సాక్షి, హైదరాబాద్: అరుదైన వన్యప్రాణులను ఈశాన్య రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి పాతబస్తీ కేంద్రంగా అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరు అన్నదమ్ముల గుట్టును దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. నిందితుడి నుంచి 4 స్లోలోరిస్‌లతో పాటు నక్షత్ర తాబేలు, మరో అరుదైన తాబేలును స్వాధీనం చేసుకున్నామని అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి ఆదివారం వెల్లడించారు. కేసును అధీనంలోకి తీసుకున్న అటవీ శాఖ అధికారులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. పాతబస్తీలోని బార్కస్‌కు చెందిన అన్నదమ్ములు సాలెహ్ బిన్ మహ్మద్ బదామ్, అలీ బిన్ మహ్మద్ బదామ్ మందుల షాపు నిర్వహిస్తున్నారు. ఈ ఆదాయం చాలకపోవడంతో అదనపు రాబడి మార్గాలు అన్వేషించారు. ఏడాది క్రితం పావురాల అమ్మకం మొదలెట్టారు. ఆపై కొన్ని రకాలైన పిల్లులు, కోళ్లను విక్రయించేవారు. వీరి వద్దకు వచ్చే కస్టమర్లలో అనేకులు అరుదైన జంతువులు కావాలని కోరడంతో వీరి దృష్టి వాటిపై పడింది.
ఈశాన్య రాష్ట్రాల నుంచి తెచ్చి..
కొందరు కస్టమర్లలో ఉన్న మూఢనమ్మకాల నేపథ్యంలో కొన్ని అరుదైన జంతువులకు నగరంలో డిమాండ్ ఉందని అలీ బిన్ గుర్తించాడు. ఈశాన్య రాష్ట్రాల్లో దొరికే వాటిని అక్రమ మార్గంలో తెచ్చి విక్రయించడం ద్వారా తేలిగ్గా భారీ మొత్తం సంపాదించవచ్చని అన్నదమ్ములు పథకం వేశారు. అలీ బిన్ ఈశాన్య రాష్ట్రాల్లో జంతువులను స్మగ్లింగ్ చేసే వారిని సంప్రదించాడు. వారి సహకారం తో ప్రైవేట్ వాహ నాల్లో వాటిని సిటీకి తీసుకు వస్తున్నాడు. వీటిని కొన్నాళ్ల పాటు తమ ‘కబూతర్ ఖానా’లోనే ఉంచి ఆపై కోరిన వారికి మూడు రెట్ల ధరకు అమ్ముతున్నారు. వీరి దందాపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో సిబ్బంది నిందితుల ఇంటిపై దాడి చేశారు. సాలెహ్ బిన్‌ను అదుపులోకి తీసుకుని నాలుగు స్లో లోరిస్‌లు, స్టార్ తాబేలు, డొప్ప తాబేలును స్వాధీ నం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం జంతువులతో సహా నిందితుడిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. పరారీలో ఉన్న అలీ బిన్ చిక్కితే ఈ కేసులో కీలకాంశాలు వెలుగులోకి రావచ్చు.
స్లో లోరిస్.. రూ.50 వేలు
లోరిస్‌కు చెందిన కొన్ని అవయవాలను సంప్రదాయ వైద్యంలో ఔషధాల తయారీకి వాడుతున్నారు. దీని మాంసం తింటే పటుత్వం పెరుగుతుందని, సజీవంగా తమ ప్రాంగణంలో పాతి పెడితే అదృష్టం పడుతుందనే మూఢనమ్మకాలున్నాయి.
►క్షీరదాల జాతికి చెందిన స్లో లోరిస్ జంతువు నిశాచరి. నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో కూడా ఇది లేదు. ఇవి ఈశాన్య రాష్ట్రాలతోపాటు బంగ్లాదేశ్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌లో ఉంటాయి.
►శాకాహారి అయిన స్లో లోరిస్ చెట్లపై నివసిస్తూ బొప్పాయి సహా కొన్ని రకాలైన పళ్లను తింటుంది. దీనికి ఆహారం నిమిత్తం రోజుకు రూ.300 వరకు వెచ్చిస్తున్నారు.
►దీనిని రూ.15 వేలకు ఖరీదు చేసి రూ.50 వేలకు అలీ సోదరులు విక్రయిస్తున్నారు.
నక్షత్ర తాబేలు రూ.40 వేలు..
స్టార్ టార్టాయిస్ ఇంట్లో ఉంచుకున్నా, పెంచుకున్నా భవిష్యత్తు బాగుంటుందని, అదృష్టం వరిస్తుందనే నమ్మకం ఉంది. మెత్తడి డొప్ప తాబేలు ఇంట్లో ఉంటే అదృష్టం వరిస్తుందని నమ్మకం పలువురిలో ఉంది.
►స్టార్ టార్టాయిస్‌గా పిలిచే నక్షత్ర తాబేళ్లు పొడి ప్రాంతాలు, కొన్ని అడవుల్లో జీవిస్తుంటాయి. ఇవి భారీ సంఖ్యలో విదేశాలకు స్మగ్లింగ్ అవుతుంటాయి.
►సుదీర్ఘ సమయం నీటి అడుగున ఉండగలిగే మెత్తడి డొప్ప తాబేలు దేశంలోని గంగ, సింధు, మహానదుల్లో మాత్రమే దొరుకుతుంది.
►నక్షత్ర తాబేళ్లను రూ.10 వేలకు కొని.. రూ.40 వేలకు, మెత్తని డొప్పతో ఉండే తాబేళ్లను రూ.5 వేలకు ఖరీదు చేసి రూ.20 వేలకు విక్రయిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment