Nizam Sagar
-
నిజాంసాగర్ కెనాల్ కు గండి
-
తన ప్రసంగాలతో స్ఫూర్తిని నింపే వ్యక్తే.. చివరికి ఇలా..
సాక్షి, నిజామాబాద్: కాసాల జైపాల్‌రెడ్డి.. అతడో మోటివేటర్.. ఒత్తిడితో కుంగిపోయి, సమస్యలతో పో రాడలేక జీవితంపై విరక్తిచెందిన ఎందరికో తన ప్రసంగాలతో స్ఫూర్తిని నింపిన వ్యక్తిత్వ వికాస నిపుణుడు.. ‘‘ధైర్యముంటే ఈ ధరణిపైన సాధించలేని దంటూ ఏదీ లేదు’’ అంటూ ధైర్యాన్ని నూరిపోసిన ఆయన.. చివరికి తన అనారోగ్య సమస్యకు పరిష్కారం కనుగొనలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన నిజాంసాగర్‌లో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు.. పిట్లం మండలం అల్లాపూ ర్కు చెందిన జైపాల్‌రెడ్డి(34) ఎంసీఏ, ఎంఏ ఇంగ్లిష్, ఎమ్మెస్సీ సైకాలజీ చదివారు. ఉన్నత విద్యాభ్యాసం చేసిన ఆయన వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా మారారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మోటివేషనల్ క్లాసులతో వేలాది మందికి వ్యక్తిత్వ వికాసాన్ని అందించారు. పరీక్షలంటే భయం పోగొట్టారు. సుమారుగా 8 వేల సదస్సులలో పాల్గొని ఎందరిలోనో స్ఫూర్తిని నింపారు. ఆత్మహత్యాయత్నం నుంచి.. జైపాల్‌రెడ్డి గతంలో ఓసారి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. 2004లో అనారోగ్య సమస్యతో మానసికంగా కుంగిపోయిన ఆయన బాసర చేరుకున్నారు. బలవన్మరణానికి పాల్పడాలనుకున్న సమయంలో స్వామి వివేకానంద సూక్తులు తన మనసులో మెదిలాయని, దీంతో బతకాలని నిర్ణయించుకున్నానని ఆయన పలు సందర్భాలలో పేర్కొన్నారు. చదవండి: కారు ప్రమాదం.. బీజేపీ నేత కొడుకుతో సహా ఏడుగురు వైద్య విద్యార్థులు మృతి ఆరోగ్యం బాగాలేక.. జైపాల్‌రెడ్డి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగా గుల్దస్తా సమీపంలో నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సోమవారం ఉదయం ఫేస్బుక్లో పోస్టు చేశారు. పోస్టును చూసిన ఆయన స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ప్రాజెక్టు వద్దకు వెళ్లిన పోలీసులకు జైపాల్‌రెడ్డి బైక్, చెప్పులు, ఫోన్ కనిపించాయి. జాలరి సాయంతో ప్రాజెక్టులో గాలించగా మృతదేహం లభించింది. పేద కుటుంబం కావడం, అనారోగ్యం తీవ్రం కావడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. చదవండి: విష సర్పాన్ని ముద్దాడి.. మృత్యువుతో పోరాటం! -
‘సాగర్’ తీరాన చిరుత సంచారం.. కారుకు అడ్డం తిరిగి..
-
అనుమతి లేకుండా షాదీ!
సాక్షి, కామారెడ్డి: ఓవైపు కరోనా మహమ్మారి కోరలు చాస్తున్నా.. కొందరు దాన్ని లైట్ తీసుకుంటున్నారు. సర్కారుకు సహకరించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 16వ తేదీన పట్టణంలోని పాత బస్టాండ్ గోదాం రోడ్ ప్రాంతంలో ఓ వివాహం జరిగినట్లు అధికారులకు శనివారం సమాచారం అందింది. లాక్డౌన్ అమల్లో ఉన్నా నిజాంసాగర్ మండలం మహమ్మద్‌నగర్, బాన్సువాడల నుంచి పలువురు వివాహ వేడుకలో పాల్గొన్నట్లు తెలిసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు గోదాం రోడ్లో విచారణ చేపట్టారు. (పెళ్లి పెద్దలు పది మందే..! ) అయితే అధికారుల అనుమతి తీసుకోకుండానే నిఖా జరిపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కుటుంబం.. విచారణకు సహకరించడం లేదని తెలుస్తోంది. వివాహానికి 12 మందికి పైగా వచ్చారని ఒకరు, ముగ్గురమే ఉన్నామని మరొకరు, తమ మత పెద్ద లేకపోవడంతో అసలు పెళ్లే జరగలేదని ఇంకొకరు సమాధానం ఇచ్చారని సమాచారం. ఇలా పొంతనలేని సమాధానాలు ఇచ్చినవారిలో బాన్సువాడ డివిజన్‌కు చెందిన ఓ పీఎంపీ, మరో ల్యాబ్ టెక్నీషియన్ ఉండటం గమనార్హం. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆ ముగ్గురినీ భిక్కనూరులోని క్వారంటైన్ సెంటర్‌కు తరలించామని వైద్యాధికారులు తెలిపారు. విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు. -
వేర్వేరు చోట్ల ఐదుగురు ఆత్మహత్య
నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం ఐదుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. వారిలో ఒకరు విద్యార్థి కాగా ఇద్దరు యువకులు, ఓ వృద్ధుడు, మరో వివాహిత కూడా ఉన్నారు. వేర్వేరు కారణాలతో వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు వారు దర్యాప్తు చేస్తున్నామన్నారు. సాక్షి, నిజాంసాగర్(నిజామాబాద్) : మండలంలోని అచ్చంపేట మోడల్ పాఠశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న గాండ్ల మౌనిక(17) అనే విద్యార్థిని సోమవారం రాత్రి ఇంట్లోని దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గాండ్ల నాగభూషణం రెండో కుమార్తె అయిన మౌనిక అచ్చంపేట ఇంటర్ చదువుతోంది. కాగా గత 15రోజులుగా మౌనికకు ఆరోగ్యం సహకరించకపోవడంతో పాటు కడుపునొప్పితో బాధపడుతోంది. బాన్సువాడ, పిట్లంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించినా కడుపునొప్పి తగ్గక మనస్థాపానికి గురైన జీవితంపై విరక్తి చెందింది. సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి నాగభూషణం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటర్ విద్యార్థిని మృతిపై మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకులు, టీచర్లు, విద్యార్థులు నివాళి అర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. తండ్రి మందలించాడని ఒకరు.. కామారెడ్డి క్రైం: తండ్రి మందలించాడని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలోని వాంబే కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. పట్టణ ఎస్ఐ గోవింద్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కాలనీకి చెందిన మహ్మద్ అబ్దుల్లా(23) స్థానికంగా టైలరింగ్ షాపులో పని చేస్తాడు. కొద్దిరోజులుగా అతడు పనికి వెళ్లడం లేదు. దీంతో అతడి తండ్రి పనికి వెళ్లాలని మందలించాడు. మనస్తాపం చెందిన అబ్దుల్లా ఇంట్లో సిలింగ్రాడ్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనాస్థలాన్ని పట్టణ పోలీసులు పరిశీలించి శవాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడికి భార్య, మూడు నెలల కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. చౌట్పల్లి శివారులో యువకుడు కమ్మర్పల్లి(బాల్కొండ): మండలంలోని చౌట్పల్లి శివారులో గల లక్ష్మాపూర్ అటవీ ప్రాంతంలో ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ ఆసిఫ్ మహ్మద్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చౌట్పల్లికి చెందిన వేల్పూర్ రవి(30) ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 12 ఏళ్ల క్రితం పవిత్ర అనే మహిళతో వివాహం కాగా ముగ్గురు ఆడ పిల్లలు సంతానం. వీరి సంసారంలో గొడవలు ప్రారంభమై భార్యభర్తలు తరచూ గొడవపడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం భార్యభర్తలు గొడవ పడ్డారు. దీంతో రవి బయటకి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. మంగళవారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్తున్న గ్రామస్తులకు లక్ష్మాపూర్ అటవీ ప్రాంతంలో కాలిపోయిన మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం అందించగా, ఎస్ఐ ఆసిఫ్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి వేల్పూర్ రవిగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాలిన గాయాలుండడంతో రవిది ఆత్మహత్యనా, హత్యనా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో క్లూస్ టీం సభ్యుల బృందాన్ని ఘటన స్థలానికి రప్పించారు. క్లూస్ టీం సభ్యులు వివరాలను సేకరించారు. మద్యం సేవించి జీవితంపై విరక్తి చెంది ఒంటిపై కిరోసిన్ లేదా పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆర్మూర్ ఏసీపీ అందె రాములు, భీమ్‌గల్ సీఐ సైదయ్య ఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. భర్తతో గొడవపడి వివాహిత.. నస్రుల్లాబాద్: మండలంలోని అంకోల్ గ్రామానికి చెందిన కుర్మ సాయవ్వ సోమవారం ఆత్మహత్యాయత్నం చేసిందని ఎస్ఐ సందీప్ తెలిపారు. సాయవ్వ తన భర్తతో గొడవ పడిందని దీంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుందన్నారు. వెంటనే బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారని, అక్కడ చికిత్స పొందుతూ మరణించిందన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశామన్నారు. సాయవ్వకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో ఓ వృద్ధుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు మంగళవారం రైల్వే పోలీసులు తెలిపారు. నగరంలోని రాజీవ్నగర్కాలనీకు చెందిన సదానంద్‌గౌడ్(60) వృతిరీత్యా కల్లు వ్యాపారం చేస్తుంటాడు. సోమవారం మధ్యాహ్నం సదానంద్‌గౌడ్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి 9 గంటలకు రైల్వే పోలీసులకు రైలు పట్టాలపై ఓ మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడి జేబులో ఉన్న డైరీలో ఫోన్నంబర్లకు ఫోన్ చేయగా అతడి చిరునామా తెలిసింది. వెంటనే మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసులు విషయం తెలిపారు. కుటుంబ సభ్యులు రోదిస్తూ ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి పోస్టుమార్టం గదికి తరలించారు. మంగళవారం ఉదయం మృతుడి భార్య శాంత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సదానంద్‌గౌడ్ ఆత్మహత్యకు పాల్పడేంత ఇబ్బందులు ఏమి లేవని, ఆరోగ్య సమస్యలు కూడా లేవని కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులకు తెలిపారు. దీనిపై విచారించాలని వారు పోలీసులను కోరారు. -
ప్రాజెక్టులకు వేసవి గండం..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఎండలు పుంజుకోకమందే గోదావరి, కృష్ణా బేసిన్‌లోని రిజర్వాయర్లలో నీటి మట్టాలు పడిపోతున్నాయి. కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీటి మట్టాలు క్రమేపీ అడుగంటుతుండగా, గోదావరిలో ఇప్పటికే ప్రాజెక్టులన్నీ వట్టిపోయాయి. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలతో మరో ఐదు నెలల పాటు నెట్టుకురావాల్సిన పరిస్థితుల నేపథ్యంలో మున్ముందు నీటి ఎద్దడి ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే గోదావరి బేసిన్‌లోని సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టులు ఖాళీ అయ్యాయి. నిజాంసాగర్‌లో 17.8 టీఎంసీల నీటి నిల్వలకు గాను ఇప్పుడు అక్కడంతా బురదే కనిపిస్తోంది. కనీసం పశువులు తాగేందుకు నీరు సైతం లేకపోవడంతో ఆ ప్రాంతమంతా మైదానంలా కనిపిస్తోంది. గతేడాదిలో కనిష్టంగా 5.91 టీఎంసీల నిల్వలుండగా ఈ ఏడాది కేవలం 0.65 టీఎంసీలే ఉండటం, పరీవాహకంలో నీటి కష్టాలను తెచ్చిపెడుతోంది. ఇక సింగూరులోనూ దారుణ పరిస్థితులున్నాయి. ఇక్కడ 29.31 టీఎంసీల నీటి నిల్వలకు గానూ కేవలం 1.17 టీఎంసీల నిల్వలున్నాయి. గత ఏడాదితో పోలిస్తే 9 టీఎంసీల మేర నిల్వలు తక్కువగా ఉండటంతో ఈ ప్రభావం సంగారెడ్డి, మెదక్ జిల్లాల తాగునీటి అవసరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇక ఎస్సారెస్పీ పరిధిలో రబీ అవసరాలకు తాగునీటిని విడుదల చేయడంతో అక్కడ ఉండాల్సిన 90 టీఎంసీల నిల్వలకు గాను ప్రస్తుతం 13 టీఎంసీల నిల్వలే ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం రబీ అవసరాల కోసం 6,805 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మట్టం మరింత తగ్గేలా ఉంది. ఎల్లంపల్లి రిజర్వాయర్ నీటి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 11 టీఎంసీలే ఉండగా, ఇక్కడి నుంచి నిత్యం 180 క్యూసెక్కులు తాగునీటికి, 1,422 క్యూసెక్కులు సాగునీటికి వినియోగిస్తున్నారు. శ్రీశైలంలో వేగంగా పడిపోతున్న మట్టం కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. శ్రీశైలంలో 885 అడుగులకు గాను, కనీస నీటిమట్టం 834 అడుగులకు దిగువన 826 అడుగుల్లో 45.76 టీఎంసీల నీరు ఉంది. ఇక్కడి నుంచి వెయ్యి క్యూసెక్కుల మేర నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు వినియోగించుకుంటున్నాయి.ఇప్పటికే 800 అడుగుల దిగువ వరకు నీటిని తీసుకోవాలని ఇటీవలి కృష్ణా బోర్డు సమావేశంలో నిర్ణయించారు. 18 టీఎంసీల లభ్యత నీటిని ఇరు రాష్ట్రాలు వాడుకుంటే త్వరలోనే ప్రాజెక్టు ఖాళీ అయ్యే పరిస్థితులున్నాయి. ఇక సాగర్‌లో ప్రస్తుతం 590 అడుగులకు గానూ,520.8 అడుగుల మట్టంలో 150 టీఎంసీల నీరుంది. కనీస నీటి మట్టం 510 అడుగులకు పైన వినియోగించుకునే నీరు కేవలం 15 టీఎంసీలే. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాలకు గానూ కనీస నీటిమట్టం 510 అడుగులకు దిగువన 505 అడుగుల వరకు వెళ్లి మొత్తంగా 33.71 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించుకున్నాయి. ప్రస్తుత నీటితో మూడు నెలల అవసరాలు తీరినా, జూన్ నుంచి నీటి కష్టాలు తప్పవని నీటి పారుదల వర్గాలే చెబుతున్నాయి. -
‘సాగర్’ నీటిచౌర్యం
‘సాగర్’ నీరు చౌర్యానికి గురవుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలోని రైతులు అక్రమంగా మోటార్లను ఏర్పాటు చేసుకుని సాగర్ నీటిని తరలించుకుంటున్నారు. ఈ నీటితో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సుమారు 1500లకు పైగా ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. దీంతో మన జిల్లాలో రైతులు సాగుచేస్తున్న చివరి ఆయకట్టు పంటలకు సాగు నీరందని పరిస్థితి నెలకొంది. మండుతున్న ఎండలకు సాగర్ నీరు ఆవిరవడంతోపాటు నీటిచౌర్యంతో ప్రాజెక్టులో నీరు ఖాళీ అవుతోంది. నిజాంసాగర్(జుక్కల్) : కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి చౌర్యం సాగుతోంది. ఓ వైపు పూడిక.. మరోవైపు నీటిచౌర్యంతో రెండు పంటలకు అందాల్సిన ప్రాజెక్ట్ నీరు.. ఒక పంటకే ఖాళీ అవుతోంది. నిజాంల కాలంలో మంజీర నదిపై 30 టీఎంసీల సామర్థ్యం తో నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మించారు. అయితే ప్రాజెక్టులో పూడిక కారణంగా ప్రస్తుతం 17.8 టీఎంసీల సామర్థ్యానికి పడిపోయింది. నిజాంసాగర్ ప్రాజెక్టు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిర్మించినప్పటికీ.. ఉమ్మడి మెదక్ జిల్లాలో నీరు నిల్వ ఉంటుంది. నిజాంసాగర్ ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలోని పలు గ్రామాల్లో రైతులకు సాగుభూములున్నాయి. దీంతో అక్కడి రైతులు సాగర్ నీటిపై దృష్టి పెట్టారు. క్యాచ్మెంట్ ఏరియాలోని నీటిని తరలిస్తూ.. నాన్‌కమాండ్ ప్రాంతంలో బీడువారిన భూములను సాగులోకి తెస్తున్నారు. గత కొన్నేళ్లుగా నిజాంసాగర్ ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నారు. సాగర్ నీటితో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని పాపన్నపేట, శంకరంపేట, కల్హేర్ మండలాల్లోని పలు గ్రామాల రైతులు పంటలు సాగుచేస్తున్నారు. అక్రమంగా వ్యవసాయ పంపుసెట్లను బిగిస్తూ.. కిలోమీటర్ల మేర పైపులైన్లు ఏర్పాటు చేసుకుని నీటిని తరలిస్తున్నారు. సుమారు 1,500పైగా ఎకరాల్లో పంటలను సాగు చేస్తున్నారు. తరలిపోతున్న జలాలు.. నిజాంసాగర్ ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో అక్రమంగా మోటార్ల వినియోగంతో నిత్యం వందలాది క్యూసెక్కుల నీరు తరలిపోతుంది. మండుతున్న ఎండలకు తోడు నీటిచౌర్యంతో నిజాంసాగర్ ప్రాజెక్టులో రోజురోజుకు ప్రాజెక్ట్‌లో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. క్యాచ్మెంట్ ఏరియాలోని రైతులు రోజుకు 200 నుంచి 300 క్యూసెక్కుల వరకు నీటిని తరలిస్తున్నారు. వారు సాగుచేస్తున్న పంటలకు అక్రమంగా నీటిని తరలించడంతో సాగర్ చివరి ఆయకట్టు వరకు పంటలకు నీరందడం కష్టంగా మారింది. అక్రమ మోటార్లను తొలగిస్తాం.. నిజాంసాగర్ ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో అక్రమ మోటార్ల ఉంటే. వాటిని వెంటనే తొలగిస్తాం. నీటి చౌర్యానికి పాల్పడుతున్నట్లు మా దృష్టికి రాలేదు. విద్యుత్ మోటార్ల ద్వారా నీటిని వినియోగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – దత్తాత్రి, డిప్యూటీ ఈఈ -
కర్ణాటక ప్రాజెక్టులతో రాష్ట్రానికి నష్టమే!
శాసనమండలిలో మంత్రి హరీశ్‌రావు ► రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా కోర్టుల్లో కొట్లాడుతున్నామని వెల్లడి ► కాళేశ్వరం ద్వారా నిజాంసాగర్, ఎస్సారెస్పీకి నీళ్లిస్తామని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ బేసిన్లో ఎగువన కర్ణాటక కడుతున్న ఎత్తిపోతల ప్రాజెక్టులవల్ల దిగువ రాష్ట్రమైన తెలంగాణకు నష్టం జరుగుతుందని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. ఎగువన తమ వాటా నీటినే వినియోగిస్తున్నామంటూ, కర్ణాటక ఇష్టారీతిన ప్రాజెక్టులు కడుతోందని, దేనికింద ఎంత నీటిని వినియోగిస్తున్నది స్పష్టంగా తెలియడం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా కోర్టుల్లో కొట్లాడు తున్నామని, కేంద్ర జలసంఘం, కర్ణాటక ప్రభుత్వాలతో మాట్లాడుతున్నామని అన్నారు. అయితే కృష్ణా జలాలపై తుది తీర్పు గెజిట్ అయితే కృష్ణానదీ నిర్ణయ అమలు బోర్డు ఏర్పాటు జరుగుతుందని, అప్పుడే ఎగువ రాష్ట్రాల నీటి వినియోగంపై నియంత్రణ సాధ్యపడుతుందని తెలిపారు. ఈ అంశంపై గురువారం శాసన మండలిలలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. అప్పర్ కృష్ణాలో కర్ణాటకకు 150 టీఎంసీల కేటాయింపులున్నాయని, అక్కడ చేపట్టిన ఆధునీకరణతో మిగిలిన 21 టీఎంసీలతో ఐదు ఎత్తిపోతల పథకాలు చేపట్టిందన్నారు. అయితే ఈ నీటి వినియోగంపై వాస్తవాలు వెల్లడి కావాల్సి ఉందన్నారు. ఇక బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ వెలువరించిన తీర్పుతో దిగువ రాష్ట్రాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని, ఈ దృష్ట్యా దీనిపై కోర్టులు, కేంద్రం ముందు కొట్లాడుతున్నామని వెల్లడించారు. అయితే దీనిపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి మరింత లోతుగా చర్చించాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. దీనికి మంత్రి స్పందిస్తూ, మండలి చైర్మన్ అనుమతిస్తే ఒక రోజు కృష్ణాజలాలపై పూర్తి స్థాయిలో చర్చిద్దామని అన్నారు. నిజాంసాగర్, ఎస్సారెస్పీకి కాళేశ్వరం నీళ్లు నిజాంసాగర్, ఎస్సారెస్పీలకు నీటి కరువు ఏర్పడిన సమయంలో కాళేశ్వరం ద్వారా నీళ్లిచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి హరీశ్‌రావు సభ్యుడు భూపతిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు బదులిచ్చారు. కాళేశ్వరంలోని మల్లన్నసాగర్ ద్వారా నిజాంసాగర్‌కు నీళ్లిచ్చి అక్కడి రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామని, ఇక వరద కాల్వ ద్వారా కేవలం 30 మీటర్ల లిఫ్టుతో ఎస్సారెస్పీకి నీటిని రివర్సబుల్ పంపింగ్ చేస్తామన్నారు. ఈ ప్రతిపాదనను త్వరలోనే కేబినెట్ ఆమోదానికి పంపిస్తామన్నారు. నిజాంసాగర్ ఆధునీకరణ పనులకు రూ.954 కోట్లు కేటాయించామని తెలిపారు. కనీస వేతనాలు ఎక్కడ? రాములు నాయక్ హైదరాబాద్‌లోని చాలా పరిశ్రమల్లో ఇప్పటికీ కార్మికులకు కనీస వేతనాలు అందడం లేదని ఎమ్మెల్సీ రాములు నాయక్ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. స్త్రీ, పురుష వేతనాల్లోనూ తేడాలుం టున్నాయని తెలిపారు. దీనిపై కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పందిస్తూ, కనీస వేతనాలు అమలయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అమలు చేయని యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. ఈత వనాలు అభివృద్ధి చేయండి: షబ్బీర్ అలీ రాష్ట్రంలో ప్రత్యేక ప్రాంతాల్లో ఈత వనాలను అభివృద్ధి చేయాలని ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ప్రభుత్వానికి సూచించారు. చాలా చోట్ల ప్రైవేటు పట్టాదారులు ఈత చెట్లను నరికివేస్తున్నారని, దీనివల్ల భవిష్యత్తులో గీత కార్మికుల ఉపాధికి గండి పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఇక చాలా సొసైటీలకు లెసెన్సుల జారీ విషయంలో జాప్యం జరుగు తోందని మరో సభ్యుడు కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. దీనిపై ఎక్సైజ్ మంత్రి పద్మారావు స్పందిస్తూ, రిజిస్టర్ చేసుకున్న అన్ని సొసైటీలకు లైసెన్సులు జారీ చేస్తామన్నారు. -
నిజాం షుగర్ కోసం కవితకు ముడుపులు
-
నిజాం షుగర్ కోసం కవితకు ముడుపులు
కాంగ్రెస్ నేత మధు యాష్కీ సాక్షి, హైదరాబాద్: నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించకుండా ఉండేందుకు ప్రైవేటు షుగర్ ఫ్యాక్టరీ నుంచి ఎంపీ కవితకు ముడుపులు అందాయని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలితతో కలసి గాంధీభవన్‌లో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. నిజాం షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు వెంటనే చెల్లిస్తామని, 100 రోజుల్లో దానిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని హామీనిచ్చిన టీఆర్ఎస్ మోసం చేసిందన్నారు. గాయత్రీ షుగర్స్ నుంచి కవితకు ముడుపులు అందడం వల్లే నిజాం షుగర్స్‌ను తెరిపించడం సాధ్యంకాదని చెబుతున్నారని మధు యాష్కీ ఆరోపించారు. బతుకమ్మ పేరుతో రూ.15 కోట్లను ఖర్చు చేస్తున్న ప్రభుత్వం రైతుల సమస్యల్ని గాలికొదిలేసిందని విమర్శించారు. గతంలో తెలంగాణ జాగతి సంస్థ చేసిన అక్రమ వసూళ్లు, అవినీతిని ఆధారాలతో సహా బయటపెడ్తామన్నారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాబందుల సమితిగా మారిందన్నారు. నిజాం షుగర్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. -
నిజాంసాగర్ మెయిన్ కాలువకు గండి
జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువకు సోమవారం ఉదయం గండిపడింది. మాక్లూరు మండలం అమర్థ్ గ్రామం వద్ద గండి పడటంతో.. సోయా, వరి పంటు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి గండి పడ్డ ప్రాంతాన్ని సందర్శించారు. గండిని వెంటనే పూడ్చేందుకు చర్యలు చేపట్టాలని.. పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. -
నిజాంసాగర్‌కు కొనసాగుతున్న వరద
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో.. నిజాంసాగర్‌కు ఇన్‌ఫ్లో పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ 23 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1401 అడుగుల వరకు నీరు చేరింది. ఇన్ ఫ్లో 1,73 క్యూసెక్కులు ఉండటంతో.. ప్రాజెక్ట్ 23 గేట్ల ద్వారా అంతే మొత్తంలో నీటిని కిందకు వదులుతున్నారు. ఆదివారంతో పోల్చుకుంటే సోమవారం ఉదయం వరద ఉధృతి పెరిగిందని ప్రాజెక్ట్ డిప్యూటీ ఏఈ సురేష్‌బాబు తెలిపారు. -
భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ ఫుల్
-
ప్రాజెక్టులన్నీ ఫుల్
♦ భారీ వర్షాలతో మహోగ్రంగా గోదావరి, ఉపనదులు ♦ ఎస్సారెస్పీ, సింగూరు, నిజాంసాగర్ల గేట్లు ఎత్తివేత ♦ ఇంద్రావతి, ప్రాణహిత పరీవాహకంలోనూ వ రద ముప్పు ♦ తీర ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం ♦ కృష్ణా నదిలోనూ పెరిగిన ప్రవాహాలు.. ♦ శ్రీశెలానికి 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ♦ కరీంనగర్ జిల్లాలో తెగిన మిడ్‌మానేరు డ్యామ్ మట్టికట్ట ♦ పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్న మంత్రి హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి, కృష్ణా నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలకు తోడు భారీ వర్షాలతో చేరుతున్న నీటితో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి అయితే మహోగ్రరూపంతో పారుతోంది. ఈ బేసిన్‌లోని శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, నిజాంసాగర్, సింగూరు, లోయర్ మానేరు డ్యాం, కడెం ప్రాజెక్టులన్నీ నిండు కుండలుగా మారాయి. దీంతో ఆ ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. అటు కృష్ణా పరీవాహకంలో వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. ఆ నీటిని వచ్చింది వచ్చినట్లుగా వదిలేస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు 2 లక్షల క్యూసెక్కుల వరద చేరుతోంది. ప్రాజెక్టులోకి భారీగా నీరు రావడం, నదులన్నీ పొంగడంతో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. పరిస్థితిని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు స్వయం గా పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టుల పరిధిలో పర్యటిస్తూ అధికారులకు సూచనలు జారీచేస్తున్నారు. ఉప్పొంగిన గోదావరి మహారాష్ట్రతో పాటు రాష్ట్రంలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. శ్రీరాంసాగర్‌కు ఆదివారం కూడా 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద కొనసాగింది. శనివారమే ప్రాజెక్టు గేట్లను ఎత్తివేసిన అధికారులు.. వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువ ద్వారా 2 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టులో ఆదివారం సాయంత్రానికి 1090 అడుగుల వద్ద 84 టీఎంసీల నీటి నిల్వను కొనసాగిస్తున్నారు. ఇక మంజీరా నది కూడా ఉప్పొంగుతుండడంతో సింగూరు ప్రాజెక్టు గేట్లు పూర్తిగా ఎత్తేశారు. సింగూరుకు ఆదివారం ఉదయం లక్షా 20వేల క్యూసెక్కుల వరదరాగా.. సాయంత్రానికి అది 70 వేల క్యూసెక్కులకు తగ్గింది. ఔట్‌ఫ్లో 62 వేల క్యూసెక్కుల వరకు ఉంది. ఈ నీటితోపాటు హల్దివాగు, ఘనపురం ఆనకట్ట, పోచారం ప్రాజెక్టుల ద్వారా కలిపి నిజాం సాగర్ ప్రాజెక్టుకు 1.5 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.9 టీఎంసీలుకాగా.. సాయంత్రానికి 14 టీఎంసీలకు చేరింది. మరింత వరద వస్తుండటంతో ఆదివారం రాత్రి ప్రాజెక్టు 23 గేట్లను ఎత్తి 1.5 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. గత మూడేళ్లలో తొలిసారిగా ఈ మూడు ప్రాజెక్టులు నిండడం గమనార్హం. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో 4.49 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ నీళ్లన్నీ దిగువకు విడుదల చేస్తున్నారు. వీటికితోడు ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు నదులు ఉప్పొంగుతున్నాయి. దీంతో ప్రభుత్వం నదీ తీర ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసింది. ఇక ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి మట్టం ఆదివారం 21 అడుగులుగా నమోదైంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో.. నీటిమట్టం ప్రమాదకర స్థాయికి పెరగొచ్చ ని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు లోయ ర్ మానేరు డ్యామ్‌లోకి భారీగా వరద చేరుతోంది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 24 టీఎంసీలు కాగా.. ఆదివారం రాత్రి వరకు 14 టీఎంసీల నిల్వ ఉంది. శ్రీశైలానికి భారీ వరద మహారాష్ట్ర, కర్ణాటకల్లోని కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీగా వరద వస్తోంది. ఇప్పటికే ఆ ప్రాజెక్టులు నిండిపోవడంతో.. వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. దీంతో ఆదివారం జూరాల ప్రాజెక్టుకు 1.80 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు సామర్థ్యం 9.65 టీఎంసీలుకాగా.. 8.86 టీఎంసీల నిల్వను కొనసాగిస్తున్నారు. నెట్టెంపాడుకు 1,500 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాలువల ద్వారా మరో 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద మరింతగా పెరిగే అవకాశాలుండడంతో జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తి 1.98 లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. ఈ నీరంతా చేరుతుండడంతో ఆదివారం సాయంత్రానికి శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి నిల్వ 185.56 టీఎంసీలకు చేరింది. ఇదే స్థాయిలో వరద కొనసాగితే మరో రెండు రోజుల్లోనే రిజర్వాయర్ నిండిపోనుంది. వరద పెరిగే అవకాశముందన్న అంచనాల నేపథ్యంలో శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ప్రారంభించారు. ఎడమగట్టు, కుడిగట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ.. 68,645 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరంతా నాగార్జునసాగర్‌కు చేరుతోంది. ప్రస్తుతం సాగర్‌లో 141.91 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇది పూర్తిగా నిండాలంటే మరో 170.14 టీఎంసీలు అవసరం. నల్లగొండ జిల్లాలోని మూసీ రిజర్వాయర్‌కు ఆదివారం ఉదయం 11 వేల క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో మధ్యాహ్నానికి 25 వేల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో 5 గేట్లను ఎత్తి 11 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. మిడ్‌మానేరుకు గండి వరద నీటి ఉధృతికి కరీంనగర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న మిడ్ మానేరు జలాశయం స్పిల్‌వే మట్టికట్టకు గండిపడింది. అది ఉధృతమై ఆదివారం రాత్రి 20 మీటర్ల మేర తెగిపోయింది. దీంతో దిగువన ఉన్న చొక్కారావుపల్లె, యూస్వాడ గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆదివారం ఉదయమే మాన్వాడ, మల్లాపూర్ గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సిరిసిల్ల మండలం చీర్లవంచ గ్రామం నీట మునగడంతో 450 కుటుంబాలను ఖాళీ చేయించారు. మంత్రి కేటీఆర్ అక్కడికి చేరుకుని తెగిపోయిన కట్టను పరిశీలించారు. ఉన్నతాధికారులు ఆ ప్రాంతంలోనే ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఇక 4.25 టీఎంసీల నిల్వతో మధ్య మానేరు రిజర్వాయర్ నిండుకుండలా మారింది. స్వయంగా పర్యవేక్షిస్తున్న హరీశ్‌రావు ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు చేరుతుండడం, నీటి విడుదలతో పరీవాహక ప్రాంతాలకు ముప్పు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు స్వయంగా రంగంలోకి దిగి పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి, జిల్లాల అధికారులతోపాటు మహారాష్ట్ర అధికారులతోనూ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సమన్వయం చేస్తున్నారు. మిడ్‌మానేరు ప్రాజెక్టును హరీశ్‌రావు పరిశీలించారు. ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడి పరిస్థితి వివరించారు. మిడ్‌మానేరు నుంచి ఎల్ఎండీకి నీటిని వదులుతామని.. ఎల్ఎండీ నిండితే దిగువకు విడుదల చేస్తామని వివరించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద పరిస్థితి వివరాలు కూడా చెప్పారు. ఈ మేరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలని హరీశ్‌రావుకు సీఎం కేసీఆర్ సూచించారు. -
నిజాంసాగర్‌కు భారీగా వరద నీరు
నిజాంసాగర్ (నిజామాబాద్ జిల్లా) : ఎగువన కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టులోకి సుమారు 2 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 11 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తి సామర్ధ్యం 17 టీఎంసీలు. నిజాంసాగర్ ప్రాజెక్టు వద్దకు చేరుకున్న మంత్రి పోచారం, ఎమ్మెల్యేలు షిండే, రవీందర్‌రెడ్డిలు ప్రాజెక్టుకు సంబంధించిన 2 గేట్లను ఎత్తి నీటికి కిందకు వదిలారు. -
నిజాంసాగర్‌కు వరద నీరు
నిజామాబాద్ జిల్లా వరప్రదాయని నిజాంసాగర్‌కు ఈ ఏడాది తొలిసారి వరదనీరు వస్తోంది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో సుమారు 2000 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తుంది. సాయంత్రానికి ఇన్‌ఫ్లో 20 వేల క్యూసెక్కుల చేరే అవకాశం ఉంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17 టీఎంసీలు.ప్రస్తుతం ప్రాజెక్టులో 0.09 టీఎంసీల నీరు ఉంది. -
నువ్వా.. నేనా!
నిజాంసాగర్ శిఖంలో సాగుకు రైతుల పోటీ గొడవలకు కేంద్ర బిందువైన సరిహద్దు వివాదం ఏటా తప్పని పరస్పర దాడులు పట్టించుకోని అధికారులు కల్హేర్: నిజాంసాగర్ ప్రాజెక్టు శిఖం భూముల్లో పంటల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. సాగు విషయంలో పోటీ నెలకొనడంతో నువ్వా నేనా.. అన్నట్టుగా మారింది వ్యవహారం. రెండు జిల్లాల పరిధిలో శిఖం ఉండడంతో సరిహద్దు వివాదం నెలకొంది. ఏటా శిఖం సాగు విషయంలో రెండు జిల్లాల రైతులు పరస్పరం దాడులకు దిగుతున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు శిఖం క్యాచ్మెంట్ ఏరియా 38 వేల ఎకరాలకుపైగా ఉంది. కల్హేర్ మండలంలోని రాంరెడ్డిపేట, ఖానాపూర్(బి), దామర్‌చెరువు, పెద్దశంకరంపేట మండలం జుక్కల్, వీరోజీపల్లి, నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్, ఎల్లారెడ్డి మండలాల పరిధిలోని నిజాంసాగర్ ప్రాజెక్టు శిఖంలో పంటలు వేసేందుకు రైతులు ట్రాక్టర్లతో దున్నుతున్నారు. 30 నుంచి 40 మంది రైతులు ఒక్కో గ్రూప్‌గా ఏర్పడి సరిహద్దులు ఏర్పాటు చేసుకుంటున్నారు. సాగర్ పరీవాహకంలో వేలాది ట్రాక్టర్లతో నిత్యం దున్నుతున్నాయి. ఫలితంగా సరిహద్దు విషయంలో రైతుల మధ్య వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రైతులు పరస్పర దాడులకు దిగుతున్నారు. శిఖంలో పంటలు వేసేందుకు తరుచూ గొడవలు జరుగుతున్నాయి. సరిహద్దు జిల్లాల మధ్య.. నిజామాబాద్ జిల్లా ఆరేడు, ఆరేపల్లి, బ్రహ్మణ్‌పల్లి గ్రామాలకు చెందిన రైతులు, కల్హేర్ మండలం మహదేవుపల్లికి చెందిన రైతులు ఇటీవల ఘర్షణకు దిగి పరస్పరం దాడులు చేసుకున్న విషయం విదితమే. గొడవల కారణంగా పోలీసు కేసులు నమోదయ్యాయి. రాంరెడ్డిపేట, దామర్‌చెరువు గ్రామాలు, పెద్దశంకరంపేట, నిజాంసాగర్, ఎల్లారెడ్డి మండలాల్లో ఏదో ఒక చోట రైతులు గొడవలు, దాడులకు పాల్పడడం ఆనవాయితీగా మారింది. లాభదాయకం కావడంతో పెరిగిన పోటీ.. గత రెండేళ్లుగా ప్రాజెక్టులో నీరులేకపోవడంతో రైతులు శనగ, మొక్కజొన్న తదితర పంటలు వేసి సిరులు పండించారు. దీంతో సాగర్ శిఖంలో పంటలు సాగు చేసేందుకు రైతులు పోటీపడడంతో ఈ భూమి కోసం డిమాండు పెరిగింది. సరిహద్దులు ఏర్పాటు చేసుకునేందుకు రైతులు గొడవలు, దాడులకు దిగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. శిఖంలో గొడవలు జరగకుండా నియంత్రించాలని రైతులు అధికారులను కోరుతున్నారు. -
ప్రాజెక్టు ఎండినా.. వరప్రదాయినే..
ఎల్లారెడ్డి/నిజాంసాగర్: కాలం కలిసి రాని రైతన్నను నిజాంసాగర్ శిఖం భూములు ఆదుకుంటున్నాయి. ప్రాజెక్టులో నీరు లేక నేల తేలితే... నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితుల్లో ఆ భూముల్లోనే సాగు చేసుకుంటున్నారు నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన రైతులు. వాస్తవానికి ప్రాజెక్టు శిఖం భూముల్లో సాగు చట్టరీత్యానేరమే అయినప్పటికీ.. వర్షాభావ పరిస్థితుల్లో అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించడంతో రెండు జిల్లాల పరిధిలోని ప్రాజెక్టు ప్రాంత రైతులకు బంగారు పంటలు పండుతున్నాయి. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల్లో మంజీర నది పూర్తిగా ఎండిపోయింది. అక్కడక్కడ మినహా నీటి చుక్క కనిపించని పరిస్థితి. దీనిపై నిర్మించిన నిజాంసాగర్ అయితే పూర్తిగా అడుగంటి పోయింది. సింగితం ప్రాజెక్టులోనూ చుక్క నీరు లేదు. నిజామాబాద్, మెదక్ జిల్లాలకు వరప్రదాయిని అయిన నిజాంసాగర్‌లో నీరు లేక పోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు. తమ పట్టాభూములు ఈ ఏడాది పక్కన పెట్టి శిఖం భూముల వైపు దృష్టి మరల్చారు. సారవంతమైన ఒడ్రుమట్టితో నిండి ఉన్న వేలాది ఎకరాల ఈ శిఖం భూముల్లో హలాలు నడిపి.. ఆరు తడి పంటలు పండిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండల శివారు నిజాంసాగర్ బ్యాక్‌వాటర్ భూముల్లో రుద్రారం, మల్కాపూర్, అల్మాజిపూర్, మత్తమాల, ఎర్రారం, సోమార్పేట, పిప్పిర్యాగడితండా గ్రామాలతో పాటు మెదక్ జిల్లా బాచెపల్లి, కాంట్రపల్లి, కల్షేర్ మసానిపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఈ భూముల్లో సాగు చేస్తున్నారు. నీరు ఎక్కువగా అవసరం లేదని ఆరు తడి పంటలైన మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, శనగ పంటలు వేస్తున్నారు. సారవంతమైన భూమి కావడం.. నీరు అంతగా లేని పంటలు కావడంతో ఇప్పుడవి మంచి లాభాలను తెచ్చేవిగా ఉండడంతో రైతు ముఖాల్లో నవ్వు వెలుస్తోంది. కాలం కలిసిరాకున్నా.. ప్రాజెక్టు శిఖం భూముల్లో సాగు చేసుకుంటున్నామని, లేకుంటే పొట్ట చేతపట్టుకొని వలసలు పోవాల్సిన పరిస్థితి నెలకొనేదని రైతులు అంటున్నారు. సమష్టి వ్యవసాయం... సొంత భూముల్లో గట్లు ఏర్పాటు చేసుకొని సాగు చేసుకునే రైతన్న శిఖం భూముల్లో సమష్టి వ్యవసాయం చేస్తున్నారు. గ్రామాలవారీగా శిఖం భూముల్లో ఏళ్ల క్రితం నిర్ణయించుకున్న హద్దుల్లో రైతులు వేలాది ఎకరాల్లో సాగు చేసుకుంటున్నారు. ఇందుకు అయ్యే పెట్టుబడులను గ్రామంలోని రైతులంతా సమష్టిగా పంచుకోవడమే కాకుండా, కలుపు తీసుకోవడం.. నూర్పిళ్లు చేసుకోవడం.. పంట కాపలాకు ఇంటికి ఒకరు చొప్పున వెళ్తుండడం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల పెట్టుబడి కూడా తగ్గింది. కొన్ని చోట్ల పంటలను అడవి పందుల నుంచి రక్షించుకునేందుకు సోలార్ కంచెలను సైతం ఏర్పాటు చేసుకున్నారు. జూలై, ఆగస్టు మాసా ల్లో ఈ భూముల్లో వేసిన మొక్కజొన్న నూర్పిళ్లు పూర్తవగా, పొద్దు తిరుగుడు పంట చేతికి వచ్చింది. దీంతో రెండో పంటగా శనగ, జొన్నలు వేసేందుకు సిద్ధపడుతున్నారు. -
రూ.15వేల కోట్లతో రోడ్ల నిర్మాణం
నిజాంసాగర్ (నిజామాబాద్ జిల్లా) : రాష్ట్రంలో రూ.15వేల కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడతామని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. గురువారం ఆయన నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని వెల్లనూరు, మంగునూరు, నర్సింగపల్లి గ్రామంలో రూ. 4 కోట్లతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 15వేల కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే హన్మంత్ షిండే తదితరులు పాల్గొన్నారు. -
6.1లక్షల కుటుంబాలకు ఆహారభద్రత
నిజాంసాగర్: జిల్లాలో 6.1 లక్షల కుటుంబాలకు ఆహారభద్రత కార్డులను అందిస్తున్నామని జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి చెప్పారు. ఆహార భద్రత కార్డుల కోసం 6.3 లక్షల కుటుంబాల వారు దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. బుధవారం నిజాంసాగర్ తహశీల్ కార్యాలయాన్ని జేసీ రవీందర్‌రెడ్డి, బోదన్ ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్ సందర్శించారు. ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ.. ఆహార భద్రత పథకం ద్వారా అర్హులైన వారికి కార్డులను మంజూరు చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 19.5 లక్షల యూనిట్ల బియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రతి నెల రేషన్ దుకాణాల ద్వారా వినియోగదారులకు సక్రమంగా సరుకులు అందిస్తున్నామన్నారు. జిల్లాలో 33 వేల మందికి ఏఏవై కార్డులున్నాయని, వీరికి 35 కిలోల బియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు. రేషన్ వినియోగదారులు ఆధార్ నంబర్లను అందించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల్లో సన్నబియ్యం పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. సివిల్ సప్లయ్ గోదాంల ద్వారా పాఠశాలలకు సరఫరా చేస్తున్న ఈ పథకంలో కోతలు రాకుండా వేయింగ్ మిషన్ల ద్వారా బియ్యం తూకం వేస్తామ న్నారు. రేషన్ డీలర్లు నెల నెలా డీడీలను సకాలంలో చెల్లించాలన్నారు. ప్రతీ నెలా 10వ తేదిలోగా డీడీలు చెల్లిస్తే, రేషన్‌దుకాణాల్లో ప్రతీ నెలా ఒకటో తేదీ నుంచి నిత్యావసర సరుకులను అందిస్తామని తెలిపారు. సమావేశంలో స్థానిక తహశీల్దార్ సయ్యిద్మస్రూర్, ఆర్ఐ బాల్‌రెడ్డి తదితరులున్నారు. -
అర్ధరాత్రి దారిదోపిడీ
నిజాంసాగర్: నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ - పిట్లం ప్రధాన రహదారిపై గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.15 గంటలకు దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. చెట్లను నరికి రోడ్డుపై వేశారు. ఆ సమయంలో వచ్చిన వాహనాలను అపుతూ దోపిడీ చేశారు. నాలుగు లారీలు, రెండు స్కార్పియోలు, ఒక తుఫాన్, ఒక బైక్‌పై ప్రయాణిస్తున్న వారిని దోచుకున్నారు. మొత్తం రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకు దోపీడీ జరిగింది. ఈ సందర్భంగా ఎదిరించిన మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన లారీల డ్రైవర్లు గణేశ్, కరణ్ పవార్లపై దొంగలు దాడి చేసి కొట్టారు. దొంగల ముఠాలో పది నుంచి పదిహేను మంది వరకు ఉన్నారని, వారి వద్ద కత్తులు, వేట కొడవళ్లు, గొడ్డళ్లు ఉన్నాయని బాధితులు తెలిపారు. హిందీ, తెలుగు భాషల్లో మాట్లాడిన దొంగలు టీషర్టులు, ప్యాంట్లు ధరించి ఉన్నారన్నారు. దోపిడీ దొంగల సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై అంతిరెడ్డి పోలీసు బలగాలతో ఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే దొంగలు అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. మాగి, ఒడ్డేపల్లి శివారులోని అటవీ ప్రాంతాన్ని పోలీసులు అర్ధరాత్రి దొంగల కోసం గాళించారు. పోలీసులు సకాలంలో అక్కడికి చేరుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డామని పలువురు వాహనదారులు, మహిళా ప్రయాణికులు పేర్కొన్నారు. దోపిడీ దొంగలను మహారాష్ట్ర ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. అటవీ ప్రాంతంలోని చెట్లను యంత్రం ద్వారా కోసినట్లుగా అనవాళ్లు ఉన్నాయని ఎస్సై తెలిపారు. కాగా ఈ నెల 4న అర్ధరాత్రి దొంగలు అదేప్రాంతంలో చెట్లకొమ్మలను అడ్డంగా వేసిదారి దోపిడీకి ప్రయత్నించినట్లు స్థానికులు చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు కూడలి మార్గంగా ఉన్న రోడ్డుపై దొంగలు దారిదోపిడీలకు తెగబడుతున్నారన్నారు. ఎక్కువ జనసంచారం లేని అటవీ ప్రాంతం కావడంతో దొంగలకు అనుకూలంగా ఉందని అంటున్నారు. -
రొయ్యల పెంపకంపై లొల్లి
నిజాంసాగర్: వందలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న నిజాంసాగర్ ప్రాజెక్టులో రొయ్యల పెంపకం చేపట్టవద్దని మత్య్సకార్మికుల ఆందోళ నకు దిగారు. చేపపిల్లలను పెంచాలని కొందరు, రొయ్యలను పెంచాలని మరికొందరు కార్మికులు ఒకరినొకరు దూషించుకున్నారు. మంగళవారం మండలంలోని అచ్చంపేట చేపపిల్లల విత్తనోత్పత్తి కేంద్రం వద్ద స్థానిక మత్య్సకార్మిక సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా మత్స్యశాఖ ఏడీ, సంఘం అధ్యక్షుడు బాలక్రిష్ణ అధ్యక్షత వహించారు. సమావేశ ముఖ్య ఉద్దేశాన్ని ఏడీ కార్మికులకు వివరించారు. అంతలోనే కొం దరు కార్మికులు నిజాంసాగర్ ప్రాజెక్టులో రొయ్యల పెంపకాన్ని నిషేధించాలంటూ నినాదాలు చేశారు. ప్రాజెక్టులో చేప పిల్లల పెంపకం నాలుగేళ్ల నుంచి చేపట్టకపోవడంతో దళారులు రొయ్యల పెంపకానికి అలవాటుపడ్డారన్నారు. చేప పిల్లలను నాశనం చేస్తున్న రొయ్యల పెంపకాన్ని నిషేధించాలని సమావేశంలో నినాదాలు చేశారు. మరికొందరు కార్మికులు చేప పిల్లలతో పాటు రొయ్యల పెంపకాన్ని చేపట్టాలని డిమాం డ్ చేయడంతో సమావేశంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కార్మికులు ఒకరిని ఒకరు తోసుకుంటూ వేదిక వద్దకు వచ్చి మత్య్సశాఖ అధికారులను నిల దీశారు. దీంతో సమావేశంలో ఉద్రిక్తత నెలకొనడంతో అధికారులు జోక్యం చేసుకున్నారు. కార్మికుల నిర్ణయం మేరకు ప్రాజెక్టులో చేపపిల్లలను పెంచుతామన్నారు. ప్రైవేట్ వ్యాపారులు కాకుండా ప్రభుత్వ పరంగా రొ య్యల పెంపకానికి కృషిచేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. నాలుగేళ్ల నుంచి చేప పిల్లల పెంపకం లేకపోవడంతో ఉపాధి కోల్పోయామని, తమను ఆదుకోవాలని అధికారులతో కార్మికులు మొరపెట్టుకున్నారు. కార్యక్రమంలో స్థానిక మత్స్యశాఖ అధికారులు రాములు, రూపేందర్, రాజేంద్రప్రసాద్, స్థానిక మత్య్సకార్మిక సంఘం నాయకుడు రాములు పాల్గొన్నారు. -
మంజీరకు సంకెళ్లు!
నిజాంసాగర్: కర్ణాటక, మహారాష్ర్టల్లో అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాల వల్ల అటు గోదావరి, ఇటు మంజీర నదులకు సంకెళ్లుపడ్డాయి. మహా రాష్ట్ర సర్కారు తీరుతో గోదావరినది ఏడారిని తలపిస్తుండగా కర్ణాటక ప్రాంత సరిహద్దుల్లో అక్రమ చెక్‌డ్యామ్‌ల వల్ల మంజీర ఉపనదిలో నీటిప్రవాహపు గలగలలు కనుమరుగయ్యాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర జలాశయాల్లోకి చుక్కనీరు రావడం లేదు. మంజీర ఉపనదిపై ఉన్న సింగూరు జలాశయంతో పాటు నిజాంసాగర్ ప్రాజెక్టు నీళ్లు లేక నిరాశజనకంగా కనిపిస్తోంది. రెండు ప్రాజెక్టుల క్యాచ్మెంట్ ఏరియాల్లో కురుస్తున్న వర్షాలకు జలధారలు వస్తున్నాయి తప్పా పక్క రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు వరదలు రావడం లేదు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు కరంజా, సయిగావ్ ఆనకట్టల ద్వారా మంజీర ఉపనదిలోకి వరదలు వచ్చేవి. ఇప్పుడు అక్కడి ప్రాజెక్టులు, ఆనకట్టలే నిండుతున్నాయి. సింగూరు జలాశయం, నిజాంసాగర్‌లోకి వరదలు రావడం లేదని నీటిపారుదల శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో మెదక్ జిల్లాలోని సింగూరు జలాశయంతో పాటు ఇందూరు జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంత రైతులు దుర్బర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. పడిపోతున్న నిజాంసాగర్ సామర్థ్యం నిజాం నవాబు కాలంలో 1923-31 సంవత్సరంలో నిర్మించిన నిజాం సాగర్ ప్రాజెక్టు నీటి సామర్థ్యం ఏడాదికేడాది పడిపోతోంది. మంజీర ఉప నదిపై నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని 11 మండలాల్లో ఉన్న 2.75 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 1400.50 అడుగులతో 25.67 టీఎంసీలు సామర్థ్యం ఉండేది. కర్ణాటక, మహా రాష్ట్రల్లో కురిసిన భారీ వర్షాల వల్ల మంజీర నదిలో వరద నీటి ప్రవాహానికి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి పూడిక మట్టి వచ్చి చే రింది. దీంతో 1977 సంవత్సరంలో నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం 11.8 టీఎంసీలకు పడిపోయింది. నీటి మట్టం పడిపోవడంతో అప్పటి సర్కారు ప్రాజెక్టు నీటిసామర్థం్య పెంపు కోసం చర్యలు తీసుకోంది. అదే సంవత్సరంలో 4.5 టీఎంసీల సామర్థ్యాన్ని ప్రభుత్యం పెంచింది. దాంతో అప్పటి నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం 1405 అడుగులతో 17.8 టీఎంసీల సామర్థ్యానికి చేరుకుంది. ప్రాజెక్టులో నీటిసామర్థ్యం పెరిగినా చివరి ఆయకట్టు వరకు ప్రధాన కాలువ ద్వారా సాగునీరందించడం లేదు. దాంతో చివరి ఆయకట్టు ప్రాంత రైతులు ప్రత్యామ్నాయంగా బోరుబావులపై ఆధారపడి పంటలను సాగు చేస్తున్నారు. పోచారం పెంపుతో .. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిసినా మెదక్ జిల్లాలోని సింగూరు జలాశయానికి వరద నీరు పరిమితం అవుతోంది. జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు మాత్రం పోచారం ప్రాజెక్టు జీవనాధారంగా ఉంది. వర్షాకాలం ఆరంభ సమయంలో కురిసిన వర్షాలకు జిల్లాలోని గాంధారి, లింగంపేట, తాడ్వాయి, నాగిరెడ్డిపేట మండలాల్లో కురిసిన వర్షాలకు వరద నీటి ప్రవాహంతో పోచారం ప్రాజెక్టు నిండుకుండలాగా మారుతోంది. అదనంగా వచ్చిన వరదనీటి ద్వారా మంజీర ఉపనది ఉరకలేస్తోంది. ప్రస్తుతం పోచారం ప్రాజెక్టు కట్ట ఎత్తుపెంపుపై రాష్ట్ర బారీనీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావ్ నీటిపారుదలశాఖ అధికారులతో నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల పోచారం ప్రాజెక్టులోకి వచ్చిన అదనపు జలాలు దిగువనకు వెళ్లకుండా నిలిచిపోనున్నాయి. పోచారంతోనే గతేడాది నిండిన ప్రాజెక్టు గతేడాది జిల్లాలో కురిసిన వ ర్షాల వల్ల పోచారం ప్రాజెక్టు నీటితోనే నిజాంసాగర్ ప్రాజెక్టు నిండింది. పోచారం ప్రాజెక్టు పూర్థిస్తాయి నీటిమట్టానికి చేరుకొని పొంగిపోర్లింది. దాంతో పోచారం ప్రాజెక్టు ద్వారా 9.08 టీఎంసీల నీరు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి చేరింది. పోచారం నీటితో పాటు క్యాచ్ మెంట్ ఏరియాలో నుంచి వచ్చిన నీటితో గతేడాది నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. పోచారం ప్రాజెక్టు కట్ట ఎత్తు పెంచితే నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిముప్పు ఎదురవునుందని నీటిపారుదల శాఖ అధికారులు అంటున్నారు. -
‘లెండి’ ముందుకు సాగేనా!
పనులకు నిధుల కొరత సా..గుతున్న ‘సాగర్’ కాలువల నిర్మాణం నల్లవాగు మళ్లింపు పరిస్థితీ అంతే నేడు భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు రాక బాన్సువాడ : మందకొడిగా సాగుతున్న నిజాంసాగర్ ప్రధాన కాలువ పను లు.. అర్ధాంతరంగా నిలిచిన అంతర్రాష్ట్ర లెండి ప్రాజెక్టు.. ప్రతిపాదనలు పూర్తయినా అనుమతి లభించని నల్లవాగు మళ్లింపు.. ఇలా ఏ పనీ పూర్తికాక.. రైతన్న కలలు కల్లలుగానే మిగిలాయి. 2004లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పనులను ప్రారంభించగా, ఆయన అకాల మరణం తర్వాత పనులన్నీ ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ చందంలా మారాయి. ఇప్పుడు రోజులు మారాయి. ఎన్నో ఏళ్ల ఆకాంక్ష ఫలిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇక ఇప్పుడైనా ఆయా పనులను పూర్తవుతాయన్న గంపెడు ఆశతో జిల్లా రైతులు ఉన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తొలిసారి ఆదివారం జిల్లాలోని బాన్సువాడకు వస్తున్నారు. ఈ సందర్భంగా పెండింగ్ ప్రాజెక్టులు, సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు ‘సాక్షి’ అందిస్తున్న కథనమిది. నత్తనడకన నిజాంసాగర్ ఆధునికీకరణ పల్లెబాటలో భాగంగా 2004 నవంబర్ 9న అప్పటి సీఎం వైఎస్సార్ నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా సాగర్ దుస్థితిపై ఆవేదన చెందారు. ప్రాజెక్టుకు చెందిన కాలువలు శిథిలావస్థలో ఉండగా, ప్రధాన కాలువల ఆధునికీకరణకు 2007లో రూ. 549.60 కోట్లను మంజూరు చేశారు. నిజాంసాగర్ జీరో పాయింట్ నుంచి బాల్కొండ వరకు సుమారు 155 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రధాన కాలువను ఆధునీకరించేందుకు 15 ప్యాకేజీల ద్వారా ఈ పనులు చేపట్టారు. ఈ మేరకు గత రెండేళ్లలో నిధులను సైతం కేటాయించగా, పనులు కొనసాగుతున్నాయి. ఆయన అకాల మరణం తర్వాత బడ్జెట్లో అరకొర నిధులను మాత్రమే కేటాయిస్తుండడంతో పనులన్నీ పడకేశాయి. మొరం పనులు నాసిరకంగా చేయడంతో కాలువ విడుదల చేసినప్పుడల్లా కొట్టుకుపోతోంది. మరో ఐదేళ్ల వరకు ఈ పనులు పూర్తయ్యేటట్లు కనిపించడం లేదు. ప్రతిపాదనలకే పరిమితం 2008లో మరోసారి నిజాంసాగర్‌ను సంద ర్శించిన దివంగత సీఎం వైఎస్సార్ ప్రాజెక్టు పరిసరాల్లో సుమారు 500 ఎకరాల్లో బృందావన్ గార్డెన్‌లా మార్చాలని, నల్లవాగు నుంచి నీటిని మళ్లించి ఆయకట్టును సస్యశ్యామలం చేయాలని భావించారు. ఇందుకు ప్రతిపాదనలు సైతం చేయించారు. బృందావన్ గార్డెన్ కోసం పర్యాటక శాఖ అధికారులతో అంచనాలు సైతం వేయించారు. కానీ ఆ ప్రతిపాదనలు నేటికీ ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఐదేళ్లక్రితం 35కోట్లతో నల్లవాగు మళ్లింపు పథకానికి అధికారులు ప్రతిపాదనలు చేయగా, నేడు పెరిగిన ధరల కారణంగా అది కాస్తా రూ.90 కోట్లకు చేరింది. మెదక్‌లో ఉన్న నల్లవాగు రిజర్వాయర్‌లో కర్ణాటక ప్రాంతం నుంచి వర్షపు నీరు వచ్చి చేరుతుంది. ప్రతీ ఏడాది జూన్, జూలైల్లోనే ఈ రిజర్వాయర్ నిండుకుండలా మారడంతో, దిగువన సుమారు 2 నుంచి 3 టీఎంసీల నీటిని వాగులోకి వదిలేస్తారు. ఈ వాగులోనే కాకివాగు, పిల్లివాగు కలుస్తాయి. ఈ వరద నీరు నిజాంసాగర్ ప్రాజెక్టుకు దిగువన సుమారు 2 కిలోమీటర్ల దూరంలో మంజీరా నదిలో కలుస్తాయి. ఈ నీటిని నిజాంసాగర్‌లోకి మళ్లి స్తే రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. పట్టించుకోరు ‘లెండి’..! అంతర్ రాష్ట్ర ప్రాజెక్టు అయిన లెండి నిర్మాణానికీ వైఎస్సార్ హయాంలోనే రూ.112 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో కాలువ పనులు, నష్ట పరిహారం చెల్లింపు పూర్తి చేశారు. అయితే కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ హయాంలో 2011లో రూ.50 కోట్లు కేటాయించగా, 2012లో సుమారు రూ.100 కోట్లు మంజూరు చేశారు. ఆ నిధులను నేటికీ విడుదల చేయలేదు. లెండి నదితో రెండు రాష్ట్రాల్లోని వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో 1985లో లెండి ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, ఎస్బీ చవాన్ ఒప్పందం చేసుకున్నారు. అప్పట్లో దీని అంచనా విలువ రూ. 54కోట్లు. మహారాష్ట్ర ప్రభుత్వం 62 శాతం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 38 శాతం ఖర్చు చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టులోని 6.36 టీఎంసీల నీటిలో ఆంధ్రవాటా 2.43 టీఎంసీలుగా, మహారాష్ట్ర వాటా 3.93 టీఎంసీలుగా నిర్ణయించారు. లెండి ప్రాజెక్టుకు మొత్తం 14 గేట్లకు గాను 8గేట్లను పూర్తి చేశారు. ఇంకా ఆరు గేట్లు నిర్మించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వరకు మహారాష్ట్రలో 19.5 కిలోమీటర్ల దూరం ఉమ్మడి పైపులైన్ వేయాల్సి ఉంది. ఇందుకు మన రాష్ట్ర ప్రభుత్వం రూ. 20కోట్లు మహారాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించినా ఇంత వరకు పైప్‌లైన్ పనులు ప్రారంభం కాలేదు. ఇప్పటి వరకు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 202 కోట్ల రూపాయలు కేటాయించి, రూ. 123 కోట్లు మహారాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. మద్నూర్, బిచ్కుంద మండలాల్లో లెండి కాలువ పనులు కొనసాగుతున్నాయి. ఇటీవల ఈ ప్రాజెక్టు గురించి మహా రాష్ట్ర ప్రభుత్వంతో హరీశ్‌రావు చర్చలు నిర్వహించడం శుభపరిణామం. మిగితా సమస్యల ను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. -
సమస్యల్లోనే ‘ఆదర్శ’మా?
నిజాంసాగర్ : కోట్లాది రూపాయలు వెచ్చించి ఆదర్శ పాఠశాల భవన సదుపాయాన్ని నిర్మించినా.. కనీస వసతులు కల్పించకపోవడంతో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకూ అవస్థలు తప్పడం లేదు. ఈ విద్యాసంవత్సరంలో తరగతులు పెరిగినా ఉపాధ్యాయుల సంఖ్యలో మార్పు లేకపోవడం తో విద్యాబోధనపైనా ప్రభావం పడుతోం ది. ప్రయోగశాల ఉన్నా.. శిక్షకులు లేరు. దీంతో రూ. 3.2 కోట్లు వెచ్చించి నిర్మించిన మోడల్ స్కూల్ భవనం.. సమస్యల్లోనే ఆదర్శంగా నిలుస్తోంది. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా సర్కారు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందించడం కోసం రెండేళ్ల క్రితం ప్రభుత్వం మాడల్ పాఠశాలలను ప్రవేశపెట్టింది. మండలానికొకటి చొప్పున ఆదర్శ పాఠశాలలను మంజూరు చేసింది. ఒక్కో పాఠశాల భవన సముదాయ నిర్మాణానికి రూ. 3.2 కోట్ల చొప్పున కేటాయించింది. మొదటి విడతలో గత విద్యా సంవత్సరంలో జిల్లాలోని 15 మండలాల్లో ఆదర్శ పాఠశాలలను ప్రారంభించారు. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు విద్య అందించనున్నారు. గతేడాది ఆరు, ఎనిమిది, ఇంటర్ ఫస్టియర్ తరగతులు ప్రారంభించారు. ఒక్కో తరగతిలో 80 సీట్లున్నాయి. భారీగా దరఖాస్తులు రావడంతో లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేసి సీట్లు ఇచ్చారు. ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు పెరిగాయి. 6, 7, 8, 9, ఇంటర్ ప్రథమ, ద్వితీయ తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే తరగతులకు అనుగుణంగా ఉపాధ్యాయులు, అధ్యాపకుల నియామకం చేపట్టలేదు. అన్ని తరగతుల్లో పూర్తిస్థాయి విద్యాబోధనకుగాను ఒక్కో మోడల్ స్కూల్లో 20 మంది టీజీటీ, పీజీటీ ఉపాధ్యాయులు ఉండాలి. కానీ జిల్లాలోని చాలా స్కూళ్లలో ఎడెనిమిది మందే ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. దీంతో విద్యార్థులకు సరైన విద్య అందడం లేదు. ప్రయోగశాల ఉన్నా.. ఆదర్శ పాఠశాలలో ప్రభుత్వం ల్యాబ్ సౌకర్యం కల్పించింది. అయితే శిక్షకులు లేకపోవడంతో ఇది నిరుపయోగంగానే ఉంటోంది. అసౌకర్యాలే.. నిజాంసాగర్ సమీపంలో నిర్మించిన మోడల్ పాఠశాలలో టాయ్‌లెట్స్ నిరుపయోగంగా ఉన్నాయి. నీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలలో తాగునీటి సౌకర్యం సైతం లేదు. దీంతో ఇంటినుంచే నీటిని తెచ్చుకుంటున్నారు. అధికారులు స్పందించి మాడల్ స్కూల్ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.