నిజాంసాగర్, న్యూస్‌లైన్: జిల్లాలో అటవీ ప్రాంతం విస్తరించిన ప్రాంతాల్లో చిరుతల సంచారంతో గ్రామీణులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. చిరుత పులులు వరుసగా పంజా విసురుతుండటంతో మూగజీవాలు వాటికి బలి అవుతున్నాయి. వన్యప్రాణుల దాడులతో ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లుతోంది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వపరంగా ఎలాంటి సాయం అందడం లేదు. ఇటీవల జిల్లాలో చిరుతపులులు వరుస దాడులుచేసి గొర్రెలు, మేకలు, పశువులు, గేదెలు, కుక్కపిల్లలను హతమార్చాయి. ఏ పొద నుంచి, ఎక్కడి నుంచి వచ్చి చిరుతలు దాడి చేస్తాయోనని రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారులు భయాందోళన చెందుతున్నారు.
అడవుల నుంచి జనారణ్యంలోకి...
దట్టమైన అడవులకు నిలయంగా ఉన్న జిల్లాలో వన్యప్రాణు లు అధికంగా ఉన్నాయి. చిరుత పులలతో పాటు ఎలుగుబంట్లు, అడవి పందులు, నీల్‌గాయ్, నక్కలు, కొండగొర్రె లు, నెమల్లు వంటి వన్యప్రాణులు వందల సంఖ్యలో ఉన్నా యి. దట్టమైన గుట్టలు, వృక్షాలతో ఉన్న అడవులు అంతరిస్తుండటంతో వన్యప్రాణులకు ఆహారం కరువవుతోంది. తాగునీరు, పచ్చిగడ్డి కోసం వన్యప్రాణులు జనారణ్యం బాటపడుతున్నాయి. అడవుల్లో సంచరించాల్సిన వన్యప్రాణులు జనారణ్యంలోకి వచ్చి మూగజీవాలను పొట్టనబెట్టుకుంటున్నాయి. పగలు, రాత్రి అన్న తేడాలేకుండా గ్రామీణ ప్రజలకు వన్యప్రాణుల బెడద పట్టుకుంది. ఆరుగాల శ్రమించి పండిస్తున్న పంట చేనుల కాపల కోసం వెళ్లడానికి రైతులు జంకుతున్నారు. మేత కోసం వెళ్తున్న మూగజీవాలపైనా చిరుత వరుస దాడులు చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లావ్యాప్తంగా పలు గ్రామాల్లో చిరుత పులులు పంజా విసురుతున్నా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అలాగే వన్యప్రాణుల వల్ల పంట నష్టంతో పాటు మూగజీవాలు బలవుతున్నా రైతులకు మాత్రం అటవీ శాఖ అధికారులు పరిహారం చెల్లించడం లేదని బాధితులు వాపోతున్నారు. గ్రామాల్లోకి వస్తున్న వన్యప్రాణుల దాడి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా అటవీ శాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
వరుస సంఘటనలు..
- జిల్లాలోని నిజాంసాగర్, ఎల్లారెడ్డి, గాంధారి, లింగంపేట, నాగిరెడ్డిపేట, బిచ్కుంద, పిట్లం, భీంగల్, ఇందల్వాయి, మాచారెడ్డి, భిక్కనూర్, బాన్సువాడ, వర్ని, సిరికొండ మండలాల్లో చిరుత సంచారం నెలకొంది.
- బిచ్కుంద మండలం పెద్దకొడప్‌గల్ గ్రామ శివారులో ఏప్రిల్ నెల 2వ తే దీన పంట చేను కాపలా కోసం వెళ్లిన కుర్మబాలయ్య అనే రైతుపై చిరుత దాడి చేసి హతమార్చింది.
- గాంధారి మండలం ఇటీవల మాతు సంగెం గ్రామంలో ఆరునెలల కిందట గొర్రెల మందపైన చిరుత దాడి చేసి 8 జీవాలను పొట్టన బెట్టుకుంది.
- ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ గ్రామంలో గతంలో అవుల మందపైన నాలుగైదు సార్లు చిరుత దాడులు జరిగాయి.
- నిజాంసాగర్ ప్రాజెక్టు హెడ్‌స్లూయిస్ వద్ద సబ్‌స్టేషన్‌లోకి చిరుత రావడంతో సిబ్బంది బిక్కుబిక్కుమంటూ గడిపారు.
- ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామ శివారులోని అటవీ ప్రాంతానికి మేత కోసం వెళ్లిన పశువులపై చిరుత దాడి చేయడంతో ఒక పశువు మృత్యువాతకు గురైంది.
- నిజాంసాగర్ మండలం హసన్‌పల్లి గ్రామానికి చెందిన కుర్మబాలయ్య మేకల మందపై చిరుత దాడి చేసి రెండు మేకలను హతమార్చింది.
- తాజాగా బిచ్కుంద మండలం వాజిద్‌నగర్ గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తి మేకల మందపై ఆదివారం చిరుత దాడిచేసి మేకను హతమార్చింది.