ఖానాపురం(నర్సంపేట): అడవులతోపా టు వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లకోసారి అటవీ జంతువుల గణన చేపడుతోంది. అందులో భాగంగా జిల్లాలో సోమవారం నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు అటవీ ప్రాంతాలపై పట్టున్న అధికారులు, స్వచ్ఛంధ సంస్థల బాధ్యులు రంగంలోకి దిగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 14వేల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉం ది. మొత్తం 16 బీట్లు ఉండగా తొమ్మిది బీట్ల పరి« దిలోనే అడవులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
వన్యప్రాణుల వివరాలు సేకరించడానికి ఫారెస్ట్ అధికారులతోపాటు స్వచ్ఛంధ సంస్థల బాధ్యులను కలుపుకుని తొమ్మిది బృందాలు రంగంలోకి దిగనున్నాయి. ఇందులో ఎఫ్‌ఆర్వో, సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్లతోపాటు స్వచ్ఛంధ సంస్థల బాధ్యులు వలంటీర్లుగా పాల్గొంటారు. ఈ బృందాలు శాఖాహార, మాంసాహార జంతువుల గణన, అవి నివసించే స్థలాల గుర్తింపు కార్యక్రమాన్ని రెండు విడతలుగా ఈనెల 29 వరకు చేపట్టనున్నారు. అలాగే వృక్ష జాతులు, మానవులు సంచరిస్తున్న ప్రాంతాల వివరాలు సైతం సేకరించనున్నట్లు ఫారెస్ట్ అధికారుల ద్వారా తెలిసింది.
ప్రత్యేక యాప్ వినియోగం
అటవీ జంతుల గణన కోసం ప్రత్యేక విధానాన్ని వినియోగించనున్నారు. ముఖ్యంగా పులుల గుర్తింపునకు ఎంస్ట్రైప్స్(మానిటరింగ్ సిస్టం ఫర్ టైగర్స్–ఇంటెన్సివ్ పెట్రోలింగ్ అండ్ ఎకోలాజికల్ స్టాటస్) యాప్‌ను ఉపయోగించనున్నారు. దీని ద్వారా పులుల సంఖ్య కచ్చితంగా తెలిసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పులుల కాలి అడుగుల ఆనవాళ్లు, వాటి మూత్ర విసర్ణ అవశేషాలు, వెంట్రుకల ఆధారంగా గుర్తించనున్నట్లు సమాచారం.
పులుల సంఖ్య తెలుసుకోవడానికి తొమ్మిది బీట్ల పరిధిలో మూడు సీసీ కెమెరాలను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. తొలి మూడు రోజుల్లో మాంసాహార జంతువులు, ఆ తర్వాత మూడు రోజులు శాఖాహార జంతుల వివరాలు సేకరించనున్నారు. 22, 23, 24 తేదీ ల్లో క్రూర మృగాలు, మాంసాహార జంతువుల పై, 27, 28, 29 తేదీల్లో శాఖాహార జంతువులు, వాటి నివాసాలు, వృక్ష జాతుల గణన చేపడతారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం
ప్రభుత్వ ఆదేశానుసారంగా సోమవారం నుంచి వన్యప్రాణుల గణన చేపట్టనున్నాం. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశాం. గణన రెండు దఫాలుగా సాగుతుంది. ఇందులో ఫారెస్ట్ సిబ్బందితోపాటు స్వచ్ఛంధ సంస్థల బాధ్యులు పాల్గొంటారు. ఆరు రోజుల పాటు లెక్కింపు ప్రక్రియ చేపట్టి వివరాలను ప్రత్యేక వెబ్‌సైట్‌లో పొందుపరుస్తాం. – పురుషోత్తం, డీఎఫ్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment