోయిన సంఖ్యను ఎలాగూ పెంచలేము. ఉన్న ఏనుగుల సంఖ్యా వేగంగా క్షీణిస్తోంది. మాలి, చాద్, నైజీరియా వంటి దేశాల్లో మరీ దారుణంగా పడిపోయింది’’ అని కొలరాడో స్టేట్ వర్సిటీలో వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ విభాగ ప్రొఫెసర్ జార్జ్ విటెమర్ చెప్పారు.కొన్ని చోట్ల మెరుగైన పరిస్థితులు ఆఫ్రికా ఖండం దక్షిణ దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఎంతో శ్రమకోర్చి ఏనుగుల సంతతిని కాపాడుతున్నారు. ప్రభుత్వాల చొరవ, స్థానికుల అండతో ఏనుగుల సంఖ్య అక్కడ పెరిగింది. బొట్సావా, జింబాబ్వే, నమీబియాలో ఇప్పటికే వాటి సంఖ్య భారీగానే ఉంది. ‘‘కొన్ని చోట్ల మనం విజయం సాధించాం. ఈ విషయంలో మనకు మనం శెభాష్ చెప్పకోవాల్సిందే. అయితే ఇంకా ఏఏ ప్రాంతాల్లో విజయావకాశాలు ఉన్నాయో కనిపెట్టి కార్యసాధకులం కావాల్సిన తరుణమొచ్చింది’’అని ప్రొఫెసర్ జార్జ్ విటెమర్ అన్నారు.ఏనుగు దంతాలపై మోజుతో.. చాలా పొడవుండే ఆఫ్రికన్ ఏనుగుల దంతాలకు అంతర్జాతీయ మార్కెట్లో చాలా విలువ ఉంది. వీటి కోసమే వేటగాళ్లు ఏనుగులను చంపేస్తున్నారు. వేటగాళ్లను అడ్డుకోగలిగితే ఈ వన్యప్రాణులను కాపాడవచ్చని జంతుప్రేమికులు చెబుతున్నారు. అడవుల్లో పెరుగుతున్న వ్యవసాయం కారణంగా ఏనుగులు తమ ఆవాసాలను, ఆహార వనరులను కోల్పోతున్నాయి. చదవండి: అడవిలో అమ్మప్రేమ.. జంతువులు, పక్షుల్లో అరుదైన మమకారం!‘‘అడవుల విస్తరణకు ఏనుగులు మూలాధారం. ఎన్నో రకాల చెట్ల కాయలు, పండ్లను తింటూ వాటి గింజలను జీర్ణంచేయకుండా వేర్వేరు చోట్ల విసర్జించి కొత్త మొక్కల అంకురార్పణకు ఆజ్యం పోస్తాయి. నిత్యం వనవృద్ధి కార్యం చేసే ఏనుగుల సంఖ్య తగ్గడం భూమాతకు తీరని శోకం’’ అని సౌత్ ఆఫ్రికాలోని నెల్సన్ మండేలా యూనివర్సిటీలోని ఆఫ్రికన్ కన్జర్వేషన్ ఎకాలజీ అధ్యయనకారుడు, నివేదిక సహరచయిత డేవ్ బల్ఫోర్ ఆందోళన వ్యక్తంచేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అదుపులోకి కర్ణాటకకు చెందిన ముగ్గురు స్మగ్లర్లు
-
జంతువుల గురించి మీకు తెలియని పది అద్భుతమైన విషయాలు
-
అడవిలో ఉండాల్సినవి.. ఇంట్లో పెంచుకుంటున్నారు
-
అంతరిస్తున్న తోడేళ్లు! ఉమ్మడి అనంతపురంలో భారీగా తగ్గిన వన్యప్రాణులు
సాక్షి ప్రతినిధి అనంతపురం: క్రూర జంతువుగా పేరున్న తోడేళ్లు పొదలు, గుట్టలను ఆవాసాలుగా చేసుకుని జీవిస్తాయి. ఒకప్పుడు అటవీ ప్రాంతంలో ఎక్కడ చూసినా కనిపించేవి. గొర్రెలు, మేకల మంద సంచరించే ప్రాంతాల్లో తిరిగేవి. ముఖ్యంగా జీవాలు ఎక్కువగా ఉండే అనంతపురం జిల్లాలో భారీగా ఉండేవి. కానీ ప్రస్తుతం వాటి జాడ మచ్చుకైనా కనిపించడం లేదు. తాజాగా అటవీశాఖ అధికారులు వీటిని అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చేర్చారు. రెండేళ్లుగా ఎక్కడా కనిపించడం లేదని వెల్లడిస్తున్నారు. వేటలో పటిష్టమైన వ్యూహం తోడేళ్లు గుంపులుగా సంచరిస్తాయి. వేటలో పటిష్టమైన వ్యూహాన్ని అమలు చేస్తాయి. ఒకటి ముందుగా డెకాయ్ ఆపరేషన్ చేస్తుంది. ఆ తర్వాత మిగతా వన్నీ వస్తాయి. మేక లేదా గొర్రెను తీసుకెళ్లేటప్పుడు గొంతును నోట కరచుకుని, తన ముళ్లతోకతో వెనుక కొడుతూ ఉంటుంది. దీంతో ఆ జీవం దానితో పాటు పరిగెడుతుంది. దీని వల్ల ఈడ్చుకెళ్లే శ్రమ వాటికి తగ్గుతుంది. ఒక తోడేలు ఉందంటే రెండు మూడు నక్కలు కూడా దాని సమీపంలోకి పోలేవు. రెండు లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో 30కి మించి తోడేళ్లు ఉండేవని అంచనా. కాగా, ఒకప్పుడు ప్రతి జిల్లాలోనూ గుంటనక్కలు కనిపించేవి. ఇప్పుడు వాటి జాడ కూడా లేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో నాలుగేళ్లుగా మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే పునుగుపిల్లి కూడా కనుమరుగైనట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అటవీ విస్తీర్ణం తగ్గడం వల్లే.. జనావాసాలు పెరిగాయి. అడవులు వ్యవసాయ భూములుగా మారాయి. దీంతో వన్యప్రాణుల ఆవాసానికి ఇబ్బందిగా మారింది. కొండలు ఎక్కువగా ఉన్న అనంతపురం లాంటి జిల్లాలే తోడేళ్లకు మంచి ఆవాసాలు. ఇక్కడే వీటి జాడ లేదంటే మిగతా చోట్ల అసలే కనిపించవు. వీటిని కాపాడుకునేందుకు సర్వశక్తులా యతి్నస్తున్నాం. –సందీప్ కృపాకర్, జిల్లా ఫారెస్టు అధికారి, అనంతపురం చదవండి: కొరమీను, ఇంగిలాయి, జల్ల, బొమ్మిడాయి, గొరక, వాలుగ.. ఇక్కడ పుట్టినవే! -
అతిథులతో అంతా ఓకేనా?
దక్షిణాఫ్రికాలోని నమీబియా నుంచి మన దేశానికి వచ్చిన 8 ఆఫ్రికన్ చీతాలు ఇక్కడ అంతరించిన వన్యప్రాణి జాతిని పునరుద్ధరించడానికి పనికొస్తాయా? భారత ప్రధాని మోదీ తన జన్మదినం సందర్భంగా శనివారం మధ్యప్రదేశ్‌లోని కూనో జాతీయోద్యానంలోకి వదిలిపెట్టిన ఈ ‘అతిథుల’ గురించి అంతటా ఆసక్తిగా సాగుతున్న చర్చ ఇది. భారత భూభాగంపై ఆసియా ప్రాంత చీతాలు అంతరించిన 70 ఏళ్ళ పైచిలుకు తర్వాత జరుగుతున్న ఈ సాహసోపేత ప్రయోగంపై సహజంగానే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఖండాంతర చీతాల దిగుమతిని పలువురు సానుకూల ప్రయత్నంగా భావిస్తుంటే, కొందరు దీనిలోని ప్రతికూల అంశాలు, ప్రభావాలను ప్రస్తావిస్తున్నారు. గత శతాబ్దపు మొదట్లో ప్రపంచవ్యాప్తంగా లక్ష చీతాలుంటే, 2016లో చివరిసారిగా లెక్కలు వేసినప్పుడు 7100 వన్యప్రాణులే మిగిలాయి. వాటిలోనూ అధిక భాగం ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో, అతి కొద్దిగా వందలోపు చీతాలు ఇరాన్లో ఉన్నాయి. ఒకప్పుడు మన దేశంలో తమిళనాడులోని తిరునల్వేలి నుంచి సువిశాల ఉత్తరాది పచ్చిక మైదానాల దాకా చీతాలు వేలల్లో ఉండేవట. మహా రాజుల మృగయా వినోదం, జనాభా విస్ఫోటనంతో తగ్గిన పచ్చిక బయళ్ళ లాంటి కారణాలతో అవి కనుమరుగయ్యాయి. అంతరించిన వన్యప్రాణి జాతిగా 1952లో భారత అధికారిక ప్రకటన నుంచి మన దేశంలో వీటి కథ ఓ గత చరిత్ర. ఒకానొక కాలంలో 6 నుంచి 18 రూపాయలకు వేటాడిన చీతాలను మళ్ళీ పెంచి పోషించి, శతాబ్దాల విధ్వంసాన్ని చక్కదిద్దే యత్నమే ‘ప్రాజెక్ట్ చీతా’. ఈ ప్రయోగానికి తగ్గ అటవీ ప్రాంతం కోసం ఏళ్ళ తరబడి అన్వేషించి, చివరకు కూనోను ఎంపిక చేశారు. వాయవ్య మధ్యప్రదేశ్‌లోని కూనో జాతీయోద్యానం ఒకప్పుడు సమీప గ్వాలియర్ సింధియా మహారాజులకు ఇష్టమైన వేటస్థలం. ప్రపంచంలో ప్రస్తుతం అత్యధికంగా చీతాలున్న నమీబియా నుంచి తెచ్చినవాటిని సెప్టెంబర్ 17న ప్రాథమికంగా ప్రధాని కూనోలోనే విడుదల చేశారు. నెల రోజుల ఏకాంతం తర్వాత 750 చదరపు కి.మీ.ల కూనో సవన్నా అటవీ భూముల్లోకి స్వేచ్ఛగా వదిలేస్తారు. అయితే, ఒకప్పుడు మన దేశంలో సంచరించిన ఏషియాటిక్ రకం చీతాలకు భిన్నమైనవి ఈ ఆఫ్రికన్ చీతాలు. వీటిని ఇలా తమ సహజ ఆవాసాల నుంచి భారత్‌కు తరలించడం సరైనది కాదని కొందరు నిపుణుల భావన. అయిదేళ్ళకు రూ. 39 కోట్ల ఖర్చుతో కూడిన ఈ చీతాల తరలింపు, నూతన ఆవాస ప్రక్రియ ఆకర్షణీయమే తప్ప, ఆశించిన ఫలితాలివ్వదన్నది వారి వాదన. గంటకు 120 కి.మీ.ల వేగంతో, భూతలంపై అత్యంత వేగవంతమైన ప్రాణి అయిన చీతా స్వేచ్ఛగా సంచరించాలంటే సువిశాల ప్రాంతం కావాలి. అలా ఆఫ్రికన్ చీతాలకు తగిన ఆవాసం కానీ, అవి ఆహారంగా తినే రకం ప్రాణులు కానీ భారత్‌లో లేవు. గడ్డిభూములు పెంచాలనే లక్ష్యమూ దీనితో సాధ్యం కాదనేది విమర్శకుల అభిప్రాయం. మరికొందరు మాత్రం ఎక్కడ ఉంటే అక్కడ అలవాటు పడే స్వభావం చీతాలది గనక అతి నిరాశ అవసరం లేదంటున్నారు. నిజానికి, ఇండియన్ టైగర్లు, సింహాల పరిరక్షణ కోసం స్వాతంత్య్రానంతరం భారత్‌లో చేసిన రెండు ప్రధాన వన్యప్రాణి సంరక్షణ పథకాలూ విజయవంతమయ్యాయి. అయితే, అప్పటికే మన దగ్గరున్న పులులు, సింహాల సంతతిని పెంచడంతో అది సాధ్యమైంది. కానీ, ఈసారి ప్రపంచంలో మునుపెన్నడూ లేని విధంగా ఖండాంతర వన్యప్రాణి దిగుమతి చేపట్టాం. అందుకే, ప్రపంచవ్యాప్త జీవ్యావరణవేత్తలు, జంతు ప్రేమికులు ఈ ప్రయోగాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. వన్యప్రాణి పరిరక్షణ సాగాలంటే, వాటి సంఖ్య కన్నా ముందు పెరగాల్సింది అటవీ ప్రాంతం. దేశంలో ప్రస్తుత జాతీయోద్యానాలు, వన్యప్రాణి కేంద్రాలు ఏ మేరకు జీవకోటి పరిరక్షణకు సరిపోతు న్నాయో తెలుసుకొనే అధ్యయనాలు ఈమధ్యే మొదలయ్యాయి. హైవేల నిర్మాణం సహా అనేకం వన్యప్రాణి ఆవాసాల పరిధిని కుదించేస్తున్నాయి. తగినంత ఆహారం దొరకక దగ్గరలో ఉన్న జనావాసాలపై అటవీ మృగాల దాడులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. వన్యప్రాణుల కోసమంటూ ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేయిస్తున్న ప్రభువులు, వారి పరివారం తీరా తమ హెలిప్యాడ్, గుడారాల కోసం కూనో ఉద్యానంలో పెద్ద సంఖ్యలో చెట్లు కొట్టేశారు. ప్రకృతిపై ప్రేమతోనే చీతాలు తెచ్చామన్న పాలకుల మాటలకూ, ఈ చేతలకూ పొంతన లేదు. మనుషులకూ, వన్యప్రాణులకూ మధ్య ఘర్షణకు దారి తీస్తున్న ఈ జీవ్యావరణ అసమతౌల్యంపై తక్షణం దృష్టి పెట్టాలి. దేశంలోని గడ్డిభూముల్లో 2005 –15 మధ్య దశాబ్దిలోనే 31 శాతాన్నీ, ఇప్పటికి మొత్తం 95 శాతాన్నీ నాశనం చేసుకున్న భారత్‌లో చీతాలు ఎక్కడ స్వేచ్ఛగా తిరుగుతాయి? విదేశీ చీతాలను తెచ్చుకొని సాకే కన్నా ఇక్కడ అంతరిస్తున్న అడవి పిల్లి జాతులనూ, బట్టమేక పక్షులనూ పరిరక్షించడం మేలు. అసలైతే గుజరాత్ గిర్ అడవి సింహాల తరలింపునకు కూనో జాతీయోద్యానం సరైనది. లెక్కకు మించి సింహాలున్నా వాటిని తరలించడానికీ, సదరు ఆసియా సింహాలున్న ఏకైక ప్రాంతమనే కీర్తి కిరీటాన్ని పోగొట్టుకోవడానికీ గుజరాత్ నిరాకరిస్తోంది. ఆ సింహాల తరలింపునకు అడ్డుకట్టగానే ఇక్కడ చీతాలు పెట్టారనే ఆరోపణలూ లేకపోలేదు. ఇలాంటి అశాస్త్రీయ ధోరణులే వన్యప్రాణి సంరక్షణకు కీడు. ప్రాణులన్నిటినీ ఒకే ప్రాంతానికి పరిమితం చేస్తే, ఏదైనా మహమ్మారి తలెత్తితే మొదటికే మోసం వస్తుందని నిపుణుల హెచ్చరిక. నిపుణుల సూచనలు ప్రభుత్వం పట్టించుకోకుంటే ఏ ‘ప్రాజెక్ట్ చీతా’ వల్ల ఏం ప్రయోజనం? -
గోల్ఫ్ కోర్సులో క్రూర మృగాల వేట.. ఆటకు బ్రేక్
ఓ భారీ జిరాఫీని అప్పుడే వేటాడిన నాలుగు యువ సింహాలు, రెండు శివంగులు.. ఆ ‘ఆహారాన్ని’ సొంతం చేసుకొనేందుకు కదన రంగంలోకి దిగి వాటిని తరుముతున్న 20 హైనాలు. తమ వేటను తిరిగి చేజిక్కించుకొనేందుకు ఎదురుదాడికి ప్రయత్నిస్తున్న ఆడ సింహాలు.. ఆ ఇందులో పెద్ద వింత ఏముంది.. ఆఫ్రికా అడవుల్లో ఇలాంటి దృశ్యాలన్నీ సర్వసాధారణమేగా అనుకుంటున్నారా? కానీ ఇదంతా జరిగింది అడవిలో కాదు.. అడవి మధ్య ఉన్న ఓ గోల్ఫ్ కోర్స్‌లో! దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్ నడిమధ్యన ఉన్న స్కుకుజా గోల్ఫ్ క్లబ్లో తాజాగా కొందరు ఆటగాళ్లు గోల్ఫ్ ఆడుతుండగా వారి ఆటకు ఈ క్రూర మృగాలు ఇలా బ్రేక్ వేశాయి! ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అడవికి, గోల్ఫ్‌కోర్స్‌కు మధ్య ఎటువంటి రక్షణ కంచె లేకపోవడంతో జంతువులు తరచూ ఇలా లోపలకు దూసుకొస్తాయట. గోల్ఫ్‌కోర్స్‌లో ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి గుంటల్లో దప్పిక తీర్చుకొనేందుకు జిరాఫీలతోపాటు చిరుత పులులు, ఖడ్గ మృగాలు, ఏనుగులు, అడవి దున్నలు తరచూ అక్కడకు వస్తుంటాయట!! అందుకే ఇక్కడ గోల్ఫ్ ఆడాలనుకొనే ఆటగాళ్లకు ఎంతో గుండెధైర్యం కావాలట! అదొక్కటే కాదు.. అడవి జంతువులేవైనా దాడి చేసి చంపేస్తే క్లబ్ నిర్వాహకుల బాధ్యతేమీ లేదంటూ అగ్రిమెంట్‌పై సంతకం చేసిన వారినే ఇందులోకి అనుమతిస్తారట!! క్రూగర్ నేషనల్ పార్క్ సిబ్బంది కోసం 1972లో ఈ గోల్ఫ్‌కోర్స్‌ను తొలుత ఏర్పాటు చేయగా ఆ తర్వాత క్రమంగా స్థానికులతోపాటు పర్యాటకులకు కూడా ఇందులో ఆడేందుకు అవకాశం కల్పించారు. అందుకే దీన్ని ప్రపంచంలోకెల్లా అత్యంత కఠినమైన, క్రూరమైన గోల్ఫ్కోర్స్గా పిలుస్తున్నారు. చదవండి: రణరంగంలా మారిన బాగ్ధాద్.. కాల్పుల్లో 15మంది మృతి -
వన్యప్రాణులకు ఆయుష్షు పోసే కృత్రిమ మేధస్సు!
జన్నారం(ఖానాపూర్): వన్యప్రాణుల సంరక్షణ, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగేసింది. టీ అటల్ ఇన్నొవేషన్ మిషన్ (ఎయిమ్) ఆధ్వర్యంలో కార్యాచరణకు పూనుకుంటోంది. వన్యప్రాణుల అభివృద్ధి, కదలికలు, సంతతి అంశాల క్రోడీకరణకు సాంకేతికత రూపొందించడం, కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా వివరాలు సేకరించడానికి రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ జోన్‌లోని జన్నారం అటవీ డివిజన్‌ను ఎంపిక చేసింది. 59 కంపెనీల దరఖాస్తులు కృత్రిమ మేధస్సుతో వన్యప్రాణులపై అధ్యయనం చేసే ప్రాజెక్టును చేపట్టడానికి దేశవ్యాప్తంగా టీ ఎయిమ్స్‌కు 59 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ నెల 8న ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, అటవీశాఖ పీసీసీఎప్ డోబ్రియాల్, క్యాప్ జెమిని ఇండియా వైస్ ప్రెసిడెంట్ అనురాగ్ ప్రతాప్ సమక్షంలో నిర్వహించిన సదస్సులో థింక్ ఎవాల్వ్ కన్సల్టెన్సీ కంపెనీ విజేతగా నిలిచి ప్రాజెక్టును దక్కించుకుంది. ఈ కంపెనీ చేపట్టబోయే ప్రాజెక్టుకు క్యాప్ జెమిని కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద(సీఎస్ఆర్) ప్రోత్సాహకంగా రూ.20 లక్షలు అందజేసింది. అధ్యయనం చేసే అంశాలు థింక్ ఎవాల్వ్ కన్సల్టెన్సీ కంపెనీ కృత్రిమ మేధస్సు ద్వారా వన్యప్రాణుల కదలికలు, వాటి ఆహార అలవాట్లు, సంతతి, వాటి సంఖ్య, అవి ఏ ప్రదేశంలో సంచరిస్తాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి, వన్యప్రాణుల సంఖ్య పెరగడానికి, తగ్గడానికి కారణాలను విశ్లేషిస్తుంది. తాను రూపొందించిన సాంకేతికతను వినియోగించి అటవీ శాఖ అధికారుల సహకారంతో అధ్యయనం చేస్తుంది. ఇదీ చదవండి: డాక్టర్ లాస్యసింధుకు జాతీయ హెల్త్‌కేర్ అవార్డు -
జనావాస పరిసరాల్లోకి గొరగేదెలు.. భయపడుతున్న జనం
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో గొరగేదెలు జనావాస ప్రాంతాల్లోకి వచ్చేస్తుండటంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. పైడిపనుకుల, మంప, సూరేంద్రపాలెం పరిసర ప్రాంతాల్లో ఇవి సంచరిస్తున్నట్టుగా వారు చెబుతున్నారు. వేసవి తీవ్రత, అటవీప్రాంతంలో తాగునీరు అందుబాటులో లేకపోవడమే అవి బయటకు రావడానికి కారణంగా చెబుతున్నారు. కొయ్యూరు: అటవీ ప్రాంతంలో ఉండాల్సిన గొరగేదెలు (బైసన్స్) గ్రామాల సమీపంలోకి వచ్చేస్తున్నాయి. దీంతో వాటిని చూసిన గిరిజనులు భయపడుతున్నారు. వేసవి కావడంతో దాహం తీర్చుకునేందుకు, చల్లదనం కోసం కాలువల వెంబడి ఉంటున్నాయి. గత ఐదేళ్లక్రితం వరకు ఒడిశాకు చెందిన వేటగాళ్లు వీటిని వేటాడేందుకు వచ్చేవారు. నెల రోజుల పాటు కాలువల వెంబడి కాసి నాటు తుపాకులతో వాటిని వేటాడి చంపేవారు.ఆ మాంసాన్ని ఎండిబెట్టి గ్రామాలకు తరలించేవారు. 2016 ఫిబ్రవరిలో ఎం.భీమవరం పంచాయతీ పుట్టకోట సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో నాటు తుపాకులు కలిగి ఉన్న ఇద్దరు ఒడిశా గిరిజనులను మావోయిస్టులుగా అనుమానించి అప్పటిలో పోలీసులు కాల్చి చంపారు. అప్పటి నుంచి ఒడిశా వేటగాళ్లు రావడం తగ్గించేశారు. ఈ ప్రాంతంలో గతంలో రెండు పులులు ఉన్నట్టు అటవీశాఖ నిర్ధారించింది. తరువాత జరిగిన జంతు గణనలో వాటి జాడ తెలియలేదు. దీంతో గొరగేదెల సంఖ్య పెరిగి ఉంటుందని భావిస్తున్నారు. గొరగేదెలు ఎక్కువగా గూడెం,చింతపల్లి, కొయ్యూరు సరిహద్దు గ్రామాల్లో తిరుగుతుంటాయి. మర్రిపాకల రేంజ్లో ఫారెస్టు చాలా దట్టంగా ఉంటుంది. దీంతో ఈ ప్రాంతంలో వీటి మంద ఎక్కువగా ఉంటాయి. వర్షాకాలం, శీతాకాలంలో మేత, నీరు అందుబాటులో ఉంటుంది. అందువల్ల ఇవి అటవీ ప్రాంతాన్ని వదిలి బయటకు రావు. వేసవి వచ్చేసరికి అటవీ ప్రాంతంలో చిన్న చిన్న ఊట కాలువలు ఎండిపోతాయి. వాటి చర్మం పలుచగా ఉన్నందున వేడిని తట్టుకోలేవు. అందువల్ల ఎక్కువగా ఇవి నీటిలోనే ఉండేందుకు ఇష్టపడతాయి. పెద్ద కాలువల వద్దనే ఉంటాయి.అక్కడే నీళ్లు తాగి తిరుగుతాయి. వేటగాళ్లు కూడా కాలువల వెంబడే ఉంటారు.అవి నీరు తాగుతున్న సమయంలో తుపాకీతో వేటాడుతారు. లేదంటే సంప్రదాయ ఆయుధాలతో చంపేందుకు ప్రయత్నిస్తారు. గాయపడిన గేదెలు కనిపించిన వారిని చంపేందుకు చూస్తాయి. ఇలాంటి సమయంలోనే వీటి నుంచి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మందతో ప్రమాదం లేదు గొరగేదెలు మందలుగా ఉన్నప్పుడు ఎవరిని ఏమీ అనవు. ఒంటరిగా ఉన్న గేదెలు మాత్రమే దాడులు చేసేందుకు చూస్తాయి. అవి దాడులు చేస్తే ప్రాణాలతో బయటపడడం కష్టంగానే ఉంటుంది. ఒంటరిగా ఉన్న గేదె, గాయపడిన వాటితోనే ప్రమాదం ఉంటుందని గిరిజనులు తెలిపారు. పైడిపనుకుల, మంపకు అటువైపున ఉన్న కొండ, సూరేంద్రపాలెం ప్రాంతాల్లోకి వచ్చేస్తున్నాయి. గాయపడిన గేదె ఒకటి తిరుగుతుందని తెలుసుకున్న పరిసర ప్రాంతీయులు భయపడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి దట్టమైన అడవిలోనే గొరగేదెలుంటాయి. వాటిపై ఎలాంటి లెక్కలు లేవు. అంచనాగా చెప్పడం తప్ప అవి ఎన్ని ఉంటాయో గణన చేయలేదు. వేసవి కావడంతో అవి నీటి వనరులున్న ప్రాంతాలకు వస్తాయి.అవి ఏయే ప్రాంతాల్లో తిరుగుతున్నాయో అటవీ సిబ్బందిని పంపించి పరిశీలన చేయిస్తాం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువగా మర్రిపాకల రేంజ్‌లోనే ఉన్నట్టుగా సమాచారం ఉంది. – సూర్యనారాయణ పడాల్, నర్సీపట్నం డీఎఫ్‌వో -
తెలుసా..! ఈ దేశంలో రైళ్లు కుక్కల్లా మొరుగుతాయట.. ఎందుకంటే..
ప్రపంచవ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జపాన్.. రైలు కూతలకు కుక్క అరుపులు జోడించిందనే వార్త హాస్యస్పదమే. కానీ ఇది నిజం. భూకంప పరిస్థితుల్లో సైతం ప్రత్యేక ఆటోమేటిక్ లాకింగ్ వ్యవస్థలు కలిగిన జపనీస్ ట్రైన్ టెక్నాలజీకి.. 2018 వరకూ ఆ దేశ వన్యప్రాణులే బ్రేక్స్ వేసేవి. సూపర్ ఫాస్ట్ షింకన్సేన్ (బుల్లెట్ ట్రైన్) సైతం దూసుకుపోగలిగే జపాన్ రైల్వే ట్రాక్స్‌పై వందలాదిగా జింకలు ప్రాణాలు కోల్పోవడం, ఆ కారణంగా రైల్వే ప్రయాణికులు ఆలస్యంగా గమ్యాన్ని చేరుకోవడం.. ఇలా జపాన్‌కి పెద్ద సమస్యే వచ్చిపడింది. ట్రాక్స్‌కి, హిల్స్‌కి జరిగే యాక్షన్‌లో కొన్ని ఐరన్ ఫిల్లింగ్స్ ఆకర్షించే రుచిని కలిగి ఉండటంతో.. వాటిని నాకేందుకు జింకలు భారీగా రైల్వే ట్రాక్స్ మీదకు వస్తున్నాయని అధ్యయనాలు తేల్చాయి. అలా వచ్చిన జింకలు రైలు కిందపడి చనిపోయేవి. దాంతో రంగంలోకి దిగిన రైల్వే టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఆర్టీఆర్ఐ) పరిష్కారం దిశగా అడుగులు వేసింది. సింహం పేడను తెచ్చి ట్రాక్ పొడవునా జల్లి ఓ ప్రయోగం చేశారు. ఆ వాసనకి అక్కడ సింహాలు ఉన్నాయేమోనన్న భయంతో జింకలు ట్రాక్ మీదకి వచ్చేవి కావట. అయితే వర్షం పడి సింహం పేడ కొట్టుకుపోవడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. శాశ్వత పరిష్కారం కోసం రైలు కూత శబ్దానికి కుక్క అరుపులను జోడించారు. 20 సెకన్ల పాటు కుక్క అరుపులు వినిపిస్తుంటే.. జింకలు ట్రాక్ మీద నుంచి తుర్రుమనడం గమనించిన అధికారులు.. ఇదే పద్ధతిని అవలంబించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం వన్యప్రాణులు అధికంగా సంచరించే ప్రాంతాల్లో జపాన్ రైళ్లు కుక్కల్లా మొరుగుతున్నాయి. ఐడియా అదుర్స్ కదూ. చదవండి: Facts About Hair: ఒక వెంట్రుక వయసు దాదాపుగా ఇన్నేళ్లు ఉంటుందట!! -
తగలబడుతున్న బంగారు నేల.. ఊళ్లోకి క్రూరమృగాలు?
ఎటు చూసినా గుంపులుగా జనం, దొపిడీలు, తగలబడుతున్న కాంప్లెక్స్, మిగిలిపోయిన శిథిలాలు.. బంగారు నేల దక్షిణాఫ్రికా అల్లకల్లోలంగా తయారైంది. కరోనాతో దీనావస్థకు చేరిన జనాల్లో, మాజీ అధ్యక్షుడు జాకోబ్ జుమా అరెస్ట్‌తో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిరసనకారులు కొందరు రొడ్డెక్కి విధ్వంసం సృష్టిస్తుండగా.. ఇదే అదనుగా దొపిడీలకు పాల్పడుతున్నారు అక్కడి జనాలు. ఈ క్రమంలో క్రూరమృగాల సంచారం వార్తలు మరింత కలవరపాటుకు గురి చేస్తున్నాయి. సాక్క్షి, వెబ్‌డెస్క్: తర్గత సంక్షోభంతో దక్షిణాఫ్రికా పరిస్థితి అధ్వానంగా తయారైంది. కరోనా మూడో వేవ్ మధ్యలో కొట్టుమిట్టాడడం, మునుపెన్నడూ లేనంతగా పెరిగిన నిరుద్యోగం-పేదరికం రేటు జనాలకు నిరసనలు బలాన్నిచ్చాయి. ఒక్కసారిగా రోడ్ల మీద పడి దొపిడీలకు పాల్పడ్డారు. వయసు భేధాల్లేకుండా ఆహారం, లిక్కర్, డబ్బులు, మందులు.. ఇలా అన్నీ దొంగతనం చేస్తున్నారు. పనిలో పనిగా కాంప్లెక్స్‌లను తగలబెడుతున్నారు. ఇప్పటిదాకా 212 మంది ప్రాణాలు పొగొట్టుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీళ్లలో చాలామంది దొపిడీలకు పాల్పడినప్పుడు తొక్కిసలాటలోనే చనిపోయారని తెలిపింది. డర్బన్, పీయెటెర్ మార్టిజ్బర్గ్ల్లో జుమా గతంలో పోటీ చేసిన క్వాజులు నాటల్, గౌటెంగ్లలో ఈ విధ్వంసం భారీగా కొనసాగుతోంది. ఈ రెండు ప్రావిన్స్‌ల్లో ఇప్పటిదాకా సుమారు 2500 మందిని అరెస్ట్ చేశారు. వీధుల్లోకి మృగాలు ఇక ఆగ్రహంతో ఉన్న నిరసనకారులు క్వాజులు-నాటల్ ప్రావిన్స్‌లోని హ్లూహ్లూవే రిజర్వ్ కంచెను తెంచేయడంతో.. సింహాలు, ఖడ్గమృగాలు, ఏనుగులు, చిరుత పులులు రోడ్ల మీదకు దూసుకొచ్చినట్లు కొన్ని వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వాటిలో చాలావరకు పాతవని అధికారులు అంటున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం.. ‘‘జంతువులు సంచరించిన మాట వాస్తవమేనని, అది తరచూ జరిగేదేనని, కానీ, సంబంధం లేకుండా కొందరు వాటిని అల్లర్లతో ముడిపెడుతున్నారని, సౌతాఫ్రికాలో ఏదో జరిగిపోతోందన్న ప్రచారం చేస్తున్నారని మండిపడుతోంది. Protesters have pulled down the fence at the Hluhluwe Game Reserve to let the animals out. Watch out for lions, etc. pic.twitter.com/uOQGTrQ4cA — The Duke (@TheDukeofOndini) July 11, 2021 Please note that the video currently circulating showing that Hluhluwe Park’s fence has been destroyed is an old video. It was taken on 12th May 2021 following the community protest by the community of Biliya community. So far we have not experienced any damage to our property. — EZEMVELO KZNWildlife (@EZEMVELOKZNWild) July 12, 2021 వారం దాటేసి.. దక్షిణాఫ్రికాకు తొమ్మిదేళ్లపాటు అధ్యక్షుడిగా పని చేశాడు జాకబ్ జుమా. అయితే పేదల పెన్నిధిగా పేరున్న జుమాపై సంచలనమైన ఆరోపణలు వచ్చాయి. 12 నేరాల జాబితాలో ఎట్టకేలకు కటకటాల వెనక్కి పంపగలిగింది రామఫోసా ప్రభుత్వం. దీంతో పెద్ద ఎత్తున్న వ్యతిరేక ఉద్యమం మొదలైంది. జనాలు భారీ ఎత్తున్న దొపిడీలకు పాల్పడుతుండడంతో దక్షిణాఫ్రికా ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే నిరసకారుల్ని, ప్రజల్ని అదుపు చేయడం పోలీస్ దళాలకు వల్ల కాలేదు. దీంతో జులై 12 నుంచి సైన్యం రంగంలోకి దిగింది. ఈ లోపు జుమా దాఖలు చేసిన రీ-పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ పరిణామంతో జుమాకు పట్టున్న ముఖ్యపట్టణాల్లో నిరసనలు తారాస్థాయికి చేరాయి. ఇక ఇదంతా ప్రణాళికబద్ధంగా జరుగుతున్న దాడులేనని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సైరిల్ రామఫోసా ఆరోపిస్తున్నారు. అల్లర్ల అదుపునకు మరో వారం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. -
సాసర్‌వెల్స్ సక్సెస్; వన్యప్రాణులు ఖుష్
వేసవిలో వన్యప్రాణులకు తాగునీటి ఇబ్బంది రాకుండా తెలంగాణ అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ సాసర్‌వెల్స్ (నీటి తొట్టీలు) సత్ఫలితాలిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్లోని జన్నారం, ఇందన్పల్లి, తాళ్లపేట అటవీ రేంజ్‌లలో సుమారు 90 వరకు నీటితొట్టీలను ఏర్పాటు చేశారు. సంబంధిత బీట్ అధికారి, బేస్‌క్యాంపు సిబ్బంది నీటితొట్టీల్లోని నీటిని పర్యవేక్షిస్తూ.. అయిపోగానే ట్యాంకర్ల ద్వారా నింపుతారు. రెండు స్క్వైర్ కిలోమీటర్లకు ఒక నీటితొట్టీని ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంతంలోని వన్యప్రాణులు నీరు తాగడానికి అనుకూలంగా ఉంటోంది. అడవిలో వాగులు, కుంటల్లో నీరు ఎండిపోతున్న నేపథ్యంలో నీటితొట్టీలు వన్యప్రాణుల దాహం తీరుస్తున్నాయి. గతేడాదివి 60 నీటితొట్టీలుండగా ఈ సంవత్సరం మరో 30 కొత్తవి నిర్మించారు. కాగా, నీరు తాగడానికి వచ్చిన వన్యప్రాణులు అధికారులు అమర్చిన సీసీ కెమెరాకు చిక్కాయి. ఈ దృశ్యాలను పరిశీలిస్తే సాసర్‌వెల్స్ సత్ఫలితాలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎఫ్‌డీవో మాధవరావును సంప్రదించగా ఎప్పటికప్పుడు నీటితొట్టీలను పరిశీలిస్తున్నామని, సిబ్బంది వారానికి రెండు రోజులు నీటిని పోసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. – జన్నారం(ఖానాపూర్) -
తల్లి పక్కన ఉండగానే అడవి జంతువుల దాడి!
తుర్కపల్లి: అడవి జంతువులు ఓ చిన్నారిని చిదిమేశాయి. వాటి దాడిలో నాలుగేళ్ల బాలుడు చనిపోయాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామశివారులో గురువారం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా వాపన్ పల్లి కాలనీకి చెందిన శివ, అతని కుమారుడు హరీశ్ కుటుంబం సహా నెలరోజుల క్రితం వాసాలమర్రికి వలసవచ్చారు. హరీశ్‌కు భార్య గంగోత్రి, కుమారుడు మునేశ్వర్‌రావు(4) ఉన్నారు. రోజుమాదిరిగానే బుధవారం సాయంత్రం వరకు కోళ్లు అమ్ముకొని వచ్చి రాత్రి భోజనం చేసి నిద్రపోయారు. అటవీప్రాంతం కావడంతో పాములు, తేళ్ల భయానికి మునేశ్వర్‌రావు పక్కన తల్లి గంగోత్రి, ఆమెకు రక్షణగా భర్త హరీశ్, మరోపక్కన తాత శివ పడుకున్నారు. అర్ధరాత్రి బాలుడు ఏడవడంతో తల్లి గంగోత్రి నిద్రలేచి పాలిచ్చింది. ఉదయం 5 గంటల ప్రాంతంలో తల్లి లేచి చూడగా కొడుకు తలను కొరికివేసినట్టుగా ఉండటం చూసి గట్టిగా కేకలేయడంతో భర్త, మామ నిద్రలేచారు. బాలుడి తల రక్తమడుగులో ఉంది. తీవ్రగాయాలపాలై కళ్లు బయటికి వచ్చాయి. రాత్రి 2.30 గంటల సమయంలో బాలుడి తలను అడవిజంతువులు కొరికివేసి ఉంటాయని అనుమానిస్తున్నారు. కాగా, బాలుడి తలను కొరికివేసింది కుక్కలా.. అడవిజంతువులా అనేది తేలాల్సి ఉంది. పోస్టుమార్టం నివేదిక వచ్చాక అసలు విషయం బయటపడుతుందని పోలీసులు తెలిపారు. -
బెజవాడ పరిసరాల్లో అరుదైన వన్యప్రాణులు
సాక్షి, అమరావతి: విజయవాడ పరిసర ప్రాంతాల్లో పలు కొత్త వన్యప్రాణుల ఉనికి పర్యావరణవేత్తల్లో ఆశలు చిగురింపజేస్తోంది. వాతావరణ మార్పులు, కరువవుతున్న పచ్చదనంతో జీవవైవిధ్యం దెబ్బతిన్న పరిస్థితుల్లోనూ కృష్ణా జిల్లాలో కొండపల్లి అటవీ ప్రాంతం, మరికొన్నిచోట్ల అరుదైన వన్యప్రాణుల్ని గుర్తించారు. ఇంతవరకు ఈ ప్రాంతంలో ఎప్పుడూ చూడని కొత్త రకం చుంచు (మద్రాస్ ట్రీష్రూ), ఐదు చారల తాటి ఉడత, పెద్ద రెక్కల గద్ద (స్టెప్పీ ఈగిల్)ను ఐఐఎస్ఈఆర్ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) కనుగొంది. కొన్నేళ్ల నుంచి కొండపల్లి రిజర్వు ఫారెస్టులోని మూలపాడు అటవీ ప్రాంతంలో జీవవైవిధ్యం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ ఉన్న చెట్లు, వాతావరణం వల్ల అటవీ ప్రాంతం అభివృద్ధి చెందడంతో వన్యప్రాణుల మనుగడ పెరిగింది. ఈ నేపథ్యంలోనే పలు కొత్త వన్యప్రాణుల ఉనికి బయటపడినట్లు ఐఐఎస్ఈఆర్ అంచనా వేస్తోంది. పెద్ద రెక్కల గద్ద (స్టెప్పీ ఈగిల్) శీతాకాలంలో భారత ఉపఖండంలో అరుదుగా కనిపించే అతిపెద్ద గద్ద ఇది. మధ్య ఆసియా, మంగోలియా నుంచి చలికాలంలో ఈ పెద్ద రెక్కల గద్దలు మనదేశానికి వస్తాయి. అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉంది ఈ గద్ద. ఇటీవల విజయవాడ రూరల్ మండలం అంబాపురంలో ఒక వ్యక్తి పొలంలో దీన్ని ఫొటో తీయడంతో వీటి ఉనికి బయటపడింది. ఇవికాకుండా శీతాకాలంలో పలు వలస పక్షులు ఈ ప్రాంతానికి ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. వాటిలో అరుదుగా ఉండే కోకిల, పలు రకాల గద్దలు కూడా ఉన్నాయి. కొత్త రకం చుంచు (మద్రాస్ ట్రీష్రూ) కృష్ణా జిల్లా మూలపాడు సీతాకోక చిలుకల పార్కులో సెప్టెంబర్ 10న దీన్ని గుర్తించారు. కీటకాలు, విత్తనాలు తిని జీవించే ఈ చుంచు జాతి ప్రాణులు రాతి ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. ఉడతల మాదిరిగా ఉండే ఇవి నడుస్తున్నప్పుడు తోకపైకి వంగి ఉంటుంది. 1850లో నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల మధ్య కొండల్లో మొదటిసారిగా వీటిని కనుగొన్నారు. అంతకుముందు విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లా అటవీ ప్రాంతాల్లోనూ సంచరించినట్లు గుర్తించారు. ఐదు చారల తాటి ఉడుత మన ఇళ్ల వద్ద కనిపించే సాధారణ ఉడుత శరీరంపై మూడు చారలు మాత్రమే ఉంటాయి. ఐదు చారల తాటి ఉడుతలున్నా అవి అంతరించిపోయినట్లు భావించారు. కానీ సెప్టెంబర్ 10న మూలపాడు అడవిలో, 11న విజయవాడ రూరల్ మండలం నున్న సమీపంలో వీటిని గుర్తించారు. ఈ ప్రాంతంలో వీటి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కొత్త జాతులు చాలా ఉన్నాయి మూలపాడు ప్రాంతంలో జీవవైవిధ్యం బాగుండటంతో కొత్త వన్యప్రాణులు ఇక్కడ కనిపిస్తున్నాయి. విజయవాడ పరిసరాల్లో ఇప్పటివరకు 630 జాతుల (పక్షులు, కీటకాలు, సాలె పురుగులు, క్షీరదాలు మొదలైనవి)ను రికార్డు చేశాం. 260కి పైగా పక్షి జాతుల సమాచారం మా వద్ద ఉంది. ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువ జీవజాతులు ఉన్నాయని భావిస్తున్నాం. ఐఐఎస్ఈఆర్ బయాలజీ విభాగం, దులీప్ మాథై నేచర్ కన్జర్వేషన్ ట్రస్ట్ సహకారంతో తిరుపతి, విజయవాడలో సర్వే చేస్తున్నాం. – రాజశేఖర్ బండి, సిటిజన్ సైన్స్ కో–ఆర్డినేటర్, ఐఐఎస్ఈఆర్ -
ముప్పు ముంగిట వన్యప్రాణులు
వన్యప్రాణులు ముప్పు ముంగిట మనుగడ సాగిస్తున్నాయి. వాటికి సహజ ఆవాసాలైన అడవులను స్వార్థపరులైన మనుషులు ఆక్రమించుకుంటూ ఉండటంతో అవి ఆవాసాన్నే కాదు, అర్ధంతరంగా ఆయువునూ కోల్పోతున్నాయి. గడచిన యాభయ్యేళ్ల కాలంలో భూమ్మీద మనుషుల జనాభా రెట్టింపును మించి పెరిగింది. ఇదే కాలంలో వన్యప్రాణుల జనాభా మూడింట రెండు వంతులకు పైగా తగ్గిపోయింది. కొన్ని జాతుల వన్యప్రాణులు పూర్తిగా కనుమరుగైపోయాయి. ఇంకొన్ని అంతరించిపోయే దశలోకి చేరుకున్నాయి. ఇదే రీతిలో వన్యప్రాణులు మరింతగా కనుమరుగైతే, పర్యావరణ సమతుల్యత దారుణంగా దెబ్బతిని, ఆ పరిస్థితి మనుషుల మనుగడకే ముప్పుగా మారే ప్రమాదం లేకపోలేదు. వన్యప్రాణుల మనుగడకు సంబంధించి ఇటీవల విడుదలైన ‘లివింగ్ ప్లానెట్ ఇండెక్స్’ నివేదిక ఆందోళన కలిగించేదిగా ఉంది. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఇంటర్నేషనల్, జువాలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్ సహకారంతో ‘లివింగ్ ప్లానెట్ ఇండెక్స్’–2020 తన నివేదికను రూపొందించింది. భూగోళంపై నివసించే సమస్త వన్యప్రాణులనూ ఇందులో లెక్కలోకి తీసుకోకపోయినా, వెన్నెముక గల 4000 వేల వన్యజంతువుల జాతులను పరిగణనలోకి తీసుకుంది. వీటి సంఖ్య 1970 నాటితో పోల్చితే 2016 నాటికి సగటున 68 శాతం మేరకు తగ్గిపోయింది. వ్యవసాయ విస్తరణ, అడవుల నరికివేత పెరగడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తినట్లు ‘లివింగ్ ప్లానెట్ ఇండెక్స్’ వెల్లడించింది. కోట్లాది సంవత్సరాలుగా భూమిపై మనుగడ సాగిస్తున్న వన్యజీవులు కేవలం అర్ధశతాబ్ది వ్యవధిలోనే ఈ స్థాయిలో తగ్గిపోవడమంటే, ఈ పరిణామాన్ని రెప్పపాటు కాలంలో సంభవించిన మార్పుగా పరిగణించాలని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ జనరల్ మార్కో లాంబెర్టిని అభిప్రాయపడ్డారు. బార్బరీ లయన్, బాక్ట్రియన్ ఒంటె ఎందుకు ఈ పరిస్థితి..? గడచిన అర్ధశతాబ్ది కాలంలోనే వన్యప్రాణుల సంఖ్య ఇంత దారుణంగా తగ్గిపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇదే కాలంలో మనుషుల జనాభా రెట్టింపును మించి పెరిగింది. మనుషుల వినిమయం అంతకు మించి పెరిగింది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇంటర్నేషనల్ చెబుతున్న ప్రకారం– భూమికి గల తన సహజ వనరుల పునరుత్పాదక శక్తితో పోలిస్తే, 1970 సంవత్సరానికి ముందు వరకు మానవుల పర్యావరణ అడుగుజాడలు తక్కువగానే ఉండేవి. అందువల్ల మనుషులు అటవీ సంపదను వాడుకుంటూ వచ్చినా, అప్పట్లో అంతగా ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడైతే మనుషులు భూమికి గల సహజ వనరుల పునరుత్పాదన సామర్థ్యానికి మించి ఒకటిన్నర రెట్లు ఎక్కువగా సహజ వనరులను ఇష్టానుసారం వాడేసుకుంటున్నారు. గడచిన యాభై ఏళ్లలో భారీగా పెరిగిన పరిశ్రమలు అడవులను, గడ్డిభూములను వ్యవసాయ క్షేత్రాలుగా మార్చేయడం గణనీయంగా పెరిగింది. దీనికి తోడు పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం, తరచుగా అడవుల్లో చెలరేగుతున్న కార్చిచ్చులు వన్యప్రాణులను వేగంగా హరించేస్తున్నాయి. ప్రస్తుతం భూమిపైనున్న స్థలభాగంలో మూడోవంతు, మంచినీటి వనరుల్లో నాలుగింట మూడువంతులు కేవలం ఆహార ఉత్పాదన కోసమే వినియోగమవుతున్నాయి. మనుషులు మనుగడ సాగిస్తున్న భూమిపై ఈ పరిస్థితి ఉంటే, సముద్రాల పరిస్థితి మరీ దారుణంగా మారింది. సముద్రాల్లోని మత్స్యవనరులను మనుషులు వినియోగించుకోవాల్సిన దాని కంటే 75 శాతం అదనంగా వినియోగించుకుంటున్నారు. కరీబియన్ మాంక్ సీల్, టాస్మానియన్ టైగర్ కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణం భూమిపైనున్న వన్యప్రాణులు కొన్ని ప్రాంతాల్లో మరింత వేగంగా కనుమరుగైపోతున్నాయి. ముఖ్యంగా మధ్య అమెరికా, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. ఈ ప్రాంతాల్లో గడచిన యాభై ఏళ్లలో వన్యప్రాణుల సంఖ్య ఏకంగా 94 శాతం మేరకు తగ్గిపోయింది. ఇలాంటి పరిణామం కచ్చితంగా మన ప్రపంచంపై ప్రభావం చూపుతుందని లాంబెర్టిని హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న నలభై స్వచ్ఛంద సంస్థలు, విద్యా పరిశోధన సంస్థలు వేర్వేరుగా జరిపిన అధ్యయనాల్లోని సమాచారాన్ని క్రోడీకరించుకుని, ‘లివింగ్ ప్లానెట్’ తన నివేదికలోని సమాచారాన్ని సవరించుకుని, ఇటీవలే దానిని విడుదల చేసింది. ఈ నివేదికను ‘ద నేచర్’ జర్నల్ ప్రచురించింది. ఇందులో వన్యప్రాణుల పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలన్నీ తక్షణమే చేపట్టవలసిన చర్యలను కూడా సూచించింది. ‘‘ఈ పరిస్థితిపై మనం తక్షణమే స్పందించాలి. జీవ వైవిధ్యం నాశనమవుతున్న వేగంతో పోల్చుకుంటే, ప్రభుత్వాలు చేపడుతున్న చర్యల వల్ల మొదలైన జీవ వైవిధ్య పునరుద్ధరణ వేగం చాలా తక్కువగా ఉంటోంది. ఇక ఏమాత్రం జాప్యం చేసినా మానవాళి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. జీవ వైవిధ్యాన్ని తిరిగి యథాస్థితికి తీసుకురావాలంటే కొన్ని దశాబ్దాల కాలం పట్టవచ్చు’’ అని ‘లివింగ్ ప్లానెట్’ అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకుడు డేవిడ్ లీక్లీర్ ఆందోళన వ్యక్తం చేశారు. వేటాడి చంపేస్తున్నారు అరుదైన వన్యప్రాణులను సైతం వేటగాళ్లు వేటాడి చంపేస్తున్నారు. ఇదివరకటితో పోలిస్తే, మాంసం కోసం వన్యప్రాణుల వేట గత యాభయ్యేళ్లలో గణనీయంగా పెరిగింది. సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 60 లక్షల టన్నుల వన్యప్రాణుల మాంసం అక్రమ మార్కెట్లకు తరలుతోంది. కేవలం బ్రెజిల్‌లోని అమెజాన్ అడవుల నుంచి 2 వేల కోట్ల డాలర్ల (రూ.1.47 లక్షల కోట్లు) విలువ చేసే వన్యప్రాణుల మాంసం ఇతర దేశాలకు అక్రమంగా ఎగుమతి అవుతోంది. వ్యక్తిగత లగేజీల్లో దాచి ఇలా తరలిస్తుండగా పారిస్ ఎయిర్‌పోర్టులో ఏటా పట్టుబడే వన్యప్రాణుల మాంసం 260 టన్నుల వరకు ఉంటోంది. ఇక మిగిలిన అంతర్జాతీయ విమానాశ్రయాలకు, నౌకాశ్రయాలకు చేరుతున్న మాంసం ఏ పరిమాణంలో ఉంటుందో ఊహించుకోవాల్సిందే! ఇవి ఇప్పటికే అంతరించాయి అడవుల నరికివేత, కార్చిచ్చులు, కాలుష్యం, వేట తదితర కారణాల వల్ల ఇప్పటికే చాలా వన్యప్రాణులు పూర్తిగా కనుమరుగై పోయాయి. గడచిన వందేళ్లలో దాదాపు 500 జాతులకు చెందిన జంతువులు, పక్షులు అంతరించిపోయాయి. గోల్డెన్ టోడ్ (బంగారు వన్నె కప్ప), రామచిలుకల జాతికి చెందిన కరోలినా పారాకీట్, కోడి జాతికి చెందిన హీత్ హెన్, కంగారు తరహా జాతికి చెందిన టాస్మానియన్ టైగర్, పెద్దపులుల్లో ఒక జాతి అయిన కాస్పియన్ టైగర్, కరీబియన్ మాంక్ సీల్, ఖడ్గమృగం జాతికి చెందిన వెస్టర్న్ బ్లాక్ రినో, పింటా ఐలాండ్ తాబేలు, సింహాల జాతిలో అరుదైన బార్బరీ లయన్, షోంబర్క్ జింకలు వంటివి గత వందేళ్లలోనే ఉనికిలో లేకుండా పోయాయి. క్లౌడెడ్ చిరుతపులి, పంగోలిన్ భారత్‌లో వన్యప్రాణుల పరిస్థితి గడచిన శతాబ్ద కాలంలో మన భారత్‌లో కూడా కొన్ని జంతువులు పూర్తిగా కనుమరుగైపోయాయి. వాటిలో చిరుత జాతికి చెందిన ఇండియన్ చీతా, అడవి దున్నల జాతికి చెందిన ఇండియన్ అరోక్, సుమత్రా ఖడ్గమృగాలు, శివాతెరియం (దీనిని శివుడి వాహనంగా భావించేవారు) వంటి భారీ జంతువులు సైతం అంతరించిపోయాయి. భారత్‌లో నెలకొన్న పరిస్థితులు వన్యప్రాణుల మనుగడకు నానాటికీ ప్రమాదకరంగా మారుతున్నాయి. వన్యప్రాణుల పరిరక్షణ కోసం ప్రభుత్వం 1972లో వన్యప్రాణుల పరిరక్షణ చట్టాన్ని అమలులోకి తెచ్చినా, మాంసం కోసం, జంతు శరీర భాగాల కోసం వన్యప్రాణుల వేట జరుగుతూనే ఉంది. చట్ట ప్రకారం వన్యప్రాణుల వేట, తరలింపు వంటి చర్యలను శిక్షార్హమైన నేరాలుగా పరిగణిస్తున్నా, వేటగాళ్లు వీటిని బేఖాతరు చేస్తూ, యధేచ్ఛగా వన్యప్రాణులకు ముప్పు తెచ్చిపెడుతున్నారు. జీవవైవిధ్యం గల దేశాల్లో భారత్ ఒకటి. ప్రపంచంలోని 6.5 శాతం వన్యప్రాణులు భారత్‌లోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా గల స్తన్యజీవుల్లో 7.6 శాతం, పక్షిజాతుల్లో 12.6 శాతం భారత్‌లో కనిపిస్తాయి. భారత్‌లో ఎక్కువగా వేటగాళ్ల బారిన పడుతున్న వాటిలో పెద్దపులులు, ఖడ్గమృగాలు, ఏనుగులు, నక్షత్ర తాబేళ్లు వంటివి ఉంటున్నాయి. చర్మం కోసం, పంజా, గోర్లు, ఇతర శరీర భాగాల కోసం వేటగాళ్లు పెద్దపులులను వేటాడుతున్నారు. చైనీస్ సంప్రదాయ వైద్యంలో పెద్దపులి శరీర భాగాలకు విపరీతమైన గిరాకీ ఉంది. దంతాల కోసం ఏనుగులను, కొమ్ముల కోసం ఖడ్గమృగాలను పొట్టన పెట్టుకుంటున్నారు. వీటిని గృహాలంకరణలుగా వాడటంపై రకరకాల నమ్మకాలు ప్రచారం ఉండటంతో వీటికీ గిరాకీ ఎక్కువగానే ఉంటోంది. ఫెంగ్‌షుయి నమ్మకాల కారణంగా కొన్ని దేశాల్లో నక్షత్ర తాబేళ్లను పెంచుకుంటున్నారు. సాధారణంగా వీటిని సజీవంగానే విదేశాలకు తరలిస్తుంటారు చైనా, మలేసియా, ఇండోనేసియా వంటి దేశాల్లో పులులు, ఖడ్గమృగాల శరీర భాగాలకు విపరీతమైన గిరాకీ ఉండటంతో అక్రమ మార్గాల గుండా వీటిని తరలిస్తున్నారు. ఇదివరకటి కాలంలో అడవి జంతువుల వేట కోసం వేటగాళ్లు ఉచ్చులు, మామూలు తుపాకులు ఎక్కువగా వాడేవారు. ఇటీవలి కాలంలో భారీ జంతువులను వేటాడటానికి అధునాతనమైన తుపాకులతో పాటు కొందరు పశువైద్యులు జంతువులకు శస్త్రచికిత్సలు చేసేటప్పుడు వాడే మత్తుమందులు, విషం సైతం వినియోగించి, జంతువులను మట్టుబెడుతున్నారని ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) వెల్లడించింది. భారతీయ ఖడ్గమృగాలు (ఇండియన్ రినో) ఒకప్పుడు పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ భూభాగాల్లో విరివిగా కనిపించేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 2,500 లోపే ఉండటంతో అతి అరుదుగా మాత్రమే కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని అడవుల్లో వేటగాళ్లు వేటాడిన జంతు శరీర భాగాల స్మగ్లింగ్ ఉత్తర భారత రాష్ట్రాలు కేంద్రంగా సాగుతోంది. ఈ రాష్ట్రాల్లోని కొనుగోలుదారులు వేటగాళ్ల నుంచి వీటిని కొనుగోలు చేసి, నేపాల్‌కు తరలించి, అక్కడి నుంచి వివిధ మార్గాల్లో చైనా, మలేసియా, ఇండోనేసియా తదితర దేశాలకు తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. వన్యప్రాణుల వేటను, అక్రమ తరలింపును కట్టడి చేసేందుకు ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకుంటే, మరిన్ని వన్యప్రాణులు పూర్తిగా కనుమరుగైపోయే పరిస్థితులు ఉన్నాయని ఐయూసీఎన్ వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ప్రమాదం అంచున ఉన్న జంతుజాతులు ‘భూమిపై నివసించే స్తన్యజీవుల్లో 301 జాతులకు చెందిన జంతువులు ప్రమాదం అంచున ఉన్నాయి. వీటి పరిరక్షణ కోసం తక్షణ చర్యలు తీసుకోకుంటే త్వరలోనే ఇవి అంతరించిపోయే ప్రమాదం ఉంది. ప్రమాదం అంచుల్లో ఉన్న ఈ జంతుజాతుల్లో లోలాండ్ గొరిల్లా, మాండ్రిల్ సహా 168 జాతులకు చెందిన వానరాలు, జడల బర్రె, బాక్ట్రియన్ ఒంటె సహా 73 జాతులకు చెందిన గిట్టలు గల జంతువులు, 27 జాతులకు చెందిన గబ్బిలాలు, క్లౌడెడ్ చిరుతపులి, కొన్నిరకాల ఎలుగుబంట్లు సహా 12 జాతులకు చెందిన మాంసాహార జంతువులు, ఎనిమిది జాతులకు చెందిన పంగోలిన్, కంగారూ జాతికి చెందిన 26 రకాల జంతువులు, ఆల్పైన్ వూలీ ర్యాట్ సహా ఎలుక జాతికి చెందిన 21 రకాల జంతువుల సంఖ్య గడచిన యాభై ఏళ్లలో గణనీయంగా క్షీణించింది. ప్రస్తుతం ఇవి దాదాపు కనుమరుగయ్యే స్థితికి చేరుకున్నాయని ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్’ వెల్లడించింది. ఈ జంతువులను తన ‘రెడ్‌లిస్ట్’లో చేర్చింది. గణనీయంగా వీటి తరుగుదలకు అడవులు తరిగిపోవడమే కాకుండా, ఇష్టానుసారం సాగిస్తున్న వేట కూడా కారణమవుతోందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ మెక్‌డొనాల్డ్ చెబుతున్నారు. మాంసం కోసం, జంతువుల శరీర అవయవాల కోసం వీటిని వేటాడటం గత యాభై ఏళ్లలో బాగా ఎక్కువైందని, ఇదే పరిస్థితి కొనసాగితే ‘రెడ్‌లిస్ట్’లో ఉన్న వన్యప్రాణులు పూర్తిగా కనుమరుగవడానికి ఎంతోకాలం పట్టదని ఆయన హెచ్చరిస్తున్నారు. -
అటవీశాఖ కార్యాలయంపై రాళ్ల దాడి
ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీశాఖ కార్యాలయంపై సోమవారం పలువురు రాళ్లతో దాడి చేశారు. ఈ నెల 6న మండలంలోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడుతున్న యువకుడిని అటవీ అధికారులు పట్టుకున్నారు. విచారణ పేరుతో రెండు రోజులుగా చిత్రహింసలు పెట్టడంతో ప్రాణాపాయ స్థితికి చేరాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు కార్యాలయంపై దాడి చేశారు. రేంజ్ కార్యాలయంతో పాటు ఎఫ్‌డీవో గెస్ట్‌హౌస్ అద్దాలు, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. పలువురు అధికారులు, సిబ్బంది కార్యాలయ తలుపులు వేసుకుని లోపలే ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. కాగా పలు వన్యప్రాణులను వేటాడిన యువకుడు చిరుతను హతమార్చేందుకు యత్నించాడని, తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. కేసులు నమోదు చేస్తామనే భయంతో యువకుడు స్పృహ కోల్పోయాడని ఎఫ్‌డీవో కోటేశ్వర్, ఎఫ్ఆర్వో వినాయక్ తెలిపారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. (చెప్పుతో కొట్టిన సర్పంచ్.. యువకుడి ఆత్మహత్య) -
ఫీల్.. కూల్
ఠారెత్తిస్తున్న ఎండలతో ఇళ్ల నీడన ఉంటున్న మనుషులే తల్లడిల్లుతున్నారు. మరి వేడి సెగలు, వడగాలుల మధ్య తిరుగాడే వన్యప్రాణులు ఇంకెంత విలవిలలాడాలి. నాలుగైదు రోజులుగా నగరం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఈ క్రమంలో వేసవి తాపం నుంచి మూగజీవాలను కాపాడేందుకు నెహ్రూ జూలాజికల్ పార్కులో చర్యలకు ఉపక్రమించారు. జూలో ఉన్న వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చింపాంజీ, కోతులు, పులులు, సింహాలు, చిరుత పులుల ఎన్‌క్లోజర్ లోపల 50కిపైగా కూలర్లను ఏర్పాటు చేసి చల్లదనాన్ని కల్పిస్తున్నారు. నిశాచర జంతుశాల(నైట్ హౌజ్)లో ఎయిర్ కండిషనర్లు, ఎగ్జాస్ట్ ఫ్యాన్లను పెట్టారు. బహదూర్‌పురా :సూరీడు సుర్రుమంటున్నాడు.. ఉదయం నుంచే ఎండలు మండిపోతున్నాయి.. నగరంలో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. మార్చి, ఏప్రిల్‌లో కాస్త తక్కువగా ఉన్నా.. లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లలోనే ఉండటంతో కాస్త రక్షణ పొందారు. గత నాలుగైదు రోజులుగా నగరం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. దీంతో ప్రజలతో పాటు మూగజీవాలు అల్లాడుతున్నాయి. వేసవి తాపం నుంచి జీవులను కాపాడేందుకు నెహ్రూ జూలాజికల్ పార్కులో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవి ప్రారంభంలోనే జూలోని వన్య ప్రాణుల సంరక్షణకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు ప్రస్తుతం మరింత శ్రద్ధ పెట్టారు. జంతువులు ఉండే చోట్ల స్ప్రింక్లర్లు, చిన్న రెయిన్గన్స్లను ఏర్పాటు చేసి నీటిని విరజిమ్ముతున్నారు. పక్షులు ఇతర వన్యప్రాణుల ఎన్‌క్లోజర్‌లో ఫాగర్లను ఏర్పాటు చేసి నీటి బిందువులను పొగమంచు వలే విరజిమ్ముతున్నారు. వన్యప్రాణుల ఎన్క్లోజర్ల పైకప్పుపై తుంగ గడ్డిని ఏర్పాటు చేసి ఎండ వేడిమి నుంచి ఉపశమనం కల్పిస్తున్నారు. చింపాంజీ, కోతులు, పులులు, సింహాలు, చిరుతపులుల ఎన్‌క్లోజర్ లోపల 50పైగా కూలర్లను ఏర్పాటు చేసి చల్లదనాన్ని కల్పిస్తున్నారు. నిశాచర జంతుశాల(నైట్ హౌజ్)లో ఎయిర్ కండిషనర్లు, ఎగ్జాస్ ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. వెటర్నరీ వైద్య సిబ్బందితో పర్యవేక్షణ.. వన్యప్రాణులను జూపార్కు వెటర్నరీ వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వేసవిలో పుట్టిన వన్యప్రాణుల కూనలపై మరింత శ్రద్ధ తీసుకుంటూ అన్ని రకాల చర్యలను చేపడుతున్నామని జూపార్కు క్యూరేటర్ క్షితిజ తెలిపారు. ఓపెన్ ఎన్‌క్లోజర్‌లోని ఏనుగులు, తాబేలు, నీటిగుర్రం, ఖడ్గమృగంతో పాటు ఆస్ట్రిచ్ పక్షి ఇతర వన్యప్రాణుల ఎన్క్లోజర్లలో నీటిని నేరుగా వన్యప్రాణులపైకి విరజిమ్ముతున్నట్లు వారు వివరించారు. వేసవి తాపాన్ని తట్టుకునేలా... వేసవిని తట్టుకునేందుకు వన్యప్రాణులకు పుచ్చకాయలు, కర్బూజ వంటివి అందిస్తున్నారు. గ్లూకాన్డీ, ఎలక్ట్రాల్ పౌడర్, విటమిన్–సీ, బీ కాంప్లెక్స్ సప్లిమెంట్లను అందిస్తూ వేసవి తాపాన్ని తట్టుకునేందుకు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతున్నారు. సూర్యకాంతి నేరుగా వన్యప్రాణులపై పడకుండా కిటికీలు, వెంటిలేటర్లు, తలుపులకు గోనె సంచులను కప్పి వాటిని నీటితో ఎప్పటికప్పుడు తడుపుతున్నారు. పక్షుల ఎన్క్లోజర్ల పైకప్పులు, చుట్టుపక్కల ఆకుపచ్చని నీడ వలయాలను ఏర్పాటు చేశారు. వన్యప్రాణులకు సురక్షితమైన నీటిని అందిస్తున్నారు. లోపల ఫ్యాన్లు, కూలర్లను ఏర్పాటు చేశారు. ఎండ వేడిని తట్టుకునే శక్తి వేటికిఎంత..? ♦ రాష్ట్రవ్యాప్తంగా ఎండలు 44 డిగ్రీలకు పైగా పెరగడంతో కొన్ని వన్యప్రాణులు, పక్షులు పిట్టల్లా రాలిపోతున్నాయి. మనుషులతో పాటు వన్యప్రాణులు ఎండ వేడిని కొంతమేర తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. 38–40 డిగ్రీల ఎండను కొన్ని వన్యప్రాణులు ఓర్చుకుంటాయి. క్రూర జంతువులైన పులులు, సింహాలు, నక్కలు, తోడేళ్లు, చిరుతపులులు, ఎలుగుబంట్లు 40 డిగ్రీల ఎండను సైతం తట్టుకుంటాయి. భారీ జంతువైన ఏనుగు 44 డిగ్రీల ఎండను సైతం ఓర్చుకోగలుగుతుంది. ఆస్ట్రిచ్ పక్షులు 45–47 డిగ్రీల ఎండలో హాయిగా జీవిస్తాయి. చిన్న పక్షులైతే 40 డిగ్రీలలోపు ఎండ వేడిమికే సతమతమవుతాయి. ♦ రామచిలుకలు, అడవి కోళ్లు, బాతులు, ఇతరత్ర చిన్న చిన్న పక్షులు జూలో 500కు పైగా ఉన్నాయి. సహజ సిద్ధమైన జూ వాతావరణంలో ఎండ తీవ్రత కూడా తక్కువగానే ఉంటుంది. 40 డిగ్రీల వరకు ఎండ వేడిమిని అతికష్టం మీద ఈ పక్షులు తట్టుకోగలుగుతాయి. రాత్రివేళ సంచరించే నిశాచర జంతువు, దేవాంగ పిల్లి, గబ్బిలాలు, ముళ్ల పంది, రాటేల్, అడవి పిల్లులు 40 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకుంటాయి. -
వన్యప్రాణులను చంపి టిక్‌టాక్‌లో పోస్టు..
అనంతపురం, కంబదూరు: వన్యప్రాణులను చంపి టిక్‌టాక్‌లో పోస్టు చేసిన ఓ వ్యక్తిని అటవీ అధికారులు అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. రామగిరి మండలం పేరూరుకు చెందిన నాగార్జున అనే యువకుడు కంబదూరు మండలం అయ్యంపల్లికి చెందిన బోయ నరసింహులు అనే వ్యక్తి వద్ద జీతగాడిగా ఉన్నాడు. రోజూ గొర్రెలను మేపడానికి పొలాల్లోకి వెళ్లేవాడు. అయితే ఇటీవల నాగార్జున ఓ జింక పిల్లను పట్టుకొని దానిని అడిస్తూ మేక పాలను తాపడం, కుందేళ్లను చంపి దాని మాంసాన్ని కుక్కలను వేయడం వంటి పనులు చేస్తూ వీడియో తీసి టిక్‌టాక్‌లో పోస్ట్ చేశాడు. వీడియోలను జిల్లా ఫారెస్ట్ అధికారి జగన్నాథం చూసి వెంటనే నిందితుడిపై కేసు నమోదు చేయాలని కళ్యాణదుర్గం అటవీ అధికారులను ఆదేశించారు. సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు సెక్షన్ ఆఫీసర్ రామచంద్రనాయక్ తెలిపారు. -
నెహ్రూ జూపార్కులో జూనియర్ ఫ్రెండ్స్
బహదూర్‌పురా: లాక్డౌన్ అనంతరం నెహ్రూ జూలాజికల్ పార్కులో సింహాలు, పులులు, నక్కలు, ఆస్ట్రిచ్ పక్షులు జూ సందర్శకులను అలరించనున్నాయి. ఇటీవల జూపార్కులోని ఆదిసన(రాధ), మాధవ్‌లకు రెండు సింహపు కూనలు జన్మించాయి. వాటిని డార్క్ రూమ్‌లో నుంచి డే క్రాల్‌లోకి విడుదల చేశారు. ప్రస్తుతం సింహపు కూనలు సమ్మర్ హౌజ్‌లో ఉన్నాయి. 2013లో సౌదీ అరేబియా ప్రిన్స్ సింహాలను జూకు బహుమతిగా అందించారు. జూలో వీటికి రాధ, మాధవ్‌లుగా పేర్లు పెట్టారు. ఇటీవల రెండు కూనలు జన్మించడంతో అధికారులు హర్షం వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితం రాయల్ బెంగాల్ టైగర్(ఆశ) మూడు పులి కూనలకు జన్మనిచ్చింది. ఇటీవల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నక్కలు కూడా రెండు నక్క కూనలకు జన్మనిచ్చాయి. జూపార్కులో ఉన్న ఆస్ట్రిచ్ పక్షులు మూడు పిల్లలకు జన్మనిచ్చాయి. మొత్తం మీద లాక్డౌన్లో జూపార్కులో 10 కొత్త వన్యప్రాణులు సందర్శకులను అలరించనున్నాయి. బుడిబుడి నడకలతో జూపార్కు యానిమల్ కీపర్లను కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ నెలాఖరు వరకు జూపార్కులో మరిన్ని కొత్త వన్యప్రాణులు పురుడు పోసుకునే అవకాశాలు ఉన్నాయి. జూలోని వన్యప్రాణులకు కరోనా వ్యాధి సోకకుండా పెద్దఎత్తున జాగ్రత్త చర్యలను జూ అధికారులు తీసుకుంటున్నారు. -
వాల్గొండ అటవీప్రాంతంలో కలకలం
మల్లాపూర్(కోరుట్ల): వాల్గొండ అటవీ ప్రాంతంతో మంగళవారం రాత్రి వన్యప్రాణులకోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్‌తీగలతో ట్రాక్టర్ దగ్ధమవగా, చుక్కల జింక మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని వాల్గొండ అటవీప్రాంతంలో ఆదే గ్రామానికి చెందిన ఇస్లావత్ శరినాయక్ కౌలుకు తీసుకున్న పొలంలో మొరం మట్టి పోసేందుకు ట్రాక్టర్ డ్రైవర్ చెట్పల్లి రాజు వెళ్లాడు. ఈ సమయంలో విద్యుదాఘాతానికి గురైన ట్రాక్టర్లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. విషయాన్ని గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఘటనస్థలికి వెళ్లగా వన్యప్రాణుల కోసం అమర్చిన విద్యుత్‌తీగలు గుర్తించారు. సంఘటన జరిగిన కొంతదూరంలో చుక్కల జింక కరెంట్‌షాక్‌కు గురై మృతిచెంది కనిపించింది. ప్రజాప్రతినిధులు వెంటనే పోలీస్, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి చుక్కల జింక మృతదేహాన్ని, దుండగులు వదిలి వెళ్లిన బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
పులి వచ్చిందా.. అయితే పట్టేయొచ్చు..!
సాక్షి, హైదరాబాద్: వన్యప్రాణుల ట్రాకింగ్‌కు ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ను వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) శాస్త్రవేత్తలు రూపొందించారు.కోవిడ్ –19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో సుదీర్ఘ లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో దేశవ్యా ప్తంగా పలుప్రాంతాల్లో అడవుల్లోంచి వన్యప్రాణులు, జంతువులు రోడ్లపైకి, జనావాసాలకు దగ్గరగా వస్తున్న విషయం తెలిసిందే.ఎక్కడికక్కడ వాటిని ట్రాక్ చేయడంతో పాటు, వాటి ఆనుపానులు తెలుసుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు.అదేవిధంగా దేశంలోని వివి ధ రాష్ట్రాల్లో మనుషులు,జంతువులు తారసపడుతున్న ప్రాంతాలు, అక్కడున్న పరిస్థితులను తెలుసుకునేందుకు అవసరమైన ము ఖ్యమైన సమాచారాన్ని దీని ద్వారా పొందవచ్చునంటున్నారు ఆండ్రాయిడ్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా ‘లాక్డౌన్ వైల్డ్‌లైఫ్ ట్రాకర్’ను వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) రూపొందించింది. దేశవ్యాప్తంగా అడవులు, దగ్గర్లలోని గ్రామా లు, పట్టణాల్లో ఎక్కడెక్కడ ఏ రకమైన వ న్యప్రాణులు, జంతువులు కనిపించాయో రికార్డ్ చేసేందుకు వీలుగా ఇందులో టూ ల్స్‌ను వినియోగిస్తున్నారు. లాక్డౌన్ సందర్భంగా ఇక్కడ పులి కనిపించింది, అక్కడ ఏనుగులు రోడ్లపైకి వచ్చాయి, మరోచోట చిరుతపులి ఊళ్లోకి వచ్చింది అంటూ వస్తు న్న వార్తలు, వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్న కథనాలు, ఫోటోలు కేవలం ఆ మేరకే పరిమితం కాకుండా, దీనికి సంబంధించిన డేటాను సమీకృతంగా సేకరించి వన్యప్రాణులకు చెందిన ఆసక్తికరమైన సమాచారాన్ని నమోదు చేయొచ్చనే ఆలోచనతో డబ్ల్యూఐఐ శాస్త్రవేత్తలు ఈ యాప్‌ను రూపొందించారు. ఎప్పుడైనా రికార్డు చేయవచ్చు... పట్టణప్రాంతాలతో పాటు మనుషులు ఎక్కువగా లేని చోట్లకు జంతువులు కూడా వస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో తమకు కనిపించిన వాటి గురించి ఈ యాప్ ద్వారా తెలియజేయొచ్చని ఈ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ మోహన్ తెలిపారు. వన్యప్రాణులు కనిపిస్తే అదే సమయంలో లేకుంటే ఆ తర్వాతైనా తెలియజేయొచ్చని, వాటి ఫొటోలను అప్లోడ్ చేయొచ్చని డబ్ల్యూఐఐ సీనియర్ సైంటిస్ట్ డా.బిలాల్ హబీబ్ తెలిపారు. ఈ యాప్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని, దీనిద్వారా తమకు కనిపించిన జంతువు ల చిత్రాలను ఎక్కడినుంచైనా, ఏ సమయం లోనైనా రికార్డ్ చేసి పంపొచ్చునని తెలియజేశారు.ఈ రికార్డింగ్‌లను సులభంగా చేయడంతో పాటు జీపీఎస్ ద్వారా తెలుసుకునే వీలుంటుందన్నారు.ఈ సమాచారం, ఫొటోలను సంబంధిత రాష్ట్రాల అటవీశాఖలకు పంపించి, వాటి పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణను చేపట్టేందుకు వీలవుతుందని మోహన్ వెల్లడించారు. -
కోతులకు సోకితే అంతే
సాక్షి, హైదరాబాద్: కోతులకి మనుషుల ద్వారా కరోనా వైరస్ వ్యాపించే అవకాశాలున్నాయని జీవ శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో వాటికి మనుషులు ఆహారం, పండ్లు నేరుగా అందించడం ప్రమాదకరమని చెబుతున్నారు. మనుషుల నుంచి లేదా వారు పెట్టే ఆహారం నుంచి ఈ వైరస్ కోతులకు సోకితే సార్స్–సీవోవీ–2 వైరస్ మ్యుటేటయ్యేందుకు దోహదపడటంతో పాటు అడవు ల్లోని ఇతర జంతువులకు ఇది వ్యాపిస్తే దీర్ఘకాలం దుష్పరిణామాలు ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు. తాజాగా తమిళనాడులోని సలీం అలీ సెంటర్ ఫర్ ఒరింతోలజీ, నేచురల్ హిస్టరీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ హోన్నవల్లి ఎం.కుమార తమ అధ్యయన పత్రంలో ఆయా అంశాలను ప్రస్తావించారు. వైరస్లు, ఎండో పారాసైట్లు మనుషులు, జంతువుల మధ్య సోకే, వ్యాప్తి చెందే అవకాశాలున్నాయ ని ఆయన స్పష్టం చేశారు. కోతులు, అడవి జంతువులకు మనుషులు నేరుగా ఆహారం పెట్టే అలవాటును మార్చుకోవాల్సి ఉందని మరో శాస్త్రవేత్త పేర్కొన్నారు. ఒకవేళ సార్స్–సీవో వీ–2 వైరస్ మ్యుటేట్ అయ్యి ఇతర జం తువులకు సోకితే మొత్తం వన్యప్రాణులపైనే దాని ప్రభావం పడుతుందని తమిళనాడుకు చెందిన మరో జీవశాస్త్రవేత్త హెచ్చరిస్తున్నా రు. ఈ క్రమంలో గతంలో కోతులపై పరిశోధనతో పాటు వివిధ అంశాలపై అధ్యయనం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ సైం టిస్ట్, ఆల్ఇండియా నెట్వర్క్ ప్రాజెక్ట్ ఆన్ వెర్టేట్రేట్ పెస్ట్ మేనేజ్మెంట్ హెడ్ డాక్టర్ వి.వాసుదేవరావు ‘సాక్షి’కి పలు విషయా లు వెల్లడించారు. ‘జంతువుల కు, ముఖ్యంగా కోతులకు రెడీమేడ్ ఆహారం అందించాల్సిన అవసరం లేదు. పబ్లిక్ ఫీడిం గ్ వల్ల వాటికి ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకా శాలున్నాయి. వాటికి ఆహారం, పండ్లు పెట్టి ఇన్ఫెక్షన్లను వ్యాప్తి చెం దేలా చేయడం సమంజసం కాదు. వైరస్ ఎలా మ్యుటేట్ అవుతుందో తెలియదు. కాబట్టి జాగ్రత్త అవసరం. జంతువుల నుంచి వైరస్లు, బ్యాక్టీరియా వ్యాపించే అవకాశాలెక్కువ. పైగా అవి స్వతహాగా ఆహారం సంపాదించుకోవాలన్న గుణాన్ని మార్చుకుని, ఆహారం పెట్టనపుడు దాడులకు దిగుతాయి. పైగా కోతుల్లో టీబీ లక్షణాలు ఎక్కువ. అవి మనుషులకు సోకే ప్రమాదం ఉంది’. అడవుల్లోకి తిరిగి వెళ్లేలా చేయాలి సమన్వయ చర్యలతో కోతులకు ఫీడింగ్ కంట్రోల్ చేయాలి. అవి తమంతట తామే అడవుల్లోకి తిరిగెళ్లేలా చూడాలి. ఇందుకు ప్రభుత్వ పరంగా చర్యలు చేపడుతున్నాం. మంకీ ఫుడ్‌కోర్టుల ఏర్పాటు ద్వారా కోతులకు పండ్లు అం దుబాటులోకి వచ్చేలా చూస్తున్నాం. ప్రస్తుతం అడవుల్లో వాటికి పండ్లు,ఫలాలు దొరకట్లేదు. కోతుల జనాభా నియంత్రణకు ఆపరేషన్ల ద్వారా అడ్డుకట్ట వేసేందుకు నిర్మల్‌లో సంతాన నిరోధక కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. – వైల్డ్‌లైఫ్ ఓఎస్డీ శంకరన్ -
లాక్డౌన్: మాకు చాన్సొచ్చింది
పులి గాండ్రిస్తుంది. సింహం గర్జిస్తుంది. ఏనుగు ఘీంకరిస్తుంది. మనిషి? మనిషి.. ‘హారన్’ కొడతాడు! గాండ్రించే పులి కూడా గర్జించే సింహం కూడా ఘీంకరించే ఏనుగు కూడా ‘హారన్’కు అదిరిపడతాయి. లాక్‌డౌన్‌తో ఇప్పుడు హారన్ సౌండ్ లేదు. వన్యప్రాణులకు పీస్ ఆఫ్ మైండ్! మనిషి ‘లోపల’ ఉన్నాడు కదా. ఇప్పుడు వాటికి చాన్సొచ్చింది. లోపల్నుంచి బయటికొస్తున్నాయి! జలంధర్ నుంచి కనిపిస్తున్న ధౌలాధర్ కొండలు ఒక్క జంతువులు, పక్షులేనా! నింగి నాట్యమాడుతోంది. నేల విహంగమౌతోంది. చంద్రుడు తెల్లటి గడ్డ పెరుగు. సూర్యుడు మరికొన్ని ఎల్యీడీల వెలుగు. అద్దం తుడిచినట్లు నదులు. కడిగి బోర్లించిన గిన్నెల్లా కనుచూపు కొండలు. బాగుంది కవిత్వం. బ్యాంకుల్లో డబ్బులేవి? బియ్యం డబ్బాల్లో నిల్వలేవి? ఆఫీస్‌లలో కొలువులేవి? వేసవికి సెలవులేవి? కరువు, కవిత్వం ఎప్పుడూ ఉండేవే. లౌక్‌డౌన్‌కు ముందు మాత్రం.. జీవితంలో అది లేదని, ఇది లేదని నోరు చప్పరించలేదా? ఇన్నాళ్లూ ప్రకృతిని బోనులో ఉంచి మనం విహరించాం. ఈ కొన్నాళ్ల బందిఖానా నుంచి ప్రకృతి వింతలను వినోదిద్దాం. పునుగుపిల్లి, కోళికోడ్ మార్చి 25 అర్ధరాత్రి నుంచి మన దగ్గర లాక్డౌన్ మొదలైంది. దేశానికి 1947లో అర్ధరాత్రి స్వాతంత్య్రం వచ్చినట్లే.. నేచర్‌కీ ఇది అర్ధరాత్రి స్వతంత్రం! పది రోజులు గడిచాయి. స్వాతంత్య్రం ఎంత స్వేచ్ఛను ఇస్తుందో ఒక్కో ప్రాణీ మనకు చూపించడం మొదలైంది. ఉత్తరాఖండ్‌లో మూడు సంబార్ జాతి జింకలు వీధిల్లోకి వచ్చాయి. తప్పిపోయినట్లు రాలేదు. తాపీగా రొడ్డెక్కాయి. నోయిడాలో నీలంరంగు ఎద్దు (నీల్గాయ్) తోకను ఆడించుకుంటూ, చేతులు వెనక్కు పెట్టుకుని నెమ్మదిగా.. ‘దారంతా నాదే’ అని నడుస్తున్న మనిషిలా తిరిగింది. డెహ్రాడూన్‌లో గజరాజు షికారు కొట్టింది. కోళికోడ్‌లో చిన్న పునుగుపిల్లి.. ‘ఏమైపోయారు ఈ మనుషులంతా..’ అనో ఏమో.. వెనక్కు చూసుకుంటూ ముందుకు వెళ్లింది. ఆలివ్ ‘రిడ్లే’ తాబేళ్లు ఒడిశా బీచ్ అలలపై జారుడుబండ ఆడాయి! కర్ణాటకలో ఒక అడవి దున్న మార్కెట్లోకి వచ్చింది. ముంబై వీధుల్లో నెమళ్లు నాట్యమాడాయి. పాట్నా దగ్గరి వైమానిక స్థావరంలో చిరుత ఒకటి తిండి మాని మరీ ఆటలు ఆడింది. తిరుపతి ఘాట్‌రోడ్లలో లేళ్లు గంతులేశాయి. ఏటూరు నాగారంలో ఎలుగుబంట్లు అభయారణ్యం నుంచి కంచె దాకా వచ్చి ‘వాటీజ్ హ్యాపెనింగ్! డప్పుల్లేని లోకంలోకి వచ్చిపడ్డామా’ అని జిల్లా పారెస్టు ఆఫీసర్ల వైపు చూశాయి. సంబార్ జింకలు, ఉత్తరాఖండ్ లాక్‌డౌన్‌తో బయటికి వస్తున్న వాటిలో కొన్ని అరుదైన జీవులు. కొన్ని అంతరించిపోతున్న జీవులు. సంబార్ జాతి జింకలు బలంగా ఉంటాయి. సంఖ్యలో మాత్రం బలహీనం. ‘రెడ్ లిస్ట్’లో ఉన్నాయి. పులుగులు, ఎలుగులు, రిడ్లే తాబేళ్లు కదలికలు ఉండేవీ కానీ అస్తమానం కనిపించేవి కావు. అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, పోలండ్, ఇంగ్లండ్‌లోనూ అడవుల నుంచి జంతువులు బయటికి వస్తున్నా.. ఇంత పెద్ద దేశంలోని నూటా ముప్పై కోట్ల జనాభా ఒక్కసారిగా ఇళ్లలోనే లాక్ అయిపోవడంతో, మన మూగజీవులకు పెద్ద బ్లాక్ తొలగిపోయింది. ఎం.ఎస్.రామారావు గారు పాడినట్లు.. ‘ఈ విశాల, ప్రశాంత, ఏకాంత..’ లాక్డౌన్లో మనుషులు నిదురిస్తుంటే.. జంతు ప్రపంచం ఒళ్లు విరుచుకుని లేస్తోంది. నీల్గాయ్, నోయిడా జలంధర్‌లో ఈమధ్య ఉదయాన్నే నిద్రలేచి బాల్కనీలోకి వచ్చినవాళ్లు దూరంగా కనిపిస్తున్న ధౌలాధర్ కొండల్ని చూసి షాక్ తిన్నారు. రాత్రికి రాత్రి ఇంటి ముందుకు కొండ వచ్చేస్తే అలాగే ఉంటుంది మరి. గత ముప్పై ఏళ్లుగా పరిశ్రమల కాలుష్యంలో మసకబారి క్రమంగా అదృశ్యం అయిపోయిన ఆ కొండలు ఈ లాక్డౌన్లో క్లీన్ అయి కళ్లముందుకు వచ్చాయి. దేశంలో ఇంకా చాలా కాలుష్యాలు తగ్గిపోయాయి. ఢిల్లీ, మిగతా మెట్రో నగరాలు వానొచ్చి కడిగేసినట్లుగా అయ్యాయి. బెంగళూరులో ప్రాణవాయువు నాణ్యత పెరిగింది. గంగా యమునా నదీ జలాలు తేటపడ్డాయి. ‘ఆశ్చర్యం’ అంటున్నారు డాక్టర్ పి.కె.మిశ్రా. వారణాసిలోని ఐఐటిలో కెమికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ ఆయన. ‘యమున’ గురించైతే ‘అన్బిలీవబుల్.. బట్ ట్రూ’ అంటుంటోంది కేంద్ర ‘జలశక్తి’ మంత్రిత్వశాఖ. పరిశమ్రలు, కర్మక్రియలు ఆగిపోయి నదులు ప్రక్షాళన అయ్యాయి. అంతా మన మంచికే అనుకోవడం నిర్వేదం కాదు, జీవనవేదం కాదు. వాస్తవం. పరుగుల జీవితంలోని ఈ తాత్కాలిక విరామంలో మన ఇళ్లూ, ఒళ్లు కూడా శుభ్రం అవుతున్నాయి. అవనిద్దాం. అవని చోటును అవనికే ఉంచేద్దాం. తేటపడిన ‘యమున’ : వజీరాబాద్ బ్యారేజ్, నార్త్ ఢిల్లీ