ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : ముక్కపచ్చలారని మూడేళ్ల బాలుడిపై చిరుతపులి పంజా విసిరింది. అతి దారుణంగా హతమార్చింది. తల్లితో పాటు వంటగదిలో ఉన్న వసీం అక్రమ్ (3)ను ఇంట్లోకి ప్రవేశించిన చిరుత ఆమె కళ్లెదుటే పిల్లాడ్ని నోట కరుచుకుపోయింది. ఇంటి సమీపంలోని దట్టమైన అడవిలోకి తీసుకెళ్లి విగతజీవుడిని చేసింది. అటవీశాఖ సిబ్బంది చిరుతను వలపన్ని పట్టుకుందామని చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. బాలుడు అదృశ్యమైన 15 గంటల తర్వాత అతని శవం మాత్రం కనుగొన్నారు. తల, మొండెం వేరుచేసి ఉన్న చిన్నారి శవం చూసి ఆ గ్రామమంతా కన్నీరుమున్నీరైంది. ఈ ఘటన రియాజీలోని మహోర్ ప్రాంతంలో మంగళవారం చోటుచేసుకుంది. అలసత్వం ప్రదర్శించిన అటవీ సిబ్బందిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
బాలుడిని చంపిన చిరుత ఆచూకీ ఈ ఉదయం లభించిందనీ, కానీ దాన్ని పట్టుకోలేకపోయామని జమ్మూ ప్రాంతీయ వన్యప్రాణి అధికారి తాహిర్ అహ్మద్ షాల్ తెలిపారు. క్రూర జంతువుల దాడుల నుంచి రక్షించుకునేందుకు ప్రజల్ని అప్రమత్తం చేశామని అన్నారు. అయితే, వాటి (వన్య ప్రాణులు) ఆవాసమైన అడవిలోకి ప్రవేశించడమే ఈ అనర్థానికి మూలమని వ్యాఖ్యానించారు.
కాగా, గడచిన రెండు నెలల్లో ఇది మూడో ఘటన. డిసెంబర్ 7న ఎనిమిదేళ్ల బాలుడిని ఓ చిరుత పొట్టనబెట్టుకుంది. గతవారం యోగా చేసుకుంటున్న ఓ బౌద్ధ గురువుపై చిరుత దాడి చేసి హతమార్చింది. అభివృద్ధి పేరుతో ఇష్టారాజ్యంగా అడవులను నరికివేయడంతోనే ఈ దుస్థితి దాపురించిందనీ, అడవుల్లో ఉండాల్సిన వన్యప్రాణులు ప్రజల ప్రాణాలను తీసేవి కావని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment